పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana అభిప్రాయం:

    07/05/2010 9:00 am

    నేను ఈ వ్యాసం వ్రాయడానికి పూనుకొన్నప్పుడు నాకు కూడా కామేశ్వరరావుగారిలాగే ఊహ జనించింది. కన్నడరాజ్యరమారమణుడు ఎందుకు కన్నడములో వ్రాయలేదని. దానికి నేను ఊహించిన కారణాలను ఇక్కడ ఇస్తున్నాను.

    1) కన్నడ పద్యరచనా సాహిత్యము రాయలనాటికే ఉచ్ఛదశను అందుకొన్నది (It has already peaked). వాళ్లు కీర్తనా సాహిత్య ప్రక్రియను కొనసాగించడానికి ఉద్యుక్తులయ్యారు. తెలుగు సాహిత్యపు ప్రబంధయుగపు ఔన్నత్యానికి కాలము రాయల నాటిది.

    2) కన్నడములో వ్రాయడము తెలుగుకన్నా తేలిక, ఎదుకంటే కన్నడములో అక్షరమైత్రి యతి లేదు. కన్నడములో మొట్టమొదట తెలుగులాగే సంస్కృత వృత్తాలతో నిండిన చంపూ కావ్యాలు నాంది పలికినా, తరువాత వచ్చిన కవులు షట్పదలు, సాంగత్యములాటి దేశి ఛందస్సులో (నా ఉద్దేశములో సరియైన నిర్ణయము, ఇలా తెలుగు కవులు అందరూ ఎందుకు ఉద్యమించలేదో అని ఎప్పుడూ నేను విచారపడుతాను) వ్రాసారు. సంస్కృత సందీర్ఘ సమాసాలతో వృత్తాలలో వ్రాసే రాయలకు ఇలా దేశి ఛందస్సులో వ్రాయడము రుచించలేదేమో? లేక challenging గా తోచలేదేమో?

    3) తెలుగులో బాగుగా వ్రాసి తెలుగువారిని మెప్పిస్తే తన రాజ్యములోని ఎక్కువ పాలైన తెలుగు ప్రాంతాలు అలజడి లేక ఉంటాయనే రాజకీయ కారణాలు కూడా రాయలకు కలిగిందేమో? అందుకే ఆంధ్రవిష్ణువు తన కలలో వచ్చాడంటాడు.

    తెలుగు నేర్చుకోక తెలుగులో కావ్యాలు వ్రాసేటంత జ్ఞానము అబ్బడము సామాన్యము కాదు. కాని రాయలు సామాన్యుడు కాడు. వీరుడు, సాముగరిడీలు, కసరత్తు చేయడములో దిట్ట, రాజనీతిజ్ఞుడు, వీణావాదననైపుణి గలవాడు. సంస్కృతములో అసాధారణ పాండితీ ప్రతిభను ఆర్జించుకొన్నవాడు. In theory, it is possible for SrIkrishnadevaraayalu to excel in Telugu.

    రాయలు కన్నడమును మాత్రమే కాదు, తన మాతృభాష ఐన తుళును కూడా ఉద్ధరించలేదు. రాయలవంటి చక్రవర్తి తుళు భాషకు మద్దతును ఇచ్చి ఉంటే నేడు తుళు భాష కన్నడముతో సమానముగా శోభించి ఉంటుంది. నా ఉద్దేశములో రాయలు వ్రాసిన సంస్కృత కావ్యాల (మనకు లభించినవి) శైలికి ఆముక్తమాల్యద శైలికి మధ్య ఉండే సాన్నిహిత్యము, భేదము గమనించాలి.

    విధేయుడు – మోహన

  2. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    07/05/2010 7:58 am

    “కవిత్వం ‘డెమాక్రటైజ్’ అయ్యింది” అన్నమాటకి నేను “కవితావస్తువు ప్రజల జీవితానికీ, ఆశయాకాంక్షలకీ చేరువయ్యిం”దని అర్థం చెప్పుకున్నాను. కాదా?

    ఆ వ్యాఖ్యా, అంతకు ముందు పారాగ్రాఫూ మీ సమీక్షలో ఇమిడినట్లు నాకనిపించలేదు.

  3. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/05/2010 1:14 am

    మోహనరావు గారూ మీకు కన్నడం బాగా తెలుసును కదా? కన్నడ పదకర్తల రచనలనీ వారికి ఆద్యుడైన అన్నమాచార్యుల రచనలతో పోల్చి తెలుగు పాఠకుల కి ఏమన్నా మీరు చెప్పగలిగితే బాగుంటుందేమో?? ఆ అవసరం ఇవాళ చాలా ఉంది కూడానూ!! ఎందుకంటే ఇది మీలాంటి వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. ఆలోచించండి.

