“ఒరేయ్, నువ్వు చాలా చెత్త వాగుతావురా”, అన్నాడు ముఖం కందగడ్డలా పెట్టుకొని, గోవిందరాజులు. అందులో అబద్ధం లేదు గనక నేనూ నోర్మూసుకున్నాను.
స్థలం: విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న ఒక విశాలమయిన స్టార్ హోటల్ లాబీ.
సమయం: సాయంత్రం ఆరు గంటలు.
సందర్భం: నేను, వెంకట్ అనబడు వేంకటాచలపతిని వాడు ఈమధ్యే ఓ కొత్త విదేశీ కారు కొన్న సందర్భంగా ట్రీట్ అడిగినవేళ.
సాయంత్రం సరదాగా, రానున్న రాత్రికి కర్టన్ రైజరులా హుషారుగా ఉంది. చుట్టూ ఎన్నో కార్లు. వాటిలో భాగాలేమో అనిపించే డ్రైవర్లు. డిక్కీల వెనుకనుంచి వస్తున్న చౌకరకం సిగరెట్ల పొగ, ఆటోనుంచి దిగి హిందీలో అడ్రస్ అడుగుతున్న బెంగాలీ కుటుంబం, నవ్వుతూ గుంపుగా బస్ దిగి ఫ్రెషర్స్ డే పార్టీ చేసుకునేందుకు లోపలికి వస్తున్న కాలేజీ అమ్మాయిలు.
సిగరెట్ పాకెట్లో నుంచి నాకొకటి ఇస్తూ, వాడూ ఒకటి వెలిగించుకుంటూ, “ఇప్పుడు వాడి కారు చూడకపోతే, మీబాబు కొంపేవన్నా కూల్తుందా? నీ…” అని బూతులకు దిగాడు.
“అరేయ్, నువ్వంటే కోటీశ్వరుడి నుంచి బిలియనీరువు అవుతున్నావు, నేను నా దిగువ మధ్యతరగతి నుంచి మధ్యతరగతి కన్నా ఎగబాకుదామని చూస్తున్నాను, అయినా నీకు తెలియకుండా మా బాబుకి కొంపగోడు ఎక్కడివిరా!?” అన్నాను.
“ఈ పనికిమాలిన లాజిక్కులొకటి, పద మళ్ళీ కాఫీ తాగుదా”మని లోపలికి దారి తీశాడు. వాడి వెనుకే నేనూ.
గోవిందరాజులు ఒక్క విశాఖపట్నంలోనే కాక చుట్టుపక్కల మరో మూడు జిల్లాల్లో బాగా డబ్బు, పేరుప్రతిష్టలు ఉన్న కుటుంబానికి ఏకైక వారసుడు, నేనేమో బతకలేని బడిపంతులు అనిపించుకునే (ఆరోజుల్లో)మామూలు సాదాసీదా కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి ప్రతినిధికి నాలుగో కొడుకును, కాగా పిల్లల్లో ఆరోవాణ్ణి. మా ఎలిమెంటరీ స్కూలు రోజులకు అటు ఐదేళ్ళు ఇటు ఐదేళ్ళు గోవిందరాజులు ఒక్కడు తప్ప ఎవరూ రోజూ కారులో వచ్చినవాడు లేడు. అందువల్లో ఏమో చాలామంది మా ఈడు పిల్లలు వాడిని ఆటల్లో కలుపుకునే వాళ్ళు కాదు. నేను మాత్రం ఎందుకు దోస్తీ కట్టానంటే కేవీఆర్ మేష్టారి వల్ల. ఇన్ని సంవత్సరాల మా జీవితంలో వాడు అంత కోటీశ్వరుడైనా, ఇప్పటికీ దాదాపు రోజూ కలిసి మాట్లాడుకునేది, తిట్టుకునేదీ మేమిద్దరమే. వెంకట్ గాడు గోవిందరాజులుకు దగ్గరి చుట్టం, మా వయసు వాడే. కానీ వేరే ఇంగ్లీషు బళ్ళో చదివేవాడు. మరి గోవిందరాజులు మాత్రం మా దుంపల బళ్ళో ఎందుకు చదివాడు? దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు. ఆయన శిక్షణలో ఏదో కొన్ని అక్షరం ముక్కలతో పాటు మరికొన్ని మామూలు విషయాలు నేర్చుకుంటాడేమో అని వాళ్ళ తాత మా నాన్న దగ్గర చేర్చాడు.
