ఊరెళ్ళి రాగానే పిడుగులాంటి వార్త వినాల్సొచ్చింది.
సిగరెట్ కంపెనీ రాజు పోయాడని గడియారస్థంభం సెంటర్లో ఎవరో అనుకుంటూండగా విన్నాను. పొలం పనుల పనిమీద ముమ్మిడారం వెళ్ళి అక్కడే రెండ్రోజులుండాల్సి వచ్చింది. నిన్న పోతే ఇంతవరకూ నాకెవరూ చెప్పలేదేవిటి? ఆ వార్త విని గుండె బద్దలయ్యింది. వెళ్ళాల్సిన పని ముగించకుండానే హుటాహుటిన ఇంటి ముఖం పట్టాను. సావిత్రి కూడా నాతో ఏమీ అనలేదు. ఆశ్చర్యంగా ఉందే?
ఇంట్లో అడుగుపెడుతూనే – “సావిత్రీ రాజు పోయాడట!” అని కంగారుగా అన్నాను.
“అవును తెలుసు! నేనూ నిన్న రాత్రే విన్నాను,” అనేసి తన పనిలో మునిగిపోయింది.
“అదేవిటి నాతో మాటవరసకయినా చెప్పలేదు?” కోపమూ, చికాకూ రెండు ఒకేసారి ధ్వనించాయి నా గొంతులో. చెప్పాల్సినంత పెద్ద విశేషమా అన్నట్లు నాకేసి చూసింది. దాంతో కోపం పెరిగిపోయింది నాలో! కళ్ళెర్ర జేస్తూ చూశాను.
“ఏం చెప్పాలి? నా పెనిమిటి ప్రాణాలకి ముప్పు తెచ్చాడని ఆనందంగా చెప్పాలా? వాళ్ళకీ మనకీ సంబంధం లేదు. తెలుసున్నా కావాలనే చెప్పలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించినంతవరకూ నాకేదీ ముఖ్యం కాదు,” గట్టిగానే అంది.
“ఎంతయినా వాడు నా స్నేహి…” దుఃఖం పెల్లుబికి మాటలు రాలేదు.
“మనకి చేసిన అన్యాయానికి దేవుడు బాగానే శాస్తి చేశాడు. చెడ్డవాళ్ళని ఎలా శిక్షించాలో ఆ దేవుడికి బాగా తెలుసు. వాడు మీ గుండె మీద కొడదామనుకుంటే దేవుడు వాడికి కేన్సరుతో జవాబిచ్చాడు,” అంటూ కోపంతో కసిగా అంది.
ఒకప్పుడు రాజుని అన్నయ్యా అంటూ పిలిచిన సావిత్రేనా? వాడూ, వీడూ, శాస్తీ అంటూ శాపనార్థపు మాటలు మాట్లాడుతున్నది. అంత బాధలోనూ నవ్వొచ్చింది.
రాజూ, నేనూ చిన్నప్పటి నుండీ స్నేహితులం. వాళ్ళది గంగలకుర్రు. మాది బండార్లంక. ఇద్దరం అంబాజీపేట హైస్కూల్లో కలిసి చదువుకున్నాం. రాజు తండ్రీ, మా నాన్నకీ దూరపు చుట్టరికం ఏదో ఉందని చిన్నప్పుడు విన్నాను. నిజానికి మా ఇద్దరి స్నేహం వలనే కుటుంబంలో పలకరింపులుండేవి. నేనూ, రాజూ కాకుండా మాతో పాటు గోపాలం కూడా ఉండేవాడు. గోపాలం మా జట్టులో తరువాత చేరాడు. చిన్నప్పటి స్నేహం అలా చిగురించి పెళ్ళయి పెద్దయ్యే వరకూ సాగింది. హైస్కూలు వరకూ సాగిన మా స్నేహం కాలేజీకొచ్చాక పూర్తిగా తెగిపోయింది. నేను అమలాపురం ఎస్.కే.బి.యార్ కాలేజీలో చేరితే, గోపాలం కాకినాడ వెళిపోయాడు. రాజుని వాళ్ళ నాన్న రాజమండ్రీ కాలేజీలో చేర్చాడు. పండగలకీ, శలవలకీ వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళం. డిగ్రీ అయ్యాక నేను బి.ఇడీలో చేరాను. రాజు బీ.కాం పరీక్ష పోయిందనీ విన్నాను. ఆ తరువాత వాణ్ణి ఓ అయిదారేళ్ళు కలవలేదు.
