భారతీయ ఖగోళ సంప్రదాయం – ఆర్యభట-I కల్పనాశక్తి

ఆగష్టు 12న సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ, ఈ సందర్భం మనకి భారతీయ ఖగోళ సంప్రదాయాన్ని మననం చేసుకుందికి, ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ‘అతి పరిచయాదవజ్ఞా’ అని లోకోక్తి. అంటే బాగా పరిచయం ఉండడం వల్ల… అది వ్యక్తి ఐనా, విషయమైనా… ఒక రకమైన నిరసన భావం, చులకన భావం కలుగుతుంది అని తాత్పర్యం. భూమి నీడలోకి చంద్రుడు రావడంవల్ల పౌర్ణమినాడు చంద్రగ్రహణం, సూర్యుడికీ భూమికీ మధ్య చంద్రుడు రావడంవల్ల అమావాస్యనాడు సూర్యగ్రహణం ఏర్పడతాయని ఈ రోజు బడిపిల్లలతో సహా అందరికీ తెలిసిన విషయం. అందువల్ల, ఆ ప్రసక్తి వచ్చినప్పుడల్లా దానిలో కొత్త విషయం తెలుసుకోవడంలో ఉండే ఆసక్తి, ఉత్సాహం కనిపించవు. నిజానికి సేరోస్ ఆవృతి (Saros Cycle) పేరు ప్రచారంలో ఉన్నంతగా, మాధవ గురుకులానికి చెందిన వాతస్సేరి పరమేశ్వర (సా.శ. 1365-1455) 55 సంవత్సరాలు గ్రహణాలను స్వయంగా పరిశీలించి, రచించిన “గ్రహణ మండన”, “గ్రహణాష్టక”, “గ్రహణన్యాయదీపిక” అనే మూడు గ్రంథాలకు లేదు. 1608లో దూరదర్శిని (telescope) కనిపెట్టబడకముందే, వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు – ముఖ్యంగా ఆర్యభట I, గ్రహణాలను ముందుగా అంచనా వెయ్యడానికి కావలసిన గణిత వ్యవస్థను రూపొందించారు. ఆర్యభట I ప్రత్యేకత కేవలం గ్రహణాలను గణించడం మాత్రమే కాదు; ఖగోళాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన అవలంబించిన ఆలోచనావిధానమే విశిష్టమైనది.

ఈ వ్యాసం ఉద్దేశం ఆధునిక ఖగోళ పరిభాషలో గ్రహణ సిద్ధాంతాన్ని వివరించడం కాదు. ఆర్యభట I వంటి మహా ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు, అతని ఆలోచనల వెనుక ఉన్న తర్కం ఏమిటి, అతని గణిత వ్యవస్థ ఎందుకు శతాబ్దాల తరబడి ప్రభావవంతంగా కొనసాగిందన్న విషయాలను పరిశీలించడం.

ముందుగా ఒక హెచ్చరిక. ఆర్యభట తన సిద్ధాంతాలను చాలా సంక్షిప్తంగా మాత్రమే వ్యక్తం చేశాడు. చాలావరకు వివరణలన్నీ బహుశా బోధనాత్మకంగా ఉండి ఉండాలి. అందువల్ల అతని ఆలోచనల స్వభావాన్ని అతను రూపొందించిన గణిత వ్యవస్థ ఆధారంగా అంచనా వెయ్యడమేగాని, అవే అని రూఢిపరచడం లేదు. అతని వ్యవస్థ తరతరాల మేధావుల పరిశీలనకు, నిశితమైన విమర్శకు గురి అయింది. అయినప్పటికీ అనుసరణీయమైందిగా నిలబడటానికి దాని గణితపరమైన అపూర్వ కల్పనాశక్తి ఒక కారణం. సృష్టికీ, కాలానికీ తొలితుదలులేని చక్రీయగతిని సంభావించిన భారతీయ తత్త్వదృష్టిపై ఆధారపడటం రెండవ కారణం.

