తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్‌వ్యూ

(1980, 90 దశకాలలో తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన తెలుగు పరిశోధన పత్రిక నుంచి ఈ చర్చ పరిష్కరించి ముద్రిస్తున్నాం. 12-7-1988న తెలుగు పరిశోధన గురించి వెల్చేరు నారాయణరావుతో జరిపిన గోష్ఠిలో – ప్రొఫెసర్ రామకృష్ణ (హైదరాబాద్ విశ్వవిద్యాలయం, చరిత్ర విభాగం), వాసిలి వసంతకుమార్, డా. ననుమాస స్వామి పాల్గొన్నారు.)


చేరా:

భాషాశాస్త్ర పరిశోధనకీ సాహిత్య పరిశోధనకీ ఏమైనా భేదాలున్నాయా? రెంటినీ ఒకే ప్రమాణంతో చూపించటానికి వీలుందా?

నారా:

మొన్నటివరకు తెలుగులో సాహిత్యానికీ భాషాశాస్త్రానికీ ఎక్కువ సామీప్యం ఉందని గ్రహించలేదు మనం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొట్టమొదట లింగ్విస్టిక్సు పాఠం చెప్పడం మొదలు పెట్టిన రోజుల్లో – అంటే, గంటి జోగిసోమయాజులుగారు లింగ్విస్టిక్సూ పింగళి లక్ష్మీకాంతంగారు సాహిత్య విమర్శా చెప్తున్న రోజుల్లో – ఒక విభాగానికీ ఇంకో విభాగానికీ చుక్కెదురు ఉందనే అభిప్రాయం కూడా ఒకటుండేది. మీరు భాషాశాస్త్ర విద్యార్థి అయినట్లయితే సాహిత్యశాస్త్ర విద్యార్థి కావడానికి వీల్లేదు. సాహిత్యశాస్త్ర విద్యార్థి అయితే భాషాశాస్త్ర విద్యార్థి కావడానికి వీల్లేదు. ఈ తేడా సోమయాజులుగారూ లక్ష్మీకాంతంగారూ ఆంధ్రా యూనివర్సిటీలో అకస్మాత్తుగా తెచ్చి పెట్టింది కాదు. అంతకు ముందు సాంప్రదాయిక విద్యలో భాగాలకు పొడిగింపే తేడాలు. వాటి కొనసాగింపే తెలుగుదేశంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పడ్డ తెలుగు డిపార్టుమెంటు యొక్క రూపం. పూర్వం సంస్కృత పాఠశాలల్లో వ్యాకరణ శాస్త్రం చదువుకునేవాణ్ణి వ్యాకరణ విద్యార్థి అనేవారు. అలంకారశాస్త్రం చదువుకునేవాణ్ణి అలంకార విద్యార్థి అనేవారు. ఆ అలంకార విద్యార్థి అనేమాట వెనకాతల ఒక వ్యంగ్యం ఉంది. అంటే అలంకార ప్రాయంగా ఉండే విద్యార్థి అని. బుద్ధిమంతులూ కుశలమైనటువంటి ఆలోచన కలవాళ్ళూ వ్యాకరణం చదువుకుంటారనీ, ఊరికే పద్యాల్లో అందాలు చెప్పి సరదాగా జీవితాన్ని గడపాలనుకునేవాళ్ళు, అంత గాఢమైనటువంటి పరిశీలనాశక్తి లేనివాళ్ళు సాహిత్యశాస్త్రం చదువుకుంటారని ఒక అభిప్రాయం ఆ రోజుల్లోనే ఉండేది.

దానికి సరిగ్గా తల్లకిందులు అభిప్రాయం లక్ష్మీకాంతంగారు సాహిత్యశాస్త్ర విమర్శ, సోమయాజులుగారు భాషాశాస్త్రమూ చెబుతున్న రోజుల్లో ఏర్పడింది. అవడం తల్లకిందులే ఆయినా రెండింటి మధ్య సంబంధం లేదన్న భావం మాత్రం అంతకన్న పూర్వానిదే. ఇంకొంచెం పూర్వానికి వెళ్ళి చూస్తే భారతదేశంలో చెప్పుకోదగ్గ ప్రధానమైన అలంకారశాస్త్ర సిద్ధాంతం ఏదీ కూడా వ్యాకరణంతో సంబంధం లేకుండా వచ్చింది కాదు. సంస్కృత వ్యాకరణ మర్యాదలూ, సంస్కృత వ్యాకరణ నియమాలూ, సంస్కృత వ్యాకరణ సిద్ధాంతాలూ సాహిత్యశాస్త్రానికి ఒక రకమైన పదునునీ ఒక నిక్కచ్చితనాన్నీ తెచ్చిపెట్టాయి. ఈ పదునూ నిక్కచ్చితనం పోయి సంస్కృత అలంకారశాస్త్రమంటే రససిద్ధాంతం గజిబిజిగా మాట్లాడట మనేటటువంటి ఒక తేలిక రకమైన అభిప్రాయం మనకి లక్ష్మీకాంతంగారి రోజుల్లోనే మొదలైందని నా అనుమానం. అంటే అలంకారాల సంఖ్య, అలంకారాలు నిర్ణయించగలగడం, వక్రోక్తి గురించి మాట్లాడగలగడం, వక్రోక్తి ఎన్ని రకాలుగా ఉందో చెప్పగలగడం, ధ్వనిని గురించి చెప్పగలగడం, ధ్వనిని శాస్త్రీయంగా స్థాపించగలగడం, ధ్వనిని వివరంగా అన్వయించగలగడం, ఈ క్లిష్టమైన అలంకారశాస్త్ర భాగాలు చదవడం మానేసేసి, నాలుగైదు సరదా మాటల్లో, ఏదో నాలుగో ఐదో శ్లోకాలు ఉదాహరణకు తీసుకొచ్చి రసాన్ని గురించి ఓ మోస్తరైన ఆస్పష్టతతో మాట్లాడ్డం లక్ష్మీకాంతంగారి రోజుల్లో ఆరంభమైంది మనకి.

అయితే ఇందుకు కారణం లక్ష్మీకాంతంగారు కాదు. ఆయన మీద అభాండం వెయ్యడం నా ఉద్దేశం కాదు. ఈ పరిస్థితి ఆ కాలంలో ఏర్పడిందంటున్నానంతే. అలంకారశాస్త్రంలో ఉండే గ్రంథాలు పఠనపాఠనంలోంచి పోవడం అందుకు కారణం. ఆ తరవాత పశ్చిమ దేశాల నుంచి కొన్ని సాహిత్యశాస్త్ర మర్యాదలు మనకు వచ్చాయి. ఇవి శాస్త్రీయంగా పశ్చిమ దేశాల్లోని సాహిత్య సిద్ధాంతాలు నేర్చుకోడం మూలంగా వచ్చినవి కావు. అక్కడో వ్యాసం ఇక్కడో పుస్తకం చదవడం మూలంగా వచ్చినవి. వీటిని ఇట్లా చదవటం మొదలు పెట్టినవాళ్ళు చేసిన మంచి పని ఒకటుంది. అదేమిటంటే కొత్త అభిప్రాయాలు తెచ్చిపెట్టారు. కాని వీళ్ళు చేసిన పనిలో లోపం ఏమిటంటే ప్రాచీన అలంకారశాస్త్రం శ్రద్ధగా చదువుకోవడం మానెయ్యటం. మానేసిన తరవాత ఏమైందీ మీకు తెలిసే వుంటుంది. హడ్సన్ (Hudson) అనే ఒకాయన Introduction to the Study of Literature అనే ఓ పుస్తకం రాశాడు. పశ్చిమదేశాల్లో అది గొప్ప పుస్తకం అంటే ఎవరైనా నవ్వుతారు. ఏదో ఒక హైస్కూల్ టెక్స్ట్‌బుక్ లాంటి పుస్తకమది. ఆ హైస్కూలు టెక్స్ట్‌బుక్కు ఇక్కడ మనకి ప్రామాణిక గ్రంథమైంది.

