సార్థకనామ వృత్తములు – 1

పరిచయము

పద్యములకు పేరులను లాక్షణికులు ఎలా పెట్టారో అనే ప్రశ్న నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఒకే పద్యానికి ఎన్నో పేరులు, ఒకే పేరుతో ఎన్నో పద్యాలు! వృత్తాలలో ప్రతి వృత్తమునకు దాని గురులఘువుల నిర్ణయానుసారము ఒక వృత్త సంఖ్య ఉంటుంది. వృత్తపు ఛందస్సు సంఖ్య (అనగా పాదములోని అక్షరాల సంఖ్య), వృత్త సంఖ్య ఉంటే దాని గణస్వరూపమును తెలిసికొన వీలగును. యత్యక్షరములు వృత్తపు లయను బట్టి, విఱుపు బట్టి ఉంటాయి. వృత్తపు పేరును బట్టి గణనిర్ణయము సాధ్యమా? క్రొత్త వృత్తములకైనా ఇలా చేయవచ్చు గదా?

య, మ, త, ర, జ, భ, న, స, హ, వ, ల, గ అనే గణములతో పేరును బెట్టవచ్చును. అక్షరములోని హల్లు, గణాన్ని తెలుపుతుంది. అచ్చు ఆ గణము ఎన్నిమార్లు ఆవృత్తి అవ్వాలన్న విషయము తెలుపుతుంది (అ-కారమునకు ఒకటి, ఆ-కారమునకు రెండు, ఇ-కారమునకు మూడు, ఇలా). మిగిలిన అక్షరాలను నిరాకరించవచ్చును, ఒత్తునకు ఒకే గణము. అనుస్వారమును నిరాకరించుటయా లేదా అనే విషయమును గుఱించి ఆలోచించాలి. ఉదాహరణముగా భారతికి భ/భ/ర/త/త/త, సరస్వతికి స/ర/స/వ/త/త/త, రాత్రికి ర/ర/త/త/త/ర, హరికి హ/ర/ర/ర. ఒత్తులను తెలుగు రీత్యా అనుసరిస్తాను నేను. రాత్రిని మనము రా వ్రాసి తి వ్రాసి క్రింద ర ఒత్తును వ్రాస్తాము. కాబట్టి రాత్రి వృత్తమునకు రెండు ర-గణములు, మూడు త-గణములు, ఒక ర-గణము. నాగరి లిపిలో ఇలా ఉండదు. స్తుతి అని వ్రాసినప్పుడు అక్కడ తు-కారమునకు ప్రాధాన్యతన్యం (स्तुति). అనుస్వారము ఒక shorthand పద్ధతి. మంత్ర, రంభ రెండింటిలో అనుస్వారము ఉన్నా, నిజముగా అవి మన్త్ర, రమ్భ. ఇంతవఱకు నేను సుమారు 150కి పైన ఇట్టి సార్థకనామ గణాక్షర వృత్తములను కల్పించినాను. అందులో అరవై వృత్తములను ఇక్కడ మీకు పరిచయము చేస్తున్నాను. ఒక్కొక్క వృత్తములో ఒక ఉదాహరణమును మాత్రమే ఇస్తున్నాను. ఈ వృత్తములకు పేరులు ఛందశ్శాస్త్రములో ఉన్నప్పుడు వాటిని కుండలీకరణములలో తెలిపినాను.

