కళాసాగరం కర్ణాటకం-4

ఉడిపినుంచి శృంగేరి చేరడానికి దాదాపు మూడు గంటలు పట్టింది. దూరం ఎనభై కిలోమీటర్లే అయినా, శృంగేరికి చేరే కొద్దీ ఘాట్ రోడ్డు మీద పయనించాలి. అడవిదారి, కొండ మలుపులు.

‘శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం’ ఉంది శృంగేరిలో. హైందవ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉండే ఈ పీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించినది. ఈ పీఠానికి ప్రస్తుతపు (36వ) అధిపతి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి. ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి. ఈ ఇద్దరూ తెలుగువారే కావడం ఒక యాదృచ్ఛిక విశేషం.


శృంగేరి ఆలయం

దివ్యమైన పెద్ద గోపురం ఆ ఆలయ ప్రాంగణానికి ఒక కిరీటంలా అమరింది. గోపురానికి పక్కనే ఆలయపు కార్యాలయం. అక్కడినుంచి మాకు ఒక గది కేటాయించుకున్నాం. వీలయినంత త్వరగా, తగిన బట్టలు ధరించి ఆలయంలోకి ప్రవేశించాం.

ఆ ఆవరణలో చెప్పులు నిషిద్ధం. అయినా, చెప్పులు అలవాటైన కాళ్ళకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ కలిగించని విధంగా, చిన్న మట్టి బెడ్డయినా లేకుండా ఆవరణ మొత్తం శుభ్రంగా ఉంది. ఇంకా సూర్యాస్తమయం కాలేదు. ఆవరణలోకి ప్రవేశించగానే కాళ్ళు కడుక్కునే ఏర్పాటు. ముందుకు అడుగులు వేస్తే, కుడి వైపున శ్రీ శారదాంబాలయం, ఇంకా ముందుకు చేరితే విద్యాశంకరాలయం… ఆ ఆలయాన్ని దాటితే, తుంగభద్రా నదిని దాటేందుకు ఒక సన్నటి అందమైన వంతెన. నదిని దాటితే, పీఠాధిపతుల నివాసప్రాంతం.

శృంగేరి అనే పేరు ‘ఋష్యశృంగగిరి’నుండి ఉత్పత్తి అయిందట. ఆదిశంకరాచార్యులు ధర్మప్రచారం కోసం దేశాటన జరుపుతూ ఇక్కడకు వచ్చినప్పుడు, ప్రసవిస్తున్న ఒక కప్పకు, ఒక పాము తన పడగతో నీడ పట్టటం చూశారట. సహజంగా పాముకు కప్ప ఆహారం. ఆ విధంగా బద్ధవైరులైన ఆ రెండు జీవాల మధ్యా పరస్పర మైత్రీభావమూ, పాముకు కప్పమీద దయాభావమూ ఉండటం చూశాక, ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైందని శంకరాచార్యులు భావించి, ఇక్కడే మొదటి మఠాన్ని స్థాపించారని స్థలపురాణం. ఆ తర్వాతే పూరీలో, కంచిలో, బదరీలో, ద్వారకలో మఠాలను స్థాపించారట.


విద్యాశంకరాలయం

విద్యాశంకరాలయం చోళ, ద్రావిడ, చాళుక్య శైలుల కలయికతో నిర్మితమైంది. ఎత్తైన వేదిక మీద నిలబడిన ఈ ఆలయం కూడా ఆధ్యాత్మికతను ప్రతిఫలించే శిల్పకళతో అలంకృతమైంది. ఆలయంలో పన్నెండు రాశిచక్ర స్తంభాలు ఉన్నాయనీ, వాటిమీద ఆయా నెలల్లో సూర్యకిరణాలు పడతాయనీ, అది ఈ ఆలయానికి మాత్రమే ఒనగూడిన విశేషమనీ అక్కడి సిబ్బందిలో ఒకరు వివరించారు. మా దంపతులిద్దరిదీ ధనూరాశి అని తెలుసుకుని, ఆ డిసెంబర్ నెలలో సూర్యకిరణాలు ప్రసరించే ధనూరాశి స్తంభాన్ని చూపాడతను.

సరస్వతీదేవి కొలువైన ఆలయం కాబట్టి, అక్కడకు వచ్చిన భక్తులు రామకోటి రాసేందుకు వీలుగా రూళ్ళ కాగితాలు అందజేసే ఏర్పాటు అక్కడ రెండు మూడు చోట్ల కనపడింది. అనేకమంది వాటిని వినియోగించుకుంటున్నారు కూడా.

పురాణాలు, ఆధ్యాత్మిక వాతావరణం సంగతెలా ఉన్నా, ఆ ఆవరణ మొత్తం ఒక ప్రశాంతత నెలకొని ఉంది.