అది ఎలాంటి ప్రమాణ గ్రంథమైందీ అంటే, కావ్య ప్రకాశిక మన అలంకార శాస్త్రానికి ఎంత ప్రామాణిక గ్రంథమో అలాంటి ప్రమాణ గ్రంథమై కూచుంది. అందులోంచి ఉదాహరణలు మాట్లాట్టం, అది తప్ప ఇంకే పుస్తకం చదవక పోవటం, మహా అయితే ఆరిస్టాటిల్ Poetics చదవటం, అది కూడా బుచర్ (S.H. Butcher) అనువాదమో మరొకటో కాస్త చదవటం, ఈ రెండు పుస్తకాల ఆధారంగా పశ్చిమ దేశాల సాహిత్య శాస్త్రాన్నంతట్నీ కూడా పాఠం చెప్పడం ఆనేది మనకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమల్లోకి వచ్చింది. లక్ష్మీకాంతంగారి మీద నాకు విపరీతమైన గౌరవం ఉంది, ఆయన మహా ప్రతిభావంతుడు. కాని ఆయన ఇంత ప్రతిభ తోటీ ఈ రెండు పుస్తకాలకీ ప్రామాణ్యం తెచ్చి పెట్టాడు. దానివల్ల ఏమయ్యిందీ అంటే సాహిత్యశాస్త్రానికీ భాషాశాస్త్రానికీ మధ్యన వైరుధ్యం ఏర్పడింది.

(గోపి: So called వైరుధ్యం…)

ఈ వైరుధ్యానికి కారణం ఏమిటంటే భాషాశాస్త్రానికి నిష్కర్ష కావాలి. దానికి శాస్త్రీయమైనటువంటి ఒక పదును కావాలి. ఔనో కాదో తేల్చి చెప్పటానికి కావలసినటువంటి వివేచన కావాలి. పద్యంలో అందాన్ని గురించి చెప్పటానికి అందానికి గురించిన ఊహలు ఉంటే చాలు. అంటే పద్యాన్ని అనుభవించే శక్తికి, పద్యాన్ని విమర్శించే శక్తికీ అభేదం చెప్పేరన్నమాట. అంటే ‘మంచి పద్యాన్ని అనుభవించ గలిగినట్టి సాహిత్యాభిమాని మంచి విమర్శకుడు కూడా అవుతాడు’ అనే అభిప్రాయం మనకి దాదాపుగా ఏర్పడిపోయింది. మీరు ప్రత్యేకంగా శాస్త్రాలు చదవక్కర్లేదు దీనికోసం. మరి వ్యాకరణ శాస్త్రానికొస్తే అలా కాదు. శాస్త్రం చదవాలి. శాస్త్రం చదవకుండా ఏమీ చెప్పటానికి వీల్లేదు. ఈ వైరుధ్యం తెలుగులో సాహిత్య విమర్శని తప్పుదారి పట్టించింది. సాహిత్య విమర్శ కుండవలసినటువంటి ప్రామాణికతనీ, శాస్త్రబద్ధతనీ బలహీనపరిచింది.

చేరా:

ఇక్కడొక సందేహం. ఇంతకు ముందు తెలుగులో ప్రాచీన సాహిత్యశాస్త్రం గురుముఖతః గానీ, విడిగా గానీ చదవటం అలవాటు తప్పిపోయిన తరువాత జరిగిన పరిస్థితిని వివరించారు, బాగానే వుంది. అయితే అంతకు పూర్వం పరిస్థితి చాలా హాయిగా ఉండేదా? సాహిత్య శాస్త్రంలో చాలా ప్రామాణికమైన పరిశోధన జరిగేదా?

నారా:

మీ రెండు పశ్నల్లో రెండు మాటలు: హాయిగా, పరిశోధన, వదిలేస్తాను. అంతకు ముందు సాహిత్యశాస్త్రంలో ఎవరు పాండిత్యాన్ని సంపాదించినా, దాన్ని గురించి ఏమి రాసినా (పరిశోధన అనే దాన్ని గురించి తరువాత మాట్లాడుకుందాం.) వారు ఆనాటి సాహిత్య ప్రమాణాలు క్షుణ్ణంగా నేర్చుకున్నవాళ్ళు, ఆ విషయాల్ని స్పష్టంగాను, నిష్కర్షగాను, శాస్త్ర ప్రమాణంతోను రాసినవాళ్ళు. ఉదాహరణకి వేదం వేంకటరాయశాస్త్రిగారిని తీసుకుందాం. ఆయన ఆముక్తమాల్యదకి వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం రాసిన మర్యాదలు చూడండి. అప్పటికున్నటువంటి సాంప్రదాయిక సాహిత్య శాస్త్ర విమర్శ పద్ధతులన్నీ కూడా జాగ్రత్తగా ఆయన అమలుపరిచారు. ఒక పద్యంలో అలంకారం ఏమిటి? దీనిలో వ్యాకరణ విశేషం ఏమిటి? దీనిలో ఉండేటటువంటి మిగతా విశేషాలేమిటి? ఇవి చెప్పేటప్పుడు మల్లినాథసూరి లాంటి వాళ్ళు అంతకు ముందు ఏరకమైన పద్ధతిని అనుసరించారో ఆ పద్ధతుల్ని అనుసరించారు వేదంవారు. మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఏర్పడే నాటికి ఏమయ్యింది? ఆ రకమైన రచన చేయడానికి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఆ శాఖలో లేకపోయారు. బయట ఒకవేళ వున్నా, వాళ్ళకి విశ్వవిద్యాలయాలలో ఉద్యోగాలు రాలేదు. అయితే సాంప్రదాయిక పండితులకి అప్పటికి లేనిది ఏమిటీ అంటే – పరిశోధనబుద్ధి. పరిశోధకుడికి పూర్వగ్రంథాలమీద ప్రామాణిక బుద్ధి ఉండదు, పూర్వగ్రంథాలను ప్రశ్నించే బుద్ధి ఉంటుంది. మన సంప్రదాయ సాహిత్యశాస్త్రం ఎట్లాంటిదంటే పూర్వగ్రంథాల మీద ప్రామాణికతను పెంపొందించేది.

అప్పకవీయం చదివిన విద్యార్థి అప్పకవీయంలో ఉన్న విషయాన్ని వీలున్నంత వరకు అంగీకరించడానికి ప్రయత్నిస్తాడు. కావ్య ప్రకాశికలో ఉన్న విషయాన్ని బోధపరచుకొని, కావ్యప్రణాళిక నాకు బాగా వొచ్చునని చెప్పుకోవడం పాండిత్యానికి లక్షణం గాని, కావ్య ప్రకాశికను కాదనడం సాంప్రదాయిక విద్యార్థి లక్షణం కాదు. ఒకవేళ ఎప్పుడైనా పెద్దపండితులైన వాళ్ళు ఖండన గ్రంథం రాస్తే దాన్ని మళ్ళీ పరిశీలించి బోధపర్చుకోడం వరకే విద్యార్థి పని. చాలా పెద్ద పండితులైనవాళ్ళకి మాత్రమే శాస్త్రగ్రంథాలుగా పేరు పడిన వాటిని కాదనగలిగే శక్తి ఉండేది. మిగతా వాళ్ళందరూ కూడ బోధపర్చుకోవడం, తిరిగి అన్వయించడం, చెప్పడం మాత్రమే జరిగేది. ఇప్పుడది కాదుగా. పరిశోధన విషయంలో మనం ఏం నేర్పుతామంటే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినవాడికి ప్రశ్నించే అలవాటు నేర్పుతాం, ‘అది ఎందుకు కాదు, అది ఇంకోరకంగా ఎందుకు చెయ్యకూడదు?’ అన్న ప్రశ్న నేర్పుతాం. పాండిత్య సంప్రదాయానికీ ఆధునిక వైజ్ఞానిక సంప్రదాయానికీ ఉండే ప్రధానమైన తేడా ఇది. ఆ తేడా మీరంగీకరిస్తే…

(గోపి: ప్రశ్నించడం నేర్పడం ఎందుకంటారు?
నా. రా: తరవాత చెప్తాను.)

ఈ తేడా మీరంగీకరిస్తే అప్పటికి తెలుగు దేశంలో పండితులుగా ఉన్నవాళ్ళు చేస్తున్న సాహిత్యవిమర్శ అప్పటి సంప్రదాయాల్లో క్షుణ్ణంగా ఉండేది అని నేను నమ్ముతున్నాను. అయితే దాని ప్రయోజనాలు విశ్వవిద్యాలయాలు పొందలేదు. ఎంచేత పొందలేదంటే డిగ్రీలు లేకపోతే ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనే పద్ధతి ఉంది కాబట్టి. దాదాపుగా బాగా చదువుకున్న వాళ్ళందరినీ యూనివర్సిటీల బయటనే అట్టేపెట్టారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు యూనివర్సిటీల్లో ఎప్పుడూ ఉద్యోగం చెయ్యలేదు, వేదం వేంకటరాయశాస్త్రిగారు యూనివర్సిటీల్లో ఎప్పుడూ ఉద్యోగం చెయ్యలేదు. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు కూడా అంతే. వాళ్ళ పాండిత్య ప్రయోజనం మనం పొందలేకపోయాం. వెంపరాలవారు మనుచరిత్రకు రాసిన వ్యాఖ్యానం చూడండి. అలాంటి వ్యాఖ్యానం ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఎక్కడన్నా తయారవుతుందేమో చెప్పండి. ఒక పాండిత్య సంప్రదాయం మీద మార్పు కోరేటటువంటి వాళ్ళకు చిన్నచూపు ఉండటం సహజమే. కాని విశ్వవిద్యాలయాలు పాతదాని మంచినీ కొత్తదాని మంచినీ కూడా కలుపుకోవాలి. ఆ కలుపుకునే పనిని మన విశ్వవిద్యాలయాలు చెయ్యలేకపోయాయి.