1. గ్రహాల స్థానాలను నిర్ణయించే శాస్త్రంగా ఖగోళశాస్త్రం

ఈనాటి పాఠకులు ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం, ప్రాచీన భారతీయ ఖగోళశాస్త్ర మౌలిక లక్ష్యం గ్రహకక్ష్యల స్వరూపాన్ని కనుగొనడంగాని, వాటి ద్రవ్యరాశి, భూమినుండి వాటి కచ్చితమైన దూరాలను కొలవడంగాని కాదు. వారి ప్రధాన లక్ష్యం: ఏ సమయంలోనైనా ఒక గ్రహం ఎక్కడ ఉంటుందో ముందుగా చెప్పగలగడం. కనుకనే వారి జ్యామితి పరిశీలనాత్మకమై (observational), కక్ష్యలో గ్రహాల స్థానాల్ని నిర్ణయించడానికీ, మందవృత్తాలద్వారా (epicycles) వాటి గమనాలని వివరించే (explanatory)దిశలోనూ కొనసాగింది.

దీనికోసం వారు కొన్ని ప్రాథమిక ప్రమేయాలను స్వీకరించారు. గ్రహాలు తమ తమ కక్ష్యల్లో ‘సమాన ఋజు వేగం’తో (constant linear velocity) నడుస్తాయన్నది మొదటిది. దానివల్ల, భూమినుండి దూరంగా కక్ష్యగల గ్రహాలు ఒక భ్రమణాన్ని పూర్తి చెయ్యడానికి ఎక్కువకాలం తీసుకుంటుందన్నది సూచితము (వాటి కోణీయ వేగాలు — angular velocities — సమానం అనుకుంటే, అన్ని గ్రహాలూ తమ కక్ష్యల దూరాలతో నిమిత్తం లేకుండా తమ భ్రమణాలను ఒకే కాలపరిమితిలో పూర్తిచెయ్యవలసి వచ్చేది). రెండు నక్షత్రాలకి (న + క్షత్ర) స్వయంగా చలనం లేదు (గత శతాబ్దం వరకూ శాస్త్రజ్ఞసమాజం నిశ్చితాభిప్రాయం అదే). అందువల్లనే మేషరాశి ప్రారంభ బిందువును యుగ ప్రారంభానికి ప్రామాణికంగా తీసుకోగలిగారు. దీనికి భిన్నంగా, గ్రహాలకి తూర్పుదిశగా స్వీయచలనం ఉంటుందన్నది రెండవది. చంద్రుడి కక్ష్య ఆధారంగా, ఒక మహాయుగంలో చంద్రుడు నడిచే దూరాన్ని అన్ని గ్రహాలూ మహాయుగంలో నడిచే దూరంగా నిర్ణయించారు. దాన్నిబట్టి, ఒక మహాయుగంలో వివిధ గ్రహాల భ్రమణాలను నిర్ధారించారు.

ఈ విధమైన ఖగోళ గణిత వ్యవస్థ ద్వారా వారు

  • పంచాంగ నిర్మాణం చేయగలిగారు.
  • చంద్రుని కళలను నిర్ణయించగలిగారు.
  • గ్రహణసమయాల పూర్వనిర్ధారణ చేయగలిగారు.
  • గ్రహ సంయోగాలను లెక్కించగలిగారు.
  • మతపరమైన ఆచారాలకు అవసరమైన కాలనిర్ణయాలను చేయగలిగారు.
  • వ్యవసాయ కార్యక్రమాలకు అనువైన సమయాలను నిర్ధారించగలిగారు.

భారతీయ ఖగోళశాస్త్రం ప్రధానంగా స్థానీయ ఖగోళ శాస్త్రంగా (Positional Astronomy) అభివృద్ధి చెందింది.

