రంగస్థల ఆహార్యం
నాటకానికి అతి ముఖ్యమైన మరో మూలస్థంభం ఈ రంగస్థల ఆహార్యం. కథా వస్తు పరంగా నటీనటుల అలంకారం, స్థల, కాల, గుణ విశ్లేషణ చూపే వేదికాలంకరణ, సన్నివేశాల్లో వాడబడే వస్తు ప్రకరణ, ఇంకా దృశ్యస్పురణ కలిగించే వాయిద్య సహకారం (దాన్నే సంగీతం అని అంటాం) ఇవన్నీ కలిపి ఆహార్యం (మేకప్, స్టేజి డెకరేషన్, ప్రోపర్టీసు, మ్యూజిక్) అంటారు. ఒక నాటకం రక్తి కట్టాలంటే మంచి నటీనటులూ, కథా వస్తువు మాత్రమే కాదు, దానికి తగ్గ ఆహార్యం కూడా ఉండి తీరాలి.
ఆహార్యం నాటకంలో పాత్ర తీరుతెన్నుల్నీ, స్వభావాన్నీ చూపడమే కాదు, మన కళ్ళకి అగుపించని కొన్ని గత కాలపు వ్యక్తుల వ్యవహారిక జీవితాల్ని మనకు స్ఫురణ కొచ్చేలా చేస్తుంది. ఉదాహరణకి జాలరి పాత్ర ఉందనుకోండి, ఆ నటుడి వేషాన్ని బట్టీ, వాళ్ళు ఉపయోగించే వస్తువులను బట్టీ (ఇక్కడ చేపల్ని పట్టే వల, వస్తువు) మనం జాలరి అని సులభంగా ఊహించగలం. అలాగే ప్రతీ పాత్రకీ పాత్ర పరంగా తగిన ఆహార్యం ఉండి తీరాలి. ముసలి పాత్ర వేసే నటుణ్ణి, యవ్వనంలో ఉన్న వ్యక్తిలా అలంకరణ (మేకప్) చేస్తే చూడ్డానికి అపహాస్యం అవుతుంది. అంతే కాదు, పాత్రల దుస్తుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే గానీ ఫలానా పాత్ర ఫలానా కాలానికి చెందిందీ అని చెప్పడం కష్టం. రచయితకే కాదు, దర్శకుడికీ ప్రత్యేక అవగాహన ఉండాలి.
కొన్ని పాత్రల్ని రచయిత చూడకపోయినా ఆనాటి కాల పరిస్థితుల కనుగుణంగా పాత్రల్ని సృష్టిస్తే, వాటికి తగ్గ అలంకరణ చేయడం ద్వారా ఫలానా పాత్ర అని అతి సులభంగా ప్రేక్షకుడు గుర్తించగలుగుతాడు. పాత్రల ఆహార్యం సహజంగా నిజ జీవితాలకి దగ్గరగా ఉంటేనే ఏ పాత్రయినా మనసుకి హత్తుకుంటుంది. దీనికి దర్శకుడి భాద్యత ఎంతైనా ఉంటుంది. ఏ పాత్ర కెటువంటి అలంకరణ చేయాలీ, ఏ సన్నివేశానికి తగ్గ అలంకరణ మార్పులు చేసుకోవాలీ అన్న విషయం దర్శకుడికి సరైన అవగాహన లేకపోతే నాటకంలో పాత్రలు తేలిపోతాయి. ఇక్కడ రచయిత సూచన ప్రాయంగా పాత్రని చెబుతాడే తప్ప, అవసరం అయితే కానీ విశేషంగా వివరించడు. ఆయా పాత్రల్ని బట్టి ఏ మేకప్ లేదా అలంకరణ నప్పుతుందో ముందే ఊహించుకొని దాని కనుగుణంగా ఒక ప్రణాళిక చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పని సరిగా దర్శకుడిదే !
ఒక్కోసారి సన్నివేశ పరంగా పాత్రల మేకప్ మార్చవలసి వస్తుంది. ఒక సన్నివేశంలో ఒక యుక్తవయసు అమ్మాయిని తరువాత సన్నివేశంలో గృహిణిగా చూపించాల్సివస్తే దాని కనుగుణంగా దుస్తులు లేదా అలంకరణ మార్పులు చేసి తీరాలి. లేకపోతే, చూసేవాళ్ళకి శ్రద్ధ లోపిస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు అతి తక్కువ కాలంలో అలంకరణ మార్పులు చేసుకునేలా దర్శకుడు ఏర్పాటు చేసుకోవాలి. లేదా మొదటి సన్నివేశంలో వచ్చిన పాత్రని రెండో సన్నివేశంలో రానీయకుండా జాగ్రత్తపడి, మూడో సన్నివేశంలో అలంకరణ మార్పులతో చూపించాలి. ఇక్కడే దర్శకుడి చాకచక్యం అంతా బయటపడేది. రచయిత రాసిన నాటకాన్ని ప్రదర్శనా యోగ్యంగా మలచడంలోనే దర్శకుడి ప్రతిభ కొట్టచ్చినట్లు కనిపిస్తుంది.
పూర్వం ముఖాలకి పసుపూ, కుంకుమా, విభూతీ, పారాణి (సున్నం, కుంకుమ నీళ్ళతో కలిపిన మిశ్రమం) వాడేవారు. కొన్ని సందర్భాలలో స్త్రీల చేతులకు గోరింటాకు పెట్టే వారు. కాలక్రమేణా, సాంకేతిక ప్రగతిలో ముఖానికి వేసుకొనే రంగులు వచ్చాయి. దాంతో నటులకి రంగులతో మేకప్ చేసే విధానం అలవాటులోకి వచ్చింది. సుమారు 1800 సంవత్సర కాలంలో ముఖానికి రంగులు పూసుకోవడం అనేది మొదలయ్యింది. 1800 కాలం ముందే ఈ రంగుల (కాస్మెటిక్స్) వాడకం ప్రజల్లోకి వచ్చినా, నాటకాలలో వాడడం మాత్రం ఇంగ్లీషు వారే మొదలు పెట్టారు. ముఖ్యంగా షేక్స్పియర్ నాటకాలతో రంగుల ప్రాభవం మరింత పెరిగింది. దాంతో వివిధ రకాల పాత్రల్నీ ప్రస్ఫుటంగా స్టేజి మీద కనిపించేలా చేయడానికి ఈ రంగులు చాలా వరకూ దోహదం చేసేవి. ఇప్పుడు మేకప్ లేకుండా ఒక్క నాటకం కూడా వేయబడదు.
ఈ రంగుల వాడకం మాత్రం మనకి పాశ్చ్యాత్య దేశాల, ముఖ్యంగా బ్రిటీషు వారి పాలనా సమయంలోనే వచ్చింది. ఇంగ్లీషు వారికి అప్పటికే షేక్స్పియరు నాటకాలు ప్రాచుర్యంలో ఉండేవి. వివిధ రంగుల వాడకం ద్వారా ప్రతీ పాత్రకీ తగ్గ మేకప్ అనే ప్రక్రియ వెలుగు చూసింది. దాని ముందుగా బెంగాలీలు నాటకాల్లో వాడడం మొదలు పెట్టేక అది మెల్ల మెల్లగా మిగతా ప్రాంతాలవారూ వాడడం మొదలు పెట్టేరు.
అలాగే కేశాలంకరణ, విగ్గుల వాడకం కూడా మనకి పాశ్చాత్యుల వల్లే తెలిసింది. ఇవన్నీ మెల్ల మెల్లగా ప్రతీ ప్రాంతానికీ పాకి నాటకాలలో విగ్గులు వాడడం అనేది ఒక అలవాటుగా మారింది. ఇవన్నీ ఆహార్యం క్రిందకే వస్తాయి. ఏ పాత్రకి ఏ ఆహార్యం ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఏ రకమైంది ఉండాలీ ఇవన్నీ నిర్ణయించుకునేది దర్శకుడే !
పాత్రల మేకప్ అనేది ఆహార్యంలో మొదటి అంశం అయితే రెండవ అంశం వేదికాలంకరణ (స్టేజి డెకరేషన్ లేదా సెట్టింగ్స్). సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాలంటే స్థల కాలాల్ని బట్టీ సెట్టింగ్స్ వేస్తే ఆ సన్నివేశానికి మరింత బలం చేకూరుతుంది.పూర్వం స్టేజి మీద రకరకాల తెరలు వాడేవారు. (ఇక్కడ తెర అంటే స్టేజి వెనుక తెర. సాథారణంగా తెర అన్న దాన్ని స్టేజి ముందు ఉండే తెరకి వాడడం కద్దు. కానీ ఇక్కడ తెర అంటే సదరు సన్నివేశానికి వెనుక వాడే తెర. వాడుక భాషలో చెప్పాలంటే బ్యాక్ డ్రాప్ అన్నమాట.) ఆ తెరలమీద రంగు రంగు చిత్రాలు వేసి ఆ సన్నివేశం ఎక్కడ జరుగుతోందో చూపేవారు. వివిధ రకాల తెరల వాడకం కూడా 1800 కాలంలోనే ఎక్కువయ్యింది. ఇప్పటికీ తెర లేని నాటకం ఉండదు అంటే అతిశయోక్తి లేదు.
ఈ తెరల వాడకం సన్నివేశ విభజనకి చాలా ఉపయోగ పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆయా పాత్రలు ఏ ఏ ప్రదేశంలో ఉన్నారో స్థల నిర్ణయం చేస్తూ అతి సులభంగా చూపించచ్చు. దాని వల్ల సన్నివేశానికి ఆయువు పట్టు దొరికి బలం చేకూరుతుంది. ఒక్కోసారి ప్రతీ అంకానికీ ఒక ప్రత్యేక తెర వాడడం కద్దు. మన పల్లెల్లో తరచు చూపించే తోలుబొమ్మలాటలు నాటకాలకి తెల్లటి తెరలు వాడి, నీడలతో సృజనాత్మకమైన ప్రదర్శనకి దోహదం చేసాయి. నీడలతో సన్నివేశాలకి వేరే దృక్పథాన్ని చూపించడం తోలుబొమ్మలాట ద్వారానే మొదలయ్యింది. విద్యుఛ్ఛక్తి (కరెంటు) మన జీవితంలో విడదీయలేని నిత్యావసరమవ్వడం కూడా ఈ తరహా వైవిధ్య ప్రదర్శనకి ఓ పెద్ద కారణంగా కనిపిస్తుంది.