చేరా:

చారిత్రక స్థితిని వదిలేస్తే ఇపుడు మన దేశంలోగానీ ఇతర దేశాల్లోగానీ, అసలు సిద్ధాంతపరంగా భాషా పరిశోధనకీ సాహిత్య పరిశోధనకీ భేదాలు ఉండాలా?

నారా:

ఉండక్కర్లేదు. ఉండక్కర్లేదు సరికదా రెండింటి లక్ష్యం కూడా ఒక్కటే. జనం భాషను వాడుకుంటారు. భాషలోని సాహిత్యాన్నీ వాడుకుంటారు. సాహిత్యం second order system, అంతే కదా! భాషేమో first order system. అంచేత రెండింటికీ కూడా కొన్ని సమానమైన ధర్మాలున్నాయి. సాహిత్యాన్ని గూర్చి మాట్లాడేవాళ్ళు భాషను గూర్చి మాట్లాడే వాళ్ళకున్నటువంటి వారి అభిప్రాయాల్లో చాలావాటిని వాడుకొనే వీలుంది. అంచేత నిజంగా ఇప్పుడు మంచి సాహిత్యంలో కృషి చేసేవారికి భాషా శాస్త్రంలో మంచి ప్రవేశం ఉండాలి. అలా లేకుండా చేసే విమర్శ కేవలం వ్యక్తిగత అభిరుచికి చెందిందవుతుంది. అదే impressionistic criticism. నీవు పద్యం చదువుతావు, బావుంటుంది, ఎందుకు బావుంటుందో తెలియదు. కాని నీ అనుభవానికి వచ్చిన ఫలాన రకాల అందాలున్నాయి అని చెపుతావు. ఈ చెప్పడం మరొక కాస్త కవిత్వంలా వుంటుంది. కవిత్వం గురించి మాట్లాడడానికి మరికాస్త కవిత్వం మాట్లాడతాం.

గోపి:

దీన్నే కదా సహృదయత అంటారు? ఈ impressionistic criticism, ఇదీ ఒకటేనా?

నారా:

ఒకరకంగా చూస్తే ఒకటే.

గోపి:

మరి, ఈ సహృదయతకు ఒక సంస్కారం, స్థాయి ఉండాలంటారు కదా?

నారా:

సంస్కారమనేది సమాజంలో బతకడం మూలంగా ఏర్పడుతుంది. ఇప్పుడు సహృదయుడని ఒకనికి ముద్ర వేసి, అతడు చెప్పిందే మంచి పద్యం అనుకోవడం ఒక రకమైన సాహిత్యాన్ని పైకి తీసుకరావాలనే ఒక వర్గం చేసిన పని. అలా కాకుండా సంస్కారం, సమాజంలో బతకడం మూలాన మీకేర్పడుతుంది అనీ, జీవితం జీవించడం మూలంగా ఏ పద్యం బావుందో ఏ పద్యం బాగా లేదో తెలుస్తుంది అనీ, అనడం అవనరం. ఇదేదో ప్రత్యేకంగా కొందరికే వొచ్చే విద్య కాదు.

గోపి:

Impressionistic criticismను పూర్తిగా తోసివేయవచ్చా?

నారా:

తోసివెయ్యకూడదు. సమాజంలో అటువంటి విమర్శ ఎప్పడూ జరుగుతూనే వుంటుంది. ఒక పద్యం మంచిదా చెడ్డదా, ఒక కవి గొప్పవాడా తక్కువవాడా, ఇలాంటి ప్రశ్నలు శ్రోతలూ పాఠకులూ నిరంతరం వేసుకుంటూనే వుంటారు. అందులో చాలా భాగం ఆయా కాలాల భావజాల ప్రభావంలో ఏర్పడిన అభిరుచుల మూలంగా నిర్ణయమవుతుంది. ఎటొచ్చీ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే పరిశోధకులకీ విమర్శకులకీ ఇందులో ప్రమేయం లేదు. కవుల్లో ఎక్కువ తక్కువలు నిర్ణయించే పని, విశ్వవిద్యాలయ విమర్శకులది కాదు, కాకూడదు.

చేరా:

అయితే విశ్వవిద్యాలయ విమర్శకులు, పరిశోధకులు ఏం చెయ్యాలి?

నారా:

సమాజం ఒప్పేసుకున్న గొప్ప కవి ఏ కారణాల చేత ఒప్పుకోబడ్డాడో సిద్ధాంతపూర్వకంగా వివరించవచ్చు. ఒక విధమైన ప్రక్రియ, ఉదాహరణకి, వచన పద్యం ఎందువల్ల వస్తుందో చెప్పొచ్చు. ఒక వర్గం వాళ్ళకి, లేదా ఒక రకం పాఠకులకి, ఒక తరహా సాహిత్యం ఎందుకు నచ్చుతుందో కారణాలు వివరించవచ్చు. అంతే కానీ ఓ కవిని పట్టుకుని ఇతను మహాకవి అనో తక్కువరకం కవి అనో నిర్ణయం చేసే పని మాత్రం విశ్వవిద్యాలయం పరిశోధకుల చేతుల్లో లేదు. దానికి కారణం అలాంటి నిర్ణయాలు సిద్ధాంతపూర్వకంగా చెయ్యడానికి అవకాశాలేవీ లేవు.

చేరా:

ఒక పద్యం బాగుందన్నప్పుడుగాని, ఆ పద్యంలో ఇది బాగుందని చెప్పినప్పుడుగాని, పద్యగతమైన కారణాలేమీ ఉండవా?

నారా:

పద్యగతమైన కారణాలూ వుంటాయి, పాఠకగతమైన కారణాలూ వుంటాయి. వాటిలో ఏవి ఏవో సున్నితంగా పట్టుకోడానికి మాత్రం స్ఫుటమైన సాహిత్య సిద్ధాంతాలేవీ లేవు. ఇంతవరకూ సాహిత్య విమర్శలో ఏర్పడిన ఏ సిద్ధాంతమూ కూడా ఆ పని చెయ్యలేదు. ఉదాహరణకి వేమన పద్యాలు కొన్ని వందలూ వేలూ వున్నాయి. అందులో కొన్ని ఎక్కువ ప్రచారం పొందాయి. మరి కొన్ని ఎవరికీ తెలీకుండా పుస్తకాల్లో పడున్నాయి. జనం నోళ్ళల్లో నలిగిన పద్యాలు వాళ్ళకి నచ్చినవని, అంచేత అవి అందమైనవనీ మనం ఒప్పుకుంటాం. అవి ఎందుకు జనానికి నచ్చేయో పరిశోధకులు / విమర్శకులు రకరకాల కారణాలు ఇవాళ చెప్పవచ్చు. కానీ నాలుగు వేల వేమన పద్యాలు ముందు పడేస్తే ఆందులో- ఇదిగో ఈ ఫలానా పద్యాలు జనానికి నచ్చుతాయి. మిగతావి నచ్చవు. ఎందుకంటే ఫలానా పద్యగతమైన కారణాలవల్ల- అని నిర్ణయించడానికి ఏ సిద్ధాంతమూ తోడ్పడదు. పోతే జనాభిప్రాయాన్ని పరిశీలించిన పరిశోధకుడు, ఆటవెలది పద్యంలో ఒక రకమైన లక్షణాలుంటే అది ఎక్కువ అందమైన పద్యం అని నిర్ణయించొచ్చు. ఆ నిర్ణయానికి ప్రయోజనం ఎందుకుందంటే, జనాభిప్రాయానికి అంతర్గతంగా ఉన్న హేతుబద్ధత, దీనివల్ల వ్యక్తమవుతుంది కాబట్టి.

గోపి:

మరి విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు చాలా మంది ఆధునిక కవుల మీద, రచయితల మీద, M. Phil. Thesisలు చేస్తున్నారు. వాళ్ళ మీద M.Phil చెయ్యడానికి, వాళ్ళంత గొప్పవాళ్ళా? అని అడుగుతూంటారు. వాళ్ళ మీద పరిశోధన చేయకూడదా?