ఏ ఆలయంలోకి వెళ్ళినప్పుడైనా నాలో కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. ఏది వాస్తవం? ఆలయమా? దైవమా? భక్తులా? వారి మనసుల్లోని ‘భక్తి’ అన్న భావమా? మనిషికి ఉపకరించేది, సాంత్వననిచ్చేది ఏది? ఆలయంలో ఉన్నది రాతి విగ్రహం కాదని, సాక్షాత్తూ దైవమేనని ఎప్పుడు నమ్మకంగా స్ఫురిస్తుంది? అలా స్ఫురించకపోవడం లోపమా? అపరాధమా? వీటన్నిటిలో పరమసత్యం ఏది? సందేహాలు వస్తున్నప్పటికీ, సమాధానాలను అస్పష్టత మంచుపొరలా కప్పి ఉన్నప్పటికీ, ఆ ఆలయంలో అలుముకున్న ప్రశాంతవాతావరణం మాత్రం, మాటల్లో చెప్పలేని విధంగా మనసును సేద దీర్చుతున్నట్లనిపించింది. బహుశా దైవత్వమంటే అదేనేమో! తర్కానికి అందని అనుభవాలవి!

మర్నాడు పొద్దున్నే హంపి దారి పట్టాం.

‘హంపి చూడాలంటే ఒక రోజు సరిపోదు. కనీసం రెండు రోజులుండాలి’ అని ఒక మిత్రుడి సలహా. దానికి తగ్గట్టుగా, రెండు రోజులు హంపిలో ఉన్న తర్వాతే తిరుగు ప్రయాణానికి వీలయేలా ప్రణాళిక వేసుకున్నాం. అది కూడా సరిపోదని హంపిలో గడుపుతున్నప్పుడు కానీ తెలియరాలేదు.

శృంగేరినుంచి ఉదయాన ఆరు గంటలకే బయల్దేరాం. తెలతెలవారుతోంది. కారును హంపి దారి పట్టించే ముందు, ఆలయానికి దగ్గర్లోనే ఒక చిన్న హోటల్లో కాఫీ తాగేందుకు ఆగాం. చలి పిసరంత ఎక్కువే అనిపిస్తోంది. మేమున్న వసతిగృహానికి పక్కనే మరో రెండు ధర్మసత్రాలున్నాయి. రెండిటి ముందూ కనీసం యాభై అరవైమంది స్కూలు పిల్లలు యూనిఫారాలు ధరించి, దర్శనంకోసం శారదాంబాలయంలోకి వెళ్లేందుకు సిద్ధంగా బారులు తీరుతున్నారు. వాళ్ళను టీచర్లు పర్యవేక్షిస్తున్నారు. వీధంతా ఆ పిల్లల కువకువలతో సందడిగా మారింది!

శృంగేరినుంచి హంపి దాదాపు 350 కిలోమీటర్లుంది. రెండు దారుల్లో హంపికి చేరవచ్చు. హొన్నవళ్ళి, అనంతనహళ్ళి, మరియమ్మనహళ్ళి, హొసపేటెల మీదుగా సాగేది ఒక దారి. ముత్తినకొప్ప, తిమ్మలాపుర మీదుగా సాగి హొసపేటె దగ్గర కలిసేది మరొకటి. ఊళ్ళ మధ్యనుంచి సాగే మొదటి దారి కాస్తంత నిడివి తక్కువ. రెండో దారిలో ఎక్కువ భాగం అడవిగుండా సాగుతుంది. గూగులమ్మ మొదటి దారినే ఎంచుకుంది.



హంపి

యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గౌరవాన్ని అందుకున్నది హంపి. ఇది విజయనగర సామ్రాజ్యం కన్నా పురాతనమైందట. ఇక్కడ విస్తరించిన అనేక ఆలయశిథిలాలను చూస్తే, హంపి ఒక మతపరమైన కేంద్రంగా కూడా కొనసాగిందని, ఇప్పటికీ కొనసాగుతోందని తెలుసుకోవచ్చు.

పురాణగాథలనుబట్టి చూస్తే, రామలక్ష్మణులు సీతాదేవి కోసం వెతుకుతూ హనుమంతుడినీ, సుగ్రీవుడినీ కలిసిన ప్రదేశం ఇదేనని, రామాయణంలో వర్ణించిన వానర రాజ్యం ‘కిష్కింధ’యే హంపి అని ఒక వాదన ఉంది. అతి పురాతనమైన ఇక్కడి విరూపాక్ష దేవాలయంలో పూజలు 7వ శతాబ్దంనుండి నిరంతరంగా జరుగుతున్నాయి. ఇక్కడి హేమకూట పర్వతం మీద తపస్సు చేసిన తర్వాతనే శివుడు విరూపాక్షుడిగా పంపాదేవిని – అంటే పార్వతీ దేవిని వివాహమాడాడని ఒక నమ్మకం ఉంది. తన మూడవ కంటితో మన్మథుణ్ణి భస్మం చేసిందీ అక్కడేనట. ఇక హంపీకి దగ్గర్లోని అంజనాద్రి కొండ, హనుమంతుని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.