    రమ.

  4. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/05/2010 1:01 am

    కామేశ్వర రావు గారి ముగింపువాక్యాలనే రాయని రచనా కుశలతకి సంబంధించి నేను నా జవాబుగా చెప్పదలుచుకున్నాను.

    రమ.

  5. పసిఁడిపల్లకి గురించి Kameswara Rao అభిప్రాయం:

    07/05/2010 12:44 am

    ఈ కవితని మళ్ళా చదువుతూ ఉంటే రెండు చిన్న అనుమానాలు వచ్చాయి.
    “ధవళపట్టంబరంబు” – ఇక్కడెందుకో “పట్టు” పదం “ధవళ” “అంబర” పదాల మధ్య సరిగా అతికినట్టు లేదు. పట్టు తత్సమ పదం కాదు కదా. అలా సమాసం చెయ్యవచ్చా? అది “పట్ట” అనుకుంటే “పట్టాంబరంబు” అవ్వాలి.

    “కంఠీరవోజస్సె” – ఇక్కడ వృద్ధి జరిగి “కంఠీరవౌజస్సె” అవ్వాలి కదా? ఈ పద్యంలో మొదటి రెండు పాదాల్లోనూ “ఇంద్రుడు”, “బృహస్పతి” ఉపమానాలు సరిగా సరితూగాయి. తర్వాతి రెండు పాదాల్లో ఆ తూకం తప్పింది. పెద్దనని బ్రహ్మతో పోల్చారు కాబట్టి అక్కడ రాయలని విష్ణువుతో పోలిస్తే ఇంకా బాగుండేదనిపించింది.

  6. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/05/2010 12:38 am

    చిలక జోస్యాలు చెప్పడంలో నేను ప్రవీణురాలిని కాను. నేను తప్పులూ ఎన్నడమ్ లేదు. విమర్శని స్వీకరించడం చాలా మందికి కస్టం అని నేనెరుగుదుమను. నేను చెప్పింది సాహిత్య పరిధి విస్తృతం గురించి. దానికి నేను ప్రత్యేకంగా ఋజువులు చూపించడం ఎందుకూ?? కవిత్వం పేరుతో అచ్చవుతున్న అనేకమైన సరుకులు ఉదాహరణలే!! వాదనకోసం ఎంతైనా వాదన చేయవచ్చును . దానికేం?? కానీ ప్రతిభావంతమైన సాహితీ కారులు కావాలీ అంటే మాత్రం వాళ్ళకి వాళ్ళు వ్యక్తీకరించుకున్న ప్రక్రియ మీద మంచి పట్టూ..భాష మీద అధికారమూ సాహిత్యం మీద సాధికారతా అన్నవి తప్పనిసరి. ఇవాళ్టి చాలా మంది కవి నామధేయులకి అవి పూజ్యమన్నది తేటతెల్లమైన సంగతి. వారి వారి రచనలే ఇందుకు సాక్ష్యం. ఇందుకు ఎలాంటి జోస్యాలూ అవసరం లేదు. ఇకపోతే మాకు ఇవన్నీ కవితలే అని అనేవాళ్ళూ ఉంటారు. అనడానికి ఇబ్బందిలేని కాలంలో ఉన్నవాళ్ళం గనక. వాళ్ళు “ప్రజాస్వామ్యబధ్ధమైన వచన కవితా ప్రక్రియ” లోని సులువులని వాడుకుని అదంతా కవిత్వమనే దబాయించి బతకొచ్చు. కాదని అంటే వాళ్ల కులాలనీ వాళ్ళ వర్గాలనీ వాళ్ళ మతాలనీ ఎత్తి చూపి బెదిరించే పనికి పూనుకోనూ వచ్చు. ఇవాళ చాలా సందర్భాల్లో తరుచూ జరిగేది ఇదే!! అందువల్లనే ఇంత అసహనం కన్పిస్తూంది విమర్శ మీద.

    రామారావుగారి సర్వే చాలామటుకు నిజం కవిత్వ పుస్తకాలకి సంబంధించి.
    తెలుగున కవిత్వం అమ్ముడయ్యే సరుకు కాదు. కవులు స్వంతంగా అచ్చు వేసుకుని నలుగురికీ పంచిపెట్టుకుని తాము కవులమని చెప్పుకుందికి ఉపయోగపడే ఒక సాధనం. అయితే ఈ పరిస్థితి కవిత్వానికే కాదు కధలకీ ఉంది. నిజానికి సాహిత్యం మీద ఆసక్తితో పుస్తకాలు కొనేది చాలావరకూ పాత సాహిత్యాన్నే!! కొద్దోగొప్పో పుస్తకాలు కొనేవాళ్ళు ఎక్కువగా భారత రామాయణాలనీ ప్రబంధాలనీ కొంటుంటారు. వీటికే మార్కెట్ ఉందని ప్రచురణకర్తలూ అంటారు.

