పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి vElUri veMkaTESvara raavu అభిప్రాయం:

    07/03/2010 10:20 pm

    అఫ్సర్, ముకుందరామారావుల కవితా సంకలనాలపై నేను రాసిన సమీక్షల మూలంగా నాపైవచ్చిన వ్యాజస్తుతి ( నిందాస్తుతి, స్తుతినిందా తో సహా!) కాస్సేపు పక్కకు పెట్టి, ముందుగా నాదొక ప్రశ్న. ఈ ప్రశ్నవెయ్యడానికి కారణం, కేవలం తెలుసుకోవాలనే కుతూహలమే!

    రమ గారు ఇలా రాసారు:
    ” పాశ్చాత్యదేశాల్లో పత్రికలు ఇంకా ప్రచురణకర్తల మీదా ఒక ముద్ర ఉంది. అదేమంటే అక్కడ వాళ్ళు కావాలంటే అకవులని హడావుడి చేసి కవులుగా ప్రచారం చేయగలరు..లేదా కవులని తయారూ చేయగలరు. అలాగే ఒక మంచి పుస్తకాన్నీ ఒక మంచి రచయితనీ కావాలనుకుంటే నొక్కేయనూగలరు అని. దీనికి సంబంధించి పశ్చిమ దేశాల పత్రికల మీదా ప్రచురణకర్తల మీదా బోలెడన్ని సంఘటనలూ ..కధలూ ప్రచారంలో ఉన్నాయి, ” అని.
    రమ గారు ఈ ” బోలెడన్ని సంఘటనలూ … కథలూ ” ఎక్కడ చదివారో, కనీసం కొన్ని ఆధారాలు ఇచ్చి ఉంటే, బాగుండేది.
    ఏ ఆరోపణకైనా ఆధారాలుండాలనుకుంటాను.

    వేలూరి వేంకటేశ్వర రావు

  2. శ్రీకృష్ణదేవరాయలు గురించి గన్నవరపు వరాహ నరసింహ మూర్తి అభిప్రాయం:

    07/03/2010 9:09 pm

    గుఱ్ఱపు జాషువా కవిత గొంటెగ వేయదు తప్పు గెంతులున్
    వెఱ్ఱగు గబ్బిలమ్మటనె వేసఁగి కమ్మగ గూయు కోయిలే
    తొఱ్ఱల దాగియుండునునె దోయజ మందలి తేనె సోకుచున్
    ఎఱ్ఱనె నవ్యతాంధ్రమున నెన్నగఁ బాడెనె నింపు గీతముల్ .

  3. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/03/2010 7:42 pm

    ఎవరి మెప్పుకోసవో వ్రాసే రాతల్లో నిజాయితీ ఉండదని రామారావు గారన్న మాట బాగుంది. నిజాయితీ లేని కవిత్వం ఎలాగు పాఠకులని మనసులకి చేరదు. కానీ ఆ నిజాయితీ ఒక్క అమెరికాంధ్రులకు మాత్రవే ఎందుకు పరిమితవో నాకు తెలీదు. అసలాంధ్రుల కవిత్వవంతా కూడా ఆది కవి నన్నయ్య ముందునుంచి అమెరికాంధ్రులవరకునిజాయితీ లేని కవిత్వవేనా? ఎవరో కల తెలుసుకున్న ఐదు అంతకు తక్కువ తెలివిమంతులు తప్ప. కానీ ఈమాట ఐదుగురు అంతకు తక్కువ రచయితలతో నడవదు కదా. పాపం ఈమాట కూడా నిజాయితీ లేని రచనల్ని ప్రచురిస్తూ ఎలాగో ఒకలా గడిపేస్తున్నదనమాట.