చరిత్రపరంగా చూస్తే, దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు విజయనగర సామ్రాజ్యపు రాజధానిగానే కాక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లిన హంపిలో, విజయనగర రాజులు హరిహర, బుక్కరాయలు అద్భుతమైన దేవాలయాలెన్నో నిర్మించారు. ఇక్కడ పర్యటించిన పర్షియన్, యూరోపియన్, పోర్చుగీసు యాత్రికులు రచించిన చారిత్రక గ్రంథాల్లో, తుంగభద్ర నదికి దగ్గరగా దేవాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు, వాణిజ్యకేంద్రాలతో సంపన్నమైన ఒక గొప్ప నగరంగా హంపి విలసిల్లేదని పేర్కొన్నారు. కాలక్రమేణా విజయనగర సామ్రాజ్యం సుల్తానుల కూటమి చేతిలో ఓడినప్పుడు, ఈ నగరాన్ని ముస్లిం సైన్యాలు దోచుకుని ధ్వంసం చేశాయి. అలనాటి సైన్యక్రౌర్యానికి గుర్తుగా, ఇప్పటి హంపి శిథిలావస్థలో దర్శనమిస్తుంది.

హంపి చేరేసరికి మూడు కావస్తోంది. దారిలో ఒకచోట బ్రేక్‌ఫాస్ట్‌కోసం ఆగినప్పుడు బుక్ చేసుకున్న ‘హోమ్ స్టే’కి, రెండు మూడు ఇరుకు సందుల మలుపుల్లోంచి తిరిగి చేరుకున్నాం. అది పేరుకే హోమ్ స్టే. బాత్రూమ్ కలిసి ఉన్న ఒక్క చిన్న గది. మంచమూ, నిలువుటద్దమూ తప్ప మరేమీ లేదందులో. పైగా వాటి పరిశుభ్రత కూడా నిరాశ పరచింది. పోనీ మెయిన్ రోడ్డు మీద కాస్తంత మెరుగ్గా కనిపిస్తున్న మరొక చోటికి మారదామా అంటే, అప్పటికే రెండు రోజులకూ డబ్బు చెల్లించేశాం! మొత్తానికి అక్కడి మనిషిని బుజ్జగించి రూమ్‌ను సిద్ధం చేయించుకున్నాం. కాసేపటి తర్వాత, అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విరూపాక్షాలయానికి బయల్దేరాం.


విరూపాక్షాలయం ముందు

మేం వెళ్తున్న దారి, ఒక విశాలమైన రాతి గుట్ట మీదకు చేరింది, GPS పుణ్యమా అని! అక్కడొక చిన్నపాటి సత్రంలాంటి కట్టడం వద్ద కారు పార్క్ చేసి, గుట్ట కింద కనబడుతున్న విరూపాక్షాలయం వైపు దిగుతూ పోయాం. ఆలయం పల్లంలో ఉండటంవల్ల దూరం తెలియలేదుగానీ, దాదాపు రెండు ఫర్లాంగులు దిగాం. దిగడం తేలికే. మళ్ళీ ఎక్కడం కూడా ఉంటుందని స్ఫురించింది. ఈ కాస్తేగా, పర్వాలేదులెమ్మని ఒకళ్ళకొకళ్ళం ధైర్యం చెప్పుకున్నాం. దాదాపు 80 శాతం దిగిపోయాక తెలిసింది – ఆలయం తాలూకు పార్కింగ్ అక్కడికి అరకిలోమీటర్ దూరంలో ఉందనీ, సందర్శకులంతా అక్కడే బస్సులూ కార్లూ దిగి, నడిచి వస్తున్నారనీ.

ఆలయం ముందర ఒక చిన్న గుంపు. వాళ్ళ మధ్యలో ఒక ఏనుగు. ఆ ఏనుగుతో ఫోటోలు దిగడానికి చాలామంది పోటీలు పడుతున్నారు. మావటికి చిల్లర అందిస్తున్నారు. శ్రీమతి కూడా ఆ సంరంభంలో శక్తిమేరకు పాల్గొంది.

