భారతీయ మతసంస్కరణ – సంఘసంస్కరణ

భారతదేశము 1857లో జరిగిన స్వాతంత్ర్యవిప్లవము నాటికి రాజకీయముగా పారతంత్ర్యమునబడియుండినది. ఆర్థికముగా దారిద్ర్యమున మునిగియున్నది. వైజ్ఞానికముగా, పాశ్చాత్యవ్యామోహమున మునిగి భావదాస్యమునకు లోనైనది. ఈ యింగ్లీషువారింత సులభముగా భారతదేశమును చేజిక్కించుకొని, దీనినింత నిరంకుశముగా పరిపాలింపగలుగుట, వారి శాస్త్రవిజ్ఞానము యొక్క ఇంద్రజాలము వారి సాహిత్యములోని నూతనభావములు వారి నాగరికతలోని క్రొత్తదనము, వారి క్రైస్తవ నీతిమతధర్మములు భారతీయులకు దిగ్భ్రమ కలిగించినవి. అన్ని విషయములలోను ఈ యాంగ్లేయులు భారతీయులకన్న అధికులని వారి నాగరికత భారతీయ నాగరికతకన్న మిన్నయని వారి నీతి మతధర్మములు మనవానికన్న శ్రేష్టతరములని పాశ్చాత్యుల వద్ద విద్యనభ్యసించు భారతీయ యువకులలో నొకవిధమైన వ్యామోహము కలిగినది. అంతట మనవారు నిజదేశ వేషభాషల పైన నభిమానమును వదలి పాశ్చాత్య నాగరికతను అనుకరించు గ్రుడ్డిపద్ధతి బయలుదేరినది. మన నీతిమతధర్మములను తృణీకరించి సాంఘికాచారములను ధిక్కరించి ఆహారవిహారములందు నీతి నియమములను విడనాడి స్వేచ్ఛావిహారులై ఆస్తికత్వమునుగూడా కోల్పోయి ఆధోగతిలోనికి దిగిపోవసాగినారు. కొంతకాలమీ దుస్థితికెట్టి ప్రతిక్రియయు జరుగలేదు సరికదా దీనికి దోహదమే జరిగినది. మన వేదశాస్త్రములకు సరియైన అర్థములు చెప్పి మన నీతి మత ధర్మములు పాశ్చాత్యుల నీతిమతధర్మముల కేవిధముగాను తీసికట్టుకావని రుజువుచేయగల సమర్థులైన విద్వాంసులు గాని పరిషత్తులు గాని లేవు. ప్రజలలో సరియైన భావములను కలిగించు వార్తాపత్రికలును లేవు. ఈ దుఃస్థితిని తొలగించగల పరిస్థితులు కొంతకాలమువరకును కలుగలేదు. అవి క్రమక్రమముగా కలిగినవి.

భారతదేశములోని వివిధమతావలంబులలో వివిధవర్ణముల జనసంఘములలో క్రమక్రమముగా ధర్మజిజ్ఞాస కలిగినది. మన వేదశాస్త్రముల యంతరార్థమును వెల్లడించి భారతదేశ నీతిమత ధర్మములను పాశ్చాత్య నీతిమత ధర్మములతో పోల్చిచూచి అన్ని మతములు, అన్ని ధర్మములు నొకే పరమసత్యమును బోధించు భిన్నమార్గములేయను పరమార్థమును బోధించి పాశ్చాత్య నాగరికతావ్యామోహమును తొలగించిన స్మర్తలు, సంఘ సంస్కర్తలు, మతోద్ధారకులు కొందరు బయలుదేరినారు. భారతదేశములోని వివిధ వర్ణములవారు వివిధ మతశాఖలకు చెందినవారు మేల్కొని తమతమ సంఘములలోను మతాచారాములలోను ప్రబలిన మూఢవిశ్వాసములను, దురాచారములను తొలగించుకొని విద్యాభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని పొందుటకు కృషిచేయుటయేగాక భారతదేశములోని తక్కిన మత సంప్రదాయములు కూడా తమ సంప్రదాయములతో సమానములైనవేయను సుహృద్భావముతో కేవలము స్వసంఘాభివృద్ధికొరకే గాక తక్కిన సంఘముల యభివృద్ధికొరకుకూడా తమకు తోచిన సహాయము చేయుట తమ కర్తవ్యమేయను భావముతో ప్రవర్తింపసాగిరి. అంతట భారతదేశములోని దరిద్రులకు దుఃఖార్తులకు దీనజనులకు జాతి మత వర్ణ వివక్షత లేకుండా అన్నవస్త్రములు వైద్యసహాయము విద్యాదానమును చేయుటకు దానధర్మములను చేయసాగినారు. భారతదేశములోని ప్రజలందరూ సోదరులేయను భావము వర్ధిల్లినది. ఇలాగున స్వసంఘాభివృద్ధి కొరకు ప్రారంభమైన కృషి సంస్కరణ ప్రయత్నములు పరోపకారబుద్ధితో చేయబడిన దానధర్మములుగాను దేశోద్ధరణ ప్రయత్నములుగాను పరిణమించి దేశములో జాతీయైక్యతాభావమును కలిగించి తరువాత రాజకీయ సంస్కరణలకోసము జరిగిన కృషికిని జాతీయోద్యమమునకును పునాదిగానున్నవనియు, ఈ కాలములో గొప్ప సంఘ సంస్కర్తలు మత సంస్కర్తలు బయలుదేరి దేశములో ప్రచారము చేయుటవల్ల సంఘ సంస్కరణోద్యమము జాతీయ భావము దేశములోని వివిధ ప్రాంతముల ప్రజలలో బాగా వ్యాప్తిచెందియుండని యెడల తరువాత కాంగ్రెసు మహాసభ ప్రారంభించిన రాజకీయోద్యమము దేశ ప్రజలలో నింతబాగా వ్యాపించియుండెడిది కాదనియు శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను రచించిన రోమారోలాగారును (Romain Rolland) కాంగ్రెస్ స్థాపన దాని అభివృద్ధి-యను గ్రంథమును రచించిన ఎఫ్. ఆండ్రూస్ గిరిజాముఖర్జీ గార్లును స్పష్టముగా వ్రాసియున్నారు.

