హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?

కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టిః।
అర్వాగ్ దేవా అస్య విసర్జనేనాఽథా కో వేద యత ఆబభూవ॥

– (నాసదీయ సూక్తం ఋగ్వేదం 10-129-06)

ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో ఎవరు చెప్పగలరు? దేవతలు కూడా సృష్టి మొదలయ్యాకే వచ్చిన వారు కదా, మరి ఈ సృష్టి ఎలా మొదలయ్యిందో ఆ ఎరుకగల వారెవ్వరు?

ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న।
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ త్సో అంగ వేద యది వా న వేద॥

– (నాసదీయ సూక్తం ఋగ్వేదం 10-129-07)

ఈ సృష్టి ఆ కర్త సంకల్పమే, అవునో, కాదో? అత్యున్నత ఆకాశంలో ఉండి అధివీక్షించే దేవదేవునకు తెలుసునా? ఆయనకు కూడా తెలుసునో తెలియదో!


ఈమధ్య దాకా మా అబ్బాయిలిద్దరూ రాత్రి పూట పడుకునే ముందు కథలు చెప్పమని అడిగేవారు. వంతులవారిగా నేను, మా ఆవిడ కథలు చెప్పేవాళ్ళం. నా వంతు వచ్చినప్పుడు భారత, భాగవత, రామాయణ కథలనే నాకు తోచిన విధంగా చెప్పేవాడిని. మూడు కన్నుల శివుడు హిమాలయాల్లో ఉంటాడని, పాల సముద్రంలో విష్ణువు పాముపై పడుకుంటే, ఆయన నాభి నుండి ఉద్భవించిన కమలంలో ఉండి బ్రహ్మ మనల్నందరినీ సృష్టిస్తాడని అల్లిబిల్లి కథలుగా అల్లి చెబుతుంటే మాపిల్లలు ఊఁ కొడుతూ నిద్రపోయేవారు.

ఏ ప్రాచీన నాగరికతకైనా ఈ రకమైన కథలు, కథనాలు ఉంటాయి. శక్తివంతమైన పౌరాణిక గాథలు (mythology) ఏ జాతికైనా వారి వారసత్వ సంపద. నిజానికి నా దృష్టిలో ‘హిందువు అంటే ఎవరు?’ అన్న ప్రశ్నకు భారత, భాగవత, రామాయణ కథలను తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న వారంతా హిందువులే. అయితే, ఈ ఇతిహాస, పురాణ కథల ఆధారంగా మన ప్రాచీన చరిత్రను నిర్మించుకోగలమా? అంతేకాక, ఇతర ఆధారాల ద్వారా మనకు తెలిసిన చరిత్రను ఉపయోగించి ఈ కథల్లో నిజానిజాలను, అంతరార్థాలను నిర్ధారించగలమా? ఈ విషయంపై గత 50 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక శాస్త్రవేత్త చెప్పిన అభిప్రాయాలను ఉటంకించడం ఇక్కడ అసమంజసం కాదనుకుంటాను:

“We have to be careful how we use history and myth to understand one another. In this context I would define a myth as a story that a group of people believe for a long time despite massive evidence that it is not actually true; the spirit of myth is the spirit of Oz: Pay no attention to the man behind the curtain. […] we need to use history to understand myth—that is, we need to understand why such a text was composed and retold many times […] But we cannot use the myth to reconstruct the actual history behind the text; we cannot say that the text is evidence. […] Such myths reveal to us the history of sentiments rather than events; motivations rather than movements.” (W. D. p. 23).

పై మాటలు రాసిన పరిశోధకురాలు మరెవరో కాదు, ప్రస్తుతం వివాదాస్పదమైన అమెరికన్‌ రచయిత్రి వెండీ డానిగర్‌ (Wendy Doniger). ఈ కొటేషన్ పెంగ్విన్-ఇండియా ఉపసంహరించుకున్న The Hindus: An alternative history పుస్తకంలో 23వ పేజీలో నుండి తీసుకున్నదే.

ఈ పుస్తకాన్ని నేను నాలుగేళ్ల క్రితమే చదివాను. అయితే, హిందూమత చరిత్రను కూలంకషంగా చర్చించిన ఈ పుస్తకంలో కొన్ని విషయాల్లో డానిగర్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించలే(దు)ను. అలాగే, కొన్నిచోట్ల ఆవిడ విశ్లేషించిన తీరుపై నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆవిడ ఇచ్చిన సమాచారంలో కొండొకచో చిన్న చిన్న పొరపాట్లు కూడా కనిపించాయి. హిందూమతానికి ముఖ్యమైన అంశాలు కొన్నింటిని ఆవిడ స్పృశించకుండా వదిలేయడం వల్ల ఈ పుస్తకంలో కొన్ని చర్చలు అసమగ్రమనిపించాయి.