బేలూరు చెన్నకేశవాలయానికి ఉన్న రాజగోపురంవంటిదే ఈ ఆలయానికీ ఉంది. తొమ్మిది అంతస్తులు. పైకి పోతున్నకొద్దీ చిన్నవవుతున్నాయి. మొదటి అంతస్తు గోడలమీద చక్కటి శిల్పకళ. ఆ శిల్పాలలో దేవతల రూపాలే కాదు – మానవాకృతులు కూడా ఉన్నాయి. నివ్వెరపరచేలా, వాటిలో కొన్ని ఆకృతుల మర్మావయవాలు అతి స్పష్టంగా చెక్కి ఉన్నాయి. కొన్ని శిల్పాలు రతి భంగిమలను ప్రదర్శిస్తున్నాయి. ఇదేమిటి? ఆలయగోపురం మీద ఈ బొమ్మలేమిటి?


వివరణాత్మక శిల్పాలు

“యుక్తవయసులో స్త్రీ పురుషులకు ఒకరి శరీరనిర్మాణాల పట్ల మరొకరికి కుతూహలం ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చినపుడు వాళ్ళకు ఆ వివరాలు కూడా తెలిసి వచ్చి, వాళ్ళను పెడదారులు పట్టనివ్వకుండా సమాధానపరచడానికి ఇలాంటి శిల్పాలు ఏర్పాటు చేశారు,” అని ఓ గైడ్ వివరిస్తుండగా విన్నాం. చతుర్విధ పురుషార్థాల్లో ఒకటైన కామానికి హిందూ మతంలో కల్పించిన గౌరవప్రదమైన స్థానానికి సంకేతంగా ఆ మూర్తులను అక్కడ ఏర్పాటు చేశారని మరొక వివరణ కూడా ఉంది.

తుంగభద్రా నదీదేవత ‘పంప’. ఆమె భర్త ‘విరూపాక్షుడు’ అని పేరు కూడా ఉన్న శివుడి ఆలయం ఇది. రాజగోపురం దాటి లోపలకు చేరితే మరో చిన్న గోపురం. అందులోంచి విశాలమైన మండపంలోకి ప్రవేశించాం. ఆ మండపం కప్పు లోపలి వైపున శివ కల్యాణ ఘట్టాల చిత్రాలున్నాయి. బలమైన కాంతిపుంజాన్ని వెలువరిస్తున్న టార్చ్‌లైట్ సాయంతో ఆ చిత్రాల గురించి వివరిస్తున్నాడొక గైడ్. కాలపు తాకిడికి అస్పష్టమవుతున్నప్పటికీ, ఆ చిత్రాల శోభ ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది; అలరిస్తూనే ఉంటుంది.

ఆ మండపంనుంచి బయటకు వచ్చేక, ఆ ప్రాంగణంలోనే ఉన్న రెండుమూడు చిన్న చిన్న ఆలయాలను కూడా దర్శించుకున్నాం. ఒక చోట, ఒక గదిలోకి ప్రవేశించాం. ఆ గది గోడ మీద, ప్రధాన గోపుర దృశ్యం తలక్రిందులుగా ప్రతిఫలనం చెందుతోంది. ఆ గోడకు ఎదురుగా ఉన్న గోడకు ఒక చిన్న రంధ్రం. అది, ‘కెమెరా అబ్స్క్యూరా’ (Camera Obscura) అన్న ఒక సహజవిశేషం. ఆ చీకటి గదిలో, వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఒక చిన్న రంధ్రం గుండా సూర్యకాంతి ప్రసరించి, సుమారు 52 మీటర్ల ఎత్తైన గోపురపు ప్రతిబింబాన్ని, ఎదురు గోడ మీదకు తలక్రిందులుగా ప్రసరిస్తుంది.

గదిలోంచి బయటకు వస్తే, ఎదురుగా ఒక లోతైన పుష్కరిణి. అందులో నీరంతా ఆకుపచ్చగా పసరెక్కి వుంది. నీళ్ళలోకి సాగుతున్న మెట్ల మీద చిన్నా పెద్దా తాబేళ్లు; నీళ్ళలోంచి అప్పుడప్పుడూ తలలు బయటకు పెట్టి చూస్తున్న పెద్ద పెద్ద చేపలు.


హంపి బజారు

ఆలయం బయటకు వచ్చాం. ఎదురుగా, కుడి ఎడమ వైపుల ‘హంపి బజారు’. పదేసి అడుగుల పొడవూ వెడల్పూ ఉన్నట్లు తోచే మండపాలవంటి గదులు వరసగా దాదాపు కిలోమీటర్ పొడవున విస్తరించాయి. ఒకప్పుడు ఈ గదుల్లో పట్టువస్త్రాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలను రాశులు పోసి అమ్మేవారట!

