బాలమురళి – స్మృతి సరళి

[జూలై 6 – అజరామరమైన సంగీతాన్ని అందించిన విద్వన్మణి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జన్మదినం సందర్భంగా — సం.]

బాలమురళి గానవాహిని మాధురుల్
విశ్వనాథ కావ్యభాస్వరములు
రేల్బవళ్ళుగ నమరినవి బాల్యమునుండి
రామచంద్ర పుత్ర! రామభద్ర!

(ఈమాట, మే 2017).

1973లో విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి పాతికేళ్ళు నిండిన సందర్భంలో బాలమురళి చేసిన కచేరీని విశాఖపట్నంలో రేడియోలోనే విన్నాను. అందులో ఆయన “గాంగేయభూషిణి” అనే అరుదైన రాగంలో రాగాలాపన చేస్తున్నారు. సభలో శ్రోతగా కూర్చున్న కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆ గానప్రవాహానికి ఎంతగానో పరవశించిపోయారు. బాలమురళి రాగాలాపన ముగించి త్యాగరాజస్వామి వారి ఎవ్వరే రామయ్య కృతిని అందుకోబోయే తరుణంలో, విశ్వనాథ వారు చేతులెత్తి సైగ చేసి, మాట్లాడటానికి వేదిక పైకి వచ్చారు. అప్పుడు ఆయన బాలమురళిని అభినందిస్తూ ఆశువుగా పద్యం చెప్పారట. అప్పుడు పాడినట్టుగా చెప్పిన ‘శ్రీ రమ్యచిత్తాలంకారస్వరూపా!’ అన్న కృతిగానంతోనే రెండు రోజుల తర్వాత విశాఖపట్నంలో నేను హాజరు అయిన కచేరీని మొదలుబెట్టిన గుర్తు.

సం. 1956 లో బెజవాడ ఇస్లాంపేటలో ఉన్న ఒక మరీ పెద్ద అద్దె ఇంటినుంచి సత్యనారాయణపురంలోని సొంత ఇంటికి మా నాన్నగారు తన ఉమ్మడి కుటుంబంతో మారారు. ఇస్లాంపేటలో ఉన్న రోజుల్లోనే మా ఇంట్లో టెలిఫోనూ, రేడియో (జి.ఇ) ఉండేవి. రేడియో వినటం – మా ఇంట్లోనే తిష్ట వేసిన ఒక దూరపు బంధువు కారణంగా రేడియో సిలోన్ బినాకా గీత్‌మాలాతో సహా – అప్పుడే నాకు అలవాటయింది.

నాన్నగారు సత్యనారాయణపురంలో మా ఇంటికి బాగా దగ్గరగా ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఐదో క్లాస్‌లో నన్ను చేర్పించారు. సత్యనారాయణపురం వచ్చిన తర్వాత రేడియోలో ఎక్కువగా పరిచయమైన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడనుండి ప్రసారమవుతూ ఉన్న ‘భక్తిరంజని’. ఆ సుప్రభాత కార్యక్రమాన్ని ఆకాశవాణిలో ఆవిష్కరించినది బాలమురళేనని చెబుతారు. ఆ కార్యక్రమం వినటమే ఆయనతో మొదటి పరిచయం.

నేను ఫస్ట్ ఫాం (ఆరవ తరగతి) నుంచి SSLC (11 వ తరగతి) వరకూ 1957-63 లలో సత్యనారాయణపురంలో AKTPMH స్కూల్‌గా ప్రసిధ్ధమైన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నాను. మా ఇంటినుంచి బడికి మహా అయితే పది, పన్నెండు నిమిషాల నడక. పొద్దున పదిన్నరకు పాఠాలు మొదలు. పదికి ఫస్ట్ బెల్ విన్న తర్వాత బయలుదేరి వెళ్ళేవాణ్ణి.

మా స్కూల్ మెయిన్ గేట్‌నుంచి ఆ ఇంటికి ఒక నిమిషంన్నర నడక. ఆ ఇంటి గేట్ పక్కన ప్రహరీ గోడకు ఉన్న పలకలమీద మంగళంపల్లి పట్టాభిరామయ్య అని రాసి ఉండేది. అది బాలమురళి తండ్రిగారిల్లు. ఆ ఇంటి వరండాలో అప్పుడప్పుడు పచార్లు చేస్తున్న బాలమురళీకృష్ణను చూసిన మంచి గుర్తే ఉంది నాకింకా…

మా ఇంటికి పక్క పెద్ద వీధి, శివాలయం వీధిలో వైణికులు శ్రీ కంభంపాటి అక్కాజీరావు ఉండేవారు. మా ఇంటికి బాగా దగ్గరలో మల్లిక్ (అదివో అల్లదివో హరివాసము) కొన్నాళ్ళు ఉన్నారు. మా స్కూల్‌కు కూతవేటు దూరంలో శ్రీ ఏడిద కామేశ్వరరావుగారు ఉండేవారు.

