సిద్ధార్థుడు బుద్ధుడయ్యాక మాట ఇచ్చిన ప్రకారం తనని చూడ్డానికి వస్తున్నాడని తెల్సింది బింబిసారుడికి. ఏడేళ్ళ క్రితమే అన్నీ వదులుకుని సత్యాన్వేషణకి తన రాజ్యంలోంచే కదా వెళ్ళాడు సిద్ధార్థుడు? వెళ్ళేటప్పుడు, సత్యదర్శనం అయ్యాక తప్పక వెనక్కి వచ్చి కనిపిస్తానని తనతో చెప్పాడు కూడా. అనుకున్నది సాధించాడన్న మాట.
అప్పటికే విని ఉన్న విషయం, బుద్ధుడు రాజభవనాలలో విశ్రమించడు; తినేది భిక్షాన్నం. ఆయన కూడా వచ్చే వేలమంది శిష్యులందరికీ విశ్రాంతికి చోటు చూపించాలంటే తన మేడలూ మిద్దెలూ పనికిరావు. బింబిసారుడి మంత్రుల్లో ఒకరు ఇచ్చిన సలహా ప్రకారం రాజగృహానికి వచ్చే భగవానుడికి సరైన విడిది – వేణువనం. సలహా నచ్చిన బింబిసారుడు వేణువనం సర్వాంగసుందరంగా తయారు చేయించాడు భగవానుడి రాకకోసం. చిన్నప్పుడు తనకి పాఠశాలలో సహాధ్యాయి అయినా, ఇప్పుడు వచ్చేది పాత సిద్ధార్థుడు కాదు. తెలుసుకున్న సత్యం ఏమిటో ఆయన నోట వినాలి.
వేణువనంలో విడిది చేసిన బుద్ధుణ్ణి బింబిసారుడు దర్శించబోయేసరికి బుద్ధభగవానుడు చుట్టురా ఉన్న అశేష ప్రజానీకానికి ఏదో చెప్తున్నాడు. ఏ హడావిడీ, శబ్దం చేయకుండా వెళ్ళి వినడం మొదలుపెట్టాడు మగధ రాజు.
“ … దుఃఖానికి కారణం కోరిక. ఎప్పుడైతే ఆ కోరిక అంతరిస్తుందో అదే ధర్మమార్గానికి దారి. దీనికి నేను ఎంచుకున్న దారి అష్టాంగమార్గం. వీటిని మూడు ముక్కలుగా చెప్పాలంటే మొదటిది సరైన అవగాహన, రెండోది నైతిక ప్రవర్తన, మూడోది మానసిక క్రమశిక్షణ. ఇదే అష్టాంగమార్గం – సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. సమ్యక్ శ్రమ అంటే మనసులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవడం, వస్తే వాటిని తొలగించుకోవడం, మంచి ఆలోచనలను పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం, వర్తమాన క్షణంలో జీవించడం. సమ్యక్ స్మృతితో మన శరీరం, భావాలు, మనస్సు, ఆలోచనలపట్ల ఎల్లప్పుడూ సంపూర్ణమైన అవగాహనతో ఉండడం. మనం మొదటి ఏడు మెట్లూ సరిగ్గా ఎక్కగలిగినప్పుడు మనకి కలిగే ఆనందమైన స్థితి సమ్యక్ సమాధి. అప్పుడు మనకి లభించేది ఏనాటికీ తరిగిపోని అత్యుత్తమ శాంతి. అదే మానవజీవిత పరమావధి.”
ఉపన్యాసం అయ్యాక భగవానుడు అప్యాయంగా పలకరించాడు చిన్ననాటి స్నేహితుణ్ణి. బుద్ధుడయ్యాక సిద్ధార్థుడు తనని మర్చిపోయాడేమో అనుకున్న బింబిసారుడికి, మనసులో ఆనందం కలిగింది. బింబిసారుడు అడిగాడు, “నాలాంటి వారికి ఈ అష్టాంగమార్గం ఎలా సాధ్యం? పొద్దున్న లేచినప్పట్నుంచీ రాత్రి నిద్రపోయేవరకూ ఎన్నెన్నో పనులు. కాసేపు ఇవి గుర్తున్నా, ఏదో పని మీదకి వచ్చేసరికి ఇదంతా మర్చిపోవడం తప్పదు కదా?”