2. కాలగమనపు చక్రీయత మరియు మహాయుగాలు: నిరయన సిద్ధాంత వ్యవస్థ

భారతీయ ఖగోళ గ్రంథాలలో కనిపించే మహాయుగాలూ, కల్పాలూ సూచించే సంఖ్యలు ఆధునిక పాఠకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. భారతీయ గణిత ప్రతిభని అంచనా వేసిన పాశ్చాత్య మేధావులు ఈ అంకెలని కేవలం మతపరమైన ఊహలుగా త్రోసిపుచ్చారు.

ఈ సంఖ్యలు ఖగోళ చలనాల పునరావృత స్వభావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించబడ్డాయి. గ్రహాలు, చంద్రుడు, నాడులు మొదలైన ఖగోళ అంశాల గమనాలకు ఒక సామూహిక ప్రారంభ బిందువును ఊహించి, అక్కడినుండి గణనలు నిర్మించడం వారి విధానం.

కాలానికి ఆది అంతం లేదని భావించిన భారతీయ తత్త్వదృష్టిలో, ఈ రకమైన చక్రీయ గణిత నిర్మాణం సహజ పరిణామం.
ప్రాచీన భారతీయ ఖగోళశాస్త్రజ్ఞులకు విషువత్తుల చలనం (Precession of Equinoxes) గురించి అవగాహన ఉంది. అంటే, వసంత(vernal equinox), శరత్ విషువత్తు(autumnal equinox)లు స్థిరంగా లేకుండా, సంవత్సరానికి సుమారు 50 సెకెన్ల చాపరేఖతో పడమటి దిశగా నడుస్తాయని వారికి తెలుసు. ఐతే, అది వారు ఇప్పటి శాస్త్రం చెప్పినట్లు వృత్తాకారంలో కాకుండా, లోలకం (pendulum)లా ఒక వైపునుంచి మరొక వైపుకు ఊగిసలాడుతున్నట్టు (Trepidation of Equinoxes) భావించారు. దానివల్ల, ప్రతి సంవత్సరం మేషరాశి ప్రారంభ బిందువు వద్ద నాక్షత్రిక సౌర సంవత్సరం ప్రారంభం అవదు.

స్థిర నక్షత్రాల నేపథ్యం ఒక స్థిరమైన నిర్దేశాంక వ్యవస్థను అందిస్తుంది. దానివల్ల నక్షత్రాల నేపథ్యంలో గ్రహాల స్థానాలను కోణీయ దూరాల రూపంలో సులభంగా వ్యక్తీకరించవచ్చు.ఈ సౌలభ్యం వల్ల, ఏ రోజు గ్రహ స్థితి కావలసి వచ్చినా, యుగ ప్రారంభంనుండి గడిచిన పౌరదినాలను (civil days)బట్టి, మహాయుగంలో ఆ గ్రహం చేసే భ్రమణాలకి దామాషా పద్ధతిలో ఆ రోజు వరకు గ్రహ భ్రమణాలనీ, దానినుండి మధ్యమ గ్రహాన్ని కనుక్కోవచ్చు. అలా ఏ సమయంలోనైనా గ్రహాల మధ్యమ స్థానం కనుక్కోవాలంటే, నిలకడగా ఉండే ప్రారంభ బిందువు ఉంటేనే సాధ్యమౌతుంది. విషువత్తుల చలనం వల్ల ప్రతి సంవత్సరమూ మారుతుండే సాయన మేషరాశి ప్రారంభ బిందువు ఉపయోగించదు. [ఇక్కడ మరొక విషయం స్పష్టం చెయ్యాలి. సాయన సిద్ధాంతంలో, సూర్యుడు తన భ్రమణంలో ఉత్తరార్ధగోళంలో ప్రవేశించేటపుడు జ్యోతిశ్చక్రాన్ని ఖండించే బిందువు(vernal equinox)ని మేషరాశి ప్రారంభ బిందువుగా పరిగణిస్తారు. నిరయన సిద్ధాంతంలో మేషరాశి ప్రారంభ బిందువు స్థిరం. ఈ రెండింటి మధ్యనున్న దూరమే విషువత్ చలనం.] అందుకని జ్యోతిశ్చక్రం మీద సూర్యుడి చలనం ఆధారంగా, విషువత్తులనీ, ఉత్తర- దక్షిణ ఆయనాలనీ, [ఇప్పటి కార్తీయ నిరూపణ వ్యవస్థ (cartesian coordinate system)లోలా,] నాలుగు మూల దిక్కులుగా తీసుకుని, యుగప్రారంభ బిందువుగా మేషరాశి ప్రారంభ బిందువును ప్రామాణికంగా తీసుకుని నిరయన సిద్ధాంతం (Sidereal System) రూపొందించారు.

