ఒకానొక నిద్రించేచోటు!

ఒకప్పుడు ఇల్లంటే
ఆత్మీయత అలమిన అందమైన లోగిలి
అరమరికలు ఎరుగని నిండు వెన్నెల వాకిలి
ఆజన్మాంతం అల్లుకున్న బంధాల పందిరి
తరం నుంచి తరానికి బదిలీ అయ్యే ప్రాణస్పందన!

కానీ ఇప్పుడు
ప్రాణంలేని యంత్రాలతో నింపిన కాంక్రీటు కీకారణ్యం
కలిసున్నా కనిపించని కంచెలతో కట్టిన ఏకాంత ద్వీపం
స్మార్ట్ ఫోన్ తెరపై వెచ్చదనం వెతుక్కునే
అస్థిపంజరం!

కీ ఇస్తేగానీ ఆడని తాతయ్య గడియారం
నాయనమ్మ కబుర్లు చెప్పే చెక్క ఉయ్యాల
నాన్న కునుకు తీసే ఆరాం కుర్చీ
అమ్మ పట్టుచీరల బీరువాలో దాచిన సంపెగల పరిమళాలు
ఇప్పటి ఇళ్ళలో ఇలాంటి జ్ఞాపకాల పేటికల
ఆనవాళ్ళే కానరావు.

ఇప్పుడు బంధాలన్నీ వాడిపారేసే వస్తువులే!
గతంతో పేగుబంధం తెంచేసి
భవితతో అనుబంధం చిదిమేసి
నిర్లిప్తత ఆవహించిన అనామక మేఘాలం మనం!

ఆర్ద్రత అడుగంటిన ఉదాసీన గాలివాటంలో
మాటిమాటికీ గూడు మార్చడం ఇప్పుడు
శిశిరంలో కొమ్మనొదిలే పండుటాకు ప్రయాణమంత తేలిక.
ఏ మమకార గురుత్వాకర్షణా లాగని నిర్లిప్త గమనం.

ఇప్పుడు ఇల్లంటే
పగలంతా అలసి సొలసి
రాత్రికి వాలిపోయే వింత స్థావరం.
ఇక్కడ విశ్రమించేవి ప్రాణాలు కావు.
రేపు ఉదయం నడవాల్సిన యంత్రాలు.

అవును!
ఇప్పుడు ఇల్లంటే
జడదేహాలకు సుషుప్తిని ప్రసాదించే
స్మృతి విహీన శయనాగారం!