మరికొన్ని వివరాలు చెప్పనిస్తే, సినిమాల్లో నటించిన సుబ్బరాయశర్మ నాకు స్కూల్ సీనియర్. సుత్తివేలుతో నటించిన సుత్తి వీరభద్రరావూ నేనూ, కొన్ని హైస్కూల్ తరగతుల్లో నేనున్న సెక్షన్‌లోనే, పక్కపక్కన కూర్చునే వాళ్ళం. అప్పుడప్పుడు కొన్ని క్లాసుల్లో నేల మీద. SSLCలో పెద్ద పరీక్షల్లో నా నంబర్ 18108. భద్రంది 18110. పట్టాభిరామయ్యగారి ఇంటికి ఎదురు వరసలో రేలంగి, సూరిబాబు, CSR ఆంజనేయులుగార్ల ఇళ్ళు. ఆ వెనుక వీధిలో కన్నాంబగారి ఇల్లు. అక్కాజీరావుగారు బాలమురళి మొట్టమొదటి కచేరీలో వీణా సహకార వాదనం చేశారని విన్నాను.

వింజమూరి సూర్య సుబ్బలక్ష్మి ఫోర్త్ ఫారంలో నా క్లాస్‌మేట్. ఆ అమ్మాయి విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే పిల్లల కార్యక్రమాల్లో పాటలు పాడుతుండేది. ఆ కార్యక్రమాలు ఆ అమ్మాయి పాటతోనే మొదలయ్యేవి చాలాసార్లు. (ఆ అమ్మాయి పాడిన “అక్షరాలూ దిద్దు నాకూ ఆటబొమ్మలెందుకింక, అబ్బిగాడికిచ్చి వేస్త”, “సిపాయి ఎక్కేది ఎర్రా గుర్రం, మా పాపాయి ఎక్కేది కొయ్య గుర్రం” అన్న పాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. (‘వాటిని సంపాయించగలరా!’ అని శ్రీ పరుచూరిని ఈమాట ద్వారా అడిగాను కూడా). సుబ్బలక్ష్మి ఒక పొద్దున పూట క్లాస్‌రూమ్‌లో ఒక్కణ్ణే కూచుని ఉన్న నన్ను “వాసూ! నాతో రా,” అని పిలిచి స్కూల్‌నుంచి కామేశ్వరరావుగారింటికి తీసుకుని వెళ్ళింది.

అప్పుడు ఆయనొక పడక్కుర్చీలో కూర్చుని తన ముందు చాప మీద కూర్చున్న ఐదారుగురు పిల్లలతో నాటక సంభాషణలేవో చదివిస్తున్నారు. సుబ్బలక్ష్మి ఆయనతో, “ఈ అబ్బాయి నా క్లాస్‌మేట్ వాసుదేవరావు. ఈ అబ్బాయికి ఒక పోర్షన్ ఇవ్వండి అన్నయ్యగారూ!” అన్నది. ఆయన ఆమెను ప్రశ్నలేవీ అడగకుండా నన్ను నా గురించి ఏదైనా చెప్పమని, నేను చెప్పింది విని, నాకు – రెండంటే రెండు చిన్న సంభాషణలున్న ఒక రాక్షసి బంటు, ‘భేతాళుడి’ పాత్ర ఇచ్చారు. ఆ నాటికలో నేను మైకు ముందు నుంచుని చెప్పిన భేతాళుడి మాటలు నాకు ఇప్పటికీ గుర్తే.

ఈ పై వివరం చెప్పడం ఎందుకంటే, బాలమురళి ఆ రోజుల్లో విజయవాడ రేడియో స్టేషన్‌లో సంగీత విభాగాన్ని నిర్వహిస్తుండేవారు. ఆ భేతాళుడి పాత్రతో మొదలై విజయవాడ ఆకాశవాణిలో పిల్లల కార్యక్రమాలలో నాకు గొంతు వేషాలు చాలా వచ్చాయి, లీడ్ రోల్స్‌తో సహా. (కొన్ని కార్యక్రమాలకు తెన్నేటి హేమలతగారిని అనౌన్సరుగా చూశాను, విన్నాను. మైకులో ఆమె గొంతు పరమాద్భుతం). ఆ విధంగా బాలమురళిని తరచూ చూస్తుండటం జరుగుతుండేది. ఒకటి రెండుసార్లు బాలమురళి, ‘మురళి మామయ్య’గా పిల్లల కార్యక్రమాలకు వచ్చి సంగీతం గురించి చెబుతుండేవారు. అప్పుడాయన ఏమి చెప్పారో నాకు ఒక ముక్క గుర్తు లేదు.