ఈ సందర్భంలోనే, ఆర్యభట I నిర్వచించిన (అర్థ) జ్యా (Sine), కోటిజ్యా (Cosine), ఉత్క్రమజ్యా (Versine) ల ప్రాముఖ్యత మనకు తేటతెల్లం అవుతుంది. ఈ నిరూపకాల ద్వారా ఒక తలంలోని ఏ బిందువునైనా అది కేంద్రబిందువుతో చేసే కోణాన్నిబట్టి, కచ్చితంగా నిర్ణయించడంతోపాటు, కేంద్రంనుండి, రెండు అక్షాలనుండి, దాని దూరాన్ని కూడా కనుక్కోవచ్చు. రీని డేకార్త్ (Rene Descartes(1596–1650)) కంటే సుమారు వెయ్యి సంవత్సరాలు ముందు ‘అటువంటి’ వ్యవస్థని రూపొందించినా, దురదృష్టవశాత్తూ, మనం మన శాస్త్రజ్ఞుల కృషిని గుర్తించి అనుసరించలేకపోయాము. ఈ త్రికోణమితీయ సాధనాల ద్వారా గ్రహాల స్థానాలు, క్రాంతి (Declination) వంటి అనేక పరిమాణాలను ఆర్యభట సులభంగా, కచ్చితంగా గణించగలిగాడు.

3. గ్రహ కక్ష్యల స్వరూపానికి ఎందుకు తక్కువ ప్రాముఖ్యం?

ఆర్యభట I, ఇతర భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించినట్లు కనిపిస్తుంది: ఒక గ్రహం ఎక్కడ ఉందో చెప్పడానికి, దాని కక్ష్య అసలు స్వరూపం పూర్తిగా తెలుసుకోవడం తప్పనిసరి కాదు. గ్రహం ఎందుకు అసమగతిలో సంచరిస్తుందన్న ప్రశ్నకంటే, ఆ అసమగతిని గణితపరంగా ఎలా నిర్దేశించవచ్చన్నదే వారికి ముఖ్యం.

గ్రహం అసమగతిలో నడుస్తోందని పరిశీలనలు వ్యక్తపరుస్తున్నా, అది సమవేగంతో ఒక వృత్తాకార కక్ష్యలో నడుస్తోందని ప్రమేయం తీసుకోవడం వెనుక, మందవృత్తాల ద్వారా ఆ అసమచలనాన్ని వివరించగల సమర్ధత కారణం. వారి లక్ష్యం గ్రహస్థానాన్ని కచ్చితంగా అంచనా వేయడం. దానికోసం వారు:

  • మంద సంస్కరణ
  • శీఘ్ర సంస్కరణ
  • మందవృత్తాలు

వంటి జ్యామితీయ పద్ధతులను ఉపయోగించారు.

ఒక గణిత వ్యవస్థ విజయాన్ని నిర్ణయించేది – అది “వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది?” అన్న ప్రశ్న కాదు; “ఎంత కచ్చితంగా అంచనా వెయ్యగలుగుతోంది?” అన్నదే.