1) హలి (క్షుత్) – [హ/ల/ల/ల] భ/లల UI III
5 సుప్రతిష్ఠ 31

నీలవసన
బాలక పశు-
పాలక పరి-
పాలక హలి

2) రమ (నీలతోయా, మాలినీ, కరేణు) – ర/మ UI UU UU
6 గాయత్రి 3

యోగమాతా వేదీ
రాగరత్నాంభోధీ
వేగ రమ్మోయమ్మా
భోగభాగ్యా లిమ్మా

3) లాలస (సరి) – [ల/ల/ల/స] న/స III IIU
6 గాయత్రి 32

పొగల గదిలో
రగులు మదిలో
మిగులు తలఁపా
వగల వలపా

4) నర (గిరా, మణిరుచి, శఫరికా, నిరసికా, నరమనోరమా) – న/ర III UIU
6 గాయత్రి 24

సరసభారతీ
స్వరలయాకృతీ
సరసభాషిణీ
స్వరసుభూషిణీ

5) తరఁగ (భీమార్జనము} – త/ర/గ UUI UI UU
7 ఉష్ణిక్కు 21

కాయమ్ము నీకె యిత్తున్
శ్రీయంచు నిన్నె దల్తున్
ధ్యేయమ్ము జూపఁగా రా
నా యంతరంగమా రా

6) భర్గ (హోడపదా) – భ/ర/గ UII UI UU
7 ఉష్ణిక్కు 23

భర్గుని చూడ రండీ
దుర్గకు భర్త యండీ
స్వర్గపు ద్వార మండీ
మార్గము చూపు నండీ

7) మలయ (మదలేఖా) – [మ/ల/య] మ/స/గ UUU IIUU
7 ఉష్ణిక్కు 25

చూసేవో మలయాద్రీ
నా సీతన్ బరిపూతన్
హా సీతా పవనమ్ముల్
మోసేనో వ్యధ శ్వాసల్

8) లలిత (అను) – [ల/ల/ల/ల/త] న/య/ల IIII UUI
7 ఉష్ణిక్కు 80

లలితము నీ వాక్కు
లలితము నీ ఋక్కు
లలితము నీ గీతి
లలితము నీ ప్రీతి

9) నగజ (మణిముఖీ) – [న/గ/జ] న/ర/ల III UI UI
7 ఉష్ణిక్కు 88

జగము బ్రోచు తల్లి
సుగుణ కల్పవల్లి
మొగము జూప రావ
నగజ నన్ను గావ

10) భవ్య (కృష్ణగతి) – [భ/వ/య] భ/జ/గగ UIII UI UU
8 అనుష్టుప్పు 47

అంబరము కెంపు లయ్యెన్
సంబరము లింపు లయ్యెన్
రెంబలకుఁ బూలు తోఁచెన్
గంబురపు గాలి వీచెన్

11) రామ – ర/ర/మ UIU UIU UUU
9 బృహతి 19

నామ మంత్రాలె – నా పుష్పమ్ముల్
శ్యామ జీవించ – సందీప్తమ్మై
ప్రేమతో రమ్ము – ప్రేమాధారా
రామ నా జీవ – రాజీవమ్మై

12) నర్మ – న/ర/మ IIIUI UU UU
9 బృహతి 24

పరుస మేల నాపై నీకున్
సరస మొల్కు నర్మాలాపం
బరుస మీయుఁ గాదా నాకున్
గరము లిచ్చి కావన్ రావా

13) రవి (కామినీ, భావినీ, తరంగవతీ) – [ర/వ/వ/వ] ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171

జ్యోతి నీవె భూతలమ్ముపై
భాతి నిచ్చు భాస్కరా రవీ
హేతువీవె సృష్టికిన్ సదా
చేతనమ్ము జీవితమ్ములో

14) భర్త – భ/ర/త UII UI – UU UI
9 బృహతి 279

నెయ్యపు భర్త – నీవే గాదె
ఇయ్యది ప్రేమ – యెప్డున్ నీదె
ఉయ్యెల లూఁగె – నూహల్ నేఁడు
తియ్యగఁ బారె – దేనెల్ జూడు

15) మల్లియ – [మ/ల/ల/ల/ల/య] మ/న/స/గ UU UII – III UU
10 పంక్తి 249

పూచెన్ మల్లియ – పులక లివ్వన్
వీచెన్ గాలులు – విరుల నూపన్
దోఁచెన్ నా హృదిఁ – దొగరు టాశల్
వేచెన్ గన్నులు – విమలుఁ జూడన్

16) భవహర – [భ/వ/హ/ర] భ/య/జ/గ UIII UUI UIU
10 పంక్తి 335

చంద్రధర – చంద్రాగ్నిలోచనా
సాంద్ర హిమ-శైలాగ్ర కేతనా
యింద్ర హరి – బృందారకస్తుతా
మంద్రరవ – మాధుర్య నందితా