ఆ వైభవం ఊహించుకున్నాను:

వేడి తగ్గుముఖం పట్టగా, మంద్రంగా వీస్తోన్న గాలి. ఎక్కడో నాట్య ప్రదర్శన జరుగుతున్నట్లు, ఉండీ ఉండీ వినిపిస్తున్న మృదంగనాదం. మండపాల్లో నేల మీద పరచిన తాటాకు చాపల మీద, మూటలు కట్టి తెచ్చిన ముత్యాలు, రత్నాలను రాశులుగా పోస్తున్న వర్తకులు. విరూపాక్షుడి దర్శనం కోసం వెళ్తున్న జంట. తల్లి కొంగు లాగుతూ తనకు ఎర్రగా మెరుస్తున్న ఆ రాయి కావాలని మారాం చేస్తోన్న పాప; అది రాయి కాదు, వజ్రమని గ్రహించి ‘ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళేటపుడు కొంటా’నని సముదాయిస్తున్న తల్లి. శేరు కెంపులు కొన్న యువతికి మరో అర్ధశేరు ముత్యాలు కూడా అమ్మజూపుతున్న వ్యాపారి. ఉన్నవాటిలో నదరుగా కనిపిస్తున్న పచ్చలు ఏరుకుని, వాటిని బంగారు తీగతో హారంగా అల్లమని చెప్తున్న ప్రౌఢ. కెంపులు కూర్చిన పొడవాటి హారం కుచద్వయానికి గుచ్చుకోకుండా అమరుతోందా లేదా అని చూసుకుంటూ సర్దుకుంటున్న వనిత. హారాన్నే చూస్తున్నాడో ఆమెనే చూస్తున్నాడోగానీ, మురిసిపోతున్న ఆమె భర్త! కొనే ఉద్దేశముందో లేదో తెలియనివ్వకుండా, పట్టుచీరను చేతుల్లోకి తీసుకుని పరిశీలిస్తున్న సుందరి. గొడుగు సరిగ్గా పట్టమని, వీవన సరిగ్గా వీచమని పరిచారికలను కంటి చూపుతోనే గదమాయిస్తూ మరకతాలను బేరమాడుతున్న యజమానురాలు. జంగిడితో తెచ్చిన మల్లెమాలలమ్ముతూ చిరునవ్వులూ విరజిమ్ముతున్న బాలిక. ముంతలతో చల్లని మజ్జిగ అందిస్తున్న వృద్ధ. మజ్జిగకన్నా చల్లగా ఉందావిడ చూపు. చీకటి పడ్డ తర్వాత వెలిగించే కాగడా కడ్డీలకు గుడ్డలు చుడుతూ, నూనె కుండలు సర్దుతూ సన్నాహాలు చేస్తున్న సేవకులు. అశ్వాల మీద కూర్చుని జనసమూహాన్ని పరికిస్తూ భటులు. గుడి ముందర, అదే పనిగా అటూ ఇటూ తొండాన్ని ఊపుతూ మధ్యమధ్యలో చెరుకు గడలు నోట్లోకి చేర్చుకుంటున్న ఏనుగు. దాని తల కదలికలతోబాటు మోగుతున్న చిరుగంట! క్షణం కూడా విశ్రాంతిగా కూర్చోకుండా చిన్న చిన్న పరుగులతో పావురాలను తరుముతూ, అంతలోనే మళ్ళీ తల్లి పక్కకు చేరుతున్న గున్న.

ఏదో కూరగాయలు కొన్నట్టు, వజ్రవైఢూర్యాలను దారి పక్కని దుకాణాల్లో కొనుగోలు చెయ్యడం సామాన్యమైన విషయమైతే, ఆ విజయనగర సామ్రాజ్యపు ఆర్థికస్థితి ఎంత బలమైనదై ఉండాలి?! ఆ లావాదేవీల్లో ఎంత నిజాయితీ పేరుకుని ఉండాలి!? అంత బాహాటమైన ఆ వీధిలో, చోరభయంలేని వాతావరణం నెలకొన్నదంటే, పరిపాలన ఎంత సక్రమంగా జరిగి ఉంటుందనుకోవాలి!?

ఆ స్వర్ణయుగం తలపులలోంచి బయటపడ్డాను. ‘రాతి రథం ఎక్కడుందీ’ అని గూగులమ్మను అడిగితే, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజప్రాసాదపు శిథిలాల మధ్య ఉందని తెలిపింది. నడక దారిని ప్రదర్శించింది.

