పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి వెంకట రెడ్డి అభిప్రాయం:

    05/10/2012 3:37 am

    అద్రుష్థ వశాత్ ఈ ప్రదేశం చూడటం జరిగింది. కళాపూర్నొదయం అందిస్తున్నందుకు క్రుతఘ్నతలు.
    వెంకట.రెడ్డి.

  2. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:

    05/09/2012 6:54 pm

    1) సంస్కృతములో కావ్యములను వ్రాసే పద్ధతి వేరు, తెలుగులో వ్రాసే పద్ధతి వేరు. సంస్కృతములో ఒక ఆశ్వాసాన్ని ఒకే వృత్తములో వ్రాస్తారు (ఉదా. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వీటి రెంటితో ఉపజాతులు, వియోగిని, శ్లోకము, స్వాగతము, ఇత్యాదులు). ఆశ్వాసాంతములో మాలిని మున్నగు విశేష వృత్తాలను వాడుతారు. సంస్కృతములో వృత్త వైవిధ్యాన్ని నాటకాలలో చూపుతారు, కావ్యాలలో కాదు. తెలుగులో సంస్కృతములా కాక ఒక ఆశ్వాసాన్ని అన్ని వృత్తములలో వ్రాసినారు.

    2) కన్నడ భాషలో మొట్ట మొదట చంపూ సంప్రదాయములో కావ్యాలు వచ్చాయి, దానినే తెలుగులో కూడ అనుసరించారు. ఏవో కొన్ని నిర్వచన కావ్యాలు తప్ప తెలుగులో చంపూ కావ్యాలే ఎక్కువ. ఇందులో గద్యపద్యములు రెండూ ఉంటాయి.

    3) కన్నడములో మొట్టమొదట అనుష్టుభ్ శ్లోకాలను వాడారు. కాని తెలుగులో పూర్వ కవులు శ్లోకాన్ని వాడలేదు. తెలుగు కన్నడ కవులు ఆ శ్లోకస్థానములో కందమును వాడారు. ఇది చిన్న పద్యము, కథను సాగించడానికి చక్కగా ఉంటుంది, అందువల్ల.

    4) తరువాత ఎక్కువగా వాడిన వృత్తాలు చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము – ఈ క్రమములో. అందుకే నేనొక చోట అన్నాను, తెలుగులో శార్దూలానికన్న మత్తేభాన్ని ఎక్కువగా వాడుతారు అని, ఎందుకంటే అందులో ప్రారంభములో శార్దూలములా మూడు గురువులు ఉండవు. సంస్కృతములో ఉపజాతుల స్థానాన్ని తెలుగులో తేటగీతి, ఆటవెలది ఆక్రమించాయి.

    5) ఇక యతి విషయము. పదాన్ని యతి స్థానములో విరిచితే కొన్ని సమయాలలో బాగానే ఉంటుంది (ఉదా. లాస్యము లాడవా పలు వి-లాసములన్ …), కొన్ని చోటులలో బాగుండవు (ఉదా. టంగుమని మ్రోగె గంట ప-డతి వినంగ …). జాత్యుపజాతులలో సామాన్యముగా పాదాంత విరామమును వాడుతారు. ఇది ద్విపదలకు, రగడలకు తప్పక ఉండాలి.

    6) తెలుగులో పాదాంత యతి ఎందుకు లేదన్నదానికి, కోవెల సంపత్కుమారులు ఇలాగన్నారు. తెలుగులో ప్రాస ఉన్నది, అందువల్ల ఒక్కొక్కప్పుడు, పదములోని రెండవ అక్షరము ప్రాసాక్షరముగా అమరకపోవచ్చు. ముందటి పాదమునుండి పదము ఆరంభమయితే ప్రాసకు సౌలభ్యము దొరుకుతుంది. పదాన్ని ఇలా విరిచినప్పుడు, నా ఉద్దేశములో ముందటి పాదములో చివర పదానికి ఒక అక్షరముకంటె ఎక్కువగా ఉంటే వినడానికి అంత బాగుగా నుండదు.

