వాదా

నింగికెగిరే ప్ర‌య‌త్నంలో
నిలువునా నేల‌కూలాను.

కుప్ప‌కూలిన కూడ‌లిలోనే
న‌న్ను నేను కూడ‌దీసుకున్నాను.
త‌ప్పిపోయిన దారిలోనే
న‌న్ను నేను దొర‌క‌బుచ్చుకున్నాను.

పొదుపు చేసుకున్న‌
ప‌దాల‌ను ఖ‌ర్చుచేసి,
పాన‌శాల‌కు వెలుప‌ల‌
కాసింత మైకాన్ని కొనుక్కున్నాను.
అదుపు చేసుకోలేని
అనుభూతిని దాచిపెట్టి
పాఠ‌శాల‌కు అవ‌త‌ల‌
త‌గినంత క‌వ‌నాన్ని క‌నుక్కున్నాను.

నేల కూలిన చోట‌నే
మ‌ళ్ళీ మొల‌కెత్తాను.
మొల‌కెత్తిన త‌డ‌వునే
మ‌ళ్ళీ గ‌ళ‌మెత్తాను.
ఈసారి అప్ర‌య‌త్నంగానే
నినాదంగా నింగికెగిరాను.

నిద‌ర్శ‌నం కావాల‌నుకుంటే,
నింగికెళ్ళి చూడండి.
న‌మ్మ‌కంగా మీ చెవుల్లో
మార్మోగుతాను.