శ్రీ ఆంజనేయ రక్షా కవచం

అంత పెద్ద ఊరన్న మాటేగాని ఒక చిన్న కుటుంబం బతకడానికి చాలిన రెండు గదుల వాటా దొరకడం కష్టమైపోయింది అదేం పాపమో! నేను ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చి అప్పుడే పది రోజులు దాటిపోయింది. వచ్చిన రోజు మొదలు హోటల్ భోజనం, సత్రం నిద్రగా సాగుతోంది నా బ్రతుకు. పొద్దున, సత్రం, గది రెండు రోజుల్లో ఖాళీ చెయ్యాలని నోటీసు కూడా యిచ్చేశారు.

ఇప్పటి దాకా నేను చూసిన ఇళ్ళల్లో ఒక్కటీ మా శ్రీమతికి నచ్చలేదు – ఒకటి పిల్లల బడికి దూరమనీ, మరొకటి మరీ బజారులో ఉందనీ… ఇలా ఏవేవో వంకలు! ఒక ఇల్లు నాకే నచ్చలేదు. ఇల్లంతా బాగానే ఉంది కానీ వంట గదిలో మా ఆవిడ కదిలే చోటు లేదనిపించి నేనే వదిలేశా దాన్ని. పిల్లల బడికి దగ్గర్లోనే ఇల్లు ఉండాలని మా ఆవిడ గట్టి కండిషన్ పెట్టడంతో, ఇంకేం చేయాలో తెలియలేదు. “ఎరగని ఊరిలో మొరగని కుక్క ఎందుకూ పనికి రాదు” అన్న సామెత గుర్తు వచ్చి వెంటనే, నేనంటే అభిమానంగా వుండే నా పక్క సీటు చలపతితో నా ఇక్కట్లు మొర పెట్టుకున్నా. నా కష్టాలు విని అతను వెంటనే స్పందించాడు.

“అయ్యో, చంద్రం గారూ! మీ రంత ఇదిగా చెప్పాలా! మీరీ విషయం ఇదివరకే నా చెవిని వేసుంటే ఏనాడో మీ ప్రోబ్లం సాల్వై పోయి ఉండేది తెలుసా… హైస్కూలికి బారెడు ఆవలగా మావాళ్ళ ఇల్లే ఒకటి ఖాళీగా ఉంది. మీరు ‘సరే’ అనండి, ఈ సాయంకాలమే మిమ్మల్ని తీసుకుపోయి ఇల్లు చూపిస్తా. ఆ ఇల్లు నూటికి తొంభైతొమ్మిదిపాళ్ళు మీకు నచ్చుతుందనే నా ఉద్దేశం” అన్నాడు. నేను నా మనసులోనే ఎగిరి గంతు వేశా, వెతకబోయిన తీగ వచ్చి కాలికి చుట్టుకున్నట్లు అనిపించడంతో. ఆ సాయంకాలమే అతనితో వెళ్ళి ఆ ఇల్లు చూశా.

బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. చుట్టూ ఎత్తుగా ప్రహరీ గోడ. పెద్ద ఆవరణలో మధ్యగా కట్టబడిన బంగాళా పంపిణీ ఇల్లది. విశాలమైన గదులు, ఉడ్వర్కు, అటాచ్డు బాత్రూములు – అన్ని వసతులతో ఉంది ఆయిల్లు. ఇక పెరటి దొడ్డి చూస్తేనే కడుపు నిండిపోయింది. ఎంత పెద్దదో. గుమ్మానికి దగ్గరగా పచ్చిక, మిగతా అంతా ఒత్తుగా పెరిగిన పొదలు, గోడవారగా చెట్లూ. ఓ మూలగా బోరింగు పంపు. అప్పుడే అక్కడ కిందా మీదా పడుతూ ఆడుకుంటున్న మా పిల్లలు కళ్ళకు కట్టడంతో నా వొళ్ళు పులకించిపోయింది అంటే నమ్మండి! ఈమధ్య బొత్తిగా ఇంటి మీద ఇళ్ళు కట్టేసి పిల్లలకు కాస్తయినా ఆడుకునేందుకు చోటే లేకుండా చేస్తున్నారు. ఇక వాళ్ళు టి.వి.లకు అంటుకు పోయి కాలక్షేపం చెయ్యక చస్తారా మరి!

అంతలోనే అనుమానంతో నీరసమొచ్చింది. ఇల్లు బాగుంది, సరే. ఆ ఇంటి మీద ఆశ పెంచుకోగానే సరిపోదు, అద్దె కూడా అందుబాటులో ఉండాలి కదా. చలపతిని అదే అడిగా. “అద్దా” అంటూ బుర్ర గోక్కున్నాడు. కాసేపు ఆకాశం వైపు చూస్తూ ఆలోచించాడు. గడ్డం సాలోచనగా రుద్దుకున్నాడు, నేల వైపు కాసేపు చూశాడు. చివరకు, “మీరు కాబట్టీ, ఓ ఎనిమిది వేలు ఇవ్వండి” అన్నాడు, చిన్నగా. మరీ అంత చవకా! అన్న ఆనందంతో నేను నోరు తెరిచేశా. నాకు నోట మాట రాలేదు. చలపతి అపార్ధం చేసుకుని వెంటనే రియాక్టు అయ్యాడు… “ఈ ఊళ్ళో అద్దెలు జాస్తి. రెండుగదుల ఫ్లాట్‌కే పది వేలు అడుగుతున్నారు, తెలుసా? ఆపైన మెయింటినెన్సు అనీ, నీళ్ళు కొనాలనీ… ఇలా ఏవేవో పైన కూడా గుంజుతారు! ఇక్కడ అల్లాంటివి ఏమీ లేవు. ఇది నా ఇల్లు కాదు, మా మామగారిది. నేనూ వాళ్ళకి జవాబు చెప్పాలి కదా. ఎనిమిదివేలకు తగ్గితే బాగుండదు” అన్నాడు.

