పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. About eemaata గురించి KLN RAO అభిప్రాయం:

    07/11/2010 10:03 pm

    తెలుగులో ఒక ఆన్ లైన్ పత్రిక చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పత్రిక ఇన్నాళ్ళూ నా కంట్లో పడకపోవడం బాధగా కూడా ఉంది. Anyhow, my first visit to this magazine satisfied my thirst of telugu reading online. Thanks for the efforts put by you. Keep it up.

  2. అ, న్యాయం గురించి KLN RAO అభిప్రాయం:

    07/11/2010 9:58 pm

    కథ బాగుంది. కాకపోతే అమెరికాలో కూడా ఇంతేనా అనిపించింది. ఇండియాలో అయితే ఇన్సూరెన్సు ఏజెంటు డబ్బులు తీసుకుని కంపెనీకి బదులు క్లెయిం చేసిన వాళ్ళకి లాభం చూపించేవాడు. మనకి మానవత్వం ఎక్కువ కదా!

  3. నీడ గురించి Chandra అభిప్రాయం:

    07/11/2010 2:49 pm

    Though this happens with almost every generation, and a known story, the narration is very good, and gripping. The author has a good command on the Rayalaseema accent that brought nativity with the story. Keep up the good work,

    Chandra.

  4. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    07/11/2010 9:31 am

    అయితే, రమా భరద్వాజ గారు మిగతా వాళ్ళని చదవకుండా తిట్టిపోస్తారన్న మాట. బాగుందండీ వరస! “ఊరి చివర” మీరు చదివిన ఆధారాలు మీ మాటల్లో లేవు.

    సరే, పెడసరం రమ గారు సెలవు పుచ్చుకున్నారు కనుక, ఇక్కడ ఇప్పుడు వేలూరి కి, కాకపోతే సాయి బ్రహ్మానందం గారికి ఒక ప్రశ్న. “ఊరి చివర”లో అఫ్సర్ గారి అమెరికా పద్యాలు వున్నాయా? వుంటే, అవి డయాస్పోరా గురించి మాట్లాడే వేలూరి గారి కంటిలో ఎందుకు పడలేదు? అఫ్సర్ గారి కవిత్వాన్ని శ్రద్ధగా చదివే బ్రహ్మానందం గారు అఫ్సర్ గారిని అమెరికా తెలుగు కవి అని అనడానికి ఆధారాలు చూపగలరా?

    నాకు రామారావు గారు చెప్పింది కొంత నిజం కావచ్చుననిపిస్తున్నది. అఫ్సర్ గారికి “అక్కడి” దృస్టి ఎక్కువ. ఆయన తెలంగాణా, దలిత, ముస్లిం కవితలు అట్లా కనిపిస్తాయి. నేను పాఠకుడిని మాత్రమే. విశ్లేషణ చెయ్యలేను. పెద్దలు వేలూరి గారు, బ్రహ్మానందం గారు, ఇంకా ఎవరయినా చెప్పాలి.

    ఈ విషయం విమర్శ వైపు నించే కాక, చాలా కాలం ఆంధ్రాలో వుండి, అమెరికా వలస వచ్చిన కవులు- స్వామి, రవి శంకర్, కన్నెగంటి చంద్ర, రవికిరణ్, మరువం ఉష, యదుభూషణ్, కల్పనా రెంటాల, కె.గీత – వంటి వారున్నారు.

    అఫ్సర్ గారు “అక్కడి” పక్షం ఎక్కువ వున్నారా? “ఇక్కడి” అనుభవాలని లోకువ చేస్తున్నారా? “ఊరి చివర” లో “ఇక్కడి” అనుభవం ఎంత?!

  5. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    07/11/2010 7:50 am

    సమకాలీన కవిత్వం మీద లోతైన విమర్శ రాక పోవటానికి కారణం కవి నామధేయులు విరుచుకు పడతారన్న భయం అన్నది వట్టి మాట. సమకాలీన వచన కవిత్వం పట్ల ఏక వాక్య అభిప్రాయాలు వెలిబుచ్చటమే తప్ప విమర్శించటానికి కావలసిన పరికరాలు ఎవరిదగ్గరా లేవు. అవి తయారు చేసుకోవటానికి మనకున్న సాంప్రదాయాల పట్ల అవగాహన ఉండడం ఎంత అవసరమో మారుతున్న సందర్భం పట్ల అవగాహన కూడా అంటే అవసరం. ఈ రెండింటినీ అనుసంధానం చేయవలసిన బాధ్యత అందరిమీదా ఉంది. ఈ మాట పాఠకులలో చాలా మందికి సాహిత్యపు పూర్వాపరాలు తెలియవు అని రమ గారు అన్న మీదట ఆ అభిప్రాయానికి కారణమేమిటి అని సంపాదకులు అడిగితే కారణం చెప్పకుండా తమకు నచ్చే రచయితల జాబితా ఇచ్చారు రమగారు. వీరంతా పూర్వాపరాలు తెలిసిన వాళ్ళని వారి అభిప్రాయం కావచ్చు. చూడబోతే ఆ జాబితాలో సాహిత్యపు పూర్వం తెలిసిన వారు చాలా మందే కనపడ్డారు కానీ పరం గురించి బలమైన అభిప్రాయాలు వెలిబుచ్చిన వారెవరూ అందులో నాకు కనపడలేదు. ఇది ఆ జాబితాలో ఉన్న వారి పట్ల అగౌరవంతో అంటున్న మాట కాదు. మనమున్న సందర్భం అటువంటిది.

