ఫాంటసీ — రియాలిటీ

రెమి అనే ఎలక రకరకాల మురుక్కాలవలలో మునిగి, తేలి చివరకి పారిస్‌ వస్తుంది. లింగ్వినీ అనే వాడితో పరిచయం చేసుకుంటుంది. పారిస్‌లో పేరుపొందిన ఒక రెస్టారెంట్ వంశ పారంపర్యంగా లింగ్వినీ కి వస్తుంది. అయితే, లింగ్వినీకి వంట గురించి ఓ న మా లూ కూడా తెలియవు. రెమి మామూలు ఎలకల్లా ఏ చెత్త పడితే ఆచెత్త తినే ఎలక కాదు. నోటికి మంచి రుచి అంటే ఏమిటో తెలిసిన ఎలక రెమి. అంతే కాదు, మంచి భోజనం కావాలంటే మంచిగా వండటం రావాలని నమ్మిన ఎలక రెమి. చప్పుడు చెయ్యకండా మెల్లిగా రెమి లింగ్వినీపెట్టుకున్న తెల్ల టోపీ లో చేరి, లింగ్వినీ జుత్తు పట్టుకొని ఆడిస్తూ, రకరకాల పిండివంటకాలు అద్భుతంగా చేయిస్తుంది.

ఇలా ఉండగా పరమ కర్కోటకుడు, రెస్టా రెంట్ సమీక్షకుడు, యాంటాన్‌ ఈగో లింగ్వినీ రెస్టారెంట్ కి వస్తున్నాడని వార్త రాంగానే రెమికి కంగారు పెరుగుతుంది. ఈ విషమ సమస్య పరిష్కారం కోసం, రెమి తన బంధువులనీ, స్నేహితులనీ సహాయం చెయ్యమని అడుగుతుంది. ఈ గడ్డుసమస్య నుంచి తనని కాపాడమని అర్థిస్తుంది. అడిగిన తడవుగానే, జంతువులన్నీ హుటాహుటిన వస్తాయి. మరి వంటగదిలోకి అతి పరిశుభ్రంగా రావాలిగదా! అందులోనూ ప్రసిద్ధికెక్కిన ఫ్రెంచ్‌ రెస్టారెంటాయిరి! సమీక్ష చెయ్యడానికి వచ్చేవాడు యాంటాన్‌ ఈగో! అన్ని జంతువులూ డిష్‌వాషర్‌లో వేడివేడి నీళ్ళతో ‘స్నానం’ చేసి, వేడివేడిగా పొగలుకక్కే ఆవిరితో బయటకొచ్చి చకచక వాటివాటి స్థానాలకి క్లాక్‌వర్క్‌ లా సర్దుకుం టాయి. ఇదీ, క్లుప్తంగా, యానిమేషన్‌ సినిమా రాటటూయీ (Ratatouille) కథ. ఫ్రెంచ్‌ కిచెన్‌, ఫ్రెంచ్‌ వంటలు, వంట పరికరాలూ, అత్యద్భుతంగా అతిచాకచక్యంగా చిత్రించబడ్డ ఫాంటసీ. ఆభూతకల్పన! ఫాంటసీయే కానీ చూస్తున్నంతసేపూ, ప్రేక్షకులు పారిస్‌ రెస్టారెంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఎంత తెలివి గల ఎలకలైనా, ఎంత నాగరికమైన రుచులు తెలిసినా, ఫ్రెంచ్‌ షెఫ్‌లు కాలేవు కదా! అయితే ఒక గంటన్నరసేపు ఈ ఫాంటసీ ప్రేక్షకులని ఆకట్టేసుకుంటుంది! అసంభవం అని తెలిసికూడా ఆ కొద్దిసేపూ మనం ఆనందించగలం.

అయితే ఆభూతకల్పనలు తెలుగు వారికి కొత్తేమీ కాదు. నూటికి తొంభైతొమ్మిది తెలుగు సినిమాలు ఫాంటసీలేకదా! సినిమాలలో ఫాంటసీ పరవాలేదు. వినోదం కోసం అసందర్భమైన, అసంభవమైన, సన్నివేశాలు సృష్టించవచ్చు.