గోవిందరాజులు వెయిటర్ను పిలిచి, “మేమిక్కడ సిగరెట్ కాలుస్తాం. ఏసి ఆఫ్ చేయ్ కాసేపు” అన్నాడు.
దానికి ఆ బిక్క చచ్చిపోయిన వెయిటర్, “సార్ బిజినెస్ అవర్స్ సార్, గెష్ట్స్ వస్తారు సార్” అన్నాడు భయంగా.
“అవునా?” మావాడి గొంతులో దారుణమైన హేళన ధ్వనిస్తొంది, “అయితే మీ బిజినెస్ మానేజర్ని పిలువ్” అన్నాడు గట్టిగా. అప్పటికి అక్కడున్న ఒకరిద్దరు మావాడి గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి బిత్తరపోయి వచ్చే బిజినెస్ మేనేజర్ ఏమి చేస్తాడో అనే ఆదుర్దా తో ఎదురు చూట్టం నేను గమనించాను.
“సార్ మీరు ఏమీ అనుకోకపోతే బార్ రూం లో కూర్చొండి, కాఫీ అక్కడికే పంపుతాను” అని కాళ్ళావేళ్ళా పడటం ప్రారంభించాడు ఆ వెయిటర్.
“అక్కడ ఏ.సి లేదా?”మా వాడి ప్రశ్న.
“ఉంది సార్”
“మరి”?
“అక్కడ స్మోకింగ్ పర్మిటెడ్ సార్”
“ఎందుకని?” సమాధానం లేదు పాపం.
“సర్లేరా, ఈ ఇరుకు గదుల్లో ఎందుకు? ముందు కాఫీ తాగెయ్. హాయిగా బయట నిలబడి సిగరెట్లు కాల్చుకోవచ్చ”ని గోవిందరాజులిని శాంతపర్చాను. కాఫీ తాగి, బయట కొచ్చి చూస్తే చుట్టూ కార్లు. కానీ వెంకట్ గాడి బియండబ్ల్యు మాత్రం లేదు.
“అవునొరే, ఇందాకటి నీ కోపం నా మీదా? వెంకట్ గాడి మీదా?” అన్నాను. “నీ మీదేరా, వాడి బాబు సింహాచలం దేవస్థానం భూములమ్మి వీడికో పది కోట్లిస్తే ఈ ఎదవేమో బోడి ముండా ఫారిన్ కార్ల మీద తగలేసి చూస్కో నారాజా అని ఊరేగుతున్నాడు. ఆ యెదవకి నువ్వొక వంత పాట. ఆ ట్రీట్ ఏదో మీ ఇద్దరు తగలడక నన్నెందుకురా ఇందులోకి లాగారు?”అన్నాడు.
“నాకూ ఎప్పటి నుండో ఆ కారు మీద మోజుందిరా, ఒక్క సారి ఎక్కి అలా భీమిలి దాకా వెళ్ళొద్దామని” నా సంజాయిషీ.
మాటల్లోనే ఎర్రటి బియండబ్ల్యు మెల్లగా దొర్లుకుంటూ మా దగ్గరికి రావటం, డ్రయివర్ డోర్ తీస్తే వెంకట్ గాడు ఇంకా మెల్లగా దిగుతూ మా హావభావాలను గమనిస్తున్నాడు. కారు కొవ్వెక్కిన కోడి పుంజులా ఉంది. ఈలోపు చుట్టు పక్కల జనం, డ్రయవర్లు, కారు చుట్టూ చేరి, చూస్తూ, ముట్టుకుంటూ మురిసిపోతున్నారు.
“ఏరా, ఆ పెందుర్తి సైట్ కొనకుండా ఎందుకు దీని మీద ఇంత మదుపు” అని నేరుగా గోవిందరాజులు ఎటాక్ లోకి దిగాడు.
“ఇదీ, మదుపేలేరా! ఆ కొరియా కంపెనీ వాడొస్తున్నాడా? వాడికి తిప్పుతాను దీన్ని, నెలకు అద్దెంతో తెలుసా? లక్ష, అక్షరాలా లక్ష!! నాలుగేళ్ళలో మన మదుపు మనకొస్తుంది, పైగా ఇంత కాస్ట్‌లీ కారు తిప్పుతున్నామంటే ఏ బ్యాంకులోనయినా రెండు రోజుల్లో శాంక్షన్” అంటూ వ్యాపారమర్మాలు చెప్పుకొచ్చాడు.