నేను ఎలిమెంటరీ స్కూల్లో బడిపంతులుగా చేరితే, గోపాలం ఆర్.ఎం.పీ డాక్టరుగా అమలాపురం వచ్చాడు. నేను పిల్లల చదువు కోసం అమలాపురంలోనే కాపురం ఉండేవాణ్ణి. గోపాలం అమలాపురంలో మరో డాక్టరుతో కలిసి ప్రాక్టీసు పెట్టాడు. రాజుని కలవకపోయినా అప్పుడప్పుడు వాడి కబుర్లు తెలిసేవి. బెజవాడలో చిన్న వ్యాపారం చేస్తున్నాడనీ విన్నాను. నా పెళ్ళికి శుభలేఖ వేద్దామని గంగలకుర్రు వెళితే వాళ్ళ కుటుంబం కూడా బెజవాడ మకాం మార్చారని తెలిసింది. పెళ్ళయ్యాక సంసార బాధ్యతల్లో పడ్డాక మా స్నేహం పూర్తిగా సన్నగిల్లింది. అమలాపురం నేనొచ్చిన ఆరేళ్ళకి గోపాలం వచ్చాడు. వాడికీ పెళ్ళయ్యింది. ఇద్దరు కూతుళ్ళు. ఎప్పుడైనా కలిస్తే చిన్ననాటి కబుర్లు నెమరువేసుకునే వాళ్ళం.
మా ఆవిడ పేరన పెళ్ళి కట్నంగా మా మావగారు ఠాణేలంకలో మూడెకరాలు పొలం నాకిచ్చారు. అది కౌలుకి ఇచ్చి అప్పుడప్పుడు పొలం చూసుకోవడానికి వెళ్ళేవాణ్ణి. ఓ సారి ముమ్మిడారం పొలం పని మీద వెళ్ళినప్పుడు బస్టాండులో రాజు కనిపించాడు. వాణ్ణి గుర్తుపట్టి నేనే పలకరించాను. గెడ్డాలూ అవీ పెరిగిపోయి చూడ్డానికి పేషంటులా ఉన్నాడు. వాడికీ పెళ్ళయ్యిందనీ, నలుగురు పిల్లలనీ, వాళ్ళావిడ పుట్టింటారు కొత్తలంకనీ చెప్పాడు. ఏం చేస్తున్నావనీ అడిగితే ఏమీ చెయ్యడం లేదనీ పెళ్ళాం పిల్లల్ని పుట్టింట్లో వదిలేసి బెజవాడ వెళుతున్నాననీ చెప్పాడు. ఏ వ్యాపారమూ తనకి అచ్చి రాలేదనీ, ఉన్న కొద్దిపాటి ఆస్తీ హారతికర్పూరంలా హరించుకుపోయిందనీ, అప్పుల బాధ భరించలేక కోనసీమ వచ్చేశాననీ చెప్పాడు. అత్తారింటికి వచ్చి ఏడాది దాటిందనీ చెప్పాడు.
“మరి ఇన్నాళ్ళూ ఎందుకు కలవలేదేవిటి?” అని ప్రశ్నిస్తే తలదించుకున్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాక ఎవర్నీ కలవడానికి మనసు రాలేదనీ ఏడ్చాడు. వాడి గురించి అంతా విన్నాక నాకూ బాధ కలిగింది. అమలాపురంలో మా యింటికి తీసుకెళ్ళాను. నా భార్య సావిత్రి రాజు పేరు వినడమే కానీ వాణ్ణి ఎప్పుడూ కలవలేదు. పరిచయం చేశాను. సావిత్రి నా స్నేహితుడొచ్చాడని నాలుగైదు వెరైటీ వంటకాలతో పాటు పులిహోర కూడా చేసింది. భోజనం అయ్యాక వీధరుగు మీద కూర్చున్నాక ఒక్క సారి బావురుమని ఏడ్చాడు. సుష్టుగా భోజనం తిని ఏళ్ళయ్యిందనీ అన్నాడు. ఆర్థికంగా చితికి పోయాడు. రెండు మూడు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించాననీ, కానీ కుటుంబం రోడ్డున పడిపోతుందని మానేశాననీ చెప్పాడు. నాకు ఇక్కడ తెలుసున్నవాళ్ళ ద్వారా ఏదైనా పని చూస్తాననీ, వాడికి అభ్యంతరం లేకపోతే సూపరు బజారులో వాళ్ళావిడకి ఉద్యోగం ఇప్పించగలననీ, వాడినీ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోమనీ చెప్పాను. అప్పటికి గోపాలం ఇంకా అమలాపురం రాలేదు.