భిన్న మతముల సమన్వయము

భారతదేశ రాజకీయచరిత్రను పరిశీలించినచో వివిధ కాలములలో ప్రవర్తిల్లిన నీతి మత ధర్మములా కాలమునాటి రాజకీయ పరిణామమున కేవిధముగా పునాదిగా నున్నదీ తెలియగలదు. పైగా ఈ దేశచరిత్రలో నింకొక విశేషము కనబడుచున్నది. వివిధకాలములలో వివిధమతావలంబులైన దేశీయరాజులీ దేశమును పరిపాలించి తమతమ మత సంప్రదాయములకు చేయూతనొసగి వానిని ప్రజలలో వ్యాపింపజేయుటకు ప్రయత్నించినట్లును, ఈ క్రొత్త సంప్రదాయములు కొంతకాలము తమ ప్రత్యేకతను ప్రదర్శించి విజృంభించిన కొలదికాలములోనే అవి ప్రజల పూర్వాచారములలో లీనమై అదృశ్యమైనట్లును కనబడుచున్నది. భారతదేశ నీతిమతధర్మములకు కేవలము భిన్నసంప్రదాయములుగల యవనపారశీకతురుష్కులాదిగాగల విజాతీయులు, మ్లేచ్ఛులు నీ దేశమునకు వచ్చినప్పుడు కూడా ఈలాగునే జరిగినట్లు కనబడుచున్నది.

మ్లేచ్ఛుల దండయాత్రల తరువాత భారతదేశ సాంఘికమతసంప్రదాయములలో రెండువిధములైన మార్పులు కలిగినవి. ఒకవంక పూర్వాచార పరాయణులు మ్లేచ్ఛసంపర్కము వలన ధర్మచ్యుతి కలుగకుండ, స్వధర్మరక్షణము జేసికొన బ్రయత్నించుటలో మారుమూలలకుపోయి వర్ణాశ్రమ ధర్మములను నిలువబెట్టుకొనుట కనేక కఠిననియమములను జేసికొని పరమఛాందసులై జీవింపసాగినారు. దక్షిణదేశములోని బ్రాహ్మణాచారములనేకము లీవిధముగావచ్చినవే. ఇంకొక వంక భారతీయ జనసామాన్యములోని వివిధ వృత్తులవారు ఈ క్రొత్తప్రభుత్వమున విజాతీయుల సాహచర్యమువలన మ్లేచ్ఛసంపర్కము వలన కొంతమార్పును జెందినారు. తమ ఆచార వ్యవహారములలోని కట్టుబాటులను కొంత సడలించి ఈ క్రొత్త ప్రజల నీతి మత ధర్మములను సనాతన ధర్మములతో సమన్వయము జేసికొని కాలక్షేపము చేయసాగినారు. భారతదేశములోని వివిధ వర్ణములవారిలో కనబడు వివిధ ఆచార వ్యవహారములు, సంప్రదాయములు, ఈలాగున నుద్భవించినవేయని మానవ ధర్మశాస్త్రజులయూహ. అతిబాల్య వివాహములు, స్త్రీల ఘోషా పద్ధతి, అస్పృశ్యత మొదలైన ఆచారములు కూడా ఇట్లు వచ్చినవే. ఇట్లు మారిన ఆచారములును కొత్తగా వచ్చికలిసిన ఆచారములును శాస్త్ర సమ్మతముగా చేసి మన స్మృతికర్తలు సనాతన ధర్మమును నిలువబెట్టినారు. ఆహారవిహారములందు చేయబడిన నిషేధములు నిబంధనలు, వివాహ సంస్కారమునుగూర్చి చేయబడిన కట్టుబాటులును ఇలాగున ఏర్పడినవే. ఈ సందర్భములో శృతిస్మృతులలోని వచనములకు క్రొత్తయర్థములను చెప్పిగాని లేదా క్రొత్తధర్మమును సమర్థించుటకొక క్రొత్తసూత్రమునే కల్పించిగాని మన స్మృతికర్తలు శాస్త్రజ్ఞులును సనాతన ధర్మమును నిలువబెట్ట జూచినారు. అందువల్ల మనయాచార వ్యవహారములలోను ధర్మశాస్త్ర విధులలోను ఏవి ఎప్పుడువచ్చినవో చెప్పుటయే కష్టమయిపోయినది.

కేవలము విజాతీయ సంపర్కము కలిగినప్పుడే గాక మనదేశములో యుద్ధములవల్లను విప్లవములవల్లను ధర్మచ్యుతి కలిగినప్పుడు కూడా ఆచారమును సంస్కరించియో సమర్థించియో ధర్మము నిలువబెట్టవలసి వచ్చుచుండినది. ఈలాగున వివిధ కాలములలో ధర్మనిర్ణయమును గురించి అభిప్రాయభేదము హెచ్చినట్లును ఆయా కాలములలోని పరిస్థితుల కనుగుణముగా ఆయా కాలముల నాటి ధర్మశాస్త్రజ్ఞులు స్మృతికర్తలు ఋషులు ఆలోచించి ధర్మనిర్ణయములు చేసినట్లును చాలా నిదర్శనములు కనబడుచున్నవి. వేదకాలములోనే వర్ణాశ్రమధర్మములను గూర్చి కొన్ని అభిప్రాయభేదములు కలిగినవి. వశిష్ఠ విశ్వామిత్రులగాథయే దీనికి తార్కాణము. హింస, అహింసలను గూర్చి, బ్రహ్మసాధన విధానములను గూర్చి యజ్ఞయాగాదికముల విషయమై వేదాంత విషయమై అనేక అభిప్రాయ భేదములువచ్చి చర్చలు జరిగినవి. ధర్మనిర్ణయముకూడా జరిగి కొందరి నిర్ణయానుసారముగా నడచుకొనసాగిరి. మఱికొందరు అందుకు భిన్నముగా ప్రవర్తింపసాగిరి. షడ్దర్శనములు ద్వైత శిస్టాద్వైతములు- శైవ వైష్ణవములు బౌద్ధ జైన చార్వాక నాస్తిక సంప్రదాయములు ఇల్లా బయలుదేరినవే.