క్షణం ఆలస్యం చేస్తే మళ్ళీ మాట మారి పోవచ్చునన్న భయంతో నేను వెంటనే పర్సు బయటకు తీసి, ఎందుకైనా ఉంటాయని దొంగ అరలో దాచి ఉంచిన వెయ్యి రూపాయలూ తీసి చలపతి చేతిలో ఉంచా, “ఇదిగో అడ్వాన్సు, ఈ ఇల్లు మాకు ఖాయం” అంటూ. ఆ డబ్బు సంతోషంగా జేబులో పెట్టుకుంటూ, “ఒక నెల అద్దె డిపాజిట్‌గా ఇవ్వాలి. ఆపైన ప్రతినెలా, ఆ నెల మొదటి వారంలోనే అద్దె ఇచ్చెయ్యాలి. మళ్ళీ మీరు ఖాళీ చేసినప్పుడు ఇంటిని యధాతధంగా అప్పగించాలి. ఇవి షరతులు. వీటికి మీరు ఒప్పుకుంటే, రేపు సాయంకాలానికల్లా శుభ్రం చేయించి, తాళాలు మీ చేతిలో ఉంచుతా. ఎల్లుండే మీరు అందులో చేరిపోవచ్చు” అన్నాడు చలపతి.

“సరే” అన్నాను సంతోషంగా. ఆ ఏర్పాటు నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజే నేను సత్రం గది ఖాళీ చెయ్యాలి కూడా. ఇకనేం, నేరుగా వెళ్ళి ఆ ఇంటిలోనే చేరిపోవచ్చు. ఆ రోజు రాత్రి దీపాలు పెట్టేవేళ వచ్చాడు చలపతి నేనుండే సత్రం గదికి. “ఈ రోజు ఆదివారం కావడం కలిసొచ్చింది. దగ్గరుండి ఇల్లంతా శుభ్రం చేయించేశా. ఇవిగో తాళంచెవులు” అంటూ,తాళాలు నా చేతిలో పెట్టాడు అన్నమాట ప్రకారం. నేనూ నా మాట నిలబెట్టుకోడం కోసం వెంటనే, పదిహేను వేలకి చెక్కు రాసి ఇచ్చేశా. అతడు నాకు అభినందనలు చెప్పి వెళ్ళి పోయాడు.

అతడటు వెళ్ళగానే నేనిటు మా ఆవిడకు ఫోను చెయ్యడం కోసం పరుగెత్తా. నేను చెప్పిందంతా విని మా ఆవిడ ఆ ఇంటిని అప్రూవ్ చేసింది. ఇక ఆ రాత్రి నాకు ఉద్వేగం ఎక్కువై చాలాసేపటివరకు నిద్ర పట్టనేలేదు.


సోమవారం ఎప్పటిలాగే ఆఫీసుకి వెళ్ళా. లంచ్ అవర్‌లో బలరామమూర్తిగారు పలకరించారు, “ఏమోయ్ చంద్రం! నీ ఇల్లు వెతకడం ఎంతదాకా వచ్చిందేమిటి” అంటూ. అందరికంటే వయసులో పెద్ద, సెక్షన్ హెడ్డు, అందరి యోగక్షేమాలూ విచారిస్తూ ఉంటారలా.

“ఇల్లు దొరికింది సార్! చంకలో పిల్లిని ఉంచుకుని ఊరంతా వెతికినట్లయ్యింది చూడండి. నా బాధ చెప్పగానే చలపతి వాళ్ళ మామగారి ఇల్లు చూపించారు. హైస్కూలుకి వంద గజాలు దూరం కూడా ఉండదు. ఇల్లు చాలా బాగుంది” అంటూ తలెత్తి చూశా. అక్కడున్న వారిలో ఎవరి మొహాల్లోనూ కత్తి వేటుకు చుక్క నెత్తురు బొట్టు లేదు. అందరూ తెల్ల మొహాలు వేసుకుని నా వైపే చూస్తున్నారు.

“ఏమిటలా చూస్తున్నారు? ఏమయ్యింది?” అని అడిగా ఆత్రంగా.

బలరామమూర్తిగారు నెమ్మదిగా కోలుకొని, “చంద్రం! నువ్వు మోసపోయావయ్యా. ఆ చలపతి ఎంతకైనా తగినవాడే! మేము నిలబెట్టి కడిగేస్తామన్న భయంతో కాబోలు, జ్వరమని వంక పెట్టి సెలవు పెట్టేశాడు ఈ రొజు” అన్నారు. నా కెందుకో చాలా భయం వేసింది.

“ఏమిటి సార్, విషయం ఏమిటో చెప్పండి” అంటూ ప్రాధేయపడ్డా, గుండెల్లో దడ పుడుతుంటే.