మా స్కూల్‌కు మెయిన్ గేట్‌తోపాటు ఉన్న మరో పక్క గేట్‌లోంచి బయటకు వస్తే లైబ్రరీ వీధిలోకి వచ్చేవాళ్ళం. ఆ వీథికి ఒక వైపు అంచున మా స్కూల్. ఆ అంచుకు దగ్గరగా కృష్ణాజిల్లా లోకల్ లైబ్రరీ అథారిటీ (LLA) శాఖ ఉండేది. శుక్రవారాల శలవుతో. ఆ వీథి మరో చివర ఆంధ్రరత్న పార్క్ వైపు, సోమవారాల శలవుతో, మునిసిపల్ గ్రంథాలయ శాఖ ఒకటి ఉండేది. నా హైస్కూల్ రోజుల్లో – ముఖ్యంగా క్రికెట్ ఆడుకోలేని వానాకాలాల్లో, మరీ ఎండలుగా ఉన్న ఎండాకాలం శలవల రోజుల్లో నేను వాటిల్లోనే కాలం గడిపేవాణ్ణి; ఎక్కువగా తెలుగు డిటెక్టివ్ నవలలు ఒకదాని తర్వాత ఒకటిగా చదివేస్తూ. శ్రీశ్రీ ఒక గేయంలో చెప్పిన – ‘వాడే వీడు’ పాంచకడీ దేవ్-ను అప్పుడే LLA లో చదివాను.

ఆ రోజుల్లోనే నా రెండో చెల్లెలు ఇంటి దగ్గర సంగీతం – గాత్రమూ, వీణా – నేర్చుకునేది. ఆమె టీచర్ – బాలమురళి సహాధ్యాయి శ్రీ లంకా వెంకటేశ్వర్లు. అలా బాలమురళి వివరాలు కొన్ని వారి దగ్గర వినటమూ ఉండేది.

1968 జులైలో MSc చదువుకి విశాఖపట్నం వెళ్ళిపోయాను. (వచ్చేశాను). అయినా నేను యూనివర్సిటీ హాస్టల్లో లేను. ఒక క్లాస్‌మేట్‌తో కలిసి కృష్ణనగర్లో ఒక ప్రైవేట్ రూమ్‌లో ఉన్నాను. ఆ రెండేళ్ళలో రెండో మూడో గదులు మారినా ఉన్నది ఆ ప్రాంతంలోనే. అక్కడే కలెక్టర్ ఆఫీస్. ఆ ఆవరణలో ఉన్న వివేకానంద హాల్లో సంగీత కచేరీలు జరుగుతుండేవి. నేనా కచేరీలకు వెళ్తూ ఉండేవాణ్ణి. వెళ్ళని కచేరీ ఒకటి నాకు మరీ గుర్తు. MSc ఫైనల్ ఎగ్జామ్స్ రోజుల్లో జరిగిన MS సుబ్బలక్ష్మిగారి కచేరి.

1970 లో నా MSc అయిపోయిన తర్వాత 1971 లో యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలరుగా చేరాను. అప్పుడూ ఆ ప్రాంతంలోనే నా నివాసం. భారతి గానసభ సంగీత కచేరీలకు వెళ్ళటం ఒక అలవాటైపోయింది. దాంతో ముళ్ళపూడి శ్రీరామమూర్తివంటి లోకల్ విద్వాంసులతో పరిచయమవటమూనూ.

శ్రీరామమూర్తిగారు చెప్పిన విషయం. మద్రాస్‌లో బాలమురళికి ఒక కచేరీలో సహకార వాద్యానికై చెన్నై వెళ్ళారట. ఆ రోజు ఉదయాన బాలమురళితో మాట్లాడటానికి, బాలమురళి ఇంటి ముందుగదిలో కూచుని వేచి ఉన్నారట శ్రీరామమూర్తీ, విశాఖకే చెందిన వయొలిన్ విద్వాంసులు శ్రీ ఎన్ సి హెచ్ కృష్ణమాచార్యులూ. బాలమురళి పైనుంచి మెట్లు దిగి వస్తూనే కృష్ణమాచార్యులతో “శ్రీరామమూర్తిలాగా మృదంగం వాయించనా!” అంటూ వాయించారట.

బాలమురళి – నేదునూరి ఒక వ్యత్యాసం: ఆ విశాఖపట్నం రోజుల్లో వివేకానంద హాల్లో జరిగిన నేదునూరి కచేరికి వెళ్ళాను. వారు పాడే రామదాసు కీర్తన ‘ఏమయ్య రామ!‘ మొదటిసారి అప్పుడే విన్నాను. నేదునూరి ఖరహరప్రియలో ‘సౌమిత్రి భాగ్యమే‘ పాడుతుండగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఏమీ తొణక్కుండా నేదునూరి పాడటం కొనసాగించారు. అదే హల్లో కొంతకాలం తర్వాత బాలమురళి చేసిన ఒక కచేరీలో ఆయన నెరవు చేస్తున్న స్వరప్రస్తార సమయంలో కరెంటు పోయింది. బాలమురళి అరనిమిషం సేపు “స, సరీ, సరే” అని ఆపేశారు.