నన్ను కలిశాక రాజుకి ధైర్యం వచ్చింది. ఒక సిగరెట్టు వ్యాపారం చేస్తున్న భూషణం అనే ఆయన నాకు బాగా తెలుసు. వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ చెబుతాను. ఆయన దగ్గరకి రాజుని తీసుకెళ్ళి పరిచయం చేశాను. వాడి గురించి అంతా చెప్పి ఏదైనా సాయం చెయ్యమని చెప్పాను. ఆయన నా మాటమీద గౌరవం ఉంచి వాడికి కిళ్ళీకొట్లకి సిగరెట్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఏజంటుగా ఉద్యోగం ఇప్పించాడు. జీతం ఎంతయినా సరే ఒప్పుకోమన్నాను. మొదట్లో మా ఇంట్లో ఉన్నా, కొంత కాలం అయ్యాక కుటుంబాన్ని అమలాపురంలో మకాం మార్చాడు. ఇక రెండు గదులింట్లో అద్దెకుండేవాళ్ళు. అమలాపురం వచ్చినా రాజు కష్టాలు తీరలేదు. వచ్చే జీతంతో సంసారం గడవడం కష్టంగానే ఉంది. అడపాదడపా నేనూ సాయం చేసేవాణ్ణి. ఓ సారి సావిత్రి వాళ్ళింటికెళ్ళినప్పుడు రాజు పెళ్ళాం పిల్లలు గంజి తాగుతూ కనిపించరనీ ఇంటికి రాగానే నాకు చెప్పింది. వెంటనే ఒక బస్తా బియ్యం ఇంటికి పంపాను. నేను కౌలుకివ్వగా ప్రతీ ఏటా శిస్తుతో పాటు ఓ ఇరవై బస్తాల బియ్యం కూడా ఇస్తాడు. రాజు పరిస్థితి చక్కబడేవరకూ ప్రతీ నెలా నేను బియ్యం బస్తా పంపించే వాణ్ణి. రాజు భార్య కాంతం సూపరు బజారులో ఉద్యోగానికి కుదిరింది. సరిగ్గా అదే సమయానికి గోపాలం కూడా అమలాపురం రావడంతో వాడూ రాజుకి డబ్బు సాయం చేసేవాడు.
చిన్నతనంలో రాజుకి నేనంటే ఎంతో ఇష్టం. ఎప్పుడయినా స్కూలుకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం కుదరకపోతే తన తినడం మానేసి మరీ నాకిచ్చేవాడు. నాకు నీళ్ళంటే భయం. అలాంటిది నాకు కాలవలో ఈత కొట్టడం నేర్పాడు. ఎంతో ఆప్యాయంగా ఉండే మా స్నేహం చివరి దశలో ముక్కలయ్యింది. వాడు నాతో మాట్లాడి పదేళ్ళు దాటింది. ఎప్పుడయినా ఎవరి పెళ్ళిలో ఎదురుపడినా పలకరింపులు కూడా లేకుండా తల వంచుకెళ్ళే పరిస్థితి దాపురించింది. కారణాలు ఏమయితేనే వాడూ నాతో మాట్లాడడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. నేనూ ఆ పని చెయ్యలేదు. ఇక ముగ్గురం ప్రతీరోజూ సాయంత్రం కలిసే వాళ్ళం. మరలా మరలా చిన్ననాటి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఒక్కోసారి ఆ కబుర్లకీ అంతూ దరీ ఉండేది కాదు. కాలం తెలిసేది కాదు.
చిన్ననాటి సంఘటనలన్నీ గుర్తొచ్చి దుఃఖం ఆగలేదు నాకు. గోపాలం ఇంటికి వెళదామనుకొని చెప్పులేసుకుంటూండగా – “వాళ్ళింటికేనా?” అని చుర చురా చూస్తూ అంది సావిత్రి. వాళ్ళు అంటే రాజు అన్నమాట.
