ఇంగ్లీషు చదువుల చరిత్ర 3

IX

ఐరోపాదేశపు సారస్వతమును పాశ్చాత్య ప్రకృతి శాస్త్రవిజ్ఞానమును కలకత్తాలోని నేటివు యువజన సంఘమునందు నూతనభావములను వికారములను కలిగించెను. వారు పూర్వమునుండి అలవాటుపడిన ప్రాతపంథలనువీడి ప్రాత సిద్ధాంతములను విసర్జించి క్రొత్త ఆలోచనలతో విపరీతపుబుద్ధులతో ప్రవర్తింపసాగిరి. శాస్త్రప్రమాణములు ప్రయోగములును అనుశృతములైన విశ్వాసములను పోగొట్టి మతమునందును ఆచారములందును అపనమ్మకము కలిగించి సంఘ మర్యాదలందు నీతిధర్మములందు గౌరవమును పోగొట్టి ఇంగ్లీషు చదివిన వారివలన ఒక క్రొత్త ప్రచారము చేయించుచుండెను. కలకత్తాలోని ఇంగ్లీషుచదువులు చెప్పు హిందూకాలేజీ విద్యార్థులు విజృంభించి దేశము యొక్క మతమును సంఘమును ఆచారములను తీవ్రముగా విమర్శింపసాగిరి. వర్ణాశ్రమధర్మములను భోగ్యాభోగ్య ఆహారనియమములను తృణీకరించి మతాచారములు బహిరంగముగా నిరసింపసాగిరి. అన్ని విషయములందును పాశ్చాత్యపద్ధతులే శ్రేష్టములను భావముతో ప్రవర్తింపుచుండిరి.

క్రొత్తగా నాంగ్లేయవిద్య నేర్చినవారెల్లరు నీ పాశ్చాత్య విద్యావిధానమును భారతదేశమున నింకను బాగా వ్యాపింపజేయవలెననియు ప్రచారము చేయుచుండిరి. (Life and Experiences of a Bengali Chemist – P. C. Ray, Vol. II P. 333-342; Keshub Chunder Sen; P. C. Muzumdar: Rise and Fulfilment of British Rule – Thompson and Garratt, P. P. 309-311)

ఈ దేశప్రజల కింగ్లీషువిద్యయం దభిరుచి గలుగుటను గనిపెట్టి క్రైస్తవమిషనరీలు అనేక ఇంగ్లీషు పాఠశాలలు కాలేజీలు స్థాపించి మెల్లగా బాలురకు తమ మతాచారవ్యవహారములందు హేయభావము గలిగించి బాలుర మనస్సులకు క్రైస్తవభావముల నెక్కించుచుండిరి. దీనిఫలితముగా బాలురు క్రైస్తవమతము నవలంబించినను అవలంబింపకపోయినను ముందుగా హిందూమతాచారములందు నమ్మకము గోల్పోవుదురని వారి విశ్వాసము. ఇది నిజమయ్యెను. చాలామంది యువకులలో నాస్తికభావము లుదయించెను. ఎట్టకేలకు కొందరు క్రైస్తవమతమున గలిసిరి. కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్ అను మిషనరీ 1830లో వచ్చి చేసిన తీవ్రమైన కృషివలన కులీనకుటుంబమునకు జెందిన కృష్ణమోహన బెనర్జీగారు 1832లో క్రైస్తవుడయ్యెను. దీనితో భారతదేశమున నొక క్రొత్త సమస్య ప్రారంభమయ్యెను.

క్రైస్తవమతాచార్యులు బాలురనుచేరదీసి క్రైస్తవులుగ జేయుచుండుట బాలురదలితండ్రులు వారిని వశము చేయమని సుప్రీముకోర్టులలో హెబియస్ కార్పసు కేసులు దాఖలుచేయుట, క్రైస్తవమతాచార్యులు వానిని ప్రతిఘటించుటయు ప్రారంభమయ్యెను*. క్రైస్తవులైన యువకులభార్యలను బలవంతముగా వారివశము చేయించుటకును మతాచార్యులు ప్రయత్నించిరి. క్రైస్తవమతమున జేరినవారికి హిందూ సమష్టికుటుంబమునగల ఆస్తిహక్కులు పోవుటవలన క్రైస్తవులుగ జేరకుండుటజూచి క్రైస్తవమతాచార్యులు ప్రభుత్వమువారిని ప్రోత్సహించి అట్టి హక్కులుపోకుండ 1832లో వంగ రాష్ట్రమున శాసింపజేసిరి. ఈ శాసనమును తరువాత 1850లో దేశమునంతటను అమలుపరచిరి.