“అది ఒక ‘హాంటెడ్ హౌసు’! దయ్యాల కొంప. ఆ ఇంటిలో ఒక లంబాడీ దయ్యం ఉంది. వీధిలోనుంచే వింటే పగలూ రాత్రీ అక్కడ గజ్జల చప్పుళ్ళు వినిపిస్తాయి. తెలుసా” అన్నారు బలరామమూర్తిగారు. అంత వరకు పొంగి పొరలుతున్న నా సంతోషమంతా చప్పగా చల్లారి నీళ్ళు కారిపోయింది. ఏమిచెయ్యడానికీ పాలుపోలేదు నాకు. అందరిలోకీ చిన్నవాడైన సంతోష్, “భయపడకండీ మాస్టారూ! ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరూ నమ్మరు. దయ్యాలూ భూతాలూ అంతా నాన్సెన్స్” అన్నాడు.

బలరామ మూర్తి గారు ఉడుక్కున్నారు. “అవును బాబూ! మీరు దేవుణ్ణీ, దయ్యాన్నీ కూడా నమ్మరు. ప్రతి దానికీ దృష్టాంతం కావాలి మీకు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి కనిపించి మనుష్యుల్లో నమ్మకాల్ని పుట్టిస్తాయి. ఒక లంబాడీ పోరి ఆ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా? అక్కడ వినిపించే గజ్జల మ్రోత ఏమిటి? ఆ తరవాత ఆ ఇంట్లో ఎవరూ కాపురం ఎందుకు లేరు?” సవాళ్ళు విసిరాడాయన.

“అసలు లంబాడీ పిల్ల ఆ ఇంట్లో ఎందుకు ఉంది? ఎందుకు చచ్చిపోయింది?” అడిగా ఆశ్చర్యపోతూ.

“చెపుతా విను. ఆ ఇల్లు మన చలపతి మామగారు కట్టిస్తూండగానే ఒక జాగీర్దారు కన్ను దానిమీద పడింది. అది వాడికి అద్దెకి ఇవ్వక తప్పలేదు. వాడక్కడ చేరి చెయ్యని అఘాయిత్యం లేదు. ఒక సారి ఒక లంబాడీ పిల్లని చెరబెట్టాడు. వీడు పెట్టే బాధలు పడలేక ఆ పిల్ల పెట్టిన కేకలు చాలా మంది విన్నారు. కాని ఆ జాగీర్దారు రౌడీయిజానికి భయపడి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయేవారు. చివరకి ఒక రోజు మిట్టమధ్యాహ్నం వేళ ఆమె ఎలాగో తప్పించుకుని బయటికి వచ్చి దొడ్లోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటికి ఆవలగానున్న చింత చెట్టెక్కి చిగురు కోసుకుంటున్న పిల్లలు చూసి గోల గోల చేశారు. నలుగురూ పోగై వెళ్ళి ఆమెను బయటికి తీసేసరికే ఆమె చచ్చిపోయింది. జాగీర్దార్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంగతికి నేనూ ఒక సాక్షినే. తర్వాత ఆ బావి పూడ్చేయించారు. ఒకటి రెండు నెలల తర్వాత ఆ ఇంటి ఆవరణలో గజ్జల మోతలు మొదలయ్యాయి. ఇదీ ఆ ఇంటి సంగతి” అంటూ కధ ముగించి మంచినీళ్ళు తాగారు బలరామమూర్తిగారు.

నాకు గుండెపోటొచ్చినంత పనైంది. మనసులోనే అనుకున్నా, “హమ్మ చలపతీ, నువ్వు ఎంతకైనా తగినవాడివే. చల్లగా మాట్లాడి ఎంత ఠోకరా ఇచ్చావు నాకు” అని. కాని ఇప్పుడేం చెయ్యను! చెయ్యకూడని పనులన్నీ ఎప్పుడో చేసేశా గద. చెక్కు చలపతికి ఇచ్చేశా. ఈసరికి అతడు దాన్ని సొమ్ము చేసుకునే ఉంటాడు. అంతేకాదు, పొద్దున్న వస్తూ సత్రం వాళ్ళచేత లెక్కలన్నీ సరిచూపించి, ఇవ్వాల్సినది ఇచ్చేసి, ఈరోజే ఖాళీ చేసేస్తున్నట్లు చెప్పి వచ్చేశా. ఆఫీసుకి రాగానే ఆ ఇంటి తాళంచెవులు ఆఫీసు ప్యూనుకి ఇచ్చి, వీలు చూసుకుని నా సామాను తీసుకెళ్ళి ఆ ఇంటిలో పెట్టెయ్యమని చెప్పేశా కూడా. అతడు ఈ లంచవర్‌లో వెళ్ళి ఆ పని చేసేసే ఉంటాడు. చచ్చాన్రా బాబూ! ఇప్పుడు నేనేంచెయ్యాలి…

అంతలో సంతోష్ అడిగాడు బలరామమూర్తి గారిని, “సార్! మీరెప్పుడైనా చూశారా లంబాడీ దయ్యాన్ని?”

సీటులోనే ఎగిరిపడ్డారు బలరామమూర్తిగారు. “చూడ్డం కూడానా! లంబాడీ దయ్యాన్ని ఎదురుగా చూసి బ్రతికిన వాళ్ళు ఎవరూ లేరు. అలా చూసిన వాళ్ళు వెంటనే నెత్తురు కక్కుకు చస్తారు, ఏమిటనుకుంటున్నావో” అంటూ కోప్పడ్డారు సంతోష్‌ని. ఆతరవాత నా వైపు తిరిగి అద్దె ఎంత చెప్పాడేమిటి అని అడిగారు. నేను చెప్పింది వినగానే సంతోష్ ఫక్కున నవ్వి “అందుకే పడ్డారు మాస్టారు! పాపం, ఆయన పంచతంత్రం చదివి ఉండరు. చదివితే తెలిసివుండేది. నూపప్పు తీసుకుని నువ్వులిమ్మని అడిగితే ఆలోచించాల్సి వుంటుందని” అన్నాడు వెక్కిరింతలా.