17) హరి – [హ/ర/ర/ర] ర/య/య/లగ UI UIU – UIU UIU
11 త్రిష్టుప్పు 587

ఎందుకో హరీ – యిప్పుడే చిత్త మా-
నంద మాయెరా – నాకు నీ యోచనల్
ముందు నిల్వరా – మోహనా తృప్తితో
డెంద మూగురా – డింగు నా దుఃఖముల్

18) హీర (తాల (ళ), శ్యేని. సేనికా, శ్రేణి, నిఃశ్రేణికా) – [హ/హ/హ/హ/ర] ర/జ/ర/లగ
UI UI UI – UI UIU
11 త్రిష్టుప్పు 683

హీర మేల నాకు – హేమ మేల నీ-
హార మేల పుష్ప – హార మేల నా
తార లేల మేళ-తాళ మేల నన్
జేర వేల నాదు – శ్రీలు నీవెగా

19) మాయా (వైశ్వదేవీ, చంద్రకాంతా, చంద్రలేఖా ) – మ/మ/య/య UUUUU – UIU UIUU
12 జగతి 577

ఆనందమ్మై రా – హారిణీ దివ్యదీపా
నేనే నీవై రా – నిత్య పీయూష రూపా
పాణిగ్రాహీ రా – పాహి మాయావిలాసా
ప్రాణమ్మై రావా – వైశ్వదేవీ సుహాసా

దీనినే ఇప్పుడు శాలినీవృత్తముగా వ్రాద్దామా?

శాలిని – మ/త/త/గగ
11 త్రిష్టుప్ 289

ఆనందమ్మై – హారిణీ దివ్యదీపా
నేనే నీవై – నిత్య పీయూష రూపా
పాణిగ్రాహీ – పాహి మాయావిలాసా
ప్రాణమ్మై రా – వైశ్వదేవీ సుహాసా

20) నవరాగ – [న/వ/ర/ర/గ] న/య/య/య IIII UUI – UUI UU
12 జగతి 592

అట నవరాగమ్ము – లాకాశవీధిన్
స్ఫుట నవరాగంపు – సొంపుల్ వినంగా
నటనల జాలించి – నన్ జూడ ర మ్మో
చటుల కురంగాంశ – జాలమ్ము లేలా

21) భార్య (వలభీ) – భ/భ/ర/య UII UII – UIU IUU
12 జగతి 695

భారము గాముర – భర్తలార మీకున్
భారతి పార్వతి – వాణి మాకు దల్లుల్
వారలు గాతురు – ప్రాణ మిచ్చి స్త్రీలన్
వారసు లీ ధర – వారి కెల్ల మేమే

22) విజయ – [వ/వ/వ/జ/య] జ/ర/జ/య IUI UIU – IUI IUU
12 జగతి 854

ప్రభాత మాయెగా – ప్రకాశముతోడన్
నభమ్ము నిండెగా – నవారుణ కాంతిన్
శుభమ్ము కల్గుగా – శుభోదయ వేళన్
ప్రభూ నమస్సులన్ – బ్రమోదము నిత్తున్

23) తావి (ఇంద్రవంశా, వీరాసికా) – [త/త/వ/వ/వ] త/త/జ/ర UUI UU – IIUI UIU
12 జగతి 1381

మాణిక్యవీణన్ – మఱి నేను మీటనా
గానంపు తావిన్ – గడు రక్తి జల్లనా
తానమ్ము లెన్నో – దనరార జూపనా
తానాన తానా – తనతాన తాననా

24) స్వాగత – [స/స/వ/గ/త] స/స/య/త IIU IIUI – UUU UI
12 జగతి 2140

అరుదెంచెను నూత్న-మౌ సౌందర్యమ్ము
వరుస మ్మొక నవ్య – వాతాహ్వానమ్ము
హరుసమ్ముల వేగ – మందించన్ నిండు
తరుణ మ్మిదె స్వాగ-త మ్మివ్వన్ రండు