[* ఇటువంటి కేసులు రెండు 1843లో బొంబాయి సుప్రీముకోర్టులో వచ్చినప్పుడు దేశీయులందు చాలా అలజడి ఆందోళనము కలిగెననియు, తమమతమున గలిసిన క్రైస్తవులహక్కులను కాపాడుటకొరకు వారి పక్షమవలంబించి పనిచేయసాగిన మిషనరీలయందును తీవ్రమైన ఆవేశము కనబడినదనియు బొంబాయి సుప్రీముకోర్టు జడ్జిపనిచేసిన సర్ ఎర్‌స్కిన్‌ఫెర్రీగారు తరువాత 1853లో వ్రాసియున్నారు. see: Cases illustrative of Oriental life decided in Supreme Court of Bombay, Sir Erskine Ferry. Page 520.]

భారతదేశమున క్రైస్తవమత ప్రచారావశ్యకతనుగూర్చి క్రైస్తవమిషనరీలు ఇంగ్లాండుదేశమునగూడ ప్రచారము చేయగా 1833లో కుంఫిణీవారికి పార్లమెంటువారు మరల పట్టానిచ్చు సందర్భమున భారతదేశమందు క్రైస్తవప్రచారము చేయుటలో మిషనరీలకుగల ఆటంకములనన్నిటిని తీసివేయుటకు వలసిన ఏర్పాటులనుజేసిరి.

భారతదేశ ప్రభుత్వమున మిషనరీల పలుకుబడి హెచ్చెను. అంతట గవర్నరులు ప్రభుత్వసభ్యులు కలెక్టర్లు జడ్జీలు వీరికి సర్వవిధములైన సాయములను జేయుచు వీరిని ప్రోత్సహింపసాగిరి. క్రైస్తవులైనవారి కుద్యోగములిచ్చుట ప్రారంభించిరి. దేశీయుల మతముతో జోక్యము కలిగించుకొనమనియు మతవిషయకమైన విచక్షణచూపమనియు కుంఫిణీవారు వాగ్దానము చేసియున్నను అందుకు విరుద్ధముగా ప్రవర్తింపసాగిరి.

ఇట్లు క్రైస్తవమతాచార్యులును భారతదేశమును పాలించు కుంఫిణీయుద్యోగులును ఏకమై హిందూమతముపైన దండెత్తి దానిని నిర్మూలించుటకు ప్రయత్నించుచున్నారను భావము ప్రజలలో వ్యాపించగనే స్వధర్మ రక్షణము చేసికొనవలెనను తలంపు కలిగెను. అంతట వంగరాష్ట్రమున అంతవరకు బ్రహ్మసభయనియు ధర్మసభయనియు రెండు పక్షములుగా చేరి పోరాడుకొనుచున్న హిందూ సంఘసంస్కరణవాదులు సనాతనధర్మవాదులు నీవిపత్సమయమున నేకమైరి. వారి నాయకులగు దేవేంద్రనాథ ఠాకూరుగారును రాజారాధాకాంతదేవుగారును ఈ విషయమున ఏకీభావము వహించి సభలు చేసియు తీర్మానములు గావించియు పై యధికారులకు మహజరులంపియు, పత్రికలందు విమర్శించియు ఆందోళనము చేయసాగిరి$. తరువాత 1861లో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అను పేరుతో నొక జాతీయ ప్రజాసంఘము స్థాపించబడి రాజ్యాంగ సంస్కరణములకొరకు ఆందోళనము చేయసాగెను.

[$ see: Life of Alexander Duff-George Smith (1879) Vol. II Pp. 59-71; see: Rise and fulfillment of British Rule in India—Thompson and Garrett, PP 310-311.]

