చరిత్రాత్మక నవల అంటే?

ఈ సంచికలో మీకు మూడు వ్యాసాలు అందిస్తున్నాం. ఒకటి కొల్లాయి గట్టితేనేమి? నవలపై రాచమల్లు రామచంద్రారెడ్డి వ్యాసం. రెండవది ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల అనే పేరుతో నోరి నరసింహశాస్త్రి రాసిన వ్యాసం. మూడవ వ్యాసం బయోగ్రాఫికల్ నావెల్ అని ఇర్వింగ్ స్టోన్ వ్రాసినది. నాగరాజు పప్పు ఈ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించారు.

మహీధర రామమోహన రావుగారు రాసిన “కొల్లాయి గట్టితేనేమి?” అనే నవలపై రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) ఒక విస్తృతమైన సమీక్ష రాశారు. ఆ నవల ఒక గొప్ప చారిత్రక నవల అని శ్లాఘించారు. సాధారణంగా రారా విమర్శలు చాలా ఘాటుగా సూటిగా ఉంటాయి. ఈ నవలని ఒక గొప్ప చారిత్రక నవల అని కితాబు ఇవ్వడంలో ఆయన ఉపయోగించిన సైద్ధాంతిక ప్రాతిపదికలు ఏవీ ముందుగా చెప్పలేదు. నవల చదవనివాళ్ళకి అనువుగా ఉంటుందని కాబోలు, మొత్తం కథా కథనం అంతా పూసగుచ్చినట్టు చెపుతూ, ఈ నవలకున్న లక్షణాలన్నీఆ కథాకథనంలో కలిపేశారు. ఒక రకంగా అది మంచి పనేనేమో కాని, తాను ఏ లక్షణాలని ప్రాతిపదికగా చేసుకొని ఈ నవలని చర్చిస్తున్నారో ముందుగా చెప్పి ఉంటే వ్యాసం విసుగు పుట్టించేది కాదు. వ్యాసం మొత్తం చదివి (బహుశా నవల చదవవలసిన అవసరం లేదు!), ఆ లక్షణాలన్నీ పాఠకుడు పరీక్షకు వెళ్ళే విద్యార్థిలా ఏరుకోవలసిన అవసరం కల్పించారు. వ్యాసం చివర బ్రాకెట్లలో చారిత్రక నవలకి ఉండవలసిన లక్షణాలని తాను లూకాచ్ (Gyorgy Lukacs, 1885-1971) నుంచి సంగ్రహించానని రాశారు. అయితే, లూకాచ్ అనే హంగేరియన్ మార్కిస్ట్ సాహిత్యసిద్ధాంత ప్రవక్త 1930ల్లో రష్యాలో పరదేశిగా, దేశభ్రష్టుడిగా ఉన్నరోజుల్లో రాసిన The Historical Novel చదువుకున్న వారికి రారా విశ్లేషణ క్లిష్టంగా ఉండకపోవచ్చు.

రారా మార్కిస్టు. అలాగే మహీధర రామమోహనరావు కూడా మార్క్సిస్టే. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1940లలో అని చెప్పవచ్చు) మొదలై, ఇప్పటివరకూ మార్కిస్ట్ సిద్ధాంత ఆచరణలోనే కాకుండా అవగాహనలో కూడా రకరకాల ఛాయలు పొడసూపినై. వీరిద్దరూ ఏ ఛాయకి సంబంధించిన వారో చెప్పటం ప్రస్తుతానికి అనవసరం.

సర్ వాల్టర్ స్కాట్ 18వ శతాబ్దపు మధ్య భాగంలో స్కాట్లండ్, 12వ శతాబ్దపు ఇంగ్లండ్ చరిత్రలు ఆధారంగా రాసిన నవలలు లూకాచ్ చాలా నిశితంగా పరిశీలించాడు. ఆ పరిశీలన ఫలితాలు – చారిత్రక నవలకి ఉండవలసిన లక్షణాలుగా, చారిత్రిక నవల హక్కులుగా చాలామంది మార్కిస్టు సాహిత్యవేత్తలు అంగీకరిస్తారు. ఆయన ఉద్దేశంలో చారిత్రక నవలకి ఉండ వలసిన లక్షణాలని నేను క్రోడీకరిస్తున్నాను. తీరిక, ఓపిక ఉన్న పాఠకులు లూకాచ్ మార్కిస్ట్ కాకముందు రాసిన The Theory of the Novel, మార్కిస్టుగా మారిన తరువాత రాసిన The Historical Novel చదవటం కాలయాపన అని నేను అనను.

