నాకు సంస్కృతం రాదు. తెలుగు కావ్యాలు ఎక్కువగా చదవలేదు. మంచి మంచి పద్యాలు నోటికి రావు. తెలిసిన పద్యాలు కూడా గబుక్కున ఎక్కడివో ఎవరివో చెప్పలేను. కవిత్వం చదివి ఆస్వాదించడం మాత్రమే తెలుసు. కాళ్ళు భూమ్మీద ఆనించుకుని స్థిరంగా నిలబడడం కోసం ఆరాటపడిన కాలం మాది, కావ్యాలు కవిత్వాలు చదివి వాటిలోని సొబగు సౌందర్యాలు ఆకళింపు చేసుకునే వెసులుబాటు లేనితనంలో జీవితంలోని నాణ్యమైన కాలం గడిచిపోయిన సందర్భం మాది. ఈ పిల్ల చూడబోతే బాగా చదువు వచ్చిన పిల్ల. ఇంజినీరింగ్‌తో పాటు డొక్కశుద్ధిగా సాహిత్యం చదివిన పిల్ల. లోకాన్ని చూస్తూ అర్థంచేసుకుంటున్న పిల్ల. మరెందుకీ గౌరవం అందుకునే సాహసం నాకు అంటే… నాకు కవిత్వం అంటే గౌరవం. కథలంటే ప్రేమ. హాస్య వ్యంగ్య జీవన చిత్రాలంటే మక్కువ. పిల్లల్ని గౌరవంగా చూస్తూ, గారంచేసే తల్లులంటే ఇష్టం. తమ పిల్లల పసితనం లోని అమాయకత్వంలో కనపడకుండా దాక్కున్న కళ్ళు చెదిరే తెలివీ, సమయోచిత సంభాషణలకీ అబ్బురపడి ఆ అబ్బురాన్ని పదిమందికీ పంచి ఆనందించే చిట్టి తల్లులని గుండెకి హత్తుకోవాలనిపిస్తూ వుంటుంది. అందుచేత ఈ నెమలీకల్ని అలా తడిమే సాహసం చేస్తున్నాను. ఈ సంపుటికి కాకీక కాకికి కాక అని శీర్షిక పెట్టడం నాకు నచ్చలేదు. ఇవి కేకీకలు కదా మరి!
మా విజయవాడలో చాన్నాళ్ళ క్రిందట ఒక సభలో కూర్చుని వున్నప్పుడు మా శ్యామలానంద ప్రసాద్ మాస్టారు ఒక సన్నజాజి మొగ్గని తీసుకొచ్చి ‘మా అన్నయ్య కూతురు. కవిత్వం రాస్తుంది. అమెరికాలో చదువుతోంది.’ అని చెప్పి ఆ అమ్మాయి చేత సంతకం పెట్టించి నాకు వానకు తడిసిన పువ్వొకటి ఇప్పించారు. పుస్తకం శీర్షిక అయిన కవితే కాదు అన్ని కవితలూ చాలా బావున్నాయి. ఆమె మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యం అనిపించింది. క్లుప్తంగా వుండే ఆమె కవితలలో సంగీతపు సొబగు వుంది, ఒక తాత్వికత వుంది. అలవోకగా చెప్పేసి వెళ్ళిపోయినా, హత్తుకుపోయే గుణం వుంది. ఇప్పుడక్కడ అప్రస్తుతమైనా ఈ కవితను ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది.
ఊడ్చిన గది
గదంతా శుభ్రంగా ఊడవాలనిపించింది
ఎందుకో ఒక మాటు ఏడవాలనిపించింది
తరువాత గాఢంగా నిద్ర పట్టేసింది
లేచి చూస్తే గదంతా ఖాళీ అనిపించింది
తళ తళా మెరుస్తూ ఉల్లాసంగా కనిపించింది
ఓ మంచి పుస్తకం తీసి చదవాలనిపించింది
కొన్ని పాత కవితలను మననం
చేసుకోవాలనిపించింది
ఈ కవితలో ఎంత జీవన తాత్వికత వుందో అర్థంచేసుకుని అభిమానంతో చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకోడం మర్చిపోయాను. అది మొదటి పరిచయం. తరువాత వాళ్ళమ్మగారి దగ్గరకు వెళ్ళి చిట్టి చిట్టి మిరియాలు, ఱ అనే ఆత్మ కథాత్మక నవలిక తెచ్చుకున్నాను. ఆ పుస్తకం నన్ను ఎంతగా కదిలించిందంటే, నేనే కాదు అందరూ చదవాలనే ఆశతో ఒక స్నేహితురాలికి ఇచ్చాను. ఆవిడ ఎక్కడో పెట్టానని ఇవ్వలేదు. మరణం మాట తలుచుకుంటే ఒక కంపన కలుగుతుంది ఎవరికైనా. కానీ అంత చిన్న వయస్సులో ఈ అమ్మాయి ఆ పుస్తకంలో ఎన్ని సహజ, అసహజ, హఠాత్ మరణాలను కొంత ఉద్వేగంతోనూ కొంత నిర్మోహంతోనూ ప్రస్తావించిందో చదివి కదిలిపోయాను, అధ్యయనంతో పాటు అనుభవాలు జీవన దృక్పథ నిర్మాణానికి సోపానాలు వేస్తాయని మరొకసారి తెలిసింది.