మన ఋషులు మతాచార్యులు స్మృతికర్తలు కాలమునుబట్టి అవసరమైన మార్పులనుజేసి నూతన సిద్ధాంతములను ప్రాతవానితో సమన్వయము చేసి సనాతన ధర్మము యొక్క మూలధర్మములు మాత్రము చెడిపోకుండా కాపాడుచువచ్చినారు. అందువల్లనే దేశములోనికెంతమంది విజాతీయులు వచ్చినను ఎన్ని మ్లేచ్ఛజాతులు వచ్చిపడినను ఎన్ని రాజకీయ విప్లవములు జరిగినను ప్రజల ఆచార వ్యవహారములలో ఎన్ని మార్పులు కలిగినను సనాతనధర్మము యొక్క మూలసిద్ధాంతములు మాత్రము చెక్కుచెదరకుండా నిలిచియున్నవి.

హిందూదేశ ప్రజాజీవనమునకు మూలకంబములైన వర్ణాశ్రమ ధర్మములు, సమష్టి కుటుంబవిధానము, గ్రామ పంచాయతీ పరిపాలనము, ఇన్ని వేల సంవత్సరములైన తరువాతకూడా ఈ రూపములోనైనను నిలిచియున్నవన్నచో ఇది సనాతన ధర్మముయొక్క ప్రభావమే అని అంగీకరింపక తప్పదు. భారతీయ నీతిమతధర్మములకు కేవలము వ్యతిరేకముగా కనబడు ఇస్లాము మతమును మహమ్మదీయ నాగరికతయు నీదేశమునకు వచ్చిన పిదప కూడ మన మత ధర్మములు చెక్కుచెదరలేదు.

మహమ్మదీయులీదేశమునకు వచ్చిన కొలదికాలములోనే మారిపోయిరి. హిందూదేశములోని వివిధమతశాఖలకు చెందిన కులములవారితో కలసిమెలసి జీవించుటవలన క్రొత్తగా నీదేశమునకు వచ్చిన మహమ్మదీయుల చిత్తవృత్తులలో క్రమక్రమముగా మార్పు వచ్చినది. వారీదేశ ప్రజల యాచారవ్యవహారములను పెక్కింటిని స్వీకరించిరి. వారియాచారవ్యవహారములు కొంత మారినవి. మహమ్మదీయ సూఫీ వేదాంతుల తత్వబోధలు మన వేదాంతమునకు సన్నిహితముగానుండి మనదేశీయులలో కొందరినాకర్షించినవి. ఈ సాహచర్యమువలన మహమ్మదీయమతములోని ఉత్తమ నీతిధర్మములును హిందువులు అవగాహనము చేసికొని అందులోని మంచిని గ్రహించుటకు అవకాశము కలిగినది. త్వరలోనే ఈ మహమ్మదీయ మతము కూడ మన మతమునకువలెనె మోక్షమార్గముజూపు మతమేయని కొందరు వేదాంతులును భక్తులును గ్రహించిరి. వారు సర్వసమానసౌభ్రాతృత్వమున రామురహీముల యభేదమును బోధింపసాగిరి. మహానుభావులైన తులసీదాసు, రామానందుడు, కబీరును ఇటువంటి మతరూతబోధను చేసిన మహానుభావులే. వీరు మన బ్రహ్మముగారి తత్వము వంటి గేయముల ద్వారా మతతత్వ బోధచేయసాగిరి. పూర్వపు మతసంస్కర్తలు సంస్కృత భాషలోనే తమ వ్యాఖ్యానములను వ్రాయుచుండిరి. అవి కేవలము పండితులకే అర్థమగుచుండెను. ఆ మహాభక్తులు దేశభాషయైన హిందీలోనే తమ గీతములను పాడినందువలన అవి జనసామాన్యమునందు సులభముగ వ్యాపించెను. సర్వమతములును సమానములేయని మతవిచక్షణ లేకుండ మానవులందరు సోదరులేయని ఈ మహానుభావులు బోధించినందువలన దేశ ప్రజలలో యొకవిధమైన జాతీయభావము వర్ధిల్లసాగెను.

ఈ దేశమునకు వచ్చిన ముసల్మానులు, ఇక్కడి సాధుజనులైన హిందువులతో కలసిమెలసియున్నందువలన మొదట ఆ జాతివారు వచ్చినప్పుడు ప్రదర్శించిన క్రౌర్యమును మతావేశమును వీడి సాత్వికులైరి. ఇస్లాములో కలిసిన హిందువులు క్రొత్తమతమును స్వీకరించినారేగాని తమ పూర్వాచారములను వదలలేదు. ఈ దేశములోని ఇస్లాము, విదేశములలోని ఇస్లాముకు భిన్నమైన మతముగా మార్పుజెందినది. అది భారతీయ సంస్కృతిని పొంది జాతీయ మతముగా మారినది. ఈ దేశపు మహమ్మదీయులు మనోవాక్కాయకర్మములగు భారతీయులుగనేయుండిరి. కొలదికాలములోనే మన భారతీయ ముసల్మానులకు విదేశీయులతో సంబంధములు తెగిపోయినవి. ఇక్కడనే సంసారములు చేయుచు ఇక్కడనే మట్టియగుచుండిరి. మన గ్రామములలోని హిందువులకును మహమ్మదీయులకును ఆహారవిహారములందు గాని వేషభాషలందుగాని ఎక్కువ బేధములు కానవచ్చుటలేదు. భారతదేశమును పరిపాలించిన మహమ్మదీయ రాజులు కూడా భారతీయులుగనే ప్రవర్తించిరి. వారీదేశమున అనేక మహానిర్మాణములుగావించి, శిల్పకళను, సంగీత సాహిత్యములను పోషించి భోజులనిపించుకొనిరి. తరువాత నీదేశమును పరిపాలించిన ఇంగ్లీషువారివలే గాక, వారీ దేశమునే తమ మాతృదేశముగ జేసుకొనిరి.

