ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం

గూగుల్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలో విజ్ఞానసాహిత్యం అంతా – సున్నా ఒకటీ సున్నా ఒకటీ సున్నా ఒకటీ – అంటూ ఎడాపెడా డిజిటైజ్ చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. గూగుల్ ఇప్పటికి ఏడు మిలియనుల పైచిలుకు పుస్తకాలని డిజిటైజ్ చేసింది. ప్రస్తుతానికి, ఈ ఏడు మిలియనులలో తెలుగు పుస్తకాలు ఏవీలేవని ధీమాగా చెప్పవచ్చు. అయితే, ఉదాసీనత మంచిది కాదేమో! ఈ మధ్యకాలంలో కాపీరైట్ దారుల కలకలంతో గూగుల్ చేస్తున్న పనికి తాత్కాలికంగా ఆటంకం వచ్చిపడింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుల్లో ఉన్నది. లేకపోతే ఈ పాటికి బహుశా ఇంకో ఏడుమిలియన్ల పుస్తకాలు ‘గూగుల్ పుస్తకాలు’ గా మారి ఉండేవి. అప్పుడుకూడా, గూగుల్ తెలుగు జోలికి వచ్చి ఉండక పోవచ్చు. అందుకు ఇప్పుడు కారణాలు వెదకడం అనవసరం. తాత్కాలికంగా వచ్చిన కాపీరైట్ కలకలం సద్దుమణగగానే, అనతి కాలంలో, అంటే నాలుగైదేళ్ళ వ్యవధిలో ప్రపంచసాహిత్యం అంతా (భారతదేశానికి సంబంధించినంత వరకూ, ముందుగా హిందీ, తరువాత అరవం, బెంగాలీ, ఆ తరువాత తెలుగూ!) గూగుల్ గుప్పిట్లో ఇమిడి పోయే సూచనలు కనిపిస్తున్నాయి.

విజ్ఞానం ప్రజల సొత్తు. ప్రపంచ ప్రజల సొత్తు. సమాజంలో ఏదోరకమైన ఆధిక్యత ఉన్న ప్రత్యేక వర్గాలు ‘ఇదంతా మాది’ అని గుత్తకి తీసుకోవడం అధర్మం, అన్యాయం. ఇవి అందమైన నినాదాలు. విజ్ఞానం అందరికీ అందుబాటులోకి తేవడం అనే కోరిక అద్భుతమైన కోరిక. సర్వశాస్త్ర విజ్ఞానాన్నీ ప్రజాస్వామ్యీకరించడం అంతకన్నా అద్భుతమైన ప్రణాళిక. ఈ నినాదాలు, కోరికలు, ప్రణాళికలూ – ఇవి ఏవీ కొత్తవి కావు. అందమైన నినాదాలు, అద్భుతమైన కోరికలూ నిరుపయోగం అని వేరే చెప్పనక్కరలేదు. అందుచేత వాటిని పక్కకి పెట్టి, ప్రణాళిక పరంగా ఆలోచిద్దాం. గూగుల్ చేపట్టిన ప్రణాళిక – డిజిటైజేషన్‌ ద్వారా సర్వసాహిత్యాన్నీ డెమోక్రటైజ్ చెయ్యడం. ఈ బృహత్ప్రణాళిక వలన వచ్చే లాభనష్టాల బేరీజు వేసుకుందాం (మనం అంతకన్నా ఎక్కువగా ఏమీ చెయ్యలేం కాబట్టి!).

