అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?

అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళకోసం జంపాల చౌదరి గారు ఐదు సంవత్సరాల క్రితం డైజెస్ట్ పద్ధతిలో “తెలుగునాడి” అనే మాసపత్రిక ప్రారంభించారు. తెలుగుదేశపు రాజకీయాలు, విమర్శలు, పాత కథలు, కొత్త కథలు, కవితలు, వ్యాఖ్యానాలు, సినిమా నాస్టాల్జియా, పిల్లలకోసం ప్రత్యేక శీర్షికలూ అన్నీ కలిపి అందమైన కాగితంపై అచ్చు వేసి నెలనెలా అందించారు. క్రిందటి నెలతో ఆ ఒక్క డైజెస్ట్ పత్రిక ఆగిపోయింది. కారణం: చందాదారుల సంఖ్య పెరగలేదు; ప్రకటనల సంఖ్య మాత్రం తగ్గు ముఖం పట్టింది. ఐదు సంవత్సరాలపాటు ధైర్యంగా, పట్టుదలతో పత్రిక ప్రచురించిన తెలుగునాడి సంపాదకవర్గాన్ని అభినందించక తప్పదు.

ఈ సందర్భంలో అమెరికాలో అచ్చులో పత్రికల ప్రచురణ గురించి ముచ్చటించడం అవసరం.

పాశ్చాత్య దేశాలలో అచ్చులో పత్రికలు అంతరిస్తున్నాయి అని చెప్పడం అతిశయోక్తే కావచ్చు. కాని అచ్చులో పత్రికా ప్రచురణకి క్షీణదశ వచ్చింది అని ఘంటాపథంగా చెప్పడానికి ప్రత్యేకమైన ప్రావీణ్యత అక్కరలేదు. టీనా బ్రౌన్‌ అన్నట్టు ‘సముద్ర కెరటాలపై సర్ఫ్ (సవారీ) చెయ్యటానికి సముద్ర శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించనక్కరలేదు’.

అమెరికాలో గత యాభై యేళ్ళలో ఆనవాయితీగా దినపత్రిక చదివే జనాభా సుమారు ఎనభై నుంచి యాభై శాతానికి తగ్గింది. దినపత్రికలకి చందాదారుల సంఖ్య ఏటేటా రెండు శాతంనుంచి ఐదు శాతంవరకూ తగ్గుతోంది. 18-35 సంవత్సరాల వయస్సులో వున్న యువతలో పంతొమ్మిది శాతానికి మాత్రవే దినపత్రిక చదివే అలవాటు ఉన్నది. పత్రికా ప్రచురణ వ్యయం పెరిగింది. ప్రకటనల పరంగా వచ్చే ఆదాయం పల్చబడింది. కొన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన దినపత్రికలు అప్పుల భారంలో మునిగి పోతున్నాయి. ఈ మధ్యకాలంలో నూటయాభైయేళ్ళుగా ప్రసిద్ధికెక్కిన దినపత్రికలు మూతపడ్డాయి; మూత పడని పత్రికలలో పాత్రికేయుల సిబ్బంది పల్చబడ్డది. సిబ్బందితో పాటు పత్రికల సైజు కూడా తగ్గింది.

టెలివిజన్‌, ఇంటర్నెట్, ముఖ్య వార్తలని కాలయాపన కాకుండా తక్షణం అందిస్తున్నాయి. అందుకనే దాదాపు అన్ని ఇంగ్లీషు దినపత్రికలు అచ్చులోనే కాక ఇంటర్నెట్లో కూడా ప్రచురించడం మొదలు పెట్టారు, దినపత్రిక చదివే యువత జనాభా పెంచడం కోసం; తద్వారా వచ్చే ప్రకటనల రాబడి పెరుగుతుందన్న ఆశతోనూ.

అతి వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్ ప్రభావం వల్ల ఇప్పుడు మనకి అలవాటైన పద్ధతిలో దినపత్రిక అనేది సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చు. త్వరలో అచ్చుపత్రికలు ఈ-ఇంక్ తోనో, ఈ-పేపర్ (Flexible OLED) మీదనో రావచ్చునేమో! అప్పుడు అచ్చుపత్రిక అంటే నిజంగా వెదురు గుజ్జు కాగితం పైన అచ్చు వేసింది అవుతుంది. కనీసం అప్పటి దాకా అచ్చులో దినపత్రికలు అంతరించడానికి పైన యిచ్చిన కారణాలు అన్ని రకాల పత్రికల ప్రచురణకీ వర్తిస్తాయని అని నా నమ్మకం.