ఈలోపు మాపక్క నుంచి ఏదో మాయ జలతారు మమ్ముల్ని కప్పేసినట్లు, అమెరికన్ డాలర్ల వర్షం కురిసినట్లు, ఫారిన్ సెంటు పీపాలేవో పగిలి మేము ఆ పరిమళపు వరదలో కొట్టుకు పోతున్నట్లు, ఇంకా ఏవేవో అవుతున్నట్లు భ్రాంతి కొలుపుతూ ఒక గులాబి పువ్వు, అంతకంటే చక్కనైన కార్లోంచి దిగి, నడిస్తే ఆ గ్రానైట్ రాళ్ళు ఎక్కడ కందిపోతాయో అన్నంత సుతారంగా అడుగులు వేస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ, అందరూ నన్నే చూడక తప్పదుగా అనే నమ్మకంతో కాబోలు ఎటూ తల కూడా తిప్పకుండా హోటల్ రిసెప్షన్ దాటి అలా అలా చిలిపి అని తెలుగు అర్ధాన్నిచ్చే బహు ఇంగ్లీషు రెస్టారెంటులోకి అడుగులేసింది. మా ముగ్గురి లోకి మొదట తేరుకున్న వెంకట్ “ఒరేయ్, ఎదవల్లారా, ఏమిటా చూపులు? ఇక్కడ అరకోటి కారు నొదిలేసి” అంటూ మమ్ముల్ని మళ్ళీ ఈ పాపపంకిలపు లోకం లోకి లాగాడు.
“నీ కారు, నీ బొంద! ఆ అందం చూడరా, ఆమె ఒక్క సారి కోరితే ఆ కార్ల ఫ్యాక్టరీ వోనరే వంద కార్లు వైజాగ్ పంపిస్తాడు ఫ్రీగా” అన్నాను.
“ఏడిశావులే, సిండి క్రాఫర్డ్, నయోమి కాంప్బెల్ లాంటి వాళ్ళే వాడిని ఏమీ చేయలేకపోయారు. మన స్థానిక వనరులు ఏమీ చేయలేవు గానీ పదండి బార్లోకి” అన్నాడు.
“అబ్బే, ఈరోజు మంగళవారం మేము ఈరోజు తాగం .. పద.. చి..లి..పి..లోకి” అన్నాం.
“మంగళవారం మానటం ఏంట్రా?” వాడి అనుమానం.
“అవును మరి గురువారం, శనివారం ఎన్వీ మానట్లేదా? అలాంటిదే ఇదీ, పద” నేను.
చిలిపి రెస్టారెంట్ యువజంటల తోటీ నవధనికుల తోటీ కళకళ లాడుతోంది. వచ్చిన గులాబీ పువ్వు ఏ కుండీలో కూర్చుందో అని మేము వెతకక్కర్లేకుండానే అటు వేపే తిరిగిన జనాల మెడలు మాకు దారి చూపించాయి. మేము దగ్గర్లోనే ఒక టేబుల్ చూసుకొని, లొట్టల బాటిల్ తెరిచాము.
“ఎందుకురా కొంతమంది ఇంత అందంగా పుడతారూ?” అనేది గోవిందరాజుల అనుమానమైతే, “చూడరా, ఎంత సింపుల్ గా, మెళ్ళో ఒకే ఒక్క సన్న చెయిన్‌తో, స్మాషింగ్ బ్యూటీరా బాబూ” అని నా కితాబు.
“ఒరేయ్, లంబూ-జంబూ! అంత సింపుల్ గా తయారయ్యి బయటకు, ముఖ్యంగా ఇలాంటి స్టార్ హోటళ్ళకూ, పార్టీలకూ రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలీదురా” అన్నాడు వెంకట్.
“అవున్లే, నీకంటే స్వంత అనుభవం! మాకేం తెలుస్తుందీ?” సాగతీశాడు గోవిందరాజులు. కేజీలకు కేజీలు నగలు దిగేసుకుని, నడిచే నగల దుకాణం లాగా, మూవింగ్ జ్యూయలరీ మాల్స్ లా తిరిగే వెంకట్ భార్య, వదినలు గుర్తుకొచ్చి నేను పెద్దగా నవ్వితే, వాడేమో టేబుల్ కింద నుంచి తన్నాడు.
