కొల్లాయి గట్టితే నేమి? (ఒక ఉత్తమ చారిత్రక నవల)
1919-20 నాటి ఆర్ధిక, సాంఘీక, రాజకీయ పరిస్థితులను చిత్రించే ప్రయత్నంలో శ్రీ మహీధర రామమోహన రావు గారు రచించిన నవల “కొల్లాయి గట్టితేనేమి?” పంజాబ్‌లో రౌలట్ చట్టం అంతకుముందే అమల్లోకి వచ్చింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అప్పుడప్పుడే జరిగింది. బ్రిటిష్ వ్యతిరేకత పై వర్గాల్లోనే అయినా దావానలంలా వ్యాపిస్తున్నది; జాతీయతాభావం గ్రామసీమల్లోకీ, సామాన్య జనంలోకి ప్రవేశిస్తున్నది. దీనికి చిహ్నంగా కాంగ్రెసు మీద గాంధీ ఆధిపత్యం బలపడుతున్నది. అంతవరకూ విధ్యాధికుల సంస్థగా వుండిన కాంగ్రెస్ సామాన్య ప్రజల రాజకీయ సంస్థగా రూపాంతరం చెందుతున్నది. బ్రిటిష్ ప్రభుత్వంపట్ల సహాయ నిరాకరణకూ, విదేశీ వస్తు బహిష్కరణకూ గాంధీ నాయకత్వాన కాంగ్రెసు పిలుపు యిచ్చింది. సహాయ నిరాకరణలో భాగంగా విద్యార్ధులు కాలేజీలు వదిలిపెట్టి జాతీయోద్యమంలో పాల్గొంటున్నారు. విదేశవస్తు బహిష్కరణలో భాగంగా విదేశ వస్త్రదహనం ఆవేశపూరితమైన ఉద్యమరూపం ధరించింది. ఖద్దరు ధారణ దేశభక్తి చిహ్నంగా, నూలు వడకడం పవిత్ర దీక్షా చిహ్నంగా, జైలుకు పోవడం రాజకీయ వీరకృత్యంగా చలామణిలోకి వచ్చినాయి. ఇవి 1920 నాటి రాజకీయ పరిస్థితులు. విదేశవస్తు బహిష్కరణ, ఖద్దరు ధారణ, రాజకీయ ప్రదర్శనలు మాత్రమే. వాటికి రాజకీయ నాయకులే పెద్దగా ఆర్థిక ప్రాముఖ్యం ఆపాదించలేదు. వాటి ఆర్థిక ప్రాముఖ్యం గురించి ఎపుడైనా ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడితే అది కేవలం మేధావి వర్గాలలో – రాజకీయంగా బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీపడి, జాతీయోద్యమం పట్ల విశ్వాసంలేని మేధావి వర్గాలలో – దేశభక్తి, కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమం పట్ల విశ్వాసమూ కలిగించడానికి చేసే ప్రయత్నం మాత్రమే.
ఆర్ధికంగా చూస్తే ఆంధ్రదేశం పురాణకాలం నుండి వున్నట్లే వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడి బతికేది. నామమాత్రంగా మిగిలిన చేతి వృత్తులు తప్ప పరిశ్రమలు లేనే లేవు. కృష్ణా గోదావరుల మీద గతశతాబ్దిలో కట్టిన ఆనకట్టల ఫలితంగా మధ్య కోస్తా జిల్లాలలో కరువు కాటకాలు మాయమైనాయి. గ్రామసీమల్లోని వ్యవసాయక సమాజం నుండి మధ్యతరగతి వర్గం ఉద్భవించడానికి, పాశ్చాత్య విద్యవైపూ, పాశ్చాత్య భావాలవైపూ ఆకర్షింపబడటానికి అవకాశాలు ఏర్పడినాయి. పాశ్చాత్య విద్యకు ప్రభుత్వ నౌకరి తప్ప పరమలక్ష్యం మరొకటి ఉండే అవకాశం లేదు.