నారా:

గొప్ప కవి అక్కరలేదయ్యా పరిశోధన చెయ్యడానికి. వైద్య శాస్త్రంలో పరిశోధన చేసేవాడు టైఫాయిడ్ మీదా చేస్తాడు, కలరా మీదా చేస్తాడు. వస్తువేదైనా పరిశోధన విధానం మీద, పరిశోధన నిర్ణయాల మీద, ఆ పరిశోధన మంచిచెడ్డలు ఆధారపడుంటాయి, అంతే. పరిశోధనను బట్టి వస్తువుకు ప్రామాణికత రాదు. వస్తువును బట్టి పరిశోధనకీ ప్రామాణికత రాదు. పోతన మీద చేసినంత మాత్రాన పరిశోధన గొప్ప పరిశోధన అయిపోదు. అలా అని ఒక చవకబారు నవల మీద ప్రామాణిక పరిశోధన చెయ్యలేమని చెప్పడానికీ వీల్లేదు. ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు తెలుగులో వచ్చే పాప్యులర్ లిటరేచర్ మీద, అంటే హత్యలూ మాసభంగాలూ ఉండే వారపత్రికల నవలల మీద అద్భుతమైన పరిశోధన చెయ్యొచ్చు.

చేరా:

పరిశోధనలో సిద్ధాంతపరమైన పరిశోధనలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి, సాహిత్యంలో తెలుగులోకానీ ఇంకో భాషలోగానీ మార్పులు ఏ క్రమంలో వస్తాయి? ఏ ప్రక్రియలు ఏ కారణాల వల్ల రూపొందుతాయి? అని చేసేది సిద్ధాంతపరమైన పరిశోధన అనుకుందాం. అందరూ అలాంటి విమర్శలు చెయ్యలేరు. అలా చెయ్యాలనీ లేదు. అయినప్పుడు సిద్ధాంతపరమైన పరిశోధన కాకుండా, ఏం చెయ్యొచ్చు?

నారా:

సాహిత్యంలో చెయ్యవలసిన పని చాలావుంది. ఒక పరిశోధకుడు అనుసరిస్తున్న లేదా ప్రతిపాదిస్తున్న కొత్త సిద్ధాంతాలు ఏమీ లేకపోయినా, అప్పటికి ఉన్న సిద్ధాంతాల ఉపయోగంలో ప్రయోజనాలూ పరిమితులూ నిర్ణయించొచ్చు.

గోపి:

ఈ పని చెయ్యడానికి ఒక మెథడాలజీ ఉండాలంటారు గదా! ఇప్పుడు యూనివర్సిటీలలో మెథడాలజీ ఆని బోధిస్తున్నారు. మీ ఉద్దేశంలో మెథడాలజీ అంటే ఏమిటి?

నారా:

ఇక్కడ ఎందుచేతనో గానీ మెథడాలజీ అనే మాట ఏదో ఒక మంత్రం లాగ వాడుతున్నట్టు నాకనుమానంగా వుంది. అదేదో ఒక పుస్తకంలో చదివేస్తే ఆ తర్వాత అన్ని పరిశోధనలకు అది వాడెయ్యొచ్చును ఆనే అభిప్రాయం చాలామందికి వున్నట్టుంది.

చేరా:

రాసేటప్పుడు ఒక పద్ధతిలో style sheet కట్టుబడి వుండడం మెథడాలజీ అన్న అభిప్రాయం ప్రచారంలో వుంది.

నారా:

అట్లా అయితే అది పొరపాటు అభిప్రాయమే. రాసేటప్పుడు ఒకరు రాసేది మరొకరికి ఆర్థం కావడానికి కొన్ని ఆనవాయితీలు అవసరం. ఆ ఆనవాయితీల సంపుటినే style sheet అంటారు. ఇలాంటి ఆనవాయితీలు సాధారణంగా ఒక్కొక్క జనసమూహంలో ఒక్కోరకంగా ఏర్పడతాయి. ఉదాహరణకి, దస్తావేజులు రాయడం తీసుకోండి. అందులో కొంటున్న లేదా అమ్ముతున్న భూమికి సరిహద్దులు చెప్పే పద్ధతిలో ఆనవాయితీగా కొన్ని మాటలు అమలులో వుంటాయి. అది వాళ్ళ style. ఇలాంటి ఆనవాయితీలన్నీ దస్తావేజుల మతలబులు అనే పుస్తకంలో అచ్చువేశారు. అది గ్రామ కరణాల style sheet అని చెప్పొచ్చు.

తెలుగులో పిహెచ్‍.డి. వ్యాసాలు రాయడం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నా, అవి రాయడానికి నియతమైన మతలబు ఏదీ ఏర్పడలేదు. మొత్తం పుస్తకాలన్నీ కలిపి వందో రెండు వందలో ఉన్నప్పుడు, పాండిత్యలోకంలో ఉన్నవాళ్ళందరూ వాటిని కంఠస్థం చేసినప్పుడు, వాటిని వ్యాసాల్లో ఉదాహరించేవాళ్ళు. ఏ పద్యం, ఏ శ్లోకం, ఎవరు రాసిన ఏ గ్రంథంలో వుందో ఆచూకీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి, సమాచారానికి ఆచూకీలు ఇవ్వవలసిన పద్ధతిలో మనం అందరం కలిసి ఉమ్మడిగా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవాలి.

Style sheet ఇలాంటి నియమాలతోపాటు ఇంకా కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చెయ్యాలి. అది పరిశోధన వ్యాసాలలో రాయవలసిన వచనం ఎలా వుండాలి అనే ప్రశ్నకి సంబంధించినది.

చేరా:

మనకి తెలుగులో విషయానికి తగిన వచనం వేరువేరుగా develop కాలేదు. అన్నిటికీ ఒకేరకమైన వచనం రాయటం అలవాటవడం వల్ల, ఆలంకారికంగా రాసిన వచనమే మంచిదని చాలామంది అనుకుంటున్నారు.

నారా:

నేనిందాకనే చెప్పాను. ఎప్పుడైతే గజిబిజిగా, రససిద్ధాంతాన్ని గురించి ఉపన్యాస ధోరణిలో చెప్పే మాటలు సాహిత్య విమర్శగా చెలామణి అవటం మొదలయిందో, అప్పుడే మనకు నిష్కర్షగా వుండే వచనం రాయవలసిన అవసరం లేకుండా పోయింది.

చేరా:

సంస్కృతంలో ఉన్న అలంకార శాస్త్రాలలో ఆలాటి వచనం వుందా?

నారా:

ఉంది. అభినవగుప్తుడు రాసిన వచనం చూడండి. ఇంకే ఇతర శాస్త్ర గ్రంథాలలో రాసిన వచనమైనా చూడండి. శాస్త్రంలో వచనం నిష్కర్షగానే రాశారు వాళ్ళు. అందంగా ఉండాల్సిన వచనం అందంగానే రాశారు. ఇంగ్లీషులోనూ అంతే. మనకి శాస్త్ర పాండిత్యంలో విచ్ఛిత్తి ఏర్పడింది. పాశ్చాత్య పాండిత్యంతో తగినంత పరిచయం ఏర్పడలేదు. అంచేత ఇటు సంస్కృతం, అటు ఇంగ్లీషు రెండు గొప్ప భాషల మధ్య నలిగిపోయిన భాష తెలుగు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖల్లో మనం ఈ రెండు భాషల గొప్పదనాన్ని అందిపుచ్చుకోలేక వాటితో అల్పపరిచయం వల్ల మనలో కలిగిన అవలక్షణాలని మాత్రం పెంపొందించుకుంటున్నాం. అందువల్ల మన వచనం చచ్చిపోయింది.

చేరా:

సంస్కృతంతో తెలుగుకి proximity చాలాకాలం నుంచి ఉందనుకోండి. కాని అప్పుడు కూడా తెలుగులో మంచి వచనం develop కాలేదే?

నారా:

అప్పుడు వచనం ఎక్కువ అవసరం లేకపోయిందనుకుంటాను. కానీ విషయ ప్రధానమైన వచనం అవసరం వచ్చేసరికి తెలుగులో మనకి మంచి వచనమే మొదలయ్యింది. కొమర్రాజు లక్ష్మణరావు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, సి.ఆర్. రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, వీళ్ళు మంచి వచనం రాశారు. ఎందుచేతనోగాని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో పరిశోధకులకి అలాంటి వచనం అలవాటవలేదు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళెవరూ తెలుగు శాఖల్లో పాఠం చెప్పలేదు. డిగ్రీలు లేకపోవడం కారణంగా కొందరూ, మరి ఇతర కారణాలవల్ల కొందరూ- కొత్తరకమైన ఊహలు చేస్తున్న వాళ్ళూ కొత్తరకమైన రచనలు చేస్తున్నవాళ్ళూ చాలామంది కాలేజీలకి, విశ్వవిద్యాలయాలకి బైటే ఉండి పోవడం తెలుగుశాఖల దురదృష్టం. ఏ కారణంచేతనయితేనేం తెలుగు శాఖల్లో ఉండే విద్యార్థులకి వాళ్ళతో సాహచర్యం లేకుండా పోయింది.