కారు దిగినప్పటినుంచీ ఇంతవరకూ నడిచాం కదా, ఇక ఆటో ఎక్కుదామని ఒక ఆటోని పిలిచి రాతిరథానికి వెళ్ళాలన్నాను. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి, తిరిగి ఇక్కడికే తీసుకొచ్చి దింపడానికి ఎనిమిది వందలు కావాలన్నాడు డ్రైవర్. రెండు కిలోమీటర్ల దూరానికి ఎనిమిది వందలు చాలా ఎక్కువనిపించింది. అదే అన్నాను. ‘నడక దారి రెండు కిలోమీటర్లే. కానీ ఆటో వెళ్ళే దారి పది కిలోమీటర్లు. చుట్టు తిరిగివెళ్ళాలి. మళ్ళీ ఇక్కడికే తెచ్చి దింపుతానంటున్నా కదా,’ అని ఆటోవాలా వాదన.

శ్రీమతి వైపు చూశాను. నడుద్దాం అంది. నడక మొదలెట్టాం.


శిలాసౌందర్యం

హంపి బజారు పొడవు దాదాపు కిలోమీటర్. బజారు చివరికి చేరేక దారి ఎడమకు తిరిగింది. అక్కడినుంచి కనుచూపు మేరలో తుంగభద్ర నది; నదిలో ‘కోరాకిల్’ అనే దొన్నెపడవల్లో కేరింతలు కొడుతూ షికార్లు చేస్తున్నారు యువజనం. నాలుగున్నర గంటల వేళ, కాషాయరంగు సూర్యకాంతిలో కొత్త అందాలు సంతరించుకుంటున్న పరిసరాలు! అంత దూరంనుంచి చూసినప్పుడు నదికి అవతలి ఒడ్డు పొడవునా, తన సౌందర్యసృష్టిచాతుర్యాన్ని ప్రదర్శించడానికే ప్రకృతి పూనుకుని మరీ పేర్చినట్లు, రకరకాల ఆకారాల్లో పరిమాణాల్లో, సంధ్యకాంతిలో వెలుగుతూ కొలువుదీరిన శిలలు!

వీలైనంత త్వరగా అడుగులు వేస్తున్నాం. బాట ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళ మీదినుంచి, మెట్లు మెట్లుగా చెక్కిన రాతి మైదానాలలోంచి, మధ్యమధ్యలో ఇసుకదారుల్లోంచి సాగుతోంది. ఇప్పుడా దారిలో నడుస్తున్నది మేము మాత్రమే. కూతవేటు దూరంలో నడుస్తున్న మరొక పడుచుజంట తొందరగానే కనుమరుగైంది.

దారి పొడవునా, ప్రతి వంద గజాలకూ ఒకటి చొప్పున ఏవేవో ఆలయాలు. ఆలయాలు అనడంకన్నా ఆలయాల శిథిలాలు అనడం సబబు. కొన్ని మండపాల ముందర, ఆ ఆలయపు వివరాలు తెలిపే బోర్డులు ఉన్నాయిగానీ, ఏ ఆలయంలోనూ విగ్రహంకానీ, దానికి పూజలు జరుగుతున్న దాఖలాలుగానీ లేవు.

మరో పది నిముషాల్లో రాతి రథం ఉన్న ఆవరణను చేరుకున్నాం. కాళ్ళు సణుగుతున్నాయి. మేం పట్టించుకోలేదు.


రాతి రథం

చాలా ఆలయాల్లో కనిపించే రథంలాంటి ఈ నిర్మాణం కూడా ఒకప్పుడు ఆలయమేనట. అప్పట్లో ఈ ఆలయంలో విష్ణుమూర్తి వాహనమైన గరుడుడి విగ్రహం ఉండేదట. ఆలయం పైన టెర్రా కోటా కప్పు కూడా ఉండేదట. అవేవీ ఇప్పుడు లేవు. చూడటానికి ఇదంతా ఒకే శిలలో మలచినట్లు అనిపించినా, వాస్తవానికి అనేక గ్రానైట్ శిలలను కీలలతో అమర్చి, ఆ అతుకులను ఎంతో చాకచక్యంగా దాచి ఆకారాన్ని తీర్చిదిద్దిన విశేషమది! ఈ రథం కదిలితే యుగాంతం వస్తుందని ఒక కథనం ఉందట. దాదాపు అడుగు ఎత్తున్న అరుగుమీద నిర్మించిన ఈ రథానికి ముందు వైపున, మెట్లకు రెండు పక్కలా రెండు ఏనుగుల శిల్పాలు కనిపిస్తాయి. అయితే అవి ఈ రథపు నిర్మాణంలో భాగం కాదనీ, వేరెక్కడినుంచో తెచ్చి వాటిని ఇక్కడ అమర్చారనీ గైడ్ చెప్పాడు.

