కోటిగాని కతలు: శ్రీశైలంలో సన్యాసి

పొద్దున్నే తయారై శ్రీశైలం పోతున్నామని ఇళ్ళల్లో డబ్బులిప్పించుకుని, తలా ఒక జత బట్టలు, తువ్వాలు పెట్టుకుని బయలుదేరారు కోటీ, మల్లి, వెంకీ. దానికి అంతకుముందు వారం రోజులుగా ప్లాను చేసుకుని ఇళ్ళల్లో నసపెడుతూ, ఇంట్లోవాళ్ళని బతిమిలాడుతూ చివరికి సాధించారబ్బా.

వాళ్ళ ఊరినించి శ్రీశైలం పోవడానికి రెండు దోవలున్నాయి. గొల్లపల్లి దాకా నడిచిపోయి అక్కడ ఏ బస్సో లారీయో పట్టుకుని కుంట దగ్గర దిగి, అక్కడ దోర్నాల దాకా పోయే బస్సెక్కి అక్కడ దిగాక శ్రీశైలం పోయే బస్సెక్కడం. రెండోది, వెల్లంపల్లి దాకా నడిచిపోయి అక్కడ లారీ లేదా బస్సు ఎక్కి కుంట దగ్గర దిగి దోర్నాల బస్సెక్కి అక్కడ దిగాక శ్రీశైలం వెళ్ళే బస్సెక్కడం. అయితే ఈ రెండు దోవల్లోనూ గుండ్లకమ్మని దాటిపోవాలి. గొల్లపల్లి దగ్గర అయితే గుండ్లకమ్మకి, దాన్ని దాటిపోయే కాలిబాట మారిపోతూ ఉంటుంది. వెల్లంపల్లి దగ్గర అయితే తోపుడెక్కువ.

ఈసారి వెల్లంపల్లి మీదుగా పోవడానికి నిర్ణయించుకుని ఆ దోవలో నడిచి పోవడానికి బయలుదేరారు. దారిలో ఊరివాళ్ళు నలుగురు అడివి పందిని పట్టి గుంజలకి కట్టి భుజాల మోసుకుపోతూ ఎదురొచ్చారు. ముందు రోజు అడివికి పోయి బాంబులు పెట్టి వస్తారు, అడివి పందులు తిరిగే చోట. అవి వాటి దగ్గరికి వెళ్ళి తినే పదార్ధమేదో అనుకుని కొరికితే ఆ బాంబు పేలి చచ్చిపోతుంది పంది అక్కడికక్కడే. మరుసటి రోజు ఊళ్ళో వాళ్ళు అడివికి పోయి తెచ్చుకుంటారు దాన్ని.

“అరే, శవం ఎదురొస్తే మంచిది రా” అన్నాడు మల్లిగాడు.

“రేయ్, శవం అంటే మనిషి శవం రా” అన్నాడు కోటిగాడు.

“హహ్హహ్హా!” అందరూ నవ్వుకున్నారు.

పిట్టల్నీ, గిజిగాడి గూళ్ళని, ఎండుగడ్డి పరకలు వేలాడుతోన్న తుమ్మ చెట్లనీ, అక్కడక్కడా తెట్టె గోడలని, అవి లేని చోట జంకులని, పొలాలనీ చూసుకుంటూ మట్టి రోడ్లనీ, గుండ్లకమ్మనీ దాటుకుంటూ చేరుకున్నారు బస్సు వచ్చే చోటుకి. ఓ అరగంట చెట్టు నీడకి నిలబడి మాట్లాడుకుంటుండగానే రయ్యిమని ఎర్ర దుమ్ము పోసుకుంటూ బస్సు వచ్చేసింది. ముగ్గురూ సర్దుకు కూచున్నారు. టిక్కెట్లు కొట్టించుకోవడం అయిపోయింది ఆ తరవాత.

“రేయ్, ఏదైనా సినిమా కత చెప్పరా” అనడిగాడు మల్లిగాడు కోటీని.