సాంఘిక పరిస్థితులు తదనుగుణంగానే ఉండినాయి. వర్ణధర్మాలు గ్రామసీమల్లో చెక్కు చెదరకుండా సాగుతున్నాయి. విద్యాధికుల్లో ఏ కొద్దిమందికో వాటిలో విశ్వాసం సన్నగిల్లినా వాళ్ళకు ఆచారబలాన్ని ధిక్కరించే సాహసం లేదు. తెగించిన వాళ్ళు, హిందూ సమాజాన్ని మార్చలేక బ్రహ్మసమాజీకులౌతున్నారు. బ్రహ్మసమాజ ఉద్యమ ఫలితంగా వితంతు వివాహాలూ, వర్ణాంతర వివాహాలూ ఎక్కడైనా ఒకచోట జరుగుతున్నాయి. పాశ్చాత్య భావాల ప్రభావం వల్ల సాంఘిక ఆచారాలు మారకపోయినా వాటిమీద విశ్వాసం సడలుతున్నది.
1919-20 నాటి రాజకీయ ఆర్ధిక సాంఘీక పరిస్థితులు ఇవి. ఆ రోజుల్లో రాజమండ్రి కాలేజీలో బియ్యే చదువుకుంటున్న ఒక బ్రాహ్మణ యువకుడు స్వాతంత్ర్యోద్యమం చేత ప్రభావితుడై తన మిల్లు బట్టలనన్నిటినీ కాల్చివేసి చదువు మానుకుని స్వగ్రామమైన ముంగండకు వస్తాడు. దారిలో స్వరాజ్యం అనే నాయుళ్ళ అమ్మాయితో పరిచయమౌతుంది. స్వరాజ్యం తండ్రి అబ్బాయినాయుడు బ్రహ్మసమాజీకుడు. స్త్రీ విద్యాభిమానంతో కూతురుకు ఇంగ్లీషు చదువు చెప్పించినాడు. ఆడపిల్లకు చదువేమిటని ఆమె అత్తవారు తీవ్రంగా అభ్యంతరం చెప్పినా వినలేదు. ఆ కారణంగా స్వరాజ్యం భర్త మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. స్వరాజ్యాన్ని కాపురానికి పంపిస్తామన్నా, చదువుకున్న ఆడపిల్లకు తమ ఇంట్లో ఉండే అర్హత లేదన్నారు అత్తవారు. యిరవై యేండ్ల మిసిమి వయస్సులో వున్న స్వరాజ్యం విధవో, సధవో, వివాహితో, అవివాహితో, యేదైందీ తెలియని వింత పరిస్థితిలో వుంది. చేసేదేమీ లేక కాలేజీ చదువుకు పోవాలనుకుంటున్న స్వరాజ్యం ఆలోచనను దేశభక్తి ప్రేరణతో కాలేజీ చదువు మానుకొన్న రామనాథం హర్షించలేకపోయినా, ఆమె ఆధునిక దృక్పథానికీ, మనస్సంకోచాలు లేని నిర్మల హార్దిక ప్రవర్తనకూ మనసులో హర్షించకుండా వుండలేకపోయినాడు.