ముందుగా ఒక చిన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. చారిత్రక నవల అనేది, నిర్వచన పరంగా చాలామటుకు రాజకీయానుగుణ్యంగా ఉంటుంది. లూకాచ్ ప్రవచించిన సిద్ధాంతం ప్రకారం చారిత్రక నవలకి ముఖ్యంగా ఐదు ప్రధానమైన అర్హతలు (లక్షణాలు) ఉండాలి.

  1. చారిత్రిక నవల సాంప్రదాయక రూపం ఇతిహాసం. ఈ ఇతిహాసం, ప్రత్యమ్నాయులు, లేదా ప్రతినిధులు అని చెప్పబడే కొంతమందిపై సాంఘిక శక్తులు విస్తృతంగా వారి జీవితాలలో తెచ్చిన మార్పుల ద్వారా సాధారణ జనుల జీవితాల రూపాంతరీకరణం చిత్రిస్తుంది.
  2. ఈ ఇతిహాసంలో పేరుపొందిన చారిత్రిక వ్యక్తులు పాత్రధారులుగా వస్తారు; కాని వారి పాత్ర కేవలం నామమాత్రమే.
  3. కథ సామాన్యమైన మధ్యరకం వ్యక్తులతో అల్లబడుతుంది. రెండు విరుద్ధ శక్తుల ఘర్షణలో వీళ్ళు కథాగమనానికి వ్యక్తిగతమైన స్పష్టత ఇస్తారు.
  4. పతనమవుతున్న సాంఘికరూపాలకి ప్రబలమవుతున్న సాంఘిక రూపాలకీ మధ్య జరిగే విషాదాంత పోటీకి నవల వేదిక అవుతుంది. ఓడిన రూపాలకి గౌరవం, విజయవంతమైన రూపాలకి సమర్థన లభిస్తాయి.
  5. వివిధ పోరాటాలతో సమాజాలని, ఆ సమాజాలలో వ్యక్తులనీ వేరుచేసి చూపించి, సాంప్రదాయక చారిత్రక నవల తుదిలో మానవ ప్రగతిని ధ్రువీకరిస్తుంది.

ఈ పై క్రోడీకరణ ఉపయుక్తమని భావిస్తున్నాను. పోతే, లూకాచ్ అవగాహనలో చారిత్రక నవల, భవిష్యత్తులో రాబోయే వాస్తవిక నవలకి పూర్వగామి. టాల్‌స్టాయ్ రాసిన వార్ అండ్ పీస్ ఏకకాలికముగా 19వ శతాబ్దపు చారిత్రక నవలగాను, వాస్తవిక నవలగానూ లూకాచ్ పరిగణించాడు. అది నిజమా కాదా అన్నది వివాదగ్రస్తం.

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నుండి, ఇప్పటివరకూ, అంటే ఈ నూరు సంవత్సరాలలో ప్రచురించబడ్డ ‘చారిత్రక నవలల’కు లూకాచ్ చెప్పిన లక్షణాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నకి సమాధానం వేరే మరొక వ్యాసం మరొకరు రాయవలసి ఉంటుంది. అసలు, లూకాచ్ ఉద్ఘాటించిన లక్షణాలు ఈ కాలపు చారిత్రక నవలలకి ఆపాదించవచ్చా అన్నది మౌలికమైన ప్రశ్న. ఈ విషయాలపై కూడా, వేరే ప్రస్తావించవలసి ఉన్నది.

తెలుగులో చరిత్రాత్మక నవలపై నోరి నరసింహ శాస్త్రి కొన్ని లక్షణాలు ప్రతిపాదించి, కొన్ని నవలలపై వ్యాఖానించారు. ఆయన ప్రతిపాదించిన లక్షణాలకి, రారా ప్రతిపాదించిన లక్షణాలకీ మధ్య చాలా భేదాలున్నాయి. చరిత్రాత్మక నవలపై నోరి వారి ఉద్దేశము వారి మాటలలోనే చెప్పటం ఉత్తమం:

“నవలకు మూలభూతమైనది కథ. నవలలో కథాకథనంతో పాత్రసృష్టి చేయవచ్చు. సాంఘిక, ఆధ్యాత్మిక జీవితము చిత్రించవచ్చు. వాఙ్మయ సంఘర్షణలు ప్రదర్శించవచ్చు. నేటి జీవితాన్ని విమర్శించి ఆదర్శజీవితం సూచించవచ్చు. ఇంకా ఎన్నో సాధించి ఆనందం కలిగించవచ్చు. స్థూలంగా నిర్వచనం చేస్తే, పూర్వకాలానికి సంబంధించినదైతే చారిత్రక నవల అవుతుంది.”