అయితే, నాకు ఈ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది. ప్రతి అంశంపై ఇప్పటిదాకా మనకు తెలిసిన సమాచారం అసమగ్రమేనని ఇంకా ఎన్నో పరిశోధనలకు ఆస్కారం ఉందని అడుగడుగునా చెప్పుకునే సత్య శోధనా తత్పరతే కనిపించింది. విదేశీ వనితగా తాను చేసే విశ్లేషణల్లో తనకు తెలియకుండానే ‘పాశ్చాత్య పక్షపాతం’ (western bias) చొరబడే ప్రమాదం ఉందని ఒప్పుకునే నిజాయితీ కనబడింది.

అందుకే, ఈ పుస్తకాన్ని నిషేధించాలని దీనానాథ్ బాత్రా అనబడే వ్యక్తి ‘శిక్షా బచావో ఆందోళన్‌’ అనే సంస్థ ద్వారా కోర్టుకు వెళ్లాడని విని ఆశ్చర్యపోయాను. అంతే కాక, భారతదేశంలో ఈ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్‌-ఇండియా వారు నాలుగేళ్ళ కోర్టు పోరాటం తరువాత ఆ సంస్థతో కోర్టు వెలుపల సంధి చేసుకొని ఈ పుస్తకాన్ని మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకోవాలని, మిగిలిన ప్రతులను తగులబెట్టాలని నిర్ణయించిందని విని మరింత విస్తుపోయాను.

ఎవరీ వెండీ డానిగర్?

వెండీ డానిగర్ (Wendy Doniger) అమెరికాలో భారతీయ శాస్త్రాన్ని గత 50యేళ్లుగా అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్. ఈమె న్యూయార్క్ నగరంలో యూదుల కుటుంబాన 1940లో జన్మించింది. ఆ రోజుల్లో ఈవిడ తండ్రి లెస్టర్ డానిగర్ ఒక ప్రచురణ సంస్థను నడిపేవాడు. వెండీ డానిగర్ ‘సంస్కృతము, భారతీయ విద్య’ అన్న అంశాలపై రాడ్‌క్లిఫ్ కాలేజీలో బి. ఏ. చేసి, అదే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ నుండి 1963లో ఏం.ఏ.; ఆపై 1963-64లలో ఇండియాలో గడపి, 1968లో హార్వర్డ్ నుండే ‘Asceticism and Sexuality in the Mythology of Siva’ అన్న అంశంపై పిఎచ్. డి.; తరువాత నాలుగేళ్ళు ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో, The Origins of Heresy in Hindu Mythology అన్న అంశంపై పనిచేసి 1973లో డి. ఫిల్. పట్టాలు పుచ్చుకున్నారు.

ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ విభాగంలో, విశిష్టాధ్యాపకురాలిగా పనిచేస్తున్న వెండీ డానిగర్ హిందూ మతంపై ఎన్నో పుస్తకాలు, అనువాదాలు రాశారు. 1975లో సంస్కృతంలోని శివపురాణపు కథలకు అనువాదాన్ని, 1981లో ఋగ్వేదంలో 108 సూక్తాలకు, 1991లో మనుధర్మశాస్త్రానికి, 2002లో వాత్సాయన కామసూత్రానికి, 2006లో హర్షుని ప్రియదర్శిక, రత్నావళి కావ్యాలకు — అనువాదాలు ప్రచురించారు. మొదట్లో ఫ్రాయిడ్ సిద్ధాంతాలను ఆధారం చేసుకొని హిందూమతాన్ని, పురాణాలను విశ్లేషణ చేసిన ఈమె, ఆపై హిందూ పౌరాణిక గాథలపై మత, తత్త్వ, తాంత్రిక విషయాలను విస్తృతంగా చర్చిస్తూ 16 పుస్తకాలు వెలువరించారు. వీటిలో ప్రముఖమైనవి:

  • The Implied Spider: Politics and Theology in Myth. The 1996–1997 ACLS/AAR Lectures. New York: Columbia University Press, 1998,
  • Splitting the Difference: Gender and Myth in Ancient Greece and India. The 1996 Jordan Lectures. Chicago and London: University of London Press and University of Chicago Press, 1999.
  • The Bedtrick: Tales of Sex and Masquerade. Chicago: University of Chicago Press, 2000.
  • La Trappola della Giumenta. Trans. Vincenzo Vergiani. Milan: Adelphi Edizione, 2003.
  • The Woman Who Pretended to Be Who She Was. New York: Oxford University Press, 2005.
  • The Hindus: An Alternative History. New York: Penguin Press, 2009.
  • On Hinduism, Oxford University Press, 2013.

ఇవేకాక, ఎన్నో పుస్తకాలకు పరిష్కర్తగా పనిచేసిన డానిగర్, ప్రతిష్ఠాత్మకమైన జర్నళ్ళలో వందలకొద్ది పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. ప్రస్తుతం ఆవిడ సంపాదకురాలిగా, ఒక రచయితగా Norton anthology of primary Hindu writings అన్న పుస్తకంపై పని చేస్తున్నారు. నవంబర్ 2014లో మార్కెట్లో లభ్యమయ్యే ఈ పుస్తకంపై మరింత దుమారం చెలరేగే అవకాశం ఉంది.