X

హిందూదేశమతాచారములతో నెట్టిజోక్యము కలుగచేసికొనమనియు, అన్ని మతములను సమానముగా జూచెదమనియు క్రైస్తవమతమందు ప్రజలను కలుపుకొన బ్రయత్నించమనియు కుంఫిణీవారు మొదటినుండియు వాగ్దానము చేయుచుండిరి. ఈ సూత్రము పార్లమెంటువారుచేసిన చట్టములందుకూడా శాసించబడెను. కాని ఇంగ్లీషుప్రభుత్వము క్రమక్రమముగా బలవంతమైనకొలదియు నీ వాగ్దానములను తృణీకరించి క్రైస్తవమత పక్షపాతము చూపసాగెను. క్రైస్తవమత ప్రచారముచేయు మిషనరీలకు ప్రబుత్వమన్నివిధముల సహాయము చేయసాగెను. ఈ మిషనరీలు పాఠశాలలు స్థాపించి విద్యాబోధనముద్వారా క్రైస్తవమతమును ప్రచారము చేయదలచిరి. దీనివలన బాలురమనసులు మరల్పగలుగుచుండిరి. త్వరలోనే కొందరినిట్లు క్రైస్తవులుగజేసిరి. పాఠశాలలలో పరీక్షలందుత్తీర్ణులైనవారికే ప్రభుత్వోద్యోగము లివ్వబడునని 1844లో శాసింపబడుటతో క్రైస్తవ పాఠశాలాధికారుల పుణ్యము పుచ్చెను. చాలామందిని వీరు క్రైస్తవమతమున గలుపసాగిరి. దీనిని గూర్చి ప్రజలెంత మొరలుపెట్టుకొన్నను ప్రభుత్వమువారు కలిపించుకొనరైరి. న్యాయస్థానములందు కూడా క్రైస్తవమతపక్షపాతము ప్రబలి న్యాయము దొరకకుండెను.

1842లో మార్క్విస్ ఆఫ్ ట్వీడ్‌డేలు ప్రభువు మద్రాసు గవర్నరయ్యెను. ఇతనికి క్రైస్తవమతాచార్యులపైన చాలనభిమానముండెను. క్రైస్తవమతాభిమానియైన జాన్‌ఫ్రయ్యర్ తామస్ అనునాయన 1843లో చెన్నపట్టణ ప్రభుత్వములో రివిన్యూ శక్రటరీ యయ్యెను. తరువాత నతడు క్రమక్రమముగా ప్రభుత్వమునందు పెద్ద యుద్యోగములు చేయుచు 1850లో ప్రధాన ప్రభుత్వ కార్యదర్శియయ్యెను. ఇతడు తన యావచ్ఛక్తిని వినియోగించి క్రైస్తవ మిషనరీలకు సాయము చేయసాగెను. ఇట్లే చెన్నపట్టణమున పరమోన్నత న్యాయస్థానమగు సుప్రీము కోర్టులో 1844లో న్యాయాధిపతియైన సర్ విలియం బర్టనుగారు క్రైస్తవ మతమునందు గాఢమైన అభిమానము కలిగియుండిరి. ప్రభుత్వమునందలి పెద్ద అధికారులందరు ఆనాటి క్రైస్తవ సంఘములందు గౌరవోద్యోగములు కలిగియుండిరి. పెక్కుమంది కలెక్టరులు జిల్లాజడ్జీలు మిషనరీల చెప్పుచేతలలో నుండిరి. ఒకరిద్దరు నిష్పక్షపాతముగా నున్నందులకుద్యోగములందు దెబ్బతినిరి. అట్టివారిలో సదరుకోర్టులో జడ్జియగు మాల్కలంవెలిన్‌గారొకరు. ఈ క్రైస్తవ పక్షపాతులగు నుద్యోగులు తమ అధికారములందు చూపు క్రైస్తవమత పక్షపాతము, చేయుచుండిన అన్యాయములు, ప్రజలను పెట్టుచుండిన నిర్భంధములు మితిమీరిపోగా దేశప్రజలలో తీవ్రమైన అశాంతి యుదయించెను. హిందువులు క్రైస్తవ మతమున జేరినచో వారి ధర్మశాస్త్రమును బట్టి సమష్టి కుటుంబములందలి ఆస్తి హక్కులు పోవుట క్రైస్తవ మత ప్రచారమున కాటంకము కలిగించు చున్నందున 1832 లోనే వంగ రాష్ట్రమున నీ యడ్డంకి తొలగించు నొక శాసనము చేయించిరి. దీనిని దేశమంతట ప్రవేశపెట్ట వలయునని మిషనరీలు సంకల్పించిరి. అంతట చెన్నపట్టణ ప్రజలలో కలవరము కలిగెను. దీనినిగూరి 1845 సం|| ఏప్రిలు నెలలో అసమ్మతి సభలు చేయగా చెన్నపట్ట్ణ ప్రభుత్వమువారును కేంద్ర ప్రభుత్వమువారును కొన్ని ఉత్తర ప్రత్యుత్తరములు జరిపి అప్పటికది మానిరి.