అంతే కాదు: ” చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును… మనకి పాశ్చాత్యులవలె చరిత్ర రాయబడలేదు. మనకి ఇతిహాసాలలోనే చరిత్ర కలిసిపోయి ఉన్నది. అయితే ఇతిహాసాలలో ఉన్నకథలన్నీ జరిగినవని కాదు; కొన్నైనా జరగలేదని నిరూపించలేము. అందుచేత ఐతిహాసిక కథని చారిత్రకముగా నిర్మించి నవల అల్లవచ్చు.”

తెలుగులో మొట్టమొదటి చారిత్రక నవల 1914లో దుగ్గిరాల రామచంద్రయ్యగారు రాసిన విజయనగర సామ్రాజ్యము (రారా ఈ నవలని తన వ్యాసంలో తీవ్రంగా నిరసించాడు). నోరి వారి లెక్కలో అడివి బాపిరాజు రాసిన హిమబిందు, గోనగన్నారెడ్డి చారిత్రక నవలలే. అదే విధంగా, నోరివారు మూడు శతాబ్దాల సారస్వత చరిత్ర, సాంఘిక చరిత్ర ఆధారముగా తీసుకొని మూడు నవలలు (చరిత్రాత్మక నవలలు) రాశారు; నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి. వీటిపై విశదంగా వారి వ్యాసంలోనే చదవవచ్చు. ఆయన పరిధిలో, చివరికి విశ్వనాథ సత్యనారాయణగారి పురాణవైర గ్రంధమాల పేరున వచ్చిన నవలలు కూడా ఒక విధముగా చరిత్రాత్మక నవలలే!

మీకు అందించబడుతున్న మూడవ వ్యాసం: ఇర్వింగ్ స్టోన్ (Irving Stone) రాసిన వ్యాసం: జీవిత నవల (The Biographical Novel). ఇర్వింగ్ స్టోన్ రాసిన Lust for life, The Agony and Ecstasy ఈమాట పాఠకులు చాలామందికి తెలిసినవే. ఇందులో మొదటిది కేవలం జీవితచరిత్ర (Biography) -1956 లో వెండి తెరకెక్కింది; రెండవది జీవిత నవలగా మలచబడినది. ఇది 1965లో వెండి తెరకెక్కింది.

ఒక వ్యక్తి జీవితచరిత్రని రచయిత తన ప్రావీణ్యత, ఊహ ఉపయోగించి చారిత్రక జీవిత నవల రాయవచ్చు. ఇటువంటి సాహిత్య ప్రక్రియలో చారిత్రక సత్యాలు, ఒక వ్యక్తి జీవితంతో ఎట్లా ముడిపడి ఉన్నాయో విశదమవుతుంది. రచయిత, ఒక వ్యక్తి జీవితంలో సాధించి ఘనకార్యాలు, జీవితంలో సంఘర్షణలు, పడ్డ బాధలు, చెప్పుతూ నాటకీయత కల్పిస్తాడు. పాఠకుడిని ఆకట్టే సంభాణలుంటాయి, చారిత్రక సత్యాలు కావలసినన్ని ఉంటాయి. నవలాకారుడు కొన్ని కథలు, కొంత హాస్యం మేళవించి నవలలో అన్ని పాత్రలకీ జీవం పోస్తాడు. నవలకి ఒక విధమైన సంపూర్ణత వస్తుంది. చారిత్రక నవలకీ దీనికీ భేదం రూపంలో కాదు; రచయిత చెప్పే పద్ధతిలో ఉంటుంది. స్థూలంగా ఇవీ, ఇర్వింగ్ స్టోన్ జీవిత నవలకి ప్రతిపాదించిన లక్షణాలు.

ఇలా ఈ మూడు వ్యాసాలను కలిపి ప్రచురించడం, నవల లక్షణాలపై ఒక మంచి చర్చకు దారి తీయగలిగితే మా ఉద్దేశ్యం నెరవేరినట్లే. ఈ సలహానిచ్చి, ప్రోత్సహించిన పప్పు నాగరాజు గారికి మా కృతజ్ఞతలు.