పూర్వం నాటకాలు వేసేటప్పుడు కొంతమంది నాటకం ఆసాంతం తెరలు పట్టుకొనే వారు. సాంకేతిక పరంగా ఇప్పుడు ఇలాంటి వన్నీ అధిగమించాము. ఇంకా వేదికని రెండు మూడు భాగాలుగా చేసి సన్ని వేశాన్ని అతి సహజంగా చూపించడం కూడా చూస్తూ ఉన్నాము. తెలుగునాట వేదికాలంకరణకి ఒక రకమైన ప్రత్యేకతని కలిగించింది మాత్రం సురభి నాటక సంస్థ వారేనని చెప్పచ్చు. వేదికాలంకరణ నాటకాన్ని వేరే మెట్టు ఎక్కిస్తుంది అన్నది ప్రయోగాత్మకంగా సురభి నాటక సంస్థ వారు నిరూపించారు. అప్పట్లో నాటకాలకి బహుళ ప్రాచుర్యాన్నీ, ప్రజలో మరింత ఆసక్తిని కలిగించింది సురభి వారి ఈ వేదికాలంకరణే! కేవలం సురభి వాళ్ళ సెట్టింగులు చూడ్డానికే జనాలు తండోపతండాలు గా వచ్చేవారు. అంతే కాదు, రామాయణ, మహాభారతాల వంటి పౌరాణిక నాటకాలని కళ్ళకు కట్టినట్లు చూపించడంతో నాటకాలకి సరికొత్త వన్నె చేకూరింది. చాలా మంది సురభి వారిని అనుకరించారు కానీ, వారి స్థాయి కెవరూ చేరలేకపోయారు.
వేదికాలంకరణలో అనేక ప్రయోగాలు జనరంజకంగా చేసింది సురభి నాటక సంస్థ వారే ! మాయాబజారు నాటకంలో వీరు వాడిన సెట్టింగులు కళ్ళు చెదిరేలా ఉంటాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో ఆయుధాలతో స్పెషల్ ఎఫెక్ట్స్ చూపిస్తూ వేదికాలంకరణ లో కొత్తదనానికి ప్రాణం పోసారు. కానీ వేదికాలంకరణలో పాశ్చాత్య దేశాల స్థాయికి మాత్రం మనం చేరుకోలేకపోయాం. ఒక రకంగా చెప్పాలంటే మన ఆర్థిక స్థితి కూడా ముఖ్య కారణం కావచ్చు. ఇప్పటికీ లండన్ లో షేక్‌స్పియర్ నాటకాలకి ఈ వేదికాలంకరణే ప్రత్యేక ఆకర్షణ. లండన్లో షేక్‌స్పియర్ థియేటర్లో నాటకం చూడడం వర్ణించనలవి కాని అనుభవం. మిమ్మల్ని కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మీ కళ్ళముందే జరుగుతున్నట్లుగా చూపిస్తారు. అక్కడ నాటకం చూసాక మిమ్మల్ని కొన్ని రోజులు ఆయా సన్నివేశాలూ, పాత్రలూ వెంటాడుతూనే ఉంటాయంటే అతిశయోక్తి కాదు.
పాశ్చాత్య దేశాల్లో నాటకాలకి కేవలం వేదికాలంకరణ కోసం ప్రత్యేకంగా ఇరవై ముఫ్ఫై మంది పని చేస్తారు. దీనికొక మేనేజరుంటాడు. వాళ్ళకి ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తారు. మనం తెలుగు నాటకం మాత్రం ఈ విషయంలో వెనకబడే ఉంది.ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఏ మాత్రం నవ్యత చూపించడానికీ తగిన శ్రద్ధ చూపడం లేదు. అమెరికా వంటి దేశాల్లో బ్రాడ్‌వే షోలకి కేవలం ఈ సెట్టింగులూ, హంగులూ చూడ్డానికే జనం ఎగబడతారు. స్టేజి మీద తుఫాను, మంచు కురవడం లాంటి వన్నీ చూపిస్తూ, ఆచరణ యోగ్యం కాని, ఊహ కందనీ కొన్ని సన్నివేశాలని చూపిస్తూ సంభ్రమాశ్చర్యాలకి గురిచేస్తారు. ఆహార్యంలో వేదికాలంకరణ ఒక ప్రత్యేకమైన విభాగం. సన్నివేశాన్ని నిలబెట్టేది ఈ వేదికాలంకరణే! దర్శకుడి సృజనాత్మకత, భావుకత అన్నీ కొట్టచ్చినట్లు కనిపించేది ఇక్కడే!
సాంకేతికాభివృద్ధి పెరిగాక ఆహార్యంలోకి నిశ్శబ్దంగా చొచ్చుకుపోయి, ఇప్పుడు నే లేందే నాటకం లేదంటూ మిగతావాటిని వెనక్కి నెట్టేసిన మరొక వస్తువు మైకు. ప్రస్తుతం ఏమున్నా లేకపోయినా మైకు లేందే నాటకం లేదు. అది లేందే నటులకి గొంతు పెగలని పరిస్థితి ఏర్పడింది.
పూర్వం నాటకానికి మైకు అనే సాంకేతిక వస్తువు లేదు. వాళ్ళు యథాశక్తి తమ తమ కంఠ స్వరాలపైనే ఆధార పడేవారు. ఆ కాలంలో నాటకాలు వేసేటప్పుడు నటీ నటుల గొంతులకి అతి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎందుకంటే వారు చెప్పే డైలాగులు స్పష్టంగా ఆఖరి వరసలో వాళ్ళకి బిగ్గరగా వినబడేలా ఉండాలనుకునే వాళ్ళు. కాల క్రమేణా విజ్ఞాన ప్రగతిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వస్తువు మైకనే ఖచ్చితంగా చెప్పచ్చు. మనిషి సాంకేతిక ప్రగతి పెరిగాక, ఈ మైకు అనేది నాటకాని కొక ప్రత్యేక అవసరంగా తయారయ్యింది. మైకు లొచ్చాక నటీనటులు గొంతు చించుకో నవసరం లేక పోయింది.
అంతే కాదు చివరి వరుస నున్న వారికి కూడా స్పష్టంగా ప్రతీ మాట వినిపించడానికి ఈ మైకు తోడ్పడుతుంది. కానీ ఈ మైకులూ, స్పీకర్లూ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. అంతే కాదు, ఇవి పని చేస్తేనే నాటకం రక్తి కడుతుంది. ఈ మైకులు పనిచేయాలంటే విద్యుచ్చక్తి కావాలి. పట్టణాల్లో ఫరవాలేదు కానీ, పల్లెల్లో ఇప్పటికీ ఇది సమస్యే!
అలాగే రాత్రి పూట నాటకాలు వేయాలంటే లైటింగ్ కావాలి. దీనికీ కరెంటు అవసరం ఉంది. ఇవన్నీ సరిగ్గా కుదిరితేనే నాటకం సవ్యంగా వస్తుంది. ఒక్కోసారి మైకులు మొరాయిస్తే అంతే సంగతులు. ఇప్పటికీ నాటకాలకి ఇది పెద్ద సమస్యే! అనేక నాటక సంస్థలు మిగతా విషయాలపై చూపించే శ్రద్ధా, ఆరాటం ఎందుకో ఈ మైకులూ, స్పీకర్ల మీద చూపించరు. మిగతా వాట్లకి ఎంత ఖర్చయినా చేస్తారు కానీ ఇక్కడ కొచ్చేసరికి ప్రతీ సంస్థా పొదుపు కార్యక్రమం మొదలు పెడతారు. సాంకేతికంగా ముందుకెళ్ళినా ఇలాంటి వాటిని తెలివిగా ఉపయోగించుకో లేకపోతున్నాం. శ్రీరామనవమి పందిళ్ళలోనూ, వినాయక చవితి పండగలకీ వేసే నాటకాలకి ఈ కరెంటు బెడద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నాటకం వేయాలంటే ఈ హంగులూ, సాంకేతిక సదుపాయాలూ ఉన్న ధియేటర్లు కావాలి.
మన తెలుగునాట పట్టుమని ఒక మంచి థియేటర్ లేదు. ప్రతీ ఊళ్ళోనూ ఇదే పరిస్థితి. కాస్తో కూస్తో హైద్రాబాదు రవీంద్ర భారతి నయం. చిన్న చిన్న పట్టణాలూ, పల్లెల్లో ఇప్పటికీ నాటక థియేటర్ల కొరత ఉంది. బహుశా సినిమాలు వచ్చాక నాటకం వెనకబడి పోవడానికిదొక ముఖ్య కారణం కావచ్చు. మంచి థియేటరు ఉండి సరైన సౌకర్యాలు ఉంటే నాటకం చూడ్డానికి తప్పకుండా జనం వస్తారు అని చాలామంది నాటకాభిమానుల విశ్వాసం !
ఇహ ఆహార్యంలో ఆఖరిది, అతి ముఖ్యమైనది సంగీతం. ఇది నాటకంలో సన్నివేశానికొక విధమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఒక రకమైన అర్థాన్నీ, రసాత్మకతనీ కలగజేస్తుంది. పూర్వం నాటకాలు ప్రారంభమైనప్పటి నుండీ సంగీతం ఉంది. నాటక ప్రక్రియ అనేది నృత్య నాటికల నుండే వచ్చింది. నృత్య నాటకాలకి సంగీతమే ఊపిరి. సంగీతం లేకుండా నాటకం ఏమాత్రం రక్తి కట్టదు. ఒక్కోసారి పాత్రల చిత్రీకరణకి సంగీతం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. నటీనటుల సంభాషణలకి సన్నివేశ పరంగా ప్రాణ ప్రతిష్ట చేస్తుంది. నిజ జీవితంలో మనకు వినిపించే శబ్దాలని స్టేజి మీద వినిపిస్తూ సన్నివేశానికి మరింత బలం చేకూర్చేది సంగీతమే!
కొన్ని కొన్ని నాటకాలలో పద్యాలూ, పాటలూ ఉంటాయి. అవన్నీ సంగీత ప్రధానమైనవే ! ముఖ్యంగా తెలుగు వారి సొత్తయిన పద్య నాటకానికి వెన్నెముక ఈ సంగీతమే! పద్యనాటకంలో ప్రతీ పద్యానికీ ఒక రాగం, లయ ఉంటుంది. దాని కనుగుణంగా పద్యాన్ని పాడుతుంటే ఎంతో కర్ణపేయంగా ఉంటుంది. పద్య నాటకాలకి మంచి సంగీతం ఆయువు పట్టు లాంటిది. పాండవోద్యోగ విజయంలో పద్యాలు ఇప్పటికీ మన చెవుల్లో గింగిర్లాడుతున్నాయంటే కారణం సంగీతమే! రాగభూయిష్టమైన పద్యాలు జనరంజకం అయితే ఆ పద్య నాటకం ప్రేక్షకుల మనస్సులలో నిలిచి పోతుంది. ఒకప్పటి పద్య నాటకాలలో జనరంజకమైన పద్యాల్ని ఇప్పటికీ అవే ట్యూన్లతో వాడుతున్నారు. ఎందుకంటే మనం వినీ, వినీ ఆ రాగాలకీ, ట్యూన్లకీ అలవాటు పడిపోయాం. ఫలానా పద్యం ఫలానా రాగంలో ఉంటేనే బాగుంటుందని ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేసాం. అందుకే కొన్ని పద్యాల ట్యూన్లు కొన్ని దశాబ్దాలుగా జీవించే ఉన్నాయి. ముందు ముందు జీవిస్తాయి కూడా! చాలామంది నాటాకాలు వేయడానికి అన్నీ సమకూర్చుకుంటారు కానీ సరైన సంగీతం అమర్చుకోరు. దాంతో ఎంత గొప్ప నాటకమైన దెబ్బతినే అవకాశం ఉంది. అదీకాక అనేక రకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు దొరకడం కూడా కష్టమే ! ఈ మధ్య కీబోర్డు వచ్చాక సంగీతం అంటే కీబోర్డు ప్లేయరే తప్ప, ఇహ వేరేమీ కాదు అన్న అభిప్రాయం స్థిరపడి పోయింది.