సమాధానం ఏమీ ఇవ్వకుండా వెనక్కి తిరుగుతూండగా – “అడుగుతున్నది, మిమ్మల్నే!” అని చికాగ్గా అంది. గోపాలం ఇంటికని చెప్పాను.
సావిత్రికి రాజన్నా, వాళ్ళ కుటుంబం అన్నా పీకల వరకూ కోపం. ఆవిడ కారణాలు ఆవిడకున్నాయి. అప్పట్లో నేనెంతో చెప్పి చెప్పి విసిగిపోయాను. నేను చెప్పడానికి ప్రయత్నించినా ఆవిడ వినడానికి ఎప్పుడూ సిద్ధంగా లేదు. గోపాలం ఇంటికెళ్ళాక వాడు ఇంట్లో లేడనీ అర్జంటుగా రమ్మనమని ఆసుపత్రి నుండి ఫోన్ వస్తే వెళ్ళారని గోపాలం భార్య లక్ష్మి చెప్పింది. నన్నూ, నా మొహాన్నీ చూడగానే ఆవిడకి నేనెందుకొచ్చానో అర్థమయ్యింది.
“మీకు తెలిసే ఉంటుంది. రాజు నిన్న మధ్యాన్నం మద్రాసు హాస్పిటల్లో పోయారట. ఈయన చెప్పారు! పాపం అంత పేరూ, డబ్బూ ఉండి చివర్లో కేన్సరు బారిన పడటం తలుచుకుంటే బాధేస్తుంది. మరీ అరవయ్యో పడిలో పడకుండానే పిట్టలా రాలిపోవడం అన్యాయం. కూతురి పెళ్ళయినా అయ్యింది. కొడుకులిద్దరికీ పెళ్ళీ అవీ ఇంకా కాలేదు. సంబంధాలు కుదిరాయనీ ఈయన చెప్పారు. పాపం! మద్రాసు నుండి శవాన్ని ఇక్కడకి రేపో ఎల్లుండో తీసుకొస్తారని విన్నాను,” అందావిడ.
నేనేమీ మాట్లాడే పరిస్థితిలో లేను. అవునన్నట్లు తలూపాను. ఆవిడికీ మా గురించి అంతా తెలుసు. వెనక్కి తిరిగి వెళిపోదామనుకుంటూండగా, “ఆయన వచ్చే వేళయ్యింది. భోజనం కూడా చెయ్యలేదు. ఒక్క నిమిషం ఉంటే ఆసుపత్రికి ఫోన్ చేస్తానుండండి. మీరొచ్చారని చెబుతాను,” అని అనడంతో అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను. కొంతసేపయ్యక ఆవిడ కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది.
“ఈయనా నిన్న రాత్రంతా నిద్రపోలేదు. మీ ఇంటికీ వెళ్ళాననీ చెప్పారు. మీ చిన్ననాటి విషయాలు కొన్ని చెప్పారు…” అంది.
“రాజుకి నేనంటే వల్లమాలిన ప్రేమండీ! వాడన్నా నాకు ఇష్టం. ఓ సారి ముక్తేశ్వరం గోదారిలో ఈతకొడుతూ నీళ్ళ ప్రవాహానికి ఊపిరాడక మునిగిపోతే రాజే నన్ను రక్షించాడు. మా స్నేహం ఇలా ముగుస్తుందనీ నేనూ ఊహించలేకపోయాను. సావిత్రికెందుకో వాళ్ళంటే పగా, కోపమూ…” విచారంగా అన్నాను.
“నాకూ తెలుసండీ! అయినా ఒకటి చెప్పమంటారా? డబ్బు మనుషుల్ని మారుస్తుంది. స్నేహాల్నీ, బంధుత్వాలనీ కూలదోస్తుంది. సావిత్రిగారి కోపంలో అర్థం లేకపోలేదు. ఆవిడ పరిస్థితిలో నేనున్నా అలాగే ఆలోచిస్తానేమో? గంజిక్కూడా నోచుకోని వాళ్ళు ఇంత సంపద పొందారంటే ఎవరు కారణమో రాజుగారికి తెలీదా?” అందావిడ.
