తెలుగు భాష ఎవరిది?

ఆంగ్ల పాలన, పాశ్చాత్య నాగరికత ప్రభావంతో తెలుగు సాహిత్యం ఆధునికత, వ్యక్తివాదం వైపు సాగగా, విచిత్రంగా దళితులు, సంప్రదాయ బ్రాహ్మణ కవులతో పాటు గ్రాంథిక పద్య కవిత్వంలోనే నిలిచారు. ఇలా భిన్నధ్రువాలు కలిసాయి. వ్యావహారిక భాషా ఉద్యమం కోస్తా బ్రాహ్మణ మాండలికాన్ని ప్రామాణికంగా చేసి, ఇతర మాండలికాలపై ఆధిపత్యం సృష్టించింది, అందువల్ల దళితులు కూడా గ్రాంథిక తెలుగు భాష, పద్యకవిత్వాలను ఆశ్రయించారు. నేటి పరిస్థితి పూర్తిగా వ్యతిరేకదిశలో సాగుతోంది. నేటి దళిత మేధావులు తెలుగును కుల వివక్షకు నిలయంగా భావించి ఆంగ్లాన్ని స్వీకరించాలని వాదిస్తున్నారు.

తెలుగు వారికి ఆధునికత అనేది ప్రీతిపాత్రమైన పదం. అయితే, ‘సంస్కృతి’, ‘గతం’ వంటి పదాలు భావాలు వారి దృష్టిలో వివాదాస్పదమైనవి, అప్రధానమైనవి. వ్యక్తివాదం పట్ల అనురక్తి తెలుగు వారిలో ఎక్కువ. ఆంగ్ల పాలన, ఆంగ్ల భాష, పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్లనే మనం అభివృద్ధి చెందామని అన్ని సిద్ధాంతాల వారూ అంగీకరిస్తారు. అనుభూతి కవుల నుంచి విప్లవ కవుల వరకు అందరూ ఈ ఆలోచనలలో సమానత్వం కలిగి ఉంటారు. మంచి గతమున కొంచెమేనని, ఆంగ్ల పాలన ధర్మపాలన అని చాటిన గురజాడ భావకవుల నుంచి విప్లవ కవుల వరకు అందరికీ ఆరాధ్యుడు కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఈ విభిన్న సిద్ధాంతాలు, భావాలు కలిగిన వారందరూ పాశ్చాత్య నాగరికత ప్రభావాలు, వ్యక్తివాదం, ప్రగతిశీలత, అభివృద్ధి లాంటి భావాలకు వారసులు కావడమే దీనికి కారణం.

గురజాడ వారసత్వం: అందుకోలేని దళిత, సంప్రదాయ వర్గాలు

ఈ భావాలను వైతాళికుడు గురజాడ ప్రతిబింబించాడు. అయితే, ఈ వైతాళికుడి మేలుకొలుపులను అందుకోలేకపోయినవారు దళితులు మరియు సంప్రదాయ బ్రాహ్మణులు. ఆశ్చర్యంగా భిన్న ధ్రువాలుగా కనబడే వీరు ఇద్దరూ పరస్పర గౌరవంతో మెలిగారు. దళితులు, సంప్రదాయ బ్రాహ్మణ కవులు కూడా, ప్రగతిశీలులు, వ్యక్తివాదులు, పాశ్చాత్య ప్రభావాలకు లోనైనవారు, ఆంగ్ల విద్యావంతులైన భావ/అభ్యుదయ/విప్లవ కవుల నిర్లిప్తతకు గురయ్యారు. గ్రామాలలో, పట్టణాలలో పద్య కవుల ప్రభావం తక్కువ కాదు, ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ. ఇందుకు స్పష్టమైన ఉదాహరణలు జాషువ, తిరుపతి వెంకట కవులు.

దళిత కవుల పద్య ప్రస్థానం: ఆంగ్ల ప్రభావాలకు దూరం

ఇంకా సులువుగా చెప్పాలంటే, ఒకవైపు ఆంగ్ల విద్యావంతులు, మరోవైపు ఓరియంటల్ చదువులు తెలుగు-సంస్కృతం మాత్రమే తెలిసినవారు భిన్న శిబిరాలుగా మిగిలిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే, సమాజంలోని అట్టడుగు స్థానంలోని దళితులు ఓరియంటల్ విద్య, తెలుగు-సంస్కృతాలు చదువుకుని పద్య విద్యలో ఆరితేరారు. ఆంగ్ల ప్రభావాలకు దూరంగా నిలిచిపోయారు. ‘ఆంగ్ల విద్య, ఆంగ్ల భాష దళితులను విముక్తం చేసింది’ అనే తర్కానికి ఇది విరుద్ధం. సంస్కృతం, పురాణాలు, కావ్యాలు దళితులకు అందాయి కానీ, ఆంగ్ల విద్య అందలేదు. దళితులకు ఆంగ్లం అందకపోగా, ఓరియంటల్ విద్య అందుబాటులో ఉండడం, దాని స్ఫూర్తితోనే సంప్రదాయ పద్ధతిలోనే సంప్రదాయాన్ని ఎదిరించడం విచిత్రం. పరిమితంగా సంప్రదాయ విద్య అందినంత మాత్రాన దళితులను సమానంగా చూశారని కాదు. “శిల్పాన్ని మెచ్చుకుని శిల్పిని వెలివేస్తున్నారని” కవి జాషువా రాశాడు. అయితే, సంప్రదాయ బ్రాహ్మణులు కనీసం శిల్పాన్ని (కళని, కవిత్వాన్ని) అయినా మెచ్చుకున్నారు. జాషువా లాంటి కొందరు దళిత ప్రముఖ కవులకు, తిరుపతి వెంకట కవులు అంటే బ్రాహ్మణ పండిత కవులు గండపెండెరాలను తొడిగారు, మెచ్చుకుంటూ రాశారు, ఆస్తులు ఇచ్చారు. ఆధునిక కవులు జాషువ ఉనికినే గుర్తించలేదు. వైతాళికుల కవిత్వ సంకలనంలో ఆయన కవిత ఒక్కటి కూడా చేరలేదు. నిజానికి ఆనాటికి అనేకమంది దళితులు పద్య కావ్యాలు రాశారు, వాటి నుంచి కూడా పద్యాలు చేర్చలేదు. ఆధునిక కవులు వారిని అసలు గుర్తించలేదు.

పద్యంపై విప్లవ కవుల విమర్శ: ఫ్యూడలిజం vs ప్రజాస్వామ్యం

విప్లవ కవి శ్రీశ్రీ, కృష్ణశాస్త్రిని ‘మొదటి స్థాయి కవి’ అని, జాషువను ‘ద్వితీయ స్థాయి కవి’ అని అన్నారు. ఈ కామెంట్ ఆధారంగా శ్రీశ్రీని కొందరు దళిత మేధావులు కులతత్వం ఉందని అన్నారు, కానీ అది పూర్తిగా తప్పు. విశ్వనాథను అధిక్షేపిస్తూ, జాషువను మెచ్చుకుంటూ శ్రీశ్రీ ఒక కవిత రాశాడు కూడా: “ఎంకిపాట వన్స్‌మోర్ కవి కోకిల గబ్బిలం, విశ్వసత్యనాథాయన అగ్గిమీద గుగ్గిలం.” ఫ్యూడలిజం (భూస్వామ్య వ్యవస్థ) పాతది అని, ఊడ్చిపారేయాలని అభ్యుదయ కవుల ఆగ్రహం. పద్యం ఫ్యూడల్. వచన కవిత్వం అంటే ప్రజాస్వామ్యం, ఆధునికం అని వారి అభిప్రాయం. అప్పుడు పద్య కావ్యాలనే రచించిన జాషువను విప్లవ కవులు ఎలా మెచ్చుకుంటారు?

కమ్యూనిస్టుల భూస్వామ్య వ్యతిరేక వాదనలు

విప్లవ రచయితల సంఘం కార్యదర్శి వి. చెంచయ్య అరుణతార మాసపత్రిక, సెప్టెంబర్ 1995 సంచికలో జాషువ దృక్పథంలో వైరుధ్యాలు అనే సంపాదకీయ వ్యాసం రాసారు.

“హిందూ సమాజంలోని కొన్ని సంప్రదాయాలు జాషువా అవమానాలు పాలు కావడానికి కారణాలు అయితే, అదే సమాజంలోని భూస్వామ్య వ్యవస్థకు చెందిన మరికొన్ని సంప్రదాయాలు బిరుదులు సన్మానాలు వగైరా జాషువకు ఆనందాన్ని కలిగించాయి. భూస్వామ్య వ్యవస్థలోని విలువలలో వ్యక్తిగతంగా తనకు ఉపయోగపడే వాటిని జాషువా వ్యతిరేకించలేదు. మనిషిగా నిలబడడానికి కవిగా నిలదొక్కుకోవడానికి తల్లిదండ్రులని భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి కొన్ని పాత కవిత సంప్రదాయాలతోనూ సంఘం ఇచ్చే విలువలతోనూ పాత ఆచారాలతోనూ జాషువా రాజీ పడవలసి వచ్చిందని ఆయన కుమార్తె హేమలత గారు పేర్కొన్నారు. ఆ మాటల్లోని వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆర్థికంగా శక్తి లేని సాంఘికంగా గౌరవం లేని కులంలో పుట్టి అడుగడుగునా అవమానాలు పొందిన జాషువా వ్యక్తిగా కవిగా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని విషయాలలో రాజీపడడం అనివార్యమని అనుకున్నాడు. జాషువా పొందినన్ని సన్మానాలు గాని అవమానాలు గాని ఎవరూ పొంది ఉండరు. ఒక విధంగా అవమానాలతో మండిపడ్డా జాషువా హృదయం సన్మానాలతో చల్లబడిందేమో”

ఐతే ఇక్కడ భూస్వామ్య వ్యవస్థలో సేద తీరాడు, లబ్దిపొందాడు అనేది విమర్శ. ఇది చాలా పెద్ద నేరం కమ్యూనిస్ట్‌ల దృష్టిలో. పెట్టుబడిదారుల ఆశ్రయం కన్నా హీనం అది. ఈయన మెచ్చిన అభ్యుదయ విప్లవకవులు పెట్టుబడిదారుల ఆశ్రయమే పొందారు, జర్నలిజం, సినిమా వంటి ఆధునిక మార్గాల ద్వారా. సినిమాల కోసం భక్తి పాటలు, భక్తి సినిమాలకు మాటలు రాశారు. విదేశీ యానం కూడా చేయగలిగారు. విదేశాల్లో కూడా మన్నన పొందారు.

పద్య ప్రేమికుల పైన పెద్ద బండవేస్తారు కమ్యూనిస్టులు. బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావులు పద్యానికి కాలం చెల్లలేదు అంటూ పద్య రచన పట్ల ప్రేమ చూపుతూ వ్యాసాలు రాసారు. వాటిని ఖండిస్తూ చెంచయ్య ఒక సూత్రీకరణ చేస్తారు. పద్య పునరుద్ధరణ వాదం వెనుక, బాబ్రీ మసీదు విధ్వంసం వెనుక కూడా బ్రాహ్మణీయ భావజాలమే ఉంది అంటారు చెంచయ్య. దీన్ని గొప్ప తాత్విక సూత్రీకరణ అంటారు విప్లవ కవి వరవరరావు.