ఆవరణలో ఉన్న విఠలుడి ఆలయాన్ని చూపి, ఆలయం ముందరి మహామండపంలోకి దారి తీశాడు గైడ్. దాని పేరు శృంగార మండపమట. హంపి వైభవం కొనసాగుతున్న రోజుల్లో ఆ మండపంలో సంగీత కచ్చేరీలూ నాట్య ప్రదర్శనలూ జరిగేవట. ఆ మండపంలోని కొన్ని స్తంభాలను చూపాడు. ‘వినండి, ఇది బడి గంట శబ్దం,’ ‘ఇది గజ్జెల శబ్దం,’ ‘ఇది డోలక్ చప్పుడు,’ అంటూ కొన్నిటి మీద తట్టి చూపాడు. ఆయా శబ్దాలను పోలిన రావాలను వెలువరిస్తున్నాయా స్తంభాలు. చేత్తో తడితేనే ఆ రాళ్ళు అలా వేర్వేరు శబ్దాలను వెలువరించడానికి వినియోగించిన సాంకేతికత ఏమిటో – ఆ శిల్పులకే తెలియాలి!

చీకటి పడే ఛాయలు కనిపిస్తున్నాయి. తిరుగు నడక మొదలుపెట్టాం. బేలూరు, హళేబీడుల శిల్పసంపద కలిగించిన ఉన్మత్తత ఇంకా మాలో సమసిపోలేదో ఏమో, ఇప్పుడు చూసిన శిల్పసౌందర్యం మమ్మల్ని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. లేక, బహుశా వీటిని ఆస్వాదించడానికి కావలసిన రసదృష్టి మాలో మానుబట్టిందో!

మర్నాడు పొద్దున్న ఆరింటికే బయల్దేరాం.


రాణుల స్నానశాల

నాటి రాణులు జలకాలాడిన ప్రదేశం, క్వీన్స్ బాత్ (Queen’s Bath) మా మొదటి మజిలీ. బయటినుంచి మామూలుగా కనిపించినా, లోపలికి వెళ్తే అందమైన స్తంభాలతో, నీటి మీదకు చొచ్చుకు వచ్చేట్లు కట్టిన బాల్కనీలతో కట్టిన నీటి కొలను కనిపిస్తుంది. రాణుల జలక్రీడలకు అనువుగా కొలను పైకప్పు లేకుండా మండువాలా ఉంది. కొలనులోకి నీళ్ళు వచ్చేందుకూ, పాత నీరు తీసివేసేందుకూ ఏర్పాట్లు కనిపిస్తాయి.

అక్కడినుంచి రెండు మూడు ఫర్లాంగుల దూరంలోని లోటస్ మహల్‌కు చేరుకున్నాం. విజయనగర సామ్రాజ్యపు వాస్తుశిల్ప విన్యాసాలను ప్రదర్శించే ఈ భవనానికే కమల్ మహల్, చిత్రాంగిణి మహల్ అని కూడా పేర్లున్నాయట. పద్మం ఆకారంలో నిర్మించిన ఆ రెండంతస్తుల మండపం, రాజకుటుంబాల వనితలు సురక్షితంగా తీరికవేళలు గడిపే భవనమట. దాని ఆర్చీలకు హిందూ-ఇస్లామిక్ నిర్మాణ శైలిలో తీర్చిదిద్దిన నగిషీలు కనువిందు చేశాయి. గాలీ వెలుతురూ చక్కగా ప్రసరిస్తూ, అక్కడ కూర్చున్న వారికి ఆహ్లాదాన్ని కలిగించేలా ఉందా భవనపు నిర్మాణం.


లోటస్ మహల్

ఆ విశాలమైన ఆవరణలో, లోటస్ మహల్‌కు కూతవేటు దూరంలో గజశాల భవనమూ, దాని పక్కన సైనికుల భవనమూ కనపడ్డాయి. గజశాలలో 11 ఏనుగులకు మాత్రమే చోటుండటం చూసి, కొద్దిగా ఆశ్చర్యం వేసింది. విజయనగర సామ్రాజ్యంవంటి బృహత్సంస్థానానికి వందల సంఖ్యలో ఏనుగులుండే అవకాశముంది కదా! అంటే వాటన్నిటిలోకీ ఉత్తమమైనవి – అటు రూపంలో ఠీవి, ఇటు ప్రవర్తనలో రాజసం ఉట్టిపడే వాటికి మాత్రమే ఈ గజశాలలో స్థానం దొరికేదేమో బహుశా!

ఒకప్పుడు ఏనుగులు తీరుబడిగా విశ్రాంతి తీసుకున్న ఈ పెద్ద పెద్ద గదుల్లో ఇప్పుడు మాత్రం గబ్బిలాల వాసన సుడులు తిరుగుతోంది.

