పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి jayaprabha అభిప్రాయం:

    05/04/2012 2:53 pm

    బెజ్జాల కృష్ణ మోహన రావు గారూ !

    మందాక్రాంత వృత్తాన్ని గురించి మీరు రాసిన వ్యాసానికి మీరు పాఠకులనించి స్పందనని ఆశిస్తే నాకని పించిందీ ..మీకు తెలుగు పాఠకుల మీద ఎంతటి నమ్మకం ఉండి ఆశించి ఉంటారో కదా అని. నేను ఈ అభిప్రాయం ఎందుకని రాస్తున్నానంటే … నా అనుభవం మీకు ఏమన్నా ఉపయోగపడవచ్చునేమో అని మాత్రమే!

    ప్రతీ వ్యాసానికీ ప్రతీవారూ పాఠకులు కారు. కాలేరు కూడాను. వారి వారి స్థాయిని అనుసరించి మాత్రమే ఒక రచనని ఆయా పాఠకులు స్వీకరించగలుగుతారు. మీ వ్యాసాన్ని గురించి మీరు చందస్సుని సాధికారంగా తెలిసిన వారిన్నించీ గనక స్పందనని ఆశిస్తే బహుశా …మీ ఆశకి ఫలితం ఉంటుంది. వికాశ్ విన్నకోట నిజాయితీగా తన నిస్సహాయతని తెలియజేశాడు. అందుకు అతడిని అభినందించాలి. ఇంక గొర్తి బ్రహ్మానందం అన్నట్టు… రకరకాల కారణాలకి గానూ వ్యక్తులు “మౌనం” గా ఉంటూంటారు. నేను ఏనాడో చెప్పాను. చదువుకున్న పాఠకులు తెలుగులో వచ్చే మంచి రచనల పట్ల చూపించే ఉదాశీనత వలన … మంచి పుస్తకాలు రాసేవారు క్రమేపీ తెలుగున కనుమరుగౌతారని. మనం నిజంగా అసలు విషయాల మీద చర్చించడాన్ని ఏనాడో మాని వేశాము.

    నేను అన్నమయ్య పదపరిచయం చేస్తూ రెండు పుస్తకాలని ప్రచురిస్తే .. దానిమీద మామూలు పాఠకులు ఎక్కువగానూ “చదువుకున్న” పాఠకులు నిశ్సబ్దంగానూ స్పందించేరు. కొన్ని వేల సంకీర్తనలతో ఒక దశాబ్దం పాటు ఏకదీక్షగా పని చేస్తే..!!

    ఏతావతా నాకు అనుభవం అయ్యిందేమంటే .. తెలుగున ఒక పుస్తకం మీద స్పందన తెలియజేయడానికే శక్తి చాలని వారో లేదా ఆసక్తి చాలని వారో ఉన్నా .. నేను ఏనాడూ నిరాశ పడలేదు. ఎందుకంటే రేప్పొద్దున్న వికాస్ విన్నకోట లాంటి కుర్ర వాళ్ళు తెలుగు పట్ల నిజంగా ఆకర్షితులై .. విషయాలని తెలుసుకుందామని అనుకుంటే వాళ్లకి అక్కరకొచ్చే పుస్తకాలు ఉండాలి.

    అందుకని మీరు రాయవలసి ఉంది. పైగా మీకు చందస్సు అంటే ఉన్న ఇస్టం ..చందస్సుని గురించి మీకు చెప్పవలసిన విషయం బలంగా ఉండటమే ముఖ్యం!! మిగిలినవి కావు. ఆగామి కాలం ఏ రచనలని స్వీకరిస్తుందో.. వేటిని జారవిడుస్తుందో.. తెలిసిన వారేరీ?? ఉన్నారా నిజంగా ??

    అయితే గాఢమైన విషయాలని రాసేవారికి “ప్రోత్సాహం” తప్పకుండా అవసరమే !! కానీ అది కొరవడిన కాలమ్లో ఉంటున్నామన్న స్పృహ రాయడానికి మరింత ప్రేరణనే కలిగించాలని నేననుకుంటాను. మీవ్యాసం మందాక్రాంతం గురించి మరింత బాగా తెలిసిన వారికి చేరాలని మాత్రం ఆశిస్తాను.

    యాధాలాపమైన రచనలకి… అలాగే ఏ సాహితీ బలం చాలని రచనలకీ పనిగట్టుకుని అతిగా “ఒహోఓహోలూ” నిజంగా సాహితీ విలువ కలిగిన రచనల విషయమ్లో మాత్రం నిశ్సబ్దాలూ … ఉదాశీనతలూ… ఏ కాలమ్లోనూ ఏ జాతీ గర్వపడదగిన విషయాలు కానేరవని మాత్రం చెప్పగలను.

    జయప్రభ.