ముసల్మానుల తరువాత నీదేశమును పరిపాలించిన ఇంగ్లీషువారు ప్రజలతో కలసిమెలసి చరింపక తామొక ప్రత్యేక కులముగా ప్రవర్తించిరి. ఈ దేశమునుండి సొమ్ము తీసికొనిపోవుటమాత్రమే వారికి పరమావధిగనుండెను. వారీదేశీయులను నీచముగ చూడసాగిరి. తమ నాగరీకత నీతిమతధర్మములు భారతీయ సభ్యతకన్నను నీతిమతధర్మములకన్నను శ్రేష్ఠతరములను భావముతో వానినికూడ వ్యాపింపజేయుటకు ప్రయత్నించిరి.

ఇంగ్లీషువారి ప్రభుత్వ విధానమువలనను క్రైస్తవమతబోధకుల ప్రచారమువలనను ఇంగ్లీషువారు స్థాపించిన విద్యావిధానము వలనను గూడ పాశ్చాత్య నీతిమతధర్మముల యొక్క ఆధిక్యతను గూర్చిన ప్రచారము జరుగుచుండెను. ఈ దేశ ప్రజల వేషభాషలను నాగరీకతను నీతిమతధర్మములను త్రోసిరాజనుట ప్రారంభమయ్యెను. అంతటనీభావములు తలకెక్కిన భారతీయ యువకుల మనస్సులు మారినవి. ఇంగ్లీషువారు మనకన్న అన్నివిధములుగను అధికులు గనుకనే మనలను పరిపాలింప గలుగుచున్నారనియు వారి నాగరికత మనదానికన్న మిన్నయనియు ఒక దురభిప్రాయము వ్యాపింపసాగెను. చాలమంది పాశ్చాత్యనాగరికతా వ్యామోహమున పడిపోవసాగిరి. ఇంగ్లీషు విద్యావిధానమువలన, రంగులోను రక్తములోను భారతీయులుగనున్నప్పటికిని రుచులలోను భావములలోను కేవలము ఇంగ్లీషు మానసపుత్రులుగ నుండు విద్యాధికుల తరగతియొకటి బయలుదేరినది. ఈ దేశమున కింగ్లీషువారు వచ్చునప్పటికి ఇక్కడి రాజులును నవాబులును రాజ్యాధిపత్యము కొరకు పోరాడుకొనుచు ఐకమత్యము లేక బలహీనులైనందువలన ఇంగ్లీషువారీ దేశీయ రాజుల కలహములందు పాల్గొని బలవంతులై అతి సులభముగా రాజ్యాధిపత్యమును చేజిక్కించుకొనగలిగిరి. ఇట్లు రాజకీయముగ దేశమెంత బలహీనముగనుండి అల్లకల్లోలముగనుండెనో మత విషయములందును సాంఘిక విషయములందునుగూడ అంత అల్లకల్లోలముగనెయుండెను. నాటి సాంఘిక మతాచార వ్యవహారములు కలగాపులగముగనుండెను. సనాతనధర్మము పేరున అనేక మూఢవిశ్వాసములు దురాచారములు ప్రబలియుండెను. కాళికాపూజల పేరున జంతుబలులును నరవధలును శక్తిపూజల పేరున మద్యమాంసమైథునములతోడి వామాచారమును ప్రబలియుండెను. కృష్ణభక్తియను పేరిట స్త్రీపురుషులు నీతినియమములు వీడి స్వేచ్ఛావిహారులై చరించుచుండిరి. అతిబాల్యవివాహముల వలనను, బాలవితంతువులు మరల వివాహమాడరాదను నియమము వలనను, బలవంతపు సహగమనముల వలనను విద్యలేమి వలనను స్త్రీల దుఃస్థితి వర్ణనాతీతముగనుండెను.

క్రైస్తవ మిషనరీలు విద్యాబోధకులై హిందూమతాచారములెల్ల హేయకరములైనవని బోధించుచుండిరి. ఈ పాశ్చాత్య విద్యాబోధనము తలకెక్కిన యువకులు దేశీయ మతాచారములనేవగించుకొని, ఆహారవిహారములందు స్వేచ్ఛావిహారులై హద్దుపద్దులులేక ప్రవర్తింపసాగిరి. సనాతన ధర్మములలో నిది మంచిది ఇది చెడ్డదియని చెప్పగలవారె లేకపోయినందువలన యువకులలో చాలమంది అవినీతిపరులై నాస్తికులై చరింపసాగిరి.