జాషువ జీవితాంతం పద్యాన్ని విడిచిపెట్టకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తారు చెంచయ్య. భావకవులు, అభ్యుదయకవులు అందరూ పద్యం నుంచి గేయం వచన కవితలలోకి ప్రయాణించారు కానీ జాషువ పద్యంలోనే నిలిచిపోయారు. అంటే ఈ విప్లవ విమర్శకుడు దృష్టిలో ఫ్యూడల్ గా మిగిలిపోయాడు. రాయలసీమ ప్రాంతంలో అక్షరాస్యులు కానివారికి కూడా వేమన పద్యాలు ఒకటి రెండూ రాకుండా ఉండవు అని, ప్రజలలో వ్యాపించిన పద్యకవులు ఉన్నారు అని అంగీకరిస్తాడు చెంచయ్య. కానీ జాషువ పద్యాలు కూడా ఇలాగే కొన్ని చోట్ల ప్రజల నాలుకలపై ఉన్నాయి. తిరుపతి వెంకట కవుల పద్యాలు, హరిశ్చంద్ర నాటక పద్యాలు కూడా ఒకప్పుడు ప్రజలలో బాగా వ్యాప్తి చెందాయి కానీ వచన కవిత్వం అలా వ్యాప్తి చెందలేదు అనే విషయాన్ని ఈ కమ్యూనిస్ట్‌లు విస్మరిస్తారు. (ఇలా ప్రజాదరణ పొందిన పద్యాలలో చెంచయ్య మెచ్చిన దేశీ ఛందస్సులు మాత్రమే కాదు, వృత్తపద్యములు కూడా ఉన్నాయి). వచన కవిత్వం ఎప్పుడూ నగర మధ్యతరగతికి చెందినది, ఆధునిక విద్యావంతులకు చెందినది. అందుకే కమ్యూనిస్టు ప్రచారానికి గ్రామీణ పాట, ఒగ్గుకథ వంటి ప్రాచీన గ్రామీణ కళారూపాలు పనికి వచ్చాయి కానీ వచన కవిత వంటి ఆధునిక రూపం కాదు.

ఒకచోట వచన కవులకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండదు అని అంగీకరిస్తాడు చెంచయ్య. కానీ పద్యానికి ప్రజాదరణ ఉండడం గురించి కొంతవరకు అంగీకరించిన చెంచయ్య, జాషువ ఆత్మకథతో సహా అన్నీ పద్యాలలోనే రాసుకున్నాడు అని విమర్శిస్తూ, వచన కవిత్వం రాయనందుకు ఎందుకు తప్పు పట్టాడు? పద్యం ఫ్యూడల్ అని కమ్యూనిస్ట్ సూత్రీకరణ. ఐతే పాట, ఒగ్గుకథ వంటివి గతించిన గ్రామీణ భూస్వామ్య రూపాలు కాదా? ప్రజలలో వ్యాప్తి వుండచ్చు. పద్యానికి కూడా ఉండేది అది అసలు విషయం కాదు. పాత పద్యాలలోనే కాదు, గ్రామీణుల పాటలలో, సామెతలలో, మాటలలో ఎన్నో ఫ్యూడల్ విలువలు ఉంటాయి. అయినా పాటను ఎందుకు పట్టుకొన్నారు కమ్యూనిస్టులు? పద్యాన్ని గతంలోకి ఎందుకు నెట్టారు? పద్యాన్ని మాత్రమే ఫ్యూడల్ అని ఎందుకు అన్నారు? ఇది ఒక వైరుధ్యం. తెలుగు భాషలోని యీ లోపాల గురించి దళితవాదులు సామాజిక మాధ్యమాలలో విమర్శించడం చూస్తాం.

ఈ వైరుధ్యాన్ని కంచ ఐలయ్య మాత్రమే పరిష్కరించారు. ఇంగ్లీషు శ్రామిక భాష, తెలుగు ప్రజావ్యతిరేక బ్రాహ్మణీయ భాష కనుక తెలుగును నిర్మూలించాలి అని ఐలయ్య తర్కం. కమ్యూనిస్టుల తాత్వికతకు అనివార్య పర్యవసానం ఇది. ఫ్యూడల్ అనేది ఆధునిక దృష్టిలో పెద్ద తిట్టు పదం. కమ్యూనిస్టు కవులు శ్రీశ్రీ, ఆరుద్రలు సినిమాలలో పాటలు రాసి గౌరవం పొందారు, డబ్బు సంపాదించుకున్నారు. (శ్రీశ్రీ ఎమర్జన్సీ సమయంలో ఇందిరాగాంధీని మెచ్చుకుంటూ కవిత్వం రాశాడు. విరసం ఆగ్రహానికి గురయ్యాడు అనుకోండి) కమ్యూనిస్టు మేధావి రాంభట్ల ఒక పెద్ద పత్రికలో ఎడిటర్‌గా ఉన్నాడు. ఆ సంస్థలో జరిగిన సమ్మెను వ్యతిరేకించి, యాజమాన్యం పక్షం వహించాడు. రాంభట్ల మన ఆధునికత సారాన్ని తెలిపే మాట అన్నాడు: “ఫ్యూడల్ కన్నా పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనశీలమైనది. కనుక పెద్ద పెట్టుబడిదారైన మా పత్రిక యజమాని గౌరవనీయుడు. ” “అంతేకాదు ఫ్యూడల్ భావాలు ఇంకా వదిలించుకోలేకపోయిన తన కమ్యూనిస్ట్ మిత్రుల కన్నా, తమ గొప్ప పెట్టుబడిదారు యజమాని పురోగమనానికి ప్రతీక అన్నాడు.

టి. రవిచంద్, రాంభట్ల కృష్ణమూర్తి ఆత్మకథ ‘సొంత కథ’ను విశ్లేషిస్తూ ఇలా అంటారు: “రాంభట్ల కృష్ణమూర్తి కేవలం అభ్యుదయ కవి, రచయిత మాత్రమే కాదు; ఆయన పండితుడు, పరిశోధకుడు కూడా. కౌటిల్యం తెలియని కమ్యూనిస్టు ఆయన. నిర్భయంగా, నిజాయితీగా తన భావజాల మిత్రుల, నాయకుల ఫ్యూడల్ మనస్తత్వాన్ని బయటపెట్టి, ‘వీరికంటే పెట్టుబడిదారుడైన రామోజీ రావే నయం’ అని ప్రకటించినవాడు. కమ్యూనిస్టుల పరిభాషలో, వారి దృష్టిలో ఫ్యూడలిజం కన్నా పెట్టుబడిదారీ విధానం అభ్యుదయకరమైందని చెప్పి, పెట్టుబడిదారుడైన తన మిత్రుడు రామోజీరావు వెయ్యి రెట్లు ఎక్కువ అని అనగలిగిన ధీశాలి రాంభట్ల కృష్ణమూర్తి. ”

విప్లవ వీరుడు పరిటాల రాములు గురించి ఒకరు రాసిన ఒక విప్లవ గీతంలోని వాక్యాలు ఇవి: “రాలిపడక తప్పవు భూస్వామి తలల గుత్తులు.”

కమ్యూనిస్టుల వాదన ఏమిటంటే, భారతదేశం ఇంకా భూస్వామ్య వ్యవస్థలోనే పునాది కలిగి ఉంది. ఆధునిక విలువలను సంతరించుకోలేదని వారి అభిప్రాయం. పెట్టుబడిదారీ వ్యవస్థ భూస్వామ్యం కంటే పురోగమనశీలమైనది, భూస్వామ్యంలోని చెడుగుకు స్తబ్ధతకు విరుగుడు అని కమ్యూనిస్టుల సిద్ధాంతం. దీనికి ప్రతిధ్వని అన్నట్లు బహుజన విమర్శకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య అంటారు: “ఇంకా ఆధునికతనే రాలేదు, అత్యాధునికత (పోస్ట్ మోడర్నిజం)కూడానా?” అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు విమర్శకులు ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి అభిప్రాయం ఇది: “విప్లవం అంటే రైతాంగ విప్లవమే. భూస్వామ్య ఆర్థిక పునాది మీద ఏర్పడిన రాజకీయ వ్యవస్థను సమూలంగా పెకలించే కార్యక్రమమే విప్లవం.”

ఈ భూస్వామ్య వ్యతిరేకత అనే భావజాలం కమ్యూనిస్టులు నుంచి ఈనాటి పోస్ట్ మోడర్న్ విమర్శకుల వరకు అందరినీ ఒకేలా వెంటాడడం విశేషం. భూస్వామ్య వ్యతిరేకత ముసుగులో వీరు సాహిత్యానికి ఆధునిక వలసవాద హద్దులు ఏర్పరిచారు అనేది అసలు గమనించాల్సిన విషయం. పోస్ట్ మోడర్న్ విమర్శకుడు బి. తిరుపతి రావు ఆలోచనలు ఇందుకు నిదర్శనం “కవి వేగుంట మోహన ప్రసాద్ వాచకం మొత్తంలో మనకు కనిపించేది సమకాలీన సామాజిక బీభత్సాన్ని తిరస్కరిస్తూ ప్రత్యామ్నాయాన్ని ఫ్యూడల్ విలువలతో ప్రతిపాదించటం, కనీసం సూచించటం. ‘మో’ కి ఫ్యూడల్ విలువల మీద అచంచలమైన విశ్వాసం. ఇది అక్కడక్కడ ఫెటిష్ గా కూడా కనపడుతుంది. ఫ్యూడల్ విలువల పట్ల ఈ ఆరాధన స్థాయి భవిష్యత్తు మీద అప్పుడప్పుడు భయాన్ని కలిగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.” (సాంధ్య భాష కవితా సంకలనం ముందు మాట).

ఈ విమర్శ లో పోస్ట్ మోడర్న్ విమర్శకుడు తిరుపతి రావు కూడా కమ్యూనిస్టులు లాగే ఫ్యూడల్ విలువల పట్ల ప్రత్యేకంగా భయం వ్యక్తం చేశారు. అలాగే ఇదే ముందుమాటలో ఈ కవిలో భౌతిక వాదం లోపించడం, మితిమీరిన అంతర్ముఖత్వం గురించి కూడా విమర్శించారు. సంస్కృత పద ప్రయోగాలు ఎక్కువగా ఉండడాన్ని విమర్శించారు.