తాను ఈమధ్యే ఒంగోల్లో చూసొచ్చిన కొండవీటి దొంగ సినిమా ఎత్తుకోని వైనవైనాలుగా చెప్పడం మొదలుపెట్టాడు కోటిగాడు. సినిమా కతలు చెప్పమంటే యమాజోరు కోటిగానికి. స్టోరీ అయిపోతూండగానే కుంట వచ్చేసింది. అక్కడ ఎక్కువ వెయిటింగు లేకుండానే దోర్నాల పోయే బస్సు వచ్చేసింది. కిక్కిరిసిపోయి ఉంది. వీళ్ళకి సీట్లు దొరకలా. కండక్టరు మా ఒడుపుగా అందరిమధ్య దూరిపోతూ టిక్కెట్లు కొట్టేసి తన సీట్లో దర్జాగా కూచున్నాడు. కోటీ, మల్లీ, వెంకీలు ముగ్గురూ ఒక దగ్గిరగా ఒత్తుకు నుంచుని కబుర్లు మొదలు పెట్టేసేరు.

‘పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ’

కోటిగాడు పల్లవందుకోగానే, మళ్ళీ

‘పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ’

అని ఈసారి ముగ్గురూ గొంతు కలిపారు.

‘మౌనంలో పుట్టావా గీతిక
స్నేహంతో మీటావా మెల్లగ’

రొయ్ రొయ్ మని గాలి కిటికీలన్నింటినించీ వచ్చేసి పాటని ఎత్తుకుపోతోంది.

“రేయ్, ఏంట్రా ఆ పాటలు! చదువుకునే పిల్లలు గాదా మీరు?” వెనక నించి గర్జించారెవరో.

వెనక్కి తిరిగి చూస్తే పక్క ఊరి హెడ్మాస్టరు గారు, కడ్డీ పట్టుకుని వేళ్ళాడుతూ నిలబడి.

“రేయ్, హెడ్మాస్టర్లు బస్సులు గూడా ఎక్కుతారంట్రా?” గుసగుసగా అన్నాడు కోటిగాడు.ముగ్గురు గప్‌చిప్ అయిపోయి దోర్నాల వచ్చిందాకా మౌనస్వాముల్లాగా నిలబడిపోయారు. పక్కూరి హెడ్మాస్టరు దోర్నాల్లో దిగి ఊళ్ళోకి వెళ్ళిపోతూంటే హమ్మయ్య అనుకుని శ్రీశైలం పోయే బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. తొందరగానే వచ్చేసింది బస్సు. బస్సునిండా శివభక్తులే.

సీట్లు చిక్కించుకొని సర్దుకుని కూచున్నాక, “రేయ్,శ్రీశైలంలో స్వాములుంటారంట్రా. వాళ్ళు మునీశ్పపరులంటా. అడివిలో జపంజేస్తా ఉంటారంటా. మన పక్కనే ఉన్నా ఏమీ మాట్లాడరంటా. సోమీ అని పలకరించినా గమ్మున కుచ్చుంటారంట. మన జాతకం ఉన్నదున్నట్టు జెప్పే శక్తి ఉంటదంటగానీ మనం ఎంటబడి గుచ్చి గుచ్చి అడిగితేగానీ చెప్పరంట” అని చెప్పుకుపోయాడు మల్లిగాడు.

“అయితే మనం ఎట్టైనా ఒక స్వాములోరిని పట్టుకోని మన జాతకం జెప్పించుకోవాలి రా” అని వెంకిగాడు యమా ఆదుర్దా ప్రదర్శించాడు.

అవున్రా వెంటనే అర్జెంటుగా ఒప్పేసుకున్నాడు కోటిగాడు.

కిటికీల్లోంచి రయ్యిమని కొట్టింది గాలి. హాయిగా ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. కాసేపు గాలి పోసుకుంటూ గమ్ముగా కూచుని ఆ తర్వాత ఏమీ తోచక ఊరూ పేరూ కాయ సినిమా ఆడ్డం మొదలు పెట్టారు.

‘ర’

‘రామవరప్పాడు’
‘రామారావు’
‘రామ్ములక్కాయ’
‘రాముడు-భీముడు’

‘శ’

‘శంఖవరం’
‘శశిరేఖ’
‘శనక్కాయ’
‘శత్రువు’

“రేయ్,శనక్కాయ కాయంట్రా?”

“శనక్కాయ్ గాకుండా ఇంకో కాయి పేరు నీకుదెలిస్తే చెప్పరా?”

“శొంటి కాయ.”

“శొంటి కాయేంది రా? ఎక్కడన్నా చూశా?”