సహజంగానే అప్పుడప్పుడు బెజవాడలో మా యింటికి వెళ్తుండే వాణ్ణి. బాలమురళి గౌరవార్థం లైబ్రరీ వీధిని మంగళంపల్లి బాలమురళి వీధిగా మార్చిన సందర్భంలో నేను ఆ నామకరణోత్సవంలో ఒక ప్రేక్షకునిగా అక్కడ ఉండటం అనుకోకుండా జరిగిన విషయం.

తరువాత కొద్దికాలంలోనే నా ఉద్యోగం గూడా విశాఖపట్నంలోనే కావడంతో నేనక్కడే ఉండిపోయాను. ఒక రోజున వార్తా పత్రికలో పట్టాభిరామయ్యగారు స్వర్గస్తులైనారన్న వార్త చదివి కొంత విచారానికి లోనయ్యాను – హైస్కూల్ రోజుల్ని తలుచుకుంటూ.

రెండు మూడు రోజుల తర్వాత నేను ఒక విదేశీ కాన్ఫరెన్స్‌కి ట్రావెల్ ఫండ్స్ కోసం ఢిల్లీ వెళ్ళవలసి వచ్చి ట్రైన్‌లో వెళ్తున్నాను. రాత్రి పదకొండు గంటలు దాటింది. విజయవాడ స్టేషన్ వస్తోంది. ఆరో, ఏడో నెంబర్ ప్లాట్ఫారం మీద ఆగడానికి ట్రైన్ మెల్లిగా నడుస్తోంది. అక్కడ ట్రైన్ కనీసం ఇరవై నిమిషాలు ఆగుతుంది కదా అని ట్రైన్ దిగి ప్లాట్ఫారం మీద కాసేపు నడుద్దామని బోగీ తలుపు దగ్గర నుంచున్నాను. ప్లాట్ఫారం మీద గోడకు ఆనుకుని నుంచుని బాలమురళీ, అన్నవరపూ కనబడ్డారు. ఇద్దరూ బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. వారివద్దకు వెళ్ళి నమస్కరించి బాలమురళిని పలకరించి నా సానుభూతిని తెలుపుకున్నాను.

సందర్భం ఏదో గుర్తుకు రావటం లేదు – పారుపల్లి వారి జయంతి సందర్భమేమో – విజయవాడలో తుమ్మలపల్లి వారి హాల్లో బాలమురళి ప్రసంగించారు. ఆ కార్యక్రమానికి ఆయనను గాంధీనగరంనుంచి కారులో డ్రైవ్ చెసుకూంటూ సభకు తీసుకొచ్చింది ‘ముత్యాలముగ్గు’లో నటించిన కొత్త హీరో.

ఆ సభలో బాలమురళి చెప్పిన ఒక విషయం గుర్తుచేసుకుంటాను. మహతి, రోహిణివంటి కొత్త రాగాలను బాలమురళి సృష్టించటమేమిటి, ఆ రాగాలూ ఆ స్వరమేళనలూ ఎప్పటినుంచో ఉన్నాయని కొందరు ఒక వాదన లేవనెత్తేరని చెబుతూ, సభని ఒక్క నిముషం సేపు నిశ్శబ్దంగా ఉండమని కోరారు. అంతే. గుండుసూది కింద బడితే అందరికీ వినబడేంతగా సభ నిశ్శబ్దమయిపోయింది. నిమిషం గడవగానే ఆయన “నిశ్శబ్దం విశ్వంలో ఎప్పణ్ణించో ఉంది. కానీ ఈ హాల్లో నిశ్శబ్దాన్ని ఇప్పుడు నేను సృష్టించాను,” అన్నారు. ఆ సభలోనే ఆయన చెప్పిన మరొక విషయం: కొన్ని దేశాల సంగీతాలు ఒకటి, రెండు రాగాలకు పరిమితమైనవేననీ, ఉదాహరణకు, చైనా సంగీతమంతా మోహన రాగమేననీ, అరబ్బులది వకుళాభరణమేననీ అన్నారు. వకుళాభరణం పాడవలసినదిగా శ్రీ శ్రీధర్ అభ్యర్ధించారు. “ఇప్పుడు ఈ ప్రసంగంలో కాదు, తర్వాత కచేరీలో పాడతా” అని చెప్పి పాడిన గుర్తు.

బాలమురళి విజయవాడ ఆకాశవాణిలో పనిచేస్తున్నపుడు – ఉద్యోగనిబంధనలలో ఆస్థాన సంగీత విద్వాంసులకు బయట కచేరీలు కొన్నే చేయాలని పరిమితి ఉండేది. అప్పటి ఆకాశవాణి విజయవాడ డైరక్టర్ ఒక రోజున బాలమురళిని తన ఆఫీస్‌కి పిలిచి “మీరు అనుమతి లేకుండా మొన్న బయట కచేరీ ఎందుకు చేశారు?” అని అడిగారు.”లేదండీ, నేనీమధ్య బయట కచేరీ ఏదీ చేయలేదే”. డైరక్టర్: “నిన్న నాకు ఒకరు బాలమురళి బాగా పాడేరని చెప్పారు.” “అదా! నేను ఇంట్లో ఏదో పాడుకుంటున్నప్పుడు వారు వచ్చారు”.