గోపి:

సాహచర్యం ఉండి ఉంటే…?

నారా:

కొత్త రకమైన ఊహలు, కొత్త రకమైన వచనం వాళ్ళదగ్గర్నుంచి నేర్చుకునేవాళ్ళు. ఎప్పుడూ ఆధునికమవుతున్న జాతిలో పూర్వతరం కన్నా తర్వాతితరం గొప్పతరం కావాలి. అంచేత పూర్వతరంలో రెండు గొప్ప లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ రెండు గొప్ప లక్షణాల సంపుటి తర్వాతితరం వారికి రావాలి. ఆ ఇద్దరి ఆలోచనల్లో ఉండే అవలక్షణాలు వీళ్ళకి అఖ్ఖరలేదు.

చేరా:

పాత పండితులు తమ నమ్మకాల ప్రపంచానికీ పరిశోధనాపద్ధతికీ అభేదాన్ని ప్రదర్శిస్తున్నారు. అంచేత ఇబ్బందులు వస్తున్నాయి.

నారా:

పరిశోధనాప్రపంచానికి ఎవరి నమ్మకాలతోనూ నిమిత్తం లేనటువంటి ఒక పరిధి ఉంది. హేతుబద్ధత తప్ప ఇంక దేనినీ పరిశోధనాప్రపంచం ఒప్పుకోదు. ఉదాహరణకి, అన్నమాచార్యుల భక్తి గీతాలపై పరిశోధన చెయ్యొచ్చు. కానీ, పరిశోధకుడు మాత్రం భక్తుడు కాకూడదు. ఒకవేళ వ్యక్తిగత జీవితంలో భక్తుడైనా, పరిశోధన మాత్రం భక్తుడిగా చెయ్యకూడదు. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనకి ఈ నియమం అవసరం.

గోపి:

కానీ, ఇట్లా ఉంటే, బయటవాళ్ళు మీది ఎకడమిక్ విమర్శ అని చిన్నచూపు చూస్తున్నారు కదా.

నారా:

ఏమీ ఫరవాలేదు. అవును ఇవి ఎకడమిక్ విమర్శలే. వీటికి లోకంలో ప్రచారం రావాలనే ప్రయత్నం ఉండనఖ్ఖరలేదు. లోకంలో ప్రచారం లేకపోతే వ్యాకరణశాస్త్రం రాసిన చామ్‌స్కీకి ఏమీ నష్టం లేదు. న్యూయార్క్ టైమ్స్‌లో ఇంగ్లీషు భాష గురించి రాసే విలియమ్ శఫైర్ (William Safire) కన్నా చామ్‌స్కీకి తక్కువ పేరుండొచ్చుగాక కానీ, అంతమాత్రాన అతనికి ఏమీ నష్టం లేదు. శాస్త్ర పాండిత్యంలో అంగీకారాన్ని పొందిన ఒక సిద్ధాంతం, లౌకిక ప్రఖ్యాతికి ఒకప్పుడు రావొచ్చు. కానీ లౌకిక ప్రఖ్యాతి శాస్త్ర పండితులకి ధ్యేయం కాకూడదు. పూర్వం మన దేశంలో శాస్త్ర పండితులూ లౌకిక పండితులూ అని వేర్వేరుగా ఉండేవాళ్ళు. ఇప్పుడా భేదం పోతున్నట్టు కన్పిస్తోంది.

గోపి:

అయితే శాస్త్ర పండితులు దేశాన్నీ, సమాజాన్నీ మార్చాలనే ఉద్దేశంతో రాయకూడదా? అలా రాసేవాళ్ళు ఉన్నారు కదా?

నారా:

రాయొచ్చు. రాయాలి కూడా. అలా అని ఆ రెండింటికీ ఉన్న భేదాన్ని మరిచిపోకూడదు, మీకు తెలుసు కదా, చామ్‌స్కీయే ఈ పని చేస్తున్నాడు. ఆయన ఒక పక్క బయట రాజకీయాలలో తలమున్కలుగా దూరి, అమెరికన్ సామ్రాజ్యవాదం గురించీ, వియత్నాం యుద్ధం గురించీ, బోలెడు పుస్తకాలు రాసేడు. కాని మళ్ళా భాషాశాస్త్ర పరిశోధనలూ చేశాడు. శాస్త్ర పరిశోధన శాస్త్రకారునిగానే చేశాడు. రాజకీయ పుస్తకాలు తనకున్న రాజకీయ దృక్పథం తోటే రాశాడు. ఈ రెండింటికీ తాత్వికంగా సుతరామూ సంబంధం లేదని నేననను. కానీ ఈ రెండు రకాల పుస్తకాల శైలి లోనూ, రచనా విధానం లోనూ ఉన్న తేడాలు మాత్రం ముఖ్యం. ఈరోజు ఒకరు విశ్వనాథ సత్యనారాయణగారి మీద పరిశోధన చేస్తూండొచ్చు. మరొకరు శ్రీశ్రీ మీద పరిశోధన చేస్తూండొచ్చు. ఈ ఇద్దరికీ లోకం దృష్టిలో బోలెడంత స్పర్థ ఉంది. అయితే వీరిపై విశ్వవిద్యాలయాల్లో చేసే పరిశోధనల్లో మాత్రం ఒకేరకమైన ప్రమాణాలు ఉండాలి.

ఇవన్నీ పరిశోధనలో అనుసరించవలసిన మెథడాలజీలో భాగాలవుతాయి. మెథడాలజీ అంటే పరిశోధనకి అనుసరించవలసిన సిద్ధాంతాలు అమలు పరిచే పద్ధతి. ఉదాహరణకి, సాహిత్య విశ్లేషణకీ, విమర్శకీ వర్తింపజేయడానికి అనువయే సిద్ధాంతాలు, ఇప్పటికే ఏర్పడినవి, చాలా వున్నాయి. సాంప్రదాయిక కావ్య విజ్ఞానంలో చూస్తే రస సిద్ధాంతం (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రస సిద్ధాంతాలు) కావ్య రూప చర్చలకు పనికివచ్చే అలంకార, రీతి సిద్ధాంతాలు, ఇంకా నేను చెప్పనక్కరలేనంత ప్రచురంగా తెలిసిన ధ్వని, వక్రోక్తి, ఔచిత్యాది సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవి అనుసరించి, అంటే వీటిని వర్తింపజేసి, సాహిత్య పరిశీలన చెయ్యవచ్చు. అప్పుడు అది వాళ్ళ మెథడాలజీ ఆవుతుంది. ఎటొచ్చీ బుద్ధిమంతుడైన పరిశోధకుడు ఈ సిద్ధాంతాలను అనుసరించేటప్పుడు ఇవి ఒక కాలంలో ఒక ప్రత్యేక దృక్పథంతో వీటికి నప్పేలా రచించబడిన కావ్యాలకి మాత్రమే వర్తిస్తాయా లేక ఇవి ఇతర సాహిత్యాలకి కూడా వర్తిస్తాయా? అని ఒక ప్రశ్న వేసుకుంటాడు, ఈ ప్రశ్నవల్ల ఆయా విధానాల పరిమితి కూడా చర్చలోకి వస్తుంది. అలాగే మనకి అలవాటయిన ఒక ఆధునిక సిద్ధాంతం – కవి జీవితం, అతని కాలం, దాని ప్రభావం అతని రచనలో ప్రతిఫలించే తీరూ, ఇలాంటివి పరిశీలించడానికి పనికొచ్చేది ఉంది. ఈ విధానానికి ఒక నియతమైన పేరు లేదు. కాని, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఆధునిక పెట్టుబడిదారీ సమాజంలో వ్యక్తికి స్వతంత్ర ప్రతిపత్తి వుందనే వాదం దీనికి మూలం. ఇది ఒక మెథడాలజీగా మనం చాలా కాలంగా వాడుతున్నాం. ఎటొచ్చీ ఇదొక మెథడాలజీ మాత్రమేననీ, సార్వకాలిక సత్యం కాదనీ, మనం బోధపరుచుకునుంటే ఈ మెథడాలజీకి ఉన్న పరిమితులు మనం గమనించి ఉండేవాళ్ళం. ఇలాగే మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్ని ఒక మెథడాలజీగా మలుచుకుని తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించిన వాళ్ళున్నారు. తెలుగు పరిశోధనలో మనందరం ఏవో కొన్ని మెథడాలజీలని అనుసరిస్తున్నాం. ఎటొచ్చీ వాటి స్వరూపం మనం యోచించుకోలేదు. అంచేత వాటి పరిమితులు మనకి తెలీవు. వాటి ఉపయోగాలూ సరిగ్గా తెలియవు.