ఆధునికతను తీవ్రంగా విమర్శించే పోస్ట్ మోడర్న్ విమర్శకుడు కూడా గతకాలపు ఫ్యూడల్ విలువల గురించి ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. కమ్యూనిస్ట్ లతో మొదలుకొని ఇలాంటి పోస్ట్ మోడర్న్ విమర్శకుల వరకు ఫ్యూడల్ అనేది స్తబ్ధత కు, మృత భాషకు, అవాస్తవికతకు మూర్ఖత్వానికి క్షీణ విలువలకు సింబల్. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్థ చలనానికి చారిత్రక పురోగతికి వ్యక్తి చైతన్యానికి సింబల్. అందుకే ఫ్యూడల్ విలువల వల్ల భవిష్యత్తు మూసుకుపోతుందనే భయం వ్యక్తం చేశారు యీ అత్యాధునిక విమర్శకుడు. ఈయన మోహన్ ప్రసాద్ కవిత్వం లో నోస్టాల్జియా గురించి చాలా మాట్లాడుతాడు కానీ, భారత ఖండం లో సంస్కృతి గ్రామీణత గతం కాదు.
ఇక్కడ గతం పూర్తిగా గడిచిపోలేదు. గ్రామం మాయం కాలేదు. పాశ్చాత్య నాగరికతకు సంబంధించిన సిద్ధాంతాలను మక్కికి మక్కీ ఇక్కడ దించడం వల్ల ఆధునికత వాదులు కమ్యూనిస్టులు దగ్గర నుంచి తిరుపతి రావు వంటి అత్యాధునిక వాదుల వరకు పొరబడ్డారు. 1970 లో తోటి దిగంబర కవులకు రాసిన బహిరంగ లేఖలో, కమ్యూనిజాన్ని యూరప్ నుంచి యథాతథం గా పాశ్చాత్య దేశాలు నుంచి అరువు తెచ్చుకొన్నారు అని మహా స్వప్న అసంతృప్తి వ్యక్తంచేశారు. 19వ శతాబ్దపు చిరిగి కంపుకొడుతున్న యూరోపియన్ కోటును (సిద్ధాంతాలు) ధరించాలి అని సాహితీ వేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు అని విమర్శించాడు దిగంబర కవి మహాస్వప్న. ఇది కమ్యూనిస్ట్ లు మొదలుకొని అందరు తెలుగువాళ్లలో కనబడే సాధారణ తర్కం.

అందుకే కళారూపంగా పద్యం భూస్వామ్య అవశేషం, గతకాలానికి చెందినది కమ్యూనిస్టుల ప్రగతి శీలుల ఆధునికుల దృష్టిలో.

పద్య కవులు vs వచన కవులు

“ఛందో బందోబస్తుల్ని ఛట్ ఫట్ మని తెంచేసి గద్యానికి పద్యానికి పెళ్లి చేద్దాం” అన్నాడు శ్రీశ్రీ.

బస్తాలకు బళ్ళకెత్తు పద్యాలా కవిత్వం
ప్రాచీనత పవిత్రమా పనికిరాదా నవత్వం
ప్రపంచాన్ని చూడలేని కవిత నిజం చూపదు
ఇసుకలోన తలదూర్చిన ఉష్ట్ర పక్షి బాపతు.
(ప్రాసక్రీడలు, శ్రీశ్రీ)

“వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను” అన్నాడు కవి పఠాభి. ఇంతగా పద్య కవిత్వంపై తిరుగుబాటు జరుగుతున్నా, దళిత కవులు మాత్రం పద్య కావ్య ప్రపంచంలోనే మిగిలిపోవడం విశేషం. భావ కవులు పాశ్చాత్య భావాల వల్ల ప్రభావితులై పద్యాన్ని కూడా ఆధునీకరించారు. సరళం చేశారు. సంక్లిష్ట ఆధునిక ప్రతీకలు చొప్పించారు పద్యాలలోకి. కానీ జాషువతో మొదలుకొని దళితకవులు అందరూ ఈ ఆధునిక రీతిలోకి మారలేదు. వారిని పాశ్చాత్యం తాకలేదు. పాతపద్ధతిలోనే పద్యాలు రాసారు. వచనకవిత్వం అసలే రాయలేదు. అప్పటికి దళితులు ఇంకా గ్రామాలు, చిన్న పట్టణాలలోనే మిగిలిపోవడం దీనికి కారణం. దళితులు నగరీకరణ చెంది, ఆధునికతలోకి పూర్తిగా అడుగుపెడితే కానీ వచన కవిత్వంలోకి మారడం అసాధ్యం. ఆధునిక రచనా రీతులలోకి ప్రవేశం దుర్లభం. జాషువ వచన రచనలు కూడా చాలా వరకు గ్రాంథిక వాసన కలిగివుంటాయి.

వచన కవిత్వం: అగ్రవర్ణాల సొత్తు?

నిజానికి, వచన కవిత ఖరీదైన ప్రక్రియ. కారులో ప్రయాణం హాయిగా ఉంటుంది, ఎద్దుల బండి నడపడం కన్నా చాలా సులభం. అమెరికాలో కార్లు చాలా వేగంగా పరిగెడతాయి, కానీ కార్లు నడపడానికి అటువంటి నాగరికతలోకి ప్రవేశం అవసరం. అలాగే, నగరీకరణలోకి కొందరు అగ్రవర్ణాలు మాత్రమే ప్రవేశించగలిగారు. వాళ్లు ఎద్దుల బండిని ఫ్యూడల్ అని వెటకారం చేశారు, నడకలో కాలగమనంలో పురోగమనంలో మందకొడితనంగా భావించారు. “మందగించక ముందుకడుగేయ్” అని గురజాడ ఎప్పుడో అన్నాడు. కానీ, దళితులు గ్రామాలలో, పద్య సన్నిధిలో నిలిచిపోయారు. దళిత కవి జోసెఫ్ తన కుల వృత్తి నైపుణ్యం గురించి, దళితుడి గర్వాన్ని, ఆత్మాభిమానాన్ని చెప్పులు కుట్టే వృత్తికి సంబంధించిన మాండలిక పదాలతో పద్యంలో వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో దళితుడిని శ్మశాన వాసి శివుడితో పోలుస్తూ, దళితుల దీనస్థితిని, దోపిడీని వర్ణిస్తాడు కవి జోసెఫ్. ఈయన జాషువకి సమకాలికుడు. ప్రతిభావంతులైన పద్య కవులు జోసెఫ్, బిర్నీడి మోషే ఇద్దరూ జాషువ లాగే వినుకొండ వాళ్లే కావడం విశేషం. జోసెఫ్ మొదటిసారిగా సరళ గ్రాంథికంలో రాసిన గద్య కావ్యం చంద్రహాసం. “రాయప్రోలు చిదంబర శాస్త్రి గారి అనుగ్రహంతో ఆర్జించిన అల్ప భాషా జ్ఞానంతో ఈ కావ్యాన్ని రాశాను” అని ఆయన వినయంగా చెప్పుకున్నాడు. జోసెఫ్ రాసిన కన్నీటి కబురు అనే గద్య కావ్యం ప్రసిద్ధం. కుసుమ ధర్మన్న,, బిర్నీడి మోషే, జోసెఫ్ కవి, యడ్లపల్లి సామ్యూల్, సుజ్ఞానానంద కవి మొదలైన ఎందరో దళిత కవులు పద్య కావ్యాలు రాశారు. ఈ పద్య కవుల్లో కొందరు సంప్రదాయవాది విశ్వనాథ సత్యనారాయణ గారి మెప్పు కూడా పొందారు.

“హరిజనులలో నేడు మంచి కవులు పుట్టినారు. పుట్టుచున్నారు. మనము ఏర్పాటు చేయబోవుచున్న ఒకానొక సామ్యవాద రాజ్యాంగమునకు ఇది గొప్ప శుభసూచకము’’ (జ్ఞానానంద కవి ‘అక్షరాభిషేకం’ కావ్యానికి ముందుమాట) అని విశ్వనాథ సత్యనారాయణ ప్రకటించడం విశేషంగా భావించవచ్చు. మిగతా కవుల కంటే హరిజన కవులు కరుణ రసము ఉట్టిపడునట్లు కవిత్వం రాస్తున్నారని విశ్వనాథ ప్రశంసించాడు.

పద్య కావ్యాలలో మాదిగ వాడలు, పీడిత కులాల కుల వృత్తులు, దోపిడీ, పీడన అన్నీ గ్రాంథిక భాషలో, ఛందస్సులో వ్యక్తమయ్యాయి. వచన కవిత్వం పూర్తిగా ఆంగ్ల విద్యావంతులైన అగ్రకులాల సొత్తుగా మిగిలిపోయింది. ఇదొక వైచిత్రి. వచన కవిత్వం ఆధునికుల వైయక్తిక అనుభూతి కి చెందినది. సామూహికత కు చెందిన మౌఖికతకు అది దూరం. అందుకే నాటి వచన కవితలో కులం, సంస్కృతి ప్రసక్తి లేదు.

గ్రాంథిక భాషకు వ్యాకరణం రాసిన చిన్నయసూరి అబ్రాహ్మణుడు. ఆయనను చూసి బ్రాహ్మణ పండితులు ఈర్ష్య పడ్డారు.

ముద్రణాయంత్రం, లేఖనం, వ్యావహారిక భాష వీటి సహాయంతో వృద్ధి చెందిన వచన కవిత్వం, కథ, నవల వంటి ప్రక్రియలు ఎక్కువగా అగ్రవర్ణాల కవుల సొత్తుగా మారాయి. ఆంగ్ల విద్య, ఆంగ్ల గ్రంథాల ప్రభావం వల్ల వ్యక్తివాద సంక్లిష్టత వైపు ఈ సాహిత్యం ప్రయాణించింది. వారికి భిన్నంగా, సంస్కృత-తెలుగు భాషా సాహిత్యాల ప్రభావంతో గ్రామీణ వాతావరణంలో పెరిగిన దళితులు, ఆంగ్ల విద్య లేని బ్రాహ్మణులు నేర్పిన చదువుతో, మాండలిక పదకోశంతో గ్రాంథిక భాషలో పద్య కావ్యాలు రాశారు. వాటిలో ఆంగ్ల భాషా సంపర్కం అసలే లేదు. ఎక్కువగా అచ్చ తెలుగు, గ్రామీణ వాడ నుడికారం, సరళ సంస్కృత పదాలు, వాడ జీవితం ఈ దళిత కవుల కావ్యాలలో ప్రవేశించాయి. ఆంగ్ల పరిపాలన లేని తెలంగాణలో పద్యమే రాజ్యం చేసింది. కవి దాశరథి పద్యం, పాటల ద్వారా ప్రసిద్ధులయ్యారు. వచన కవిత్వం కూడా రాసినా, పద్యం ద్వారానే మొదట ప్రసిద్ధులయ్యారు.

వ్యావహారిక భాషా ఉద్యమం, ఆంగ్ల ఆధిపత్యం

నిజమైన వ్యావహారిక భాషను వ్యాప్తి చేసినవాడుగా ప్రసిద్ధి చెందిన గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం లో ప్రధాన పాత్ర గిరీశం ఆంగ్లం విరివిగా వాడతాడు. అప్పటికి ఆంగ్ల విద్య చాలా తక్కువ. సరళమైన ఆంగ్ల పదాలే కాకుండా, సామాన్య పరిజ్ఞానం కలవారికి అందని కఠిన ఆంగ్ల పదాలు కూడా చేర్చాడని గురజాడపై విమర్శలు వచ్చాయి. ఆ రోజులలో గురజాడ అనుయాయులు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు, ఆరుద్ర వంటివారు వచన కవిత్వంలో పాశ్చాత్య దేశాలలో వచ్చిన ఆధునిక కవితా ప్రయోగాలు డాడాయిజాలు, సర్రియలిజాలు ప్రవేశపెడుతుంటే, దళిత కవులు వాడ నుడికారం, సంస్కృత పదాలు వాడుతూ పూర్తిగా స్థానికతలో గ్రామీణ భారతంలో మిగిలిపోయారు. “సుకవి జీవించు ప్రజల నాలుకలయందు” అన్నాడు జాషువ. అంటే మౌఖికం అన్నమాట. హరిశ్చంద్ర నాటకంలో కాటిసీనులో జాషువా పద్యాలు చేరాయి. ఆంధ్ర దేశమంతా పద్య నాటకాల హవా నడిచింది. ఆధునిక రచయిత గురజాడ వ్యావహారిక భాషలో రాసిన కన్యాశుల్కం నాటకం మరుగున పడిపోయింది. “చెల్లియొ చెల్లకో తమరు చేసిన తప్పులు సైచిరందరున్” లాంటి పద్యాల వల్ల తిరుపతి వెంకట కవులు రాసిన మహాభారతం ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధికెక్కింది. సాంఘిక సమస్యలతో కూడిన చింతామణి లాంటి నాటకాలు కూడా పద్య నాటకాలుగానే వేదికలకెక్కాయి. పాట, పద్యం లాంటి మౌఖిక కళారూపాలే తెలుగునాట వన్నెకెక్కాయి.