25) గజాస్య – [గ/జ/జ/స/య] ర/స/న/ర/గ UIU IIUI – IIUI UU
13 అతిజగతి 1499

మోదకమ్ముల నిత్తు – ముదమార నీకున్
బాధకమ్ముల బాపు – ప్రణతోఽస్మి యందున్
నాదబిందు విలాస – నను గావు మయ్యా
ఆదిదేవ గజాస్య – యగజాననాత్మా

26) జలజాత – [జ/ల/జ/జ/త] జ/స/స/య/ల IUII IUII – UIU UI
13 అతిజగతి 4830

హరీ యని దలంచగ – హాయియే కల్గె
తరించఁగ సుఖమ్ములు – దాఁకఁగాఁ దోచె
స్థిరమ్మగు మనమ్మున – దీపమే వెల్గె
సరస్సను హృదిన్ జల-జాతమే పూచె

27) రాగవల్లి – [ర/ర/గ/వ/ల/ల/ల/ల] ర/ర/ర/న/ల UIU UIU – UIU IIII
13 అతిజగతి 7827

గంగగా పొంగెరా – గాన మీ మనమున
రంగుతో నిండెరా – రాగ మీ మనమున
చెంగునన్ నాట్యముల్ – జేసె నీ హృదయము
శృంగమున్ జేరెరా – తృప్తితో హృదయము

28) గజానన – [గ/జ/జ/న/న] ర/స/న/న/ల UIU IIUI – III III
13 అతిజగతి 8155

ఓ గజానన దేవ – యుమకు సుతుఁడ
వేగ మాపుమ విఘ్న – విషమములను
రాగతాళలయంపు – రవళి యలర
స్వాగతమ్మిడి లోక-వరునిఁ గొలుతు

29) గగనతార – [గ/గ/న/త/త/ర] త/స/ర/ర/లగ UUI IIU UI – UUI UIU
14 శక్వరి 5277

రావా గగనతారా వి-రాట్చిత్ర కాంతితోఁ
దేవా నవనవమ్మై సు-దీప్తుల్ ప్రశాంతితో
నీ వర్ణమయమౌ రాత్రి – యెంతెంత హాయియో
నీ విశ్వములలో నెప్డు – నిద్రించు మాయయో

30) నగవు – [న/గ/వ/వ/వ/వ/వ] న/ర/జ/ర/లగ III UI UI – UI UI UI U
14 శక్వరి 5464

నగవుతోడ వేగ – నన్ను జూడ రమ్ము, నీ
నగవు తప్ప కిచ్చు – నాకు నూత్న శక్తి, నా
సగము నీవు గాదె – సంబరమ్ములందు, రా
మొగము జూప వేల – మోము పూయు పద్మమై

31) రాసలీల – [ర/ర/స/ల/ల/ల/ల/ల] ర/ర/స/న/లల UIU UIU – IIUI IIII
14 శక్వరి 16083

భాసురమ్మౌ వనిన్ – బహురూపు బ్రియమగు
రాసలీలల్ గనన్ – రహి నిండ నయమగు
వేసముల్ దాల్చి గో-పిక లెల్ల రయముగ
నాసతో వెళ్ళి రా – హరి జెంతఁ బ్రియముగ

32) లీలామయా (మాలినీ, నాందీముఖీ )- [ల/ల/ల/ల/ల/ల/మ/య/య] న/న/మ/య/య III III UU – UI UUI UU
15 అతిశక్వరి 4672

మురిపెములకు ఱేఁడా – మోము జూపంగ లేఁడా
మఱల వరము లీఁడా – మాలినిం గాన రాఁడా
హరుస మొసగు మెండై – హారి లీలామయుండై
మురళి రవము దెచ్చున్ – మోహమున్ ముంచవచ్చున్

33) స్వరాలయ – [స/వ/ర/ర/ల/య] స/య/య/జ/య IIUI UUI UUI – UII UU
15 అతిశక్వరి 6732

రవముల్ గలింగెన్ బదమ్ముల్ స్వ-రాలయ కిత్తున్
భవముల్ వెలింగెన్ హృదబ్జమ్ముఁ – బావని కిత్తున్
నవతల్ జెలంగెన్ ముదమ్ముల్ మ-నమ్మున నిండెన్
శివమై మెలంగెన్ దలంపుల్ ర-చింతును గైతల్