4. ఆర్యభట I ప్రతిభ

ఆర్యభట ప్రతిభ కేవలం గ్రహణ గణితంలో లేదు. ఆధునిక కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే, ఒక విస్తృత ఖగోళ గణిత వ్యవస్థకు అవసరమైన ‘ఆర్కిటెక్చర్’ను నిర్మించడంలో ఉంది.

అతని ప్రతిభకి గీటురాళ్ళు:

  • అప్పటివరకూ ఉన్న సిద్ధాంతాలనీ, సంప్రదాయాలనీ పునస్సమీక్షించి, సమకాలీన మేధావులైన బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు వంటివారికి కూడా అవగాహన కానంత దూరదృష్టితో చేసిన భూ-భ్రమణ సిద్ధాంతం
  • మహాయుగ ప్రక్షాళన
  • వృత్తపాదాన్ని 24 భాగాలుగా విభజించి జ్యాలూ, జ్యాల మధ్య తేడాల సూచికల నిర్మాణం, ఆ విలువల కచ్చితత్వం
  • గ్రహణాలని ముందుగా పసిగట్టడానికి రూపొందించిన గణిత ప్రక్రియ
  • కాలాన్ని శబ్దంతో సమన్వయం చేసి 60 దీర్ఘాక్షరాలు పలకడానికి 24 సెకెన్ల కాలం అంటే ఒక విఘడియ కాలం పడుతుంది అని నిర్ణయించడం
  • అప్పటివరకూ ఎవరూ చెయ్యని రీతిలో π ని వ్యవహారానికీ (√10), కచ్చితత్వానికీ (62832/20000) వేరు వేరుగా నిర్వచించిన తీరు
  • ఖగోళ వస్తువు నియమిత కాలంలో ఆవర్తనాలు జరుపుతున్నపుడు, దాని కక్ష్య వ్యాసార్ధాన్ని పరిమాణంతో నిమిత్తం లేకుండా, రేడియన్ల ప్రమాణంలో దానిని కుదించి R = 3438 = 21600/ 2π అని నిర్ణయించడం
  • అతి చిన్న కోణాలలో జ్యాకీ, చాపానికీ ఉండే ప్రమాణం దాదాపు సమానం అన్న విషయాన్ని (ఇప్పటి భాషలో first order approximation ఉపయోగించి ) జ్యాపట్టికల వ్యవస్థని నిర్మించిన తీరు

400 సంవత్సరాలు అఖండంగా వెలుగొందిన కేరళ గురుపరంపర అతని వ్యవస్థని అక్కునజేర్చుకుని, దాన్ని మెరుగుపరిచిందన్న ఒక్క విషయం చాలు. అతని ప్రతిభకి వేరెవ్వరి కితాబులూ అవసరం లేదు.

5. చంద్రుని నాడుల (Nodes) ప్రాముఖ్యత

గ్రహణాలను ముందుగా అంచనా వెయ్యడంలో చంద్రుని కక్ష్యకన్నా, ఆ కక్ష్య జ్యోతిశ్చక్రాన్ని ఖండించే రెండు బిందువులు అతి ముఖ్యమైనవి. వీటిని ఆధునిక ఖగోళశాస్త్రం ఆరోహణ నాడి (Ascending Node), అవరోహణ నాడి (Descending Node)గా వ్యవహరిస్తుంది.

సమకాలీన భారతీయ సంప్రదాయంలో ఇవి రాహు, కేతువులుగా ప్రసిద్ధి పొందాయి. సూర్య, చంద్రులు ఈ నాడుల సమీపంలో అమావాస్య సమయంలో సంయోగంలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవించే అవకాశం వస్తుంది. అందుకే భారతీయ ఖగోళశాస్త్రజ్ఞులు ముందుగా నాడిని ఆధారంగా తీసుకుని, సూర్యచంద్రుల రేఖాంశాలనుండి నాడి రేఖాంశాన్ని ముందుగా తగ్గించేవారు. ఇది ఆధునిక నిర్దేశాంక గణితంలో మూలబిందువు బదిలీ (Shifting the Origin)కి సమాంతర భావన. దానివల్ల, చంద్రుడి అక్షాంశ గణన సులభమౌతుంది.