ఇంత సాహిత్య పరిజ్ఞానం, సమతూకంతో వ్రాయగల నేర్పు వున్న ఇంద్రాణి మొదటి కవితా సంపుటే ఒక ఇంద్రజాలం అన్నారు కదా యదుకులభూషణ్‌గారు. ఈ చిన్న పుస్తకం ఆమె ఆలోచనలకి వాటిని వ్యంగ్య హాస్య శైలిలో చెప్పిన పద్ధతికి ఆమెలో వచ్చిన పరిణతికి అద్దం పడుతుంది.
మొదటి మూడు నాలుగు వ్యాసాలూ లేదా స్కెచ్‌లు అమెరికాలో భారతీయ జీవితాన్ని కొంత వ్యంగ్యంగా చెప్పినవి. తమ సహజమైన ఆహారాన్ని వెతుక్కుతిని స్వేచ్ఛగా అడవిలో తిరిగే జంతువుల్ని పట్టి తెచ్చి ప్రదర్శనకు పెడితే, వాటి చర్మాలతో చేసిన చెప్పులూ బెల్టులూ వాచీ స్ట్రాపులూ ధరించి, ఆ ప్రదర్శనశాలకు వెళ్ళి వాటితో ఫోటోలు దిగే మన సంస్కృతి, మన భూతదయ ఎంత డొల్లదో అసలు ఆ పదానికి అర్థం మనకి తెలుసా? అనే సందేహం కూడా కలుగచేస్తుంది ‘నేషనల్ జూ’. బ్రేక్ రూమ్‌లో తటస్థపడ్డ బాబు ఇండియాలో నానా తంటాలు పడి అవకాశాల దేశానికొచ్చి నిలదొక్కుకుని నిచ్చెన ఎక్కడం ఇప్పుడొక మామూలు విషయమే. అయితే, డబ్బింగ్ సినిమా పాటలు పాడి పడీపడీ నవ్వించడం ఇంకో సంగతి. ‘నేనెవరు, I quit your world’లలో ప్రపంచ పోకడలపై అసంతృప్తి, అశక్తత, మేధావులైన స్త్రీలపై లౌక్యుల సంస్కారం లేని ప్రవర్తనలపై నిరసనతో కూడిన కోపంతో వ్రాసిన కవితలు. ప్రేమను శారీరక సౌందర్యానికి పరిమితం చేసిన కవులూ భావుకులూ చలనచిత్రాలూ మనోసౌందర్యానికి, వాత్సల్యానికి చోటు పెట్టని ప్రేమలు ప్రవర్తిల్లుతున్న చోట అసలు ప్రేమ అంటే ఏమిటనే సందేహం, అదొక మరీచిక అయిపోయిందా అనే నిస్పృహ కలుగుతుంది ‘యదా కాష్టంచ…’ చదివితే.
ఆ పైన కవిత్వం గురించి ఆమె అభిప్రాయాలను ప్రకటించే వ్యాసాలూ, అందులోనే మళ్ళీ ‘పాత సామాన్లకు ఉల్లిపాయలు’ అంటూ రొడ్దకొట్టుడు కవిత్వంపై గుడుగుడు కుంచం ఆడే వస్తువులపై వ్యంగ్యాస్త్రాలను సంధించింది. ఆంధ్రావిలాస్ కాఫీ క్లబ్ అప్పుడెప్పుడో చదివిన కవుల రైలును గుర్తు తెచ్చింది. ప్రపంచమంతా అల్లుకుపోయిన సాలెగూటిలో ఇరుక్కుపోయిన జనత ప్రతి విషయం పైనా తమ ‘విలువైన’ అభిప్రాయాలూ ఇష్టాల వేలిముద్రలూ వేయడంపై విసుర్లూ. ఇట్లా పుస్తకం మల్లెపూలూ మరువం కనకాంబరాలూ మాచిపత్రీ కలిపి కట్టిన కదంబమూ అనొచ్చు లేదా అడవి దారిలో గాలిపాట వింటూ ఏరుకొచ్చుకున్న నెమలీకలని కూర్చి కట్టిన గుత్తి అనుకోవచ్చు. ఈ నెమలీకల్ని ఇంటి లైబ్రరీలో పుస్తకాల మధ్య దాచుకోవాలి. ‘నీళ్ళు కాచే పనిపిల్ల, ఫకీరు, పొద్దున్నే బిపాసా, చెట్టు కింద మనుషులు’ లాంటి ఎన్నో కవితలు ఆశువుగా వ్రాసిన ఇంద్రాణి మరిన్ని నెమలీకల్ని ఏరి తెచ్చి తెలుగువాళ్ళకి కానుక చెయ్యాలని ఆశ. ఇంద్రాణిలో ఫ్లెయ్‌ర్ వుంది. ఆర్ధ్రత, ఆలోచన, సున్నితమైన పరిశీలన, అనుభవాలని వడబోసి దాచుకునే శక్తి, అధ్యయనం, తల్లులకి పిల్లల పట్ల వుండే లాంటి ప్రేమ ప్రపంచం మీద కవులకి రచయితలకు వుంటుందని నేను అనుకుంటాను. అలాంటి ప్రేమ వున్న ఇంద్రాణి ప్రచురించబోయే మరో కవితా సంపుటి కోసం ఎదురు చూస్తూ…
పి. సత్యవతి
ఒక మంచి ఉదయం
విజయవాడ
15 ఏప్రిల్ 2019