  2. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:

    05/04/2012 1:59 pm

    బ్రహ్మానందంగారికి, వికాస్ గారికి, మీ అభిప్రాయలకు కృతజ్ఞతాపూర్వక వందనాలు.

    వికాస్ గారు – మీరు ముందుంచిన విషయాలు చాల ముఖ్యమైనవి. నా అనుభవమువల్ల నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలను మీముందు, అలాగే మిగిలినవారి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. (1) ప్రతిరోజు ఒక గంట లేక గంటన్నర ఏదో ఒక సాహితీ పుస్తకాన్ని చదివితే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఒక గంట చాల తక్కువ సమయములా తోచవచ్చును. కాని 20, 30, 40 యేళ్ల కాలములో ఇది తక్కువ కాదు. ఎన్నో కొత్త పుస్తకాలు చదవడానికి వీలవుతుంది, ఎంతో నేర్చుకోడానికి వీలుపడుతుంది. ఇలా చేస్తే ఒంటరిదనము కూడ మరచిపోవచ్చును. (2) చదివేటప్పుడు అర్థము కాని పదాలు కనబడినప్పుడు, నిఘంటువును సంప్రదించి అర్థాలు తెలిసికోవాలి. సుమారు ఒక వేయి పుటలకన్న తక్కువగా ఉండే నిఘంటువు చాలు ఈ కార్యానికి. మిగిలినవాటికి ఆంధ్రభారతివారి నిఘంటువు సైటును చూడవచ్చును. మొట్టమొదట పదాలకు అర్థాలు వెదకడములోనే సమయమవుతుందని బాధపడవచ్చును. కాని కొన్నాళ్లకు చాలా పదాలకు అర్థాలు తెలియడమువల్ల ఇలా వెదకడము తగ్గుతుంది. (3) పాత కవిత్వమయినా, కొత్త కవిత్వమయినా దేనినయినా చదవడానికి ఎన్నుకోవచ్చును. శ్రీశ్రీ కవితలలోని కొన్ని పదాలకు నిఘంటువు తప్పని సరి ఇప్పటికీ. కావ్యాలకన్నా, అందులోని కొన్ని భాగాలను పఠనీయాంశాలుగా ఎన్నుకోవచ్చును, ఉదా. నన్నయ దుష్యంతుని కథ, తిక్కన ఉత్తరగోగ్రహణము, శ్రీనాథుని హంసదూతము, పోతన రుక్మిణీ కల్యాణము, శ్రీరామచరిత్ర,, పాపరాజు కుశలవుల రామాయణ గానము, మున్నగునవి. (4) అంతర్జాలములో ఎన్నో పుస్తకాలు ఉచితముగా లభ్యము. టీకాతాత్పర్యాలతో చాల పుస్తకాలు ఉన్నాయి. వాటిని సులభముగా ఇక్కడినుండి, ఇక్కడినుండి దిగుమతి చేసికొనవచ్చును. ఇవి కొన్ని సలహాలు మత్రమే. మిగిలినవి ఆసక్తిపైన ఆధారపడినవి.

    విధేయుడు – మోహన

  3. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి chavakiran అభిప్రాయం:

    05/04/2012 12:14 pm

    వికాస్ గారు,
    తెలుగు పుస్తకాలు చదవదానికి ఇండియా రాక కోసం ఆగక్కరలేదు. చక్కగా కినిగెలో చదువుకోవచ్చు. Visit kinige.com for more details!

  4. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి vikas,vinnakota అభిప్రాయం:

    05/04/2012 4:38 am

    గౌరవనీయులు జెజ్జాల కృష్ణ మోహన రావు మరియు సంపాదకులకు నామస్కారం

    నేను, అమెరికాకి వచ్చి రెండేళ్ళు అయ్యింది, చిన్నపుడు 10వ తరగతి నుంచి మొదలు పెట్టిన వృత్తి విద్యలొ పట్టా కోసం వేట ఈమధ్యే పూర్తి అయ్యింది. నాకు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసాలు చదివినప్పుడు ఒక రకం ఐన depression వస్తుంది. Sir, మీ వ్యాసాలు నాకు అర్ధం కాక పోయినా, తెలుగు భాషలో నా తెలియనితనం అజ్ణానం తేటతెల్లం అవుతోంది. ఈమధ్య ఎందుకో, దూరంగా ఉంటున్నందుకో ఏమో భాష మీద మమకారం, నేర్చుకోవాలన్న తాపత్రయం పెరుగుతోంది, కాని మీరు రాసిన ఋతుపర్ణము, కామవేదం లాంటి కవితలు లేదా మీరు ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి రాసే వ్యాసాలు ఐనా సరే, పూర్తిగా కాదు కదా పావు వంతు ఐనా నాకు అర్ధం కావడం లేదు. దయచేసి తప్పుగా అర్ధం చేసుకొకండి. భాష సంస్కృతి అంటూ పెద్ద మాటలు పక్కన పెడితే ఆఖరికి సినిమా పాటలు కూడా కొన్ని సార్లు అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న నాలాంటి వాడు తెలుగు నేర్చుకోవాలి అంటే అసలు వీలు పడుతుందా?