దేశములో వ్యాపించిన దురాచారములను మాన్పి, నీతిమతధర్మములను పాశ్చాత్య నాగరికతయొక్క యొరవడిరాతితో సరిజూచి సంఘమంతను సంస్కరించవలెనను ఉద్దేశముతో రాజా రామమోహనరాయిలవారు 1823లో బ్రహ్మసభను స్థాపించిరి. ఈ సంస్కరణోద్యమమున ద్వారకానాథ ఠాగూరుగారును, ప్రసన్నకుమార ఠాగూరుగారును ఆయనకు తోడ్పడిరి. రామమోహనరాయిలవారి కాలములో నీతిమతధర్మములను గూర్చిన విమర్శనములె హెచ్చుగా సాగుచుండెనుగాని స్వధర్మరక్షణ ప్రయత్నము జరుగలేదు.

అందువలన రామమోహనరాయిలవారి సంస్కరణోద్యమమునకు వ్యతిరేకముగా సనాతనధర్మసభ యొకటి బయలుదేరెను. నీతిమతధర్మములనుగూర్చి చర్చలు జరిగెను. అందులోనేవి సరియైనవో ఏవి సరియైనవికావో అను జిజ్ఞాస బయలుదేరినది. హిందూసంఘమిట్లు రెండు చీలికలై కలహించుచుండగా పాశ్చాత్య క్రైస్తవ మిషనరీలు విజృంభించి తమ మతబోధద్వారమునను విద్యబోధనలద్వారమునను భారతీయ యువకుల మనస్సులను విరచివేయసాగిరి. ఇట్లొకవంక సంఘసంస్కరణోద్యమమువలనను మరియొకవంక పాశ్చాత్యుల మతప్రచారమువలనను హిందూసంఘము చీలికలై సనాతనధర్మము కూకటివ్రేళ్ళతో పెకలింపబడి నాశనమగు కాలము వచ్చినదాయనునంతటి అల్లకల్లోలముగనుండెను. దేశములోని యువకులలో చాలమంది ప్రచ్ఛన్న క్రైస్తవులైరి. వంగదేశములో వేలకొలది యువకులు క్రైస్తవమతమును స్వీకరించు పరిస్థితులు దాపురించెను. ఈ దుఃస్థితిని చూచి, బ్రహ్మసభను ధర్మసభను ఏకముచేసి సంఘసంస్కరణోద్యమమును సర్వజనసమ్మతముగా నుండునట్లు నడిపి స్వధర్మరక్షణము చేయుటకు బ్రహ్మసమాజ నాయకులైన మహర్షి దేవేంద్రనాథ ఠాకూరుగారు పూనుకొని, ఇందుకొరకు కృషిచేయసాగిరి. పాశ్చాత్య మతబోధకుల సంపర్కము లేకుండా హిందూ బాలబాలికలకు విద్యనేర్పుటకొక పాఠశాలను స్థాపించుటకాయన ప్రయత్నించెను. బ్రహ్మసమాజము పరిశుద్ధ సనాతన ధర్మమునకు వ్యతిరేకముకాదని చెప్పి పరిశుద్ధమైన ఉపనిషన్మతము నుద్ధరించుటయె తమయుద్దేశమని ఆయన ప్రచారము ప్రారంభించెను. ఆయన ఎంతో కష్టపడి పనిచేసినందువలన క్రైస్తవమతవ్యాపనము కొంతవరకు అరికట్టబడెను గాని దేశీయ యువకుల చిత్తవృత్తులలో మార్పురాలేదు. వారిలో వ్యాపించిన విపరీత భావములు తగ్గలేదు. సంఘసంస్కరణోద్యమము పేరున వీరు స్వేచ్ఛావిహారులై చరించుచుండిరి. మతసంస్కరణము పేరున శుష్కవేదాంతులై నాస్తికులైయుండిరి.

ఇటువంటి పరిస్థితులలో నీక్రైస్తవమిషనరీలును బ్రహ్మసామాజికులును తృణీకరించిన విగ్రహారాధనము వారు చెప్పునంతటి పనికిమాలిన మతముకాదనియు పూజాపునస్కారములు మూఢవిశ్వాసమునకు తావలములు కావనియు దీనిద్వారమునగూడ మోక్షసాధనము చేయవచ్చుననియు ప్రత్యక్షముగా ప్రపంచమున చాటిన పుణ్యపురుషుడైన శ్రీ రామకృష్ణపరమహంస దక్షిణేశ్వరమున కాళికాలయమున తన సాధనలను ప్రారంభించెను. ఆయన 1836లో జన్మించి 1853 మొదలు 1886 వరకును ఆస్తికులందరకు మార్గదర్శకుడై జీవించెను. ఇతర మతబోధకులవలెను సంస్కర్తలవలెను ఆయన దేశములో పర్యటనములుచేసి సన్యాసములొసగలేదు. మతప్రచారము చేయలేదు. కేవలము తన తపఃప్రభావమువలన ఆకాలమునాటి విద్యాధికులనాకర్షించి వారిని భారతదేశోద్ధరణమునకు బద్ధకంకణులుగా జేయగలిగెను. నేడు గాంధి మహాత్మునివలెనె నాడు రామకృష్ణపరమహంసయు భారతీయసంస్కృతికి ధర్మసాధనకు భారతదేశోద్ధరణకును మార్గదర్శియైనాడు. తరువాత భారతదేశమునుద్ధరించుటకు పాటుపడిన మహాపురుషులనేకులు రామకృష్ణపరమహంస గాలిసోకినవారే.

దేశాభిమానపూరితములై, జాతీయోద్యమమునకు దోహదము చేసిన అనేక నవలలను రచించిన సుప్రసిద్ధ బంగాలీ గ్రంథకర్తయైన బంకించంద్ర చటర్జీ, అనేక నాటకములను రచించి ప్రదర్శించిన గిరీశచంద్రఘోషు, బ్రహ్మసమాజ నాయకుడైన కేశవచంద్రసేను మొదలైనవారికి రామకృష్ణపరమహంస యొక్క తేజము సోకినది. మొదట కేవలము క్రైస్తవమత సిద్ధాంతములె యుత్కృష్టములని వానిని బ్రహ్మసమాజమున జొప్పింపదలచిన కేశవచంద్రసేను రామకృష్ణపరమహంస ప్రభావమువలన భక్తియోగమును స్వీకరించి దానిని ప్రచారము చేసెను.

రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడయిన వివేకానందస్వామి (1863-1902) పట్టపరీక్ష చదువుచూ 1888లో నాయన శిష్యుడైనాడు. రామకృష్ణపరమహంస నిర్యాణానంతరము వివేకానందస్వామి భారతదేశోద్ధరణ కొరకు మనదేశములోను అమెరికాలోను మహత్తరమైన కృషి చేసినాడు. భారతదేశ దారిద్ర్యము భారతీయ పారతంత్ర్యము వివేకానందుని కరగించినవి. వివేకానందస్వామి యుపన్యాసములందు గాఢమైన దేశాభిమానము ద్యోతకమగుచుండెను. కేవలము ఇంగ్లీషువారిని ప్రార్థించి లాభములేదనియు, దేశోద్ధరణము కొరకు స్వయంకృషి చేయుటయవసరమనియు ఆయన ప్రబోధమునుగావించెను. భారతీయ విద్యాధికులు భారతీయ జనసామాన్యమునుద్ధరించుటకు ప్రయత్నింపలేదనియు, అందువలననే ఈ దుఃస్థితి వ్యాపించియున్నదనియు ఆయన చెప్పుచుండెను. కాంగ్రెస్ మహాసభయందు వివేకానందస్వామి ప్రత్యక్షముగ పాల్గొనకపోయినను చాలమంది కాంగ్రెసు నాయకులాయనను దర్శించి ఆయన సలహాలను పొందుచుండిరి. ఆయన తన పర్యటనములందును ఉపన్యాసములందును భారతదేశోద్ధరణ కొరకుద్భోధించని సందర్భమేలేదు. ఆయన రామకృష్ణమఠముల ద్వారమున భారతదేశ క్షేమలాభములకావశ్యంబులైన విద్యాభివృద్ధి వైద్యసాహాయ్యము కఱవులలోను వరదలలోను ప్రజాసేవ మొదలైన సత్కార్యములను జరిగించుచుండెను. ఈ విధముగా రామకృష్ణపరమహంసగారి జీవితమును వారి శిష్యుల కృషియు భారతదేశోద్ధరణమునకు చాల తోడ్పడెను.

భారతదేశోద్ధరణకు ప్రోద్బలమును కలుగజేసిన శక్తులలో పాశ్చాత్య విద్వాంసులు సంస్కృత విజ్ఞానులను మెచ్చుకొనుచు వ్రాసిన గ్రంథములు ముఖ్యముగా పేర్కొనదగినవి. భారతీయ యువకులు పాశ్చాత్యవ్యామోహమున మునిగి నిజదేశ వేషభాషలపైన నభిమానములేక సనాతనధర్మమును తృణీకరించి సంస్కృత సాహిత్యమును చదువక యుపేక్షించిన స్థితిలో పాశ్చాత్య విద్వాంసులు కొందరు సంస్కృతమునభ్యసించి, అందులోని అమూల్య గ్రంథములను తమ భాషలలోనికనువదించి భారతీయ మతధర్మములందును విజ్ఞానమునందును గల ఉత్తమాంశములను గూర్చి మెచ్చుకొనుచు అనేక గ్రంథములను రచింపసాగిరి. ఇవి చదివిన భారతీయ విద్యాధికులలో గొప్పమార్పు కలిగెను. సంస్కృతభాషపైనను సాహిత్యముపైనను గౌరవము కలిగెను. నిజదేశవేషభాషలపైన మరల కొంత అభిమానము కలిగెను.

1875లో అమెరికాలో స్థాపించబడిన దివ్యజ్ఞాన సమాజము భారతీయ నీతిమతధర్మములను ప్రపంచములోని వివిధ మతధర్మములతో పోల్చిచూచి ఇందలి యుత్కృష్టతను చాటసాగెను. ఈ సమాజమువారు ప్రకటించిన పత్రికలు గ్రంథములు మనదేశమున వ్యాప్తిచెందెను. దివ్యజ్ఞానసమాజ స్థాపకులైన మదాం బ్లావట్‌స్కీ, కర్నల్ అల్కాట్‌గార్లు భారతదేశమునకు వచ్చి చాలచోట్ల ఉపన్యాసములిచ్చి సమాజ శాఖలను స్థాపించిరి. వీరి యుపన్యాసములు రచనలు భారతీయులందుత్సాహము కలిగించెను. ఈ దివ్యజ్ఞాన సమాజముయొక్క ప్రధానకార్యస్థానము 1882లో అడయారులో స్థాపించుటకు శ్రీ తల్లాప్రగడ సుబ్బారావుగారే కారకులైరని ఈ సమాజమువారి ప్రముఖులు వ్రాసినారు.