రాజు భూషణంగారి దగ్గర సిగరెట్ డిస్ట్రిబ్యూటర్ పనిలో కుదిరాక వాడి యజమాని భూషణం హఠాత్తుగా పోయాడు. భూషణానికి పిల్లల్లేరు. దాంతో ఆ వ్యాపారం తను చెయ్యాలనుకున్నాడు రాజు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆ సమయంలో నేనే లక్ష రూపాయిలు ముదుపు పెట్టి వాడి చేత వ్యాపారం పెట్టించాను. ఏ ముహుర్తాన వాడా వ్యాపారం మొదలు పెట్టాడో కానీ చూస్తూండగా లక్షల్లో పెరిగిపోయింది వాడి ఆదాయం. రాజు కూడా చాలా కష్టపడ్డాడు. చూస్తూండగా అమలాపురంలో పెద్దిల్లు కొన్నాడు. ఏడాది తిరక్కుండానో మరో మేడ కట్టాడు. ఊరంతా వాడి పేరు మార్మోగిపోయింది. కష్టాలకి అయిన వారు వుండనట్లుగానే, సంపదలకి అందరూ సన్నిహితులే! రోడ్డు మీద సిగరెట్ సంచులతో సైకిలు మీద వెళ్ళే రాజు ప్రిమియర్ పద్మినీ కారు స్థాయికి ఎదిగాడు. రోటరీ క్లబ్బు ప్రెసిడెంటయ్యాడు. డబ్బున్న వాళ్ళ గుంపులో అతి ముఖ్యమయిన వ్యక్తిగా ఎదిగాడు. ఇదంతా అయిదారేళ్ళలోనే జరిగిపోయింది.
ఎంత డబ్బొచ్చినా వాడి అదృష్టానికి కారణం నేనే అన్న గౌరవంతోనే నాతో మసిలేవాడు. వ్యాపారంలో ఏ కొత్త పెట్టుబడి పెట్టాలన్నా నా దగ్గరకొచ్చి – “ఒరే! సూర్యం! ఓ అయిదు వేలు అప్పివ్వరా? కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా?” అనేవాడు. వాడు నా దగ్గర మామూలుగానే ఉండేవాడు. కానీ వాడి భార్య ప్రవర్తనలోనూ, తీరులోనూ మార్పొచ్చిందనీ సావిత్రి తరచూ ఆరోపణలు చేసేది. నేనెప్పుడూ పట్టించుకునేవాణ్ణి కాదు.
“ఏం చేస్తాం లేండి? ఎంతో కష్టపడి పైకొచ్చాడు. దురదృష్ట వశాత్తూ కేన్సరు బారి పడ్డాడు. పైగా గొంతు కేన్సరని విన్నాను,” నా కళ్ళల్లో సన్నటి నీటి పొర ఆవిడ గురించినట్లుంది.
“ఎంతయినా చిన్ననాటి నేస్తాలు కదా? ఆమాత్రం ఉంటుంది లెండి! అహాలు పెరిగి బంధాలు చెడినంత మాత్రాన ఆపేక్షలు పోతాయా?…” అంటూ ఆవిడ ఇంకా ఏదో చెప్పబోతూండగా ఫోన్ రింగయితే చటుక్కున కుర్చీలోంచి లేచి వెళ్ళిందావిడ. గోపాలం ఫోనని అర్థమయ్యింది. ఆవిడ నన్ను మాట్లాడ్డానికి రమ్మని ఫోను చేతికిచ్చింది.
“ఒరేయ్ గోపాలం… రాజు గాడు…” మాటలు పెగల్లేదు. అవతల వాడి గొంతూ అంతే!
“ఒరేయ్ సూర్యం! ఎమ్మెల్యేగారికి మైనర్ స్ట్రోక్ వచ్చింది. అర్జంటుగా కాకినాడ తీసుకెళ్ళాలి. నన్నూ కూడా ఉండమని అడిగారు. నేను సరాసరి వెళతాను. రాజు శవాన్ని ఎల్లుండి తీసుకొస్తారట. ఈలోగా నేనొచ్చేస్తాను. సారీ రా! తప్పదు, వెళ్ళాలి,” అంటూ దిగాలుగా చెప్పాడు.
వాడికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటికొచ్చేశాను. తలనొప్పిగా ఉందంటూ పడుకుండి పోయాను. నిద్ర వచ్చి చస్తే కదా? రాత్రంతా రాజు గాడి ఆలోచనలే! కాలవగట్టున తిరిగిన ఆటలూ, కాలవలో కొట్టిన ఈతలూ ఒకటేవిటి, ముప్పయ్యేళ్ళ జీవితం కళ్ళముందు గిర్రున తిరిగింది.