నాకు చాలా బాధనిపించింది. నేనిప్పుడు తెలివిగా ప్రవర్తించకపోతే వీళ్ళు నన్నొక కక్కుర్తి మనిషిగా, ఫ్రీగా వస్తే ఫినైలయినా తాగేసే వెధవ రకంగా కట్టేసే ప్రమాదం ఉంది. బుర్రకి పదును పెట్టి ఆలోచించా. అసలే ఊరికి కొత్తవాడిని కూడా!

“ఏమిటి మాస్టారూ, మేమే మాట్లాడుతున్నాం గాని మీరేమీ మాట్లాడరేం” అన్నాడు చక్రవర్తి పక్క కుర్చీలోంచి. నాకు మనసులో చాలా బెరుకుగా ఉంది. కాని ఆ మాట ఒప్పుకోవాలంటే అహం అడ్డొస్తోంది. శ్రద్ధగా భోంచేస్తున్న వాడిలా వంచిన తల ఎత్తకుండానే, “నాకలాంటి నమ్మకాలూ, భయాలేమీ లేవండీ” అనేశా. అప్పటికే భోజనం ముగించి కూర్చున్న సంతోష్ నా భుజం తట్టి, “కీపిట్ అప్ మాస్టారూ! ధైర్యే సాహసే లక్ష్మీ, మన ధైర్యమే మనకు రక్ష! ఇలాంటి కాకమ్మ కధలు నమ్మితే మనం వట్టి పిరికి సన్నాసులమని అర్థం. మీరేం ఇదవ్వకండి. ధైర్యంగా ఉండండి” అన్నాడు. మూర్తిగారు లేచి వెళ్ళిపోయారు.

సాయంకాలం అవుతున్న కొద్దీ నాలో గుబులు పెరగసాగింది. ఆ సాయంకాలం తాళంచెవులు తిరిగి ఇస్తూ ప్యూన్ వీరాస్వామి, “మీకా ఇల్లొద్దు సారూ. పిల్లలు గలవోరు, తొందరపడి ఆ ఇంటిలో మకాం ఎట్టమోకండి. ఓపాలి ఎవరో సాములోరు సెపితే యినకుండా ఆ ఇంటి అరుగు మీద పడుకుని నిదరోయాడంట. మరుసటేల చూస్తే నెత్తురు కక్కుకుని సచ్చి పడుణ్ణాట్ట, ఆ ఇంటికి ఎనకపక్క గుడిసెలో ఉండే సాయిబు చెప్పాడు. సారూ, నామాట ఇనుకోని ఈ రాత్రికి ఏ వోటల్లోనో వుండి, వేరే ఇల్లెతుక్కోండి” అంటూ ఎంతో ఇదై పోయాడు.

నాకేమో పచ్చి వెలక్కాయ గొంతుకలో అడ్డు పడ్డట్లు ఉంది. కాస్త తోడుగా ఉండేందుకు కూడా ఎవరూ లేరు. దిక్కు లేని పక్షి లాగ దిగులేసింది. అలా అనుకోగానే గుర్తొచ్చింది, ‘దిక్కులేని వాళ్ళకు దేముడే దిక్కు’ అన్న మాట! ఇన్నాళ్ళూ నేను విడిది చేసిన సత్రం వీధి లోనే ఒక గుడి ఉంది. చాలా మంది భక్తులు వస్తూ, పోతుంటారు, రద్దీగానే వుంటుంది. అది చూశా కాని, ఎప్పుడూ లోపలకు వెళ్ళింది లేదు. అసలు ఇంతవరకు నేను ఆ గుడిలోఉన్నది దేవో, దేవరో, తొండమో, తోకో, అసలు మనకున్న ముక్కోటి దేవతల్లో ఎవరో, ఏమీ తెలుసుకోలేదు. కాని ఈవేళ అవసరం నెట్టింది. “అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ” అంటూ ఆఫీసు విడిచిపెట్టాక పళ్ళూ పువ్వులూ వగైరాలన్నీ కొనుక్కుని, దిగజారి పారిపోయిన ధైర్యాన్ని వెతుక్కుంటూ, గుడికి బయలుదేరా.