“ఆ! నీకు దెలీపోతే లేనట్టే రా?”

“ఒంటికొమ్ము శొంటికాయ అనేది విన్లా?”

“ఒరేయ్, ఒంటికాయ శొంటి కొమ్మురా!”

“హ హహ హ్హా”

“అధాట్న వచ్చిందిలేరా!పెద్ద నవ్వావ్ గాని.”

“ఒంటికొమ్ము శొంటికాయ! దీని మీనింగేందిరా?’

“మీనింగెవడికి దెల్సు రా? ఎవరో అంటంటే విన్నా.”

చెట్లు. పుట్టలు. పర పర గాలి. రైయ్ రైయ్యని ఉత్సాహం.

జ్ జ్ మని కుదిపే ఇంజను వేడి.

గోతాలు. సంచులు. సామాన్లు.
తల్లో పూలు. పంచెలు. పూల చీరెలు.
ముసలి గొణుగుళ్ళు. పడుచు పౌడరు గుబాళింపులు. తగువులు. వుడుక్కోడాలు.

సున్నిపెంటలో బస్సాగినప్పుడు మళ్ళీ ఎప్పుడు కదులుతుందా అని ఉక్కపోతల సణుగుళ్ళు.

ఆటల్తో,వాదులాటల్తో, ఎట్టకేలకూ శ్రీశైలం వస్తే, అబ్బా చేరుకున్నాం రా, అని దిగిపోయారు ముగ్గురూ.

గుడి దగ్గిరి సత్రంలో బక్కెట్లతో నీళ్ళు బట్టుకొని సుబ్బరంగా తల స్నానాలు చేసేసి తువ్వాళ్ళతో తలలు తుడుచుకొని తెచ్చుకున్న మంచి బట్టలు కట్టుకొని నీటుగా దువ్వుకొని ఫ్రెస్షుగా తయారై గుడి వైపుకి బయలుదేరారు.

“మాంచి సాదువును కనిపెట్టి ఎట్టైనా జాతకం జెప్పించుకోవాల్సిందే రా!”

“అవున్రా!”

“అవున్రా!”

“మొకం మాంచి తేజస్సుతో వెలిగిపోతా వుంటది రా అట్టాంటోళ్ళకి.”

“అవున్రా! మనం కాళ్ళమీదబడి బతిమిలాడితేగానీ చెప్పర్రా.”

మాట్లాడుకుంటూ జనసమ్మర్దంలో గుడి దగ్గిరికి వచ్చేసి చెప్పుల స్టాండులో చెప్పులు పెట్టుకుని గుడి వైపుకి నడిచారు. చెప్పుల స్టాండులో చెప్పులు పెట్టుకునేవాడు చెప్పులు కాజేస్తాడేమోనని చెప్పులు విడిచి ఇస్తుంటే లోపల కొంచెం భయం వెంకిగాడికి. అసలికే కొత్త చెప్పులాయే.

మల్లికార్జుని గుడి, భ్రమరాంబిక అమ్మవారి గుడి, పంచపాండవులు ప్రతిష్టించిన శివలింగాలు, వృద్ధ మల్లికార్జున లింగము అన్ని చూసుకుంటూ, ప్రతి గుళ్ళో విబూది, కుంకుమ భక్తిగా తీసుకొని మొహానికి అద్దుకుంటూ దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చారు.

చెప్పుల్దీసుకుని, జేబుల్లోంచి కర్చీపులు బయటికి దీసి చెమటలు తుడుచుకుంటూ రద్దీగా ఉన్న బాట గుండా నడుచుకుంటూ రోడ్డు మీదకొచ్చి సోడాలు తాగుదామని రోడ్డు పక్కన చెట్టు కింద ఆగున్న సోడా బండి దగ్గర మూడు గోలీ సోడాలు కొట్టించుకొని కొంచెం కొంచెం గుటకలు వేస్తూ నిలబడ్డారు. వడలిపోయిన మొక్కలకి నీళ్ళు దొరికినట్టు ప్రాణాలు కుదుటబడి హాయిగా అనిపించింది ఒక్కోళ్ళకీ.

గుటక వేస్తుండగా చెట్టు నీడకున్న పిట్టగోడ మీద కూచుని కనిపించాడో సన్యాసి.