గోపి:

మీ దృష్టికి వచ్చినంత వరకు మన తెలుగు థీసిస్సుల్లో మీరు చెప్తున్నట్లుగా మెథడాలజీని సరిగా ఫాలో కావడం లేదంటారా?

నారా:

చాలా మంది ఫాలో కావడం లేదు. చాలా మందికి అసలు ఏం రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో తెలీదు. తెలుగులో పిహెచ్.డీ.లకి నిజంగా ఏ ప్రమాణాలూ లేవు. ఈ మాటంటే చాలా కష్టంగా ఉండొచ్చుగానీ దాదాపు ఏం రాసినా, ఎలా రాసినా, పిహెచ్. డి. వచ్చే స్థితి ఇప్పుడు విశ్వవిద్యాలయ తెలుగు శాఖల్లో వుంది. అలా అని పరిశోధన చేయించేవాళ్ళలోగాని, చేసేవాళ్ళలోగాని ప్రతిభావంతులు లేరని అనుకోకండి. చాలామంది వున్నారు. వాళ్ళు చాలా మంచిపని చేయగల దక్షత వున్నవాళ్ళు. అందులో కొందరు చేస్తున్నారు కూడా. కానీ లేనిదల్లా మంచికీ, చెడ్డకీ తారతమ్యం చూసే పట్టుదల; పిహెచ్.డి. ఇవ్వదగిన పరిశోధనకీ, ఇవ్వకూడని పరిశోధనకీ తేడా చూడవలసిన అవసరం.

గోపి:

మీరు చాలా నెగెటివ్‍గా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు మంచి ఏవీఁ కనిపించడంలేదా? మీరనుకున్న ప్రమాణాలతో లోపాలు ఏమీ లేని పిహెచ్.డి. థీసిస్సులు ఎప్పుడైనా, ఎక్కడైనా వస్తాయా?

నారా:

నేను నెగెటివ్‍గా మాట్లాడుతున్నానని అనుకోవడంలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రమాదాన్ని గమనించమని హెచ్చరిస్తున్నానంతే. మనకి ప్రపంచంలో ఏ సాహిత్య శాఖలతో పోల్చినా తీసిపోని సమర్థులున్నారు. వాళ్ళు మంచి పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసాలు రాశారు. కాని అంతకు పదిరెట్లు ఎందుకూ పనికి రాని పిహెచ్.డీలు తయారయాయి కూడా. పైగా లోపాలు లేని పిహెచ్.డి. గ్రంథాలు ఎక్కడా ఉండవు. నేను కోరేది అది కాదు. మనకి పిహెచ్.డి. ఇవ్వడానికి కనీస ప్రమాణాలు లేవని నేనంటున్నాను. అవి ఏర్పడాలని నేను కోరుతున్నాను.

గోపి:

అవి ఎలా ఉండాలో కొన్ని సూచించగలరా?

నారా:

కొన్ని మాత్రం సూచించడానికి ప్రయత్నం చేస్తాను. ఆందరికీ ఆమోదకరమయిన ప్రమాణాలు ఏర్పడడానికి చాలామంది కూర్చుని ఉమ్మడిగా చర్చించాలి. మొదటిది: పిహెచ్.డి. ధ్యేయం పరమ ప్రామాణికుడైన పండితుడ్ని తయారుచేయడం కాదు. తన రంగంలో ఏ అంశంమీదనైనా ఒక పద్ధతిలో సమాచారాన్ని పోగుచేసి, ఆ సమాచారం ఆధారంగా తెలివైన ప్రశ్నలు వేయగలగాలి. మంచి ప్రశ్నలకి మంచి సమాధానాలొస్తాయి. తప్పుడు ప్రశ్నలకి తప్పుడు సమాధానాలొస్తాయి. ప్రశ్నించడం, విశ్లేషించడం, వ్యాఖ్యానించడం, ఈ మూడూ చేతనయినవాళ్ళని తెలుగు శాఖలు తయారుచెయ్యాలి. ఇవి నేర్చుకున్న విద్యార్థులు తాము పిహెచ్.డి. కోసం పని చేసిన రంగంలోనే కాకుండా, ఆ తరవాత ఇంకే రంగంలోనైనా పని చేయగలరు, విద్యార్థులను తర్ఫీదు చేయగలరు. పిహెచ్.డి. గ్రంథాలకి మనకి మంచి నమూనాలు లేవు. అవి ఏర్పరచాలి.

గోపి:

మీరు నమూనాలు లేవంటున్నారు కదా! ఎలా ఏర్పరచగలం?

నారా:

ఇంతవరకు తెలుగు పరిశోధన రంగంలో వచ్చిన పుస్తకాలని సమీక్షించాలి. మీరు పెట్టిన ఈ రిసెర్చి జర్నల్ ఆ పని చేస్తుందని ఆశిస్తున్నాను. ఇంతవరకు మనకి పరిశోధన ప్రకటించడానికి ప్రామాణికమైన జర్నల్ లేదు. దినపత్రికలో ప్రకటించిన వ్యాసాలు కానివ్వండి, వార పత్రికలో వచ్చిన వ్యాసాలు కానివ్వండి, వాటికీ, పరిశోధనా పత్రికలు అనబడే పత్రికల్లో ప్రచురించే వ్యాసాలకీ చెప్పుకోదగ్గ తేడా ఉండడంలేదు. వీటిని ఒక పరిశోధన పత్రికలో బాధ్యతగా రివ్యూ చేసే పద్ధతి రావాలి.

చేరా:

అలా ఇంతవరకూ రివ్యూ చెయ్యలేకపోవడానికి, మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న జర్నల్స్ లేకపోవడం ఒక కారణం. మనకి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ లేకపోవడం మరో కారణం.

నారా:

ఒప్పకున్నాను కానీ ఇలా ఎన్నాళ్ళుంటాం మనం? నిజంగా మనకి కావాలంటే వాటిని ఏర్పరుచుకోవడం ఎంతో కష్టంకాదు. లింగ్విస్టిక్స్‌లో అలాంటి ప్రమాణాలు, అంతర్జాతీయంగా ఆ రంగంలోని ఇతర పండితులతో బాంధవ్యాలూ కూడా ఉన్నాయి కదా! తెలుగు కాక ఇక ఏ ఇతర శాఖలు చూసినా, ఇలాంటి ప్రమాణాలూ పరిచయాలూ వున్నాయి. తెలుగులో మనకి కమ్యూనిటీ ఆఫ్ స్కాలర్స్ లేదు. ఒకరి పనిని పదిమంది విమర్శించి, సమీక్షించి దాని తర్వాత వెయ్యవలసిన ముందడుగు మనం వెయ్యగలగాలంటే పరిశోధన మీద విమర్శ అవసరం. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటీ అంటే ritualization of research. పిహెచ్.డి. థీసిస్ రాయడం, అది వున్నది వున్నట్లుగా అచ్చు వేయడం, దానికొక ఆవిష్కరణ సభ పెట్టడం, దాని గురించి నలుగురూ పొగడడం, ఆ తర్వాత దానిని మర్చిపోవడం. ఇలాంటి పనివల్ల మనకి పుస్తకాల పట్ల పూజాభావం ఏర్పడుతుందేమో గాని, సవిమర్శకమైన అవగాహన ఏర్పడదు. గత ఇరవై ఏళ్ళుగా మనకు వచ్చిన పిహెచ్‍.డి. గ్రంథాలలో కొన్ని ప్రామాణికమైన పాఠ్యగ్రంథాలుగా కూడా చలామణి అవుతున్నాయి. ఆ పుస్తకాల మీద ఇన్నాళ్ళయినా చర్చలు గాని, సమీక్షలు గాని లేవు. వాటిల్లో అభిప్రాయాలని దాదాపు చిలకపలుకుల్లా విద్యార్థులు వల్లించేస్తున్నారు.

రామకృష్ణ:

మీరు తెలుగు సిద్ధాంత గ్రంథాలకి మోడల్స్‌ గురించి మాట్లాడుతున్నారు. కొన్ని మంచి మోడల్స్ మనకి లేవంటారా? మీరేమీ అనుకోకపోతే మీ పుస్తకం ఉంది కదా! దాన్ని ఒక మోడల్ కింద మీరు ఆమోదిస్తారా?