దాంతో కమ్యూనిస్టు సంఘాలు కూడా గ్రామీణుల గీతాల బాణీలనే తీసుకొని కమ్యూనిస్టు భావాల సందేశాలని ప్రచారం చేశారు. పుస్తకాల ద్వారా కన్నా, పాటలు, ఒగ్గు కథలు లాంటి మౌఖిక రూపాల ద్వారానే కమ్యూనిజాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. రాజస్థానాలలో విలాసంగా జీవించిన కవుల ప్రబంధాల ద్వారా పద్యం వృద్ధి చెందింది కనుక అది ఫ్యూడల్. కానీ పాట పేదప్రజలకు చెందినది కనుక, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా విప్లవ భావాల ప్రసారానికి అనుకూలం అని కమ్యూనిస్ట్ ల భావన. ఐతే వేమన, వీరబ్రహ్మం లాంటి వారు కూడా పద్యాలు రాసారు. అవి ప్రజల్లోకి వెళ్ళాయి. వారు కేవలం దేశీ ఛందస్సు తేటగీతి ఆటవెలది వంటి పద్యాలే రాసి ఉండచ్చు కానీ పద్యం సాధారణ ప్రజలలో కూడా ఉంది. జాషువ వృత్త పద్యాలలో కూడా దళితుల పేదల వేదన పలికించాడు. కానీ కమ్యూనిస్ట్ లు వేదికలపై ఎటువంటి పద్యాలను ఆలపించేవారు కాదు. మొత్తంగా పద్యం ప్రగతి వ్యతిరేకం అనే భావన కారణం కావచ్చు. ముద్రణ యంత్రం వచ్చినా, దాని ప్రభావాన్ని నిలువరిస్తూ తెలుగునాట మౌఖిక సంస్కృతి నిలబడింది. అందుకే పాశ్చాత్య దేశాలలోలా భారతదేశంలో సినిమాలు ఉండవు; సినిమాలలో కూడా పాటలు ఉంటాయి. చంపూ కావ్య లక్షణాన్ని సంస్కృత నాటక లక్షణాన్ని యక్షగానం లాంటి కళారూపాలను మనం దాటలేదు. చైనాలో ఎప్పటినుంచో ముద్రణ యంత్రం వాడుకలో ఉన్నా, చైనాతో భారతీయ మొగల్ రాజులకి సంబంధాలు ఉన్నా, ముద్రణ సాంకేతికతను భారత్ స్వీకరించలేదు. ఆలస్యంగా ముద్రణ ప్రవేశించింది. భారతదేశం ప్రధానంగా మౌఖిక సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడమే కారణం అంటారు కొందరు మేధావులు. అంటే, ముద్రణ యంత్రం వచ్చినా పక్కనే మౌఖిక సంస్కృతి కూడా సమాంతరంగా కొనసాగుతూ వచ్చింది. లేఖనం మౌఖికత జంటగా కొనసాగుతూ రావడం అనే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఇలా వైరుధ్యాలు సమన్వయం కావడం భారతీయ లక్షణం.

కరణాలు రాసిన గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచుకొన్న మెకంజి కైఫీయత్తుల వల్ల తెలుగు సాహిత్యం సుసంపన్నం అవుతుందని గురజాడ అన్నాడు. “తమ వీధిలోకి వచ్చిన హరిదాసు వల్ల ప్రభావితుడనయి హరికథను రూపొందించాను” అన్నాడు హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు. గురజాడ లేఖనం, ముద్రణ, వ్యావహారిక భాషలకి ప్రాతినిధ్యం వహిస్తాడు. సమకాలికుడు ఆదిభట్ల మౌఖిక సంస్కృతికి, గ్రాంథిక భాషకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆదిభట్ల గొప్ప సంస్కృత పండితుడు సంస్కృత కవి అయినప్పటికీ, అచ్చతెలుగు లో కావ్యం రాశాడు. సంస్కృత ఆధిపత్యాన్ని తిరస్కరించాడు కూడా. అందువల్ల సంప్రదాయ వాదులు ప్రగతిశీలులు(ఆధునికులు) అంటూ బైనరీ విభజన సులభం కాదు. పాశ్చాత్య భావ ప్రేరితులు, స్థానిక భావజాలం కలవారు అని సౌలభ్యం కోసం వేరు పరిచి చెప్పవచ్చు కొంతవరకు. అవగాహన కోసం మాత్రమే.

ప్రామాణికతపై ప్రశ్నలు: వ్యావహారిక-గ్రాంథిక భాషా వాదాలు

వ్యావహారిక భాష అంటే ప్రజల భాష అని ప్రచారం చేశారు ప్రగతిశీలులు. ముద్రణ, ఆంగ్ల ప్రభావం, పత్రికా మాధ్యమం, ఆధునికతల నుంచి వ్యావహారిక భాష పుట్టినందువల్ల దాని వ్యాప్తి ఎక్కువని వాదించారు మేధావులు. గ్రాంథిక భాష ఫ్యూడల్ అన్నారు, వెనుకబాటు, తిరోగమనానికి చిహ్నం అని ఆడిపోసుకున్నారు. పద్యం, పద్య కావ్యాలు కాలం చెల్లినవి అన్నారు. ఈ అవగాహన ఆంగ్ల విద్యావంతుల, నాగరికుల అవగాహన మాత్రమే. ఈ సత్యాన్ని పాక్షికంగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. వ్యావహారిక భాషా వాదంతో పాటు, ‘ఏది ప్రామాణిక భాష’ అనే ప్రశ్న మొదలైంది. మాండలికాలు, ప్రాంతీయ భేదాల్ని అధిగమిస్తూ పత్రికలలో, పాఠ్య గ్రంథాలలో ఉపయోగించే ప్రామాణిక భాష కోసం వెతుకులాట మొదలైంది. ఒకే దేవుడులా ఒకే తెలుగు అవసరమైంది. దానికి కూడా గురజాడ దారి చూపాడు. ‘డిసెంట్’ పత్రంలో కృష్ణా-గోదావరి జిల్లాల ప్రజలు మాట్లాడే మాండలికం చాలా స్వచ్ఛమైనది, ఎక్కువ మంది ఉపయోగించేది కనుక ప్రామాణికంగా స్వీకరించాలి అన్నాడు. ఇక్కడ రెండు ప్రమాణాలు చూపాడు గురజాడ: ఒకటి ‘ప్యూరిస్ట్’ (స్వచ్ఛమైనది), రెండు ఎక్కువ మంది మాట్లాడేది. ‘ప్యూరిటీ-పొల్యూషన్’ అనే పదాలు ఆధునికులకు ప్రమాణం అనవచ్చా?

ఈయన చూపిన రెండవ ప్రమాణం మెజారిటీ. “పదుగురాడు మాట పాడియై ధర చెల్లు” అనేదే ప్రజాస్వామ్యం. దానిలోని లోపం కూడా అదే. అయితే, అసలు విషయం ఆ జిల్లాలకు అంతటికీ, అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలకు కలిపి ఒకే మాండలికం ఉందా? మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలలో కనబడేది కృష్ణా జిల్లా బ్రాహ్మణ మాండలికం. అందరికీ కలిపి ఒకే మాండలికం ఎలా సాధ్యం? ఆధునికత, టెక్నాలజీ, ప్రయాణ సాధనాలు, చదువు తెచ్చిన మార్పులు ఒకే రకం భాషని అక్కడ సృష్టించాయి అని గురజాడ అభిప్రాయమా? ఈ కోస్తావాదులు తెలంగాణ భాషని కించపరిచారు అని తెలంగాణ వాదం బలపడ్డాక ఆరోపణలు వచ్చాయి. ప్రామాణిక భాష మోనోపలీగా మారింది అనే విమర్శలు మొదలయ్యాయి. నిజానికి వ్యావహారిక భాష పేరుతో జరిగినది కూడా ఆధిపత్యమే తప్ప మరేమీ కాదు.

భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ అంటారు: “మొదటి తరం నుంచి ఈనాటి వరకు రచయితల్లో తీరాంధ్ర వాస్తవ్యులే అధిక సంఖ్యాకులు. ఆధునిక ప్రచార సాధనాలన్నీ అక్కడి వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇన్ని వసతులు సమకూడినందున, తీరాంధ్ర భాష (కోస్తా ప్రాంతీయ మాండలికం) నేటి ఆధునిక ప్రామాణిక భాషగా పరిణమించింది.” అంటే, ఆధునికత తెచ్చిన విచిత్రం ఏమిటంటే ఒక మాండలికం అన్ని మాండలికాల నెత్తిమీద కూర్చుంది. బూదరాజు ఇలా చెప్తూ హితవు చెప్తారు: “శిష్ట భాషను కానీ, చివరకు పరమ మూర్ఖుడైన పల్లెటూరి వ్యక్తి మాట్లాడే స్థానిక మాండలికాన్ని గాని పరిహసించడం తెలియనితనం.” అంటే, పల్లెటూరి వ్యక్తి ‘పరమ మూర్ఖుడు’ అన్నమాట. ఈ భావన నుంచే మన ఆధునికత బలిసింది. ఆ బలుపు నుంచే వ్యావహారిక భాషా వాదం పుట్టింది.

ఈ వ్యావహారిక భాషా వాదం లోగుట్టు బయటపెట్టారు సోషలిస్టు, విశ్వనాథ అభిమాని జువ్వాడి గౌతమరావు. కోస్తా భాష ఆధిపత్యంపై ఈ తిరుగుబాటు ఇంచుమించుగా గ్రాంథిక-వ్యావహారిక భాషా వాదాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జరిగింది.