లోటస్ మహల్, గజశాల, సైనికుల ఆవాసాలు దాటి ఇంకొంచెం లోపలికి నడిచాం. ఎండ ఇప్పుడిప్పుడే తన ఉనికిని స్ఫురింపజేయడం మొదలుపెట్టింది. ‘శృంగార దేవాలయం’ అన్న పేరు కొంత విడ్డూరంగా తోచి, ఆ పేరు రాసి ఉన్న బోర్డు సూచిస్తున్న వైపు బాటలో సాగాం. బాటకు రెండు వైపులా శిథిలావస్థలో కుములుతున్న ఆలయాలు అడుగడుగునా తారసపడ్డాయి. వేటిలోనూ విగ్రహాలు లేవు. ఆ శిథిలాలను చూస్తున్న కొద్దీ గత వైభవం స్ఫురణకు వస్తూ మనసులో విషాదాన్ని నిద్ర లేపుతోంది.

హంపిలో, ఆ చుట్టుపక్కల్లోనే ఇంకా అనేక దర్శనీయ స్థలాలున్నాయనీ, వాటన్నిటినీ తనివిదీరా సందర్శించడానికి కనీసం నెల రోజులు కావాలనీ కొత్త నిజం తెలిసింది. మరోసారి వద్దామని ఒట్టు పెట్టుకుని, మనసు రాయిచేసుకుని అక్కడినుంచి బయల్దేరాం.


మర్నాడు డిసెంబర్ 25న, పొద్దున్న ఆరింటికే బయల్దేరి చిత్రదుర్గ మీదుగా బెంగుళూరుకు తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. కారు హొసపేటె-చిత్రదుర్గ హైవేలో పరుగులు తీస్తోంది. అక్కడక్కడ కొండల మీద, నింపాదిగా తిరిగే పొడవాటి రెక్కల విండ్ మిల్స్. ప్రత్యేకంగా నిర్మించిన ట్రైలర్లమీద పురాణకాలపు పక్షుల నిడుపాటి రెక్కల్లా, గాలిమరల రెక్కలను రవాణా చేస్తున్న లారీలు అనేకం ఎదురయాయి.

పదింటిలోపు చిత్రదుర్గ చేరుకున్నాం. అక్కడొక కోట ఉందని తెలుసు. ఆ కోటను చూడాలని మా ఉబలాటం. కానీ, ఇవాళ సాయంత్రం నాలుగింటికల్లా కారును తిరిగి అందించాలి కాబట్టి, ఆ కోటను తీరుబడిగా చూడటానికి తగినంత సమయం ఇప్పుడు లేదని స్పష్టంగా తెలిసింది. నిరాశగానే బెంగళూరు వైపు సాగాం.


కర్ణాటకలో మేం చూడాలనుకున్నవి ఇంకా ఎన్నో ఉన్నాయి. మైసూరు, హొరనాడు, గోకర్ణం, జోగ్ ఫాల్స్, చిక్కమగళూరు – కనీసం నెల రోజులపాటు తీరుబడిగా చేపట్టాల్సిన పర్యటన అది. తిరుగు ప్రయాణానికి టికెట్‌ని ముందే బుక్ చేయకుండా ఉంటే బహుశా వాటిలో కొన్నైనా చూసే వాళ్ళం. అంత దూరమూ వెళ్ళి అన్నీ చూసి రాలేదన్న బెంగ ఉన్నా, ఒక కల నిజమైందన్న సంతోషమూ నిండింది మాలో.

ఊహించనంత సౌందర్యంతో, మానవాతీతమనిపించే సృజనశక్తిని మనసుకు రుచి చూపించాయి హళేబీడు, బేలూరు. ఒకనాడు పరిఢవిల్లిన రాజ్యవైభవానికి ప్రతీకలుగా, కొండెక్కిన కాగడాలను తలపించాయి హంపిలోని శిథిలాలు. రెండిటిలోనూ మార్మికతకు, కళాదృష్టికి లోటు లేదు. వాటి పరిసరాల్లో ప్రకృతి చిందించే అందాలకూ కొదవలేదు. ‘ప్రస్తుతపు క్షణమే వాస్తవం’ అన్న నమ్మకాన్ని అలవరచుకున్న ఆలోచనాలోచనాలకు అలనాటి రాజ్యాల, పాలకుల, శిల్పుల సౌందర్యతృష్ణ, ఆధ్యాత్మిక పిపాస మనసులో మెదిలినప్పుడల్లా ఒక కొత్త కోణం స్ఫురిస్తోంది. ఆశ్చర్యపరుస్తోంది.

‘ప్రకృతి అందాలనూ, మానవనిర్మితమైన అద్భుతాలనూ దర్శించడానికి వేరే ఏ దేశాలకో వెళ్ళనక్కర్లేదు; మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో వర్ణనాతీతమైన సౌందర్యావిష్కరణలున్నాయి’ అని మరోసారి రుజువు చేసుకున్నాం.


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...