ఎలక్ట్రానిక్ కీబోర్డు వల్ల కాస్త మంచీ ఉంది, చెడూ ఉంది. ఒక్క మనిషే సంగీతాన్ని సమకూర్చొచ్చు. కానీ కీబోర్డులో కొన్ని శాస్త్రీయ సంగీత రాగాలు పలికించడం కష్టం. అలాంటప్పుడు కాస్త ఇబ్బందే ! ముఖ్యంగా పద్య నాటకాలకి ఇదొక అవరోధం లాగే కనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇప్పుడెవరూ పట్టించు కోవడం మానేసారు. ఏదో లాగించేద్దాం అన్నట్లుగానే ఉంటోంది సంగీతం. సంగీతం వల్ల వచ్చే ప్రత్యేకమైన అనుభూతి, అమెరికాలో బ్రాడ్వే మ్యూజికల్స్ తో కూడిన బాలేలు (ballets) చూస్తే తెలుస్తుంది. తెలుగు నాటా మంచి సంగీతకారులున్నారు కానీ, వాళ్ళెవ్వరూ నాటక రంగానికి పనిజేసిన దాఖలాలు లేవు.
కాకపోతే మామూలు సాంఘిక నాటకంలో పాటలూ, పద్యాలూ ఉండవు కాబట్టి, కీబోర్డు సంగీతం చాలు అన్న స్థాయికి వచ్చేసింది నాటకం. సినిమాలు వచ్చేక నాటకాల్లో సంగీతానికి ప్రాధాన్యత చాలా వరకూ తగ్గింది. త్యాగరాజు లాంటి వాగ్గేయకారులు సంగీత ప్రధానమైన నృత్య నాటికలు (ప్రహ్లాద విజయము, నౌకా చరితము) రచించారు. నృత్య నాటికలు కేవలం నృత్య ప్రధానమైనవే కాదు, సంగీత ప్రధానమైనవి కూడా. నృత్యానికి లయ, తాళం అతి ముఖ్యమైనది. కాబట్టి లయ బద్ధమైన సంగీతం, నృత్య నాటకానికి చాలా అవసరం. ఇప్పటికీ కొన్ని అన్నమాచార్య కీర్తనలకీ, త్యాగరాజ కీర్తనలకీ నృత్యం చేయడం చూస్తూనే ఉంటాం. సంగీతం లేకుండా నాటకాలు రక్తి కట్టవు. ఇది ఎవ్వరూ కాదన లేరు.
అందుకే, ఒక మంచి నాటకానికి ఆహార్యం చాలా ముఖ్యం. ఆకర్షణీయమైన సెట్టింగులూ, నటీనటులకి మంచి మేకప్పూ, హృద్యమైన సంగీతమూ ఇవన్నీ కలిస్తేనే నాటకం ప్రేక్షకుల హృదయాల్లో నాటుతుంది.
చాలామంది నటులకీ, సంభాషణలకీ, కథా వస్తువుకీ ఇచ్చిన ప్రాధాన్యత ఆహార్యానికివ్వరు. అలాంటి నాటకాలు ఎక్కువ కాలం బ్రతికి బట్ట కట్ట లేవు. ఈ రోజు వరకూ కూడా సురభి వాళ్ళ నాటకాలకి జనం ఎగబడడానికి కారణం ఆహార్యమే ! ఈ విషయం చాలా నాటక సంస్థలు గ్రహించినట్లు కనిపించవు. ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి పరవాలేదులే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. ఆ సరిపెట్టుకునే గుణమే నాటకాన్ని మరో మెట్టుకి తీసుకెళ్ళ లేక పోయింది. ఇదంతా మనకి నాటక కళాపోషకులు లేకపోవడమే కారణం. నాటకం అంటే మనకి కాస్త చిన్న చూపు పెరగడానికి కారణం మనకి సరైన థియేటర్లు లేకపోవడం ఇంకా పెద్ద కారణం. ఇప్పటికీ స్టేజి మీద సరైన సెట్టింగులు లేకుండానే ప్రదర్శనలు జరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. కారణాలు ఏవయితనేం నాటకం వేదిక పెరగాల్సినంత పెరగలేదు.
సంధాత లేదా నిర్దేశకుడు
నాటక రచన, నటన, ఆహార్యం అనే మూడు మూల స్థంభాలూ నిలబెట్టగానే నాటకం పూర్తి కాలేదు. ఈ మూడింటినీ సరైన సమన్వయంతో నిలబెట్టి, వాటిన ఒక రీతిలో, సరైన స్థానంలో ఉంచడానికొక నిర్దేశకుడు కావాలి. ఈ మూడింటి గురించీ కూలంకషంగా తెలుసున్న ఒక సంధాత కావాలి. ఆ సంధాతనే మనం దర్శకుడు అంటూ ఉంటాం. “దర్శకత్వం అనేది ఏముందీ, రచయిత రాసిస్తాడు, నటులు నటిస్తారు, ఆహార్యం అందిస్తారు, ఇవన్నీ అమరేక దర్శకత్వం ఎవరైనా చేస్తారు” అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది పొరపాటు అభిప్రాయం. ఇంతకుముందు ప్రస్తావించిన ప్రతీ విభాగంలోనూ నైపుణ్యత, లోతైన అవగాహన లేకపోతే దర్శకత్వం అనేది రాణించదు.
పది కాలాల పాటూ నాటకం నిలవాలంటే దర్శకుడు చాలా శ్రమించాలి. కొన్ని నాటకాలయితే కొన్ని దశాబ్దాలుగా ఒకే రీతిన అంటే మొదట చేసిన దర్శకుడి పంథానే దాదాపుగా అనుసరిస్తూ ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకి గురజాడ వారి కన్యాశుల్కం అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు తప్ప దాదాపు కొన్ని దశాబ్దాలుగా అదే రీతిలో ప్రదర్శిస్తున్నారు.అంటే మొదట దర్శకత్వం చేసిన ఆ మహా వ్యక్తి ఎవరో కానీ నాటకానికి జీవం పోసాడు. అలాంటి దర్శకుల ప్రతిభ కలకాలం నిలిచి పోతుంది. అలా అని ప్రతీ దర్శకుడూ మొత్తం అచ్చు గుద్దినట్లు నాటకాన్ని దించేస్తున్నారని కాదు. నూటికి డెబ్భై శాతం అదే రకంగా చూపిస్తున్నారు. నా దృష్టిలో కన్యాశుల్కం నాటకం స్క్రిప్టు పరంగా చూస్తే, కొన్ని చోట్ల అది ప్రదర్శనా యోగ్యంగా కనిపించదు. అతి చిన్న దృశ్యాలు చాలా ఉంటాయి. ఈ నాటకం చదువుకోడానికి బావుండే నాటకం. ప్రదర్శనా యోగ్యంగా మలచడం కోసం మూల ప్రతిని మరలా తిరగ రాసారు. ఇలాంటప్పుడే దర్శకుడి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపించేది.
అసలు దర్శకుడంటే ఎవరు? దర్శకత్వం చేయాలంటే అర్హతలేమిటి? కావల్సిన లక్షణాలేవిటి? ఎందుకు ఇది కష్టతరమైనది? అందరూ ఎందుకు దర్శకత్వం చేయలేరు? ఇలా అనేక ప్రశ్నలోస్తాయి. దర్శకత్వం చేయదల్చుకున్న ఎవరైనా ఈ ప్రశ్నలు వేసుకొని, ఒక్కసారి ఎవళ్ళకు వాళ్ళు జవాబు లిచ్చుకుంటే చాలు, ఇందులో ఉండే లోటుపాట్లు తెలుస్తాయి.
ముందుగా మూడు మూల స్థంభాలపైనా, వాటి నిర్మాణం పైనా దర్శకుడి పాత్ర ఎంతనేది చూద్దాం. ఈ మూడింటినీ అనుసంధానం చేయడంలో ప్రాధాన్యత ఏమిటో చూద్దాం.
ముందుగా దర్శకుడికి రచయిత చూపించిన కథా వస్తువుపై నమ్మకం కుదరాలి. రచయిత రాసిన ప్రతిపై పూర్తి అవగాహన రావాలి. రచయిత రాసిందానికి తన సృజన జోడించి ఇంకో మెట్టు పైకెక్కించేలా చేయాలి. నాటకం ఆత్మ చెడకుండా సృజనాత్మకంగా సన్నివేశాలని నిర్మిస్తూ, నటీనటుల హావ భావాలను పాత్రకు తగ్గట్టుగా మలచి, సరైన ఆహార్యం ప్రతీ సన్నివేశానికీ అమర్చి, నాటకాన్ని రసాత్మకఫలకంలో బంధించి, ప్రేక్షకుల మనసులపై సున్నితంగా అమర్చాలి. ఇందులో ఏవొక్కటి చెడినా నాటకం రక్తి కట్టదు. దర్శకత్వానికిది ప్రాథమిక సూత్రం.
కథా నిర్ధారణ జరిగాక, దానికి రచయిత తన ఊహాశక్తి జోడించి నాటకం రాసిస్తాడు. దర్శకుడు దాన్ని ఒకటికి పదిమార్లు చదివి అందులో ఏ మాత్రం సరిపడని విషయమున్నా, లేదా, దాన్ని మరింత సృజనాత్మకంగా చెప్పాలనుకున్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా స్పష్టంగా రచయితకి చెప్పాలి. అవసరమైతే మార్పులు చేయాలి. మార్పులు చేయడానికి కారణాలు సహేతుకంగా చెప్పాలి. ఇది ఒక రోజులో, ఒక దెబ్బలో అయ్యే పనికాదు. నాలుగైదు పర్యాయాలు చర్చించిన తరువాతే నాటకం చివరి ప్రతి (ఫైనల్ స్క్రిప్ట్) సిద్ధం చేసుకోవాలి. పాశ్చాత్యనాటకం ఈ పథం లోనే తయారవుతుంది. ఒక్కో నాటకాన్నీ నలుగురైదుగురు ప్రముఖులు చదివి, వారి వారి అభిప్రాయాల్ని సమీక్షించాక, నాటకం తయారవుతుంది. ఇదే పద్ధతి హాలీవుడ్ లో సినిమాలకీ పాటించడం కద్దు. కానీ తెలుగునాట నాటకాల్లో ఈ పద్ధతి పాటంచడం చాలా అరుదుగా కనిపిస్తుంది. నాటకం రాయడం వరకే రచయిత పని అన్నట్లుగానే దాదాపు ప్రతీ నాటక దర్శకుడూ అనుకుంటూంటాడు.
