‘పూర్ణమూ… నిరంతరమూ’, ‘రాతి తయారీ’ తరువాత ముని సురేష్ పిళ్లె తీసుకువచ్చిన మూడవ కథాసంపుటి ‘గారడీ వాడు’.
సురేష్ పిళ్లె కథలలో ఎత్తుగడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కసారిగా కథలోకి పోకుండా పాఠకుణ్ణి ప్రిపేర్ చేసే ఒక వంతెనలాంటిది ఆ ఎత్తుగడ. ఈ సంపుటిలో కథకుడు తన వాక్చాతుర్యానికి హాస్యదృక్పథం, కవిత్వం కలగలిపి, భావి కథార్థ సూచన ఇమిడ్చి, అన్ని కథలకూ మంచి ఎత్తుగడలను ఏర్పరచారు. మచ్చుకు ‘వితండం మామ’ కథలో ఎత్తుగడను చూడండి.
నగరంలో పాడె కట్టేవాడికి చాలా డిమాండు. ఏడెనిమిది అడుగులుండే నిలువు వెదురు బొంగులు రెండు, వాటికి అడ్డంగా వేయాల్సిన వెదురు బద్దలు డజనున్నర, పురికోసు దారాల కట్టలు రెండు, రెండు పిడికిళ్ల ఎండుగడ్డి, నాలుగైదు టెంకాయలు, పంచె, తువ్వాలు. శవం మీద కప్పడానికి, బద్ది చేసుకోడానికి ఓ తెల్ల గుడ్డ, రెండుకుండలు, రెండు పూలమాలలు, కాసిని విడిపూలు, పూలరేకులు, బొరుగులు, బొగ్గులు, సాంబ్రాణి, అగరొత్తులు ఎట్సెట్రా. ఎట్సెట్రా. ఇవన్నీ కలిపి టోకుగా ముప్పయ్యారు వేలవుతుందని లెక్కచెప్పాడు వాడు. పదివేలకంటె ఎక్కువ కాదన్నాడు బావ. వాడు అదో మాదిరిగా నవ్వి,’నిజమే సార్. రోజూ నాకు బేరం ఇస్తారా చెప్పండి. మీరన్నట్లు పదివేలకే చేస్తా’ అన్నాడు. ఈ బేరం కోసం, ప్రతిరోజూ ఎవరు చావగలం ఈ ఇంట్లో? అని సరిపెట్టుకుని ఒప్పేసుకున్నారు.
ఇలాగే అన్ని కథలకూ ఎంతో మంచి ఎత్తుగడలు ఉన్నాయి.
ఈ రచయిత కథ చెప్పడు, కళ్ళముందు పెట్టి చూపిస్తాడు. ఈ సంపుటిలో కుడిపైట, గేణమ్మ, లడ్డూపెడతా గోవిందా, పడమటిల్లు, ఆంజమ్మ బస్సు ప్రయాణం, స్కోర్ అయిటమ్ కథల్లో అది బాగా కనిపిస్తుంది. సత్రం అరుగుమీద కూర్చున్న వితండం మామ ఎలా ఉంటాడో చెప్పకుండా మనకు డైరెక్ట్‌గా చూపిస్తాడు రచయిత.