చెన్నపట్టణమున యూనివర్సిటీ యనుపేరున 1841లో స్థాపించబడిన ప్రభుత్వ పాఠశాలయందు మతముతో సంబంధములేని ఆంగ్లేయ లౌకిక విద్యయే గఱపుటకు నిశ్చయింపబడియుండెను. అయితే ఏదో విధముగా దానిలో బైబిలు ప్రవేశపెట్టవలెనని మిషనరీలు దృఢనిశ్చయులైరి. ఆ పాఠశాల విద్యార్థులను పరీక్షించుటకు ప్రభుత్వమువారీ మిషనరీలనే నియమించుట ప్రారంభింపగా వీరు బాలురను ప్రపంచజ్ఞానములను గూర్చి ప్రశ్నించుటయను మిషపైన బైబిలును గూర్చియు క్రైస్తవమతమును గూర్చియు ప్రశ్నించుచు జవాబు చెప్పలేనివారిని పరీక్షలందు తప్పించి ఉద్యోగములు లేకుండ జేయసాగిరి. దీనినిగూర్చి ప్రజలు మొఱపెట్టగా బైబిలు నొక పాఠ్యపుస్తకముగా చదివించినచో నీబాధ యుండదని జవాబు చెప్పిరి. వీరి సలహాను పురస్కరించుకొని మద్రాసు గవర్నరు ట్వీడుడేలుగారు బైబిలును పాఠశాలలో నొక క్లాసుపుస్తకముగా ప్రవేశపెట్టుటకు 1846 సంవత్సరం ఏప్రిలు 28 తేదీన తీర్మానించెను.

క్రైస్తవమత ప్రచారకులలో అతి సమర్థుడును ప్రతిభాశాలియనియు పేరుపొందిన జావ్‌యాండరుసన్ అను యువకుడు చర్చి ఆఫ్ స్కాట్లండు మిషనరీగా చెన్నపట్టణమునకు వచ్చి 1837వ సంవత్సరం ఏప్రిలు 3వ తేదీన నల్లవారు నివసించు (నేడు జార్జిటవును అని వ్యవహరింపబడు) బ్లాక్ టవునులో నొక పాఠశాలను స్థాపించెను. అక్టోబరు 1838 నాటికి ఈ పాఠశాలలో 270 మంది విద్యార్థులుండిరి. వీరిలో చాలమంది హిందువులు. ఇట్టి స్థితిలో నీయాండర్‌సన్ తన పాఠశాలలో ముగ్గురు అస్పృశ్యులను చేరుచుకొనెను. అంతట హిందూబాలుర తలిదండ్రులు తమ అసమ్మతిని తెలిపి హరిజన బాలురను పంపివేయమనిరి. ఆండరుసను అంగీకరించలేదు. అంతట నూరుమంది పిల్లల నొక్కసారిగ మాన్పించిరి. ఇట్లు మొదటి హిందూక్రైస్తవ యుద్ధము ప్రారంభమయ్యెను గాని కొన్నాళ్ళలో నీ కలవరము సర్దుమణిగి పాఠశాల అభివృద్ధిగాంచసాగెను.

1840లో యాండర్‌సనుదొర పాఠశాలలో చదువుకొనిన రాజగోపాల్, వెంకట్రామయ్య, యతిరాజులు అను హిందూబాలురను క్రైస్తవ మతమున కలుపగా హిందూప్రజలలో గొప్ప భయాశ్చర్యములు కలిగెను. ప్రజలమూకలు  పాఠశాలను ముట్టడించెను. ఆండర్‌సను తన పెద్ద కర్రతోవచ్చి యాజనమును పారదోలెను. మరల పాఠశాలనుండి చాలమంది హిందూబాలురను తలిదండ్రులు మాన్పించిరి. అట్లుమానినవారిలో తరువాత చెన్నపట్టణములో ప్రముఖులైన అమరవాది శేషయ్యశాస్త్రిగారొకరు. ఇది వీరి జీవితచరిత్రమున వర్ణింపబడినది.