కాషాయం రంగు బట్టలు.
అదే రంగు గుడ్డ జోలె.
తెల్లని గడ్డం.

కాలు మీద కాలు వేసుకుని పైకి ఎటో ఆకాశం వైపు చూస్తూ వేళ్ళతో లెక్కలు వేసుకుంటున్నాడు.

తల ఎత్తి సోడా తాగుతున్న కోటిగాడు కంటి అంచుతో ఆ సన్యాసిని చూసీచూడగానే మల్లిగాడిని గబుక్కున మోచేత్తో పొడిచి అటు చూడమన్నట్టు సైగ చేసేడు.

“రేయ్,మొకంలో ఆ తేజస్సు చూసినావా?” మల్లిగాడు కనిపెట్టేసినట్టు సంబరపడ్డాడు. ఆ మాటకు అవునౌనని రాష్ట్రపతి ముద్ర వేసేడు వెంకీ.

ముగ్గురూ గటగటా సోడాలు తాగేసి బండివాడికి డబ్బులిచ్చేసి ఆలస్యం చేస్తే వెళ్ళిపోతాడేమో అన్నట్టు తొందర తొందరగా పిట్టగోడ వైపుకి నడిచేరు.

అతనిప్పుడు తీరుబడిగా బాసిపట్ట వేసుకుని కూచుని చేత్తో అరికాలుని రుద్దుకుంటూ రోడ్డు మీది జనాలను పరిశీలనగా చూస్తున్నాడు.

మల్లిగాడు గబుక్కున సోడా బండి దగ్గిరికి పోయి సుయ్యిమని ఓ సోడా కొట్టించుకొని గభీల్న సాధువు ముందుకొచ్చి నిలబడి, “ఆరగించండి, సోమీ” అన్నాడు.

వెంటనే వెంకిగాడు గుసగుసగా “రేయ్,తినేటివైతే ఆరగించండి అంటార్రా” అని, సాధువు వంక తిరిగి వంగి దణ్ణం పెడుతూ పెద్దగా, “స్వీకారం చెయ్యండి సోమీ” అన్నాడు.

సాధువు గటగటా సోడా తాగేసి బ్రేవ్ మని తేంచి “అన్నదాతా సుకీబవా” అన్నాడు. సోడా కొట్టిస్తే అన్నదాతా అంటాడేదబ్బా అనుకున్నాడు కోటి గాడు.

“అన్నం పెట్టించాలా ఏవిరా సోమికి?” కోటిగాని చెవిలో మెల్లిగా అన్నాడు మల్లిగాడు.

“అదిగాదులేరా” విసుక్కునాడు కోటి.

సాధువు కళ్ళుమూసి జపం చేస్తూ కూచున్నాడు. ఎండ వేడిమి ఎక్కువౌతోంది. భక్తుల రద్దీ పెరిగింది. పూసల దండలు, రుద్రాక్షలు, దేవుడి పటాలు, చిన్న రాతి శివలింగాలు అమ్మే వ్యాపారస్తుల ధాటీ పెరిగింది.హోటళ్ళు పొగలు కక్కే ఇడ్లీలు, దోసెలు, పూరీలు వగైరా పలహారాలు పొయ్యి మీదనించి పళ్ళాల్లోకి వడ్డించి గల్లాపెట్టెలు గలగల్లాడించుకుంటున్నాయి.

ఇట్టాగాదని గబగబా పక్కనున్న కాకా హోటల్లో రెండిడ్లీలు కట్టించుకోనొచ్చి,”బక్షించండి సోమీ” అన్నాడు మల్లిగాడు.

“రేయ్,ఏందిరా నీ సినిమా లాంగ్వేజీ?” గుసగసగా అన్నాడు కోటిగాడు.

“సోముల్తో అట్టనే మరేదగా మాట్టాడాల్రా” అన్నాడు మల్లి మెల్లిగా.

ఇవేమీ పట్టించుకోకుండా సోమి పొట్లాం చుట్టున్న సన్నదారం తీసి పక్కనబెట్టి పొట్లాం విప్పి ఇడ్లీ ముక్క తుంపి శనక్కాయ చెట్నీలో ముంచుకొని తినడం మొదలెట్టేడు.రెణ్ణివిషాల్లో రెండూ తినేసి ఆ కాగితం పొట్లానికే చెయ్యి తుడుచు కొని కూచోగానే, మళ్ళా మల్లిగాడు పరిగెత్తిపోయి స్టీలు గ్లాసులో నీళ్ళు దీసుకోనొచ్చి “స్వీకారం జెయ్యండి సోమీ” అనగానే సోమి గ్లాసందుకొని గటగటా తాగేసి పొట్ట నిమురుకుంటూ “సుకీబవ! సుకీబవ!” అని అందరికీ జాయంటుగా ఆశీర్వాదం పడేసేడు.