జువ్వాడి గౌతమరావు 1959-60 జయంతి పత్రిక సంచికలలో ఆధునిక వ్యావహారిక భాష పేరుతో సాగుతున్న ఆధిపత్యంపై ధ్వజమెత్తారు. వ్యావహారికం అనేది కృష్ణాజిల్లా బ్రాహ్మణ భాష అని,, ఈ భాషని అన్ని కులాలు, అన్ని ప్రాంతాలపై రుద్దారని ఆయన అన్నారు. దీనివల్ల ఇతర ప్రాంతాల మాండలికాల వారు మాట్లాడడానికి, రాయడానికి భయపడతారు. నేటి వ్యావహారిక రచనలు అన్నీ విజాతీయ, విదేశీయ రచనలు మాత్రమే. వీటిలో పల్లెటూరి నుడికారాలు లేవు. పత్రికలది బాధ్యతారహితమైన ప్రవర్తన. అయితే, గౌతమరావు తెలుగు భాష అభివృద్ధికి సంస్కృతం అవసరం అని కూడా అన్నారు. ఆంగ్ల భాష కన్నా పద సంపద ఎక్కువగా ఉన్న సంస్కృత భాష తెలుగు అభివృద్ధికి అవసరం అన్నారు. వ్యావహారిక వాదం వల్ల ప్రాచీన కావ్యాల మీద గౌరవం సన్నగిల్లుతోందా అని కూడా ప్రశ్నించారు. ఈ వాదన కేవలం వ్యావహారిక భాషా వాదానికి పరిమితమైనది కాదు. పురోగతి పేరుతో వచ్చిన ఆధునికత, టెక్నాలజీ, పత్రికలు, ఆంగ్ల భాష, కులం – ఇవన్నీ కలిసి చేస్తున్న ఆధిపత్యంపై ప్రశ్న ఇది. సార్వజనీనత, విశ్వజనీన భాష అనే పదాలు సర్వజనామోదయోగ్యంగా పైకి కనిపిస్తాయి, కానీ వాటి వెనక ప్రత్యేకతలని, ప్రత్యేక జాతులు, సంస్కృతులు, భాషలని అణిచివేసే కుట్ర ఉంటుంది. ఈ కుట్ర జువ్వాడి గౌతమరావు మాటల్లో బట్టబయలు అయింది. కన్నడ బహుజన మేధావి డి. ఆర్. నాగరాజు ఈ విశ్వజనీన తర్కంలోని లొసుగులను ఇలా చెప్తాడు: “అసలు విశ్వజనీనమైన అభివృద్ధి నమూనాలోనే దానికి అపరిచితమైన జీవన విధానాలను అర్థం చేసుకోలేని లోపం ఉంది. తనకు తెలియని దాన్ని, ఇతరాన్ని అది భరించలేదు. ”

వ్యావహారిక భాష రుబాబు, ఆంగ్లభక్తి, భవిష్యత్ దిశ.

వ్యావహారిక భాష గురించి అసమ్మతి పత్రంలో గురజాడ అభిప్రాయాలను చదివితే ఒక కొత్త ఆధిపత్యం, వ్యావహారిక భాష పేరుతో రూపొందిన విధానం తెలుస్తుంది. గురజాడ శిష్టుల వ్యావహారిక భాషను ఇతరులు నేర్చుకోవడం జరుగుతుందని చెప్పాడు. ఉన్నత కులాల వారి నుండి తక్కువ కులాల వారు నేర్చుకోగలరని, ఇప్పుడు పట్టణాలలో పనిచేస్తున్న నౌకరులు ఈ విధంగానే నేర్చుకుంటున్నారని చెప్పారు. అది నిజమైన అంతరాలు అంతమవడానికి కారణం అవుతుంది, అందరికీ శిష్టుల భాషను అలవర్చుతోంది అంటాడు గురజాడ. వ్యావహారిక భాష అంటే శిష్ట భాష అంటే అగ్రవర్ణాల భాష. ఈ అగ్రవర్ణాలు ఎక్కడివారు? వారి చిరునామా ఏమిటి? గురజాడ అది కూడా స్పష్టం చేస్తారు. వాళ్ళు నగరాలలోని ఆంగ్ల విద్యావంతులైన బ్రాహ్మణులు. గ్రామీణ చాందస బ్రాహ్మణులు ఏమాత్రం కాదు. “బెంగాల్ బొంబాయి రాష్ట్రాలలో అత్యుత్తమ ఆంగ్ల విద్యా సంస్కృతులు ఉన్నవారు తమ దేశీయ భాషల్లో, వ్యావహారికంలో దీక్షగా రచనలు చేస్తున్నారు” అంటాడు. తెలుగు వ్యావహారిక భాషకి మూలం ఆంగ్ల పాలన, ఆంగ్ల విద్య, ఆంగ్ల సంస్కారం.

విమర్శకుడు శెట్టి ఈశ్వరరావు ఈ భాషా వివాదాలలో మొత్తంగా తెలంగాణ ఊసు లేకపోవడం గుర్తిస్తారు. తెలంగాణ భాష అంతర్వాహినిగా ఉందని తెలివిగా సర్ది చెప్తారు. ఈ అంతర్వాహిని తెలంగాణ భాష కోస్తా ఆధిపత్యంపై తిరుగుబాటు చేయడం మనం ఇటీవల చూశాం. తన వ్యావహారిక భాషా వాదానికి ఆంగ్లేయుల మాటలని గురజాడ ప్రమాణంగా తెచ్చుకోవడం ఆయన ఆంగ్ల వైఖరికి అనుగుణంగానే ఉంది. విలియం బ్రౌన్ తెలుగు వ్యాకరణంలో చెప్పిన మాటల్ని గురజాడ ప్రమాణంగా చూపుతాడు. “ఉత్తర సర్కారులోని ఉన్నత వర్గాలు, ప్రత్యేకించి విశాఖపట్నం జిల్లాలోని రాచకులానికి చెందిన విద్యావంతులు, మర్యాద, మన్నన ఆత్మాభిమానానికి పేరు మోసిన తెగ వారిది. వారు మాట్లాడే భాష ఈనాడు మాట్లాడే మాండలికాలలోకెల్లా స్వచ్ఛమైనది, నిర్దిష్టమైనది. తెలుగు నేర్చుకునే యూరోపియన్లు కృష్ణానది ఉత్తరాన ఏదో ఒక జిల్లా నుంచి అధ్యాపకుడిని ఎంచుకోవాల్సింది” అని ఆయన సలహా ఇచ్చాడు. మరో ఆంగ్ల మేధావి ఆర్డెన్ తన తెలుగు వ్యాకరణం లో ఇలా అంటాడు: “కృష్ణా-గోదావరి జిల్లాల్లో మాట్లాడే తెలుగును అతి స్వచ్ఛమైన, విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ తెలుగును ప్రామాణికమైనదిగా స్వీకరించాం.” రావు బహదూర్ కె. వీరేశలింగం గారు కూడా తీరాంధ్ర లో స్వచ్ఛమైన తెలుగు ఉంది అంటారు. భాషలో ‘ప్యూరిటీ’ (స్వచ్ఛత) కోసం తపనపడ్డారు. గురజాడ అగ్రవర్ణాల భాషను ఇంగ్లీషు పాలనలో అభివృద్ధి చెందిన ప్రాంతాలవారి భాషను స్వచ్ఛమైనదిగా స్వీకరించారు. ఇది ఆధునిక ఆంగ్ల మనుస్మృతి.

ప్రజల నెత్తిమీద పిడుగు

గురజాడ గురువు అనదగిన గిడుగు రామమూర్తి పంతులు మాటలలోనే ఈ శిష్టత బీజాలు పడ్డాయి. పిఠాపురం రాజు సౌజన్యంతో బ్రాహ్మణ పండితులు కూర్చిన సూర్య రాయాంధ్ర నిఘంటువును విమర్శిస్తూ, అది ఆంగ్లేయులు స్వయంగా తయారు చేసిన ఆంగ్లనిఘంటువు స్థాయిలో లేదు అంటాడు వ్యావహారిక వాద పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు. ఇంగ్లీషు గ్రంథాలను క్రమపద్ధతిలో పరిష్కరించి ప్రచురించిన తరువాత వాటి ఆధారంగా పదాలను ఎన్నుకొన్నారు అని, మనకి ఇంకా ప్రాచీన గ్రంథాలు అందుబాటులోకి వచ్చినవే తక్కువ అంటారు. వాటిని పరిష్కరించే పద్ధతి కూడా లోపభూయిష్టంగా ఉంది అని విసుగు చెందుతాడు గిడుగు. ప్రజల వాడుకలో ఉన్న విదేశీ పదాలు ఇంగ్లీషు పదాలతో. సహా అన్నీ నిఘంటువులో చేర్చాలి. అలాగే సామెతలను గ్రాంథికంలోకి మార్చడం కాకుండా యథాతథంగా ప్రజలు పలికినట్లు చేర్చాలి అంటాడు. అలాగే యోని శిశ్నం వంటి పదాలు కూడా చేర్చాలి. భాషలో నిషిద్ధం ఏదీ లేదు అని విశాలదృష్టి చాటుకుంటారు కానీ దీనిలో ఒక మతలబు ఉంది. కవి చౌడప్ప వంటివారు వాటికి అచ్చ తెలుగు పదాలే స్వేచ్ఛగా వాడేవారు. వాటిని తీసుకోవాలి అనడానికి సాహసించరు గిడుగు. ఎందుకంటే. శిష్టత పట్ల ఆయనకు భక్తి. అందుకే శిష్ట వ్యవహారం లో ఉన్న మాండలికాలు మాత్రమే కవిత్రయం వంటి పూర్వ కవులు స్వీకరించారు అని చెపుతాడు.

మొత్తంగా చూస్తే ఇదంతా భాష గురించి గిడుగు కొంత విశాలదృష్టిని తెలియజేస్తున్నట్లు పైకి కనబడుతుంది. ప్రయోగ శరణం వ్యాకరణం అనే సుభాషితాన్ని ప్రమాణంగా చూసినట్లు కనబడుతుంది.

ఐతే గిడుగు వ్యావహారిక భాషను గ్రామ్యభాష అని పిలిచినందుకు బాధ పడిపోతాడు. ఆ అభిప్రాయానికి ఖండన గా వ్యావహారిక భాష శిష్టభాష అని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ఐతే శిష్టత అంటే ఏమిటి? దానికి కొలమానం ఏమిటి?

లోకయాత్రలో వ్యవహారజ్ఞులే శిష్టులు, అంటే నివాసతః ఆచారతః నివసించేప్రాంతం ఆచారవ్యవహారాలు బట్టి శిష్టులు ఎవరో తెలుసుకోవచ్చు వారి వ్యవహారమే ప్రమాణం. ఐతే ఇక్కడే లోకవ్యవహారం అంటే ఏంటో చెపుతూ, లోకము అంటే ‘మాలవాళ్ళు కాదండోయ్’ అంటాడు. ఇప్పుడు అర్థం అయిందా? గిడుగు నుంచి గురజాడ వరకు అందరూ వ్యావహారికాన్ని శిష్టత తో ముడివేశారు. ఆంగ్లేయులు, అగ్రవర్ణములవారు, ఇంగ్లీషు దొరలు పాలించే అభివృద్ధి చెందిన ప్రాంతాల నగరీకరణ చెందిన ప్రజలు వ్యావహారిక భాషకు మూలస్థంబాలు ఈ సంస్కర్తల దృష్టిలో.