“నిరంతర అభ్యాసమే మార్గం. నేనూ ఒకప్పుడు నీలాగే రాజకుమారుడిని. ప్రయత్నం లేక ఏ సాధనా సిద్ధించదు.”
“ఇది చాలా కష్టమైన దారిలా కనిపిస్తోంది.”
“జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు కదా? నీ రాజ్యం పరిపాలించడం సులభమా? ప్రజల అభిమానాన్ని నిలబెట్టుకోవడం కష్టమే కదా? కష్టపడకుండా దొరికేది ఏదీ నిలవదు, ధర్మం కూడా అంతే.”
వెనక్కి వచ్చేసే ముందు బింబిసారుడు బుద్ధుడికి, ఆయన శిష్యులకి వేణువనం కానుకగా ఇచ్చాడు.
రోజులు గడుస్తూంటే మగధ రాజ్యంలో పరిస్థితులు మారి రాజకీయాలు ఎత్తుల మీద ఎత్తులతో సాగుతున్నాయి. వీటన్నింటికీ విషబీజం వేసినవాడు భగవానుడికి దగ్గిర బంధువు దేవదత్తుడే. ఒకటే కారణం, అతనికి భగవానుడంటే అసూయ, దాని మూలాన వచ్చిన పగ, ద్వేషం.
మరోసారి రాజగృహానికి వచ్చిన భగవానుడికి ముఖ్య అనుచరుడు ఆనందుడు. అశేష జనప్రవాహం బుద్ధుణ్ణి అనుసరించి ఆయన చెప్పిన మార్గంలో సాగుతోంది. నందుడు రాజ్యం వదులుకుని సన్యాసం స్వీకరించడం, క్రూరమైన హత్యలు చేసే అంగుళిమాలుడు సన్యాసం తీసుకోవడం, తనకి మనుమడి వరస అయిన జీవకుడంతటి ప్రముఖ వైద్యుడు కూడా బుద్ధుడికి శిష్యుడవడం, అన్నీ కథలు కథలుగా తెలిసి వస్తున్నాయి బింబిసారుడికి.
వయసు మీద పడుతున్న బింబిసారుడు చాలా విచారించాడు, ఎన్నో ఏళ్ళ క్రితం మొదటిసారి బుద్ధుడు చెప్పిన అష్టాంగమార్గాన్ని అవలంబించనందుకు. మరోసారి బుద్ధుణ్ణి చూడ్డానికి బయల్దేరాడు.
ఎప్పటిలాగానే భగవానుడు చిన్ననాటి స్నేహితుణ్ణి ఆప్యాయంగా పలకరించాడు. అయితే ఈసారి భగవానుడు చెప్పింది విని అశ్చర్యపోయాడు బింబిసారుడు. “కొడుకు అజాతశత్రువుకి రాజ్యం ఇచ్చేసి సన్యసించవచ్చు కదా?”
“ఎందుకు నన్ను సన్యసించమంటున్నారు? వయసు కాక వేరే కారణం ఉందా?” బింబిసారుడు అడిగాడు.
“రాజులలో కోపతాపాలు, పగలూ ఎప్పుడు వస్తాయో తెలియదు. యుద్ధాలూ అవీ జరిగి ఏ రాజు నెగ్గినా, ఎవరికీ సంతోషం అనేది లేదు కదా? శరీరం సహకరిస్తున్నప్పుడే, ఇంట్లోవారికీ బయట రాజులకీ కోపతాపాలు రాకముందే సన్యసించడం మంచిది కదా?”
ఏమీ మాట్లాడకుండా బింబిసారుడు ఇంటికి తిరిగివచ్చాడు. మనసులో వ్యాకులత. భగవానుడు తనని ఎందుకు సన్యసించమన్నాడో? బయట రాజుల సంగతి సరే, ఇంట్లో తనకు శత్రువులు ఎవరు?
బింబిసారుడు వెళ్ళాక ఆనందుడు అడిగాడు భగవానుణ్ణి, “ఇంట్లోవారికీ బయట రాజులకీ కోపతాపాలు రాకముందే సన్యసించు అన్నారు కదా రాజుగారితో, దానివల్ల ఆయన మనసులో అనుమానం నాటినట్టు అవదా?”