దినపత్రికలు కేవలం వార్తలకే పరిమితం అయినా, వార్తలకే పరిమితం కాని వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు అమెరికాలో ఎన్నో ఉన్నాయి. అమెరికాలో ప్రతి హాబీని ప్రోత్సహించే వ్యాపార పత్రికలు కోకొల్లలుగా ఉన్నాయి. కార్లకి, షికార్లకి, పుకార్లకీ, అందానికీ, ఆరోగ్యానికీ కూడా పత్రికలున్నాయి. కావాలంటే ఈసారి మీరు డాక్టరు గారి ఆఫీసు కెళ్ళినప్పుడు కాలయాపన చెయ్యడం కోసం వెయిటింగ్‌ హాల్లో పడేసిన పత్రికలు చూడండి. ఎన్నిరకాల పత్రికలు ఎంత అందంగా అచ్చయి వస్తున్నాయో లెక్క కట్టడం కష్టం. వీటి భవిష్యత్తు ఏమిటి?

ఒకటో రెండో మినహా, మిగిలిన పత్రికలన్నీ అచ్చుపత్రికలుగానే ఉండే అవకాశం ఉన్నది. ఇందుకు కారణం చందాదారుల సంఖ్యా కాదు, లబ్ధప్రతిష్టులయిన రచయితల వ్యాసాల ప్రచురణా కాదు. అవి అచ్చులో మనగలగడానికి కారణం వాటిలోని వ్యాపార ప్రకటనలే. ఈ రకం పత్రికలలో, ఏ పత్రిక తిరగేసి చూసినా, నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం పేజీలు వ్యాపార ప్రకటనలతో నిండి ఉంటాయి. ఈ పత్రికలలో వేటికయినా సంవత్సర చందా విడి ప్రతి ఖరీదుతో పోల్చి చూస్తే అతి స్వల్పం. అంటే, చందాదారుల మూలంగా ఈ పత్రికలకి చెప్పుకోదగ్గ రాబడి ఏమీ లేదు. అసలు ఏ పత్రికా చందాదారుల చందా రాబడిపై ఆధారపడి మనలేదు. అయితే, ఈ పత్రికల సర్క్యులేషన్‌ ఎంత ఎక్కువగా చూపగలిగితే ఆ పత్రిక యాజమాన్యానికి వ్యాపార దృష్ట్యా అంత ఉపయోగకరం. ఎందుకంటే, పత్రికలకి ప్రకటనల వలన వచ్చే రాబడి ఆ పత్రికల సర్క్యులేషన్‌ పై ఆధారపడి ఉంటుంది.

ఇవి కాక, కేవలం సాహిత్యం, సంస్కృతి, కవిత్వం, విమర్శ లాంటి “హై బ్రో” విషయాలకి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చే పత్రికల మనుగడ గురించి చూద్దాం. వీటిలో కొన్ని పత్రికలు వ్యాపారసరళిలో ప్రచురించబడేవి. ఈ పత్రికలకి కూడా ప్రకటనల వలన వచ్చే రాబడి సుమారు ఇరవై శాతం తగ్గిందట! ఈ తరహా పత్రికలు ఇప్పటికే ముఖ్యంగా – బ్లాగ్‌ సంస్కృతి – తెచ్చిన మార్పులతో, ఇంటర్నెట్లోకి వచ్చాయి. ఈ పత్రికలు అచ్చుపత్రికలుగా కూడా ఎంతకాలం ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. అమెరికాలో “పొయట్రీ” (Poetry Magazine) అనే పత్రికకి ఒకరు నూరు మిలియన్లు దానం ఇచ్చారు. మంచి నాణ్యత గల సాహితీ పత్రిక ప్రచురించడానికి లాభాపేక్ష లేని పెద్ద సంస్థల, లేదా, వ్యక్తుల మద్దతు అవసరం.

అచ్చుపత్రిక కానీయండి, వెబ్‌పత్రిక కానీయండి, వ్యాపార సరళిలో పత్రిక నడపాలంటే, ఆ పత్రికలో విరివిగా ప్రకటనలుండాలి. విరివిగా ప్రకటనలు రావాలంటే సర్క్యులేషన్‌ పెరగాలి. ఎథ్నిక్‌ పత్రికలకి, ముఖ్యంగా ప్రవాస భారతీయుల మాతృభాషలలో ఎథ్నిక్ పత్రికలకి సర్క్యులేషన్‌ ఒక పట్టాన పెరగదు. కారణాలు వెదకడం అనవసరం. నా ఉద్దేశంలో, దేశవ్యాప్తంగా ఎథ్నిక్ పత్రికలు వ్యాపారసరళిలో నడపటం ప్రస్తుతానికి చాలా కష్టమైన పని.

ముగింపుగా రెండు ప్రశ్నలు.

తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి వుండేదా? అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న. ఈమాట అచ్చుపత్రికగా కూడా ప్రచురిస్తూ ఉండుంటే ఇప్పటిదాకా మనగలిగేదా?


సంప్రదించిన కొన్ని వ్యాసాలు:

  1. Tina Brown interview as Q & A in The Daily Beast, October 5, 2008
  2. Eric Alterman’s essay, Out of Print in The New Yorker, March 31, 2008
  3. The Economist, “Who killed the newspaper?” August 24, 2008
  4. Randy Dotinga in The Christian Science Monitor, April 25, 2005