ఆ మర్నాడే రాజు శవాన్ని తీసుకొచ్చారని తెలిసింది. ఊరంతా వెళ్ళారని విన్నాను. నేనూ వెళ్ళి ఆఖరి చూపు చూద్దామనుకొని బయలుదేరుతూండగా సావిత్రి అడ్డుపడింది.
“మీకేవయినా మతి చలించిందా? మనకీ మన కుటుంబానికీ ముప్పు తెచ్చిన వాడు పోతే, ఏం చూసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు? మీరు హాస్పిటల్లో హార్టెటాక్ వచ్చినప్పుడు ఏడ్చింది మేము. వాడు కాదు. కనీసం చూడ్డానిక్కూడా రాలేదు. మనవంటే వాళ్ళకంత కక్షగా ఉంటే మీరు టింగురంగా అని పరామర్శకెళుతున్నారా? కనీసం కూతురు పెళ్ళికి పిలవలేదు. అంతెందుకు గృహాప్రవేశానికి పిలిచాడా? ఫ్రెండూ, ఫ్రెండూ అంటూ తెగ తాపత్రయపడిపోతున్నారు? తాటికి రెండు వైపులా బిగి ఉన్నప్పుడే అది నిలుస్తుంది. మీతో వాళ్ళకి పని లేదు. మీరు వెళ్ళడం మాత్రం నాకస్సలు ఇష్టం లేదు,” అంటూ ఆవేశంగా అంది.
మనిషితో పాటే ఆపేక్షలూ, ఆత్మీయతలూ, కక్షలూ, కార్పణ్యాలూ అన్నీ పోతాయి. అదే చెప్పాను. అయినా సావిత్రి మొండిగా వాదించింది. సావిత్రిని అర్థం చేసుకోగలను. కానీ నాకూ, రాజుకూ ఉన్న స్నేహం ఆవిడకి తెలీదు. ఎన్నో క్షణాలూ, ఆనందాలూ ఊహ తెలిసినప్పటి నుండీ పంచుకున్నాం. అవన్నీ ఒక్క సంఘటనతో తుడిచేయలేను.
పదేళ్ళ క్రితం నాటి మాట.
ఠాణేలంకలో పొలం చూడ్డం కష్టం అయ్యి అది అమ్మేశాను. అది అమ్మగా వచ్చిన డబ్బుతో అమలాపురంలో ఇల్లు కట్టుకోవాలని నా కోరిక. ఒక లాయరు కాలేజీ దగ్గరలో ఉన్న రెండెకరాల మామిడి తోట అమ్మకానికి పెట్టరని తెలిసింది. కొందామని గోపాలాన్ని అడిగాను. కొనమనీ, వీలయితే తనూ అక్కడే ఇల్లు కడతాననీ అన్నాడు. మొత్తం మూడు లక్షలకి బేరం కుదుర్చుకున్నాం. కానీ ఆ రోజు మంచి ముహూర్తం కాదని తెలిసి మర్నాడు ఉదయం వచ్చి సంతకాలు పెడదామని మాట్లాడుకున్నాం. కొంత అడ్వాన్సు కూడా ఇచ్చాను. మర్నాడు నేనూ, గోపాలం వెళ్ళేసరికి ఆ లాయరు మాకు ఆ స్థలం అమ్మనని తలా తోకా లేని కుంటి సాకులు చెప్పాడు. ఆయనతో దెబ్బలాటకి దిగాను. మాటల్లో తేలిందేవిటంటే రాజు క్రితం రాత్రి మేం వెళ్ళిన తరువాత వచ్చి అయిదు లక్షలిస్తానని ఆశ చూపించాడట. ఈయన మాకిచ్చిన మాట తోసి రాజన్నాడు. నాకు ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ లేవు. నేనూ, గోపాలమూ రాజిలా చేశాడంటే నమ్మ లేకపోయాం. ఉన్న పళాన ఒక్క రోజులో రాజు ఆ స్థలం కొనేశాడు. వాడికి నేను కొంటానని తెలిసి ఎందుకు ఇలా అడ్డుపడ్డాడో తెలీలేదు. వాడికి చెప్పకుండా నేను కొన్నానని కోపగించుకున్నాడో కూడా తెలీదు. ఏదయితేనేం ఇల్లు కోసం కొనాలనుకున్న స్థలం పోయింది.