రామనాథంకు నాలుగేండ్ల క్రితమే వివాహమైంది, మామ నారాయణమూర్తి పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్. ఆచారపరుడు, రాజభక్తి పరాయణుడు, దురహంకారి, అధికారగర్వి. రాజద్రోహం చేసిన అల్లుని మీద ద్వేషంతో కూతురు భవిష్యత్తును కూడా లెక్కచేయని వట్టి పోలీసు బుద్ది. అతని దురుసుతనంతో తుదకు కూతురు కాపురం చెడక తప్పలేదు. రామనాథం పెంపుడు తండ్రి శంకరశాస్త్రి నైష్ఠికుడుకాదు గానీ, ఆచార భంగం సహించలేడు. పాత సమాజంలో మంచి ఫలితాలనిచ్చిన అతని లౌక్యమూ, బుద్ధి చాతుర్యమూ రామనాథం వెంట వచ్చిన కొత్త సామాజిక నియమాల ధాటికి నివ్వెరపోవడం తప్ప ఎదిరించి నిలువలేవు. పెంపుడు కొడుకుని ఐ.సి.యస్. ఆఫీసరుగా చూడాలని కలలు గంటున్న శంకరశాస్త్రికి రామనాథం రాజద్రోహి కావడమూ, జైలుకు పోవడమూ దుఃఖకారణాలైనాయి. కానీ అంతకంటే బాధాకరమైనది రామనాథం సకల సనాతన కులమత ధర్మాలనూ నిరాకరించి, సంప్రదాయక ఆచారాలనూ, కుటుంబ వ్యవస్థనూ ధిక్కరించి పాత వైవాహిక నియమాలను కూడా తిరస్కరించి, మొత్తం సమాజానికే వెలిగా బతకడానికి పూనుకోవడం.
రామనాథానికి యిటు తండ్రి మామలతో గానీ, అటు మొత్తం సమాజంతో గానీ వచ్చిన ఘర్షణకు మూలకారణం ఒకటే. ఆధునిక విద్యతో రామనాథంకు అబ్బిన ఆధునిక బూర్జువా సాంఘిక రాజకీయ భావాలకూ, అతను పుట్టి పెరిగిన పాత ఫ్యూడల్ సమాజపు సాంఘిక రాజకీయ భావాలకూ పొత్తు కుదరకపోవడమే. కేవలం సాంఘిక భావాల ఘర్షణే ఐతే, యేదో ఒక విధమైన సహజీవనమో, పరస్పర సహజీవనమో సాధ్యమై వుండవచ్చు. కానీ ఘర్షణ రాజకీయ రంగంలో ప్రారంభమైనందున, ఆనాటి చారిత్రక పరిస్థితులలో సాంఘిక భావాలకు లేని తక్షణ ప్రాముఖ్యం రాజకీయ భావాలకు వుండినందున, రామనాథం మనః ప్రపంచంలో సాంఘిక భావాలకు లేని తీవ్రత రాజకీయ భావాలకు వుండినందున, ఆ ఘర్షణ – రామనాథానికి సమాజంతోనూ, బంధువులతోనూ వచ్చిన ఘర్షణ – క్రమక్రమంగా తీవ్రతరమూ, బహుముఖమూ కాక తప్పలేదు.
అల్లుడు రాజద్రోహి ఐనందుకే మండిపడుతున్న రామనాథం అత్తమామలు అతను జైలుకు పోయి వచ్చినతర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోనందుకు ప్రతిక్రియగా అతనితో బాంధవ్య బంధాలన్నీ తెంచుకుని, అతని భార్యని కాపురానికి పంపడానికి నిరాకరిస్తారు. ఫ్యూడల్ పితృస్వామిక కుటుంబంలో, ఛాందస ఆచార పరాయణ వాతావరణంలో, పోలీసు అధికారి మానవతాధ్వంసక క్రమశిక్షణ కింద పెరిగిన సుందరి (రామనాథం భార్య) భర్తను విషపురుగులాగ చూస్తుంది. ప్రాయశ్చిత్తం చేసుకోడానికి నిరాకరించిన రామనాథం పెంపుడు తలిదండ్రుల నుంచి విడివడి, బంధువులనుండీ, మొత్తం బ్రాహ్మణ్యం నుండీ విడివడి తోటలోని పాకలో ఒంటరిగా మకాం పెడతాడు. క్రమక్రమంగా స్వరాజ్యంలోని భావస్వామ్యం చేతా, ఆర్ద్రహృదయం చేతా, సంకల్ప బలం చేతా ఆకర్షితుడై ఆమెను జీవిత సహచారిణిగా, జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తాడు.