ఇంతకు ముందు చెప్పినట్లుగా రచయిత నాటకానికి తన సృజన జోడించడం దర్శకత్వ ప్రతిభకి కొలమానం. ఉదాహరణకి ఇది చూడండి. ఒక నాటక సన్నివేశంలో పిల్లవాడికి ప్రమాదం సంభవిస్తుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసాకా ఆ కుర్రాడు బ్రతుకుతాడు. ఈ మధ్యలో మిగతా పాత్రల తీరూ, బాధా, వేదనా అన్నీ చూపించాక, నాటకం కుర్రాడి ఆఖరి కోరికతో ముగుస్తుంది. ఇదీ రచయిత రాసిన సన్నివేశం.
ఆ సీన్ అక్కడతో ముగించి ఆపరేషన్ ధియేటరు ముందు మిగతా పాత్రలన్నీ చేరితే వాళ్ళ మధ్య సంభాషణల ద్వారా చెప్పించొచ్చు. అదే సృజనాత్మకత ఉన్న దర్శకుడైతే ఇంకాస్త ముందు కెళతాడు. విభిన్నంగా చూపించడానికి ప్రయత్నిస్తాడు. పై చెప్పిన సన్నివేశాన్ని ఒక ప్రతిభ గల దర్శకుడు ఇలా మలిచాడు. పిల్లాడికి ప్రమాదం జరిగి పడిపోగానే, తల్లి చూసి ‘బాబూ!’ అంటూ పరిగెత్తుకొస్తుంది. అందర్నీ పిలుస్తుంది. అందర్నీ పిలుస్తుంది. అక్కడ ఆ సీను ముగించి, తరవాత సన్నివేశంలో స్టేజి అంతా చీకటి చేసీ, తెరవెనుక అంబులెన్స్ ధ్వని వినిపిస్తూ, ఆ అంబులెన్స్ ఎరుపూ, నీలం లైట్లు వైలిగీ ఆరుతూ స్టేజి మీద చూపించాడు. దాంతో పాత్రల మధ్య వాచ్యం సగం తగ్గింది. తరవాత సీనులో ఆ పిల్లాడు ఇంటి కొచ్చినట్లు చూపించి తెలిసీ తెలియకుండా ఆపరేషన్ విషయం చిన్నగా చెప్పించాడు. దాంతో ఆ సన్నివేశం విభిన్నంగా ఉండడమే కాదు, ప్రేక్షకుడికి హత్తుకునేలా చూపించాడు. ఇదీ దర్శకత్వ ప్రతిభకి మచ్చుకొక ఉదాహరణ. అందుకే దర్శకుడికీ రచయితకీ పరస్పర అవగాహన ఉండాలి. ఒక్కోసారి ఒకే నాటకాన్ని పలు రకాలుగా చూస్తూ ఉంటాం. ఒక్కో దర్శకుడూ ఒక్కో పద్ధతిలో మలుస్తారు. ఎవరెలా మలచినా రచయిత రాసిన మూలానికి ఆత్మ చెడిపోకూడదు. రచనకీ, దర్శకత్వానికీ ఉన్న సన్నని సరిహద్దు స్పష్టంగా దర్శకుడికి తెలిసినప్పుడు ఏ ఇబ్బందీ రాదు. రచయితని దర్శకుడు డామినేట్ చేయడం మొదలు పెడితే నాటకం కూలిపోతుంది. ఒక్కోసారి కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు కనిపిస్తాడు. అంతర్లీనంగా కొన్ని చోట్ల రచయితా కనిపిస్తాడు.
కొంతమంది రచయితలకీ, దర్శకులకీ సమన్వయం చక్కగా కుదురుతుంది. వారి కలయికలో చక్కటి దృశ్యాలు తయారవుతాయి. సినిమా రంగంలో (నాటకం కాకపోయినా) తెలుగు నాటక రచయిత జంధ్యాలకీ, విశ్వనాథ్‌కీ ఉన్న సమన్వయం ఎన్నో మంచి చిత్రాలను అందించడానికి కారణంగా చెప్పచ్చు. నాటక రంగంలో ఇటువంటి సమన్వయం నాకు తెలిసి ఎక్కడా లేదు. చాలా మంది రచయితలు నాటకాలు చదువుకోవడానికి బాగుండేలా రాస్తారు. దర్శకుడు దాన్ని ప్రదర్శనా యోగ్యంగా మలచే ప్రయత్నంలో అనేక మార్పులు చేస్తాడు. దాని వల్ల ఒక్కోసారి రచయిత రాసిందాని కంటే బాగుండచ్చు, ఒక్కోసారి చెడిపోనూ వచ్చు.
ఒక్కోసారి రచయిత తన ధోరణిలో తను రాసుకు పోతాడు. దర్శకుడు తన ధోరణిలో తను ప్రదర్శింపజేస్తాడు. వారిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకుంటే ఒట్టు. తరవాతెప్పుడైనా ఆ రచయిత ఆ నాటకాన్ని చూసాడనుకోండి, “నాటకాన్ని నాశనం చేసేసాడు, తగలెట్టేసాడు” అంటూ రచయితలు బాధ పడడం చూస్తూనే ఉంటాము. ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుందంటే దర్శకుడికి నాటకం పూర్తిగా అర్థం కాకపోవడమే ! నాటకం చెయ్యాలన్న తపనే తప్ప, ఆ దర్శకుడు నాటకం ఆత్మని చూడలేక పోవడమే ముఖ్య కారణం.
కొంతమంది దర్శకులు నాటక రచయితని పూర్తిగా పక్కకు పెట్టేస్తారు. దానివల్ల నాటకాలు రాసే ఒకటీ అరా రచయిత లెవ్వరూ మరలా నాటకాల జోలికి వెళ్ళరు. దాని వల్ల మంచి నాటకాలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దర్శకత్వం చేయగలగడం వేరు, ఒక సన్నివేశాన్ని నిర్మించడం వేరు. సంభాషణలూ, పాత్రల మధ్య లింకులూ, సన్నివేశ నిర్మాణం ఇవన్నీ ఒక్క రచయిత వల్లే సాధ్యం. రచయితలే దర్శకులైన వైనాలు చూస్తాం కానీ, దర్శకుడే రచయితైనవి చాలా అరుదుగా చూస్తూంటాం.
నాటక రథానికి రచయిత రెండు చక్రాల మధ్య ఇరుసయితే, నటులు ఆ రథానికి అశ్వాల్లాంటి వాళ్ళు. గుర్రాల్ని సరిగ్గా నియంత్రిస్తూ, రథగమన వేగాన్ని నియంత్రిస్తూ చక్కగా సాఫీగా ముందుకు తీసుకెళ్ళే సారథే దర్శకుడు. వీటిల్లో ఏ ఒక్కటీ తమ తమ బాధ్యతల్ని నిర్వర్తించక పోయినా ఆ గమనం గతి తప్పుతుంది. అందుకే దర్శకుడి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది నటుల్ని చూస్తాం. నటులుగా వాళ్ళు అద్భుతంగా చేస్తారు. తీరా దర్శకత్వపు పాగా ధరించగానే చతికిల పడతారు. నటించడం వేరు, నటింపచేయడం వేరు. అందుకే అతి తక్కువ నట దర్శకుల్ని చూస్తూ ఉంటాం.
నాటకాని కైనా, ఆ విషయాని కొస్తే ఏ కళాత్మక రూపానికైనా, ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అదేమిటంటే – “కొద్దిగా తెలిస్తే చాలు, చాలా ఎక్కువగా తెలుసు అన్న భావన (ఫీలింగ్) కలగజేస్తూ ఉంటాయి”. అందుకే చాలామంది నటులు దర్శకత్వం చేసేస్తాం అంటూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్లుగా నటించడం అనేది ఒక్క పాత్రకి సంబంధించేదే! కానీ దర్శకత్వం అంటే అన్నీ పూర్తిగా తెలియాలి. తెలుసునన్న భావన (ఫీలింగ్) ఉంటే చాలదు.
నాటక ప్రదర్శనలో దర్శకుడి పాత్ర చాలా ఉంటుంది. డైలాగులెలా చెప్పాలీ, ఎలాంటి అభినయం చేయాలీ ఇవన్నీ చెప్పి శిక్షణ ఇవ్వాలి. దాని కంటే ముందు ప్రతీ సన్నివేశం గురించీ ఆయా పాత్రల పరిధి గురించీ, నటన గురించీ సవివరంగా చెప్పాలి. అంతే కాదు, తను ఆ సన్నివేశాన్ని ఎలా మలచ దల్చుకున్నదీ విశదీకరించాలి. నటీనటుల మధ్య నటన, ప్రతి నటన (యాక్షన్, రియాక్షన్) అన్నీ పర్యవేక్షిస్తూ నటనా శిక్షణ ఇవ్వాలి. ఒక్కోసారి నటనానుభవం ఎక్కువైన నటులుంటారు. వారికి తెలుసున్న పద్ధతి ఉంటుంది. అదే తీరులో చేసుకుంటూ పోతారు. వాళ్ళ నటనాచాతుర్యాన్ని ప్రదర్శించే యావ తప్ప వాళ్ళకేం పట్టదు. అలాంటప్పుడు దర్శకుడి పని కత్తిమీద సాము లాంటిదే. కొంతమంది మాట వినరు. అలాంటప్పుడు నాటకం చెడిపోతుంది. చెడితే దర్శకుణ్ణే అందరూ వేలెత్తి చూపుతారు. కానీ విజయవంతం అయితే నటులకే ఎక్కువ పేరొస్తుంది. అది వేరే విషయం.
ఇహ చివరి విభాగం ఆహార్యం. ఇక్కడ కూడా దర్శకుడి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతీ పాత్రకీ తగినా ఆహార్యం చూసుకోవాల్సిన బాధ్యత దర్శకుడిదే ! ఒక్కో సారి ఆయా కాల పరిస్థితుల్ని సావధానంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి, అనేక పౌరాణిక నాటకాల్లో మునులను చూస్తూ ఉంటాం. మునులనగానే మనం సన్యాసుల్లా భావించి కాషాయం రంగు దుస్తులు వేసేస్తాం. కానీ మనకు కాషాయం బౌద్ధం తరువాతే వచ్చింది. బౌద్ధం రాక మునుపు ఏం వాడేవారు అన్న రీసెర్చి మన దర్శకులు చేస్తారను కోను. విషయం తెలుసున్న దర్శకుల తీరు వేరేలా ఉంటుంది. కాషాయం వాడడం అంతగా పట్టించు కోనవసరం లేని చిన్న విషయమే. కాదనను. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా అధ్యయనం చేసేవాడే మంచి దర్శకుడనిపించుకుంటాడు.