ఐతే మరోచోట గిడుగు ఇలా అంటారు: “వ్యవహార శబ్దాలు తమ నిఘంటువులో కొంచమైనా చేర్చి నిఘంటు నిర్మాతలు తమ ఔదార్యము ప్రకటించినారు. హరిజనులను దేవాలయములోనికి రానిచ్చినట్లు ఉన్నది. గాంధీ మహాత్ముడు మన సంఘములోని అస్పృశ్యత కళంకము తొలగించినట్లే, ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకటించి మన భాషలోని గ్రామీణ కళంకము నేడు తుడిచి వేసినారు” ఐతే గిడుగు నిర్వచించిన శిష్టత ప్రకారం దళితుల మాటలకు ఆయన చెప్పే శిష్ట వ్యావహారిక భాషలో స్థానం లేదు. ఇదొక కంటి తుడుపు.

చిలకమర్తి, పానుగంటివంటి వంటి శిష్టులు రాసిన పుస్తకాల్లోని భాషను కూడా నిఘంటువు లో ఉపయోగించుకోవాలి అని సలహా ఇస్తాడు గిడుగు. కానీ సమకాలీన దళిత కవుల పేర్లు ఎత్తడు. దళిత కవులు గ్రామ జీవితాన్ని వృత్తి పదాలతో సహా గ్రంథస్థం చేశారు.

అందుకే చలం గిడుగు తెచ్చిన వ్యావహారిక భాషను విమర్శిస్తారు. ఇంకా ఎన్నో సంకోచాలు పెట్టుకొని లెక్కలు వేసుకొంటూ రాస్తున్న గిడుగు వ్యావహారిక భాషను బద్దలు చేస్తూ భాషలో విప్లవం తెచ్చాను అని చలం చెప్పుకొన్నారు. అందుకే శిష్ట వ్యావహారికము అనే మాటను గిడుగుతో మొదలుపెట్టి ఎందరో వాడారు

మొత్తంగా ఈ చర్చలో తేలింది ఏమిటంటే, ఒక స్వచ్ఛమైన, ప్రామాణిక వ్యావహారిక భాష కోసం అన్వేషణ సాగింది. ఆ భాషకు అగ్రవర్ణాలు, ఆంగ్ల పాలన, ఆధునిక అభివృద్ధి నేపథ్యంగా పనిచేశాయి. అందుకే దళిత కవులు ఈ వ్యావహారిక భాషకు దూరంగా, గ్రాంథికంలో, పద్య విద్యలో మిగిలిపోయారు. సుమారు అర్థ శతాబ్దం తర్వాత, నగరీకరణ చెందిన ఆధునిక దళితులు వచన కవిత్వంలోకి బలంగా ప్రవేశించారు. బహుజన మేధావి కంచె ఐలయ్య ఇప్పుడు ‘ఆంగ్లం శ్రామికుల భాష’ అంటాడు. కానీ ఆనాటి జాషువ అంటే దళిత కవులు ఇంగ్లీషు ఆధిపత్యాన్ని నిరసించారు. దీనికి జాషువ రచనల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. “షేక్స్పియర్ కానీ, మిల్టన్, గోల్డ్‌స్మిత్ కానీ, మా తిక్కన ముక్కు తిమ్మన తో పోటీ పడగలరా? స్వదేశీ కవులు నాటుగాను, ఆంగ్ల భాష కవులు నీటుగాను కనపడుతున్నారు” అంటూ ఒక పద్యం రాశారు గబ్బిలం కావ్యం లో. కులతత్వం, ఆంగ్ల బానిసత్వం వల్ల తెలుగు కవిత్వాన్ని ప్రేమించలేకపోతున్నారు అని రాశారు. మరో ముఖ్యమైన విషయం, ఆనాటి ఆధునిక కవులందరూ గురజాడను కీర్తించారు, కానీ జాషువ ఎక్కడా ఆయనను ప్రస్తావించనేలేదు. పోతన భాగవతం, వేమన కవిత్వం, సూఫీ సంస్కృతి తనని ప్రభావితం చేశాయి అని చెప్పాడు.

నిజానికి వలసవాదులు వలసవాద ప్రభావితులైన మేధావులు వ్యవహారిక భాషా ఉద్యమం ప్రజలకోసం అన్నారు కానీ వారు నిర్వచించిన శిష్ట సాహిత్యం అనే భావన బయటకు తొంగి చూడలేకపోయారు. పద్యంలాగే కులం కూడా భూస్వామ్య అవశేషం వెనుకబాటు అని మాత్రమే భావించడం వల్ల కుల సంస్కృతులను ఆబ్జెక్టివ్ గా శోధించలేకపోయారు. దానివల్ల భాష గురించి సమగ్రదృక్పథం లోపించింది.

దళిత బహుజన జ్ఞానం పురాణాలు, భాష, శిష్టత.

జయధీర్ తిరుమలరావు గారు తన రచనల ద్వారా దళిత బహుజన సమాజం యొక్క జ్ఞాన సంప్రదాయాలు, పురాణాలు, అక్షరాస్యతపై ఉన్న అపోహలను తొలగించడానికి కృషి చేశారు. ఆయన పరిశీలనల ప్రకారం, దళిత బహుజనులు నిరక్షరాస్యులు కాదనీ, వారికి శతాబ్దాల కాలం నాటి రాత సంప్రదాయాలు, తమదైన జ్ఞాన వ్యవస్థలు ఉన్నాయనీ స్పష్టమవుతుంది.

దళిత బహుజన జ్ఞాన వ్యవస్థల పునాదులు

సాధారణంగా ‘శిష్టత’ అంటే బ్రాహ్మణ ఆచార వ్యవహారాలకు చెందినదిగా భావించబడుతుంది. బ్రిటిష్ వలసవాదం ఈ భావనను మరింత బలపరిచింది. భారత ఉపఖండంలో మతాల కన్నా కుల వ్యవస్థ ప్రధానం, మతాలు కూడా కులాలకు లోబడి ఉంటాయి. దీని ఫలితంగా, జ్ఞానం అనేది కుల సంప్రదాయాలు పరంపరపై ఆధారపడి ఉంటుంది. బ్రిటిష్ వలసవాదులు, క్రైస్తవ మత దృష్టితో భారత ఖండాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో, ఇక్కడ ‘హిందూ మతం’ అనే ఒకే మతం ఉందని, బ్రాహ్మణులు దానికి మత పెద్దలని తప్పుగా భావించారు. ఈ భ్రమలో ఆధునిక మేధావులు, కమ్యూనిస్టులు, దళితవాదులు కూడా ఉన్నారు.

అయితే, జయధీర్ తిరుమలరావు ఈ భ్రమను బద్దలు కొట్టారు. దళిత బహుజన కులాలకు వారివైన కథనాలు, పురాణాలు ఉన్నాయి. వారికి సంబంధించిన దాదాపు నాలుగు వందల సంవత్సరాల పూర్వపు లేఖనాలు గ్రంథ ప్రతులు లభిస్తున్నాయి. (అంతకు ముందు కూడా ఉన్నవి లభించక పోయివుండచ్చు. మౌఖికం గా తరువాతి తరానికి అందజేయడం దానితో పాటు తాటాకులపై రాయడం ఇక్కడి ఆచారం కావడం వల్ల అతి ప్రాచీన ప్రతులు క్షీణించి వుండచ్చు )ఇది దళిత బహుజనులకు వారిదైన విద్య, చదవడం, రాయడం, ప్రవచనం వంటి జ్ఞాన సంప్రదాయాలు ఉన్నాయని నిరూపిస్తుంది. వారికి రాజపోషణ తక్కువగా ఉన్నప్పటికీ, వారివైన జ్ఞాన వ్యవస్థలు, సంప్రదాయాలు ఉన్నాయి. వారి దృష్టిలో వారి సంస్కృతి కూడా శిష్ట సంస్కృతిగానే పరిగణించబడుతుంది. అందుకే దళిత బహుజన మఠాలవారు వారి గ్రంథాలను ఆయా కుల సముదాయానికి మాత్రమే బోధించే ఆచారం ఉంది.

జానపదుల అక్షరాస్యత, రాత సంప్రదాయాలు.

జానపదులు నిరక్షరాస్యులు అనే భావన సరైంది కాదని జయధీర్ తిరుమలరావు నొక్కి చెప్పారు. ఆయన పరిశీలనల ప్రకారం, జానపద సమాజంలో అక్షరాస్యత విస్తృతంగా ఉంది. చాలామందికి తెలియని, లేదా తెలిసినా పట్టించుకోని ఈ విషయాన్ని ఆయన వివరించారు:

  • కుల గురువులు, కళాకారులు: ప్రతి కులంలో ఒక గురువు ఉంటారు. అలాగే కళలను ప్రదర్శించే కళాకారులు ఉంటారు. వీరందరికీ చదువు వస్తుంది, వారంతా అక్షరాస్యులు.
  • చారిత్రక రాత ప్రతులు: ఈ జానపదుల వద్ద హక్కులకు సంబంధించిన రాగి రేకులు ఉన్నాయి. వారి కుల గాథలు, పౌరాణిక కథలు, కుల మూలపురుషుల వృత్తాంతాలు కాగితాల మీద, తాటి ఆకుల మీద రాసి ఉన్నాయి.
  • రికార్డుల నిర్వహణ: ప్రదర్శకులు లేదా గురువులు ప్రదర్శనలు ఇస్తూ, తమ శిష్యుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారు ఇచ్చిన నగదు వివరాలను రాసుకున్న చిట్టాలు (పుస్తకాలు) ఉన్నాయి.
  • కుటుంబ రికార్డులు: ఆ శిష్యుల కుటుంబాలకు సంబంధించిన భూమి క్రయవిక్రయాలు, దత్తత వివరాలు, కుల పంచాయితీల వివరాలు కూడా రాతపూర్వకంగా పొందుపరచబడ్డాయి.
  • మత, సాంప్రదాయ వివరాలు: మత సంప్రదాయ కుటుంబాల వారు చేయించిన పూజల వివరాలు, పెళ్ళిళ్ళు తదితర కార్యక్రమాల వివరాలను కూడా వారు రాసి ఉంచారు.

ఈ రాత సంప్రదాయం జానపద సమాజంలో చాలా కాలంగా ఉన్నప్పటికీ, చాలామందికి ఇది తెలియదని లేదా తెలిసినా పట్టించుకోలేదని జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. ఆయన పరిశోధనలు జానపదుల గురించి ఉన్న అపోహలను తొలగించి, వారి అక్షరాస్యత, చారిత్రక స్పృహను వెలుగులోకి తెచ్చాయి.

దళిత బహుజనుల సమాంతర పురాణాలు జ్ఞాన వ్యవస్థల కొనసాగింపు

జానపదుల వద్ద కేవలం రాత ప్రతులే కాకుండా, సమాంతర పౌరాణిక కథలు కూడా చాలా లభిస్తాయి. ఉదాహరణకు, అల్లీ రాణి, జాంబ పురాణం, సురా భాండేశ్వర కథ, మడివేలు మాచయ్య కథ వంటి 30, 40 కథలు ఉన్నాయి. ఇలా ఎంతో సాహిత్యం దళిత బహుజనులలో ప్రసిద్ధిలో ఉంది.