    ఈ ఒక్క సందర్భమే కాదు ఎప్పుడన్న పైత్యమో భక్తో ప్రకోపించి ఏ రుద్రమో, శంకర భాష్యాల అనువాదాలో netలో వెతికి పట్టుకున్నా నాలాంటి వాడికి ‘ఒం” ‘నమహ్’ తప్ప ఇంకో ముక్క అర్ధంకావు. వాటికి అర్ధాలు తెలియవు.

    ఈసారి, India వెళ్ళినప్పుడు ఊరగాయలు కాకుండా, ఓ నాలుగు పుస్తకాలు కొనుక్కుంటే చాలు, కాని ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టలి అన్నదే ప్రశ్న? మీ వ్యాసానికి ఏరకంగాను సంబంధం లేక పొయినా దయచేసి నాకు దైవపరమైన పుస్తకాలు, భాష బాగు పడడానికి ఉపయుక్త కారమైనవి ఏమన్న సుచించమని మనవి.

    అలాగే పత్రికా ముఖంగా మరొక్క మనవి, ఈ-మాట గ్రంధాలయంలో కొంచం పురాణ వాఞ్ఙయాలని చేరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, నాబోటి వాళ్ళు ఏమన్న అర్ధం కాక పొయినా అనుమానాలు, అర్ధం కాని విషయాల వ్యక్తం పెద్దలు వివరించగలరు అని ఆశ పడుతున్నాను.

    పెద్దలు, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అది నా చిన్నతనం అని మన్నించగలరు.

    వికాస్ విన్నకోట

  5. బ్రహ్మ సృష్టి గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:

    05/04/2012 4:08 am

    కలి కామరూపుడు. బావుంది మాస్టారూ! 🙂

  6. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Saradhi Motamarri అభిప్రాయం:

    05/04/2012 2:49 am

    Tilak’s ‘addaMlo jinnah’ is one of my favorite katha. I didn’t much bother whether it is kavita or essay or katha. But I haven’t come across any comparable artifact. Actually, it is high time to talk about this story to every Telugu person not just India but across the globe. Though he wrote about Jinnah, it looks not different to me from the current genre of politicians who want to break Andhra into pieces for their breakfast.

  7. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    05/04/2012 12:02 am

    మోహన రావు గారూ,

    మీ వ్యాసం చాలా బావుంది. మీలా చందస్సులో పరిశోధన చేసి వ్యాసాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికెంతో శ్రద్ధా, అభిరుచీ, కోరికా వుందాలి. అంతకుమించి కాలం కూడా వెచ్చించగలగాలి. చందస్సు అవసరం లేదనుకునే నేటి కవులు చందస్సు దాటి కవిత్వాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. చందస్సు ఒక చట్రమనుకునే వారికి లయతో కూడిన చాలా అల్లికలున్నాయన్న సంగతి తెలీదు. చందస్సుని వాళ్ళు వదిలేసారు. కవిత్వం వాళ్ళనొదిలేసింది. అందుకే వచన కవిత్వంలో వచనం కవిత్వాన్ని రెండో స్థానానికి నెట్టేసింది.

    మీలా చెప్పే వారు ఆంధ్రాలో కూడా తక్కువే!

    “సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది,” అని మీరు చెప్పింది నాకూ వర్తిస్తుంది. మీ వ్యాసాలు క్రమం తప్పకుండా చదువుతాను. బావుందని చెబుదామనుకుంటూ వాయిదా వేసిన సందర్భాలే ఎక్కువ. ఎందుచేతనో చాలామంది ( నాతో కలుపుకుని ) చదివి మంచీ చెడూ చర్చించరు. ముఖ్యంగా రచయిత బిళ్ళ మెళ్ళో వేసుకునేవారు. చెడు చెప్పాలంటే మొహమాటం అడ్డొస్తుంది. బావుందని చెప్పాలంటే అహం అడ్డొస్తుంది. ఇంకా గట్టిగా అంటే మరలా తమ రచనలమీద మిగతా వారెక్కడ విరుచుకు పడతారోనన్న భయం ఉంటుంది. పైగా పక్కవాణ్ణి పొగిడితే మనం ఒక మెట్టు క్రిందకి పడిపోతామన్న న్యూనతా భావం వుంటుంది. ఇంతకుమించి తమ రచనలని ప్రేమించినట్లుగా ఇతరుల రచనలని గౌరవించ లేకపోవడం వుంటుంది. ఇలా సవాలక్ష కారణాలు వెతక్కుండానే రోజూ కనిపిస్తూ ఉంటాయి.