    ముతక సామెతలూ, నాసి రకం అభిప్రాయాలూ, అరకొర విషయ పరిజ్ఞానంతో, సాహితీ పరురాలమురా అన్న ఆలాపనతో అసహన ప్రకటనలు గుప్పించడం తమ హక్కు అని ఎవరైనా అనుకుంటే వేపకాయంత వెర్రి లేని వారెవరులే అని ఊరుకోవచ్చును. కానీ దానికి హద్దులు ఉండాలి..

    ప్రాంతీయత అన్నది (ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమా కావచ్చును) ప్రామాణికంగా చలామణీ అవుతున్న సాంస్కృతిక నిర్మాణాలకి భావ జాలాలనీ ప్రశ్నించటానికి పుట్టుకొచ్చినది. దాన్ని ఆధారంగా చేసుకుని ఎగబాకటానికి ప్రయత్నం చేసిన నేల బారు మనుషులూ ఉన్నారు. దాన్నే ఆధారంగా చేసుకుని అద్భుతమైన సార్వజనీనతని కనుగొన్న వారూ ఉన్నారు. ఏది ఏమిటో సోదాహరణంగా చర్చించుకోవలసిన అవసరం ఉండగా – అసలు ప్రాంతీయత అన్నదే సర్వారిష్టాలకూ మూలం అన్నట్టు కొట్టి పారేస్తే – ఇదంతా ప్రామాణికంగా చలామణీ అవుతున్న (కాళోజీ మాటల్లో చెప్పాలంటే) రెండు జిల్లాల ప్రాంతీయతలోని నేలబారు తనమేననీ అనుకోక తప్పదు.

    ఇంత పొడుగ్గా రాద్దామని నేను అనుకోలేదు కానీ కృష్ణదేవరాయల మీద జరిగిన చర్చలో – ‘తురకలను’ నమ్మరాదని కృష్ణదేవరాయలు తెలుసుకున్నాడు – అన్న మాటని ప్రస్తుత సందర్భంలో ఎడిట్ చేయవలసిన అవసరం ఉన్నదన్న విషయాన్ని సంపాదకవర్గం గుర్తించక పోగా అది మరెవరి దృష్టికీ కూడా రాక పోవటంతో సమస్య చాలా తీవ్రంగానే ఉన్నదనిపించి రాయవలసి వచ్చింది.

    [సంపాదకులు గమనించినా ఎడిట్ చేయలేదు. అందుకు కారణం వేరేగా ఇక చెప్పక్కర్లేదు కదా! – సం.]