    7) మొట్టమొదట ఉత్పలమాలను, మత్తేభవిక్రీడితమును సంస్కృతములో వ్రాసినప్పుడు వాటికి పాదాంతయతిని ఉంచలేదు మన కవులు. కొన్ని శాసనాలలో ఈ విషయాన్ని గమనించవచ్చును.

    8) మాత్రాగణములతో ఉండే రగడలలో కూడ తెలుగు కవులు కొన్ని సమయాలలో పదాలను గణాలకు తగ్గట్లు విరిచి వ్రాయకుండడము నిజముగా ఒక పెద్ద లోటే.

    విధేయుడు – మోహన

  3. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి TahaTaha అభిప్రాయం:

    05/09/2012 6:45 pm

    “తిరుపతి తుంగ శృంగవసతీ! విన వచ్చెనుసుప్రభాతగీత రవము …” గుడిగంటల్లో కాటూరి

    “శ్రీకరశైవలింగ పరిషిక్త ఘృతస్ఫటికంబు కంటె కార్తీకము కంటె పూర్ణవిధు దీపిక కంటె కృపాంత నాటక శ్లోకము కంటె …” రెల్లు తెల్లదనాన్ని వర్ణిస్తూ చల్లా సీతారామాంజనేయులు

    “రాజా వీడు కోదండబాహావిధ్వస్త దిగంతరాహితధరాప్రాణేశచూడామణిగ్రీవామంజులహారరత్న రుచిర శ్రీ పాదకంజుండగున్ …”ఆంధ్ర ప్రశస్తి లో విశ్వనాథ

    మందాక్రాంత (నిర్మాణ వైవిధ్య) సౌందర్యాన్ని చూపిస్తూ శ్రీ మోహన రాసిన వ్యాసం తెలుగుయతులమీద చర్చకు దారి తీస్తే ఈ తెలుగు కవుల పలుకులు గుర్తుకు వచ్చాయి. పదంలో మధ్యలో ఉన్న అక్షరముతో యతి వేస్తూ విరామాలు లేకుండా — సంస్కృతాన్ని స్వతం చేసుకుని — వాళ్ళే పెట్టుకున్నపద్య నిర్మాణ నియమాలని నిర్వహిస్తూ ఇంత అందంగా రాయగలరా తెలుగుకవులు అని హాయిగా మరొక్క సారి ఆశ్చర్య ఆనందాలతో విస్తుపోతూ గర్వించాను.

    తః తః

  4. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/09/2012 4:52 pm

    తెలుగు ఛందస్సులకు సంస్కృత ఛందస్సులకు మధ్య ఉన్న తేడాలకు సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో ఉన్న తేడాలు కారణమని, ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు ఛందస్సును తక్కువచేసి మాట్లాడటం సరికాదని కామేశ్వర రావుగారు చక్కగా చెప్పారు. విరామయతి, పాదాంత విరామం fusional భాష అయిన సంస్కృతానికి ఒప్పినట్టుగా poly-agglutinative భాష అయిన తెలుగుకు ఒప్పదనే నన్నయాదులు వృత్త ఛందస్సును విరామ నియమాలు లేకుండా అక్షరమైత్రితో స్వీకరించారని ఇంతకు ముందు నేను కూడా ఎక్కడో చర్చించినట్లు గుర్తు. ఛందస్సుపై పరిశోధనలు చేస్తున్న వారెవరైనా విరామయతి, పాదాంత విరామం తెలుగు వాక్యనిర్మాణానికి ఎందుకు అంతగా ఒప్పవని సోపపత్తికంగా విశ్లేషిస్తే చదవాలని నా ఆశ.

  5. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    05/09/2012 2:35 pm

    శ్యామలరావుగారు,

    మీ వ్యాఖ్యలో కొన్ని విషయాలను మరికొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

    “బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యితర వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది.”
    “తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు.”