అలా ఓ గంట గడిచింది.

సోమి ఏమీ చెప్పలా.
కదల్లా.
మెదల్లా.
ఆకాశంలోకి ఆకులవంక చూస్తూ కూచున్నాడు.

ఇంక లాభంలేదని నెమ్మదిగా కోటిగాడే ఎత్తుకున్నాడు.

చేతులు జోడించి, “స్వామీ, చెయ్యి చూసి జాతకం చెప్పండి, దయుంచి” అన్నాడు, దయుంచి అన్న పదం వేసినందుకు లోలోపల తనను తానే సెభాష్ అనుకుంటూ.

“నేను జాతకాలు చెప్పనురా అబ్బాయ్” అన్నాడు సాధువు చల్లగా తన మీసాలు దువ్వుకుంటూ.

‘ధూ! ఇడ్లీ సోడా వేష్టైపోయినాయి’ అనుకున్నాడు మల్లిగాడు. అనుకున్నదే తడవుగా గుచ్చి గుచ్చి అడిగితే గానీ చెప్పరన్న విషయం గుర్తొచ్చింది వాడికి.

తిట్టుకున్నందుకు మనసులోనే లెంపలు వేసుకుని, “అట్టంటే ఎట్ట సోమీ, ఇంకో మాట జెప్పు. పిల్లకాయలం” అని బతిమాలడం మొదలు పెట్టాడు చేతులు కట్టుకొని.

సాధువు చాలాసేపు ఏమీ మాట్లాడలా.

మల్లీ, వెంకీ, కోటీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాళ్ళ మీదబడి బతిమాలుడు వాయింపుకి జడిసి, వీళ్ళ గొడవ పడలేక, ఇంక తప్పదన్నట్టు, “నేనూ మీలాంటోణ్ణే రా. తలరాత ఈ శ్రీశైలానికి లాకొచ్చి ఈడ్నే నిలిపేసింది” అన్నాడు గాల్లోకి చూస్తూ.

ఆ మాట అని మౌనంగా ఉండిపోయేడు. ముగ్గురూ మొహమొహాలు చూసుకుంటూ నిలబడ్డారు.

“అయితే మీదేవూరు సోమీ?” దగ్గరగా జరిగి మెల్లిగా అడిగాడు వెంకి.

“నరసరావు పేట కాడ పల్లెటూర్రా” నిట్టూర్చాడు సాధువు.

“అయితే ఈడెందుకున్నావ్ సోమీ?”

“నా కొడుక్కీ నాకు ఆస్తి తగాదాలు వత్తే వంద రూపాయలు జేబులో పెట్టుకోని ఇల్లిడిచి కనిపించిన బస్సెక్కి గుంటూరు కాడో ఊళ్ళో దిగిపోయినా.”

“తరవాత ఏమైంది సోమీ?” మల్లిగాడి కొచ్చెను.

“అక్కడ వ్రుద్దాశ్రమంలో చోటు సంపాదించుకోని వంట పని, తోట పని, బజన్లు జేస్తా కాలచ్చేపం జేస్తా ఉంటే ఓమాటు శ్రీశైలానికి దర్సినానికి టూరు తీసుకోనొచ్చార్రా. అందరూ ఎళ్ళిపోయినా నాకీడ నచ్చి ఈడ్నే ఉండిపోయినా.”

గత జన్మ స్మృతిలా గుర్తు జేసుకోని, అంతలోనే హటాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అని గొణిగి చెట్టు గుబురుల్లోకి చూస్తూ గాల్లోకి దణ్ణం పెట్టేడు.

“మళ్ళెప్పుడూ ఇంటికిబోవాలనిపించలేదా సోమీ?”

ఆ కత విన్న కోటిగానికి దిగులేసింది.ఇల్లొదిలి ఎవరైనా ఎట్టెళ్ళిపోతారు అన్నది వాడి డౌటు.