ముతక గాడా గుడ్డతో కుట్టించిన ఓ నాడాల డ్రాయరు, చంకల కింద రెండు జేబులతో కుట్టించిన బనీను. ఆ అవతారంలో మామను చూస్తే రెండెకరాల రైతులా లేడు. గింజలు తోలడానికి బండికట్టే కూలీలా ఉన్నాడు. కారు ఆగగానే తలెత్తి చూసి.. “రారా అబ్బాయ్” అంటూ పక్కన చోటిచ్చాడు. పంచె చుట్టుకుని, చొక్కా తొడుక్కున్నాడు. తుండుగుడ్డ దులిపి భుజం మీద వేసుకున్నాడు
మంచి కథలు మనకు ఒక కొత్త పరిశీలనను, ఒక కొత్త ఆలోచనను, ఒక కొత్త దృష్టికోణాన్ని పరిచయం చేస్తాయి. ఈ రచయిత కథలు మనకు నిత్యజీవితంలో పరిచయమైన పాత్రల ద్వారానే, మనకు తెలియని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తాడు. కొన్నిసార్లు మొత్తం కథంతా చేసే పనిని ఒక్కోచోట ఏకవాక్యంతో సాధిస్తాడు. ఉదాహరణకు, ‘గారడీ వాడు’లో ఈ వాక్యం చూడండి:
దేవుళ్లందరూ ఒకటే. ఎవుడి గొప్పతనం ఎంత? ఎవుడి మహిత ఎంత? అనేది వాడి ముందర నిలబడి గారడీ చేసే మనిషిలో ఉంటాది.
పట్టణాలలో ఉరుకులూ పరుగులతో ఇప్పుడు మరుగున పడిపోయింది కానీ చిన్న వూరు నుంచి వచ్చిన ఈ రచయితకు ఏది చెప్పినా, ఎంత సీరియస్ విషయమైనా చమత్కారభరితంగా చెప్పడం ఇష్టం. మామూలు రచయితలకు, మంచి రచయితలకు ఉన్న తేడా వాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానంలో ఉంటుంది. మంచి రచయితలు ప్రతి చిన్న విషయాన్నీ పరిశీలనగా చూస్తారు, వర్గీకరిస్తారు, ఆపై విశ్లేషిస్తారు. ఈ రచయిత ఎంత నిశితంగా పరిశీలిస్తాడో ‘గారడీవాడు’ కథలో భక్తులను వర్గీకరించిన విధానంలో అర్థమవుతుంది. పైకి ఏదో హాస్యంగా అనిపించినా, ఇందులో లోతైన పరిశీలన ఉంది.
ఈ సంపుటిలోని అన్ని కథలూ ‘ఒక కథ రాద్దాం’ అనుకుని ప్రారంభించినవి కాదు. రచయిత దృష్టికి వచ్చిన విషయాల్లో, అతన్ని కదలించిన ఘటనల్లో, ఆసక్తి గొలిపిన సంగతుల్లోంచి ఎంచుకుని, ‘రాయకపోతే కుదురుగా, మనశ్శాంతిగా ఉండలేం’ అని భయపడి రాసిన కథలివి. నలుగురికీ తెలియాల్సిన విషయాలు, చర్చకు రావాల్సిన సంగతులు, ప్రభుత్వాల దృష్టికి వెళ్లి వారి దృక్కోణాన్ని మార్చాల్సిన అంశాలు కొన్ని ఈ సంపుటిలో కథలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ సంపుటిలోని కథలూ, పాత్రలు నిజజీవితంనుండి నడిచొచ్చాయి కాబట్టే పాత్రలు తమ జ్ఞానపరిధిని దాటి మాట్లాడవు. ఇందులోని పాత్రలు మనకు తెలిసిన ఎవరో ఒకరిని గుర్తు చేస్తాయి, సంఘటనలు కల్పితమైనప్పటికీ ‘జరిగే ఉంటాయి’ అనే అనిపిస్తాయి.
‘స్కోర్ ఐటెం’ అనే కథ సెన్సేషనల్ జర్నలిజం మీద చర్నాకోల. ఇది నూరుశాతం రచయిత స్వానుభవంనుంచి పుట్టిన కథ. అందుకే ప్రతి వాక్యం, ప్రతి సంఘటన, ప్రతి సంభాషణ జరిగినట్లే అనిపిస్తుంది. ‘ఇది కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన’ అనే భావం పాఠకునికి కలుగుతుంది. అందుకే చివరిలో జర్నలిస్టులకు చెళ్ళున మొగం మీద చర్నాకోల ఝుళిపించినట్లు అవుతుంది.