34) నారి – న/న/ర/ర/ర IIIIII UIU – UIU UIU
15 అతిశక్వరి 9408

సరసముగను మెల్లఁగా – జల్లఁగాఁ దాఁకఁగా
మఱచితి నను నారి నీ – మత్తులో మాయలో
మఱల సరస రానిచో – మాడెదన్ వాడెదన్
మఱల దరికి వత్తువా – మత్తివై ముత్తివై

35) నవ్వు – [న/వ/వ/వ/వ/వ/వ] న/జ/ర/జ/ర IIII UI UI – UI UI UIU
15 అతిశక్వరి 10928

విరిసెను నవ్వు నేఁడు – వేయి రేకు పువ్వుగా
మురిసెను నవ్వు నేఁడు – మ్రోగు వీణ తీఁగగా
కురిసెను నవ్వు నేఁడు – కొండనుండి ధారగా
మెఱిసెను నవ్వు నేఁడు – మించులోని కాంతిగా

36) రజని – ర/జ/న/న/న UI UI UI – III III III
15 అతిశక్వరి 32747

మానసమ్మునందు – మమత లొలుకు సుజని
పాన పాత్ర నింపు – ప్రణయ ఘడియ రజని
మౌన మేల నింక – మనసు మనసు పలుక
తేనెవోలె పాడు – తియగ స్వరము లొలుక

37) జనని – జ/న/న/న/న IUI IIII – IIII IIII
15 అతిశక్వరి 32766

రమించ కవిత స-రసముల రసముల
భ్రమించ మనికి వి-భవమున భవమున
నమింతు జనని వి-నయముగ నయముగ
క్షమించి యొసఁగు ప్ర-కరములఁ గరముల

38) భార్గవి – [భ/భ/ర/గ/వ/వ/వ] భ/భ/ర/ర/జ/గ UII UII – UIU UIU IUIU
16 అష్టి 21687

చూపుమ నీ దయ – సుందరీ భార్గవీ సుభాషిణీ
యాపద లాపుమ – యంబికా శాంభవీ యభేదినీ
దీపము నుంచెద – దేవి ముందెప్పుడున్ దివంచరీ
శ్రీపద సేవన – జేతు నే నిప్పుడున్ శివంకరీ

39) హరవిలాస – [హ/ర/వ/వ/వ/ల/ల/స] ర/జ/ర/జ/న/గ UI UI UI UI – UI UI IIIU
16 అష్టి 31403

ఇమ్ము లిచ్చు వాఁడు వాఁడ-హీంద్రుఁ దాల్చి హరవిలా-
సమ్ముఁ జూపు వాఁడు వాఁడు – శారదేందు కళను శీ-
ర్షమ్ము నుంచు వాఁడు వాఁడు – శాశ్వతుండు ముగితి మా-
ర్గమ్ము దెల్పు వాఁడు వానిఁ – గాలు గొల్తు నెపుడు నేన్

40) నీరవ – [న/న/న/న/ర/వ] న/న/న/న/ర/లగ IIIII IIIII – IIUI UIU
17 అత్యష్టి 45056

శిల యగును హృది యిచట – చెలికాఁడు లేనిచో
నలలు బలు సడుల వడి – నరుదెంచి ముంచు నన్
నిలయ మయి కలఁతలకు – నివసింతు, నీ రవ
మ్ములు బిలువ నెద మురిసి – బులకింతు నో ప్రియా

41) సుమ – స/స/స/స/స/మ IIU IIU – IIU IIU – IIU UUU
18 ధృతి 14044

సుమరాశులతో – శుకరావముతో – సొగ సాయెన్ జూడన్
రమణీయముగా – రహి యామని స-ద్రసవంతమ్మయ్యెన్
సుమమాలల గ్రు-చ్చుచు నుండెద నో – సురసా నీకై నేన్
రమణన్ లలితో – రచియించఁగ రా – రసికా పద్యమ్ముల్