ఇది నేను తట్టుకోలేకపోయాను. ఆ రాత్రి నాకు హార్టెటాక్ వచ్చింది. గుండె కవాటాల్లో స్టెంట్స్ వేయాలని ఉన్నపళాన కాకినాడ తీసుకెళ్ళారు. ఇదంతా గోపాలమే దగ్గరుండి చూసాడు. ఆసుపత్రిలో ఉండగా రాజూ, పెళ్ళాం వస్తే సావిత్రి నానా తిట్లూ తిట్టి పంపించేసిందనీ తరువాత తెలిసింది. ఆ స్టేంట్స్‌కి అయిదారు లక్షలు కావాల్సొచ్చింది. నా దగ్గర ఉన్న రెండు కాక మిగతాది గోపాలం సర్దాడు. అప్పటి నుండీ రాజు మా ఇంటికి రాలేదు. ఆరోగ్యం బాగుపడి అమలాపురం వచ్చాక కూడా నన్ను కలవడానికి రాలేదు. తెలీయకుండా మా మధ్య అగాథం ఏర్పడింది. గోపాలానికీ రాజుకీ మాటలు పోలేదు కానీ మునపటి స్నేహం పోయింది. నాకయితే చివరిసారిగా రాజుని ఒకసారి వెళ్ళి చూడాలనిపించింది. నాకూ, రాజుకీ మధ్యనున్న అనుబంధం సావిత్రికి తెలీదు. నేను చెప్పినా ఆవిడ చూళ్ళేదు కాబట్టి దాని లోతు తెలీదు. వెళ్ళడానికి బయల్దేరాను.
“ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. వాళ్ళు మనతో ఎలా వుంటేనే, నాకున్న చిన్న నాటి నేస్తం వాడొక్కడే!” అని గుమ్మం వరకూ వచ్చాను.
సావిత్రి గుమ్మానికి అడ్డంగా నుంచుంది. “మీరెందుకింత మొండిగా ఉన్నారు? మీరు అతనికి ఎంతో సాయం చేశారు? కనీసం మీరిచ్చే గౌరవంలో అతను పిసరంత కూడా కృతజ్ఞత చూపించలేదు,” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
“కృతజ్ఞతలు చూపిస్తారనీ, మారు సాయం చేస్తారని ఆశించి ఎవరూ స్నేహాలు చెయ్యరు. ఒకవేళ చేస్తే దాన్ని స్నేహం అనరు. నాకూ, రాజుకీ మధ్య ఒక్కటంటే ఒక్కటే చెడు సంఘటన. మిగతాదంతా అభిమానమే! నీకు చెప్పినా అర్థం కాదు, నన్ను వెళ్ళనీ…” అంటూ ముందుకి కదిలాను.
రాజు ఇంటి ముందు చాలామంది జనం ఉన్నారు. మౌనంగా వెళ్ళి కడసారిగా చూసొచ్చాను. నేను రావడం రాజు పిల్లలు చూశారు. రాజు అంతిమయాత్రలో నేనూ పాల్గొన్నాను. నా కంటూ తోబుట్టువులెవరూ లేరు. మాటలున్ననాళ్ళూ ఒక తమ్ముడిలాగే ఉన్నాడు. వాడికి నేనంటే అభిమానం ఉన్నా లేకపోయినా వాడంటే నాకు ప్రేమే! గోదార్లో మునిగిపోతూ రాజూ! అని గట్టిగా కేకేసినప్పుడు ఒక్క అంగలో భుజాన మోసి నన్ను ఒడ్డుకి చేర్చిన సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేను. పోలేను కాదు, మర్చిపోను.
రెండ్రోజుల్లో వస్తానన్న గోపాలం ఆ ఎమ్మెల్యేగారిని తీసుకొని హైద్రాబాదు వెళ్ళాడు. వాడికి రాజు ఆఖరి చూపు కూడా దక్కలేదు.