ప్రతీ పాత్రకీ ఏ ఏ దుస్తులుండాలీ, నాటక పరంగా వాడే వస్తువులూ, స్టేజి మీద సెట్టింగులూ, ఇవన్నీ చూసుకోవాల్సింది దర్శకుడే! ఈ విభాగానికొక వ్యక్తిని దర్శకుడు ఖచ్చితంగా నియమించుకొని తీరాలి. అన్నీ లెక్క చూసుకోవాలి. స్టేజి మీద సెట్టింగులు ముందుగా ప్లాన్ చేసుకొని తయారు చేయించాలి. లైటింగ్ ఏ ఏ సన్నివేశాల్లో ఎంత ఉండాలీ చూసుకోవాలి. ఇది చేయడం రాసినంత, అనుకున్నంత సులభం కాదు.
కొంతమంది దర్శకులుంటారు, స్టేజీ మీద సెట్టింగులూ, స్పెషల్ ఎఫెక్ట్స్‌కీ ఇచ్చే ప్రాధాన్యత మిగతా విభాగాలకి ఇవ్వరు. అలాంటప్పుడు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ చూడ్డానికి బాగానే అనిపిస్తాయి కానీ నటీనటుల నటన సరిగ్గా లేకపోతే కొట్టచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకే అన్నిటా సమన్వయం చూపించాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా దర్శకుడిదే దర్శకుడిదే!
ఈ ఆహార్యంలో మరో ముఖ్యమైన అంశం సంగీతం.దాని గురించి మరీ ఎక్కువగా దర్శకుడికి తెలియకపోయినా, ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ముఖ్యంగా పద్య నాటకాలు వేసేటప్పుడైతే కాస్తయినా రాగాల గురించి తెలియాలి. చాలా మంది సంగీతం గురించి తెలుసుకోడానికి శ్రద్ధ చూపరు. సంగీత దర్శకుడు ఏం చెబితే అది వింటారు. సంగీత దర్శకుడికి సన్నివేశం గురించీ, ఆయా పద్యాలకైనా, పాటలకైనా, వాటి వెనుకున్న అంతర్గత సన్నివేశ నిర్మాణం గురించీ ఖచ్చితంగా చెప్పాలి. కాకపోతే తెలుగు నాటకాల్లో సంగీతం గురించి దర్శకులు అంతగా పట్టించుకోరు. ఏదో ఉండాలి కదా అన్న తీరుగానే ఉంటుంది వారి ప్రవర్తన!
పద్యనాటకాలకి సంగీతం ఆయువుపట్టు. ఏ రాగం ఎక్కడ వాడాలీ, ఎలాంటి రాగం ఉపయోగించాలీ ఇవన్నీ సంగీత దర్శకుడి బాధ్యతైనా, దర్శకుడి బాధ్యతా సమంగానే ఉంటుంది. ఇప్పటికీ, “బావా ఎప్పుడు వచ్చితీవు”, “జండాపై కపిరాజు”, “ముందుగ వచ్చితీవు”, “అదిగో ద్వారక” – వంటి పద్యాలు అందరి మన్ననలూ పొందడమే కాదు, ఆయా పద్యాల్లోని సాహిత్యాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళిన ఘనత ఆ సంగీత దర్శకులదే!
పద్యనాటకాలకే కాదు, సాంఘిక నాటకాలకి కూడా సంగీతం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో సంగీతం ప్రేక్షకుల్ని నాటకంలోకి లాక్కెళుతుంది. అందుకే దర్శకుడికి సంగీతం మీద కాసింతైనా సంగీతం గురించి తెలిస్తే మంచిది. కాబట్టి దర్శకత్వం చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది తెలుకున్న విజ్ఞులు దాని జోలికి పోరు. వాళ్ళ వాళ్ళ పరిధిల్లో వారి వారి కళా పిపాసని తీర్చుకుంటారు.
అన్ని స్థంభాలనీ సరిగ్గా నిలబెట్టినప్పుడే ఆ నాటకం నిలబడుతుంది. దర్శకుడూ తలెత్తుకునేలా నిలబడగలడు. కాబట్టి ఓ నాటకం జనరంజకంగా చెయ్యాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఏ ఒక్కరి ప్రతిభ వల్లో అవి విజయవంతం కాలేవు. అందుకే నాటకం సమిష్టి సృజన!
నేటి తెలుగు నాటక రంగ పరిస్థితి
కందుకూరి వీరేశలింగం గారి ధర్మమాని తెలుగు నాటకం మెల్ల మెల్లగా ఆంధ్రదేశమంతటా పాకింది. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ నాటకం జనప్రియం అయ్యింది. నాటక శక్తి ప్రజల్ని సమ్మోహితుల్ని చేసింది. సాంఘిక నాటకాలతో పాటు పద్య నాటకాల ప్రభవం కూడా పెరిగింది. ఆ సమయంలోనే తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగం పద్య నాటకం లోని పద్యాలు ప్రజల్ని ఒక ఊపు ఊపాయి. పండిత పామరులందరినీ సమంగా ఉర్రూత లూగించాయి. ఇప్పటికీ ఆ పద్యాలూ బ్రతికున్నాయంటే వాటి సరళమైన రచనా, అనురక్తి అయిన రాగాలే కారణం. స్వాతంత్రోద్యమంలో నాటకం కూడా ఒక మాద్యమంగా ఉపయోగపడింది. అప్పుడే సినిమా అనే ప్రక్రియ ప్రారంభం అయ్యేసరికి మెల్ల మెల్లగా నాటక రంగంపై సినిమా ప్రభావం ఎక్కువయ్యింది. అప్పట్లో నూటికి తొంభై శాతం నటులూ, నటీమణులూ, దర్శకులూ, ఒకరేమిటి, దాదాపు అందరూ నాటక రంగం నుండి వచ్చిన వారే ! ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి వెన్నుముక నాటక రంగమే!
మెల్ల మెల్లగా సినిమా ప్రజల్లోకి వెళ్ళడం ఎక్కువయ్యేసరికి చాలామంది నటీనటులకీ సినిమారంగం పై మోజు పెరిగింది. ఎంతోమంది సినిమాలవైపు మొగ్గారు. దాంతో నాటకం మెల్ల మెల్లగా శ్రీ రామ నవమి, వినాయక చవితి నవరాత్రుల సంబరాలికి మాత్రమే పరిమితం కాసాగింది. దాదాపు మన సినీ ప్రముఖ రచయితలందరూ నాటకాలు రాసి, వేసిన వారే! నాటకం అత్యంత శ్రమతో కూడిన పని. ప్రతీ రోజూ రిహార్సల్సు వేయాలి. ఎంతో ప్రాక్టీసు చేయాలి. పైగా ఊరూరూ తిరగాలి. స్టేజి దగ్గరనుండీ నాటక సమాజాల వాళ్ళే చూసుకోవాలి. నటీ నటుల, సాంకేతిక బృందాల వసతి చూసుకోవాలి. ఒకటా రెండా ఎన్నో చూసుకుంటేనే కానీ నాటకం వేయడం కష్టం. కానీ సినిమా అలా కాదు. ఆ రోజుకి ఆ నటన ఎన్ని సార్లయినా చేసి ( ఎన్ని టేకులయినా తీసుకొని ) బాగా మెప్పించవచ్చు. మరలా మరలా అది చెయ్యనవసరం లేదు. పైగా డబ్బింగ్ ప్రక్రియ వుండనే ఉంది. కాబట్టి ఆ సీనులో ఎలాగో అలాగ చెప్పినా డబ్బింగులో సరి చేసుకోవచ్చు. ఇలా అనేక రకాల సులువులుండడం వల్ల మెల్ల మెల్లగా నాటక రంగం సినిమా రంగం వైపు మళ్ళింది. సదరు సినిమాల్లో అవకాశం రాని వాళ్ళు మాత్రం నాటకలని అంటి పెట్టుకొని ఉండేవారు. ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది.
ఆ సమయంలోనే బక్క చిక్కిపోతున్న నాటకానికి ఊపిరి పోయాడానికి పెద్దలంతా నడుంకట్టారు. నాటకాన్ని రక్షించడం కోసం పోటీలు పెడితే బాగుంటుదన్న ఆలోచన వచ్చింది. అదిగో వాటిల్లోంచి వచ్చిందే పరిషత్తు నాటక పోటీలు. నాటక సమాజాలు పోటీ పడడం మొదలయ్యాయి. బహుమతులకోసం, అవార్డులకోసం నాటక రంగంలో వాళ్ళు బారులు తీరడం మొదలు పెట్టారు. పోటీ తత్వం వల్ల కొన్ని మంచి నాటాకాలూ వచ్చాయి. బాగా చెయ్యాలీ, బహుమతులు పొందాలంటే ఎంతో సృజనాత్మకత ఉండాలీ అన్నట్లు మొదట్లో నాటకరంగం ఉండేది.
కాల క్రమేణా పోటీ తత్వంలో రాజకీయాలు పొడ చూపాయి. వర్గీకరణ మొదలయ్యింది. దాంతో లాబీలు, సిఫార్సులు పెరిగాయి. దాంతో మరలా మొదటికొచ్చింది పరిస్థితి. మన తెలుగు నాటక రంగ పరిస్థితే ఇలా ఉంది. పక్క రాష్ట్రాలయిన మహారాష్ట్రా, కర్ణాటకాలలో నాటకం బాగానే అభివృద్ధి చెందింది. బెంగాల్ రాష్ట్రం అయితే చెప్పనే అక్కరలేదు. ఇప్పటికీ కలకత్తాలో నాటకానికి బ్లాకులో టిక్కట్లు అమ్ముతారంటే నమ్మశక్యం కాదు. నాటకం అంటే బెంగాలీల కున్న ప్రేమా, అభిమానం అంతా ఇంతా కాదు. అలాగే మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రా కూడా ఈ విషయంలో ఏ మాత్రం తీసిపోదు. ఎటొచ్చీ మన తెలుగు నాటకమే ముందు కెళ్ళ లేక పోతోంది.