  6. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/11/2010 12:57 am

    రమా భరద్వాజ గారికి,

    పేర్లో ఏవుంది, ఇంకా పీర్లలో నైనా కాస్త నమ్మకవుంది జనాలకి. నేను బళ్ళో చదువుకుని నాకు తెలిసి, గ్నాపకవున్నది కొంచం ఇంజినీరింగ్, కొంచం కంప్యూటర్ సైన్సు. దాంట్లో కూడా నేను గొప్పవాడ్ని కాదు, మామూలు ఏవరేజోడినే. పన్నెండో క్లాసు దాకానే నా తెలుగు చదువు. అది కూడా తెలుక్లాసంటే లీలా మహల్లో ఇంగ్లీషు సినిమా లేకపోతేనే. అందుకని నేనొక సాహిత్యవేత్తనని నేను అనుకోను, కనీసం నలుగురిముందు ఫోజెయ్యను. కానీ నాకు తెలుగు క్లాసులెగ్గోట్టినా తెలుగంటే నా కిష్టవే. కావ్యాలు, ప్రభందాలు, మీకు తెలిసినంతగా సాహిత్య పూర్వపరాలు నాకు ఖచ్చితంగా తెలియవు, బహుశా మీకు తెలిసినదాంట్లో 10% కూడా తెలియవు. కానీ నాకేది ఇష్టవో, ఏది కాదో నాకు తెలుసు. నా బతుకు నాకిచ్చిన అనుభవాన్నుంచి నాకు తెలిసిన మంచేదో, చెడ్దేదో నాకు తెలుసు. తెలుగు కవితని చదివి నచ్చితే ఆనందించడానికి, నచ్చకపోతే విమర్సించడానికి, మరీ మనసులో అలజడి పుడ్తే, ఆ అలజడిని అక్షరాల్లోకి అనువదించడానికి (మీ మెప్పు కోసం కాదు), తెలుగులో పిహెచ.డి, కాకపోతే అమరకోశాలు, వాటి దుంపదెగా అవేవిటో అవన్నీ చదివిన అమ్మా నాయన్లు వుండాలని మీ ఉద్దేశంలాగుంది. వైద్య్హ శాస్త్రం తెలియకపోతే వైద్యం చెయ్యొద్దన్నట్టే, పాకశాస్త్ర పూర్వ పారాలు, దాంట్లో నైపుణ్యం లేకపోతే తిండి మానెయమన్నట్టుంది. మాకు చెప్పుకోడానికి మాకు చెప్పుకోదగిన గురువెలెవరూ లేరు తెలుగులో, కానీ మా అధ్యాయనం గురుముఖతా కాకుండా, మా అనుభవాల్లోంచి, మా బతుకుల్లోంచి, అది మీకు విచిత్రంగా అనిపించినా సరే. అందుకని మా రచనలు, మా విమర్శలు మీకు తెలిసిన, మీరు చదివిన, మీకు ప్రామాణికవనిపించే మీ పరిధి నుంచి కాకుండా మాకు అనుభవైన మా బతుకుల నుంచి వస్తాయని గమనించండి. మీ విమర్శలు మాకు నచ్చనందువలన మీ గురించి అర మాటలు మేవు మాట్లాడవు. మా అభిప్రాయాలు రచనలు, విమర్సలు మీకు నచ్చకపోయినందువలన ప్రపంచవేవీ మునిగిపోదు కానీ మీరు కూడా కనీసం మా వానా కాలపు తెలుగు చదువుల సభ్యతనన్నా చూపించండి మీ వ్రాతల్లో. వీధికి పెద్దకావడం పెద్ద పని కాదు, కానీ ఆ పెద్ద కాకపోవడవే గొప్పేవో ఒక సారి ఆలోచించండి.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  7. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    07/10/2010 5:13 pm

    వెల్చేరు నారాయణరావు గారు “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” అనే గ్రంథంలో కొత్త రకమైన కవిత్వం రావటానికి “రచనా సందర్భం” అనే అంశాన్ని ఒక మఖ్య ప్రేరకంగా గుర్తించారు. (ఈ పుస్తకాన్ని చదవమని ఈమాట పాఠకులందరికీ నిస్సంకోచంగా విన్నవిస్తున్నాను.) ఉదాహరణకు, ప్రింటింగ్ ప్రెస్ రాకతో ఓ పుస్తకాన్ని ఎవరికి వారు ఓ కాపీ కొనుక్కుని చదువుకునే అవకాశం కలిగింది; ఆంగ్లవిద్యా విధానాలతో విద్యార్ధులు తమ కుటుంబాల నుంచి దూరంగా వెళ్లి ఉండటం జరిగింది; ఈ రెండూ కలిసి ఏకాంతంగా ఎవరికి వారే చదువుకుని ఆనందించగలిగే కవిత్వానికి (భావకవిత్వం) దారి తీశాయి. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ , ఆంగ్లవిద్యాలయ వ్యాప్తి – వీటి నుంచి ఒక కొత్త రచనా సందర్భం తయారైందన్నమాట.

    ఇప్పుడూ ఒక సరికొత్త రచనా సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది Web 2.0 వల్ల కలిగింది. ఎవరికి వారు ఓ కవితని చదువుకున్నా, దాని గురించిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా వున్న పాఠకుల మధ్య జరగటమే కాదు, కవికి కూడ అవి ఎప్పటికప్పుడు అందుతున్నాయి. సాహిత్యచరిత్రలో ఇదివరకు ఎప్పుడూ ఇది సాధ్యపడలేదు. ఈ కొత్త రచనా సందర్భం తెలుగులో ఎలాటి కొత్త కవిత్వానికి దారితీస్తుంది అనేది ఇంకా స్పష్టంగా లేదు. అలాగే అందులో పాఠకుల, వారి చర్చల పాత్ర ఏమిటనేది కూడ తెలియదు. ఐతే ఈ కొత్త కవితాప్రపంచంలో పాఠకులకు ఇదివరకెప్పుడూ లేని పెద్దపాత్ర వుంటుందనిపిస్తున్నది.

