ఆలాపన

ఇప్పటికీ ఒక సెలోఫేన్ చుట్టిన అట్ట
లోపల విగతాలు కాబోతున్న జీవాల పేజీలు
రంగు మార్చుకుని ముడతల్లో ముక్క వాసన వేస్తూ

ఇప్పటికీ ఒక నరం ఇంకా ప్లెక్ట్రమ్ కోసం
ఎదురు చూస్తూ ఆవిరినాపుకుంటూ
ఇప్పుడే ఒక తార తెగి ఆకసానికెగిసి టాటా కొడుతూ
కమాను రజను తగిలి ఖస్సుమన్న వయొలిన్
చివరి తలుపూ తట్టడానికి మనసు మూసుకుని
చిన్న రింగులోకి వేలు దూర్చుకుని పేలు మార్చుకుని
ఎన్ని జవాబులొచ్చినా
తంత్రి మీటుతూనే ఉంటుందెప్పుడూ

ఊహల్లో స్పృహల్లో స్తనాల మెరుపుల్లో
వనాల కేకల్లో కృతి పొంగుతూనే
ఉంటుందెప్పుడూ శ్రుతుల సమాగమాల్లో
నిశ్వాసల చేతుల్లో విశ్వాసాల ఆశల్లో
ఎట్లాగైనా సరే పట్టుకోవాలి పట్టు కావాలి ముట్టుకోవాలి
ముద్దెట్టుకోవాలి

బ్రష్ చేసినట్లే ఉండాలి తుడిచేసి కదిలి పోవాలి
ద్రవం యాసిడ్ కాక ముందే త్రేన్చేసి మింగేయాలి

దూసుకొచ్చే వాణ్ని చూసి పారిపోయిన ఎలుక
దారి తప్పిన కలల మీద పడిన మూత

ఇప్పటికీ ఎప్పటికీ ప్రశ్న కదులుతూనే ఉంటుంది
థింకర్ బుగ్గన చెయ్యి తియ్యమని చాచమని
ఫెఠిల్లున తడుతూనే ఉంటుంది
మిణుకు మిణుకుమంటూనే ఉంటుంది
ఇప్పటికీ!


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...