42) సత్యభామ – స/త/య/భ/భ/మ , ప్రాసయతి IIU UU – IIU UU – IIU IIU UU
18 ధృతి 27748

దివిలో నీవే – భువిలో నీవే – రవియున్ శశియున్ నీవే
యువతన్ నీవే – నవతన్ నీవే – కవితన్ గతులున్ నీవే
శివమై రావా – ఛవియై రావా – భవసుందరమై రావా
జవమై రావా – ధ్రువమై రావా – కవగా నిలువన్ రావా

43) నారీ (నారాచ, లాలసా, సాలసా, మహామాలికా) – న/న/ర/ర/ర/ర
IIII IIUI UUI – UUI UUIU
18 ధృతి 74944

మధురము మధురమ్ము నీ జూపు – మంత్రమ్ములో ముగ్ధ నేన్
మధురము మధురమ్ము నీ రూపు – మాయావినోదమ్ముగా
మధురము మధురమ్ము నీ పల్కు – మంద్రస్వరోత్ప్రేక్షగా
మధురము మధురమ్ము నా మన్కి – మన్నీఁడు నీవేగదా

44) సిరి – స/స/స/ర/ర/ర IIU IIU IIU – UIU UIU UIU
18 ధృతి 74972

పిలుపున్ వినఁగా నెదలోఁ – బ్రేమ యుప్పొంగు నా కెంతయో
తలువన్ నిను నా మదిలోఁ – దాళముల్ బల్కె నీ గుండెయున్
జెలి నా సిరి నీవె గదా – చింతలన్ దీర్చ నా చెంత రా
వల పొక్క మహా వరమా – పాపమా తాపమా శాపమా

45) స్త్రీ – స/స/స/స/త/ర IIU IIU IIU IIU – UUI UIU
18 ధృతి 83676

తరివో, సిరివో, దరివో, మురివో, – ధర్మమ్మొ, దాసివో
పరువో, మురువో, బరువో, తరువో, – వాగ్దేవి వాణివో
వెరవో, పెరవో, వెఱపో, చెఱపో, – ప్రేమామృతాబ్ధివో
చిరమో, క్షరమో, స్థిరమో, పరమో, – స్త్రీదేవి నీవిలన్

46) సితార – స/స/స/త/త/ర IIU IIU IIU – UUI UUI UIU
18 ధృతి 84188

మన సొక్క సితార గదా – మంద్రస్వరమ్ముల్ జనించుఁగా
నిను జూడఁగ నన్ను సదా – నెయ్యంపు భావాలు ముంచుఁగా
కన రమ్ము ననున్ లలితోఁ – గాలాల పాటిందు తోడుగా
ప్రణయాలకు కల్పలతా – ప్రాణాల కుండిందు నీడగా

47) రాత్రి – ర/ర/త/త/త/ర UIU UIU UUI – UUI UUI UIU
18 ధృతి 84243

రాత్రి వేళాయెరా కన్నయ్య – రావేల వేవేగ యింటికిన్
చిత్రమౌ వెన్నెలన్ జూపించు – చిద్రూపమున్ నాదు కంటికిన్
గాత్రమున్ లేచుగా నిన్ జూడ – గానంపు గంధర్వ రాగముల్
ధాత్రిపై నీకు జూపింతు – ధారాళమై స్వర్గభోగముల్

48) రాజరాజ – ర/ర/జ/ర/ర/జ UIU UI UI UI – UIU UI UI UI
18 ధృతి 173395

వానలోఁ జారు నీటి దార – వానలోఁ జిందు నీటి జల్లు
వానలో మట్టి రంగు కాల్వ – వానలోఁ గాగితంపు నావ
వానలో నీవు నేను జేరి – పాడఁగా సాధృతమ్ము క్రింద
వానలో నింగి భూమితోడ – స్వచ్ఛమౌ ప్రేమవాక్కు బల్కు
(సాధృతము = గొడుగు)

49) సుగమ – [స/స/స/స/స/గ/మ] స/స/స/స/స/మ/గ IIU IIU IIU IIU – IIUU UUU
19 అతిధృతి 14044

ఒడిలో మొలకెత్తిన క్రొన్ననలా? – ఉష వెల్గా? దీపమ్మా?
కడలిన్ గల రత్నములా? మణులా? – కమలమ్మా? గంధమ్మా?
సడిలో స్వరమా? నుడిలో నునుపా? – శశిశోభాకారమ్మా?
బడబానలమా? గుడిలో శిలయా? – వనితా యెందున్నావో?