    ఒక ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే – ఈ కొత్త రచనాసందర్భం, నాకు తెలిసినంతవరకు, ఆంగ్లసాహిత్యం మీద పెద్ద ప్రభావం చూపలేదు; ముఖ్యంగా అమెరికాలో ఇంటర్నెట్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటున్న కవులు చాలా తక్కువగా కనిపిస్తారు. (ఈ విషయం నాకన్నా బాగా తెలిసిన వారు ఎందరో వుంటారు. వారి నుంచి ఇంకా అధికారికమైన సమాచారం వినాలని వుంది)

    నారాయణరావు గారి సిద్ధాంతం ప్రకారం రచనా సందర్భాల మార్పుని గమనించలేని తక్కువరకం కవులు పాతకవిత్వమే రాస్తారు. నిశితదృష్టి వున్న కవులు ఈ మార్పుకి అనుకూలమైన కొత్తరకం కవిత్వం సృష్టిస్తారు.

    ఇలా ఒక విప్లవాత్మక సమయంలో పాఠకులం కావటమే కాదు, నారాయణరావు గారి కవితావిప్లవకారకాల సిద్ధాంతం భవిష్యత్తుని ఎంతగా predict చేస్తుందో చూసే ఒక ఆసక్తికరమైన కాలంలో వున్నాం మనం.

    ఈ సంధికాలంలో రకరకాల ప్రయోగాలు తప్పవు. వాటిలో చాలాభాగం విఫలం కావటమూ తప్పదు. ఇప్పుడు ఈమాట లోనూ, ఇతర వెబ్ పత్రికలలోనూ జరుగుతున్నవి ఇలాటి ప్రయోగాలే. నా ఉద్దేశ్యం – వీటిలో ఫలానావి మంచివీ ఫలానావి కావు అని చెప్పగలిగే స్థితి ఇంకా రాలేదు గనుక, తొందరపడి పాఠకులు కాని సంపాదకులు గాని వేటినీ ఆపటం, అడ్డుపెట్టటం మంచిది కాదేమో (వ్యక్తిగత దూషణలు మరీ శృతి మించుతుంటే తప్ప).

  8. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/10/2010 4:38 pm

    మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.

    నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..

    సెలవు,
    భవదీయ..
    రమ.

  9. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి bollojubaba అభిప్రాయం:

    07/10/2010 12:52 pm

    నేను ఉష గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

    కవి పట్ల కృతి పట్ల గౌరవం క్షమ లేని పాఠకులు కూడా పాఠకులేనా అనిపిస్తుంది.

    చాన్నాళ్లుగా చూస్తున్నాను – అంతర్జాలంలో అఫ్సర్ గారి పట్ల కొంతమంది వెలిబుచ్చుతున్న అక్కసుకు కారణం? నాకు తెలిసి అఫ్సర్ గారు ఏనాడూ లోనిప్పును ఆర్పేసుకోలేదు. ఉప్పు సముద్రంలో మునిగిపోలేదు తేలుతూనే ఉన్నారు ఈదుతూనే ఉన్నారు. అందుకేనా ?

    ఎంతటి బాల్యమిత్రులైనా సభలో మీరు మీరు అని సంబోధించుకొంటారు. అది సభామర్యాద. అనానిమస్ గా ఉండొచ్చు కదాని (కొంతమంది) ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం సభామర్యాదా?

    బొల్లోజు బాబా

    [Post briefly edited – Eds.]