ఒకవంక పాశ్చాత్య క్రైస్తవమత బోధకులు, నింకొక వంక బ్రహ్మసామాజికులు సనాతనధర్మమును విమర్శించుచుండగా చాలకాలమువరకును దానిని సమర్థించువారే లేకపోయిరి. భారతీయుల అదృష్టవశమున వేదశాస్త్రములనభ్యసించి అందలి అంతరార్థములను గ్రహించి సంఘములో ప్రబలిన దురాచారములకు సనాతన ధర్మముత్తరవాది కాదనియు, సనాతన ధర్మమనగా దేశములో ప్రబలియున్న అవిద్యగాని అనాచారముగాని కావనియు చాటిచెప్పగలిగిన మహాసంస్కర్త దయానందసరస్వతి యుదయించెను (1824-1883). వైదికమతమనగా కేవలము యజ్ఞయాగాదికములలోను పూజాపునస్కారములలోను వ్రతములలోను మునిగితేలుట కాదనియు, వర్ణాశ్రమ ధర్మమనగా దాటరాని రాతిగోడలతో నిర్మింపబడిన మతాచారముల పట్టింపులుగావనియు, అతిబాల్యవివాహములు శాస్త్రసమ్మతములనుకొనుటయు, స్త్రీ పునర్వివాహము నిషిద్ధమనుకొనుటయు ఇంకను అనేక ఆచారములు శాస్త్రసమ్మతములనుకొనుటయు కేవలము పొరబాటనియు, చాతుర్వర్ణములనునవి గుణకర్మవిభాగములేయనియు, సనాతనధర్మము నిజముగా భారతజాతీయతకు తోడ్పడగల ఉత్తమనీతిమతధర్మములుగల సత్త్వమతమనియు దయానంద సరస్వతి శాస్త్రప్రమాణములతో నిరూపించి దేశములోనుపన్యాసములిచ్చి 1875లో తన యార్యసమాజమును స్థాపించెను. కొలదికాలములోనే దేశములో చాలచోట్ల ఆర్యసమాజశాఖలు స్థాపింపబడెను.

ఇట్లు ఆ కాలమున బయలుదేరిన సాంఘికమతసంస్కరణోద్యములన్నియు స్వధర్మముపైనను, స్వదేశముపైనను నిజదేశ వేషభాషలపైనను అభిమానము కలిగించి జాతీయోద్యమమునకు దారితీసినవి. వంగదేశములో సుప్రసిద్ధ నవలాకారుడైన బంకించంద్రచటర్జీగారి గ్రంథములందీ సంఘసంస్కరణోద్యమాభిలాషయు, దేశాభిమానమును సంపూర్ణముగ ద్యోతకమగుచున్నవి. మన భారతీయ నీతిమతధర్మము పాశ్చాత్య నీతిమతధర్మములకేవిధముగను తీసికట్టు కాదనియు భారతీయులు తమ విజ్ఞానమును వేదశాస్త్రములను సరిగా అర్థము చేసికొనినయెడల నీసంగతి తెలియగలదనియు ఆయన వంగదర్శనమను వార్తాపత్రికయందనేక వ్యాసములు వ్రాసెను. బంకించంద్రుడు ఆనందమఠమను నవలలో భారతదేశోద్ధరణమునే ఇతివృత్తముగా గైకొని భారతదేశమునే ఒక దివ్యమూర్తిగను, ఆరాధ్యదేవతగను చిత్రించి వందేమాతర గీతరూపముననొక దేశభక్తి మంత్రమును సృజించి భారతజాతీయోద్యమమునకొక నూతనరూపమును చేకూర్చెను. ఆనాటి సాంఘిక మతసంస్కరణోద్యమములు గాఢమైన దేశభక్తిని ప్రబోధించి జాతీయోద్యమమునకు దారిదీసినందులకీ యుదాహరణమొక్కటేచాలును.

“వందేమాతరం”

సుజలాం సుఫలాం మలయజశీతలాం – సస్యశ్యామలాం మాతరం
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం – ఫుల్లకుసుమిత ద్రుమదళశోభినీం
సుహాసినీం సుమధురభాషిణీం – సుఖదాం వరదాం మాతరం |వందే|

త్రింశత్కోటి కంఠ – కల కల నినాదకరాళే
ద్వాత్రింశకోటి భుజైధృతఖరకరవాలే
కేబలే మాతుమించిలే
బహుబలధారిణీం – నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరం |వందే|

తుమి విద్యా తుమి ధర్మ – తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి – హృదయే తుమి మా భక్తి
తొమార ఇ ప్రతిమా గరొ మందిరే |వందే|

త్వంహి దుర్గా దశప్రహరధారిణీ
కమలా కమల దళవిహారిణీ
వాణీ విద్యాదాయినీ – నమామిత్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
శ్యామలాం సరళాం సుస్మిత భూషితాం
ధరణీం భరణీం మాతరం |వందే|

ఆ కాలమునాటి సంఘసంస్కర్తల కృషియు, మతసంస్కర్తల ప్రబోధమును కేవలము భారతీయ విద్యాధికులలో మాత్రమే సంచలనము కలిగించియాగలేదు. వారుచేసిన మహత్తర కృషి దేశములోని జనసామాన్యమునందు కూడ వ్యాపించి వ్రేళ్ళుపారినది. అందువలననే తరువాత మనదేశములో తలయెత్తిన రాజకీయాందోళనము కూడా క్రమక్రమముగా ప్రజలలో నాటుకుని వ్రేళ్ళుపారుటకవకాశము కలిగినది.