దీనానాథ్‌ బాత్రా ఎవరు?

హిందీ, ఇంగ్లీష్ టీచరుగా, ఆపై ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీవిరమణ తీసుకున్న దీనానాథ్‌ బాత్రా, భారతీయ విద్యా బోధనలో దుష్ట పాశ్చాత్య ప్రభావాన్ని ఎదురుకోవడానికి ‘శిక్షా బచావో ఆందోళన్‌’ పేరిట ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పాకిస్తానులో భాగమైన పంజాబ్ ప్రాంతంలో జన్మించిన ఈయన, స్వాతంత్ర్యం తరువాత కుటుంబంతో సహా భారతదేశానికి తరలివచ్చారు. ఇప్పటికీ ఆయన పాకిస్తాన్ లోని చిన్ననాటి ఊరు, బడి, దేవాలయము గుర్తు చేసుకుంటూ ఉంటారు.

‘వసుధైక కుటుంబకమ్’, ‘ఏకం సత్ విప్రా బహుదా వదంతి,’ వంటి ఘనమైన సందేశాలను ప్రపంచానికి అందజేసిన హిందూమతానికి ప్రపంచంలో సరైన గుర్తింపు రాకపోవడానికి పాశ్చాత్య పండితులే కారణం అని ప్రబలంగా నమ్మే బాత్రా గత 10 సంవత్సరాలలో ఎంతోమంది రచయితలను, పుస్తక ప్రచురణ సంస్థలను కోర్టుకు తీసుకెళ్ళారు.

అంతకు ముందు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుపుతున్న రోజుల్లో మానవ వనరుల శాఖ మంత్రి అయిన మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో నడిచే ‘విద్యాభారతి అఖిల భారతీయ విద్యా సంస్థాన్’ అనే సంస్థకు బాత్రా జనరల్ సెక్రటరిగా పనిచేశారు. ఆ రోజుల్లో, ఆ సంస్థ ద్వారా కేంద్రీయ విద్యాలయాలకు పుస్తకాలు అందజేసే NCERT పాఠ్యాంశాలలో 100కు పైగా వివాదాస్పదమైన మార్పులను బాత్రా ప్రవేశపెట్టారు.

2008లో రామానుజన్ రాసిన ‘మూడు వందల రామాయణాలు‘ వ్యాసాన్ని డిల్లీ యూనివర్సిటీ హిస్టరీ సిలబస్ నుండి తొలగించడానికి హైకోర్టును ఆశ్రయించిన వారిలో బాత్రా ప్రముఖుడు. కోర్టు నియోగించిన కమిటీ రామానుజన్ వ్యాసం సిలబస్‌లో ఉండాల్సిందేనని తీర్పు చెప్పింది. ఆ రోజుల్లో డిల్లీ యూనివర్సిటీలో హింసాకాండ, అల్లర్లు చెలరేగడమే కాకుండా, అక్కడి ప్రొఫెసర్లకు బెదిరింపు ఉత్తరాలు, ఫోన్‌కాల్స్ వచ్చేవి (ప్రొఫెసర్ ఉపేందర్ సింగ్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం.) యూనివర్సిటీ వారు 2011లో ఆ వ్యాసాన్ని తొలగించడానికే నిర్ణయించుకున్నారు.

అంతేకాక, ది హిందూ పబ్లిషర్ అయిన ఎన్. రామ్ ఫ్రంట్‌లైన్ పత్రికలో ‘శాఫ్రాన్ టెర్రర్‘ అన్న శీర్షికతో వ్యాసాన్ని ప్రచురించినందుకు బాత్రా ఆయనకు లీగల్ నోటిసులను పంపించారు. కేంద్రీయ పుస్తకాలలో 75 పంక్తులు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని NCERTకి వ్యతిరేకంగా 10 వేర్వేరు కోర్టు కేసులు కూడా వేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న వెండీ డానిగర్ పుస్తకాన్ని నిషేధించాలని గత నాలుగేళ్లుగా కోర్టులో పోరాటం చేసిన బాత్రా, పెంగ్విన్ నిర్ణయం సంతృప్తి నిచ్చిందని ఇకపై డానిగర్ రాసిన On Hinduism వంటి ఇతర పుస్తకాలపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు. 84యేళ్ళ వయస్సులో కూడా అలుపెరుగక పనిచేసే ఈయన, రాజకీయాల్లో రాబోయే మార్పుల దృష్ట్యా భారతదేశానికి, భారతీయతకు మంచి రోజులు రాబోతున్నాయని ఉత్సాహంగా చెబుతున్నారు.