ఈ రచయిత మదర్ తెరెసా, మహాత్మా గాంధీలాంటి వాళ్ళనుంచే కాదు బిచ్చగాళ్ళనుంచి కూడా స్ఫూర్తి పొందుతాడు. ‘వితండం మామ’ కథకు చివరి పలుకుకు ఒక బిచ్చగాడు స్ఫూర్తి ఇచ్చాడని తెలిస్తే, ఈ రచయిత మంచి ఎక్కడున్నా గ్రహించే గుణమున్నవాడని అర్థం అవుతుంది.
కథలన్నీ జీవితాలనుంచి నడుచుకుంటూ వచ్చాయి కాబట్టి నిజాయితీగా ఉంటాయి. లోతైన పరిశీలనా దృష్టి ఉండటంతో దాదాపు అన్ని కథలలోనూ తాత్వికత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
నా మటుకు నేను కథలను నా జీవితంనుంచి కొద్దిసేపు బయటికెళ్లి వేరే వాళ్ళ జీవితాలలో కలిసిపోవడానికి చదువుతాను. అలా జరగాలంటే కథలో కొత్తదనం ఉండాలి. కథతోపాటు నేపధ్యమూ, పరిచయంలేని పరిసరాలూ పాఠకుణ్ణి కొత్త లోకానికి తీసుకుపోతాయి. కథలో చదివించే గుణాన్ని పెంచుతాయి.
అలాంటి కథే ‘కుడి పైట’. అది మనల్ని ఏకంగా మలేషియాకు తీసుకెళ్లిపోతుంది. మనకు ఇండియా గురించి, అమెరికా గురించి తెలిసినంతగా మలేషియా గురించి తెలీదు. అక్కడి ప్రవాసాంధ్రులను ఈ కథ మన ముందుంచుతుంది.
చాలామంది రచయితల వద్ద ఒకే కథ ఉంటుంది. దానినే వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు విధాలుగా వేర్వేరు కథలుగా రాస్తారు. కానీ ఈ రచయిత ఎంచుకున్న కథాంశాలు వైవిధ్యభరితమైనవి.
కథాంశాలే కాదు, కథనరీతులు కూడా వైవిధ్యభరితమైనవే. ‘సర్కిల్’ కథ టోటల్‌గా ఒక కొత్త ఫార్మాట్‌లో ఉన్న కథ. షార్ట్ ఫిల్మ్‌కు రాసుకున్న స్క్రీన్ ప్లే లాగా ఉంటుంది. ఈ కథలకు మనం పాఠకులం కాదు; ఆ కథలతో మన మైండ్‌లో రచయితతోపాటు మనమూ కో-డైరెక్ట్ చేసుకునే షార్ట్ ఫిల్మ్‌కు ప్రేక్షకులం అవుతాం.
టీనా కథ చదువుతుంటే, అత్యంత విశిష్టమైన ద్వ్యర్థికావ్యం ‘రాఘవ పాండవీయం’ చదివినట్లనిపించింది. ఈ కథను చదువుతూ మనం ఒక ప్రియురాలు కథ చెప్పుతున్నట్లు ఊహించుకుంటాము. కానీ అది చెప్పేది ఎవరో చివరికి తెలుస్తుంది. తిరిగి వెళ్లి మరోసారి చదివితే, ఊహకందని లేని రెండు వెర్షన్‌లకు సరిపోయే ద్వ్యర్థికథ ఇది అని మనకు అర్థం అవుతుంది.