    ఇక్కడొక మాట. రచనలు చేస్తున్న, చదువుతున్న అమెరికాంధ్రులంతా కూడా ఖచ్చితంగా అమెరికాలో మొదటితరవే. రెండో తరపు ఆంధ్రులు తెలుగు మాట్లాడటవేగొప్ప. సగంకన్నా ఎక్కువ బతుకుని తెలుగూర్లలో గడిపిన ఆ అనుభవాలే కదా ఈరోజు అమెరికాంధ్రుల రచనలకి ఆలంబన. ఇప్పటికీ ఇడ్లీ, దోశలు, పచ్చళ్ళు, ఆవకాయలు, కంచం నిండా అన్నాలు, వారానికి కనీసం రెండు మూడు సార్లు ఇంటితో (తెలుగు దేశంతో) ఫోను పలకరింపులు. అక్కడి ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇక్కడ పెరిగే, తరిగే రక్తపోటులు, భౌతికంగా ఇక్కడున్నా, మనసంతా అక్కడే కదా. మరి రచయితలు, వారి రచనలు, వారి పాఠకులు మాత్రం వేరుగా ఎలా? అమెరికాంధ్రులైతేనేం, అసలాంధ్రులైతేనేవి. ఇద్దరూ ఒకటే కదా. రామా రావు గారేమో అవన్నీ నిజాయితీ లేని రచనలు అంటున్నారు ఒక్క ఐదు అంతకు తక్కువ రచయితలవి తప్ప. మరా ఐదు అంతకు తక్కువున్న ఆ రచయితలు అమెరికాలో తమ చుట్టూ ఏ గోడలు కట్టుకున్నారో, ఏ గూట్లో దాక్కున్నారో ఆ గాడినీ, వేడిని, వాదాల్ని, విప్లవాల్ని వదిలించుకుని ఏ తత్వాన్ని ఒంటపట్టించుకున్నారో?ఇంతకీ ఆ ఐదు అంతకు తక్కువైన ఆ రచయితలు ఎవరో, ఎవరో ఆ గాడి వదిలిన కవులు, ఎవరో ఆ చక్కని నిజాయితీపరులు, ఎవరో వారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  4. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    07/03/2010 6:25 pm

    అఫ్సర్ గారు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు – ” మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ?” అని. అఫ్సర్ గారూ, అసలలాటి సర్వేలు జరిగినట్టు కూడా నాకు తెలియదు. దయచేసి వాటి ఫలితాల్ని మా అందరితో పంచుకోండి. ఎంతో మేలు చేసిన వారౌతారు. ముఖ్యంగా మీరన్నట్లు ఇరవై ముప్ఫై ఏళ్ల నాటి అనుభవాల మీద ఆధారపడి ఊహాగానాలు చేస్తున్న వాళ్లకు.

    తెలుగు కవిత్వాన్ని చదివే పాఠకుల సంఖ్య ఎంత? రాసే కవుల సంఖ్య ఎంత? ఏ కవుల రచనల్ని ఎంతెంత మంది పాఠకులు చదువుతున్నారు? ఎంతెంత మంది పాఠకులు ఎలాటి కవితలు వస్తే ఇష్టంగా చదువుతామని చెప్తున్నారు? పాఠకుల్లో ఎంతమంది ఏయే రకం కవిత్వాలు తమ జీవితాలకి అనుభవాలకి దగ్గరగా ఉన్నాయంటున్నారు? పాఠకుల ఇష్టానిష్టాలు ఏమిటి? ఇంకా ఎన్నో ఇలాటి సందేహాల్ని మీరు చూసిన/చేసిన సర్వేలు నివృత్తి చేస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నాను. దయచేసి అందరికీ అందించండి. కవులకూ విమర్శకులకూ సాహిత్యాభిమానులకూ ఎంతగానో ఉపయోగించే ఇలాటి సమాచారం మీ దగ్గరే దాచుకోవటం అన్యాయం అండీ.

    విదేశీరచయితలు చెయ్యవలసిన సాహసం ఒక్కటేనండి – ఇంకెవరినో మెప్పించటం కోసం కాకుండా తమకు అనుభవంలో వున్న విషయాల గురించి తమ దృష్టిపథాన్నుంచి రాయటం. మీరన్నట్లు బహుశ నా మునుపటి కామెంట్ ఇందుకు వ్యతిరేకం అయుండొచ్చు. మీరు సర్వే ఫలితాలు పంపిన వెంటనే నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను.

    అలాగే సాహిత్య సాంద్రత గురించి కూడ సర్వేల్లో ఏం తేలిందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందండి. ఆంధ్రదేశంలోని ఏయే కవుల కవిత్వం సాంద్రత ఎంత ? ఇండియాలోని ఇతర భాషల కవిత్వసాంద్రతతో పోలిస్తే మన మహాకవుల సాంద్రత ఎంత?

    అసలు సర్వేలతో సాహిత్యం బరువు తూసెయ్యొచ్చునని ఇన్నాళ్లూ తెలియక సాహిత్యాన్ని చదివీ దాని గురించి ఆలోచించీ ఎంత కాలం వృధా చేసేశానో కదా.