    వృత్త వైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం సంస్కృత కవులలో కూడా ఉన్నదే. ఒక కావ్యంలో భిన్న భిన్న వృత్తాలు వాడడం సంస్కృత కావ్యాలలో కూడా కనిపిస్తుంది కదా. మీరన్న వృత్త చతుష్కం కన్నా కూడా కందాలు తెలుగు కవులు ఎక్కువ వాడారు. అలాగే ఆటవెలది తేటగీతులు కూడా. సందర్భానుసారంగానే సీస పద్యాలు, అక్కడక్కడ ఇతర దేశి ఛందస్సులూ కూడా వాడారు. ఇతర వృత్తాలను అరుదుగానే వాడారు. అయితే వాటిని విరివిగా ఎందుకు వాడలేదు అనే దానికి కారణాలను వెతికితే మనకి కొంత విషయ పరిజ్ఞానం కలగవచ్చు. కాని, వాళ్ళ తెలివితక్కువ తనం వల్ల, స్పృహ లేని కారణంగా మానేసారని సమాధాన పడితే దాని వల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. వాళ్ళు నిజంగా ఎందుకు వాడలేదో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం ఎలాగూ లేదు.

    వృత్తౌచిత్యమన్నది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి – చెప్పే విషయం, రెండు – చెప్పే భాష. ఉదాహరణకి మందాక్రాంత వృత్తాన్నే తీసుకుందాం. మొదటగా, చెప్పే విషయం. కాళిదాసు మందాక్రాంత వృత్తంలోనే మొత్తం ఒక కావ్యం వ్రాసాడంటే, ఆ కావ్యం ఎలాంటిది? అది కథా కావ్యమా? కాదు. అందులోని వస్తువూ, రసమూ, పాత్రలూ ఇంచుమించుగా మొదటి నుండి చివర వరకూ ఒకటే విధంగా ఉంటాయి. అంచేత ఆ కావ్యమంతా ఒకే వృత్తంలో రచించడంలో ఔచిత్యం ఉంది. అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి. అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.

    కాబట్టి, తెలుగులో మందాక్రాంత విరివిగా ఎందుకు వాడబడ లేదు అనే ప్రశ్న వేసుకొనే ముందు, తెలుగులో మేఘదూతం వంటి కావ్యాలు ప్రాచీన కాలంలో ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకోవాలి. అది వేరే చర్చ, కాబట్టి దానిలోకి నేను వెళ్ళడం లేదు. అలాంటి కావ్యాలు రానందువల్ల, ఆ వృత్తం అంత విరివిగా వాడబడలేదు. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం భాష. మోహనరావుగారు, మీరూ చెప్పినట్టుగా మందాక్రాంత వృత్తం మొదటి నాలుగు గురువులూ తెలుగుకి ప్రతిబంధకం. గురువు లఘువుల సంఖ్యే కాదు, వాటి క్రమంలో కూడా వివిధ భాషల స్వరూపంలో తేడా ఉంటుంది. వృత్త చతుష్కం కాక మిగిలిన వృత్తాలు తెలుగులో విరివిగా లేకపోవడానికి యిది కూడా కారణమేమో పరిశీలించాలి.

    “మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?”