“ఇంకెక్కడి ఇల్లురా. ఈడకొచ్చి నాలుగేళ్ళైతంది. అన్ని బందాలూ తెంచుకున్న. మల్లన్నే నా బందువు. నమశ్శివాయ! నమశ్శివాయ!” అన్నాడు కళ్ళు సగం మూసి.

“మరి ఈడుండిపోతే తిండీ తిప్పలు ఎట్టా స్వామి?” చిన్నగా జోలెలోకి తొంగిచూస్తూ అడిగాడు మల్లి.

“శ్రీశైలంలో తిండికి కొదువేముంది రా. పొద్దున్నే సత్రాల్లో మిగిలిన అన్నం తెచ్చుకుంటాం. ఇంక పగలంతా బక్తులు ఇచ్చే చిల్లర పైసలొస్తాయి. టీ,టిఫిను కర్చులు ఎళ్ళిపోయినా ఇంకా మిగులుతది.”

ముగ్గురూ సాధువుకి దగ్గిరికి జరిగి చెవులు రిక్కించుకోని వింటున్నారు.

“సంవచ్చరానికో మాటు బస్తాలనిండా చిల్లర పైసలు పోసుకొని పెద్ద సేట్లు వత్తార్రా. సంవచ్చరమంతా వాళ్ళ యాపారంలో పక్కన తీసిపెట్టుంచిన చిల్లరంతా బస్తాలకి పోసుకోని శ్రీశైలానికి దెచ్చి నాలాటోళ్ళకి పంచిపెడతారు. అప్పుడొచ్చేది ఎక్కువుంటది రా.”

“ఎంత ఉంటది సామీ?” మల్లిగాడికి తెలుసుకోవాలని ఆత్రం పుట్టిపోయింది. వాళ్ళ నాయిన ఎప్పుడడిగినా అర్ధ రూపాయి మించి ఇయ్యడు.

“మనదృష్టం రా. ఆళ్ళొచ్చినప్పుడు నాలాంటోళ్ళమంతా వరసగట్టి నిలబడి జోలెబడితే మగ్గుతో పోస్తార్రా. అయిదు పైసలు, పది పైసలు, పావలాలు, అర్ధ రూపాయి, రూపాయిలు అన్ని కలగాపులగం. ఎక్కువ పెద్ద నాణేలు బడితే ఎక్కువ మొత్తం అయ్యిద్ది. ఒక్క సంవచ్చరం ఏమో ఎంచి సూస్కుంటే నా తోటోళ్ళకన్నా నాకే రూపాయి బిళ్ళలు ఎక్కువ బడ్డాయిరా” మెరుస్తున్న కళ్ళతో నెమరేసుకున్నాడు.

“అయితే ఆ డబ్బులన్నీ ఎప్పుడూ దగ్గరబెట్టుకోని తిరిగాలంటే కష్టంగా సామీ?” అడిగాడు కోటిగాడు. ఎక్కడ పడిపోతాయో అని జేబులో డబ్బుల్ని మధ్య మధ్యలో తడిమి చూసుకునేది వాడి అలవాటు.

“మా కాడుంచుకోం రా. ఏ చెట్టు కిందో,అరుగుల మీదో నడువోల్చేవోళ్ళం. మేవేడ పెట్టుకుంటాం. ఈడ కొట్లు నడిపే నమ్మకస్తులైన యాపారస్తుల్దగ్గర పెడతాం. కావాల్సొచ్చినప్పుడు అడిగి దెచ్చుకుంటాం” తృప్తిగా చెప్పుకుపోతున్నాడు.

హాయిగా గాలి కొట్టింది.

“హర హర మహదేవ! సెంబో సెంకర!” ఒక బాచీ భక్తులు అరుచుకుంటూ ఊరుక్కుంటూ గుడి వైపుకి పోతున్నారు.

ఎండ వేడిమి ఎక్కువౌతోంది. ఉండుండి గాలి. అంతలోనే ఉక్కపోత.