    చివరగా, అక్కడి సాంద్రతని అందుకోవటం అమెరికన్ తెలుగు రచయితల లక్ష్యం కావాలని నేననుకోనండి. ఎవరి బతుకులు వాళ్లవి, ఎవరి అనుభవాలు వాళ్లవి. సొంత అనుభవాల్నుంచి పుట్టి హృదయాన్నుంచి వచ్చే సాహిత్యం సర్వేల్లో తేలేంత సాంద్రత లేనిదైనా ఫర్వాలేదండి, కనీసం అరువుబరువు కాదు.

  5. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి తెలుగు యాంకి అభిప్రాయం:

    07/03/2010 5:49 pm

    ఇక్కడ వ్యాఖ్యలుంచిన వారిలాగ నాకు కవిత్వము ఎలా చదవాలో బహుశ తెలియకపోవచ్చు. వారందరిలాగ చెత్త సంకలనాలను చదివి విసిగి ఉండకపోవచ్చు. కానీ ఒక మంచి కవిత కనబడితే గుర్తించగల శక్తి మాత్రము నాకు ఉందనుకుంటున్నాను.

    అఫ్సర్ ‘నాలుగు మెతుకులు‘ కవితలో అన్నట్టు “భాష్యాలు ఎప్పుడూ వోడిపోతూనే ఉన్నాయిలే, లోగొంతుకల్న తోడిపోసే చేదలేదుగా చేతల్లో” , ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగి ఉండవచ్చు. వెంకటేశ్వరరావుగారి సమీక్షలో ఇచ్చిన కొన్ని కవితా భాగాలు చదివి ఈ పుస్తకమంతా అలాంటి కవితలే ఉన్నాయి అని బహుశ వీరు భావించి, గుఱ్ఱాన్ని గాడిదను ఒకే గాటికి కట్టేసినట్టున్నారు. ఈ సంకలనములో అఫ్సర్ కేవలము తిట్టు కవిత్వము మాత్రమే రాసాడు అని అనుకోవటము చాలా పొరబాటు. మరల మరల గుర్తుకొచ్చేటువంటి చక్కటి చిక్కటి కవితా పంక్తులెన్నో ఉన్నాయి ఈ పుస్తకములో. రెండు మూడు ఉదాహరణలు..

    జాంచెట్టు కవితలో
    దాని కొమ్మల్లోంచి రాలిపడే కిరణాల్ని కళ్ళలోపల దాచుకొని
    పొద్దుటా, మధ్యాన్నం, రాతి్ర పూటా ఆ వొకే వొక్క జాంచెట్టు
    దాని నీడ నేనయ్యానో అది నా నీడ అయ్యిందో?!

    జంగమం” నాకు బాగా నచ్చిన కవితలో..
    అనుక్షణం మారే నా ఇంటి నంబరు నా పత్తా చెప్పనే చెప్పదు
    జంగమం నా నిజ స్థావరం
    స్థావరం నా సమాధి పలకం
    జంగమ కల నా ఇలాకా..

    అలాగే తేలికగా మాటలు జారటముగురించి అఫ్సర్ ఇలా అంటాడు..
    మాట రక్త మాంసాల సరస్సులో పుట్టిన పువ్వు
    అది నీ వికార పెదాల మీద నిరాకార శకలం

    ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి. మరో టపాలో వివరముగా రాస్తాను త్వరలో.
    చివరగా.. నా ఉద్ధేశ్యములో కవి అంటే
    “ఊరి మధ్యనున్న సుందర కాసారములోని సరోజాలగురించీ, వాటి లోని అందానికి మకరందానికి ఆశ పడుతూ వాలే భృంగాల గురించీ అందమైన పదబంధాలతో వివరించే వాడు మాత్రమే కాదు. ఊరిచివరున్న ఎండి నెఱ్ఱెలు పడ్డ చెరువు గురించి కూడా కదిలించేట్టుగా చెప్పగలిగి ఉండాలి”

  6. పసిఁడిపల్లకి గురించి Kameswara Rao అభిప్రాయం:

    07/03/2010 4:56 pm

    మీ కవితా మహద్విహగ మెక్కి ప్రయాణముజేసినాడ నే
    నా కమనీయ రాట్సభకు నా హృదయమ్ము రసార్ద్రమయ్యె బా
    ష్పాకలితంబులయ్యె కనుపాపలు; తెల్గు కవిత్వ ధీధితుల్
    ప్రాకె దిగంతముల్ పసిడిపల్లకి రాయలు పట్టి యెత్తగా

    పెద్దన కృష్ణరాయల అనుబంధం అపురూపమైనది. పెద్దన పద్యంలోని ఆర్తి, ఆ అనుబంధంలోని గాఢతని పట్టిస్తుంది..