    వృత్తాన్ని విరుపులతో వ్రాయాలనే తాపత్రయం లేదు కాబట్టే తెలుగులో యతి విరామ స్థానంగా కాక అక్షర సామ్యంగా మారింది. కావ్యం మొత్తమూ పద్యాల విరుపుల అందం ఒక్కటే ఉంటే సరిపోదని మీకు నేను చెప్పనక్కరలేదు. సంస్కృతంలో కూడా రామాయణ భారతం వంటి కావ్యాలు ఇంచుమించు పూర్తిగా, కేవల పాదాంత విరామం మాత్రమే ఉన్న అనుష్టుప్పుతో నడిపించారు. ఇతర కావ్యాలలో కూడా కథా గమనం కోసం అలాంటి ఛందస్సే వాడబడింది. మందాక్రాంత వంటి అనేక విరుపులున్న పద్యాలు మేఘదూతం వంటి కొన్ని కావ్యాలలో మాత్రమే ఇంత విరివిగా వాడబడింది. తెలుగులో కూడా సందర్భం వచ్చినచోట చక్కని విరుపులతో హొయలుపోయే కందాలూ, సీసాలు మొదలైన మన దేశి ఛందస్సులో వ్రాసిన పద్యాలు ఉన్నాయి. మందాక్రాంత, మత్తకోకిల, లయగ్రాహి మొదలైన పెద్ద వృత్తాలకి విరుపులు లేకుంటే పద్యం అందం చెడిపోతుంది. తెలుగు కవులు ఈ వృత్తాలను వాడిన కొన్ని చోట్ల యీ అందాన్ని దృష్టిలో పెట్టుకో లేదన్నది మాత్రం నిజమే. కథాగమనం కోసం వృత్త చతుష్కంలో పద్యాలు వాడినప్పుడు వాటికున్న ఒక్క విరామ స్థానం అవసరం మన కవులకి కనిపించ లేదు. అందుకే వాటిని పాటించలేదు. పైగా, వాటికి మందాక్రాంత వంటి నిర్దిష్టమైన (మూడు విరుపులతో కూడిన) నడక లేకపోవడం వల్ల, ఆ ఉన్న ఒక్క విరామాన్ని పాటించకపోవడం వల్ల పద్య సౌందర్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అలా విరామ స్థానంలో విరుపు పాటించనవసరం లేని వృత్తాలనే తెలుగు కవులు ఎన్నుకున్నారనీ, అవే వృత్తచతుష్కమనీ నా ఊహ.

    కొంతమంది మరొక అభియోగం చేస్తూ ఉంటారు. కథా గమనానికీ సంభాషణలకీ సంస్కృతంలో లాగా చిన్న చిన్న పద్యాలు వాడకుండా యీ చాంతాడు వృత్తాలని తెలుగులో వాడారన్నది. ఇది కూడా అంత సమంజసంగా అనిపించదు. ఒకటి, తెలుగు కవులు కూడా చిన్న పద్యమైన కందాన్ని విస్తృతంగానే వాడారు. రెండు, సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో చాలా తేడా ఉంది. పదాలలో, వాక్యాలలో సంక్షేపము (brevity) ఎక్కువగా సాధించే లక్షణం సంస్కృతానికి ఉంది. అది ఒక రకంగా formal language కాబట్టి దానికా గుణం ఉంది. తెలుగు భాషా స్వరూపం వేరు. ఇది పూర్తిగా వాడుక భాష. నిత్యవ్యవహారంలో సంక్షిప్తంగా మాట్లాడడం అన్నది సహజమైన విషయం కాదు. అందుకే సంస్కృత భాషలో సాధించ గలిగే సంగ్రహత్వం తెలుగులో సాధించడం సాధ్యం కాదు. అలా సాధించాలని చూస్తే అది సహజ సౌందర్యాన్ని కోల్పోయి కృతకంగా తయారవుతుంది. అంచేత కథ చెప్పడంలోనైతే నేమి, సంభాషణల్లోనైతే నేమి, కొన్ని చోట్ల మనకి పెద్ద వృత్తాలు అవసరం అవుతాయి. ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు కవిత్వంలో సంక్షిప్తత తక్కువ అని పెదవి విరిచెయ్యడం సరి కాదు.

    “అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.”