XI

రాజగోపాలుడు క్రైస్తవమతమున కలిసినప్పుడు, ఈతనివ్యవహారము చెన్నపట్టణము సుప్రీముకోర్టులో విచారణకువచ్చెను. నీకేదో కొన్ని లాభములు కలిగింతుమని చెప్పినందువలననే నీవు క్రైస్తవుడవైతివికాదా యని యాతనినడుగగా తాను ఏసుక్రీస్తునందుగల నమ్మకమువలననే క్రైస్తవుడనైతినని అతడు బదులు చెప్పెను. 1846లో చెన్నపట్టణములో ముగ్గురు యువకులు క్రైస్తవమతమునగలియ ప్రయత్నింపగా ప్రజలలో కొంత అశాంతికలిగెను. వారిలో నొకరినిగూర్చిన కేసు సుప్రీముకోర్టులో విచారణకువచ్చెను. ఆబాలుడు విచక్షణజ్ఞానము కలిగినవయస్సున నున్నాడనియు తాము జోక్యము కలిగించుకొనమనియు కోర్టువారనిరి. బాలుని తండ్రికి వశముచేయక మిషనరీలు బండిలో తీసుకొని పోవుచుండగా ప్రజలు ముట్టడించి కొంత దౌర్జన్యముచేసిరి.

1847లో నొక ఆడపిల్లను మిషనరీలు అక్రమనిర్బంధములో నుంచినారని సుప్రీముకోర్టులో ఫిర్యాదు చేయబడెను. అంతట యిరువురు క్రైస్తవమతాచార్యుల సమక్షమున తానామెను పరీక్షించితిననియు ఆమెకు పండ్రెండేండ్లుకలవని కుంఫిణీ వైద్యాధికారి ఒక ధ్రువపత్రమును వ్రాసియిచ్చినందున కోర్టువారామెను మిషనరీల స్వాధీనము చేసిరి.

1847 లో 5మంది ఆడుపిల్లలు క్రైస్తవులుగ చేయబడిరి. ఈ క్రైస్తవమతవిజృంభణము చూడగా దేశీయ జన సంఘమునందు గొప్ప కలవరము పుట్టెను.

1850వ సంవత్సరం ఏప్రిలు 11వ తేదీన క్రైస్తవ మతమున కలిసినవారికి హిందూ కుటుంబములందలి ఆస్తి హక్కులుపోవని ఒక శాసనము చేయబడగా చెన్నపట్టణమున ప్రజలయందు అశాంతిగలిగెను. ఈ శాసనము మతస్వాతంత్ర్యమును ప్రసాదించు గొప్ప చట్టమని సుప్రీముకోర్టులో జడ్జిగానుండిన సర్ విలియం బర్టనుగారు బహిరంగముగా నుద్ఘోషించిరి.

శీఘ్రముగనే క్రైస్తవమతమున గలిసిన హిందువుల హక్కులనుగూర్చి యీ బర్టనుగారొక పక్షపాతపుతీర్పు నొసగిరి. క్రైస్తవమతమున గలిసిన శ్రీనివాస యనునాతని భార్య 15 ఏండ్ల వయస్సుగల లక్ష్మి అమ్మాళ్ అనునామె తన భర్తతో కాపురముచేయ నిరాకరింపగా భర్తపెట్టుకొనిన హెబియస్‌కార్పస్ అర్జీనిబట్టి 7-6-1851 తేదీన ఆమెను బర్టనుగారి కోర్టులో హాజరుపరచిరి. క్రైస్తవుడయినను భర్త ననుసరించుట నీ విధియని బర్టనుగారామెకు బుద్ధిచెప్పి భర్తదగ్గరకు వెళ్ళమనిరి. ఆమె నిరాకరింపగా బర్టనుగారు ఆంగ్లేయ కాన్‌స్టేబుల్సులో నొకనిచే నామెను తన గదిలోనున్న ఆమె భర్తదగ్గరకు బలవంతముగ పంపించెను. అంతట ఆ పిల్లతండ్రి గోలపెట్టెను. మేనత్త అర్చుచు తలవెంట్రుకలు పీకుకొని పిల్లదగ్గరకు పోబోయెను. కాని ఇద్దరు మనుష్యులామె నాటంకపరచిరి. కోర్టు ఆవరణలో చేరిన 500 మంది బ్రాహ్మణులు కేకలువేసి గత్తరచేయసాగిరి. అంతట వారిని బలవంతముగా చెదరకొట్టిరి. ఇట్టి దృశ్యములు ఆ కాలమున సర్వసామాన్యమైపోయెను.