ఇప్పటికీ మంచి నాటకాలూ ఏవైనా ఉన్నాయా అని ఎవరైనా అడిగితే మరాఠీ, లేదా బెంగాలీ నాటకల వైపే మన నాటక విజ్ఞుల దృష్టి మళ్ళుతుంది. కాస్త విభిన్నత కలిగిన నాటకాలూ కావాలంటే కన్నడా లేదా మరాఠీ లేదా బెంగాలీ నాటకరంగాల తలుపు తడుతూనే ఉంటుంది మన తెలుగు నాటకరంగం. పందొమ్మిదివందల అర వై దశకం చివరలో ఎన్నార్ నంది రాసిన “మరో మొహంజదారో” నాటకం తప్ప ఆ తరువాత తెలుగులో ప్రయోగాత్మక నాటకాలే లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరో మొహంజదారో తెలుగు నాటకంలో ఓ కలికి తురాయి. సృజనాత్మకతకి పెద్ద పీట వేసి, నాటకాన్ని మరలా ప్రజల దగ్గరకి తీసుకెళ్ళిన ప్రయోగాత్మక నాటకం. కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. “టెక్నిక్ దృష్ట్యా కానీ, విశ్లేషణ దృష్ట్యా కానీ, పాత్ర చిత్రణం దృష్ట్యా కానీ, మరో మొహంజదారో నాటకం ప్రేక్షకుల్ని జుట్టు పట్టుకు గుంజి వదిలి పెట్టి, ‘మీ లోపలికి చూసుకోండి’ అని హెచ్చరించే నాటకం”. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి “అలనాటి నాటకాలు” అనే పుస్తకంలో పైన చెప్పినట్లుగా రాసారు. “మరో మొహంజదారో గొప్పతనం చెప్పడానికి ఈ వాక్యాలు చాలు. ఆ తరువాత చెప్పుకోదగ్గ నాటకం రావి శాస్త్రి నిజం. చాలామంచి నాటకాలు రాసారు కానీ వాటి సంఖ్య మాత్రం మరీ ఎక్కువ కాదు.
నాటకరంగం ఎదగకపోడానికి సినిమా పెద్ద కారణమయితే, నాటక రంగం నుండి వెళ్ళిన వాళ్ళెవరూ దానిపై శ్రద్ధ చూపలేదు. ఒక రకంగా సినిమా రంగం లోకి ప్రవేశించడానికి నాటక రంగం పెద్ద వేదికలా తయారయ్యింది. చాలామంది సినిమాల్లో అవకాశాలు రాగానే నాటకాన్ని మర్చిపోయారు. అంతే కాదు సాంకేతికంగా ఎదిగినా, ఒక నాటకం వేయడానికి కావల్సిన ఖర్చు భరించి నాటకాన్ని పోషించిన పెద్దలెవరూ లేరు. సంపన్నులెవరూ నాటకాలలో పెట్టుబడి పెట్టలేదు. ఒకరకంగా చెప్పాలంటే మనకి మనం మంచి ధియేటర్ కట్టుకో లేకపోయాం. ఇంతకు ముందు చెప్పినట్లుగా నవరాత్రి పందిళ్ళలో అమర్చిన వేదకల పైనే నాటకం చాలా కాలం బ్రతికి బట్ట కట్టింది. లేదా ఏదైనా కాలేజీ లేదా యూనివర్శిటీ వారోత్సవాలకే నాటకాలు వేయడం మొదలయ్యింది. స్థూలంగా ధియేటర్ సౌకార్యాలు లేకపోవడం ఒక ప్రధాన కారణమైతే, పెట్టుబడి పెట్టి నాటక సమాజాలని ప్రోత్సహించిన నాధులెవరూ లేకపోవడం మరో పెద్ద కారణం. నాటక కళపై మక్కువున్న వారందరూ ఒక సమాజంగా ఏర్పడి వారి వారి సొంత డబ్బుని నాటకాలకి ఖర్చుపెట్టిన వారే ఎక్కువ. ఈ లోగా పరిషత్తు నాటకాల పోటీలు మొదలయ్యాక బహుమతులు ఎలా సంపాదించాలా అన్న దాని మీదే అందరి దృష్టీ పడింది. దాంతో రకరకాల సమస్యలు మొదలయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే పరిషత్తులొచ్చాక మేలూ జరిగింది. దానికి తగినంత కీడూ జరిగింది.
ఈలోగా ప్రభుత్వమూ నడుం బిగించింది. నాటక రంగానికి గుర్తింపంటూ నంది నాటకోత్సవాలను ఏటేటా నిర్వహించడానికి పూనుకొంది. దాంతో నాటక సమాజాల్లో కొత్త ఉత్సాహం, ఆసక్తి బయలదేరినా బహుమతుల పంపకాల్లో తేడాలు పొడసూప సాగాయి. మా నాటకం గొప్పది, మాకు బహుమతి రాలేదంటే మాకు రాలేదనీ, నొక్కేసారనీ, తొక్కేసారనీ ఇలాంటి బాధలూ, నిందలూ, ఆరోపణలూ మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఆయా పరిషత్తుల నాటక పోటీలకి ఎన్నుకునే విధానం, వారి వారి నియమాలూ, సూత్రాలే కారణం అని చాలామంది ప్రముఖుల అభిప్రాయం.
ఉదాహరణకి నంది నాటకాలనే తీసుకుందాం. ఇది మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమక్షంలో జరిగే నాటకోత్సవం. ఇక్కడ పద్య నాటకాలూ, సాంఘిక నాటకాలూ, నాటికల పోటీ నిర్వహిస్తారు. దాదాపు ఆర్నెల్లు ముందుగా ప్రకటన వస్తుంది. అనేక నాటక సమాజాలు ఈ పోటీలకి సంసిద్ధులవుతారు. ముందుగా వాళ్ళు ఏ ఏ విభాగంలో వేస్తారో నాటకం స్క్రిప్టు పంపాలి. వచ్చిన నాటకాలని స్క్రిప్టు పరంగా వడబోత మొదలవుతుంది. కొన్ని నాటకాలకి వాళ్ళ స్క్రూటినీ మొదలవుతుంది. కొంత మంది న్యాయ నిర్ణేతలు ఆయా సమాజాల వారు వేయబోయే నాటకాల రిహార్సల్సు చూస్తారు. మేకప్పు, స్టేజీ లేకుండా నటీ నటుల నటనా పరంగా నాటకం చూసి, స్క్రిప్టు తో బేరీజు వేసుకొని అందులో చివర పోటీకి అత్యుత్తమమని అనిపించిన తొమ్మిది లేదా పది నాటకాలని సెలక్ట్ చేస్తారు. ఏ ఏ నాటకాలు సెలక్ట్ చేసారన్న విషయం పేపరు ప్రకటనలో వస్తుంది. చివరికి ఈ నాటకాలని వారం రోజుల సమయంలో నంది నాటకోత్సవంలో ప్రదర్శిస్తారు. న్యాయ నిర్ణేతలు అందులోంచి అత్యుత్తమమైన నాటకాలకి ప్రధమ, ద్వితీయ బహుమతులు ఇస్తారు. అలాగే మంచి రచనకీ, నటులకీ, దర్శకులకీ బహుమతులుంటాయి. ఇదంతా చూడ్డానికీ, రాయడానికీ బాగానే ఉంటుంది. కానీ ఈ నిర్ణయ విధానంలోనే అనేక అవకతవకలు జరుగుతాయని ప్రతీ సారీ అందరూ గగ్గోలు పెడతారు.
లాబీలూ, పక్షపాతా ధోరణులూ, సిఫార్సులూ ఇవన్నీ మంచి నాటకాలని ప్రోత్సహించకుండా చేయిస్తున్నాయని అనేక మంది ఆరోపణ. “లేదూ బాగానే ఉన్నాయి. పరవాలేదు, ఆమాత్రం రాజకీయాలు ఎక్కడ లేవు చెప్పండి? ఏదో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది కదా, అలా సంతోషించడం పోయి ప్రతీ దానికీ వెంట్రుకలు లాగితే ఎలాగ?“ అనే వర్గం కూడా ఉంది.
ఈ పోటీ నాటకాలు అనే సరికి నాటక సమాజాల వాళ్ళకి కొన్ని అపోహలున్నాయి. ప్రేక్షకుల్నీ, న్యాయ నిర్ణేతల్నీ అతి సులభంగా మెప్పించగల శోక రసం (ఏడుపు) ఉండి తీరాలి. అది ఎంత ఎక్కువ పాళ్ళలో ఉంటే అంత మంచిది. అంతే కాదు భారీగా డైలాగులుండాలి. ఇలా రాసుకుంటూపోతే చాలానే ఉంటాయి. దాంతో ఏమవుతోదంటే ప్రతీ నాటకంలోనూ తప్పనిసరిగా విషాదం ఉంటోంది. న్యాయ నిర్ణేతలకీ అవే కావాలి, ఏం చేస్తాం అని సమర్థించుకునేవారు ఎక్కువైపోయారు. దీనివల్ల సున్నితంగా మనుషుల మధ్య జరిగే ఘర్షణల్ని చూపలేకపోతున్నారు.
ఒక పరిషత్తులో కట్టిన నాటకాన్ని అనేక పరిషత్తులకి ఏడాదిపాటు తిప్పుతారు. ఈ లోగా గిర్రున కొత్త సంవత్సరం వస్తుంది. మరలా ఈ పోటీ ప్రహసనం మొదలవుతుంది. దీనివల్ల ఏడాదిలో అతి తక్కువ నాటకాలు వస్తాయి. అవీ ఆయా పరిషత్తుల పోటీలకోసం రాసినవే అవుతాయి. దాంతో కొత్తదనం, నవ్యత లేక నాటకం చూడ్డానికి జనం రావడం తగ్గించేసారు. ఇదే గత ఇరవై ఏళ్ళుగా జరుగుతోంది. అలాగే నాటకాలు వేసే వాళ్ళు స్క్ర్తిప్టుల కోసం సినిమాల పైనా ఆధార పడుతున్నారు. లేదా పొరుగు రాష్ట్రాల వైపు పరిగెడుతున్నారు. ఏ ఊరెళ్ళినా ధియేటర్ల కొరత ఎలాగూ ఉంది.
టీవీ వచ్చాక నాటకం దక్షిణ దిశగా మరింత వేగంగా పయనించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం నాటక రంగం ఎలా తయారయ్యిందంటే అది టీవీలో అవకాశాలు సంపాదించడానికొక వేదిక (ఫ్లాట్ ఫారం) లా తయారయ్యింది. నటీనటుల శిక్ష ణా కేంద్రంగా తయారయ్యింది.
మిగత పాశ్చాత్య దేశాల్లోలాగ మన దేశంలో ఈ నాటక, సినిమా కళపై సరైన శిక్షణ చాలా విశ్వ విద్యాలయాల్లో లభించదు. ఉన్నా ఇద్దరో ముగ్గురో విద్యార్థులుంటారు. వాళ్ళకి డిగ్రీలు వచ్చినా అవి చూసి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళెవరూ ఉండరు. దాంతో ఆయా కోర్సుల్లో చేరే వాళ్ళ సంఖ్యా ఒంటరి గానే ఉంటుంది. యూరప్, అమెరికాల్లో అయితే ఈ నటన, స్క్రిప్టు రాయడం, దర్శకత్వం వగైరా వగైరా విభాగాలపై నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులుంటాయి. అవి వాళ్ళ కెరీరు కెంతో ఉపయోగ పడతాయి. మనకి దేశం మొత్తంలో నటన శిక్షణ ఇచ్చే ఇనిస్టిట్యూట్లు వేళ్ళ మీద లెక్కట్టోచ్చు. ఈ మధ్య టీవీ చానల్స్ పెరిగాకా వీటికీ గిరాకీ పెరిగింది. కానీ వీళ్ళందరూ టీవీ సినిమాల వైపే వెళుతున్నారు. అవకాశాలు రానివాళ్ళు మాత్రం వాటికోసం ఎదురుచూస్తూ తమ కాలాన్ని నాటకాల కోసం గడుపుతున్నారు.