ఈ జ్ఞాన సంప్రదాయాలు కులాలు, ఆశ్రిత కులాలు అనే పద్ధతిలో కొనసాగాయి. ఉదాహరణకు, మాదిగల కుల పురాణం అయిన జాంబ పురాణం చెప్పే డక్కలి వారిని మాదిగలు పోషిస్తారు. ఇలాగే యాదవులు, పద్మశాలీలు, మాల వంటి అన్ని కులాలకు ఆశ్రిత కులాల వ్యవస్థ ఉంది. రాజులు కాకుండా, ప్రజలే ఈ పురాణాలను, కథనాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందజేసే కుల సంప్రదాయాలను ఏర్పాటు చేసుకున్నారు. పోషకులు కూడా ఒక వర్గం కాదు, వివిధ కులాల వారు. అందువల్ల, జ్ఞానం, భాష, సంప్రదాయం, శిష్టత ఏ ఒక్క చోట కేంద్రీకృతం కాలేదు.

మఠాలు, వాటి రాత ప్రతులు.

మఠాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నాయి అనేది అజ్ఞానం మాత్రమే. మఠాలు రకరకాలుగా ఉన్నాయి – భక్తుల పేరుతో, మత శాఖల పేరుతో, కులాలవారీగా మఠాలు ఉన్నాయి. ప్రతి మఠంలో తప్పకుండా రాతప్రతులు ఉండేవి. ఈ రాతప్రతులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి:

  • మఠ చరిత్ర, మఠం స్థాపకుని వివరాలు.
  • కుల మఠాలైతే కుల పురాణ పురుషుడి చరిత్ర, కుల పురాణం, మఠపురాణం వంటివి ఉంటాయి.
  • మఠం ఏర్పడినప్పటి డాక్యుమెంట్లు, మఠం నిర్వహణ, కుటుంబం, భూమి, ధనం, ఆదాయ వివరాలు తెలిపే రాతప్రతులు కూడా ఉంటాయి.

వేములవాడ, కొలనుపాక వంటి ప్రదేశాలలో కులాలవారీగా మఠాలు ఉన్నాయి. ఇవన్నీ వీరశైవ మత సంప్రదాయానికి చెందినవి. వీరి వద్ద కూడా అనేక రాతప్రతులు లభ్యమవుతాయి.

జయధీర్ తిరుమలరావు గారి రచనలు దళిత బహుజనుల జ్ఞాన సంపద, వారి అక్షరాస్యత, చారిత్రక వారసత్వంపై సరికొత్త వెలుగును ప్రసరింపజేశాయి, వారి గురించి ఉన్న అనేక అపోహలను తొలగించాయి.

ఐతే యీ జ్ఞానం పట్ల కుల నిర్మూలన వాదులు అయిన వలస క్రైస్తవులు, వారిని పూర్తిగా అనుకరించిన సంస్కర్తలు కమ్యూనిస్టులు దళితవాదులు ఎవరికీ ఆసక్తి లేదు. కులనిర్మూలన లాగే తెలుగు భాష నిర్మూలన జరగాలి అనే పిలుపు కూడా ఇచ్చారు యీ ఆధునిక తెలుగు మేధావులు.

తెలుగు భాష నిర్మూలనకు పిలుపు.

క్రమేపి ప్రాచ్య విద్య నుంచి ఆంగ్ల, ఆధునిక విద్యలోకి, నగరాలలోకి అడుగుపెట్టాక మాత్రమే ఆంగ్ల విద్య నేర్చుకున్న బ్రాహ్మణులను అనుకరిస్తూ ఆధునిక సాహిత్య ప్రక్రియలోకి అడుగుపెట్టారు దళిత కవులు. ఆంగ్ల భాష, ఆంగ్ల సంస్కృతి ఉద్ధరించింది అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇటువంటి ఆంగ్ల భక్తి మొదట్లో అగ్రవర్ణాలలో ఉంది. అది దళితులలోకి పాకడానికి అర్థ శతాబ్దం సమయం పట్టింది. దళితులు ప్రధానంగా ప్రపంచీకరణ అనంతరం వచన కవితా రంగంలోకి దూసుకువచ్చారు, ఒక ఉద్యమంగా ముందుకు వచ్చారు. నిజానికి ఇప్పుడు మొత్తంగా తెలుగు భాషకి విద్యలో స్థానం తగ్గిపోతోంది. గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఆధునిక తెలుగుకి తల్లి అనదగిన ఆంగ్లానికి ప్రాధాన్యం పెరిగింది. అదే స్థాయిలో తెలుగు చోటు తరిగిపోతోంది. అందుకే అంటరాని దేవుడు నవల ముందుమాటలో బహుజన మేధావి కంచె ఐలయ్య “అసలు తెలుగుని నిర్మూలించాలి” అన్నారు. కుల నిర్మూలన లాగే భాషా నిర్మూలనకు పిలుపు ఇవ్వడం విశేషం.

“ఈ నవల తెలుగు అనువాదం తెలుగు భాషను అభివృద్ధి చేసి ఆదరించడానికి కాదు, ఆంగ్ల చదువు లేనివాళ్లు, తెలుగు మాత్రమే చదవగలిగేవాళ్లు నేను ఈ నవలలో ఏం చెబుతున్నానో అర్థం చేసుకోవడానికి మాత్రమే. రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజలందరూ ఆంగ్లంలో రాయడం, ఆంగ్లంలో చదవడం చేయాలనే నా కోరిక. కార్ల్ మార్క్స్ వర్గ పోరాట అంతిమ లక్ష్యం గురించి చెబుతూ “వర్గ పోరాటం వర్గాలను అంతరింప చేయడానికి” అంటాడు. అదేవిధంగా, నేను తెలుగులో రాసి, మాట్లాడేది తెలుగును అంతం చేయడానికి. “.

ఇక్కడికి ఒక వలయం పూర్తయింది. ఆంగ్ల సంస్కృతి, విద్యలను అందుకున్న తీర ప్రాంతాలవారు, నగరాలవారు ఆధునిక తెలుగుకి ఆదర్శమని గురజాడ భావించాడు. అంటే ఆంగ్ల సంస్కృతి ఆధునిక తెలుగుకి చోదక శక్తి అని భావించాడు, ప్రామాణిక భాషను ఆంగ్ల నాగరికత, సంస్కృతితో ముడిపెట్టాడు. ఇప్పుడు ఒకే ప్రామాణిక భాష తెలుగు భాష స్థానాన్ని నెట్టేస్తూ, అన్ని ప్రాంతీయ భాషలని నిర్మూలిస్తూ ఆంగ్లం ప్రపంచ భాషగా అవతరించింది. ఒకప్పుడు వ్యావహారిక తెలుగును అందుకోలేని వారు వెనుకబడినవారు; ఇప్పుడు ఆంగ్లాన్ని అందుకోలేని వారు వెనుకబడినవారు. ఒకప్పుడు గ్రాంథిక భాషను అణచివేతగా ఆధునిక వ్యావహారిక భాషా వాదులు భావించారు. నేడు అసలు మొత్తంగా తెలుగు భాష అణచివేతలకు, వివక్షకు మూలం అని దళిత బహుజన మేధావులు భావిస్తున్నారు. తెలుగు ఎందుకు అంతరించాలి? తెలుగును ఎందుకు నిర్మూలించాలి? ఐలయ్య వ్యంగ్యంగా మాట్లాడారా? కాదు. ఆంగ్లేయుల ఆధునిక పరిశోధనలపై ఆధారపడి అంబేద్కర్ లాంటి దళిత మేధావులు స్థానిక సంస్కృతులు, దేవతలు అన్నీ కులతత్వంతో నిండి ఉన్నాయని భావించారు. దానిని హిందూ మతం అన్నారు. స్థానిక సంస్కృతులు, హిందూ మతం కుల వివక్ష తో కూడినప్పుడు, తెలుగు భాష వివక్షకు నిలయం కాదా? తెలుగులో కులాల హైరార్కీని బలపరిచే సామెతలు ఎన్నో ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి తిట్లు ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి ఏవీ ఆంగ్లంలో ఉండవు అనేది కొందరు దళిత బహుజన మేధావుల వాదన. అందుకే కొన్నిచోట్ల ఇంగ్లీష్ మాత విగ్రహాలు కూడా నెలకొల్పారు.

అయితే, కొందరు కమ్యూనిస్టులు, తెలుగు భాషా పరిరక్షణ వాదులు తెలుగు భాషా మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగించాలని ఆందోళన చేశారు. ఈ ప్రయత్నం అగ్రవర్ణాల వారి దురహంకారంగా దళిత బహుజనులు తిరస్కరించారు. తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమాలలో చదివిస్తూ, పాశ్చాత్య దేశాలకు పంపుతూ, వెనుక బడిన వర్గాలు చదివే ప్రభుత్వ బడులలో తెలుగు కొనసాగించాలని కోరడం హిపోక్రసి అని వాదించారు. ఈ వాదానికి వారి నుంచి బలమైన సమాధానం అసాధ్యం.

భాష అనేది కేవలం వ్యవహార ప్రయోజనం కోసమే కాదు. భాష, సంస్కృతి, స్థానికత వంటివి భావోద్వేగ విషయాలు. అందువల్ల మాతృభాషలకి ప్రాధాన్యం తగ్గడం ఒక లోటుని, పరాయికరణను సృష్టిస్తుందని కొందరు వాదిస్తారు. ఆంధ్రదేశానికి స్వయంగా వచ్చి తెలుగువారిని ప్రభావితం చేసిన కెన్యా రచయిత గుగివా థియాంగో వాదన అదే.

ఇంగ్లీషు భాష ఆధిపత్యంపై తిరుగుబాటు.

తెలుగు మేధావి కంచ ఐలయ్య మాతృభాషను నిర్మూలించి ఇంగ్లీషును వరించాలి అన్నాడు. దానికి పూర్తి విరుద్ధంగా తెలుగు వాళ్ళు, కమ్యూనిస్టులు పిలిచి గౌరవించిన ఆఫ్రికా రచయిత గుగి ఇంగ్లీషు సామ్రాజ్యవాదభాష, దాని ఆధిపత్యాన్ని ఎదిరించాలి అన్నాడు. (ఆయన నవలలు తెలుగులోకి అనువాదమై పాఠకుల ఆదరణ పొందాయి. కానీ సంస్కృతి, భాషల గురించి గుగి రచనలు అనువాదం కాకపోవడం, వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం తెలుగు మేధావుల వలసబుద్ధి ని స్పష్టం చేస్తుంది. )

గుగివా థియాంగో రాసిన డీకొలోనైజింగ్ ది మైండ్ అనే పుస్తకం ఆఫ్రికన్ సాహిత్యంలో భాష యొక్క కీలక పాత్రను, ముఖ్యంగా స్థానిక భాషలను ఉపయోగించడం ద్వారా సాంస్కృతిక స్వాతంత్ర్యాన్ని సాధించడాన్ని నొక్కి చెబుతుంది. ఇది కలోనియలిజం యొక్క మానసిక ప్రభావాలను, స్థానిక భాషలను అణచివేసి ఆంగ్ల భాషను విధించడం ద్వారా ఆఫ్రికన్ గుర్తింపును ఎలా దెబ్బతీసిందో విశ్లేషిస్తుంది. తన రచనలలో గీకుయూ, స్వాహిలీ వంటి స్థానిక భాషలను ఉపయోగించాలని, ఆఫ్రికన్ సంస్కృతి, చరిత్ర, గుర్తింపును పునరుద్ధరించాలని వాదిస్తాడు గుగి.