ముందుగా కాపీరైట్ చట్టాల గురించి కొంచెం ముచ్చటించటం అవసరం. ప్రస్తుతం మనం చెయ్యగలిగిగింది ముచ్చటించుకోవడం మాత్రమే! ఎంచేతంటే, ప్రస్తుతం అమలులో ఉన్న కాపీరైట్ చట్టాలు అంత తేలికగా బోధపడేవి కావు. కారణం, ఇవి రాసింది చట్టనిర్మాణ శాస్త్రంలో పట్టాలు పుచ్చుకున్నవాళ్ళు, అంటే లాయర్లు. ఆ శాస్త్రంలో పట్టభద్రులకే అవి సరిగా అర్థం కాని భాషలో, రకరకాల మెలికలతో రాసారు, మార్పులు చేసారు. సుమారు, మూడువందల ఏళ్ళ క్రిందట ప్రచురణకర్తల మొనాపలీని నిరోధించడానికి బ్రిటన్‌లో మొట్టమొదటిసారిగా కాపీరైట్ చట్టం అమలులోకి వచ్చింది. పధ్నాలుగు సంవత్సరాలు పాటు ప్రచురణకర్తకి కాపీరైట్ ఉంటుంది. తరువాత, ప్రచురణకర్త కోరికపై మరొక పధ్నాలుగేళ్ళు. ఆపైన, ఆ ప్రచురణ ప్రజలందరిదీనూ! అంటే పబ్లిక్ డొమైన్‌ లోకి ఒస్తుందన్నమాట! మొదట్లో ఈ పధ్నాలుగు సంఖ్య ఎందుకు ఖరారయ్యిందో ఎవరికీ తెలియదు (మా జిల్లాలో ఇప్పటికీ మామిడిపళ్ళు పరకల లెక్కనే అమ్ముతారు. పరక అంటే పధ్నాలుగు!). పోతే, అమెరికాలో కాపీరైట్ చట్టాలు ఏతావాతా పదకొండుసార్లు తిరగ రాసారు. పర్యవసానం: పుస్తక రచయిత కాలం చేసిన తరువాత, డెబ్భైయేళ్ళు కాపీరైట్ అమలులో ఉంటుంది. ఇందులో ఇంకా రకరకాల చిలవలు పలవలున్నాయనుకోండి. వివరాలకి న్యాయవాదులని సంప్రదించడం ఉత్తమం. ఏది ఏమయితేనేం! ఒక్క విషయం మాత్రం ఖాయం. 1923 కి ముందుగా ప్రచురితమైన పుస్తకాలకి కాపీరైట్ లేనట్టే! భారతదేశం లో కాపీరైట్ చట్టాల గురించి నాకు తెలియదు. నాకు తెలిసిన చాలామంది రచయితలు, వ్యంగ్యంగానే అనుకోండి, “ఇండియాలో కాపీ చెయ్యటమే రైట్!” అని అనడం విన్నాను. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌలభ్యం వచ్చింతరువాత.

కాపీరైట్ లేని పుస్తకాలు, అంటే 1923 కి పూర్వం ప్రచురితమైన పుస్తకాలన్నీ, గూగుల్ పుస్తకభాండారం నుంచి ఏ రుసుమూ కట్టకండా ఎవరైనాసరే కాపీ చేసుకోవచ్చు. అంటే, వ్యాఖ్యానం లేని వేదాలు, ఉపనిషత్తులూ, బైబిళ్ళూ, టోరాలూ అల్లాంటివన్నీ అన్నమాట. ప్రస్తుతం, గూగుల్ భాండారంలో కాపీరైట్ హరించిపోయిన పుస్తకాలసంఖ్య ఒక మిలియన్‌. ఇది, గూగుల్ ద్వారా మనందరికీ వచ్చే లాభమేనని ఒప్పుకోవాలి. పోతే, మిగిలిన ఆరుమిలియన్ల పుస్తకాలకీ కాపీరైట్ ఉన్నది. ఈ ఆరుమిలియన్లలో అచ్చులో అందుబాటులో ఉన్న పుస్తకాలు ఒక మిలియన్‌. అంటే, మిగితా ఐదు మిలియన్ల పుస్తకాలకీ అచ్చు ప్రతులు దొరకవు. వీటిలో ఏ పుస్తకం కావాలన్నా గూగుల్ కి ఎవరోవొకరు (లైబ్రరీలో, వ్యక్తులో) ఏదోరకమైన రుసుం చెల్లించాల్సిందే! ఈ రుసుము ఎంత, ఎలా నిర్ణయింపబడుతుంది అన్నది చాలా జటిలమైన ప్రశ్న.