ప్రభుత్వాలు, సమాజాలు కూడా ఆలోచించాల్సిన విషయాలు కూడా కొన్నిటిలో కథాంశాలయ్యాయి. అందులో ‘గేణమ్మ’ కథ ఒకటి. ఇది వర్తమాన సామాజిక జీవితాన్ని రికార్డు చేసే కథ. సామాజిక దృష్టికోణమున్న అద్భుతమైన కథ. ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురికీ డబ్బులిస్తామనే ప్రభుత్వాలు, కాటికెళ్లడానికి ఎదురుచూసే ఇద్దరు ముసలాళ్లుంటే వారికి మాత్రం పెన్షను ఎందుకు ఇవ్వరు? అన్న ఆలోచన మీద వచ్చిన కథ. ఇది ఒక గొప్ప ప్రేమకథ కూడా. ప్రేమంటే పదహారేళ్ళ టీనేజర్లకే అనుకునే సినిమా టైపు ప్రేమ కాదు.
కోవిడ్ వెతలపై కొన్ని వందల కథలు వచ్చాయి. అందులో నాకు బాగా నచ్చిన కథ సురేష్ పిళ్లై రాసిన “రిఫ్రెష్ ఫ్రమ్ టియర్స్”. కోవిడ్ బారిన పడ్డ ఓ తండ్రి ఆస్పత్రిలో మరణశయ్యపై ఉండి, జీవితాన్ని అవలోకనం చేసుకునే క్షణాలకు అక్షరరూపం కల్పించిన కథ. కూతురితో తన మనసులో మాట్లాడుకున్నట్లుండే కథ. చావు కొద్ది గంటల్లో ఉంది. తనకు అత్యంత ప్రీతిపాత్రురాలు, తనంటే ప్రాణం పెట్టే కూతురు తన మరణాన్ని ఎలా తీసుకుంటుందో, ఎంతగా తల్లడిల్లిపోతుందో కళ్ళముందు కనిపిస్తుంటే, జీవిత రంగస్థలంనుంచి ఒక పాత్ర వైదొలగుతుంటే పలికే భావోద్వేగాల సాంద్రత, పాఠకుణ్ణి కట్టి పడేస్తుంది. పదునైన, చిక్కనైన పదబంధాలతో, నిండా కవిత్వం కూర్చిన పేరాగ్రాఫుల సమాహారంతో, కథ ఒక దుఃఖభరిత కావ్యంలా సాగుతుంది. ఇది చదువుతున్నంతసేపూ ఒక కథ చదువుతున్నట్లు అనిపించదు – గుండెను పిండేసే కవిత చదువుతున్నట్లనిపిస్తుంది.
స్త్రీవాద రచయిత అన్న ముద్ర లేకున్నా తన రచనల్లో స్త్రీ పాత్రలను ఎంతో గొప్పగా మలచారు రచయిత. అన్ని స్త్రీ పాత్రలూ ఇందులో గొప్పవే కానీ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి – ఒకటి గేణమ్మ; రెండు లచ్చన. గేణమ్మ ఆత్మ స్తైర్యం, లచ్చన నాయకత్వలక్షణం స్త్రీలకే కాదు, పురుషులకుకూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
చివరగా కథలలో వాడిన భాష గురించి మాట్లాడుకుందాం. కొంతమంది పత్రికాభాషలోనే రాస్తారు, కొంతమంది మాండలికంలోనే రాస్తారు, కొంతమంది రెండింటిలోనూ రాస్తారు. అయితే ముని సురేష్ పిళ్లే మూడింటిలోనూ రాస్తారు – రెండు మాండలికాలు, ఇంకా పత్రికాభాష. తాను పుట్టి పెరిగిన చిత్తూరు మాండలికంలో రాయడం గొప్పేమీ కాదు. కానీ ‘ఆంజమ్మ బస్సు ప్రయాణం’లో వాడిన తెలంగాణా యాస ఈ రచయిత మీద పాఠకునికి గౌరవం ఇనుమడింపజేస్తుంది.