50) రాగమయి – [ర/ర/గ/మ/య/య/య] ర/ర/మ/ర/ర/ర/గ
UI UUI UU – UU UIU – UI UUI UU
19 అతిధృతి 74771

రమ్ము రాజీవనేత్రా – రా జీవప్రియా – రమ్ము పీయూష పాత్రా
రమ్ము నా ప్రేమదీపా – రా గానప్రియా – రమ్ము మాహేంద్ర చాపా
రమ్ము సద్రాగగీతా – రా నృత్యప్రియా – రమ్ము ప్రేమాంబుపూతా
రమ్ము నా భవ్య తారా – రా దేవప్రియా – రమ్ము సమ్మోద ధారా

51) మానసరాగ – మ/మ/న/స/ర/ర/గ UU UUUU – IIIIIU – UIU UIUU
19 అతిధృతి 75713

రావా రాగోద్దీపా – రసరుచులతో – రంగులన్ నిండనిమ్మా
దేవీ తీఁగన్ బూలన్ – దినము వనిలో – తృప్తిగా గాంచుదామా
భావిన్ భాగమ్మై నా – బ్రదుకు సగమై – భవ్యమై నుంద మెప్డున్
మోవిన్ మ్రోఁగన్ ముద్దుల్ – ముదము లలరన్ – ముగ్ధులై జేరుదామా

ఇందులోని మందాక్రాంతము –

రాగోద్దీపా – రసరుచులతో – రంగులన్ నిండనిమ్మా
తీఁగన్ బూలన్ – దినము వనిలో – తృప్తిగా గాంచుదామా
భాగమ్మై నా – బ్రదుకు సగమై – భవ్యమై నుంద మెప్డున్
మ్రోఁగన్ ముద్దుల్ – ముదము లలరన్ – ముగ్ధులై జేరుదామా

52) నీహార – [న/న/న/న/హ/హ/ర] న/న/న/న/ర/జ/గ III III III III – UI UI UIU
19 అతిధృతి 176128

కలల కడలి, యలల కడలి – కాన నెందు నీలమే
కలలు చెదరె, యలలు కదిలె – కాన నశ్రుధారలే
చెలిమి వఱలఁ బ్రియుల నెపుడు – చేరలేని చేఁప లా
వలపు వలలఁ బడుచు కదిలె – పాప మేమి శాపమో
(జాతి పద్యమైన ఉత్సాహపు ఒక ప్రత్యేకత)

53) త్యాగరాజ – [త/త/య/గ/ర/ర/జ] త/త/య/త/త/ర/ల UUI UUII UU – UUI UUI UI UI
19 అతిధృతి 346213

బంగారు సీతమ్మను వేడున్ – బ్రాణాల బాదమ్ము నుంచి పాడు
పొంగారు భక్తిన్ బులకించున్ – బూజించి శ్రీరాము నెప్పు డెంచు
సంగీత సామ్రాజ్యపు ఱేఁడై – సంతోష ముప్పొంగ వ్రాయు గీతి
రంగేశు శ్రీరాముని గొల్చున్ – రాగాల రారాజు త్యాగరాజు

54) భారతవజ్ర – [భ/భ/ర/త/వ/జ/ర] భ/భ/ర/త/జ/ర/లగ UII UII – UIU UUI – IUI UIUIU
20 కృతి 350391

భారతదేశము – భవ్య సక్షేత్రమ్ము – ప్రమోదకారియే సదా
భారతదేశము – స్వర్ణ భూలోకమ్ము – ప్రజా సమూహమే గదా
భారత వజ్రము – వన్నెలన్ శోభించు – భవిష్యగీతి మ్రోయఁగా
హారతు లెత్తుద – మమ్మకున్ రండోయి – యనంత యాత్ర జేయఁగా

55) సరస్వతి – [స/ర/స/వ/త/త/త] స/ర/స/య/ర/ర/గల IIU UIU IIUI – UU UIU UIU UI
20 కృతి 598740

