[ఈ వ్యాసం చేకూరి రామారావు గారు రచించిన “భాషాపరివేషం” (2003) అన్న పుస్తకం నుండి సంగ్రహించబడింది. ఈ వ్యాసాన్ని పునర్ముద్రించడానికి అనుమతిచ్చిన చేకూరి రామారావు గారికి మా కృతజ్ఞతలు — సం.]
తెలుగునాట 20 వ శతాబ్దపు పూర్వార్ధభాగంలో గిడుగు రామమూర్తి, కోరాడ రామకృష్ణయ్య, గంటి జోగి సోమయాజులు మొదలైన వారు భాషను గురించి శాస్త్రీయంగా ఆలోచించటం తెలుగువారికి నేర్పడానికి ప్రయత్నించారు. ఆ శతాబ్దపు ఉత్తరార్ధభాగం అంతా భద్రిరాజు కృష్ణమూర్తి గారు భాషాశాస్త్రాన్ని బోధిస్తూ, పరిశోధిస్తూ, తెలుగువారికి భాషను గురించి శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించారు. పట్టుదల, అకుంఠిత దీక్ష, అసమాన ప్రతిభ కలగలిసిన అపురూపమైన పరిశోధకులు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. ద్రావిడ భాషాపరిశోధనలో గత శతాబ్దంలో ‘సగం నాది’ అనగల ఏకైక శక్తిమంతుడు ఆయన ఒక్కడే. భాషాపరిశోధనను ఒక వ్యసనంగా ఈయన తన శిష్యులలో ‘వ్యాప్తి’ చేశారు.
కృష్ణమూర్తి గారు చేసిన పరిశోధన అంతా ఒక సమీక్షలో అంచనా వేయడం కష్టం. ఆయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేసిన పి.హెచ్.డి.ని “తెలుగు వెర్బల్ బేసెస్” అనే గ్రంథంగా 1961 లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇది పేరుకు ‘తెలుగు ధాతువుల పరిశీలన’ అయినా పరిధిలో ద్రావిడ భాషలన్నింటికి విస్తరించింది. ఆయన రాసిన “కొండ భాష వ్యాకరణం” (1969) భారతీయ గిరిజన భాషల్లో కెల్లా ఉత్తమమైన వ్యాకరణం. తెలుగులో సాహిత్య అకాడమీ అచ్చు వేసిన మాండలిక వృత్తి పదకోశాలకు, నన్నయ తిక్కనాదుల పద ప్రయోగ కోశాలకు ఆయనదే ఒరవడి.
భాషాశాస్త్రాన్ని గురించి తెలుగులో ఒక ప్రామాణిక పాఠ్యగ్రంథాన్ని తయారు చెయ్యాలని ఆయన చిరకాల సంకల్పం. మన దురదృష్టవశాన ఆ సంకల్పం నెరవేరలేదు. ఆ సంకల్పాన్ని గుర్తు చేసే వ్యాస సంకలనం “భాషా, సమాజం, సంస్కృతి” అనే సంపుటి. సుమారు నలభయేళ్ళ కాల పరిధిలో అప్పుడప్పుడు రాసిన తెలుగు వ్యాసాల సంకలనం అది. ఈ పుస్తకంలో మొదటి భాగంలో భాషాశాస్త్రాలకు సంబంధించిన మూల భావనల నిర్వచనాలు, తెలుగులో వాటి అనువర్తనం ఉన్నాయి. రెండవ భాగంలో భాషకు సమాజానికి సంబంధించిన అంశాల వివరణ ఉంది. మూడో భాగంలో సంస్కృతి సంబంధమైన వ్యాసాలున్నాయి. వాటిల్లో “తిక్కన పదసంపద”, “రాచకొండ రచనల్లో సిమిలీ” అనేవి భాషాశాస్త్ర పరిధిని అతిక్రమించినవి.
గిడుగు వారి వ్యవహారికోద్యమం సాగుతున్న రోజుల్లో ఆధునిక భాషాశాస్త్రంతో అంతో ఇంతో పరిచయం ఏర్పడ్డ వాళ్ళే వ్యవహారిక భాషావాదులయ్యారు. 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో భద్రిరాజు ఈ ఆధునిక భాషాశాస్త్ర పద్ధతికి – పోనీ మతానికి – ప్రచారకులయ్యారు. ఆ రోజుల్లో ఆయనను “బిషప్ కృష్ణమూర్తి” అన్నవారున్నారు. భాష అంటే మాట్లాడేదేనని, మాతృభాషా వ్యవహర్తలు తప్పులు చెయ్యరనీ, అన్ని భాషలు సమానమేనని – ఇట్లా ఏవేవో (అప్పటికి) కొత్త విషయాలు బోధిస్తూ ఉండేవారు. అవి మాకు కొత్తగా ఉండేవి. ఆకర్షించేవి. కొంచెం ఫ్యాషనబుల్ గానూ మరికొంచెం దబాయింపుగానో ఉండేవి. ఆయన వ్యాసాలు చదువుతుంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు విషయాన్ని ప్రతిపాదించే తీరు చూస్తుంటే, ఏదో కొత్త ప్రపంచాన్ని డిస్కవర్ చేసినంత థ్రిల్ ఉండేది. కేకలు, పెడబొబ్బలు లేవు. ఆవేశాలు, నిందారోపణలు లేవు. అలంకారాలు లేవు. కవిత్వమూ కాకరకాయలు లేవు. సూటిగా పదునుగా, హేతుబద్దంగా, తార్కికంగా రాసే పద్ధతి ఒకటుంటుందని అప్పుడే తెలిసింది.
కృష్ణమూర్తిగారు తెలుగులో భాషాశాస్త్ర పరిభాష తయారు చేసిన వారిలో ప్రథముడు. ఆయన ఒక అర్థంలో ఒక పదం వాడితే ఆ మాట కాగితంమీదికెక్కిన క్షణం నుండి పరమ ప్రామాణికం అయిపోయేది. వర్ణం – సవర్ణం, పదం- పదాంశం, ఉత్పాదక – నిష్పాదక ప్రత్యయాలు, సన్నిహిత సంబంధాలు వంటి మాటలు తెలుగులో ప్రామాణికతను అందుకున్న పరిభాషా పదాలు. వీటి స్థానంలో వేరే పదాలను ప్రవేశ పెట్టడానికి ఇతరులు చేసిన ఏ ప్రయత్నం సఫలం కాలేదు. భాషాశాస్త్ర పాఠ్యగ్రంథాన్ని ఈయనే తయారు చేసి ఉంటే తెలుగు భాషకు ప్రామాణికమైన పరిభాష మరికొంత సమకూరి ఉండేది.
తెలుగులో అలంకార శైలిని మంచి వచనంగా భ్రమిస్తూ ఉన్నాము. ప్రబంధగద్యను తలపించే వచనాన్ని తెలుగువారు మరువలేకున్నారు. ఏదో ఒక రూపకం లేకుండా చాలామంది వాక్యమే రాయలేకపోతున్నారు. శాస్త్ర విషయాలకు ఆలంకారిక వచనం పనికి రాదని నాబోటి వాళ్ళు ఒక పోరాటమే చేస్తున్నారు. తెలుగులో సరళ సుందరమైన శాస్త్ర వచనం భద్రిరాజు కృష్ణమూర్తి గారి దగ్గరి నుండి నేర్చుకోవలసి ఉంది.