నారా:

దాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి, రెండు మాటలు చెప్తాను. అది రాసి అప్పుడే పదేళ్ళయింది. ఆ పుస్తకాన్ని ఇంతవరకూ ఏ యూనివర్సిటీ అధ్యాపకులూ రివ్యూ చెయ్యలేదు. ఈ మధ్య రెండో ఎడిషన్ వచ్చాక, దినపత్రిక కోసం ఓ చిన్న రివ్యూ చేసిన కె.కె. రంగనాథాచార్యులు తప్ప, అది రివ్యూ చేసిన వాళ్ళంతా బయటివాళ్ళే! ఎకడమిక్ ప్రమాణాలతో దానిని ఇంతవరకూ ఎవరూ చర్చించలేదు. ఈ మధ్య నాయని కృష్ణకుమారిగారు అందులో భావకవిత్వం గురించి నేను చేసిన విశ్లేషణ తప్పు అని చెప్పి దానిని సవరిస్తూ ఒక వ్యాసం రాశారు. అది చదివినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఆవిడ ప్రతిపాదన మీద ఉపయోగకరమైన చర్చ వస్తే ఇంకా సంతోషిస్తాను. నా పుస్తకంలోని ఒకటి రెండు concepts తీసుకుని ఎం.ఫిల్. డిసర్టేషన్స్ చేశారు కూడా. చేసినవాళ్ళు ఆ ఊహల్ని పుచ్చుకుని, సమర్థంగా విమర్శించి, ఇంకో అడుగు ముందుకువేశారు. నాకు నిజంగా సంతోషంవేసింది, నా పుస్తకం చిలక పలుకుల్లా వల్లించే పాఠ్యగ్రంథం కాకపోతున్నందుకు. అందులో అభిప్రాయాల్ని నేనప్పుడే చాలా మార్చుకున్నాను. ఆశు సాహిత్యం గురించి నేను చెప్పిన భావాలు మరికొంచెం క్లిష్టంగా చెప్పాలి. నేను రాసి పదేళ్ళయింది. పదేళ్ళపాటు ఏ సిద్ధాంతమూ మార్పులేకుండా ఉండకూడదు. కాని నా పుస్తకంలో చెప్పిన చాలా ప్రతిపాదనలు, సిద్ధాంతాలు, మార్పు సంగతి అలా ఉంచి ఉపయోగంలోకి కూడా రాలేదు. నేను సహేతుకంగా నిరాకరించిన భావాలు, దాదాపు సి. ఆర్. రెడ్డి కాలం నాటివి, ఇంకా పాఠాలు చెప్తూనే ఉన్నారు. విద్యార్థులు వింటూనే ఉన్నారు.

గోపి:

మీరు అమెరికన్ వేగంతో ఆలోచిస్తున్నారేమో ననిపిస్తోంది.

చేరా:

ఆ మాటనే నేను మరో పద్ధతిలో అడగనా? ఇప్పడు మన తెలుగు పరిశోధనలో మెథడాలజీస్ కొత్తవి ఏర్పడిలేవు. పాతవి పనికిరావు.

నారా:

ఏర్పడక పోవడమే కాదు. మెథడాలజీస్ గురించిన అవగాహన ఏర్పడలేదు.

గోపి:

ఎంచేతనంటారు?

నారా:

తెలుగువాళ్ళు తెలుగు శాఖల్లోనే ఉండిపోబట్టి. తెలుగులో పరిశోధన చేసేవాళ్ళు ఇతర హ్యుమానిటీస్‍లోనూ, సోషల్ సైన్సెస్‌లోనూ పాఠాలు చదవరు. పరాయి భాషలు నేర్చుకోరు. ఏంత్రపాలజీలోనూ, లింగ్విస్టిక్స్‌లోనూ, పొలిటికల్ సైన్స్‌లోనూ, సైకాలజీలోనూ మనవాళ్ళు ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు తీసుకునే అవసరం కల్పించాలి. ఏ విషయం మీద పరిశోధన చేస్తున్నారో దానికి తగిన మరొక భారతీయ భాషని విధిగా నేర్చుకోవాలి. తమిళం, కన్నడం, హిందీ ఇలాంటి భాషలతో తెలుగు విద్యార్థులకి ఏమీ పరిచయం ఉండడం లేదు. అంతర్జాతీయంగానూ ఇతర రాష్ట్రాలలోనూ భారతీయ సాహిత్యాలపై జరుగుతున్న పరిశోధన మనకు అందుబాటు కావడంలేదు. తెలుగు శాఖలు గూడుకట్టుకొని పోతున్నాయి.

ఇంతకన్నా ముఖ్యమైనది మరో లోపం వుంది. మనకున్నవి పట్టుమని పది యూనివర్సిటీలు కూడా లేకపోయినా అందులో కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. అమెరికాలో ఒక మంచి సంప్రదాయం వుంది; ఏ యూనివర్సిటీలో పిహెచ్.డి. తెచ్చుకున్న విద్యార్థికి ఆ యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వరు. అతడు/ఆమె బయట ఇంకో యూనివర్సిటీలో ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే. ఈ అలవాటు వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి. ఒకటి – ఒక గురువుగారి దగ్గర శిష్యులు, ఆ తరవాత వాళ్ళ శిష్యులు, ఒకచోటే గుంపు చేరిపోయి, అవే అభిప్రాయాలని వాళ్ళలో వాళ్ళు వల్లించుకుంటూ వుండరు. బయటి నుంచి వచ్చినవాళ్ళు కొత్త పద్ధతులు, కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తారు. ఈ పద్ధతి మనం కూడా అనుసరించడం మంచిదేమో ననిపిస్తుంది.

పైగా ఇందువల్ల ఇంకో లాభం కూడా వుంది. గురువుగారి దగ్గరే ఉద్యోగం చేస్తూ, వారి సిద్ధాంతం కాదనడం, వారి పద్ధతులను తిరస్కరించడం, వారి లోపాలను చూపించడం కష్టం. ప్రశ్నించడం అంటే దెబ్బలాడడం, ఎదురు తిరగడం అనే అర్థాలు ఉన్నంత కాలం మనలో పెరుగుదల రాదు. ప్రశ్నించడం అంటే గౌరవించడం, విమర్శించడం అంటే మర్యాద చేయడం అనే అర్థాలు మనలో ఏర్పడాలి.

గోపి:

ఏదైనా పరిశోధనని విమర్శిస్తే, ఆ వ్యక్తి పనికిమాలిన పని చేశాడు ఆనే అభిప్రాయం వస్తుందనే భయం వుంటుంది.

నారా:

అటువంటి భయం యూనివర్సిటీలలో ఉండకూడదు. నాకు ఒక వ్యక్తి పరిశోధన మీద గౌరవం వుంటేనే ఆ పరిశోధనని సీరియస్‍గా విమర్శిస్తాను. ఆయన/ఆవిడ లేవనెత్తిన ప్రశ్నల మూలంగా ఎంత అలజడి కలిగితే, ఆ పుస్తకం అంత మంచి పుస్తకం అన్నమాట. చెప్పుకోదగ్గ కొత్త ఆలోచనలకి కారణం కాని పుస్తకాలని విమర్శించను కూడా అక్కరలేదు. ఎవరూ ఏం మాట్లాడకుండా ఊరుకొంటే, అది గౌరవానికి గుర్తు కాదు. ఆ పుస్తకం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే అభిప్రాయానికి గుర్తు.

చేరా:

తెలుగులో community of scholars ఏర్పడనంత వరకు మనకు పుస్తకాలని సమీక్షించి, ఆ తరవాత వాటివల్ల పొందే మేలు పొందగలిగే స్థితి ఏర్పడుతుందంటారా?

నారా:

చెట్టు ముందో, విత్తు ముందో నేను చెప్పలేను. తెలుగులో పరిశోధనకి సంబంధించి ఇప్పుడు జర్నల్స్ ఉన్నాయి కదా! అందులో ప్రచురించబడడం, రివ్యూ చేయబడడం, పరిశోధకులకి ఒక ప్రమాణంగా తయారవాలి. ప్రామాణికమైన వ్యాసాలు ప్రచురించిన వారికే పరిశోధక సమాజంలో గౌరవం ఉండాలి. ఇప్పుడు గౌరవాలు ఉద్యోగ హోదాని బట్టి, ఇతర కారణాల బట్టి ఏర్పడుతున్నాయి. యూనివర్సిటీల పండితులు ఒక సమూహంగా ఏర్పడి ఇప్పటికి వచ్చిన పిహెచ్.డి. గ్రంథాలని ప్రామాణికంగా సమీక్షించాలి.

చేరా:

చాలా పిహెచ్.డి. థీసిస్సులు ఇప్పుడు అచ్చవుతున్నాయి. వాటిని సమీక్షించడం తేలికౌతుంది.

