ఇటు నేనే – అటు నేనే

వస్తున్నాను…
చించుకుంటూ
వస్తున్నాను…
లో…
చించుకుంటూ
వస్తున్నాను…
ఆ… లో…
చించుకుంటూ
వస్తున్నాను…


నువ్వు
నన్ను చూసి
అలా నవ్వుతూనే ఉండు
నీ గుండెల్లో ఎప్పుడో
గోలీ వేస్తాను
నా పదకవితల
రంగోలీ వేస్తాను


కులికినా
ఒలికినా
నా అక్షరాలకు
నీ రూపమే
ఇస్తాను
పేరు ఏమి పెట్టినా
ప్రేమ కవిత్వమే రాస్తాను


వరించెద స్మరించెద
చలించెద జ్వలించెద
…చెద …చెద
చెద చెద చెద చెద
ఆత్మాశ్రయ కవిత్వం
అంతా చెద
అయినా
రచించెద
(మౌల్వీ కాల్వినో
నీకే అంకిత మిచ్చెద)


తదేకంగా చూస్తున్నాను
“చోళీ వెనకాలేమున్నది?”
పాడుతూ ఆడుతోంది
కళా రింఛోళి మాధురి
“ఎలా ఉంది?”
పక్కన కూచుని నన్నే
తదేకంగా చూస్తున్న బాధురి
“ఎద కదిలించుచున్నది”


హైదరాబాదు –
వందల సంవత్సరాల
భాగ్యనగరంలో
రాబోయే వేయి
సంవత్సరాలకు
గలీ గలీ
గలీజుకు
లీజు కిచ్చేశారు


అందుకే
లా వత్తు లోనే వుంది
యావత్తూ
ఒక సంస్థకి
ఒక నాయకుడు
గ్లోరీ
మరొకడు
గోరీ


వాడు
నాకు బాగా తెలిసిన వాడు
ఇద్దరం చాలా సంవత్సరాలు
కలిసి చదువుకున్నాం
ప్రతి తరగతిలోనూ
వెనకబడి ఉండేవాడు
వెనకబడిన తరగతులవాడని
నాకన్నా ముందు
వాడికి ఉద్యోగం ఇచ్చారు


వీడు
వీడూ బాగా తెలిసిన వాడే
కాకపొతే వీణ్ణి
అయిదేళ్ళ కొకసారి
చూస్తాను
మళ్ళీ మళ్ళీ
నమస్కారాలతో వస్తాడు
వంగి వంగి నవ్వుతూ
పలకరిస్తాడు
చుట్టూ తిరుగుతాడు
ఒళ్ళు నాకడు కానీ
అంతా నా కుక్క లాగే
ఎంత వినయం
నక్క కన్నా వీడే నయం


మొన్న నిన్న ఈరోజు
ఈ మూడ్రోజులూ
మూడు లారీలెక్కాను
మూడు పార్టీల లారీలు
అదే బిర్యానీ పొట్లం
అదే చల్లన్నం ముద్ద
అవే రెండొందల రూపాయలు
ఏ పార్టీ చూసినా ఒకటే మొహం
నామొహం.

“సమాజంలో అందరినీ
కలుపుకు పొయ్యే కార్యక్రమం.
మీవంటి మేధావులు తప్పకుండా రావాలి”
కరపత్రం చేతిలో పెట్టి
తన కళ్ళజోడు లోంచి నా కళ్ళల్లోకి చూస్తున్న
నిక్కరుడు గట్టిన పెద్దమనిషిని
కాస్త నవ్వించాలనిపించి
కాగితం లోకి చూస్తూ బిగ్గరగా చదివాను
‘ఐక్య హిందూ నమాజోత్సవం’


“ఓరి దేముడా
ఒక లెక్కల పంతుల్ని
ఇమ్మంటే
సున్నాలేసేవాణ్ణిచ్చావా”


కళ్ళల్లో శుక్లాలు
“తెర తీయగరాదా!”
మహిమ చూపిచ్చాడు
రెటినా ఊడిపోయింది
లెంప లేసుకున్నాను
పొరపాటై పోయింది
“పొర తీయగరాదా”
వైద్యో నారాయణో…
చూపిచ్చాడు.


“కొన్నాళ్ళు
కళ్ళజోళ్ళు రెండు వాడండి.”
తెర ఊడిన కన్నులో
పొర తీసిన హరి
“ఒకటి
మయోపియాకి,
రెండోది…”
“నాకు తెలుసు
అయోమయోపియాకి.”


“భూమి ఆకార మెట్లుండును?”
ఆంధ్రా మెట్రిక్‌లో ప్రశ్న
కొక జవాబు
“కోడి గుడ్డు వలె బల్లపరుపుగా నుండును”
ఆమ్లెట్ జ్ఞాపకం వచ్చింది అర్భకుడికి*
* (ఆచార్య సోమనాథం మాట.)


విఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయంలో
పేరుబడ్డ పేకలూ టీ క్లబ్బు.
చాక్పీసు ముట్టుకుంటే చెయ్యి వణికిపొయ్యే
పంతులయ్య అంగుళీ మాలుడూ
కళ్ళ చమక్కుతోనే క్లాసు గడిపేసే
గంతులమ్మ కపాల కుండలా
కారమ్స్ బోర్డ్ ఆడుతున్నారు
మంత్రాలకు రాలే చింతకాయల్లా
కాయిన్స్ కన్నాల్లోకి వెళ్ళి పోతున్నాయ్
“పౌడర్, పౌడర్!” అంగుళీ మాలుడు
“నువ్వూ పౌడర్ వేసి ఆడితే ఎలా సాయిబూ
అత్తరు వేసి ఆడు.”
కపాల కుండలకీ, అంగుళీ మాలుడికీ
మధ్య నేపాళమాంత్రికుడు
“తహతహా! నువ్వు జుట్టుకు రంగేసుకోవేం?”
పాల కుండలా కూర్చుని అడిగింది కపాల కుండల
“ఉహూ, గ్రే గ్రేస్‌ఫుల్లీ ఆర్ డై!”
“నా తండ్రే”
ఇంటికొచ్చాను
“అమ్మా! నువ్వు జుట్టుకు రంగేసుకోవాలి”
అన్నం తింటున్న కూతురు.
“ఎందుకు తల్లీ?”
“అన్నంలో తెల్ల వెంట్రుక
తీయటం కష్టమైంది.”
చేతులు కడుక్కుంటూ
కూతురు.


“నాన్నా”
అమెరికానించి
ఫోన్లో నా కొడుకు
ఇటు నేనే
“మీ రెండో మనవరాలు
చెట్టెక్కని భేతాళుడు
ఎప్పుడూ నా భుజం మీదే.”
“మామయ్యా”
ఫోన్ లాక్కున్నట్టుంది
కోడలు
నెమలి కంఠం రంగు
చీర కట్టుకుందేమో
పురి విప్పినట్టుంది గొంతు
“చెట్టు మీది కోతి
మీ పెద్దది
మొసలీ
బుర్ర
ఇంట్లో మరిచి పోయింది
అంది.”
పెనుమాయను చినమాయలు
చప్పరిస్తున్న వేళ
అటు నేనే