కాకపోతే నంది నాటకాల వల్ల కొంత మేలూ జరిగింది. కనుమరుగవుతున్న పద్యనాటకాలు మరలా ఊపందుకున్నాయి. జనంలో ఒక రకమైన ఆసక్తి మొదలయ్యింది. ఎంతలేదనుకున్నా ఈ నంది నాటకాల ధర్మమాని ఏడాదికి కనీసం పది ఇరవై పద్య నాటకాలు తయారవుతున్నాయి. అందులో ఎన్ని గొప్పగా ఉన్నాయన్నది వేరే విషయమనుకోండి. కనీసం ఈ నాటక పోటీల కోసమైనా కొత్తగా పద్య నాటకాలు పుడుతున్నాయి. కొన్ని పాత నాటకాలే మార్చి వేస్తున్నారు కూడా. ఒక రకంగా నంది నాటకాలు పద్య నాటకాలకి మరలా ఊపిరి పోసాయనే చెప్పచ్చు.
కాకపోతే పల్లెల్లోనూ, చిన్న చిన్న పట్టణాల్లోనూ నాటకం ఉంది. కానీ కొత్త గానూ, గొప్పగానూ లేదు. ఇంతకు ముందెలాంటి స్థితిలో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. నాటకాలు వేస్తున్నారు. ఎవరూ కాదనరు. కానీ నాటకాన్ని వేరే మెట్టుపైకి తీసుకెళ్ళే ప్రయత్నం జరగడం లేదు. ఇంతకు ముందు ప్రస్థావించినట్లుగా నాటకాలకి పెట్టుబడి పెట్టే నాధుళ్ళు కరువయ్యారు. చందాల మీదే ఆయా ఊళ్ళల్లో నాటం బ్రతుకుతోందని కొందరి అభిప్రాయం. ఏదైతేనే నాటకాన్ని అద్భుత స్థాయికి తీసుకెళ్ళలేని పరిస్థితిలోనే కూలబడింది నేటి నాటక రంగం. కాకపోతే నాటకరంగంలో ఉన్న ఏ ఒక్కరూ ఈ విషయాన్ని అంగీకరించరు. అది వేరే విషయం.
ఇంతకు ముందు చెప్పినట్లుగా నవ్యతతో కూడిన నాటకాలు రాకపోడానికి కారణం రచయితల హస్తమూ ఉంది. నాటక రచనకి ఎవరూ ప్రయత్నించడం లేదు. కాస్తయినా రాయగల శక్తి ఉన్న రచయితలు టీవీలకీ, సినిమాలకీ వెళుతున్నారు. మిగతావాళ్ళు ఎందుకొచ్చిన నాటకాలూ అనుకుంటున్నారు. అలాగే ప్రపంచీకరణలో భాగంగా తెలుగు వెనకబడి పోవడంతో తెలుగులో రాసేవాళ్ళూ తగ్గుతున్నారు. చదివేవాళ్ళూ తగ్గుతున్నారు.
కొత్త కథలు పుట్టడం తగ్గింది. పోనీ పాత కథలని తీసుకొని ఎవరైనా నాటకం రాస్తున్నారంటే పాత కథలు చదివే తీరికెక్కడిది? ఈ మధ్యనే అప్పాజోష్యుల ఫౌండేషన్ వాళ్ళ గత రెండేళ్ళుగా కథా నాటిక పోటీలు పెడుతున్నారు. విలువైన బహుమతులు ప్రకటించినా వాసి ఉన్న నాటకాలు రావడం లేదని విజ్ఞుల అభిప్రాయం. పోటీ అనే సరికి ఒక రకమైన మూస లోకి వెళిపోతున్నారు. దాంతో కొత్త నాటకం వస్తోంది కానీ, పాత ధోరణలు మాత్రం వదలడం లేదు. పైగా ఈ పోటీలంటే అత్యంత శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఖర్చయినా, శ్రమ మిగులుతోందా లేక రెండూ గోతిలో పోస్తున్న చందంగా తయారయ్యిందా అన్నది కాలమే నిర్ణయించాలి.
అలాగే ఆంధ్రదేశంలో నాటక పరిషత్తులు బాగానే ఉన్నాయి. చాలా నాటక సమాజాలు పరిషత్తు పోటీలకు చూపించే ఉత్సాహం మామూలుగా ఏ రవీంద్ర భారతిలోనో లేకపోతే తుమ్మలపల్లి కళా క్షేత్రంలోనో వేస్తామంటే అంతగా ముందుకు రావడంలేదు. పరిషత్తు పోటీల్లో బహుమతి గెల్చుకుంటే కాస్త గుర్తింపు వస్తుందన్న ఆశ కారణం కావచ్చు. అలాగే ఈ నాటక సమాజాలకి ఇంకొక జాడ్యం దాపురించింది. అదేమిటంటే ఒక నాటక సమాజం వేసిన నాటకాన్ని ఇంకో సమాజం వాళ్ళు చూడరు. ఆ ప్రదర్శన దరిదాపులకి కూడా వెళ్ళరు. నాటకమే ఊపిరిగా బ్రతుకుతూ, నాటక రంగమే జీవితంగా బ్రతికే వాళ్ళు తోటి కళాకారులని ప్రోత్సహించలేక పోవడం దురదృష్టకరం. ఇవన్నీ వినడానికి బాగుండలేక పోవచ్చు. నిష్టూరంగా అనిపించొచ్చు. కానీ ఇవి ఎవరూ కాదనలేని కఠోర సత్యాలు. ముఖ్యంగా ప్రతీ నటీ నటులు తోటి కళాకారుని గౌరవించడం అనే సంప్రదాయం తగ్గిపోతోంది. వర్గాలూ, వర్గీకరణలూ ఇవన్నీ నాటక రంగానికి మేలు కంటే హానే ఎక్కువ చేస్తున్నాయి.
అలాగే పరిషత్తు పోటీల్లో ఒక నాటక సమాజం వాళ్ళకి బహుమతి ఇస్తే, బహుమతులు రాని వాళ్ళ అసూయా ద్వేషాలు ఎంతో హాని చేస్తున్నాయి. వాళ్ళు తం శక్తి నంతా ఎదుటి సమాజ వారిపై బురద జల్లడానికే వాడుతున్నారు. ఇలా ఎంతైనా రాయచ్చు. కానీ నాటకరంగలో వాళ్ళే నాటకాభివృద్ధికి శత్రువులుగా పరిగణింపబడడం తెలుగు నాటకానికి ఎంతమాత్రమూ మేలు చేయదన్నది నిర్వివాదాంశం.
కాబట్టి నాటక ప్రియులంతా పోజిటివ్ దృక్పథంతో అందర్నీ కలుపుకుంటూ నాటకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలా అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయ్యిదని ఖచ్చితంగా చెప్పచు. ప్రపంచంలో ఏ ప్రాంతలోని తెలుగు వారైనా సరే నాటకాన్ని బ్రతికించుకోడానికి నాటక ప్రియులంతా నాటకాన్ని పోషించడానికి ముందుకు రావాలి.
నాటకాన్ని బ్రతికించుకుందాం
మొదటి నుంచీ తెలుగు సాహిత్యంలో నాటకాలకి ఒక ప్రత్యేకమైన స్థానం అంటూ అందరూ గొంతులు చించుకున్నా, చేతల్లో మాత్రం నాటకానికంత విలువ లేదని నా అభిప్రాయం. తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలమీదా విమర్శనా గ్రంధాలూ, వ్యాసాలూ వచ్చాయి. కానీ ఒక్క నాటకాలపై పరిశోధనాత్మకంగా పని జరగలేదు. నాటకాలు వేయడం వరకే కానీ, ఆ నాటకాలపై మంచి విశ్లేషణాత్మకమైన పుస్తకాలు వెలువడలేదు. ఒక్క షేక్ ష్పియర్ నాటకాలే తీసుకోండి, వాటిపై ఎన్ని గ్రంధాలు వెలువడ్డాయో లెక్కలేదు. తెలుగులో మహా మహులంతా నాటకాలు రాసారు కానీ విమర్శ పై ఏ విధమైన శ్రద్ధా చూపలేదు.
అలాగే పత్రికల వాళ్ళకి కూడా నాటకం అంటే చిన్న చూపే. కథలూ, కవితలూ, వ్యాసాలూ వేసుకుంటారు కానీ, తెలుగునాట ఏ పత్రికలోనూ ఒక్క నాటకం ప్రచురించిన జాడలు కనిపించవు. అలాగే నాటకం వేద్దాము అనుకునే ఔత్సాహికులకి నాటక ప్రతులు దొరకడం కష్టమే! ఎప్పుడో పూర్వం అచ్చు వేసిన నాటక ప్రతులు ఏ గ్రంధాలయంలో లభిస్తాయో తెలియదు. నాటక విభాగానికి సంబంధించిన పుస్తకాలు లభించే గ్రంధాలయాలు కరువయ్యాయి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. గత వందేళ్ళల్లో వచ్చిన నాటకాలన్నీ సంపాదించి ఒక లైబ్రరీ లా చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది. దీని వల్ల ముందు తరం నాటక ప్రియులకి ఎంతో లాభం చేకూరుతుందనడంలో సందేహం లేదు.
అలాగే వార్తా పత్రికలు కూడా అక్కడ నాటకం వేసారు, ఇక్కడ నాటకం వేసారు అని ఏమూలో అట్టడుగున వార్తలు వేయకుండా మంచి కవరేజి ఇస్తే నాటకం అంటే జనంలో ఆసక్తి పెరిగుతుంది. వారం రోజుల పాటు ఏటా నంది నాటకోత్సవాలు జరుగుతాయి. ప్రారంభం రోజున మంత్రి గారి ఫోటో తో ఓ వార్తా, చివరిరోజున బహుమతి ప్రదానం గురించి మరో మంత్రిగారు “నాటక రంగాన్ని అభివృద్ది చేస్తామంటూ ” కళాకారులకి చేసే వాగ్దాన వార్తతో మరో వార్తా తప్ప ఒక్కటీ ఏ వార్తా పత్రిక తరిచి చూసినా కనిపించవు. అసలు ఏ నాటకాలు వేస్తున్నారు? వాటి కళాకారులెవరు? కథా వస్తువులేమిటి? ఈ వార్తలు ప్రథాన పేజీల్లో కనిపించవు. ఏ ఊళ్ళో జరుగుతున్నాయో ఆ ఊరి ఎడిషన్లో ఫొటోలూ, దానిపై రెండు వాక్యాలతో పత్రికల వాళ్ళు నాటకాలకి మంగళం పాడతారు. ఈ విషయంపై నాటక రంగం వాళ్ళూ శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. గ్లోబలైజేషన్ ధర్మమా అని ప్రసార మాద్యమాల ప్రాభవం పెరిగింది. దాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్య మాత్రం నాటక రంగానిదే ! ఇది ఎవరూ కాదనలేని నిజం. కాకపోతే ఎవరు పిల్లి మెడలో గంట కడతారన్నదే తేలని విషయం.