ఇదీ మరో సందర్భంలో వారు చెప్పినదే.

1977 మార్చ్ 6 ఆదివారం సాయత్రం కలెక్టర్ ఆఫీస్‌లో ఉన్న వివేకానంద హాల్లో – బాలమురళి కచేరీ బాగా గుర్తు. తన కచేరీల్లో ఇంటర్వల్ ఇవ్వటం అన్న ఆచారం ఒకటుంది గదా! ఆ ఆదివారం కచేరీకి హాలు కిక్కిరిసి ఉంది. ఇంటర్వల్‌లో ఆయన బయటకు వెళ్ళారు. హాలు కొంత ఖాళీ అయిందిగానీ లోపలికి వెళ్ళగలిగేటట్టుగా మాత్రం లేదు. నేను వేదికకు దగ్గరగా ఉన్న – గాయకుల ద్వారానికి ఆనుకుని అలాగే ఉండిపోయాను. కొద్దిసేపటికి నా వీపు మీద ఒక చేయి పడి నన్ను మృదువుగా పక్కకు నెట్టింది. చూద్దును: బాలమురళి నన్ను చూసి ఒక చిన్న నవ్వుతో స్టేజ్ మీదకు వెళ్ళిపోయారు.

మరొక ఇంటర్వల్ సంగతి: అభేరి ‘నగుమోము’ విస్తారంగా పాడి ఆగదేమోననిపించిన కరతాళధ్వనుల స్పందనకు ఒకసారి తలవంచి, “తర్వాత” అని కవ్వింపుగా ఒక అరక్షణం ఆగి, “ఇంటర్వల్” అన్నారు బాలమురళి. శ్రోతలం చాలామందిమి బయటకు వచ్చాం. బయట కూడా రద్దీగానేవుంది. లోపల చోటు లేకపోవటంవల్ల బయటనే నుంచుని వింటున్న శ్రోతలు చాలామంది ఉన్నారు. ఒక వయసు పైబడ్డ మహిళ అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నారు. నిర్వాహకులు లోపల ఖాళీ లేకపోవడంతో ఆమెకు ఆ సదుపాయం కల్పించినారేమో. బాలమురళి మెల్లిగా నడుస్తూ అటువైపు చూసి ఆమెకు దగ్గరగా వెళ్ళి గౌరవంగా తలవంచారు. నేను అక్కడే ఉన్నాను. ఆమె బాలమురళితో, “ఒకసారి పాడినట్టుగా మరొకసారి పాడరుగదా!” అనటం విన్నాను. బాలమురళి చిరునవ్వుతో ముందుకు నడిచారు.

ఒక్క నిముషం: అదే హాల్లో జరిగిన శ్రీ హరిప్రసాద్ చౌరసియా కచేరీలూ, కుమారి పర్వీన్ సుల్తానాగారి కచేరీలూ విన్నాను. ఒక చౌరాసియా కచేరీలో ఆయన, “ఇంటర్వల్ కహేఁ?” అనటం గూడా గుర్తు. అలాగే ఆ హాల్లో నేను విన్న శ్రీ చెంబై కచేరీ గురించి చెప్పడం భావ్యమే అనుకుంటాను. ఎందుకంటే బాలమురళి కాలికి గండపెండేరం (బంగారు కంకణం) తొడిగింది చెంబై అని బాలమురళి చెప్పినట్టు గుర్తు.

చెంబై కచేరీ అయిపోయింది. వారికి నమస్కరించుదామని, వారు వేదిక దిగటానికి తయారవుతూండగా వేదిక దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఇద్దరు పదహారూ – పద్దెనిమిది సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు నుంచుని ఉన్నారు. వాళ్ళవంక చూస్తున్నారు చెంబై. నాకు అర్థమయింది; వాళ్ళు చెంబైని “తిల్లానా ఏ రాగం?” అని అడిగినట్టున్నారు. ఆయన చెప్పారు. నాకు వినబడింది. వాళ్ళకు వినపడిందో లేదో నాకు తెలియలేదుగానీ వాళ్ళు మళ్ళీ అడిగారు. ఆయన మళ్ళీ చెప్పారు. వాళ్ళకు ఈసారీ తెలియలేదు. వాళ్ళు ‘మళ్ళీ చెప్పరా’ అని అడుగుతున్నట్టుగా అక్కడే అలాగే నుంచున్నారు. చెంబై, “అడత్త స్టేషన్” అన్నారు పిల్లలు తెల్లమొగం వేశారు. అయినా వాళ్ళకు అర్థం అవలేదని ఆయనకు అర్థమై నవ్వుతూ ‘విజయ నాగరి” అన్నారు.