    ఆధునిక కవిత్వం లో అమ్ముడయ్యే కొద్ది పుస్తకాలు ఉండొచ్చునేమో!! కానీ ఎక్కువ పుస్తకాల పరిస్థితి ఇదే!! మరి ఇలాంటప్పుడు దీనిని గురించిన వాస్తవాల ప్రస్తావన ఎవరన్నా చేస్తే…ఆ చేసిన వాళ్ళని కాదు తప్పుపట్టాల్సింది. వాస్తవాలని గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. అబ్బే నిజాలు ఉంటే ఉండనీండి మీరు మటుకు మాట్లాడకండి అని అనేలాంటి ప్రయత్నాలు చర్చించే వాళ్ళ నోరుమూయించడం..కోసం చేసేవి.అవి ఎలా చేసినా. ఎవరెవరు చేసినా.. ఏయే కారణాలకి చేసినా..!అందువలన లాభపడే వాళ్ళూ ఎవరైనా.. నస్టం ఎప్పుడూ సాహిత్యానికే జరిగింది. జరుగుతూ ఉంది.

    రమ.

  7. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి Kameswara Rao అభిప్రాయం:

    07/04/2010 11:55 pm

    ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి ఎప్పుడో ముగిసిపోయిన చర్చని మళ్ళీ లేవనెత్తడం అనవసరం, కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప. ఆముక్తమాల్యద కర్త పెద్దన అని చెప్పేందుకు చూపించిన అనేకానేక ఋజువులు సరికావని, సరిపోవని వాటిని ఖండిస్తూ వచ్చిన ప్రతివాదాలు రమ గారికి తెలియవని నేననుకోను. అంచేత కృష్ణరాయలే ఆముక్తమాల్యద రాసాడన్నది వట్టి కట్టుకథ కింద కొట్టిపారెయ్యడం సమంజసం కాదు.
    అయితే రామారావుగారు చెప్పిన హైపాతసిస్ పరీక్షలు మన కావ్యాలపై ప్రయోగించే ముందు వాటిని శాస్త్రీయంగా పరీక్షించాల్సి ఉంటుంది. మనకి కర్తృత్వం రూఢిగా తెలిసిన కావ్యాల మీద ప్రయోగించి, వాటి ఫలితాలని బట్టి అది మన కావ్యాలకి ఎంతవరకూ పనికివస్తుందనేది ముందు తేల్చుకోవాలి. తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు మొదలైన బహు గ్రంథ కర్తల కావ్యాలని తీసుకొని ఈ ప్రయోగాలు చెయ్యవచ్చు. We should do some kind of ANOVA to compare intra and inter population variation.
    రచనా శైలిని, వస్తు నిర్వహణని బట్టి కవి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం మన విమర్శకి కొత్త కాదు. దాని బట్టి ఆముక్తమాల్యద పెద్దన కన్నా రాయలే రాసి ఉండేందుకు చాలా అవకాశం ఉందని విమర్శకులు భావించారు. అది సమంజసమైనదే. ఈ సంచికలోనే వచ్చిన ఆముక్తమాల్యదలోని రాజనీతి వ్యాసం చదివితే ఇది స్పష్టంగానే తెలుస్తుంది.
    ఇదికాక ఈ మధ్య ఆముక్తమాల్యద చదువుతూ ఉంటే నాకనిపించిన మరొక విషయం. ఇందులోని భాష- అంటే వాక్య నిర్మాణం, క్రియా పదాలు మొదలైన వాటిని చూస్తే ఇది తెలుగు మాతృభాష (పోని ఇంటిభాష!) అయినవాడు ఇలా వ్రాయడు, వ్రాయలేడని కచ్చితంగా నిరూపించ వచ్చేమో అని అనిపించింది. ఈ రకమైన విశ్లేషణ ఇది వరకు ఎవరైనా చేసారేమో నాకు తెలియదు. ఆముక్తమాల్యద భాషలోని “తెలుగుదనాన్ని” అంచనా వెయ్యగలిస్తే ఈ విషయం మరింత స్పష్టపడుతుంది.
    ఈమాట వ్యాఖ్యల ఆనవాయితీకి తగ్గట్టుగానే ఇదంతా ఈ వ్యాస విషయానికి సంబంధం లేని చర్చే 🙂 అలా నా వ్యాఖ్యని వదిలెయ్యడం ఇష్టం లేక, ఈ వ్యాసానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించి ముగిస్తాను. కన్నడ రాయలుగా పేరుపొందిన కృష్ణరాయలు సంస్కృతాంధ్రాలలో కృతులు రచించి కన్నడంలో మాత్రం రచించకపోవడం నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆ భాషలో రాయలకి అంత పట్టు లేదనుకోవాలా లేక కావ్యం రచించేటంత ప్రీతి లేదనుకోవాలా?