గూగుల్ కంపెనీ ప్రజాసేవ కోసం విశ్వశ్రేయస్సు కోసం తపన పడుతూన్నదని మనం భ్రమ పడనక్కరలేదు. ప్రారంభంలో, అన్ని రకాల వ్యాపార సంస్థల లాగానే, గూగుల్ కూడా పరమ చవగ్గా పుస్తకాల కాపీని ప్రోత్సహించవచ్చు. ఆ తరువాత, వాళ్ళు ఎంత అంటే అంతే రుసుము కట్టుకోవాలి, తప్పదు. కారణం: గూగుల్‌కి పోటీ లేదు. అదే స్థితి గనక వస్తే, ఒక రకంగా జనబాహుళ్యానికి నష్టమే. దానికి తోడు, ప్రస్తుతం గూగుల్ సంస్థకీ – కాపీరైట్ ఉన్న ప్రచురణకర్తలకీ, రచయితలకీ మధ్య వ్యాజ్య వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చింతరువాత, గూగుల్ ప్రపంచ సాహిత్యం అంతనీ డిజిటైజ్ చెయ్యడానికి సంసిద్ధమై ఉన్నది. అప్పుడు పరిస్థితి ఎలాఉంటుందో ఎవరికైనా సరే ఊహించడం కష్టమేననిపిస్తున్నది, బహుశా, ఏ జార్జ్ ఆర్వెల్‌ లాంటి వాడికో తప్ప! ఆ సందర్భంలో డెమోక్రటైజేషన్‌ అన్న అద్భుత ప్రణాళిక యుటోపియాగా మారుతుంది. అప్పుడు – సున్నా ఒకటీ సున్నా ఒకటీ సున్నా ఒకటీ – ప్రణాలికలో మన స్కోరు సున్నా, గూగుల్ స్కోరు ఒకటీ అయ్యే ప్రమాదం లేకపోలేదు.

డిజిటైజేషన్‌ మూలంగా మరొక లాభం ఉన్నది. అచ్చు ప్రతుల సందడి బాగా తగ్గుతుంది. పుస్తకాల సైజు, బరువు మరుగున పడచ్చు. రోజులో పదహారు గంటలు లాప్‌టాప్‌కే అంకితం చేసుకున్న వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ, మిగిలిన జనాభా, అంటే మాబోంట్లకి (అంటే ప్రస్తుత జనాభాలో నూటికి తొంభై మంది అని!) నష్టం ఉన్నదని అనను కానీ, ఒక కష్టం మాత్రం ఉన్నదని చెప్పక తప్పదు. ఎడమచేతిలో నాలుగు వేళ్ళపయినా పుస్తకాన్నిఆనించి, ఎడమచేతి బొటన వేలు మోపుగా పెట్టుకొని, హాయిగా పడకకుర్చీలో వాలో, పట్టెమంచం మీద పడుకొనో, ఏ కృష్ణశాస్త్రినో, చెకోవ్‌నో, పదోసారి జె. జి. ఫ్రేజర్‌ రాసిన ‘ది గోల్డెన్‌ బౌ’ బైండ్ పుస్తకమో చదువుతూ, కుడిచేతి చూపుడువేలుతో పేజీలు తిప్పుతూ ఆనందించే భాగ్యం ఉండకపోవచ్చు. ఇది నా పుస్తకం! ఎంత పాతదైనా, ఎంత శిథిలావస్థలో ఉన్నా, ఇది నా స్వంత పుస్తకం! నాఇష్టమైన చోట ఎర్ర సిరాతో గీతలు పెట్టుకోవడం, గుర్తు కోసం పేజీలకి రంగురంగుల స్టిక్కర్లు అంటించుకోవడం, పేజీ కొసలు లోపలికి మడవడం, ఈ ప్రక్రియల్లో ఉన్న ఆనందానికి, అందుమూలంగా వచ్చే సంతృప్తికీ విలువ కట్టడం కష్టం.

అచ్చులో దొరకని పుస్తకాన్ని, మరొకసారి అచ్చువేయవలసిన అవసరం ఉన్నది సుమా అన్న విషయం పూర్తిగా మరిచిపోయే స్థితి రావచ్చు. ప్రపంచ సాహిత్యాన్నంతటినీ ‘గూగులీకరించడం’ ప్రగతికి చిహ్నం, అమెజాన్ అమ్మే కిండిల్ ఫలకం (ఖరీదు మాట అటుపెట్టి!) సంస్కృతీపురోగమనానికి గుర్తు, అని వాదించే వారికి నేను ప్రస్తుతానికి తిరోగమనవాదిగా కనిపించడం ఆశ్చర్యకరం కాదు.

మళ్ళీ మరోసారి చెప్పి తీరాలి. ఈ గూగుల్ ఉప్పెన మన గుమ్మందాకా రాలేదుగా అని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదేమో! ఆలోచించండి.

(కాపీరైట్ కి సంబంధించిన కొన్నివివరాలు Google & the Future of Books, by Robert Darnton, The New York Review of Books, February 12, 2009/Volume LVI, Number 2, అన్న వ్యాసం నుంచి తీసుకున్నాను. – వేవేరా)