చంద్రుడు జ్యోతిశ్చక్రంపై ప్రయాణించడు. అతని కక్ష్యకు జ్యోతిశ్చక్రంతో కొంత వాలు (obliquity) ఉంటుంది. అందువల్ల, కేంద్రాన్ని నాడికి తీసుకుపోయినపుడు, చంద్రుడి అక్షాంశం నాడినుండి దూరంగా మారుతుంది. ఇక్కడే జ్యా గణనలు కీలకమవుతాయి. నాడినుండి చంద్రుని దూరం గ్రహణసంభవతనీ, గ్రహణస్వరూపాన్ని, గ్రహణకాలాన్ని నిర్ణయిస్తుంది.

దీన్నిబట్టి, భారతీయ త్రికోణమితి వికాసానికి గ్రహణ గణితం ఒక ప్రధాన ప్రేరణగా నిలిచిందని ఊహించవచ్చు.

6. వృత్తపాదాన్ని 24 భాగాలుగా విభజించడం వెనుక ఆలోచన

ఆర్యభట ప్రణాళికలో వృత్తపాదాన్ని 24 భాగాలుగా ఎందుకు విభజించాడన్నది అత్యంత కీలకమైన, గహనమైన విషయం. కుతూహలం రేకెత్తించే ప్రశ్నలలో ఒకటి. మరొక సంఖ్య ఎంచుకోకుండా 24నే ఎందుకు ఎంచుకున్నట్టు అని ఆధునిక మేధావులు ఆశ్చర్యపోవడం కద్దు. గ్రంథంలో ఎక్కడా ఆ సంఖ్య ఎంచుకోవడం వెనుక కారణం ప్రత్యక్షంగా పేర్కొనబడి లేదు. కనుక మనం ఏది చెప్పినా అది ఊహాత్మకమే.

వృత్త పాదాన్ని (900= 5400’లని) ఆర్యభట I 24 భాగాలుగా… అంటే ఒక్కొక్కటీ 225′ గా… ఎందుకు విభజించాడు? ఈ విభజన

  1. నక్షత్ర పాద ప్రమాణానికి (200′) సరికాదు.
  2. గణిత సౌలభ్యానికి 3 డిగ్రీల (180′) చాపం కాదు.
  3. పంచాంగ దృష్టిలో చూస్తే షాష్టిక పద్ధతిలో (sexagesimal system) విభజించే, ఘడియలూ, విఘడియలూ, కరణాలు వంటి 60 వ వంతు ప్రమాణసంఖ్య కాదు
  4. అంతకంటే సుళువుగా ఒక్కొక్కటీ 270′ చాపం ఉండే 20 భాగాలు కూడా కాదు.

దానికి కారణం సూర్యుడు రాశిచక్రంమీద తిరుగుతున్నపుడు పొందే అత్యధిక క్రాంతి విలువ కూడా 24o.

కనుక దాని వెనుక గణిత సౌలభ్యంకంటే, పంచాంగ అవసరాలకంటే, ఖగోళ అవసరాలు, ముఖ్యంగా గ్రహణ సంభవత, చిన్న కోణాలలో first order approximation ఆధారంగా కోణానికీ, జ్యాకీ ఉండే వ్యత్యాసం సున్నా అవుతుందన్న విషయం, అత్యధిక క్రాంతి ఆధారంగా ఏ రేఖాంశానికైనా తత్కాల క్రాంతి కనుక్కునే అవకాశంవంటి విషయాలు శాసించాయని సులభంగా గుర్తించవచ్చు.

దాన్నిబట్టి,

  1. నాడి రేఖాంశం
  2. సూర్యుని రేఖాంశం
  3. చంద్రుని రేఖాంశం
  4. చంద్రుని క్రాంతి
  5. సూర్య, చంద్రుల దిన వేగాలు

గమనించి, విస్తృత గణనలు ప్రారంభించక ముందే

  1. గ్రహణం సంభవిస్తుందా?
  2. పాక్షికమా?
  3. సంపూర్ణమా?
  4. లోతైన సంపూర్ణ గ్రహణమా?