  8. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/04/2010 10:18 pm

    రమా గారు,

    మీ అభిప్రాయవేదో మీరు చెప్పండి. మాకు నచ్చినా నచ్చకపోయినా అది మీ అభిప్రాయంగా దానికొక గౌరవవుంటుంది. మా అభిప్రాయాలు చదివి మా గురించి చిలక జ్యోస్యాలు చెప్పకండి. మా అభిప్రాయం మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఓపికుంటే సహేతుకంగా చెప్పండి, ఓపిక లేకపోతే నచ్చలేదని చెప్పండి. తప్పులెన్నండి, తప్పులేదు. కానీ మీ విమర్శకోసం మా గురించి మీ చిలకజ్యోస్యపు సైకో ఎనాలసిస్ మాత్రం చెయ్యకండి.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  9. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhan అభిప్రాయం:

    07/04/2010 9:50 pm

    ఈ వ్యాసపు ముఖ్య విషయం రాయల కొలువులో తెలుగు కాని ఇతర భాషలలో సాహిత్యం ఎలా వర్ధిల్లిందో అన్న విషయాన్ని వివరించడమే. కాని అభిప్రాయాలు ఆముక్తమాల్యదపైన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కవులు సామాన్యముగా ఆశ్వాసాంతములో ఒక గద్యం వ్రాస్తారు. ఉదాహరణకు పెద్దన ఇలా వ్రాసారు –

    ఇది శ్రీమదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీనమానసేందిందిర నందవరపురవంశోత్తంస శఠకోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము

    (ఇది శ్రీమదాంధ్రకవితాపితామహుడని బిరుదుగలవాడు, సర్వతోముఖాంకుడనే బిరుదుగలవాడు, విష్ణుమూర్తి పాదపద్మాల మకరందాన్ని గ్రోలె తుమ్మెదవలె నుండువాడు, శఠకోపయతిచే ప్రసాదించబడిన శ్రేష్ఠమైన చతుర్విధ కవిత్వములు అభ్యసించినవాడు, అల్లసాని చొక్కయమంత్రి కుమారుడు ఐన పెద్దనార్యుడు వ్రాసిన స్వారోచిషమనుసంభవము అనే మహాకావ్యములో రెండవ ఆశ్వాసము.)

    కాని ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంతములు గద్యాలు కావు, పద్యాలు. ఉదాహరణకు –

    ఇది సింహాచలదంభకేసరిపదాభీష్టార్చనాపుణ్యల-
    బ్ధదురుట్టంకణ పొట్టునూరివిజయస్తంభోపలోట్టంకితాం-
    కదృఢేష్టాక్షర కృష్ణరాయనృపసంజ్ఞాన్మత్కృతాముక్తమా-
    ల్యద నాశ్వాసవరంబు నాలవది హృద్యంబై మహిం బొల్పగున్
    – శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, 4.289

    (ఇది సింహాచలములో ఉండే మాయనరసింహస్వామి పాదాలను కొలువగా సంక్రమించిన పుణ్యఫలమువల్ల పొట్టునూరి జయస్తంభములో పేర్కొనబడిన కృష్ణరాయనృపతి వ్రాసిన ఆముక్తమాల్యద కావ్యములో నాల్గవ ఆశ్వాసము అందరికి ప్రీతిగా విరాజిల్లును.)

    సంస్కృతకవులు ఇలాగే వ్రాసేవారు. ఉదాహరణకు నేను వ్యాసములో పేర్కొన్న రుక్మిణీశవిజయమునుండి ఒక సర్గాంత పద్యము –

    రోమ్ణాం హర్షణకారిణీ శ్రవణతః పాపౌఘవిధ్వంసినీ
    ప్రేమ్ణా చింతయతాం విచిత్రవిమలశ్లాఘార్థసందాయినీ
    సంజాతే భువి రుక్మిణీశవిజయే సద్వాదిరాజోదితే
    సంజాతః సురమండలీషు మహితః సర్గో ముదాం సప్తమః

    (రోమాంచితమయ్యేటట్లు సంతోషమిచ్చేది, వినగానే పాపాలను నిర్మూలించేది, విచిత్రమైనది, నిర్మలమైనది, అర్థవంతమయినది అయి వాదిరాజయతిచే వ్రాయబడిన రుక్మిణీశవిజయ కావ్యములో ఏడవ సర్గ సురమండలముచే పొగడదగినదైనది.)