భగవానుడు సమాధానం చెప్పలేదు. ఆనందుడు రెట్టించనూ లేదు.
“నీ తండ్రి బింబిసారుడు ఇప్పటికే దశాబ్దాలపాటు రాజ్యం చేసాడు. నిన్ను రాజుగా చేసే ఉద్దేశ్యం ఆయనకు ఉన్నట్టు కనిపించదు. దానికితోడు ఈ బుద్ధుడి దగ్గిరకి పోయి కూర్చోవడం. ఆయన దగ్గిరకి ఎవరు వెళ్ళినా ‘సన్యాసం తీసుకో’ అంటూ కబుర్లు చెప్పడమే కానీ ఈ బుద్ధుడికి ఏదైనా మంత్రం వేయడం, అవతలవార్ని తన వశంలోకి తెచ్చుకోవడం చేతనౌతుందా?” దేవదత్తుడు అజాతశత్రువుతో చెప్తున్నాడు రహస్యమందిరంలో.
అజాతశత్రువు మాట్లాడకపోవడం గమనించి దేవదత్తుడు మరింత రెచ్చగొట్టాడు, “నన్ను చూడు, కొంత సాధన తర్వాత సిద్ధుడినై ఇతరుల మనసులోని ఆలోచనలు గ్రహించగలను. బుద్ధుడు అలా చేయగలడా?”
రాజ్యకాంక్ష వదలని అజాతశత్రువు అన్నాడు, “నిజమే, నీ శక్తుల గురించి నేను విన్నాను. అయితే మా నాన్నగార్ని తప్పించి రాజ్యం గ్రహించడం ఎలా?”
“ఆయన్ని చంపడం ఒకటే దారి. నేను కూడా బుద్ధుణ్ణి అంతం చేయడానికి ఆలోచన చేసాను. నువ్వు తండ్రి దగ్గిరనుంచి రాజ్యం లాగేసుకునే రోజుకి నేను బుద్ధుడి స్థానం ఆక్రమిస్తాను. మనిద్దరం మగధని ఇష్టారాజ్యంగా ఏలవచ్చు.”
“కన్నతండ్రిని చంపడమా? ఆ పని చేయగలనా?”
“అభయుడిమీదా, జీవకుడిమీదా చూపించే అభిమానం నీ తండ్రి ఎప్పుడైనా నీ మీద చూపించాడా? ఇప్పుడు నువ్వు రాజువి కాకపోతే, అభయుడికి బింబిసారుడు రాజ్యం ఇస్తాడనేది తథ్యం. ఆ తర్వాత నీ జీవితం ఏమౌతుంది? నీ ఇష్టం, మరోసారి ఆలోచించుకో,” దేవదత్తుడు లేచి వెళ్తూ చెప్పాడు.
అజాతశత్రువు మనసులోపడిన విషబీజం మహావృక్షంగా ఎదగడం మొదలైంది.
భగవానుడు నడుస్తూంటే ఓ రోజు పైనుంచి హఠాత్తుగా పెద్ద బండ కాలి మీద పడింది. అది తలమీద పడవలసిందే కానీ ఆఖరి క్షణంలో భగవానుడు ఎందుకో పక్కకి తిరిగాడు.
కాలి గాయం తగ్గుతుంటే భగవానుడికి తెల్సింది. అజాతశత్రువు తండ్రిని కారాగారంలో పెట్టించి తానే రాజయ్యాడు. స్వహస్తాలతో తండ్రిని చంపితే జనం ఏమనుకుంటారో అని కారాగారంలో పెట్టే తిండీ, నీరు రోజు రోజుకీ తగ్గించమని ఉత్తర్వులు ఇచ్చాడు. బుద్ధుడికీ, జీవకుడికీ, కనీసం అభయుడికి కూడా బింబిసారుణ్ణి చూడ్డానికి అనుమతి లేదు. బింబిసారుడి భార్య తన దుస్తుల్లో రహస్యంగా ఆహారం దాచి భర్తకి అందిస్తోందని, ఆవిడని కూడా కారాగారం లోపలకి వెళ్ళకుండా ఆపారు.