అది పెద్ద గుడి. ప్రధాన దైవం లక్ష్మీనారాయణులే ఐనా, శివుడూ మొదలైన ఎందరో దేవుళ్ళు అక్కడ తిష్ఠ వేసి ఉన్నారు. అక్కడి ప్రధాన దైవతానికి, భూతనాధుడైన శివునికి పూజలు చేయించా. తక్కిన దేవుళ్ళకు దక్షణలు సమర్పించా. ఆంజనేయ స్వామిని చూడగానే నాకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది. విగ్రహం ఎదుట మోకరిల్లి “శాఖినీ ఢాకినీ… ఇత్యాది దయ్యంబులన్ పట్టి, నీదు వాలంబునన్ జుట్టి, నేలన్ బడగొట్టి…” అంటూ, నా చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న ఆంజనేయ దండకం, జ్ఞాపకం ఉన్నంత వరకూ చదువుతూ, ఆయన అనుగ్రహం కోసం ప్రార్ధించా. సిందూరం బొట్టు పెట్టుకున్నా, ఇంకొంచెం తమలపాకులో చుట్టుకున్నా ఎందుకన్నా మంచిదని. ఏ రిస్కూ ఎందుకు తీస్కోడం అంచెప్పి, ఆ గుడి చుట్టూ ఉన్న చిల్లర దేవుళ్ళను ఒక్కళ్ళనీ విడవకుండా అందరికీ ప్రదక్షణాలు చేసి దక్షణలు చెల్లించా. చుట్టూ ఉన్నవాళ్ళు వింతగా చూస్తున్నారని అప్పుడప్పుడూ అనిపించిందనుకోండి. కానీ నా బాధ వాళ్ళకేం తెలుసు! నేనివాళ రాత్రి పరువు నిలుపుకోడానికని మృత్యువుతో తలపడబోతున్నానని వాళ్ళకి తెలీదు కదా. తెలిస్తే హీరోలా చూసేవారో, నాకూ పూజలు చేయించేవారో కాదూ! వాళ్ళెవర్నీ పట్టించుకోలేదు నేను. అన్ని ప్రార్ధనలు ముగించి తిరుగు ముఖం పట్టే వేళకి నాకు పోయిన ధైర్యం పుంజుకున్నట్లయ్యింది.

గుడి బయట పటాలమ్మే షాపులో హనుమాన్ సంజీవనీ పర్వతాన్ని ఎత్తి తెస్తున్నట్లున్న రాగిరేకు పటం కనిపిస్తే వెంటనే కొన్నా. ఆపక్క కొట్లోనే ‘భగవంతునికీ భక్తునికీ అనుసంధాన’మైన అంబికావారి ఊదొత్తులు ఓ రెండు కట్టలు, ఎందుకైనా ఉంటుందని ఒక టార్చి లైటు, అద్దె ఇల్లైనా కొత్తింట్లోకి చేరడమేగా అని ఒక అరకిలొ మిఠాయి కూడా కొన్నా. సంచీ మోసుకుంటూ అంజనేయ దండకం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మెల్లిగా ఇంటి దారి పట్టాను. గుడి దగ్గర కొన్న హనుమాన్ చాలీసా బుక్కు జేబులోనే ఉంది. ఇంటి దగ్గరకు రాగానే దానిమీద చెయ్యి ఉంచుకుని నెమ్మదిగా గేటుని సమీపించా. గేటు తెరిచి ఉంది. వీరాంజనేయ నామం జపిస్తూ జాగ్రత్తగా గేటు దాటి లోపలికి నడిచాను.

నా రేడియం డయల్ రిస్టు వాచీ టైం పది అయిందని చెప్పింది. రోడ్డు చాలావరకు నిర్మానుష్యంగా ఉంది. నా గుండెచప్పుడు నాకే వినిపిస్తోంది. ఎలాగో ధైర్యం చిక్కబట్టుకుని గేటు మూసి గడియ వేసి వెళ్ళి ఇంటి తాళం తీశాను. ఇప్పుడు కూడా కుడికాలే ముందుగా లోపలపెట్టి, “శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం…” అంటూ ఆంజనేయ దండకం చదువుకుంటూ గృహప్రవేశం చేశా. బ్యాటరీ లైటు సాయంతో స్విచ్చి బోర్డులు వెతికి, ఒకటొకటిగా అన్నిగదుల్లోనూ లైట్లు వేశాను. ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది. సింహద్వారం బార్లా తెరిచి, ఒక కట్ట అగరువత్తులు వెలిగించి గది గదికీ తిప్పి ధూపం వేశా ఇల్లంతా ఘుమ ఘుమలాడేలా. నేను కొన్న మిఠాయిలను పెట్టె తెరిచి నట్టింట పెట్టి ప్రార్ధించా, “అమ్మా! గృహదేవతా! ఈ రోజు మొదలు మేము నీ బిడ్డలం. మమ్మల్ని కాపాడే భారం నీదేనమ్మా” అని గోడలకీ పైకప్పుకీ నైవేద్యం సమర్పించా.

భక్తి, భయం జంట కవుల్లా ఒకదాని వెంట ఒకటి ఉంటాయి కాబోలు! నా మనసు భయంతో ఒణుకడం మొదలు పెట్టగానే భక్తి దానంతట అదే పుట్టుకొచ్చింది. ఇంతవరకు దేవుని ఉనికిని అంతగా పట్టించుకోని నాకు సర్వం ఆ భగవత్‌స్వరూపంగా కనిపించ సాగింది! వెంటనే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమయిన వెంకన్న బాబుకి “స్వామీ! ఈ రాత్రి సవ్యంగా గడిచి నేను బ్రతికి బయటపడితే, ఏడు శనివారాలు వరుసగా ఏక భుక్తం ఉంటా. మరే గడ్డైనా తింటా గాని అన్నం మెతుకు మాత్రం ససేమిరా ముట్టను గాక ముట్టను” అంటూ మొక్కుకున్నా.