నేను రాజు శవం మోశానని తెలిసి సావిత్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. నాతో మాట్లాడ్డం మానేసింది. పదో రోజు ధర్మోదకాలకీ, పన్నెండో రోజుకీ మాకు రాజు కుటుంబం నుండి పిలుపు రాలేదు. ఎవర్ని పిలిచినా పిలవకపోయినా శవం మోసిన వాళ్ళని పిలవడం ఆనవాయితీ. దాంతో సావిత్రి మరింత రెచ్చిపోయింది. శవాన్ని ఎత్తేడప్పుడు నన్ను అడ్డుకుంటారనుకున్నాను కానీ, ఎవరూ ఏవీ అనలేదు. బహుశా అక్కడ గొడవపడడం బావుండదని ఆగిపోయారేమో! ఏదయితేనేం? నాకయితే ఆ పని మా స్నేహానికి గుర్తుగా ఎంతో తృప్తినిచ్చింది.
అనుకోకుండా సావిత్రి చెల్లెలు కూతురుకి కేన్సరని కబురొచ్చింది. హుటాహుటిన ఏలూరు వెళ్ళింది.
ఓ నాలుగు రోజుల తరువాత గోపాలం వచ్చాడు. వచ్చీ రాగానే మా ఇంటికి వచ్చి నన్ను కావలించుకొని మరీ ఏడ్చాడు. కొంతసేపయ్యక మామూలు స్థితికొచ్చాం. సరిగ్గా గోపాలం వచ్చిన వేళకీ సావిత్రీ రిక్షా దిగింది. వస్తూనే గోపాలాన్ని చూసి ఏదయినా సాయం చేసి ఆ పిల్లని రక్షించమని ఏడ్చింది.
“ఆ చిన్న పిల్ల చాలా అమాయకురాలండీ. మా చెల్లెలూ, భర్తా ఎంతో మంచి వాళ్ళు. అదేవిటో దేవుడు మంచి వాళ్ళకే కష్టాలన్నీ ఇస్తాడు,” అంటూ భోరుమంది.
“మంచి వాళ్ళకే దేవుడు కష్టాలిస్తాడంటున్నావు కదా? రాజుక్కూడా కేన్సరొచ్చింది, వాడూ మంచి వాడే అయ్యుండాలి,” సావిత్రిని ఎత్తుపొడుస్తూ అన్నాను.
వదిలేయన్నట్లు గోపాలం నా భుజమ్మీద తట్టాడు. సావిత్రి నాకేసి గుర్రుగా చూసింది. నేనేమీ పట్టించుకోదల్చుకోలేదు. గోపాలం తనకి తెలుసున్న డాక్టర్లకి చెప్పి చూస్తాననీ అన్నాడు. కొంతసేపయ్యాక గోపాలం వెళ్ళొస్తానని బయల్దేరాడు. వెళుతూండగా ఓ మాట అన్నాడు.
“సూర్యం! నీకో విషయం చెప్పాలి. రాజుకీ నువ్వంటే వల్ల మాలిన అభిమానం. నేను నీ దగ్గర చాలాసార్లు అయిదువేలూ, పదివేలూ కావాలని బదుళ్ళు తీసుకున్నాను, గుర్తుందా? అవన్నీ రాజే నన్ను అడగమనే వాడు. నీ చేత్తో ఇస్తే వాడికి మంచి జరుగుతుందని…”
“అవునా?” ఆశ్చర్యంగా అన్నాను.
“ఇంకా… మన స్థలం విషయంలో ఏం జరిగిందంటే…” అంటూ చెప్పబోతే నేనే వారిస్తూ – “వద్దురా! అది వాడితోనే సమాధి కానీ! మా స్నేహంలో అదొక చిన్న కుదుపు. తెలుసుకోవాలన్న ఆసక్తీ, ఉత్సాహం నాకు లేదు. అదలాగే ఉండనీ,” చెయ్యి పైకెత్తి చూపించాను.
గోపాలానికి నా మనసు తెలుసు. అవునన్నట్లు తలూపాడు.
“సూర్యం! నువ్వు వాడి శవం మోసి చాలా మంచి పని చేశావురా! నీలాంటి పెద్ద మనసున్న స్నేహితుడున్నందుకు నాకు గర్వంగా ఉంది. రాజు భౌతికంగా లేకపోయినా నీ గుండెల్లో స్టెంటు రూపంలో ఉన్నాడు,” అంటూ కళ్ళు తుడుచుకొని నడుచుకుంటూ వెళిపోయాడు.
వాడెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాను.