త్యాగరాజు బాల్యం
చిన్నప్పట్నుండీ త్యాగరాజుకి సంగీతం అంటే ఇష్టం. వీణ కాళ హస్తయ్య దగ్గర వీణా, తల్లి దగ్గరా గాత్రమూ అభ్యసించాడు. అతి పిన్న వయసులోనే సంగీతంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. తల్లి పాలు తాగేటప్పుడే సంగీతం వినిపిస్తే చాలు, తాగడం ఆపేసి, ఎంతో శ్రద్ధగా చెవులిక్కించి వినేవాడన్న ఈ విషయాన్ని, త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరూ (దాదాపు) మరింత అతిశయోక్తిగా చెప్పారు. సంగీత శబ్ద జ్ఞానానికి నెలలు పిల్లాడిగా ఉన్నప్పుడే అతివేగంగా స్పందించేవాడని చెప్పారు. ఇలాంటి విషయాలు తల్లి తండ్రులూ, బంధువుల ద్వారానే ఇతరులకి తెలిసే అవకాశం ఎక్కువ. త్యాగరాజు అసమాన్య ప్రతిభ చూసి అందరూ పొగుడుతుంటే తల్లితండ్రులే చెప్పుండచ్చు. ఇలాంటి విషయాలికెవరూ ఆధారం చూపలేరు. కాబట్టి అవుననుకొని ఒప్పుకోడానికి ఎవరికీ అభ్యంతరముండదు. ఈ విషయాన్ని కృష్ణ స్వామి భాగవతార్ రాసారు కానీ, ఆయన తండ్రి వెంకటరమణ భాగవతార్ ఎక్కడా ప్రస్తావించలేదు. తండ్రీకొడుకులిద్దరూ త్యాగరాజుతో గడిపారు కనుక ఇద్దరు రాసిందీ వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇలాంటిదే ఇంకో విశేషం కూడా ఉంది. త్యాగరాజు చిన్నతనంలో ఒకసారి విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాడట. ఓ సాధు పుంగవుడొచ్చి ఆశీర్వదించాక ఆరోగ్యం కుదట పడిందని రాసారు. ఆ తరువాత తన ముగ్గురు పిల్లల్నీ తీసుకొని రామబ్రహ్మం కాశీయాత్రకి బయల్దేరినప్పుడు, తిరువారూరు త్యాగరాజ స్వామి కలలో కనిపించి, కావేరీ నదీతీరానున్న పంచనదీ స్థలవిశేషమైన తిరువైయ్యార్లో శేష జీవితం గడపమని చెప్పాడట. ఈ సంఘటన తరువాతే రామబ్రహం తుల్జాజీ మహారాజుకి తన కలగురించి వివరిస్తే, ఆయన దయతో ఆరెకరాల పొలమూ, ఓ ఇల్లూ ఇచ్చాడని ఉంది. ఈ సంఘటన తిరువారూర్లో ఉండగా జరిగింది. కాబట్టి త్యాగరాజు తిరువైయ్యార్ వచ్చాక అంతా సవ్యంగానే సాగిందని చెప్పుకోవాలి. ఇది వెంకట రమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధంలో ఉంది. కృష్ణ స్వామి భాగవతార్ కూడా ఇలాగే రాసారు.
ఇంతకు ముందు చెప్పినట్లుగా రామబ్రహ్మం తిరువైయ్యార్ మకాం మార్చాక త్యాగరాజు అక్కడున్న సంస్కృత పాఠశాలో విద్యాభ్యాసం చేసాడు. మామూలుగా తోటి పిల్లలతో ఆట పాటల్లో అంతగా గడిపేవాడు కాదు. పేరుకు తగ్గట్లుగా తన దగ్గరున్నవన్నీ స్నేహితులకిచ్చేసేవాడు. త్యాగరాజు చిన్నతనంలోనే అంటే ఎనిమిదో ఏటే ఉపనయనం చేసాడు రామబ్రహ్మం. అప్పుడే రామ తారక మంత్రాన్ని జపించమని త్యాగరాజుకి మంత్రోపదేశం చేశాడని వెంకటరమణ భాగవతార్ రాసాడు. ఆ సమయంలోనే రామబ్రహ్మానికి రామనవమి ఆరాధనోత్సవాల్లో సహకరించడానికొచ్చిన శ్రీ రామకృష్ణానంద స్వామి “నమో నమో రాఘవాయ” అనే మంత్రాన్ని త్యాగరాజుకి ఉపదేశించారనీ రాసారు. దాదాపు ఇలాగే రాసినా, కృష్ణ స్వామి భాగవతారు రాసినదాంట్లో, శ్రీ రామకృష్ణానంద స్వామి ప్రస్తావనెక్కడా లేదు. సరిగ్గా అప్పుడే రామబ్రహ్మం తమ కుటుంబారాధ్య దైవమైన శ్రీరాముణ్ణి నిత్యమూ పూజించే బాధ్యత త్యాగరాజుకి అప్పగించాడు.
తిరువైయ్యారులో కానీ, తిరువారూరులో కానీ, ఆ చుట్టు పక్కల ఎక్కడా ఒక్క రామాలయం లేదు. ఉన్నవన్నీ శివాలయాలే. పేరుకి తగ్గట్టు రామబ్రహ్మం రామ భక్తుడు. అదే రామభక్తిని త్యాగరాజుకీ వారసత్వంగా అందించాడు. ప్రతీయేటా తప్పని సరిగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపేవాడు రామబ్రహ్మం. ఈ రామనవమి ఉత్సవాలు అన్నది భద్రాచల రామనవమి ఉత్స్తవాల స్ఫూర్తి తోనే అప్పట్లో తెలుగునాట జరిపేవారు. ముఖ్యంగా తంజావూరు చుట్టుపక్కల ఈ రామనవమి ఉత్సవాలు అప్పట్లో జరిగేవి కావు. త్యాగరాజూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేవాడు. ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రాయడానికి ఇవే కారణం కావచ్చు.
తండ్రప్పగించిన రామ పూజని త్యాగరాజు నిత్యమూ ఎంతో శ్రద్ధతో చేసేవాడు. తను కాలం చేసే వరకూ త్యాగరాజు ఈ రామ విగ్రహానికి నిత్యారాధన జరిపేడు. (ఈ విగ్రహం మధ్యలో ఒకసారి పోయి దొరికింది. ఆ విషయం ముందు ముందు వస్తుంది.)
సీతారాముల విగ్రహం
ఈ విగ్రహం కూడా తంజావూరు మ్యూజియంలో ఉంది. ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దీనికీ భధ్రాచల రామ విగ్రహానికీ చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి.
భధ్రాచల రామ విగ్రహానికొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే – సీతమ్మ వారు రాముడి తొడపైన కూర్చొనుంటుంది. ఇదొక్క భద్రాచల విగ్రహంలోనే కనిపిస్తుంది. మిగతా దేవాలయాల్లో రాముడి పక్కనే సీతమ్మ వారు ఉంటుంది. రామబ్రహ్మం పూర్వీకుల ఆరాధ్య దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా విశ్వాసం. రామ బ్రహ్మం పూర్వీకులు కర్నూలుండి తంజావూరు వలస వెళ్ళారని తెలుసు. భద్రాచల రామదాసు జీవిత కాలం 1620 – 1680 మధ్యన. ఆ తరువాతే విజయ నగర సామ్రాజ్య పతనమూ, కొంతకాలానికి తంజావూరు గద్దెపై మరాఠీ రాజుల పాలనా మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే తెలుగుసీమ నుండి తంజావూరికి వలసలు మొదలయ్యాయి. అంతేకాకుండా త్యాగరాజు తల్లి దగ్గర రామ దాసు కీర్తనలన్నీ చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే త్యాగరాజు కుటుంబ దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా నమ్మకం.
సంగీతంలో త్యాగరాజు అపార ప్రావీణ్యం చూసి రామబ్రహ్మం సంగీతంలో సులువులూ, మెలకువులూ తెలుసుకోమని శొంఠి వెంకట రమణయ్య అనే గురువు దగ్గరకి శిష్యుడిగా పంపించాడు. ఈ శొంఠి వెంకటరమణయ్య తుల్జాజీ మహారాజు కొలువులో ప్రధాన ఆస్థాన సంగీత విద్వాంసుడు. రామ బ్రహ్మమూ తుల్జాజీ కొలువులోనే ఉండడం వల్ల వెంకటరమణయ్య త్యాగరాజుని శిష్యుడిగా స్వీకరించడం సులువయ్యింది. కొంతకాలం ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు త్యాగరాజు. వి.రాఘవన్ అనే సంగీత శాస్త్ర కారుడి వద్ద 1800 కాలంలో సంగీతం సంబంధించి సంస్కృతంలో రాసిన కొన్ని ప్రతులుండేవి. అందులో ఈ శొంఠి సుబ్బయ్య కొడుకు వెంకటరమణయ్య అనే ఆయన వివిధ రకాల తాళ ప్రక్రియల్లో ప్రసిద్ధుడని ఉందనీ రాసారు. త్యాగరాజు గురువైన ఈ శొంఠి వెంకటరమణయ్య 1803 నుండి 1817 వరకూ మద్రాసు (చెన్నై) లో ఉండి ఉండవచ్చనీ రాఘవన్ అభిప్రాయపడ్డారు. త్యాగరాజు ఈయన వద్ద ఎంతో కాలం సంగీతం నేర్చుకోలేదు. “ప్రావీణ్యం సంపాదించడానికందరికీ కొన్ని సంవత్సరాలు పట్టే సంగీతాన్ని, త్యాగరాజు ఒక్క ఏడాదిలోపునే గ్రహించేసాడని ఆయన చరిత్ర రాసిన అనేకమంది చెప్పారు.
కొన్ని నెలల తరువాత త్యాగరాజు తల్లి వైపు తాత, వీణ కాళహస్తయ్య, చని పోయారు. అప్పుడు ఆయన దగ్గర “నారదీయం” అనే పేరుతో అనేక తాళ పత్ర గ్రంధాలు త్యాగరాజుకి లభించాయి. అవన్నీ క్షుణ్ణంగా చదివాడు. కానీ చాలా విషయాలు అవగతం కాలేదు. సరిగ్గా అప్పుడే అనుకోకుండా రామకృష్ణానంద స్వామిని కలవడం జరిగింది. త్యాగరాజు “నారదీయం” గ్రంధం గురించి చెప్పాడు. చాలా విషయాలు బోధ పడలేదనీ చెప్పాడు. అప్పుడా రామకృష్ణానంద స్వామి నారదోపాసన మంత్రం ఉపదేశించి, త్యాగరాజుని నారద మంత్ర జపం చేయమన్నాడు. త్యాగరాజు కొన్ని 96 కోట్ల సార్లు జపం చేసాడని వెంకట రమణ భాగవతారు రాసారు.
సరిగ్గా ఇక్కడే హరికథా భాగవతార్ల భక్తితో కూడిన ఊహజనిత మైన అల్లిక కనిపిస్తుంది. కొన్ని కోట్ల జపానంతరం నారదుడు త్యాగరాజుకి ప్రత్యక్ష మయ్యాడనీ, నారదుడు ప్రసన్నుడై “స్వరార్ణవం” అనే మరో సంగీత శాస్త్ర గ్రంధం కానుకగా ఇచ్చాడనీ రాసారు.
నారద సాక్షాత్కారం అయ్యాక, నారదుడి పై గురు భావంతో త్యాగరాజు “వరనారద” మరియు “శ్రీ నారద” అనే రెండు కృతులు స్వర పరిచాడనీ రాసారు.
ఇదే విషయం కృష్ణ బాగవతార్ వేరే రకంగా రాసారు. ఆయన నారదుడూ, ప్రత్యక్ష మవ్వడం ఇవేం రాయలేదు. కానీ త్యాగరాజు తల్లి తాతగారు గిరిరాజకవి చనిపోయినప్పుడు ఇంట్లో ఆయన వస్తువులన్నీ సర్దుతుండగా “సంగీత రత్నాకరం” అనే గ్రంధమూ, ఇంకా సంగీతానికి సంబంధించినవనేకం దొరికాయనీ రాసారు. ఈ సంగీత రత్నాకరం” మాతృభూతేశ్వర అనే ఆయన తల్లి తాతగారు గిరిరాజ కవికిచ్చినట్లుగా రాసారు. బహుశా ఈ మాతృభూతేశ్వరుడు 18వ శతాబ్దంలో తిరుచిరాపల్లి లో ఉన్న ఓ ప్రముఖ సంగీత విద్వాంసుడు కావచ్చని పి.సాంబమూర్తి గారు రాసారు. అదలా ఉంచితే, ఈ గిరిరాజ కవి త్యాగరాజు తల్లి తాతగారు. అంటే త్యాగరాజుకి ముత్తాత. ఈ కొత్త బంధుత్వం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాదు. తండ్రివైపు తాత గిరిరాజ కవి అని తెలుసు. మరి ఈ ముత్తాత గారి పేరు కూడా గిరిరాజ కవేనా అన్నది రూఢిగా చెప్పడానికెక్కడా ఆధారాలు లేవు. ఈ రెండు విషయాలూ చదువర్లని అయోమయంలో పడేస్తాయనడానికి మాత్రం సందేహించనవసరం లేదు.
ఈ సంగీత రత్నాకరంలో 72 మేళ కర్త రాగాల గురించీ, వివిధరకాలైన తాళాల గురించీ, 22 శ్రుతులూ, వాటిననుసరించే అను శ్రుతుల ప్రాధాన్యత గురించీ, 10 రకాలైన గమకాల వివరాలూ, ఔడవ రాగాల ప్రశస్తీ, ఇలా ఎన్నో విషయాలున్న గ్రంధమది. వి.రాఘవన్ అనే ఆయన “స్వరార్ణవం” అనే గ్రంధాన్ని మిగతా సంగీత గ్రంధాలతో (The Music Academy Journal) కలిపి పొందుపరచనట్లుగా ఉంది.
నారద మంత్రమే కాకుండా రామ తారక మంత్రాన్నీ కూడా కొన్ని కోట్ల సార్లు జపించాడాని రాసారు. ఎన్ని సార్లు జపించినా రాముడు ప్రత్యక్షం కాలేదు. ఎన్నో సార్లు కనిపించీ కనిపించనట్లుగా త్యాగరాజుకి భ్రమ కలిగేది. అప్పుడే “ఏల నీ దయా రాదూ” అనే కృతిని రచించాడనీ చెబుతారు.
త్యాగరాజు రచించిన కృతులని ఏ సందర్భంలో పాడాడూ, ఎప్పుడు రాసాడూ అన్న దానికి సరైన ఆధారాలు లేవు. ఏ ప్రతిలోనూ తేదీ కానీ, సంవత్సరం కానీ లేవు. అందువల్ల ప్రజలకు లభ్యమైన కృతుల సాహిత్యం బట్టీ, త్యాగరాజు జీవితంలో జరిగినట్లనిపించిన సంఘటనలకి ముడివేయడం ప్రారంభించారు. ఏ కృతి చూసినా ఫలానా సందర్భంలో చెప్పి ఉండచ్చు అనే ఊహాగానంతోనే చెప్పారనుకోవాలి తప్ప, సరైన ఆధారాలు లేవు. కొన్ని కృతులకి మాత్రం ఎక్కడ పాడారో చెప్పారు. తేదీలు లేకపోయినా ప్రదేశాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ, ఏ దైవాన్నుద్దేశించి రాసిన దాన్నిబట్టీ చెప్పడం జరిగింది. కోవూరు కీర్తనలూ, తిరుపతి వెంకటేశ్వర స్వామి పై రాసినవీ ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పంచనదయ్య త్యాగరాజు పెద్దన్నయ్య. అతను పెళ్ళి చేసుకొని మామూలు సంసారిక జీవితాన్ని గడిపేవాడు. ఈయన్నే “జప్యేశ” అని కొంత మంది సంబోధించారు. త్యాగరాజు చిన్నన్నయ్య పేరు పంచాపకేశ బ్రహ్మం. అతను త్యాగరాజుకి వివాహం కాకమునుపే అనారోగ్యంతో పోయాడు. అతను అనారోగ్యంతో మంచానున్నప్పుడు “అన్యాయము సేయకురా” అనే కృతిని త్యాగరాజు పాడినట్లుగా వెంకటరమణ, కృష్ణస్వామి భాగవతార్లిద్దరూ రాసారు.
త్యాగరాజు రాసిన మొదటి కృతి ఏదీ? ఎన్నో ఏట రాసాడూ? అన్న వివరాలు ఇదమిత్థంగా తెలీవు. కొంతమంది “గిరిరాజ సుత తనయ” అనే కృతే మొట్టమొదటి రచన అని నమ్ముతారు. అది కాదు “నమో నమో రాఘవాయ” (దేశి తోడి రాగం) మొట్ట మొదటి కృతి అని వాదిస్తారు. మొదటిది తెలుగులో రాసింది. నమో నమో రాఘవాయ మాత్రం సంస్కృత రచన.