అన్న విషయాలను ముందుగా అంచనా వేసే అవకాశం కలుగుతుంది.

7. ఆర్యభటనుండి కేరళ మాధవ గణిత సంప్రదాయం వరకు

ఆర్యభట I వ్యవస్థ బలం, దాన్ని అనుసరించిన తరువాతి శాస్త్రజ్ఞుల అపూర్వమైన కృషిని పరిశీలిస్తే స్పష్టమవుతుంది.
ఆర్యభటీయానికి లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు సంస్కృతంలో, మలయాళంలో, తెలుగులో, తమిళంలో, అనేక ఇతర భాషలలో వచ్చాయి. ఆర్యభటీయం ఆధారంగా అనేక కరణ గ్రంథాలు వచ్చాయి. ఏ ఖగోళ గ్రంథానికి వ్యాఖ్య వ్రాసినా అందులో ఆర్యభటీయ ప్రసక్తి లేనివి దాదాపు శూన్యం. కేరళ మాధవ గణిత సంప్రదాయానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు:

  • ఆర్యభట ప్రతిపాదించిన జ్యా విలువలను మరింత కచ్చితంగా సవరించారు.
  • యుగారంభ స్థిరాంకాలను (epochal constants) మెరుగుపరిచారు.
  • ఆయన పరిశీలనలను మరింత పదునుపెట్టారు.
  • త్రికోణమితి సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు.

వారు పూర్వాచార్యులను తిరస్కరించలేదు; వారి వ్యవస్థను మరింత మెరుగుపరిచారు. ఇదే నిజమైన శాస్త్రీయ సంప్రదాయానికి నిదర్శనం.

8. ముగింపు

రాబోయే సూర్యగ్రహణం, ప్రణాళిక వేసుకుంటే, మనకు ఒక అద్భుత ఖగోళ దృశ్యాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇవ్వడమే కాదు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతీయ ఖగోళ సంప్రదాయాన్ని స్మరించుకునే సందర్భాన్ని కూడా అందిస్తుంది.

భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రహణాలను కేవలం చూచి ఆశ్చర్యపడలేదు. వారు వాటి వెనుక ఉన్న గణితాన్ని, జ్యామితిని, కాలవ్యవస్థను, గ్రహగతులను అర్థం చేసుకుని ఒక సమగ్ర ఖగోళ సిద్ధాంత వ్యవస్థను నిర్మించారు. ఆ మహత్తర సంప్రదాయంలో ఆర్యభట I ఒక మైలురాయి. ఒక దిక్సూచి. ఒక ధ్రువతార. అతని అసామాన్య కృషి గ్రహణ గణితానికి మాత్రమే పరిమితం కాదు; ఖగోళాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన గణిత-జ్యామితీయ-కటపయాది పద్ధతికి భిన్నమైన – భాషను నిర్మించడంలో ఉంది. జ్యాలు, నాడులు, నక్షత్ర మండలం, మహాయుగాలు — ఇవన్నీ ఒక విస్తృత ఖగోళ సిద్ధాంత నిర్మాణశిల్పంలో పరస్పరానుసంధానమైన భాగాలు.

సంపూర్ణ సూర్యగ్రహణం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగవచ్చు. చంద్రగ్రహణం కొన్ని గంటలు మాత్రమే కొనసాగవచ్చు. కానీ ఆర్యభట నెలకొల్పిన ఖగోళ సంప్రదాయం పదిహేను శతాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఆ వారసత్వాన్ని మూఢభక్తితో ఆరాధించడంకంటే, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృష్టిని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి పునరంకితులం కావడమే మనం వారికి అందించగల నిజమైన నివాళి.