అలాగే ఏటా జరిగే నంది నాటకాలకైనా, లేదా ఏ పరిషత్తు నాటకాలకాల్లో నయినా ప్రదర్శింపబడే నాటకాలని పుస్తక రూపంలో ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నంది నాటకోత్సవాలకి పెట్టే ఖర్చులో ఇది ఏమాత్రమూ లెక్క లోకి రాదు. ఇలా నాటక ప్రతులుండడం వల్ల నాటకరంగంలో వచ్చే ప్రతీ నాటకాన్నీ పుస్తక రూపంలో చరిత్రకెక్కెస్తున్నాం. అలాగే నాటకాభి లాష ఉన్న విద్యార్థులకి ఈ పుస్తకాలు ఎంతైనా ఉపయోగపడతాయి. ఇలా ఎన్నో గంటలున్నాయి కానీ, మెడ మాత్రం ఒకటే! దీనికి నాటకరంగ పెద్దలే నడుం కట్టాలి.
అలాగే ప్రతీ కళాశాల లోనూ, విద్యాలయాల్లోనూ నాటక సమాజాల వాళ్ళు ఉచితంగా నాటాకాలు వేసి విద్యార్థులకి నాటకం పై ఆసక్తి కలిగించాలి. అలాగే యూనివర్శిటీ వారోత్సవాల్లోనూ అక్కడా మంచి ప్రదర్శనలు ఇచ్చి విద్యార్థుల్లో నాటకం అంటే ఉత్సాహం పెంచాలి.
నాటకాలు ఎవరైనా వేస్తూ టిక్కట్లు పెడితే ఖచ్చితంగా అందరూ టిక్కట్లు కొని మరీ వెళ్ళాలి. ఆ మధ్య ఒక నాటక సంస్థ వారు నాటకానికి టిక్కట్లు పెట్టారు. పట్టుమని పదిమంది కూడా రాలేదు. వచ్చిన వాళ్ళల్లో సగం మంది ఫ్రీ పాసులే ! ఇలా ఉంటుంది పరిస్థితి. అలాగే ప్రభుత్వం కూడా ధియేటర్లని నాటక సమాజాలకి తక్కువ ధరకి అద్దెకివ్వాలి. దాని వల్ల మంచి నాటకాలు అన్ని సౌకర్యాలూ ఉన్న ధియేటర్లో ప్రదర్శించవచ్చు. ధియేటర్ కయ్యే ఖర్చుని స్టేజి డెకరేషన్ కో మరో దానికో ఉపయోగిస్తే మంచి నాటకాలు వచ్చే అవకాశం ఉంది. చాలా సమాజాలు ఖర్చు ఎక్కువనీ ఆహార్యం దగ్గర సమాధాన పడిపోతారు. అందువల్ల నాటకాలంటే జనంలో ఆకర్షణ తగ్గిపోతుంది. మంచి మంచి సెట్టింగులు వేసి నాటకాలు వేస్తే జనం తప్పకుండా వస్తారని నా ఆశ. నాటకం జనాన్ని ధియేటర్ కి రప్పించాలి. ఎలా చేసినా సరే, దాని సర్వ బాధ్యతలూ నాటకరంగానిదే !
చివరగా విదేశాల్లో నాటకాల గురించి కాస్త ప్రస్తావిస్తాను. ఎందుకంటే తెలుగు నేల విడిచిన ప్రతీ తెలుగు వాడికీ ఒక తెలుగు సంఘం ఉంటుంది. ప్రతీ తెలుగు సంఘమూ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాయి. అందులో నాటకం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. కాబట్టి విదేశాల్లో తెలుగు నాటకం గురించి కాస్తయినా చెప్పుకోవడం సమంజసం. నాకు అమెరికాతో పరిచయం ఉంది కాబట్టి అమెరికాలో నాటకాల గురించి కాస్త ప్రస్తావిస్తాను.
అమెరికాలో దాదాపు అన్ని ముఖ్య నగరాల్లోనూ ఒక తెలుగు సంఘం ఉంది. ఉగాది కనీ, దీపావళి సంబరాలనీ, సంక్రాంతి వేడుకలనీ, అవనీ ఇవనీ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందులో తప్పని సరిగా నాటకం ( పౌరాణికం, హాస్యం లేదా జానపదం ఏ దైనా కానివ్వండి ) వేస్తారు. కాకపోతే ఈ నాటకాలు టైం ఫిల్లర్లుగా వేస్తారు తప్ప, అంత సీరియస్ నెస్ కనబడదు. ఏదో మొక్కుబడికి లాగించేద్దామన్నట్లు గానే ఉంటాయి. వాళ్ళ పరిమితులూ, సమస్యలూ ఆ యా సంఘాలకి ఉన్నాయి కాదను. కానీ వేసే ఆ నాటకాల్లో స్టేజి ఎక్కేద్దామన్న తపనే కానీ నాటకం అంటే అర్థం చేసుకొని అవగాహనతో వేస్తున్నారని నేననుకోను. నా అభిప్రాయం తప్పని ఎవరైనా ఖండిచ వచ్చు.
అలాగే తానా, ఆటా ప్రతీ రెండేళ్ళకొక సారి ఉత్సవాల పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అక్కడా నాటకం అంటే సవతి తల్లి ప్రేమలాగే ఉంటాయి. కానీ అదేం చిత్రమో సినిమావాళ్ళు నాటకం వేస్తే మాత్రం జనం చూస్తారు. పైగా వాళ్ళకి రాత్రి పూట సమయం కేటాయిస్తారు. తానా, ఆటా వంటి సంస్థల్ని విమర్శించడం నా ధ్యేయం కాదు. వాళ్ళు నాటక రంగానికి చెందిన అనేకమంది కళాకారుల్ని రప్పించారు. కానీ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ చేత సీరియస్ గా నాటకం వేయించిన సందర్భాలు చాలా తక్కువున్నాయి. ఇక్కడా మంచి నటులూ, నాటకమంటే అభిమానమున్న వాళ్ళూ ఉన్నారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ! దాదాపు అన్ని సాంస్కృతిక సంఘాలూ గతంలో పేరికగన్న నాటకాలనే వేస్తారు లేదా కాస్త హాస్యం ఉంటే కొత్తవి వేస్తారు. ఉంటే పౌరాణిక నాటకాలు, లేదా హాస్య నాటికలు లేదా స్కిట్స్ తప్ప సీరియస్ విషయాల మీద నాటకాలు వేసినవి చాలా తక్కువ. అక్కడక్కడ ఒకటీ అరా వేసుండొచ్చు. ఇక్కడ దూరంగా ఉన్న మన సమస్యలపై సీరియస్ నాటకాలు అంతగా రాలేదని నా అభిప్రాయం. ఇంకో విషయం. ఈ సాంస్కృతిక సంఘాల కార్యక్రమాలలో నాటకానికి ఓ ఇరవై నిముషాల స్లాట్ ఇస్తారు. అందులోనే మహాభారతమైనా ,రామాయణమైనా సర్వాంగ సుందరంగా వేసేయాలి. కనీసం 45 నిమిషాలు లేకుండా నాటికలు వేయలేరన్న సంగతి ఎందుకు అర్థం కాదో నాకిప్పటికీ అర్థం కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ అనేక పద్య నాటకాలూ అవీ వేయడం జరుగుతోంది. దాని వల్ల మంచే జరుగుతోంది. ప్రవాసంలో ఉన్న తెలుగు వారు కూడా సొంతగడ్డ పై నాటకాన్ని బ్రతికించడానికి సహాయ పడాలి. అక్కడ మంచి ప్రదర్శనలు జరిగేలా ఆర్థిక సహాయం చేస్తే తప్పకుండా తెలుగు నాటక రంగం బాగు పడుతుందని నా ఆశ. ఆ నమ్మకం నిజమవుతుందో లేదో కాలమే సమాధానం చెబుతుంది.
ఉపసంహారం
ఈ వ్యాసం చదివాక నాటకం అంటే కాస్తయినా తెలుసుకో గలిగాము అన్న భావన ఒక్కరికి కలిగినా నేను రాసిన ఈ వ్యాసానికి ఫలితం దక్కినట్లే!
అంకితం
దాదాపు రెండేళ్ళ క్రితం నంది నాటకాలకి నేనొక పద్య నాటకం ( పంచమ ధర్మం ) రాసాను. ఆ నాటకం 2005 నంది నాటకోత్సవాల వడబోతలో ఎన్నికైన చివరి తొమ్మిది నాటకాలలో ఒకటి. ఆ నాటకం ద్వారా నాకు అనేక మంది తెలుగు నాటకరంగ కళాకారులు పరిచయం అయ్యారు. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం నాకు లభించింది. టాలెంటు ఉండి అవకాశాలు రాని ఎంతో మంది కళాకారుల్ని చూసాను. అలాగే ఆ పద్య నాటకం ధర్మమా అని నాకు ఎం.వి.రమణ మూర్తి గారితో పరిచయమయ్యింది. ఆయనే నే రాసిన పంచమ ధర్మం అనే నాటకానికి దర్శకత్వం వహించారు.
రచయితకీ, దర్శకుడికీ మధ్య అవగాహన ఉంటేనే నాటకం రక్తి కడుతుందని నమ్మే వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయనే నోరి నరశింహ శాస్త్రి గారి ‘వాఘీరా’’ అనే నాటకం కూడా దర్శకత్వం వహించారు. నాటకం వేసేటప్పుడు ఎంత సీరియస్ మనిషో, బయట అంతకంటే పదిరెట్లు సౌమ్యుడు. హాస్యానికి కూడా అబద్ధం చెప్పలేదని ఆయన మిత్రులందరూ ముక్త కంఠంతో అంటారు. ఆయన పరిచయంలో నేను చాలా నేర్చుకున్నాను. ఆ మహా మనిషి 2008 ఫిబ్రవరి 20న పరమ పదించారు.
బ్రతికినన్నాళ్ళూ నాటకం మధ్యనే బ్రతికి, జీవిత చరమాంకానికి హఠాత్తుగా తెర దించేసుకొని అందరికీ కనుమరుగైన ఆ మహా వ్యక్తికి నా ఈ వ్యాసం అంకితం.
ఉపయుక్త గ్రంథాలు
- సమగ్రాంధ్ర సాహిత్యం – ఆరుద్ర
- ఆంధ్ర నాటక రంగ చరిత్ర – మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
- భారత నాటక చరిత్ర – సాహిత్య అకాడమీ
- Indian Literature – Sahitya Acadamy
- Indian Modern Drama – Sahitya Acadamy
- ధర్మవరం రామకృష్ణా చార్యులు – పోనంగి శ్రీ రామ అప్పారావు
- అలనాటి నాటకాలు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