విశాఖపట్నంనుంచి మా సత్యనారాయణపురం ఇంటికి వెళ్ళటానికి సాధారణంగా బెజవాడ పెద్ద స్టేషన్‌లో దిగి వెళ్ళేవాణ్ణి. ఒకసారి పెద్ద స్టేషన్‌లో దిగి ఆటో ఎక్కాను. అక్కడికి దగ్గరలోనే ఉన్న రైల్వే వారి హల్లో మైకునుంచి బాలమురళి మాటలాడుతున్న గొంతు వినిపించింది. ఆగిపోయి ఆ సభ వైపు నడిచి – మళ్ళీ, కిక్కిరిసిపోయిన ఆ సభలో చివరగా నుంచున్నాను. అప్పుడు ఆయన, సంగీతం వినడం వైద్యంగా ఎలా పనిచేస్తుందో పరిశీలిస్తున్నానని చెబుతూ, ఒక సంఘటన గురించి చెప్పారు. ఒక మహిళ – బాలమురళి సంగీతాన్ని వినటం దైవారాధనగా భావించిన వ్యక్తియై ఉండాలి – తను చేయించుకోబోయే ఒక సర్జరీలో మత్తుమందు తీసుకోకుండా బాలమురళి రాగాలాపనను వినదలచుకున్నాననీ, అలా వినటానికై ఒక రాగాలాపనను రికార్డ్ చేసి పంపమని తనను కోరితే, ఆమె కోరిక మేరకు (ఆ సర్జరీ సందర్భానికి తగిన) ఒక రాగాన్ని ఆలపించి ఆమెకు పంపాననీ, ఆమె హాయిగా ఉన్నారనీ చెప్పారు. కానీ పంపినది ఏ రాగాలాపనో చెప్పనని కూడా అన్నారు.

అపూర్వరాగంగళ్ చిత్రంలో ఒక పాటను, బాలమురళి సృజన ఐన మహతి రాగంలో కూర్చడం ఎలా జరిగిందో ఒక ‘పాడుతా-తీయగా’ ఎపిసోడ్‌లో, ఆ చిత్ర సంగీత దర్శకుడు MS విశ్వనాథనే స్వయంగా చెప్పారు.

శ్రీ శివానందమూర్తి విశాఖపట్నంలో సంగీతానికై ఒక ట్రస్ట్ ఏర్పరచారు. ఆ ట్రస్ట్ వారు మొట్టమొదటగా లక్ష రూపాయల పురస్కారం ఇచ్చి సన్మానించిన విద్వాంసుడు బాలమురళి. ఆ సన్మానసభకు నేనొక ప్రేక్షక-శ్రోతను. నేదునూరివారు, తదితర ప్రముఖులు ఆ సభలో బాలమురళి విద్వత్తునీ, గాయకునిగా ఆయన వైశిష్ట్యాన్నీ ప్రశంసించారు. బాలమురళి స్పందన: “మాట్లాడిన వారందరూ పెద్దవారు. వారు అబద్ధాలు చెప్పేవారు గారు. ఎవరు సంగీతానికి కొత్తగా ఏ సభ పెట్టినా వారు ముందుగా నన్నే సన్మానిస్తారు. నా తరువాతి సన్మానితులకు నాకు ఇచ్చిన మొత్తంకన్నా ఎక్కువ ఇస్తారు…” ధోరణిలో సాగింది.

ఆంధ్ర విశ్వకళా పరిషత్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉత్సవ సందర్భంగా గుర్తు. ఒక సాయంత్రం సభలో నందమూరి తారక రామారావుగారు పూర్వవిద్యార్థిగా మాట్లాడారు. వేదిక మీద బాలమురళి కూడా ఉన్నారు. రామారావుగారు మాట్లాడి, అందరికీ ధన్యవాదాలు చెప్పి వెంటనే వెళ్లిపోయారు. తర్వాత బాలమురళి కచేరీ. నిర్వాహకులు గబగబా కచేరీకి అనుగుణంగా సభావేదికను మార్చారు. బాలమురళి “వారి (రామారావు గారి) వెనుకనే గదా మేము పాడేది” అని తన సలలిత రాగ సుధారస సారాన్ని వినిపించారు.

ఈటీవీకోసం శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన ‘పాడుతా తీయగా’లో న్యాయనిర్ణేతగా బాలమురళి వచ్చినప్పుడు, బాలసుబ్రమణ్యం గురించి చెప్పిన విషయం గురించి ఈమాటకు ఉత్తరాలలో రాసాను.