ఇదే మొదటి కృతి అని చెప్పడానికి రెండు ఆధారాలు కూడా చూపించారు. త్యాగరాజు సంస్కృత విద్యా నిమిత్తమై తిరువైయ్యరు వచ్చాడు. ఎవరికైనా విద్యా ప్రభావం చిన్న తనంలో ఉంటుంది. గురువులైన సంస్కృతం పండితుల ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువ. బహుశా అదే ప్రభావంతో త్యాగరాజు సంస్కృతంలో రాసుండచ్చని వాదించారు. ఈ రచన త్యాగరాజు 13 నుంది 15 ఏళ్ళ వయసులో జరిగుండవచ్చనీ చెప్పారు. ఈ కృతి పూర్తిగా సంస్కృతంలోనే ఉంటుంది. త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతుల్లో ఇదే మొదటి కృతిగా చెప్పుకోవాలి. ఆ తరువాత రాసినవాటిలో ఎక్కువ భాగం అచ్చ తెలుగులోనే ఉన్నాయి. ఇదే విషయం విలియం జాక్సన్ (త్యాగరాజ: లైఫ్ అండ్ లిరిక్స్) లో ప్రస్తావించాడు. అతనే దీనికంటే మరో బలమైన కారణం చూపింఛాడు.
త్యాగరాజు చిన్నతనంలో అంటే, 1780 నుండి 1783 మధ్యన తంజావూరికి విపరీతమైన కరువొచ్చింది. మైసూరు రాజైన హైదరాలీ సైన్యం తంజావూరు చుట్టు పక్కల గ్రామాలనన్నీ మట్టుపెట్టాయి. పల్లెల్లో వున్న పంటకాల్వల్నీ, వ్యవసాయ భూముల్నీ చింద్రం చేసేసారు. భయంతో ప్రజలు దగ్గరున్న పట్టణాలికి పరిగెత్తారు. ప్రతీ గ్రామంలోనూ నీటికీ, తిండికీ ఎద్దడొచ్చింది. గోరుచుట్టుపై రోకలి పోటులా ఓ రెండేళ్ళ పాటు రుతుపవనాలు రాలేదు. వర్షాల్లేవు. పొలాలన్నీ బీడు భూముల్లా తయారయ్యాయి. ఇది జరిగినప్పుడు త్యాగరాజుకి సుమారు 13 నుండి 15 ఏళ్ళ వయసుండుంటుంది. ఇది చూసి చలించి, ఓ జానపద గీతంలా రాముణ్ణి వేడుకుంటూ త్యాగరాజు రాసాడనీ అన్నారు. ఆ కృతిలో – రాముడే రక్షిస్తాడనీ, సకల లోక రక్షకుడనీ, దుష్ట శిక్షకుడనీ కీర్తిస్తూ, పేదవారి కష్టాలని దాటించే దయాశీలనీ చెప్తాడు. తనని నమ్ముకున్న భక్తులకి రాముడెన్నడూ అన్యాయం చేయడనీ అంటాడు. తన చుట్టూ ఉన్న దయార్ద్ర స్థితిని చూసి దైవ భక్తి ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి త్యాగరాజు ప్రయత్నించాడని జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఇదే త్యాగరాజు మొదటి రచన అయ్యుండచ్చనీ చెప్పాడు. ఇందులో ఎక్కడా హైదరాలీ సైన్యం అకృత్యాలు కానీ, నిస్సహాయ రాజుల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించ లేదు.
త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన ఇద్దరూ (వెంకట రమణ భాగవతార్, ఆయన కొడుకు కృష్ణస్వామి బాగవతార్ కానీ) 1781 సంవత్సరంలో తంజావూరు రాజ్యంలో వచ్చిన కరువు గురించి కానీ, హైదరాలీ అకృత్యాల గురించి కానీ రాయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అప్పటికి పుట్ట లేదు. ఒకవేళ పుట్టినా ఈ విషయాలు రాసుండేవారు కారనీ విలియం జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు త్యాగరాజుని దేవుని అవతారంగా భావించి రాసారు. పురాణ పురుషుడిగా భావించారు. త్యాగరాజు కూడా తన రచనల్లో ఎక్కడా ఈ కరువు ప్రస్తావన తీసుకు రాలేదు. అదీకాక హిందువులకి పురాణా కథలమీదున్న భక్తీ, ఆసక్తీ, చరిత్ర మీద లేదని పండితుల అభిప్రాయంగా విలియం జాక్సన్ రాసాడు.