ఈ స్థితిలో కూడా బింబిసారుడు చావలేదు. కారణం దేవదత్తుడు కనిపెట్టాడు. కారాగారం గదిలో గాలీ వెల్తురూ వచ్చే కంతలోంచి బింబిసారుడు బుద్ధుడు ఉండే దిశ వైపు తిరిగి ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన అష్టాంగమార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నాడు.
వెంటనే బింబిసారుడి గదిలోకి గాలీ వెల్తురూ రాకుండా ఆ కంత మూయబడింది.
మరో కొన్ని నెలలకి బింబిసారుడి ప్రాణం పోయింది. ఎంతకీ చావడం లేదని అజాతశత్రువే తండ్రికి విషం పెట్టించాడని జనం చెవులు కొరుక్కుంటున్నారు కూడా.
భగవానుడి హత్యకి తను వేసిన ఎత్తు పారనందుకు తర్వాత ప్రయత్నంగా దేవదత్తుడు, నలగిరి అనే ఏనుగుకి మద్యం తాగించి ఆయన మీదకి ఉసిగొల్పాడు. కానీ భగవానుడు ఆ ఏనుగు వచ్చే దారిలో ప్రశాంతంగా నిలబడి దాన్ని తాకగానే, అది మత్తు దిగిపోయి మోకరిల్లింది. ఈ ప్రయత్నం కూడా నిష్ఫలం అయ్యాక దేవదత్తుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కనీసం బింబిసారుడి గొడవ వదిలింది.
అన్నీ చూసిన ఆనందుడు అడిగాడు, “భగవన్, దేవదత్తుడే ఈ అనర్థాలన్నిటికీ మూలమని స్పష్టంగా తెలుస్తోంది. అజాతశత్రువును రెచ్చగొట్టాడు. మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు. భిక్షుసంఘంలో చీలిక తేవాలనుకున్నాడు. ఇలాంటి కర్మలకు ఫలితం ఏమిటి?”
“దేవదత్తుడు స్వహస్తాలతో తీవ్రమైన అకుశల కర్మలను కూడబెట్టుకున్నాడు. అజాతశత్రువుని పితృహత్యకి ప్రేరేపించడం, భిక్షుసంఘాన్ని చీల్చే ప్రయత్నం, ఉత్పలవర్ణ అనే అర్హతురాలిని చంపడం అనే పాతకాలకి, అవీచీ నరకమే గతి. అయితే అతను చేసిన కొద్ది పుణ్యంవల్ల మరోసారి జన్మ ఎత్తి అర్హతుడు అవుతాడు.”
“ఇందులో పాపం ఏదీ అజాతశత్రువుకి చుట్టుకోదా?”
“తప్పకుండా చుట్టుకుంటుంది. రాజ్యాధికారం అనేది ఒక మత్తు. ఎలాగో ఒకలా దాన్ని చేజిక్కించుకోవాలనే విపరీతమైన కోరికతో తండ్రిని చంపిన అజాతశత్రువుని, అతని కొడుకు కూడా భవిష్యత్తులో అలాగే హత్య చేస్తాడు. ఆ తర్వాత వచ్చే తరాల్లో కూడా కొడుకులు తండ్రులను చంపుకుంటూ ఈ మగధ సింహాసనాన్ని రక్తంతో తడుపుతూనే ఉంటారు. కొన్నాళ్ళకి ఈ పితృఘాతకుల పాలనను చూసి ప్రజలు ఆగ్రహించి, ఈ హర్యంక వంశపు రాజులను గద్దె దించుతారు. యథా రాజా తథా ప్రజా. అందుకే నేను ఎప్పుడూ చెప్పేది, కోరికలను వదులుకోమని. మిమ్మల్ని ఎవరు వదిలినా, ప్రాణాంతకమైనా సరే, ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదలవద్దు.”
భగవానుడు సుదూర భవిష్యత్తును దర్శిస్తున్నాడని గ్రహించాడు ఆనందుడు. బుద్ధుని ముఖంలో ప్రశాంతత.
[గమనిక: బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడి నోటి మాట అక్షరసత్యమైంది. బింబిసారుడి చావు తర్వాత హర్యంక వంశంలో వరుస పితృహత్యలు జరిగి, ప్రజాగ్రహంతో చివరకు ఆ వంశపాలన అంతమైంది — రచయిత]