ఈ వ్యక్తి జీవిత కథా (Biographical) ఘటనల మధ్య రామనాథం రాజకీయ జీవితం కూడా పరిణామం చెందుతుంది. విదేశీ వస్త్ర దహనం చేసి, కాలేజీ చదువు మానుకోవడంతో రాజకీయాలు ప్రారంభించిన రామనాథం తన తోట లోని బావి నీటిని తోడుకోడానికి గ్రామంలోని హరిజనులకు అనుమతి యిస్తాడు. దీనికి కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి రామనాథమూ, స్వరాజ్యమూ వలంటీర్లుగా పోతారు. ఆ వెంటనే జరిగిన గాంధీ ఆంధ్రదేశ పర్యటన సందర్భంలో గాంధీని ముంగండకు ఆహ్వానిస్తారు. గాంధీజీకి యివ్వబోయే స్వాగత సత్కారాల కొరకు చేసే సన్నాహాలకు గ్రామ బ్రాహ్మణులు యిచ్చే హృదయపూర్వక సహకారంతో నవల అంతమౌతుంది.
ఈ కథాక్రమంలో 1920 నాటి ఆంధ్రదేశ చారిత్రక పరిస్థితులు విపులంగా, గాఢంగా, కన్నులకు కట్టినట్లు చిత్రితమైనాయి. రచయిత దీన్ని కేవలం సాంఘిక నవలగా కాక, చారిత్రక నవలగా ఉద్దేశించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. చారిత్రక నవలకుండవలసిన ముఖ్యలక్షణాలన్నీ యీ నవలకున్నాయి.
చారిత్రక నవలకుండవలసిన మొదటి లక్షణం చారిత్రకత. సాధారణంగా సాంఘిక నవలలన్నీ సమకాలిక సమాజాన్ని వాస్తవికంగానే చిత్రిస్తాయి. కానీ సామాజిక పరిస్థితులు యెంత వాస్తవికంగా, యెంత విపులంగా, యెంత కళాత్మకంగా చిత్రించినా, ఆ దేశకాల పరిస్థితులు అలా యెందుకున్నాయనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నంకాదు (ప్రశ్నే లేదు గనక సమాధానమూ లేదు). యథార్థ జీవితం లోని దేశకాల పరిస్థితులను యెలా వున్న వాటిని అలా చిత్రించడమే సామాజిక నవల కర్తవ్యం. ఆ పరిస్థితుల పూర్వాపరాల పరిశీలన కానీ, కార్యాకారణాల పరిశీలన కానీ దానికి అనవసరం. కానీ, చారిత్రక నవలలో దేశకాల పరిస్థితులకు చారిత్రకత వుంటుంది. అనగా, ఆ దేశం యొక్క గత చరిత్ర ఫలితంగా ఆనాటి సమాజం అలా వుందనీ, ఆ దేశపు చారిత్రక పరిణామక్రమంలో అది ఒక దశా విశేషమనీ పాఠకునికి ఒక స్పృహ (Consciousness) కలుగుతుంది. నవలలోని దేశ కాల పరిస్థితులు ఒక చారిత్రక దశా విశేషం గనుక, అవి శాశ్వతంగా వుండవనీ, కాలక్రమాన మారుతాయనీ కూడా పాఠకునికి స్పృహ కలుగుతుంది. ఈ స్పృహ యెలా కలుగుతుందంటే భూతకాల శక్తులకూ, వర్తమాన కాల శక్తులకూ జరిగే ఘర్షణ కీలకపాత్ర వహించడం ద్వారా.