నిమ్మతొనలు అమ్మే అబ్బి ఒకడు ఎండకి చెట్టు కిందకొచ్చి నిలబడ్డాడు. సోడాలకొచ్చినోళ్ళు నిమ్మ తొనలు కొనకపోతారా అని చూస్తూన్నాడు. చెట్టు మీద కాకులు కావ్ కావ్ మన్నాయి. కోటీ మల్లి వెంకీ తలా నాలుగు నిమ్మతొనలు కొని మిగతావి జేబుల్లో వేసుకోని ఒకటి నోట్లో వేసుకొని బుగ్గన బెట్టుకున్నారు.

“నిమ్మ తొన బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే బెటర్రా. నాలిక మీద పెట్టుకొని చప్పరిస్తుంటే ఫస్ట్లో బానే ఉంటది తర్వాత నాలిక మంటపుట్టిపోద్ది చూస్కో!”అని మిగిలినవాళ్ళకి జ్ఞానబోధ చేసేడు వెంకీ నోట్లో ఉన్న నిమ్మతొనని రెండో బుగ్గకి మార్చుకుంటూ.

ఈ లోపల సన్యాసి రొంటిన దోపుకున్న పొగాకు కాడ తీసి చుట్ట చుట్టుకుని కాలుస్తూ గుప్పుగుప్పున పొగలు వదలడం మొదలుపెట్టాడు.

“ఈ కాషాయం బట్టలేడగుట్టించుకున్నావ్ సోమీ?” వెంకీగాడికి కాషాయం బట్టలు ఏ షాపులో దొరుకుతాయా అని ఎప్పుడూ బలే ఆశ్చర్యం.

“రెండు జతలు ఆశ్రమం ఓళ్ళే ఇచ్చినార్రా. ఆటితోనే చానాకాలం బండి లాగించినా. ఈ మద్యే ఇంకో జత కుట్టించినా టైలరు కాడ. గుడ్డ ఆడే తెత్తాడు” అని జోలెలోంచి తాను కుట్టించుకున్న కొత్త జత తీసి ఆనందంగా చూపించాడు.

“అయితే సోమీ, మాకు తపస్సు జేసే మునీశ్పరులు కావాల సోమీ. మేం చెయ్యి చూపించుకొని జాతకం జెప్పించుకోవాల” ఇంకో సోమిని జూస్కోవాలని మనసులో అనేసుకుని అడిగాడు మల్లిగాడు.

“అట్టాంటోళ్ళు ఉంటార్రా. అడవుల్లో. వెతికి పట్టుకోవాల. శ్రీశైలం గుడికొచ్చినా వోళ్ళంతట వోళ్ళు చెప్పాలగానీ మనం అడిగితే చెప్పర్రా. అయినా పిలకాయల కెందుకురా జాతకాలు. ఇంకా చానా బతుకుండాది. ఇంకా ఎన్ని జూడాలో?” అంటూ జాలిగా ముగ్గురివంకా చూసి మళ్ళా ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అనుకుంటూ కళ్ళు మూసి దమ్ము లాగాడు.

ముగ్గురికీ ఏమీ పాలుబోలా.

“అయితే సోమీ, తమరుగారు ఎప్పుడూ అడివికి పోలేదా సోమీ?” చాలా మర్యాదగా అడిగాడు కోటి.

“అడివిలోకి పోతాం రా అప్పుడప్పుడూ. ఎప్పుడైనా కోడి కూర తినాలనిపిస్తే పోతాం” అని పొగాకు పొగలోంచి చిన్నగా నవ్వాడు సన్యాసి.

“కోడి కూరా?” నోరెళ్ళబెట్టాడు మల్లిగాడు.”ఎట్టా వండుతారు సోమీ అడివీలో?”

సన్యాసి కాసేపు గమ్మునైపోయాడు. అసలీసంగతి చెప్పకుండుండాల్సిందే అన్నట్టు కొంచెం పశ్చాత్తాపం మొహం బెట్టుకుని కూచున్నాడు. సరే కానీలే ఇన్ని సంగతులు జెప్పాం గదా అన్నట్టు,చిన్న పిలకాయలే గదా అన్న ధీమాతో,మళ్ళా రెండు దమ్ముల్లాగి,

“నాలాంటోళ్ళు చానా మందివి ఉన్నాంరా. అడివిలో ఆడో బండ కింద కొన్ని గిన్నెలు, కంచాలు దాపెట్టుంచాం. ఎప్పుడైనా తెల్సినోళ్ళకి డబ్బులిచ్చి కోడ్ని దెచ్చుకుంటాం. బియ్యం, ఉప్పు పప్పు దీసుకోని అందరం ఆడికి బోయి రాళ్ళ పొయ్యి బెట్టుకోని వండుకోని తినేసొస్తాం” అన్నాడు లోగొంతుకతో అటూ ఇటూ పరిశీలించుకుంటూ.

“కోడినెట్టా తీసకబోతారు సోమీ?” ఆశ్చర్యంగా అడిగేడు వెంకీ.

సన్యాసి నవ్వి, “సంచిలో బెట్టి సంకలో బెట్టుకోని పోతాం రా” అన్నాడు.

“ఇంక పోదాం రా. బస్సుకి టైమైతుంది” చిన్నగా అన్నాడు కోటిగాడు. ఇంకచాల్లే అనిపించింది వాడికి. మహిమలు ఏమీలేని సోమి తగిలాడని అర్ధం అయింది వాడికి.

మల్లి, వెంకీ తలకాయలు ఆడించి సన్యాసి వైపు తిరిగి, “ఇంక పోయొస్తాం సోమీ” అన్నారు.

“పోయిరాండి. మంచిది! సుకీబవ! సమస్త సన్మంగలాని బవంతు!” అన్నాడు సన్యాసి చెయ్యెత్తి.

అంతలోనే ఆగమని సైగచేసి జోలెలోంచి వీబూది ఉండ ఒకటి పైకి తీసి ఉంచుకోమని ఇవ్వబోతే కోటిగాడు అందుకుని కళ్ళకి అద్దుకున్నాడు.

ముగ్గురూ వీబూది నుదుటి మీద రాసుకుంటూ మూడడుగులు ముందుకేసి మళ్ళా వెనక్కొచ్చి అర్ధ రూపాయి సన్యాసి చేతిలో పెట్టారు.

“వీబూదుండకి డబ్బులా?” అని నవ్వి “వద్దురా! జారత్తగా ఇళ్ళకి బోండి” అని చెయ్యి ఊపాడు.

ముగ్గురూ హోటెల్లో ప్లేట్ మీల్స్ చేసేసి బయల్దేరారు. వెంటవెంటనే బస్సులు దొరికేశాయి. బస్సుల్లో సీట్లు కూడా ఇరుక్కుని కాకుండా హాయిగా విశాలంగా కూచునేటట్టు దొరికాయి. కోటిగానికి దోర్నాల్లో రోడ్డు మీద ఎవరో పారేసుకున్న అయిదు రూపాయల నోటు దొరికింది. మల్లికి కుంటలో దిగి నడుస్తుంటే ఇసకలో పావలా కాసు దొరికింది. రాత్రికి ఊరికి చేరుకున్నారు అందరూ.

ఊళ్ళోకి నడుస్తూండగా కోటిగాడన్నాడు, “రేయ్,మన జాతకం జెప్పమంటే తన జాతకం జెప్పాడేంది రా.”

“రేయ్, చూశా? సోమిచ్చిన వీబూదుండ పెట్టుకుంటే మన ప్రయాణం ఎంత సుకంగా అయిపోయింది. డబ్బులు కూడా దొరికినాయి గదరా. ఇంతకీ మనం గుచ్చి గుచ్చి అడగలేదురా. అందుకే ఏదో స్టోరీ చెప్పి పంపేశినాడు” అన్నాడు వెంకిగాడు.

“అవున్రా. ఈసారి శ్రీశైలం బోయినప్పుడు సోమి గనపడితే గట్టిగా గుచ్చి అడగాల. జాతకం చెప్పిందాకా వదలగూడదురా” మల్లిగాడు నిశ్చయంగా అన్నాడు.

అప్పటికే ఊళ్ళో వాళ్ళు రోడ్డు మీద నులక మంచాలు, నవారు మంచాలేసుకుని, దోమ తెరలు కట్టుకుని, నీళ్ళ చెంబులు మంచాల కింద పెట్టుకుని సగం నిద్దర్లలో ఉన్నారు.

మల్లి వెంకీలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళవైపుకి పోయాక, కోటీ, వాళ్ళు చెప్పేది అవునా కాదా అని ఆలోచనలో పడి ఇంటి వైపుకి నడుస్తూ ఉంటే కీచురాళ్ళ సద్దులు, ఊర కుక్కల మొరుగుళ్ళు.