    సెక్స్ శీర్షికలకీ, సినిమా వ్యాసాలకున్న గిరాకీ చందస్సు వ్యాసాలకుండదు సారూ! సాహిత్యమయినా, సంగీతమయినా సినిమా శంఖంలో పోస్తే కానీ తెలుగువారికి రుచించదు.

    -బ్రహ్మానందం గొర్తి

  8. బాలమురళీకృష్ణ గురించి P H Thyagaraju అభిప్రాయం:

    05/03/2012 1:56 pm

    వ్యాసం చాలా బాగుంది. డా రోహిణీ ప్రసాద్ గారు నాకు, అణుశాస్త్ర సంస్థలో గత పాతిక సంవత్సరాలుగా నాకు సీనియర్ అండ్ ఆత్మీయ మిత్రులు. నేను ఒక సంగీతాభిమానిగా జీవితం గడపటానికి డా రోహిణీ ప్రసాద్ గారి ప్రోద్బలం చాలా ఉంది.

  9. బాలమురళీకృష్ణ సంగీతం గురించి P H Thyagaraju అభిప్రాయం:

    05/03/2012 1:34 pm

    నేను కూడా డా. బాలమురళీ కృష్ణ గారి వీరాభిమానినే. కాకపోతే నేను అందరు విద్వాంసుల సంగీతాన్నీ కూడా వింటాను. పక్క వాద్య విద్వాంసులని ఓడించటం, స్పీడుగా స్వరాలనీ ఉచ్చరించటం లాంటి గమ్మత్తులని దాటి సంగీతపు విలువలు చాలా ఉన్నాయి. మనము వాటి యందు దృష్టి పెడితే తప్ప అసలైన సంగీత రసికులుగా తయారవలేము. ఒక రాగంలో సంగతులను ఎంత మధురంగా చూపించారు, ఒక రాగం లోని ఆర్ద్రతని ఎంత బాగా ఆవిష్కరించారు, ఒక రాగాన్ని ఎంత సృజనతో మూర్తీభవింపజేసారు అన్న అంశాలు చిరస్థాయిగా నిలిచే విలువలు. ఇటువంటి విలువలతో డా. బాలమురళిగారు పాడిన కొన్ని సన్నివేశాలు నేను ప్రత్యక్షంగా అనుభవించినవి నేను జీవితాంతము మరువలేను. నా మట్టుకు నాకు అనిపిస్తుంది, మంచి సంగీతం లోని మంచితనాన్ని ఆస్వాదించటం అలవాటు చేసుకోవాలంటే, కొన్నాళ్ళ పాటు సాహిత్యాన్ని పక్కన పెట్టాలి. అల్లాగే, కచేరీ వింటున్నంత సేపూ ఒక ధ్వని పూరిత స్పర్థని ఆలోకిస్తున్నట్టు కాకుండా, ఒక సంగీత భావాన్ని భజిస్తున్న విధంగానూ, సంగీతానందాన్ని పొందుతున్న ధోరణిలో వినటానికి కూర్చుంటే, బాలమురళి గారి సంగీతాన్ని, వార్ని పోలు ఇతర మహావిద్వాంసుల సంగీతాన్ని సరైన పద్ధతిలో ఆస్వాదించటం మనకి అలవడుతుందని నాకనిపిస్తుంది.

  10. నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన గురించి Dr, I.A.P.S. Murthy అభిప్రాయం:

    05/03/2012 1:12 pm

    దాదాపు ముప్ఫై ఐదు సంవత్సరాల క్రితం హైదరబాదులో విశ్వభారతి అని ఒక సంస్థ (ఇప్పటికీ అది పనిచేస్తోందనుకుంటాను). ప్రచురించిన కరపత్రికలో యీ పద్యం గురించి చదవడం జరిగింది. మా పదవ తరగతిలో ఇంద్రప్రస్థము – పాండవులు అని పద్యభాగంలో ఒక పాఠంలో కూడా అది చదివాను. అప్పుడు చదివిన వ్యాఖ్యానమూ గురువులు చెప్పిన భావార్థాలూ గుర్తులేనప్పటికీ, పద్యం మాత్రం గుర్తే. (మిగతా పద్యాలక్కూడా) చీమలమర్రి వారిచ్చిన వివరణ, నచ్చిన పద్యపు విందుగా, మెచ్చిన తాంబూలపు పసందుగా ఉంది. ఆ పాఠంలో ధర్మరాజు గురించి ఒక పద్యం:

    దుర్జయ విమతాహంకృతి
    మార్జయ యాచనక దైన్య మర్దన చణ దోః
    ఖర్జులు గలరతనికి భీ
    మార్జున నకులసహదేవులను ననుజన్ముల్.

    ఈ పద్యంలో ఏదైనా చమత్కారముంటే వివరించ గోర్తాను.

    – ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.