    మీ కవిత్వ దీపశిఖ కాంతులు ఈమాటని ఇలా దేదీప్యమానం చేస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

  7. పసిఁడిపల్లకి గురించి Dr.Gannavarapu Varaha Narasimha Murty అభిప్రాయం:

    07/03/2010 3:51 pm

    కలయును కాదు కాదు నిది కల్లయు కాదిది కావ్య సారముల్
    విలువలు ఙ్ఞానసంపదలు విద్యల వేత్తలు సింహ శూరులన్
    బెలుచగ పెద్దసానికవి పేర్మిని రాయలుగృస్ణ దేవునిన్
    గొలిచెనె కృస్ణ కోకిలయు కూతిడి గొప్పగఁ బద్యసంపుటిన్ .

  8. తలుపుల రసీదు గురించి Sarath అభిప్రాయం:

    07/03/2010 10:43 am

    అద్భుతం…చాలా బాగా రాసారు.

  9. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి అఫ్సర్ అభిప్రాయం:

    07/03/2010 9:46 am

    రామారావు గారంటే నాకు గౌరవం వుంది, ఆయన కొంచెం ఆలోచించి రాస్తారని. ఆ గౌరవానికి భంగం కలగకుండానే, ఈ నాలుగు మాటలూ రాస్తున్నా.

    ఈమాట తరఫు నించి ఆయన చెప్పిన మాటలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఈమాటకి సంబంధించిన విషయం.

    కాని, రచయితలూ, “ఉహా” పాఠకుల గురించి ఆయన చేసిన ఊహలు నాకు కొంచెం ఆశ్చర్యంగా వున్నాయి. మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ? ఆంధ్ర దేశంలో వొకే రకం పాఠకులు వున్నారన్న ఈ అంచనా ఎక్కడినించి వచ్చింది?

    అక్కడి రచయితలకూ, పాఠకులకూ అమెరికాలోని తెలుగు రచయితలకూ, పాఠకులకూ నిజంగా తేడా వుందా? అమెరికాలోని తెలుగు రచయితలూ, తెలుగు పాఠకులూ వొక “ఫ్రోజెన్”తెలుగు సమాజంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అది అరవయి, డెబ్బయిల ఆంధ్ర.

    అమెరికాలోని తెలుగు వాళ్ళకి మల్లెనే, అక్కడా కొందరు ఫ్రోజెన్ తెలుగు వారు వుండవచ్చు. వారికి విప్లవ రచయితలని తిట్టడమే ఏకైక పని.

    నాకు తెలిసీ ఆంధ్రాలో పాఠకుల స్వభావం మారింది, ఇటీవలి ఉనికి చైతన్యమూ, రాజకీయాల తరవాత.

    దళిత, ముస్లిం, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర రచయితల ప్రభావం అమెరికాలోని ఈ ఫ్రోజెన్ తెలుగు సమూహాలకు ఇంకా అర్ధం అవుతున్నట్టు లేదు. అవి అందరూ అనుకుంటున్న “విప్లవ” లేదా వామ పక్ష కక్కులు కావు. అమెరికాలోని వివిధ భాషీయుల, జాతుల వేదన కూడా అ.తెలుగులకు అర్ధం అవుతున్నట్టు లేదు. అది వేరే మాట్లాడుకుందాం. అక్కడి ఉనికి వేదనకూ, ఇక్కడి అనేక భిన్న జాతుల వేదనకూ కొంత చుట్టరికం దూరంగానయినా వుంది. కాని, ఆంధ్రాలో ఉనికి చైతన్యం రాజకీయ పరంగా ఎటు మళ్ళినా, సాహిత్య, సాంస్కృతిక రంగాల పరిధిని విశాలం చేసింది. ఆ విశాలమయిన పరిధిలోంచి కొత్త పాఠకుడిని చూడాలని నా అభిప్రాయం.

    రామారావు గారి “ఊహా పాఠకులు” ఎవరో , వారి వర్తమానం ఏమిటో తెలుసుకోవాలని వుంది. అలాగే,”అక్కడి” తెలుగు రచయితలు చేయలేకపోతున్న సాహసాలు / విదేశీ తెలుగు రచయితలు సేయంగల సాహసాల భోగట్టా కూడా.

    ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో! (కొంత మంది అ.తెలుగు రచయితలు క్షమిస్తే, ఈ నిజం చెప్పక తప్పదు. లైలా లాంటి వారి కామెంట్లు చదువుతున్నప్పుడు అది ఇంకా మూడు నాలుగు తరాలు కూడా పట్టవచ్చని దిగులుగా వుంది)

  10. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana అభిప్రాయం:

    07/03/2010 9:14 am

    కన్నడములో దేవరనామ వైష్ణవభక్తిగీతాలను వ్రాయడము మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన నరహరితీర్థులతో ప్రారంభమయిది. మధ్వాచార్యులు కూడా వ్రాసినరని అంటారు, కాని కన్నడములో వారి పాటలు దొరక లేదు. కాని సంస్కృతములో వారి ద్వాదశస్తోత్రము పాడడానికి ఎంతో బాగుంటుంది. నేడు కూడా ఈ ద్వాదశస్తోత్రాన్ని నైవేద్య సమయములో పాడుతారు. వ్యాసరాయలపైన దీర్ఘంగానే చర్చించాను. అక్కడ వారి గురువులైన శ్రీపాద రాయలనుగురించి కూడా వ్రాసాను. ఈ శ్రీపాదరాయల మఠము ముళ్బాగలులో ఉంది (బెంగళూరు తిరుపతి బస్సు మార్గములో). కానీ స్థలాభావమువల్ల అదంతా కత్తెరవేటుకి పడ్డది. పురందరదాసు కనకదాసులతో సహా శ్రీపాదరాయలు, వ్యాసరాయలను హరిదాసకూటానికి పితామహులని అనుకొంటారు. శ్రీపాదరాయల ఆనతిపైననో లేక తనంతట తానో చాలా యేళ్ల శిష్యరికం పిదప వ్యాసతీర్థులు ముళ్బాగలునుండి చంద్రగిరికి వెళ్లారు. అక్కడ సాళువ నరసింహరాయలకు రాజగురువుగా ఉన్నారు. శ్రీపాదరాయలు కూడా రాయలకు గురువే. ఆ సమయములో తిరుమలపైన అర్చకులు లంచగొండితనంవల్ల తీవ్రశిక్షకు పాల్పడ్డారు. స్వామివారి అర్చనకు ఎవ్వరూ లేనందువలన నరసింహరాయలు వ్యాసతీర్థులను శ్రీవారికి పూజ చేయమని అడగ్గా, అలాగే సుమారు 12 సంవత్సరాలు పూజ చేసారు ఇంతలో పూజారి వంశపు పసివాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వారికి పూజా భారాన్ని అప్పగించారు వ్యాసతీర్థులు. సాళువ నరసింహరాయలతో ఇతడు కూడా విజయనగరానికి వెళ్లారు. తిరుపతిలో ఉన్నప్పుడు వ్యాసతీర్థులు బహుశా అన్నమయ్యను కలిసుంటారనే నా ఊహ. కృష్ణరయలపైని గౌరవము, వాత్సల్యము వలన తన పాటలకు వ్యాసరాయలు కృష్ణ ముద్రను ఉంచారని కొందరు అంటారు. శ్రీపాదరాయలు రచించిన కొన్ని దేవరనామాలు – పోపు హోగోణ బారో రంగ, బారో మనెగె రంగ నిన్నంఘ్రికమలవ తోరో, ఇక్కో నోడే రంగనాథన పుట్టపాదవ, నా నినగేను బేడువుదిల్ల, భూషణకె భూషణ ఇదు భూషణ, ఆవ జనుమద తాయి ఆవ జనుమద తందె మున్నగునవి. నాకు భూషణకె భూషణ ఎంతో ఇష్టం. అతని ఒక పాట కింద ఇస్తున్నాను –

    మనెయింద సంతోష కెలవరిగె లోకదల్లి
    ధనవింద సంతోష కెలవరిగె లోకదల్లి
    వనితెయిం సంతోష కెలవరిగె లోకదల్లి
    తనయరిం సంతోష కెలవరిగె లోకదల్లి
    ఇనితు సంతోష అవరవరిగాగలి నిన్న
    నెనెవో సంతోష ఎనగాగలి నమ్మ రంగవిఠల

    ( గృహమందు ముదమగును కొందరికి లోకమున
    ధనమిచ్చు మోదమును కొందరికి లోకమున
    వనిత లిత్తురు ముదము కొందరికి లోకమున
    తనయు లిత్తురు ముదము కొందరికి లోకమున
    ఎవరి యానంద మవి వారి కగును నిన్ను
    తలచు యానంద మది నాకగు స్వామి రంగవిఠల )

    విధేయుడు – మోహన