బొంబాయి సుప్రీముకోర్టులో నిటువంటి వ్యవహారమే విచారణకురాగా సద్ధర్ముడగు సర్ ఎర్‌స్కిన్ పెర్రీ అను న్యాయాధిపతి ఇట్లనెను. “తురుష్కదేశమున నే  యాంగ్లేయుడో మహమ్మదీయుడై నలుగురు భార్యలను స్వీకరింపదలవగా అతని క్రైస్తవభార్య యాతని ననుసరింప నిరాకరించెనేని బలవంతముగ నామెను భర్తవద్దకు పంపవచ్చునా? తెల్లవారికొక ధర్మమును నల్లవారికొక ధర్మమును నుండగూడదు” అని తీర్మానించుచు బర్టనుగారి తీర్పును తీవ్రముగ ఖండించి క్రైస్తవుడైన భర్తకు అతని హిందూభార్యను వశముచేయ నిరాకరించెను. (చూడుడు: యక్సుపార్టి బలరాం బొంబాయి సుప్రీంకోర్టు 25-9-1852. Cases Illustrative of Oriental Life – Sir Erskine Perry page 516.)

వంగ రాష్ట్రమునందు స్వధర్మరక్షణకొరకు పనిచేసిన దేశీయనాయకులవలెనే చెన్నపట్టణమున గాజుల లక్ష్మీనరుసు సెట్టిగారును 1844 లో) చెన్నపట్టణ స్వదేశ సంఘముకు క్రెసెంటు అను పత్రికను స్థాపించి సభలు చేసి తీర్మానములు మహాజరులును గవర్నరుకును ఇంగ్లాండులో డైరెక్టర్లకును పార్లమెంటునకును పంపి ఆందోళనచేయసాగిరి.

అన్ని మతములను సమానముగా చూచెదమనియు క్రైస్తవమతమునకు ప్రత్యేక ప్రోత్సాహమొసగమనియు పూర్వము కుంఫిణీప్రభుత్వముచేసిన వాగ్దానములకు విరుద్ధముగా గవర్నరు ప్రవర్తించుట, మతబోధకులు ప్రభుత్వోద్యోగుల సాయముతో ప్రజలను తమ మతములో గలుపుకొనుటకొరకు ప్రజలను నిర్భంధించుచుండుట, దానికి ప్రభుత్వమువారు తోడ్పడుచుండుట, క్రైస్తవమతమున జేరుడని బాలురు పరీక్షలందుత్తీర్ణులు గాకుండగను వారికుద్యోగములు రాకుండగను మత బోధకులుద్యోగులతో కుట్రలుచేయుచుండుట చెన్న రాజధానిలో వివిధ జిల్లాలలో ఇంగ్లీషుపాఠశాలల నేర్పరచి జనసామాన్యమున విద్యాభివృద్ధి గావింపకుండుట న్యాయస్థానములందు తరచు అన్యాయములే జరుగుచుండుట గురించి 1844-1846 లో ఆందోళనచేసిరి.

తరువాత ఏర్పడిన బ్రిటిష్ ఇండియన్ ప్రజాసంఘమువలెనే చెన్నపట్టణ స్వదేశసంఘముకూడ రాజ్యాంగ సంస్కరణలను కోరసాగెను. కుంఫిణీపరిపాలనమున ప్రజలు దరిద్రులై అజ్ఞానాంధకారమున మునిగి అనారోగ్యమున పడియుండుట, రాకపోకలకు రోడ్లకు పల్లపుసాగుకు ఎట్టిసౌకర్యములుగాని లేకుండుట, పన్నులత్యధికములై రైతులు భరింపలేకుండుటయు, పన్నులివ్వలేనివారిని నరక భాధలను భరింపజేయు కలెక్టరుల నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనమును, కోర్టుల యప్రయోజకత్వమును, క్రైస్తవమతబోధకుల దురాగతములను, కుంఫిణీవారి దుష్పరిపాలనమును వర్ణించుచు 1852లో పార్లమెంటుకు మహజరులంపిరి. దేశపరిపాలనమున దేశీయ ప్రజాప్రతినిధులకు పలుకుబడి కలిగింపవలెననియు గోరిరి. 

ఇట్లు వంగ రాష్ట్రమునను చెన్నరాజధానియందును గూడ ముందు విద్యాభివృద్ధికొరకు ప్రారంభమైన ప్రచారము ఆందోళనము తరువాత స్వధర్మ రక్షణ కొరకును, పిమ్మట పరిపాలనలోని యన్యాయములను బాపుటకొరమును, అటుతరువాత రాజ్యాంగ ‘సంస్కరణ’ల కొరకును చేయబడిన జాతీయోద్యమముగా పరిణమించినది. ఇది భారతదేశచరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించి శాశ్వతముగా స్మరింపదగిన ఆశ్వాసము. 

(సమాప్తం)