చదువుల్ నేర్పి నన్ మురిపించు – స్వారస్యమ్ముగా భారతీ నేఁడు
ముదమై నాల్కపై నటియించు – మూల మ్మీ భువిన్ నీవె యే నాఁడు
హృదయ మ్మో సరస్వతి యుంతు – హృద్యమ్మైన పాదమ్ములన్ దల్లి
సదయా శారదా నమియింతు – సర్వాతీత విద్వత్సుధావల్లి

56) సరయు – స/ర/య/య/య/య/య IIU UIUI UUIU – UIU UIU UIUU
21 ప్రకృతి 299604

సరయూ తీరమందు సానందమై – సార్వభౌమాత్మజుం డుద్భవించెన్
జిఱుతప్రాయమందు జంద్రున్ గనెన్ – జిన్న యద్దమ్ములో జెల్వుఁడౌ యా
తరుణాంగున్ గనంగ నుప్పొంగె నా – తల్లికిన్ దండ్రికిన్ డెందముల్ సం-
బరముల్ గల్గె నా నయోధ్యాపురిన్ – బారమే లేని సంద్రమ్ము వోలెన్

57) గగనవిహారి – [గ/గ/న/వ/వ/వ/హ/హ/ర/ర/ర] త/న/ర/య/జ/ర/ర/ర
UUI III UI – UIU UI UI – UIU UIU UIU
24 సంకృతి 4805309

నీవో గగనవిహారి, – నేను జీవింతు నిందు – నేలపై, బందిగా నుందుగా
రావా, యుగముల హారి, – రమ్ము, నేఁజూచుచుంటి – రాత్రి యానందమున్ బొందఁగా
భావాల సరసిలోనఁ – బద్మపత్రాలు నిండెఁ, – బాట లెన్నెన్నొ పుట్టేను రా
నా విశ్వపరిధి కెప్డు – నైజ కేంద్రము నీవె, – నర్మ నాట్యమ్ము సల్పంగ రా

58) సామజవరగమన – [స/స/మ/జ/వ/ర/గ/మ/న] స/స/మ/జ/య/య/మ/న
IIUII UUU – UIUII UUI – UUU UU III
24 సంకృతి 14719516

వరగామిని నీవేనా – పాదమందు వయారాల – వచ్చేవా సొంపై నడచి
స్వరభారతి నీవేనా – పాటలందు విలాసాల – వంచేవా యింపుల్ మడచి
సురసుందరి నీవేనా – చుక్కలందు రవల్ దెచ్చి – చొక్కేవా దేవీ మురిసి
స్మరమోహిని నీవేనా – శయ్యయందు ప్రమోదాల – జల్లేవా పూలన్ గురిసి

59) సునయన – స/స/స/స/స/న/య/న IIU IIU – IIU IIU – IIU IIII – UU III
24 సంకృతి 15185628

కనుమా నగమున్ – గనుమా తరువున్ – గనుమా సునయన – గామిన్ ద్వరగ
కనుమా సుమమున్ – గనుమా తరణిన్ – గనుమా గగనపు – కాంతిన్ నెఱగ
వినుమా శుకమున్ – వినుమా పికమున్ – వినుమా పవనపు – వీచిన్ మురియ
వినుమా రవమున్ – వినుమా స్వరమున్ – వినుమా సుమధుర – వృష్టిన్ దరియ

60) హృత్స్వర – [హ/హ/హ/హ/హ/హ/హ/త/స/వ/ర] ర/జ/ర/జ/ర/భ/జ/త/గ
UI UI UI UI UI UI – UIU UIII UIU UIU
25 అభికృతి 9906859

చందమామ నింగిలోన సోయగాలఁ – జల్లెగా నీ రజని జల్లఁగా మెల్లఁగా
మందమైన మారుతమ్ము తావి మోసె – మత్తుగా నీ గడియ మెత్తఁగా క్రొత్తఁగా
నందమైన నీరవమ్ము నన్ను నింపె – నాశగా హృత్స్వరపు రాశిగా వాసిగా
బంధ మిందు త్రుంచలేము మన్కిలోన – భామినీ హృత్సరస గామినీ కామినీ

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...