అంతా మంచేనా? లోపాలేమీ లేవా అంటే ఉన్నాయి. వాటిని కూడా సరిదిద్దుకుంటే ఈ రచయిత కలంనుండి సర్వోత్కృష్టమైన కథలు వస్తాయి. నాకు కనిపించిన లోపాలు ఇవి:
‘కుడిపైట’ కథలో రెండు పేజీల ఉపోద్ఘాతం ఉంది. అది కథ కాదు. ఒక చిన్న వ్యాసం. కథను అర్థం చేసుకోవడానికి రచయిత ఇచ్చే బాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. కథకు అవసరమైనంతవరకూ సమాచారాన్ని కథలోనే ఇమడ్చవచ్చు. అలా చేయకపోవడం రచయిత ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. ఈ కథకు ముగింపు కూడా అనవసరమైన పొడిగింపులా ఉంది. ఇంతకూ ‘ఇది కథా, వ్యాసమా’ అన్న అనుమానం వస్తుంది. ఇంత మంచి కథను, ముందుమాట, ముగింపుల ద్వారా రచయిత కిందికి దించేసాడు. పాఠకుల స్థాయిని తక్కువ అంచనా వేయడం మూలాన అన్నీ విడమరిచి చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ వర్తకము, చైనాలో బొగ్గు గనులు అంటూ కథకు సంబంధం లేని విషయాలన్నీ ఎందుకు ఏకరువు పెట్టడం?
ఇప్పుడు రచయిత ఎంచుకున్న కథాంశాలకు వద్దాం. దాదాపు అన్నీ పండు ముదుసలులు, అతి పేదలు, ఇంకా ఒక గంటలో చనిపోబోయే వాళ్ళు. అవి కాకుంటే సమాజంలో జరుగుతున్న తప్పులు, వాటిని తప్పకుండా మార్చాలని ఉబలాటం. అయితే, మంచి రచయితగా, సామాజిక స్పృహ గల రచయితగా ముద్ర పడినప్పుడు, ఒక చట్రంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. రచయిత ప్రతి కథలోనూ సమాజాన్ని మార్చే బాధ్యత నెత్తికెత్తుకుంటే, ప్రకృతిలో ఎన్నో రంగులున్నా నలుపు ఎరుపు మాత్రమే వాడే చిత్రకారుడి పరిస్థితి వస్తుంది. ముని సురేష్ తన కథనప్రతిభను కేవలం సామాజిక విమర్శకే పరిమితం చేయకుండా మానవ సంబంధాల్లోని ఇతర సూక్ష్మమైన పార్శ్వాలను అన్వేషించే కథలను కూడా భవిష్యత్తులో వెలువరిస్తాడని నా ఆశ.
చదరంగంలో ఓపెనింగ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ అని మూడు భాగాలు ఉంటాయి. అలాగే కథలో కూడా ఎత్తుగడ, మధ్య భాగం, ముగింపు అని మూడు భాగాలు ఉంటాయి. ఎత్తుగడ, మధ్యభాగం దాదాపు అన్ని కథలలో బాగున్నాయి. చాలా కథల్లో ఎత్తుగడ ఉన్నంత బలంగా ముగింపులు లేవు. ఉదాహరణకు ‘వితండం మామ’ కథనే తీసుకుందాం. వితండం అని అనడమే కానీ మొదటినుంచి చివరివరకూ అతని మంచితనమే కనిపిస్తుంది. అలా క్లైమాక్స్ మీద హింట్ ఇవ్వడం కాకుండా మొదటినుంచీ కొంత నెగటివ్ షేడ్ ఇచ్చి చివర్లో అతని మంచితనం చూపించి ఉంటే మధురాంతకం రాజారాం రాసిన ‘పిచ్చి వెంకట్రావు’ కథ సరసన కూర్చోబెట్టవలసిన కథ అయ్యేది.
‘రిఫ్రెష్ ఫ్రొం టియర్స్’ కథను తీసుకుందాం. మొదటినుంచీ చివరిదాకా ఇది ఒక అద్భుతకావ్యం. దీనిలో తాత్విక చింతన, కవితాత్మకత అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ముగింపు మీద అంచనాలు విపరీతంగా పెంచేసి చివరికి మామూలుగా ముగించేశారు. కథకు తగ్గ క్లైమాక్స్ ఉండి ఉంటే ఈ కథ కూడా తెలుగులో ఇంతవరకూ వచ్చిన గొప్ప కథల సరసన చేరేది.