“ఇంతకీ, రేయ్, ఈ అందం ఎవరి సొంతంరా” అని మాలో మేము త్రైపాక్షిక చర్చలు జరుపుకుంటూ సూపు బదులు ఆమె అందాన్ని కళ్ళతో సిప్ చేస్తూ మధ్యలో విసిగిస్తున్న సెల్లు పీక నొక్కుతూ కాలం గడుపుతున్నాం.
ఈ లోపు ఎప్పుడొచ్చాడో తెలియదు గానీ ఆమె పక్కనో పురుషపుంగవుడు కూర్చుని ఉన్నాడు, ఏదో నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ… అసలే కరంటు కోతేమో… అప్పటి దాకా మసక మసకగా ఉండే దీపాలు పూర్తిగా ఆరిపోయాయి. కిచెన్ డోర్ లోనుంచి ఇద్దరు వెయిటర్లు పెద్ద ట్రే మీద బొద్దుగా ఉన్న కేకును తీసుకురావటం, ఓ మూలగా బవిరి గెడ్డాలతో, బూచోడి వేషాల్లో ఉన్న బ్యాండు సభ్యులు హ్యాపీ బర్త్ డే టూ యూ అని పాట ఎత్తుకోవటం, ఒక్క సారే జరిగాయి. చుట్టూ జనం చేరటంతో ఎవరి పుట్టిన రోజో కేకు ఎవరు కోశారో తెలియలేదు. కానీ పక్కన ఉన్న పురుషోత్తముడు మాత్రం కోపంతో కుతకుత లాడి పోతున్నాడు. గులాబి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. మెల్లగానే అయినా, గట్టిగా పళ్ళ బిగువున ఏదో అంటున్నాడు. గులాబి కళ్ళల్లో ముందస్తుగా ఒక సన్నటి నీటి తేర పేరుకుంది. త్వరలోనే గట్లు తెంచుకుని ఒక్కో చుక్కా దూకుతున్నాయి గులాబి రేకుల్లాంటి ఆ చెంపల మీదికి, ధారగా. అతగాడు వేళ్ళు చూపుతూ, పిడికిలితో ముందున్న టేబులు మీద గుద్దుతూ, ఆమె పెదవి చివరను మునిపంట కొరుకుతూ, నేల జారుతున్న కన్నీటి ముత్యాల్ని కర్చీఫ్ తో అదుపు చేయాలని విఫలయత్నం చేస్తూ… మాకు తెలియకుండానే అరగంట గడిచి పోయింది.
“ఛస్! మంచి ఈవెనింగ్ చెడగొట్టార్రా” అని తిడుతూ వెంకట్ పైకి లేచాడు. గోవిందరాజులు కూడా పోదాం రా అని క్రెడిట్ కార్డు వెయిటర్ కిచ్చి, మెల్లగా అడుగులు వేస్తూ, కొంచెం దూరం వచ్చి వెనక్కి చూసి, “ఇంకా ఏడుస్తోందిరా” అన్నాడు. స్వింగ్ డోర్ ను తిప్పుతూ నేనూ ఒక సారి మెల్లగా చూశాను, ఈసారి కర్చీఫ్ నోటికి అడ్డం పెట్టుకుని టేబుల్ను ఒక చేత్తో పట్టుకుని ఏకధారగా ఏడుస్తోంది. రిసెప్షన్‌లో క్రెడిట్ కార్డ్ కోసం నిలబడి మనసూరుకోక మళ్ళీ ఒకసారి చూస్తే రెండు చేతులతో మొహం కప్పుకొని బావురుమంటోంది. ఈలోపు మాకన్నా లోకానుభవం తనకు ఎక్కువనుకునే వెంకట్, “చాలా మంది ఆడ వాళ్ళింతేరా, ఏడవటం, ఏడిపించటం,” అన్నాడు.
బయట చిక్కబడ్డ చీకటి, మేము మౌనంగా కిందకు దిగాం. కానీ చెవుల్లో కైలాసగిరి కొండ మీద వినిపించే బంగాళాఖాతపు హోరులా ఆమె రోదన కర్ణభేరిని బద్దలు చేస్తున్న భావన.