“గిరిరాజ సుత తనయే” మొదటి కృతని సుబ్బరామ దీక్షితార్ (1839 – 1906) అనే ఆయన రాసారు. ఈ సుబ్బరామ దీక్షితార్ చిన్నతనంలో త్యాగరాజుని కలిసారు. ఈయన ముత్తుస్వామి దీక్షితార్ వంశీకుడు. ఈయన సంగీతానికి సంబంధించిన చాలా గ్రంధాలు సేకరించాడు. సంగీత సంప్రదాయ ప్రదర్శిని (Exposition of the Tradition of Music) అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో దక్షిణ భారత దేశంలోని వాగ్గేయ కారుల జీవిత చరిత్రలు రాశాడు. త్యాగరాజు గురించీ కొద్దిగా రాసాడు. తిరువారూర్ త్యాగరాజ స్వామి అవతారమే ఈ త్యాగరాజనీ కీర్తించాడు. త్యాగరాజు జీవితం గురించి వివరాలెక్కువ దొరకలేదనీ విచారించాడు.
ఇలా ఎవరికి ఏ విషయం తెలిస్తే దాన్ని వాళ్ళు రాసారు. ఇందులో స్తవమెంత, వాస్తవమెంత అన్నది తెలీదు. శాస్త్రీయంగా ఆధారాలు చూపించినప్పుడే ఇదీ సరైన చరిత్ర అని చెప్పగలం.
త్యాగరాజుకి 18వ ఏట (1785 లో) పార్వతనే అమ్మాయినిచ్చి వివాహం చేసారు. త్యాగరాజు 20 వ ఏట తండ్రి రామబ్రహ్మం కాలం చేసాడు. (త్యాగరాజుకి 15 ఏళ్ళ వయసులోనే మాతా పిత్రు వియోగం కలిగిందనీ సుబ్బరామ దీక్షితార్ రాసారు. దీనికి ఆధారాలెక్కడివో తెలీవు. )
సరిగ్గా తండ్రి పోయిన మూడేళ్ళకి త్యాగరాజు భార్య పార్వతి మరణించింది. ఆ తరువాత రెండేళ్ళకి పార్వతి చెల్లెలు కమలాంబని త్యాగరాజు రెండో పెళ్ళి చేసుకున్నాడు.
ఇక్కడి వరకే వెంకటరమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధం ఉంది. మిగతా జీవిత విశేషాలు ఎందుకు పొందుపరచలేదో తెలీదు. అలా అర్థాంతరంగా ముగించడానిగ్గల వివరాలెవ్వరికీ తెలీదు. అందువల్ల తరువాతాయన కొడుకు కృష్ణస్వామి రాసిన త్యాగరాజు జీవిత చరిత్రే అందరికీ ఆధారమయ్యింది. అందులోంచే మిగతా విశేషాలు తెలిసాయి.
( ఇంకా వుంది )
- Tyagaraja – Manuscripts of VemkaTa Ramana Bhagavatar and T.S.Rama Rao – Translated versions. Madras University
- Tyagaraja – Life Story – KrishNa Bhagavatar (English Translation Madras University)
- The Great Composers Vol I & II – P.Samba Murthy
- Tyāgarāja and the South Indian Bhajana Sampradāya – Robert L. Simon (Oxford Music Journal)
- Tyagaraja – Life and Lyrics – William Jackson
- Tyagaraja: A Great South Indian Composer – Ethel Rosenthal (Oxford Music Journal)
- Know your Tyagaraja – S.V. Krishna Murthy
- The Spiritual Heritage of Tyagaraja – Dr. V. Raghavan
- సమగ్రాంధ్ర చరిత్ర – ఆరుద్ర
- నాదయోగి త్యాగయ్య – తిరుమూరు సుధాకర రెడ్డి
- వాగ్గేయకారుల చరిత్ర – టి. పార్థసారధి
- గాన కళాబోధిని – ఎన్.సి.పార్థసారధి
- Tyagaraja and the Renewal of Tradition – Translations and Reflections- William J Jackson
- త్యాగరాజ కీర్తనలు – మంచాళ జగన్నాధ రావు
- త్యాగరాజ ఆత్మ విచారము – భమిడిపాటి కామేశ్వర రావు (తెలుగు యూనివర్సిటీ లో దొరికిన కొంత భాగం మాత్రమే)
- ఆంధ్ర వాగ్గేయ కారుల చరిత్ర – బాలాంత్రపు రజనీకాంత రావు
- The Science of Indian Music – నూకల చిన సత్యనారాయణ