    ఆముక్తమాల్యదలో ఉపయోగించబడిన చాల సంస్కృతపదాలకు సామాన్యమైన అర్థాలు ఉండక కొద్దిగా మామూలుగా లేని అర్థాలు ఉంటాయి. రాయలే వ్రాసారో, మరెవరు వ్రాసారో కాని రచయితకు మాత్రం కొబ్బరికాయలంటే ఎంతో ఇష్టమనిపిస్తుంది 🙂

    విధేయుడు – మోహన

  10. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    07/04/2010 2:26 pm

    ఈ విషయం మీద నేను చెప్పదల్చుకున్న విషయాలు ఐపోవచ్చాయి. చివరగా అఫ్సర్ గారు అడిగిన “ఊహాపాఠకుల” విషయం కొంత స్పృశించి ముగిస్తాను. నా “అశాస్త్రీయ సర్వే” పద్ధతి ఇది – నేను సామాన్యంగా రెండేళ్లకోసారి ఇండియా వెళ్తాను; అలా వెళ్లినప్పుడు నవోదయ లో గత రెండేళ్లుగా వచ్చిన కవిత్వపుస్తకాలు అన్నీ ఒకో కాపీ కొంటాను; (వాటిలో ఏవీ వెయ్యి కాపీలకు మించి ప్రచురించబడవు); అప్పుడు వాళ్లని ప్రతిసారీ అడుగుతాను – వాటిలో ఏయేవి ఎలా అమ్ముడు పోతున్నాయని. మొదల్లో కొంత మొహమోటపడ్డారు గాని తర్వాత వాళ్లు చెప్పేది NRI లు తప్ప ఎవరూ కొనరూ అని; ఇక చాలా మంది కవులు సొంతంగా ప్రచురించుకుని తెలిసిన వాళ్లకు అంటగట్టటమో ఊరికే ఇవ్వటమో చేస్తారనేది నాకు తెలిసిన కొద్దిమంది కవులు స్వయంగా చెప్పిన విషయం. ఊరికే ఇచ్చినవి చదివేవాళ్లు చాలా కొద్దిమంది అన్నది ఏ సర్వేలూ అక్కర్లేకుండానే చెప్పొచ్చు. కొన్న ఒక్కో ప్రతినీ ఈ కాలంలో ఒకరికి మించి చదవరు అనేది నా ప్రతిపాదన. కనుక మొత్తం మీద ఓ కవితాసంకలనాన్ని వెయ్యిమందికి మించి చదవరు (మొదటి నుంచి చివరదాకా చదివేవాళ్లు ఇంకా తక్కువ). అంతేకాదు, పై సమాచారాన్నుంచి వీళ్ళు ఎలాటివాళ్లో కూడా derive చెయ్యొచ్చు – వీళ్లు నాలుగు రకాల వాళ్లు: 1) ఇతర కవులు, 2) ఆ సంకలనకర్త బంధువులు, స్నేహితులు, 3) విమర్శకులు, 4) చాలా కొద్దిమంది కవితాసక్తి వున్నవాళ్లు (వీళ్లలో చాలా ఎక్కువభాగం గుప్తకవులు). ఇకపోతే ఆ కవితలు పత్రికల్లో వచ్చివుండొచ్చు. ఆ పాఠకుల మాటేమిటి? నేను చేసుకున్న మరొక ప్రతిపాదన వాళ్లు కూడా పై నాలుగు రకాల వాళ్లేనని. ఏతావాతా తేలేదేమంటే ప్రస్తుత కవిత్వానికి “ముఖ్యమైన” పాఠకులు ఎక్కువభాగం ఇతరకవులే నని.

    వీళ్లు కాక ఇంకెవరినైనా ఒక కవి తన పాఠకులుగా భావిస్తే వాళ్ళు ఊహాపాఠకులు. ఇదీ నా definition. ఇతరులు అంగీకరించొచ్చు, రించకపోవచ్చు. అఫ్సర్ గారి శాస్త్రీయ సర్వే ఫలితాల కోసం వేచి చూస్తాను.