ఆ రాత్రికి ఎట్టి పరిస్థితిలోనూ నిద్ర పోకూడదని ముందునుండీ అనుకుంటున్నదే కనుక కడుపు నిండా తింటే నిద్ర వస్తుందన్న బయంతో, నేను ఆ రాత్రి భోజనం కోసమని హోటల్‌కి వెళ్ళలేదు. గుడిలో ఇచ్చిన ప్రసాదం, ఆపై రెండు మిఠాయి ఉండలు తిని తెచ్చుకున్న మినరల్ వాటర్ కడుపు నిండా తాగి సరిపెట్టేసుకున్నా. గుడి నుండి తెచ్చిన నిర్మాల్యం, శివుని వీభూతి, అమ్మవారి కుంకుమ, అన్నీ ఇంటి లోపలి గదులన్నింటిలోనూ చల్లి, గడపలకి సిందూరం, కుంకుమ బొట్లు పెట్టా. మాస్టర్ బెడ్రూంలో ఈశాన్య మూల చూసి, అక్కడ ఒక కాగితం పరిచి దానిమీద నేను కొన్న ఆంజనేయులవారి పటాన్ని పెట్టి ఊదొత్తులు వెలిగించా. కొంచం సేపు ప్రార్ధన చేసి గది మధ్యలో నా బెడ్డింగు పరుచుకుని దాని మీద కూర్చుని ఒక సస్పెన్సు నవల తీశా, నిద్దర రాకుండా.

అల్లా ఎంతసేపు చదివానోగాని దాహమనిపించి చదవడం ఆపి లేచి కాసిని నీళ్ళు గొంతుకులో పోసుకుని, చేతి గడియారం చూస్తే టైం రెండు మీద పది నిమిషాలు అయ్యింది. దూరంగా కుక్కలు మొరుగుతున్నాయి. బయట చింత చెట్టు మీది గుడ్లగూబ కాబోలు కూసింది. అప్పుడు వినిపించింది దొడ్లో మొక్కల మధ్య ఏదో కదిలిన చప్పుడు! చెవులు రిక్కించాను. అది క్రమంగా పెరుగుతూ నా వైపుగా వస్తున్న గజ్జల చప్పుడు! నేనున్న గది కిటికీకి అవతలే ఎవరో ఉన్నారనిపించింది. క్షణక్షణానికీ ఆ గజ్జల చప్పుడు ఎక్కువైంది, ఎవరో బయట ఎగురుతున్నట్లు, దూకుతున్నట్లు ఒకటే చప్పుడు.

“ఇంకెవరు, ఆ లంబాడీ దయ్యమే అయ్యుంటుంది. నృత్యం చేస్తోంది కాబోలు!” భయంతో నాకు ముచ్చెమట్లూ పోయడం మొదలైంది. గజ్జల జోరు పెరిగింది. మరో శాల్తీ కూడా వచ్చి చేరినట్లు అనిపించింది. లయ తాళాల పట్టింపులేమీ లేని ఆ విచిత్ర విన్యాసాన్నే అంటారు కాబోలు ‘పైశాచిక నృత్యం’ అని! బెడ్రూం వెనక తలుపునెవరో తట్టినట్లయింది. నాకింక ఒళ్ళు తెలియనంత భయంతో స్పృహ పోయింది.


మెల్లిగా కళ్ళు తెరిచాను. మూసి ఉన్న కిటికీ తలుపుల సందుల్లోంచి ఎండ లోపలికి పడుతోంది. కొంచెంసేపటికి గాని నా పరిస్థితి ఏమిటో, ఎక్కడున్నానో అంతు పట్టలేదు. “హమ్మయ్య! అయితే నేను బ్రతికే ఉన్నా!” సంతోషంతో ఒళ్ళు తడిమి చూసుకున్నా. ఎక్కడా ఏ గాట్లూ, దెబ్బలూ లేవు. పునర్జన్మ ఎత్తినంత సంతోషం వచ్చింది నాకు. ఐతే, దైవబలం ముందు క్షుద్రశక్తులు ఓడిపోక తప్పదన్నమాట! నిన్న గుడికి వెళ్ళి ఎంత మంచిపని చేశాను. ఇంట్లో దేవుడి సామాగ్రి ఉండటం వల్లనే ఆ లంబాడీ దయ్యాలు లోపలకు రాలేక పోయాయని నాకు అర్ధమైపోయింది. దిండు పక్కనే ఉన్న చాలీసా పుస్తకాన్ని నుదుటికి తాకించుకొని మళ్ళీ మొక్కుకున్నా. నాకెంతో ఉల్లాసంగా అనిపించసాగింది.

తెల్లారిపోయిందన్న ధైర్యంతొ నెమ్మదిగా లేచివెళ్ళి కిటికీ తలుపు తెరిచి తొంగిచూశా. బయటి వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడా రాత్రి తాలూకు భీభత్సం సూచనలేమీ లేవు, ఒక్క చెట్టు మాత్రం ఆకులన్నీ దూసేసినట్లు బోసిగా ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది, ‘దయ్యాలు ఈ చెట్టు ఆకులు ఏంచేసుకుంటాయి చెప్మా’ అనుకున్నా. కొత్తగా వచ్చిన ధైర్యంతో తలుపు తీసుకు బయటికి వెళ్ళి గోడవారగా నడుచుకుంటూ పెరడు వైపుగా వెళ్ళా. చెట్టు మొదల్లో గడ్డి, ఎవరో కసాపిసా కలయదొక్కినట్లుగా నలిగి ఉంది. దొడ్డంతా జూస్తున్న నాకు చికిలింత పొద పక్కన, ఒకటి తెల్లగా, మరొకటి నల్లగా రెండు మూటలు కనిపించాయి. ఏవిటా అవి అని కళ్ళు చికిలించి చూస్తూ ఒక అడుగు అటేపు వేశా. ఉన్నట్టుండి అవి కదిలినట్టు అనిపించింది.