సంఘసంస్కరణోద్యమమును మతసంస్కరణమును కేవలము హిందూసంఘమునందుమాత్రమేగాక మనదేశములోని ముసల్మానులలోను ఇతర జనసంఘములలోను కూడా తలయెత్తినది. ఆయా సంఘములందుకూడా జాతీయభావములను నాటినది. ఇంతవరకును విద్యావిషయమునను రాజకీయ విషయములందును వెనుకబడియున్న మహమ్మదీయ జనసంఘము నుద్దీపింపజేసి వారిలో పాశ్చాత్య విద్యాభివృద్ధిని గలిగించి ఇంగ్లీషు ప్రభుత్వమునందు వారికి కూడా పెద్దయుద్యోగములును ప్రాతినిధ్యమును పలుకుబడిని కలిగించుటకు రాజకీయ పరిజ్ఞానమును కలిగించుటకును సర్ సయ్యద్ అహమద్‌ఖాన్‌గారు చేసిన కృషిఫలితముగా అలీగఢ్‌లో మహమ్మదీయ విశ్వవిద్యాలయ మొకటి స్థాపించబడి ఒక ఉద్యమము బయలుదేరి మన భారతదేశ ముసల్మానులకు రాజకీయముగ నొక బలమైన స్థానమును చేకూర్చినది. ఆ కాలమున హిందూ మహమ్మదీయ జనసంఘములందేగాక భారతదేశములోని సిక్కులలోను, దేశీయ క్రైస్తవులలోను కూడా మత సంఘ సంస్కరణోద్యమములు బయలుదేరెను. పంజాబులో సిక్కుల రాజ్యమును స్థాపించిన రంజితుసింగు 1839లో మరణింపగా వారి రాజ్యము భగ్నమయ్యెను. సిక్కుల గురువులను మొగలు చక్రవర్తులు బాధించివేధించినందువలన వారికి మహమ్మదీయులపైన ద్వేషము. 1857లో జరిగిన సిపాయిల విప్లవమునణచుటలో సిక్కులు ఇంగ్లీషువారికి సహాయముచేసిరి. సిక్కుల మతము హిందువుల సనాతనధర్మమునకు సన్నిహితముగా నుండినందువలన క్రమక్రమముగా సిక్కుల మతాచారములు సనాతనధర్మమునకు లోబడి వ్యక్తిత్వమును కోల్పోవసాగెను. గురుద్వారములను సిక్కుల దేవాలయములలో వైదిక దేవాలయములందలి అర్చనలు, ఆరాధనలు వచ్చిప్రవేశించెను. అంతట సిక్కుమత సంస్కర్తలు కొందరు బయలుదేరి తమ మతాచారములలో ప్రబలిన దురాచారములను రూపుమాపి సిక్కుమతమును త్రికరణశుద్ధిగా నాచరించు మహంతులే గురుద్వారములకధిపతులుగ నుండునట్లు కట్టుదిట్టములు చేసి సిక్కులలో విద్యాభివృద్ధిని రాజకీయ పరిజ్ఞానమును కలిగించి సిక్కులకొక వ్యక్తిత్వమును జాతీయ గౌరవమును కలిగించిరి.

ఇట్లే భారతదేశమునను వివిధప్రాంతములందు క్రైస్తవమతమును స్వీకరించిన దేశీయులు విద్యాభివృద్ధిగాని గౌరవముగాని లేక వెనుకబడియుండిరి. చాలమంది తక్కువజాతివారుగ నుండిరి. వారదివరకు కేవలము ఇంగ్లీషువారి వేషభాషలనే అనుకరించి తమ భవితవ్యమింగ్లీషువారి చేతులలోనే యున్నదనుకొని దేశాభిమానశూన్యులుగ నుండిరి. అయితే పాశ్చాత్య క్రైస్తవులు దేశీయ క్రైస్తవులను తమతో సమానముగ చూచుటలేదు. దేశీయులు కూడా వారిని గౌరవించుటలేదు. దేశీయ క్రైస్తవులలో బుద్ధిమంతులైన కొందరు నాయకులు బయలుదేరి తమతోడి క్రైస్తవుల దుఃస్థితిని చూచి వగచి తాముకూడా భారతీయులమేయనియు ఎప్పటికైనను తోడి భారతీయులతో కలసిమెలసియుండిననే తమకు పురోభివృద్ధి కలుగుననియు గ్రహించి దేశీయ క్రైస్తవుల విద్యాభివృద్ధినిగూర్చియు, వారియాశయములను గూర్చియు తీవ్రమైన కృషిచేసిరి. గత శతాబ్దములో దేశీయ క్రైస్తవనాయకులలో కొందరు గొప్ప కవులు, గ్రంథకర్తలు, విద్యాధురీణులు బయలుదేరి తమ మతమువారికేగాక తోడి భారతీయులకు గూడా గొప్ప సేవచేసిరి.

భారతదేశములోని పారశీవారు అల్పసంఖ్యాకులే యైనను విద్యాభివృద్ధి విషయమునను స్వతంత్ర జీవనవిధానమునందును వర్తకవ్యాపారములందును వారికిగల పలుకుబడిని బట్టియు భారతదేశము యొక్క ఆర్థికరాజకీయ వ్యవహారములందును గొప్ప స్థానమును పొందినారు. వీరు సంఘసంస్కరణమున తక్కిన మతములవారందరికన్నను ముందంజవైచినారు. స్వయంకృషి చేత వారు ధనవంతులై భారతదేశమున వైద్యవిద్యలనభివృద్ధిచేయుటకును ప్రజలకు క్షేమలాభములను కలిగించుటకును గొప్ప దానధర్మములనుజేసిరి. స్వయంకృషియందు దేశోద్ధారణ ప్రయత్నములందు దేశాభిమానమునందు భారతదేశములోని తక్కిన మతస్థులందరికిని వీరు మార్గదర్శకులైరి.

గుజరాతు రాష్ట్రములోని జైనసంఘమువారు కూడా తక్కిన వర్గములవారికన్న తక్కువసంఖ్యగలవారే యైనను విదేశవర్తకవ్యాపారములందు వారు చూపించు సాహసమునందును విద్యాభివృద్ధిలోను దేశప్రజల క్షేమలాభములకొరకు తోడ్పడు దానధర్మములను చేయుటలోను వీరు పారశీకులకు సాటిగానున్నారు. ఇట్లు భారతదేశమునందీకాలమున నన్నిజాతులవారిలోను అన్ని మతములవారిలోను సాంఘిక మతసంస్కరణాభిలాష పెంపొందుటయు కేవలము స్వసంఘాభిమానము మాత్రమేగాక స్వదేశాభిమానమును స్వదేశీయులపైన నభిమానమును వర్ధిల్లి అందరికి నుపయోగించు దానధర్మములను చేయుటలో వితరణ ప్రబలి జాతీయోద్యమమునకు దారిదీసినది.

[ఆంధ్రపత్రిక (16.3.1947)]