నారా:

అవును. నిజానికి చాలా థీసిస్సులు అచ్చుకావడం వల్లే నేను చదవగలిగేను. ఒకసారి వాటిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరుచుకుందామని పట్టుదలగా ఓ ప్రయత్నం చేశాను. మీరేమీ అనుకోకపోతే నేనోమాట చెప్తాను. చెప్పుకోదగ్గ పని చేసిన పిహెచ్.డి. గ్రంథాలు నాకు కనిపించినవి పట్టుమని పదైనా లేవు. ఈ మధ్య నేను కొన్ని ఎం.ఫిల్. డిసర్టేషన్స్ చదివాను. అందులో కొన్ని చాలా బావున్నాయి. పిహెచ్.డి. థీసిస్సుల కన్నా బావున్నాయి.

మస పిహెచ్.డి. గ్రంథాలు, మంచివి మినహాయించి, రెండు వర్గాలు చేయొచ్చు. ఒక వర్గం పురాణ పద్ధతిలో రాసినవీ, రెండవ వర్గం ప్రబంధ పద్ధతిలో రాసినవీ. పురాణాలెప్పుడూ సృష్టితో మొదలవుతాయి. అలాగే ఈ పురాణ పద్దతిలో రాసిన పిహెచ్.డి. గ్రంథాలు కూడా ఏ వేదకాలంలోనో మొదలవుతాయి. ఈ పద్ధతులలో రాసిన పుస్తకాలలో నాలుగయిదు అధ్యాయాల గాలి కబుర్ల తర్వాత గాని అసలు సమస్యను గురించి మాట్లాడడానికి వీలుండదు. ఇక రెండవ రకం పుస్తకాలలో, ప్రబంధాలలోకి మల్లే అందమైన సమాసాలతో కూడిన శైలి వుంటుంది.

కొన్ని పుస్తకాల్లో ఈ రెండు పద్ధతులు వుంటాయి. అలాగే నిర్వచనాలు చెప్పడం మనకో అలవాటు. లోకంలో అందరూ వాడుతున్న అర్థంలోనే పరిశోధకుడు ఒక మాటను వాడుతుంటే ఆ మాటను నిర్వచించనక్కరలేదు. ఉదాహరణకి తెలుగువారి హాస్యాన్ని గురించి ఒక పరిశోధన వ్యాసం రాశారనుకోండి. ఆ వ్యాసం వేదకాలం నాటి హాస్యంతో మొదలెట్టక్కరలేదు. హాస్యమనే మాటకు నిర్వచనాలు చెప్పక్కరలేదు. అందుకోసం ఇంగ్లీషు పుస్తకాలు వెతకక్కరలేదు. మీరు కావాలంటే చూడండి, మన పిహెచ్.డి. పుస్తకాలలో ఇవన్నీ కనిపిస్తాయి.

చేరా:

మీకు ఇబ్బంది కలిగించే ప్రశ్న ఒకటి అడుగుతాను. ఇటీవల మీరు, ఈ దేశంలో ఏమీ లేదు, ఏమీ లేదని చెడతిట్టేస్తున్నారని జనం అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం? అలాగే మీరు విమర్శించే చోట చాలా దురుసుగా, అసహనంగా విమర్శిస్తారని, ప్రశంసించే సందర్భంలో సంచలనాత్మకంగా మాట్లాడతారననీ ఓ అభిప్రాయంవుంది. దానికి మీరేమంటారు?

నారా:

మీరు తిట్టేస్తున్నారు అన్నమాటకి విమర్శిస్తున్నారు అన్న అర్థం చెప్పుకుంటాను. విమర్శించడమే తిట్టడమయితే, పొగిడి వెళ్ళిపోవడం తప్ప ఇంకేపని చేసినా ఆమోదం కలగదన్నమాట. కాని, పొగడ్తలవల్ల ఏం లాభం? నాకు నిజంగా గౌరవం ఉన్నచోటే విమర్శిస్తాను. విమర్శకు అవకాశాన్నిచ్చిన అభిప్రాయాలు, అవకాశాలూ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడేవి అని నా నమ్మకం. నిజంగా గౌరవం లేకుండా, ముఖస్తుతి పొగడ్తలు చేసినవాళ్ళని నేనెరుగుదునుగానీ నిజంగా గౌరవం లేకుండా, సహేతుకమైన విమర్శ చేయడం చాలా కష్టం. అది నాకు చేతకాదు. ఇక దురుసుగా, అసహనంగా మాట్లాడడం గురించి… నేను అసహనంగా మాట్లాడిన పరిస్థితులు లేకపోలేదు. తెలుగు శాఖలో పిహెచ్.డి. మొదలయి యాభై ఏళ్ళు కావస్తున్నా మన ప్రమాణాలు ఎటు ప్రయాణిస్తున్నాయో చూస్తే ఎవరికైనా అసహనంగానే వుంటుందనుకుంటాను. ఇకపోతే, మంచిపని చేసినవాళ్ళని మెచ్చుకోవడం తప్పు కాదు. మీరూ మెచ్చుకుంటారు.

చేరా:

మార్పు రావాలన్నప్పుడు దానికి తగిన వ్యూహం ఉండాలి కదా! ప్రతిదానికీ అమెరికాతో పోలుస్తారు. రెండు కల్చర్స్‌కీ భేదం వుందికదా! ఈ కల్చర్‍కి పట్టే భాషలో ఎందుకు చెప్పరు?

నారా:

వ్యూహం వుండాలనే నా ఉద్దేశం కూడా. వ్యూహం అని అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను; ఈ దేశపు పరిస్థితులకి తగినటువంటి పద్ధతిలో మనకి విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు ఏర్పడలేదు. ఇంగ్లీషు శాఖలకీ, ఫిజిక్సు కెమిస్ట్రీ మొదలయిన సైన్సు శాఖలకీ వర్తింపజేయడానికి వీలైన పద్ధతులలో విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు రూపొందించారు. పరదేశ విద్యలని ఈ దేశానికి తీసుకువచ్చేటప్పడు, అక్కడి ప్రమాణాలతోపాటు అక్కడి పద్ధతులనికూడా ఆ విద్యతోపాటు తీసుకువస్తే అందులో అర్థం వుంది. కాని, ఈ దేశపు విద్యను ఆధునికీకరించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏమిటీ అనే విషయం మనం ఇప్పటికీ చర్చించలేదు. పరదేశపు విశ్వవిద్యాలయ పద్ధతులలోనే, తెలుగులోను, సంస్కృతంలోను, ఎమ్.ఏ.లూ, పిహెచ్.డీలూ కావాలనే పట్టుదలతో మనం ఏర్పరిచిన శాఖలు ఇటు సాంప్రదాయిక విద్యకీ దూరమయాయి, అటు ఆధునిక విద్యకీ దగ్గరకాలేదు. ఇలా ఎందుకు జరిగిందన్న విషయంలో ఆలోచనా పూర్వకమైన చర్చలు జరగాలి. ఈ దేశపు సాంప్రదాయిక విద్యలను ఆధునికీకరించడం కోసం ఏ విధమైన పద్ధతులు అనుసరించాలో, అలాంటి శాఖల్లో ఉద్యోగాలకు అర్హతలు ఎలా నిర్ణయిస్తే ఉపయోగకరంగా వుంటుందో మౌలికంగా యోచించాలి. ఒక పనికి రాని పిహెచ్.డి. చేసిన వ్యక్తికి యూనివర్సిటీ తెలుగు శాఖలో, అది అర్హత కాబట్టి, ఉద్యోగం ఇవ్వక తప్పని పరిస్థితి; సాంప్రదాయికంగా చదువుకున్న పండితుడికి డిగ్రీ లేకపోయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి, ఈ రెండూ ఇప్పుడున్న వ్యవస్థ మూలంగా ఏర్పడ్డవి. ఈ వ్యవస్థ వలసదేశాల మేధావుల్లో వుండే ఒక ఆత్మన్యూనతాభావం వల్ల ఏర్పడింది. ఈ న్యూనతాభావం మనలో ఉండబట్టి… మనం మారలేకపోతున్నామని నా అనుమానం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా- మనకున్న పాత సంప్రదాయమంతా గొప్పదే, అంచేత గురుకులాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని నేను కోరడంలేదు. మన విద్యల్ని ఆధునికీకరించడానికి మనకు నప్పే పద్ధతుల్ని అన్వేషించాలి. గుడ్డిగా అనుకరించనూ కూడదు. మనదంతా గొప్పదని పిచ్చిగా నమ్మనూ కూడదు. చివరిగా ఓ మాట చెప్పనివ్వండి – జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.