ఐతే గుగి ఆఫ్రికా వాడు కనుక అతని భావాలు మనకి చెందవు అని వాదించవచ్చు. కానీ గుగి భారతీయ ప్రభావాలు గల రచయిత. భాష గురించి ఆయన భావాలకు మూలం భారతీయ రచయిత రవీంద్ర నాథ్ ఠాగూర్. ఠాగూర్ రచనలు ఎన్నో తెలుగులోకి అనువాదం అయ్యాయి ప్రభావితం చేశాయి. కానీ గుగి పై ఠాగూర్ ప్రభావం గురించి మన తెలుగు మేధావులు మౌనం వహించారు. ఇది తెలుగు మేధావుల వలసవాద స్వభావాన్ని తెలియజేస్తుంది.

ఠాగూర్ గురించి గుగివా థియాంగో జ్ఞాపకాలు.

“నేను జైలులో ఉన్నప్పుడు, ఠాగూర్ గురించిన ఒక కథనం చదివినట్లు నాకు గుర్తుంది. ఒక రచయిత ఠాగూర్‌ను కలవడానికి వెళ్ళాడు. ఆ రచయిత తనకు ఎన్ని భాషలు తెలుసో ఠాగూర్‌కు చెప్పడం మొదలుపెట్టాడు – ఇటాలియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇంకా చాలా… చివరికి ఠాగూర్ అతని వైపు తిరిగి, “నీ మాతృభాష నీకు తెలుసా?” అని అడిగారు. ఆ వ్యక్తి కాస్త ఆశ్చర్యపోయి, తెలియదు అని చెప్పినప్పుడు, ఠాగూర్ ఇలా బదులిచ్చారు, “నీకు నీ మాతృభాష తెలియకపోతే, నీకు ఏ భాషా తెలియనట్లే. ”

ఈ కథనంనన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఇంగ్లీషుభాష ఆధిపత్యంపై నేను చేసిన కృషి, ఠాగూర్ భావనల ఉద్వేగాల విస్తరణే (అంటే, ఠాగూర్ చెప్పిన మాటలనే నేను విపులీకరించాను).

ఇవి గుగి స్వయంగా చెప్పిన మాటలు.

ఐలయ్య వాదానికి భిన్నంగా, గుగి ఆంగ్లంలో రచన మానివేసి తన మాతృభాషలో రచన ప్రారంభించాడు. ఆంగ్ల ఆధిపత్యాన్ని సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా చూశాడు. భాష గురించి గుగి అభిప్రాయాలపై తెలుగునాట చర్చ జరగలేదు. కేవలం ఆయన నవలల్లోని సాయుధ పోరాట భావన మాత్రమే కమ్యూనిస్టు తెలుగు మేధావులు స్వీకరించారు. దివి కుమార్ వంటి కొద్దిమంది కమ్యూనిస్టులు మాత్రమే భాష గురించి కొద్దిగా వ్యాసాలు రాశారు. మొత్తంపై భాష గురించి గుగి అభిప్రాయాల ప్రభావం ఆంధ్రదేశంలో చాలా తక్కువ.

దీనికి కారణం తెలుగు వాళ్లు మొదటి నుంచి ప్రపంచీకరణవాదులు. ఆధునిక తెలుగు భాషకు పితామహుడు అనదగిన గురజాడతో సహా అందరూ తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లేయ సంస్కృతికి, పాశ్చాత్య నాగరికతకు కేవలం ప్రతిబింబంగా చూశారు. తెలుగును ఒక ప్రత్యేక భాషగా, ప్రత్యేక సంస్కృతిగా గౌరవించలేదు. అందుకే వీరిలో వెటకారం ప్రధానం. మనకు సోదర భాష అనదగిన కన్నడలోని రచయితలను చూసినా మనకి తేడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కన్నడ రచయిత మాస్తి వెంకటేశం అయ్యంగార్ అంటాడు: “నలుగురు కన్నడ మిత్రులు కలిసినప్పుడు కన్నడ భాషలోనే మాట్లాడుకోవడం మంచిది. ఆంగ్ల భాషను ఆశ్రయించడం మంచిది కాదు,” అని. ఆయన స్వయంగా తన రచనలు ఆంగ్లంలోకి అనువాదం చేసుకున్నారు కూడా. కానీ మాతృ భాష పట్ల ఆయనకు ప్రేమ ఉంది.

తెలుగు వాళ్ళకి భిన్నంగా పాఠశాలల్లో కన్నడ మీడియం ప్రవేశపెట్టాలని కన్నడ దళిత రచయితలు ఉద్యమం చేశారు. ప్రభుత్వ సాహిత్య సమావేశాలు బహిష్కరించారు. డా. సిద్ధలింగయ్య, కు. వీరభద్రయ్య, దేవనూరు మహాదేవ ఇలా ఉద్యమించినవారిలో ఉన్నారు. దళితరచయిత దేవనూర మహాదేవ ఇదే డిమాండు తో ప్రతిష్ఠాత్మక నృపతుంగ అవార్డును తిరస్కరించి నిరసన తెలిపారు. ఇటువంటి మాతృభాషాభిమానం తెలుగు వాళ్ళలో శూన్యం. మితిమీరిన వలసవాద ప్రభావమే కారణం. గాంధీ అన్నట్లుగా విదేశీ గాలులను ఆహ్వానించవచ్చు కానీ మన కాళ్ళు తేలిపోయేంతగా కాదు.

ముఖ్యంగా తెలుగు వాళ్ళు ప్రాగ్మాటిస్టులుగా (ఆచరణాత్మకులుగా) కనబడతారు. సంస్కృతి, భాష వారికి అప్రధానం. వారి దృష్టిలో స్థానికత వట్టి మాట. దీనికి మన ప్రగతిశీల ఉద్యమాలు కూడా కారణం కావచ్చు. ఆర్థిక నియతివాదాన్ని కమ్యూనిస్టు ఉద్యమం బలపరిచింది. అంతర్జాతీయతకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. సంస్కృతి పరమైన విషయాల్ని మూలకు నెట్టింది. అందుకే కులం, మతం వంటి విషయాల్ని చర్చించిన సాహిత్యం ఆధునిక సాహిత్య వేత్తలలో నిర్లక్ష్యానికి గురైంది. ఇటీవల దళితవాదం ఈ ఆర్థిక నియతివాదంపై దండెత్తింది. కానీ తెలుగు దళితవాదం కూడా వలసవాద భక్తి, ఆంగ్ల పాశ్చాత్య అనురక్తి అనే ఆధునిక అగ్రవర్ణ వలయంలోనే తిరుగుతోంది.

ముగింపు: తెలుగు సాహిత్యం విషవలయంలోనా?

ఆధునిక తెలుగు భాష అభివృద్ధి, ఆధునిక తెలుగు సంస్కృతి పయనం వెనుక బలమైన పాశ్చాత్య, ఆంగ్ల ప్రభావాలు ఉన్నాయి. కొద్ది అగ్రవర్ణాలు, కొన్ని ప్రాంతాల ఆధిపత్యం ఉంది. మొత్తంగా ఆంగ్ల ఆధిపత్యం ఉంది, సామ్రాజ్యవాదం ఉంది, సాంస్కృతిక మోనోపలీ ఉంది. అదొక స్వయం చలనం కాదు. ఇది తెలుగు సాహిత్యాన్ని ఎప్పటికీ బయటపడలేని విషవలయంలోకి నెట్టింది.

మూలాలు

1. గురజాడ రచనలు, అసమ్మతి పత్రం, విశాలాంధ్ర హైదరాబాద్ 1987

2 వ్యావహారిక భాషా వికాసం, బూదరాజు రాధాకృష్ణ, విశాలాంధ్ర విజయవాడ 1972

3 గురుజాడలు మహాకవి గురజాడ అప్పారావు రచనలు, మనసు ఫౌండేషన్ 2012

4 రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి విశేష సంచిక

5 సొంత కథ, రాంభట్ల కృష్ణమూర్తి 2001

6 తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, వెలమల సిమ్మన్న, దళిత సాహిత్య పీఠం విశాఖ పట్నం 2005

7 అనుభవాలూ జ్ఞాపకాలున్నూ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, విశాలాంధ్ర 1999

8 జాషువ సర్వ లభ్య రచనలు, మనసు ఫౌండేషన్

9 అంటరాని దేవుడు, కంచ ఐలయ్య, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్ 2016

10 వినుకొండకవులు, కాత్యాయనీ విద్మహే కొలిమి సాంస్కృతిక వేదిక, సెప్టెంబర్ 2020

11 కులనిర్మూలనను మిథ్యగా భావించిన ఒక బ్రాహ్మణుని ఆత్మ కథ, టి. రవిచంద్, మిసిమి పత్రిక ఏప్రిల్ 2003

12 What China and India Once Were: The Pasts That May Shape the Global Future (Benjamin A. Elman), (Sheldon Pollock) Columbia University Press, 2018

13 సూర్య రాయాంధ్ర నిఘంటువు విమర్శనము, గిడుగు వెంకట రామమూర్తి పంతులు, విశాలాంధ్ర, విజయవాడ 2000

14. My work on language and power was an elaboration of a Tagorean sentiment’: Ngugi wa Thiong’o An interview with the great African writer, thinker and activist. Devapriya Roy Mar 11, 2018 scroll. in

15. When Ngũgĩ wa Thiong’o met Tagore The indian express jun 2 2025

16 శ్రీశ్రీ కవిత్వం ప్రాచ్య పాశ్చాత్య ప్రభావాలు, కోడం కుమార స్వామి, ప్రజా తార పబ్లికేషన్స్ వరంగల్ 2009

17 కాంతి మయి – సంజీవ్ దేవ్, కాంతికుంజ సాంస్కృతిక సంస్థ తెనాలి 1982.

18 అంబేడ్కర్‌ భావాలకు కవిత్వ రూపమిచ్చిన కవి –కోయి కోటేశ్వర రావు, ఆంధ్రజ్యోతి డైలీ, Apr 15, 2024

19 మహోదయం, కేవీఆర్, విశాలాంధ్ర, 1999

20 తెలుగు రాత ప్రతులు, జయధీర్ తిరుమలరావు చెలిమి సాహితీ సర్కిల్, హైదరాబాదు 2012

21 సాంధ్య భాష కవితా సంకలనం, వేగుంట మోహన ప్రసాద్ 1999

22 Writer rejects Nrupatunga award https://timesofindia.com, Oct 31, 2010,

23 కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు మహాస్వప్న. పునర్ముద్రితం సాక్షి డైలీ జూన్ 27 2019

24. సాహిత్య దృక్పథం (సాహిత్య విమర్శ వ్యాసాలు) వి. చెంచయ్య, విరసం నెల్లూరు, 2001


రాణి శివశంకర శర్మ

రచయిత రాణి శివశంకర శర్మ గురించి:

రాణి శివశంకరశర్మ \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన \’గ్రహాంతరవాసి\’ నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన \’గ్రహాంతరవాసి\’ కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన \’అమెరికనిజం\’ ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ\’గా, మలిసంపుటి \’పూజారి 2040\’గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు \’హిందుత్వ\’, \’ధర్మోరక్షతి రక్షితః\’ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన \’శకుంతల\’ అందరి మన్ననలు పొందింది.

 ...