భయంతో ప్రాణాలు కడంటి పోయినై, నాకు తెలీకుండానే “బాబోయ్! దయ్యాలు” అంటూ పెద్దగా కీచుకేక పెట్టి, కీళ్ళు సడలిపోయి, కుప్పకూలి పడిపోయా. నా కేకకు భయపడిన వాటిలా ఆ మూటలు రెండూ చటుక్కున లేచి నిలబడి “మే, మే, మే…” అని కోరస్‌లా జంటగా అరుస్తూ పెరటి గుమ్మం వైపుగా పరుగెత్తాయి. వాటి మెడల్లో వున్న మువ్వలు ఘల్లు ఘల్లుమంటూ మోగుతుంటే నాకు అంతా అర్ధమై పోయింది. ఇదేదో పన్నాగమై ఉంటుంది అనిపించింది. ఉన్నపళంగా లేచి వాటి వెనక పరుగెత్తా. రాత్రంతా ఈ మువ్వల శబ్దానికా నేను భయంతో ఒణికింది! కోపంతో ఒళ్ళు భగ్గున మండింది. నా పిరికితనానికి నాకే సిగ్గేసింది. ఇంతకు ముందే కీచుకేక పెట్టినప్పుడు నన్నెవరైనా చూసుంటే?

నేను వెళ్ళేసరికి అప్పుడే ఒక మనిషి గేటు తెరిచి మేకల్ని బయటికి తోలి తలుపు మూసే ప్రయత్నంలో ఉన్నాడు. ఒళ్ళు రగిలిపోతూండగా గమ్మున అతని చెయ్యి ఒడిసి పట్టుకున్నా. అతడు బిత్తరపోయాడు. “ఎవర్నువ్వు? ఏం చేస్తున్నావిక్కడ” అని గద్దించి అడిగా. గుట్టు రట్టయ్యిందన్నది గ్రహించి అతడు వెంటనే, “హమ్ కో మాఫ్ కర్‌దో సాబ్” అంటూ రెండు చేతులా నా కాళ్ళు పట్టేసుకున్నాడు లబలబలాడుతూ. ఇంటి వెనకాల ఉండే సాయిబు అతనే అని తెలిసింది. అతడు చివరకు చెప్పిందేంటంటే, లంబాడీ పిల్ల ఆత్మహత్య చేసుకున్నది నిజమే. దానిని ఆసరాగా తీసుకుని ఆ దొడ్డిని తన అవసరాలకూ, తన మేకల మేతకూ ఉపయోగించుకుంటున్నాడు. ఆ నోటా ఈ నోటా గజ్జెల మోత గురించి చిన్నగా పుకారు పుట్టించాడు. పేదవాణ్ణి క్షమించమంటూ ఒకటే కాళ్ళావేళ్ళా పడ్డాడు.

అప్పుడు నా బుర్ర చాలా చురుకుగా పనిచేసింది, చెప్పద్దూ. వెంటనే గొంతంతా మంచితనం నింపుకొని, “సరేలేవయ్యా! నువ్వు కూడా ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు, నేనూ చెప్పను. సరే కాని, నువ్విల్లా చేశావని బయట పడిందా నీ చేతికి బేడీలు పడడం ఖాయం. చలపతికి తెలిసిందంటే నిన్ను ఊచకోత కోయక వదలడు, జాగ్రత్త” అన్నా వేలెట్టి బెదిరిస్తూ. ఎవరికీ చెప్పనంత కాలం తనే వచ్చి మేకలకి గడ్డి దూసుకెళ్ళమనీ, మేకల్ని మాత్రం ఇక రానీయననీ చెప్పా.

అతడు అలాగే ఒట్టేసి నాకు మరీ మరీ దణ్ణాలు పెట్టి చేసి మేకల్ని తోలుకుని వెళ్ళిపోయాడు.


ఆఫీసుకి నేను కావాలనే కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే సస్పెన్సులో పడి కొట్టుకుంటూ నాకోసం ఎదురుచూస్తున్న కొలీగ్సు నన్ను చూడగానే వచ్చి చుట్టుముట్టారు, ఏమయింది ఏమయిందంటూ. ఆసరికే అల్లిపెట్టుకున్న కథని ఏకరువు పెట్టేశా.

“నా పుణ్యం బాగుండబట్టి నా భార్య మేనమామ ఒక గొప్ప ఆంజనేయోపాసకుడు కనుక నేను రాత్రి గండం గడిచి గట్టెక్కా! ఆయన తనవాళ్ళందరికీ శ్రీ ఆంజనేయ రక్షాకవచం ఏనాడో ఏర్పాటు చేశారు. అది మమ్మల్ని, మా తాలూకు వాళ్ళనీ ఎల్ల వేళలా కాపాడుతుంది. క్షుద్రశక్తులవల్ల మాకే ప్రమాదం రాదు. అందుకే రాత్రి సుబ్బరంగా పడుకొని నిద్రపోయా” అన్నా డాంబికంగా. అందరూ చెవులోరబెట్టుకుని విన్నారు నేను చెప్పినదంతా.

సంతొష్ మాత్రం నన్ను నిలదీశాడు “అదేమిటి మాస్టారూ! ఈ విషయం మీరు మాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు” అంటూ. నేనేం మాట్లాడలేదు. వెనకటికి ఒక మహానుభావుడు అన్నాడు ‘ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచవలసివస్తే మనం దాన్నిగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు మాట్లాడకుండా ఉండగలిగితే మరీ మంచిది’ అని.