మళ్ళీ బాలమురళి-నేదునూరి: ఒక దగ్గరి స్నేహితుడి పెళ్ళికి చెన్నై వెళ్ళాను. నా భార్యతో. 1970ల చివరలో అనుకుంటాను. ఆడ పెళ్ళివాళ్ళ ఇల్లూ, బాలమురళి ఇల్లూ ఒకదానికొకటి బాగా దగ్గర. ఆ పెళ్ళిలో నేదునూరి కచేరీని బాలమురళికి దగ్గరగా కూర్చొని వినటం జరిగింది. ఇద్దరూ తెలుగువారి పుణ్యాన పుట్టిన గాయకులు, శాస్త్రజ్ఞులు. వారి వారి వైదుష్య వైవిధ్యాలతో భారతీయ సంప్రదాయ సంగీతం వింటూ పారలౌకికానందానుభవాన్ని పొందాలని కోరుకునే వారికి తదానందలబ్ధిని ప్రసాదించిన ఋషులు.

నేలమీదికొచ్చి ఒక మాట చెబుతాను. రాగం అంటే మనసుకు రంగు వేసేదని పెద్దలు చెప్పగా విన్నాను. బాలమురళి సృజన రాగాలకు రంగులేయగలిగినది. విశాఖపట్నంలో బాలమురళి ఒక కచేరీలో- కచేరీలో ఏదైనా ఒక రాగాన్ని దీర్ఘంగా ఆలాపించినపుడు, కచేరీ ముగిసిన కొన్ని గంటలదాకా ఆ తరంగాలు తన గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాయని చెప్పడం నేను విన్నాను.

ఒక రోజు విశాఖపట్నం ‘కళాభారతి’ హాల్లో బాలమురళి ప్రసంగం. ప్రసంగం అయిన తర్వాత ఆయన ఒక్కరే ఉండటం చూసి ఆయన పాదాలకు నమస్కరించాను. నమస్కరించడానికి వంగినప్పుడు నా చొక్కా జేబులో ఉన్న చిల్లర నాణేలు క్రింద పడ్డాయి. నేను వాటిని ఏరుకున్న తర్వాత “నేల మీద పడ్డ చిల్లరను ఏరుకోకూడదని తెలీదా?” అన్నారు. “తెలుసునండీ. కానీ అవి మీ పాదాల దగ్గర పడినవిగదా అని ఏరుకున్నాను,” అని జవాబిచ్చాను.

రాజకుమారుడు రామవర్మతో: “వర్మా! నాకు మోహనరాగం పాడటం ఇష్టం ఉండదు. అందులో మనీ లేదు,” అన్నారట. వైణికురాలు బేబీ గాయత్రి ఒకసారి బాలమురళిని భోజనానికి పిలుస్తూ “మీకు ఇష్టమైనవేవో చెప్పండి చేస్తాన”ని అన్నారు. బాలమురళి “నాకు చారు చాలా ఇష్టమమ్మా” అన్నారని ఆమె రాసిందే చదివాను.

భానుమతి బాలమురళిలతో తెలుగులో ఒక యుగళగీతం లేకపోవటం ఒక లోటేనేమో అనిపిస్తుంది నాకు. ఆయన ఎస్ వరలక్ష్మితో పాడిన సినిమా పాట చాలా బావుంటుంది. అన్నట్టు ఎస్ వరలక్ష్మి భానుమతి అభిమాన గాయని.

నాకు ఇష్టమైన మాటకారులు నలుగురిలో ముగ్గురు: మారడోనా, మహమ్మదాలీ, సునీల్ గావస్కర్, నాలుగు బాలమురళి. ఇందులో రాంకింగ్ ఏమీ లేదు. ఈ నలుగురిలో ఇద్దరు – బాలమురళి, గావస్కర్ ఆంధ్ర విశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణులు.

రచయిత పేరు మంజునాథ్ అని గుర్తు. ఆంగ్ల దినపత్రిక హిందూలో వరుసగా మూడు ఆదివారాల్లో కర్ణాటక సంగీత త్రిమూర్తులమీద వఛ్చిన మూడు వ్యాసాల తర్వాత, సంపాదకులు ‘వచ్చే ఆదివారంలో రాబోయే నాలుగో వ్యాసంతో ఈ వ్యాసపరంపర ముగుస్తుం’దని ప్రకటించారు. నేను పిసరు గర్వంతోనే రాస్తున్నాను: నాలుగోది బాలమురళి పైన అని అనుకున్నాను. అలాగే జరిగింది.

ఢిల్లీ నుంచి ప్రసారమయే ఆకాశవాణి సంగీత సమ్మేళనంలో జరిగిన బాలమురళి కచేరీ గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వ్రాస్తూ RM చల్లా “తానే రచించి, స్వరపరచిన ‘బృహదీశ్వర మహాదేవ’ కీర్తనను గానం చేస్తూ, బాలమురళి బృహదీశ్వరాలయ శిఖరాన్ని అధిరోహించారు!” అన్నారు. తర్వాత ఒక సందర్భంలో ఆ కీర్తన ఆవిర్భావాన్ని గురించి బాలమురళి మాట్లాడుతూ, ఆ ఆలయప్రదక్షిణతోబాటే తాను ఆ కీర్తన సాహిత్యరచన, స్వరనిర్మాణాన్ని మొదలుపెట్టి, ప్రదక్షిణ పూర్తయేసరికి కృతిని కూడా పూర్తి చేశానన్నారు. బాలమురళి తన గురించి కాకుండా, బృహదీశ్వరుని దయవల్లనే అలా సాధ్యపడింది అన్న భావంతో అలా అని ఉండవచ్చు.