చారిత్రక నవలలోని మరొక విశేషం దేశకాల నిర్దిష్టత. సామాజిక నవలలోని దేశకాల పరిస్థితులు చిత్రంలో పూర్వరంగం (Background) లాగే వుంటాయి. కానీ, వాటికి అంతకు మించిన ప్రాముఖ్యం వుండదు. దేశకాల పరిస్థితులు మార్చినా కథకు తీరని నష్టం ఏమీ జరగదు. ఆ కథ ఆ దేశం లోనే, ఆ కాలం లోనే జరగాలన్న నిర్భంధం ఏమీ లేదు. బెంగాలీ నవలలోని కథ (అప్రధానమైన కొన్ని వివరాలు మార్చి వేస్తే) తెలుగుదేశంలో జరగవచ్చు. తెలుగు నవలలోని కథ మహారాష్ట్ర దేశంలో జరగవచ్చు. ఇంగ్లండు నవలలోని కథ ఫ్రాన్సులో జరగవచ్చు; ఫ్రెంచి నవలలోని కథ యూరప్‌లో మరెక్కడైనా జరగవచ్చు. లేదా అమెరికాలో జరగవచ్చు. డికెన్స్, డాస్టోయెవస్కీల నవలల వంటి యూరోపియన్ నవలలు భారతదేశంలో యెక్కడైనా జరగవచ్చు. యిది ఎలా సాధ్యమంటే ఆ పాత్రలూ, ఆ సన్నివేశాలూ సామాజిక పరిస్థితుల నుండి ఉద్భవించినవే అయినా, ఆ సామాజిక పరిస్థితులు ఆ దేశం, ఆ కాలం యొక్క విశిష్ట పరిస్థితులు కావు. ఉదాహరణకు యీనాడు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సామాన్యమైన సామాజిక పరిస్థితులు అనేకం వున్నాయి. నిజానికవి చాలా ముఖ్యమైనవి కూడా; యుగ ధర్మాన్ని ప్రధానంగా నిర్ణయించేవి అవే. అందువలన సామాజిక నవలాకారుని దృష్టిలో అవి ప్రాముఖ్యం వహించవచ్చు. కానీ చారిత్రక నవలాకారుడు తెలుగు వాడయితే తెలుగుదేశంలోని విశిష్ట పరిస్థితులకు ప్రాముఖ్యం యిస్తాడు. మహారాష్ట్రుడయితే మహారాష్ట్ర విశిష్ట పరిస్థితులకు ప్రాముఖ్యం యిస్తాడు. ఆ దేశకాల విశిష్ట పరిస్థితులలో తప్ప ఆ కథ అలా జరగదని అనిపిస్తుంది చారిత్రక నవల. యిది ఎలా సాధ్యమంటే, యిటు నవలలోని పాత్రలకూ, సన్నివేశాలకూ, అటు దేశకాల విశిష్ట పరిస్థితులకూ కార్యకారణ సంబంధం వుంటుంది. పాత్రల మనోధర్మాలూ, జీవిత పద్దతులూ, ప్రవర్తనా రీతులూ, వ్యక్తావ్యక్త ఆశయాలూ, అట్లే సన్నివేశాల పూర్వా పరాలూ దేశకాల విశిష్ట పరిస్థితుల చేత నిర్ణయింపబడతాయి.
చారిత్రక నవలలోని మరొక ముఖ్య లక్షణం పాత్రలను ఆనాటి చారిత్రక శక్తులకూ, సామాజిక ధర్మాలకూ ప్రతినిధులుగా చిత్రించి, వాటి మధ్య జరిగే ఘర్షణను పాత్రల మధ్య జరిగే ఘర్షణగా చిత్రించడం. పాత్రల మధ్య జరిగే ఘర్షణ కేవల వైయక్తిక స్వార్థాలవల్లనో, కేవల వైయక్తిక కారణాల వల్లనో జరగదు. ఆ పాత్రలు భిన్న చారిత్రక శక్తులకు ప్రతినిధులైనందున ఘర్షణ తప్పనిసరి అవుతుంది. సమాజంలో నిత్యం ఘర్షణపడే ధర్మాలకూ, చారిత్రక శక్తులకూ, జీవిత విధానాలకూ పాత్రలు ప్రాతినిధ్యం వహించడమంటే ఆ పాత్రలు యోచించి, చర్చించి, లాభనష్టాలు బేరీజు వేసుకుని ఒక పక్షం వహించడం కాదు. ఆ పాత్రల జీవిత పద్ధతులూ, మనోధర్మాలూ, అవ్యక్తకాంక్షలూ అన్నీ కలిసి ఆయా పాత్రలు ఆయా పక్షం వహించేటట్టు (గత్యంతరం లేదని అనిపించే విధంగా) నిర్ణయిస్తాయి.
