ఎనిమిది దివ్వెలు

1.

లయలో బంధిస్తేనే
పదాలకి రెక్కలు

నీలో బంధిస్తేనే
నా మనసుకు!

2.

చెట్టుకి రెక్కల్లేవు
అందుకేనేమో
పక్షుల్ని పెంచుకుంటుంది

3.

శ్రావణ మేఘం
శుభ్రంగా కడిగీసింది

బుద్ధుడి భుజం మీద
పక్షి వేసిన రెట్టని!

4.

ఆకాశ లింగాన్ని అభిషేకిస్తున్నట్టు
ఖాళీ పాత్రలోకి పితుకుతున్న పాలు

జల లింగాన్ని అభిషేకిస్తున్నట్టు
నేల నూతిలో కురుస్తున్న వాన

5.

నేనొక
మజ్జిగ చుక్కని

నన్ను తాకిన
ప్రతి పాలచుక్కనీ
నాలా మారుస్తాను!

6.

వెన్నెల కన్నీటిని తుడుస్తూ సూర్యుడు
సూర్యుడి కోపాన్ని చల్లారుస్తూ వెన్నెల

భార్యాభర్తలు!

7.

చూస్తుండగానే..

సీతాకోక ఎగురుకుంటూ
కట్లపాము పాక్కుంటూ
కప్ప గెంతుకుంటూ

రోడ్డు దాటేసాయి!

8.

కరిగిపోయే కాలంలోని
సౌందర్యం

ఆమె వేళ్ళ సందుల్లోంచి
నదిలోకి జారే నీటిముత్యాలు!


రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి:

2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. “ఏటి ఒడ్డున” కవితా సంపుటి (2006), “ఆత్మనొక దివ్వెగా” నవల (2019), “సెలయేటి సవ్వడి” కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు.

 ...