‘లడ్డూ పెడతా గోవిందా’ కథలో క్యూ లో గొంతు చించుకొని అరిచిన ఆమె, తిరుచానూరులో ఉండే అమ్మవారే అని రచయిత చెప్పదలిచాడు. మంచి ఆలోచనే. కానీ దాన్ని చాలా మిస్టికల్‌గా చెప్పీచెప్పకుండా పాఠకునికే ఆ ఆలోచన వచ్చి ఒళ్ళు గగుర్పొడిచేలా చెయ్యాలి.
కథలన్నీ నిజజీవితంనుంచి నడిచొచ్చాయి కాబట్టి చాలావరకు నమ్మశక్యంగానే ఉన్నాయి. అయితే, కొన్నిచోట్ల సంభావ్యతా లేమి కొట్టొచ్చినట్లు కనిపించి పంటి కింద రాయిగా మారి కథాస్థాయిని తగ్గిస్తోంది. ఉదాహరణకు ‘వితండం మామ’ కథ తీసుకుందాం. పొలం ఎకరా పాతిక లక్షల చొప్పున పదెకరాలు కాష్ పెట్టి కొనే స్తోమత ఉన్న బాబాయి సైకిలెక్కి ఎందుకు తిరుగుతాడు? పొలం కొనడానికి వచ్చిన మనిషి ఎకరాకు నలభై లక్షలిస్తానంటే మారుమాట లేకుండా ఒప్పుకోవడం ఎలా జరిగింది? నాలుగు కోట్ల బేరం మారుమాట లేకండా జరగడం ఎక్కడయినా జరుగుతుందా? పనయిపోయాక వీరా మామకు లక్షో రెండు లక్షలో ఇస్తానంటే నమ్మవచ్చు కానీ, ఏకంగా యాభై లక్షలు ఇస్తానని అనడం కూడా జరిగే పనేనా?
గారడీవాడు’ కథాసంపుటి ద్వారా ముని సురేష్ పిళ్లె తన కథాకథన పటిమను మరోసారి రుజువు చేశారు. జీవిత వాస్తవాలు, సామాజిక స్పృహ, గాఢత, వైవిధ్యం, పరిశీలనాత్మకత, మానవతా విలువలు సమ పాళ్ళలో కలిపి సాధారణ మనుషుల జీవితాలను తాత్విక స్పర్శతో చూపించే శక్తి ఉన్న ఈ రచయిత నుంచీ వెలువడిన ఈ కథలు కొన్నిచోట్ల కథా నిర్మాణం పైన, క్లైమాక్స్ పైన, మరియు సంభావ్యతల పైన మరింత శ్రద్ధ అవసరం. ఈ అంశాలపై దృష్టి పెడితే సురేష్ పిళ్లె ప్రస్తుత తెలుగు కథ ను మరో మెట్టు పైకి తీసుకుపోగలరని నమ్మకం కలుగుతోంది. మొత్తం మీద, ‘గారడీవాడు’ ఆయన సాహిత్య ప్రస్థానంలో ఒక పటిష్ఠమైన ముందడుగు. అలాగే ఈ సంపుటి ద్వారా ‘తెలుగు సాహిత్య లోకంలో ఒక శక్తివంతమైన కథకుడు ప్రవేశించాడు’ అని ఒక గట్టి ప్రకటనే ఈ కథా సంపుటి ద్వారా రచయిత చేసినట్లనిపించింది.
పుస్తకం: గారడీ వాడు
రచన: ముని సురేష్ పిళ్లె
ప్రచురణ: ఆదర్శిని మీడియా
పేజీలు: 184 వెల:₹200
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర, అమెజాన్.ఇన్, సురేష్ పిళ్లే.ఇన్