బాలమురళి, వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసుడు దండమూడి రామమోహనరావు ‘విజయవాడ ట్రయో’గా ప్రసిద్ధికెక్కిన ప్రజ్ఞామూర్తులు. ఎన్నో కచేరీల్లో బాలమురళికి దండమూడి మృదంగ వాద్య సహకారాన్ని అందించారు. ఆయనకు గండపెండేరాన్ని తొడిగిన బాలమురళి, శ్రీ దండమూడికి రావలసినంత ఖ్యాతి రాలేదని కించపడ్డారు.

బాలమురళి ఇంటర్వ్యూలు వింటుంటే నాకు ఒకటి తెలిసిందనుకుంటాను. ఆయన పీక తీసేస్తామన్నా అబద్ధం చెప్పడు. అలాగే ఆయన చెప్పదలుచుకోని నిజాన్ని ఆయన గుండెల మీద కత్తిపెట్టి కూడా చెప్పించలేం. నా పిల్లలతోనూ, నా స్టూడెంట్స్‌తోనూ “ఎప్పుడూ అబద్ధం చెప్పకండి – అబద్ధం చెప్పద్దంటే నిజం చెప్పమని కాదు,” అని చెబుతూ ఉంటాను.

బాలమురళి పాట దూర దూరతీరాలకు పాకిందనేవారిని విన్నాను. వినటమే కాదు ఆయన తిల్లానాకు ఐరోపాలో (విదేశీ) యువతీ యువకులు నాట్యం చేయటాన్ని యూట్యూబ్‌లో చూశాను.

బాలమురళికి సంగీతం తెలియదనీ, సంగీతానికే బాలమురళి తెలుసనే వారాయన. నాకు సా-పా-సాలు తెలియవు కానీ బాలమురళి తెలుసు.

తర్వాత కొంతకాలానికి వారు (నిద్రలో) పరమపదం చెందారని విని దుఃఖం ఆపుకోలేక బెజవాడలో నా చిన్నన్నకు ఫోన్ చేశాను. వాడు ఫోన్‌లోనే భోరుమన్నాడు. “ఒక కచేరీ ఏర్పాటు విషయంలో నేను వారి ఇంటికి వెళ్ళారా. వారు నన్ను భోజనం చేసేదాకా వదిలి పెట్టలేదు,” అన్నాడు! ఇంక ఏం చెప్పగలను — మరొక బాలమురళి పుట్టడని శ్రీ ఇళయరాజా అన్న తర్వాత?

నా పెద్దన్న, సాహిత్య సాంస్కృతిక సంస్కార రంగాలలో నన్ను నా చిన్నతనంనుంచీ సాకుతున్నవాడు. ‘సమవర్తి’గా ‘ఈమాట’లో తన పద్యకవితలు ప్రకటించిన వాడు చెప్పింది:

స్వరసుస్పష్టత, రాగరమ్యత, కృతివ్యాహారమాధుర్యతా
చిరముద్రాక్షతవైఖరీ ప్రథిత వంశీ! నీదు సంగీతపుం
దరహాసస్నపితాశలం బరతు-నానానంది నాందీనట
ధ్ధరజూటోద్గత వారిధారగతి-హృద్యక్షుద్రఘంటారవ
స్ఫురదానర్తితబాలకృష్ణకరవంశ్యుద్గీత సౌందర్యముల్!!

స్వస్తి!

ఈ పై వ్యాసం పూర్తిగా నేను గుర్తుపెట్టుకున్న విధాన సంఘటనలను మనసులో ప్రోది చేసి రాసుకున్నది. వీటికి ఆధారాలూ దస్త్రాలూ ఏవీ లేవు. ఈ మాటల ఉద్దేశ్యం బాలమురళిని పూజ్యభావంతో గుర్తుచేసుకుందామనే. ఎవరినీ ఏ రకంగానూ కించపరచడానికి ఏ మాత్రమూ కాదు. బాలమురళి సంగీతాన్ని సర్వాంగసుందరంగా ‘ఈమాట’లో తన వ్యాసాలలో చిత్రించిన రోహిణీప్రసాద్ స్మృతికి నివాళులతో – రచయిత.


రచయిత తఃతః గురించి:

పెద్దగా ఏమీ లేదు -జస్ట్ ఎ కామన్ మాన్ -స్నే హితులనుంచి చాలా నేర్చుకున్నవాడు. క్రికెట్ , టేబుల్ టెన్నిస్ ఆడినవాడు.

 ...