ఇంతలో చలపతి ఆఫీసుకి వచ్చాడు.మనిషి చాలా డీలా పడి ఉన్నాడు. అడిగితే, సెలవులు ఐపోడంవల్ల ఆఫీసుకు రాక తప్పలేదనీ, ఇంకా జ్వరం ఉందనీ అన్నాడు. నేను చలపతి నేమీ అనలేదు, ఇలా ఎందుకు చేశావని నిలదియ్యలేదు. కాని మిగిలినవాళ్ళు అతన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు కూడా తలా ఒక మాటన్నారు. నేనే వాళ్ళకి సర్ది చెప్పాల్సి వచ్చింది, “మేమక్కడ ఉన్నన్నాళ్ళూ మాకు గాని మాకోసం వచ్చిన వాళ్ళకు గాని ఏ కష్టం రాదు, నాదీ పూచీ” అంటూ గొప్పగా హామీ ఇచ్చా అందరికీ.

“మీరంతా ఇల్లా నా మీద విరుచుకు పడతారెందుకు, అతనికి ఏమీ కాలేదు కదా” అన్నాడు నీరసంగా చలపతి. బలరామమూర్తిగారికి చాలా కోపం వచ్చింది. “నీ పుణ్యం బాగుండి వాళ్ళకు ఆంజనేయ రక్షాకవచం ఉండబట్టి సరిపోయింది! లేకపోతే నిన్నీసరికి పోలీసులు చేతులకు అరదండాలు తగిలించి, తీసుకెళ్ళి జైల్లో పడేసి ఉండేవాళ్ళు, తెలుసా” అంటూ ఆయన కేకలేశారు.

చలపతి మొహం ఎర్రగా కందిపోయింది. “దెయ్యాల భయంవల్లే ఆ ఇల్లుకి పెద్ద రేటు లేదు. చంద్రంగారూ! మీకు దయ్యాల భయం లేదు కనుక దాన్ని మీరే ఎందుకు కొనుక్కోకూడదు? బొత్తిగా చవక” అన్నాడు అతడు విరక్తిగా. హఠాత్తుగా వచ్చిన ఈ మలుపు నాకు గగుర్పాటు కలిగించింది. నాలో ఒక మూల చిన్న ఆశ లాంటిది ఒకటి పుట్టి పిలకలు వెయ్యసాగింది. మొహంలో ఏ ఫీలింగూ లేకుండా, “ధర ఎంతట” అన్నా. “పది లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చార్జస్ పెట్టుకుంటే చాలు” అన్నాడు చలపతి మొహం గంటు పెట్టుకుని.

“అదేమిటి గురూ! ఇంత వరకూ మీరు ఆరున్నర లక్షలు అనేవారు కదా” అంటూ అతని మాటకు అడ్డు వచ్చాడు సంతోష్.

“అదేం మాటోయ్! ఊళ్ళో ధరలు ఎలా పెట్రేగి పోతున్నాయో చూడటం లేదా ఏమిటి? దయ్యాల భయం వల్ల కాని లేకపోతే అది ముఫ్పైకి పైనే పలుకుతుంది. ఆ దొడ్డే చేస్తుంది ఎంతైనా” అన్నాడు చలపతి. అదీ నిజమే అనిపించింది, కాని, “నాకు పెద్ద స్తోమత లేదు. అయినా చవగ్గా వస్తోందంటే ఆశగా ఉంది, కానీ పదంటే కష్టమేమో” అన్నా, నా ఆత్రాన్ని పైకి పొక్కనీకుండా.

“నేనైనా దీన్ని వదిలించేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నా నంటే, దీనివల్ల ఒరిగేదేం లేకపోయినా ఏటా కనీసం రెండు సార్లైనా, ఇల్లు పాడైపోకూడదని చేతిచమురు ఒదుల్చుకుని బాగులు చేయిస్తున్నా. అదైనా తప్పుతుందని నా ఆశ. ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులేవో నేనే పెట్టుకుంటా. ఇప్పుడు మీకేమీ ఇబ్బంది లేదని తేలిపోయింది కదా, మీరందులో కాపురముండడానికి ఇక అభ్యంతరమేమిటి? మీరది కొనుక్కున్నా, అద్దెకున్నా నాకు సమ్మతమే” అన్నాడు చలపతి, ఇంకా మొహం మాడ్చుకునే.

ఇంక సాగదియ్యడం మంచిది కాదనిపించింది. పేరాశగాడు, పిరికివాడు అని కొలీగ్సంతా ముద్ర వేయకుండా నేను చేసిన సాహసం నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చింది. నేను ఆ రాత్రంతా పడ్డ శ్రమ వృధా కాలేదు కదా. వెంటనే చలపతికి నేనా ఇల్లు కొంటానని అందరి సమక్షంలో వాగ్దానం చేసేశా, బ్యాంకులు పోటీపడి పిలిచి మరీ లోన్లు ఇస్తుంటే నాకేం తక్కువ,అన్న ధీమాతో.

కేలండర్ లోని పేజీ మారే సరికి ఆ ఇల్లు నా భార్య పేర రిజిష్టరైపోయింది. నేను ఆరోజున గుడి పక్కనున్న షాపులో కొన్న ఆంజనేయులవారు సంజీవనీ పర్వతాన్ని మోస్తున్నట్లుగా ఉన్న పటం మా ఇంటి ముందు ద్వారబంధం పైన మేకు కొట్టి తగిలించా ‘శ్రీ ఆంజనేయ రక్షాకవచం’ పేరుతో.