చారిత్రక నవలలో చారిత్రక పరిస్థితులకూ, చారిత్రక వాతావరణానికీ ప్రాముఖ్యం వుంటుంది. కానీ అంతమాత్రాన రాజకీయ చర్చలకూ, ఉపన్యాసాలకూ, తీర్మానాలకూ ప్రాముఖ్యం వుంటుందనుకోవడం పొరపాటు. తారీఖులకూ, దస్తావేజులకూ చరిత్ర అధ్యయనంలో విలువ వుండవచ్చు గానీ, చారిత్రక నవలలో వుండదు. యెందుకంటే చారిత్రక నవల చారిత్రకంగా వుంటూనే నవలా లక్షణాలను అణుమాత్రం కూడ కోల్పోకూడదు. కనుక చారిత్రక నవలలో చారిత్రక పరిణామక్రమంలోని వివిధ ఘటనల విపుల చిత్రీకరణకూ, ఆ ఘటనల పూర్వాపరాల విస్తృత పరిశీలనకూ తావుండదు. చారిత్రక పరిణామంలోని సారభూతమైన (Essential) కొన్ని ఘటనలకు మాత్రమే తావుంటుంది. అనగా చారిత్రక పరిణామ క్రమానికి క్లుప్తీకరణా (Condensation) సాంద్రీకరణా (concentration) జరుగుతాయి. తత్ఫలితంగా చరిత్ర నాటకీకృతం అవుతుంది. అంతేగాక, సారభూతమైన ఆ ముఖ్య ఘటనల చిత్రణ కూడా (ఘటనల ఆర్ధిక సాంఘిక రాజకీయ ఫలితాలూ కారణాలూ అంటూ) శుష్క శాస్త్రచర్చకు దిగకుండా, ఆ ఘటనలు వ్యక్తుల జీవితాలను ఏ విధంగా మార్చివేసిందీ, వ్యక్తుల హృదయాలను యే విధంగా కలచి వేసిందీ కళాత్మకంగా ప్రదర్శిస్తుంది. కళాత్మకంగా అంటే వ్యక్తుల కష్టసుఖాలకూ, రాగద్వేషాలకూ, హృదయగతమైన అనుభూతులకూ ప్రాముఖ్యం యివ్వడం. అప్పుడే నాటకీకరణ పరిపూర్ణమూ అవుతుంది. సాఫల్యమూ పొందుతుంది, అప్పుడే ఆనాటి సమాజమూ, ఆనాటి ప్రజాజీవితమూ రక్తమాంసపుష్టంగా మన కండ్లముందు ప్రత్యక్షమౌతాయి. అప్పుడే అది సాహిత్యమౌతుంది. వ్యక్తుల హృదయానుభూతులతో నిమిత్తం లేకుండా కేవల చారిత్రక పరిఙ్ఞానమే చాలుననుకుంటే, దానికి చరిత్ర గ్రంథాలు వున్నాయి; చారిత్రక నవలలు రాయడం అనవసరం. ఆ చారిత్రక దశలోని ప్రజాజీవితంతో పాఠకుడు తాదాత్మ్యం పొందగలిగినప్పుడే చారిత్రక నవల సార్థకమౌతుంది.