    వృత్త విరామాల గురించి పైన చెప్పాను. ఇక యతి ప్రాసల నియమాలు వదిలి పద్య రచన చేసే సాహసం గురించి. ఎందుకు చెయ్యలేదూ, అలాంటి సాహసాలు కవులు చేసారు! ఈ వ్యాసంలోనే మోహనరావుగారు పేర్కొన్నట్టు రాయప్రోలు సుబ్బారావుగారు మేఘదూతానికి అనువాదమయిన దూతమత్తేభమనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని మత్తేభాలతో రచించారు. అలాగే మల్లవరపు విశ్వేశ్వరరావుగారు చిత్రాంగద అనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని పద్యాలతో రచించారు. యతి ప్రాస నియమాలు పాటించని కందాలు శ్రీశ్రీ సిప్రాలిలో కూడా మనకి కనిపిస్తాయి. ప్రాచీన కవులు ఎందుకలా రాయలేదు అంటే, బహుశా వాళ్ళకా ‘అవసరం’ కనిపించకపోయి ఉండవచ్చు. యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు. అక్కిరాజు ఉమాకాంతంగారు అలా జరిగిందని అభిప్రాయపడ్డారు కాని, అది పైన చెప్పినట్టుగా సంస్కృతంతో పోల్చడం వల్ల ఏర్పడిన అభిప్రాయమే అని నేననుకుంటాను. యతిప్రాసల నియమాలు కవికి ఒకోసారి ఎలా ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించే వ్యాసం, ఈమాటలోనే యిక్కడ ఉంది.

  6. తేనీటి సమయం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    05/09/2012 12:41 pm

    ఆ మూలనున్న కుండీలో ఎర్రటి మొక్క, కిటికీలోంచి కనపడుతున్న విచ్చిన మొగ్గల మేగ్నోలియా, నిశ్శబ్దంగా నిటారుగా నిలబడి వొంటి కాలుపై తపస్సులో మునిగిపోయిన ఆ పైన్ చెట్లు, వీటి మధ్య కాలం గలగల పారే సెలయేరులా కాకుండా మెత్తగా పాకి పైకి పోయే పొగమంచులా కరగిపోతుందేవో కదా. బావుందండీ మీ కవిత, నేనైతే ఆ టీ కప్పు గ్లాస్ కి తగిలే శబ్దం కూడా రాకుండా మడతేసిన పేపర్ నేప్కీన్ ని టేబుల్ పై పెట్టుకుంటాను. కొన్ని సార్లు నిశ్శబ్దం ఒక గొప్ప కమ్యూనికేటర్ కదా!
    -తిమ్మిరెడ్డి

  7. మైదానానికి చెలియలి కట్ట గురించి pavani అభిప్రాయం:

    05/09/2012 7:13 am

    I have read your article. It is a good detailed analysis. I read Maidaanam but I did not like it for something was missing. If I was asked why I did not like the book I couldn’t tell. From today I can say why I did not Like Maidaanam. I got words from your article. Thank you.

  8. చందవరం, ప్రకాశం జిల్లా గురించి అజ్ఞాత అభిప్రాయం:

    05/09/2012 12:49 am

    ఈరకం కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రచయితని ‘మామూలు మాటలని కవితలుగా మలచగల అద్యుభయ కవయిత్రి’ అనచ్చు

  9. తేనీటి సమయం గురించి Sudhakar Majety అభిప్రాయం:

    05/08/2012 11:44 pm

    జీవితాన్ని అనుభవించాలంటే బెంజ్ లూ, బీచ్ ఫ్రంట్ ఇళ్ళూ అక్కర్లేదు, మంచి కాఫీ, మరీ ముఖ్యం, దాన్ని అనుభవించగలిగే దర్జా ఉంటే చాలు. ఎంత బాగా రాసారండీ !

  10. పాఠకులకు సూచనలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/08/2012 11:42 pm

    ఇటీవలనే లండన్‌లో దొరికిన 1912 నాటి కలకత్తా ఫోటోలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. మన దేశంలో గత వందేళ్ళుగా మారకుండా ఉన్నవి ఎటువంటివో మనం గమనించవచ్చు.