    [రచనపై జరగ వలసిన చర్చలు వ్యక్తిగత దూషణకి దిగజారడం విచారకరం. గతంలో ఒకసారి ఇదే విధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈమాట సంపాదకులు వ్యాఖ్యాతలని సున్నితంగా హెచ్చరించారు కూడా. మళ్ళీ అదే పరిస్థితి తిరిగి ప్రత్యక్షమైంది కాబట్టి, ఒక్కసారి అందరూ పాఠకులకి సూచనలు మరొక్క సారి చదవడం ఔచిత్యంగా ఉంటుంది. అప్పుడూ ఇప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తడంలో పాత్రధారులెవరైనా, సహృదయులైన ఈమాట పాఠకులకి ఒక విన్నపం. వైయక్తిక స్పర్థలతోనో, సహజ గుణాభిజాత్యాలతోనో, మరే కారణం వలనో, ఎవరైనా ఏదైనా రచన మీద అసభ్యంగా మాట్లాడినా, అలా అనిపించినా, అలా ఏ అభిప్రాయమైనా మిమ్మల్ని నొప్పించినా, వెంటనే సంపాదకులకు తెలియజేయండి. తగిన చర్యలు వెంటనే తీసుకుంటాము. నేరుగా ఇతర పాఠకులతో వాగ్యుద్ధానికి దిగడం వల్ల అనర్థం తప్ప ఏమీ ఉండదు. ఏ ఒకరో, ఇద్దరో దురుసుగా మాట్లడినంతలో ఈమాటలో రచయితలకు సద్విమర్శ, ఆదరణ లేవు అనే ఏకాభిప్రాయానికి రావడం కూడా సమంజసం కాదు. ఏ అభిప్రాయం ఎంత వరకూ సభ్యమైనది, వెలిబుచ్చిన భావం, భాషా తీవ్రత సబబేనా, ఈ అభిప్రాయం చర్చకు ఎంత దోహదం చేస్తూంది, ప్రచురించాలా వద్దా? అని ప్రతీ సారీ మేము తర్జన భర్జనలు పడుతూ తీసుకునే సాపేక్షిక నిర్ణయాలలో అప్పుడప్పుడూ పొరపాట్లు జరగవచ్చు. జరిగినై కూడా. తప్పులు దిద్దుకుంటూ ఈమాట సుహృద్భావ వాతావరణం చెడకుండా మేం చేస్తూనే ఉండే ప్రయత్నాలకి మీ తోడ్పాటు అవసరం అని వేరే చెప్పక్కర్లేదు. దయచేసి సహకరించండి. – సంపాదకులు]

  10. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/10/2010 12:00 am

    ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవు. తెలిసిన పాఠకులకి నా వ్యాఖ్యలు ఏవీ పెడసరంగా విన్పించవు. నేను అభ్యంతరకతరమైన లేదా అమర్యాదాపూరితమైన వాక్యాలు ఏమీ రాయలేమోదు. అందువలన కృష్ణ ఈమాటకోసం ఆ పత్రిక సంపాదకుల కోసం.. ఇంకా అఫ్సర్ వంటి కవుల కోసం బాధ పడితే నేను చేయగలది ఏమీ లేదు. అననుకూల అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడే వాళ్లకోసం నేను అభిప్రాయాలు రాయడం లేదు. అది పత్రికని చదివే మిగతా పాఠకుల సమస్య కాదు. నేను నా అభిప్రాయాలని చెప్పకూడదని ఈమాట సంపాదకులెవ్వరూ అనలేదు. వారు వద్దని అన్న రోజున నేను అలాగే అభిప్రాయాలు చెప్పడం మానేయగలను. నాకొచ్చిన ఇబ్బది ఏమీ లేదు.

    వేలూరి వెంకటేశ్వరరావు గారు నా అభిప్రాయాలని చదివి ఆలోచించే విజ్నత ఉన్నవారే గానీ నా వ్యాఖ్యలకే బాధపడిపోయేటంత సున్నిత మనస్కులు కారు గనక నా అభిప్రాయాలని పక్కకు పెట్టి ఈ పాఠకులు వారి వారి అభిప్రాయాల ప్రకారం పత్రికని చదువుకోవచ్చును కదా?? నా గురించి వారికి ఈ చింతేల??

    నేను ” భజన చేసే విధము తెలియండి” వంటి తోవలో నడిచిన దాన్ని గాను. నడవను. ఎక్కడైనా alternative voice ని ఆహ్వానించేవారుండాలి. వ్యతిరేకించే వారుండరు. అప్పుడు అందులో “ప్రజాస్వామ్యం” లోపించిందని అర్ధం. ఈమాట ప్రహజాస్వామ్య విలువలకి కట్టుబడిన పత్రిక అని నేను ఈ అతి సున్నిత పాఠక వర్గానికి గుర్తు చేయనవసరం లేదనుకుంటాను. ఇకపోతే నేను ఎక్కడ కన్పించినా మానినా “ఇక్కడ” కన్పిస్తున్నాను కదా?? చాలదా?? నా గురించి మరిచిపోండి. నా అభిప్రాయాలలోని విషయాన్ని గురించి ఆలోచించండి. అది ఎక్కువ మంచిదీ మీకూ..మీరు అభిమానించే పత్రికకీ కూడా!!

    రమ.

    [Post briefly edited – Eds.

    ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవనే ఈ అభిప్రాయానికి కారణాలు తెలుసుకోవాలని మాకూ కోరికగా ఉంది. కానీ పెద్దలు చెప్పినట్లు “de gustibus non est disputandum”. ]