వచ్చినచిక్కల్లా ఏమిటంటే, కొన్ని ఫాంటసీలు మన రాజకీయనాయకులు తయారుచేసి, అతి సులువుగా, నైపుణ్యంగా సమయోచితంగా మనపై విడుదల చేస్తారు. కొందరు మధ్యతరగతి బుద్ధిమంతులు ఈ ఫాంటసీలు పట్టుకొని నినాదాలు చేస్తూ ఊరేగుతూ ఉంటారు. ఇది కేవలం రాజకీయనాయకుల స్వప్రయోజనాలకే అని తెలిసి కూడా అప్పుడప్పుడు సాధారణ జనం పప్పులో కాలేస్తారు! దీనివల్ల నష్టం అందరికీనూ. స్వలాభం రాజకీయ నాయకులకీనూ.

పంతొమ్మిదివందల యాభైల్లో ఆంధ్రాలో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు, వాళ్ళని ఎన్నుకుంటే, ప్రతి కుటుంబానికీ ఐదెకరాల పొలం, ఒక జత ఎడ్లు, ఒక ఆవో లేకపోతే గేదో ఇస్తామని ప్రచారం చేశారు. తమాషా ఏమిటంటే, సాధారణజనం ఆ మైకంలో పడ్డారు; ఆ పార్టీ చాలా స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వం వాళ్ళకి రాలేదనుకోండి. ఐదేళ్ళ తరువాత వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అది వేరే విషయం. కాస్త ఆలోచించి చూస్తే, వాళ్ళు ప్రజలకి చేసిన అసంగత వాగ్దానం, అసంభవమని ఏ మాత్రం జాగ్రఫీ వచ్చిన వాళ్ళకైనా తెలుస్తుంది. ఇది చాలా పాత కథ.

ఈ మధ్య కాలంలో, రాజకీయనాయకులు భాషా సాహిత్య సంస్కృతీరంగాలలో కూడా ఆభూతకల్పనలు అవలీలగా అమ్మేస్తున్నారు. అందులో ఒకటి తెలుగుభాషని అంతర్జాతీయ భాషగా చేసేవరకూ నిద్రపోము అనేది. రాష్ట్ర స్థాయిలో అధికార భాషగా, బోధనా భాషగా చెయ్యడానికి ఇదివరకు సుముఖులు కాని నాయకులుకూడా ఇప్పుడు ఈ కొత్త నినాదం పట్టుకొచ్చారు. భారీఎత్తున జరిగే సభల్లో ఈ నినాదాలు కరతాళధ్వనులు తేక మానవు. అయితే, ఇది కేవలం నినాదమే కాని, దీనిలో సరుకు లేదని ఎవరన్నా అంటే, వాళ్ళు వేళాకోళంచేసే ‘భాషా ద్రోహుల’ కింద జమకట్టడం జరుగుతున్నది. ఇది హాస్యాస్పదం. తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి (ఇది ఆర్థికంగా కొద్దిమందికి ఉపయోగపడుతుందని నాకు తెలుసు!) తేవడం గురించి ఇదివరలో చాలా చోట్ల చర్చలు జరిగిన విషయం మన అందరికీ తెలుసు.

తెలుగుని ఆంతర్జాతీయభాషగా గుర్తింపు చేయిస్తాం అన్నది పెద్ద అభూతకల్పన: ఫాంటసీ. అసాధ్యం. (కనీసం రాటటూయీ లాంటి ఫాంటసీ అన్నా కాదు; కొంతసేపు వినోదంగా పరిగణించి ఆనందించడానికి.)

ఇంతకీ ఏది అసందర్భంకాదో, ఏది సాధ్యమో, చూద్దాం.

తెలుగు సాహిత్య సంస్కృతీచరిత్రల అధ్యయనానికి, పరిశోధనకీ, తెలుగు భాషాబోధనకీ, అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు ఏం చెయ్యగలరు? ఎలా చెయ్యగలరు? (తెలుగు భాషాబోధన, సాహిత్యపరిశోధన ‘అమెరికాలో అసలు అవసరమా?‘ అని ప్రశ్నించే వారితో వాదన చెయ్యడం అనవసరం).

ఇక్కడి విశ్వవిద్యాలయాల ద్వారానే ఆ పని చేయించాలి. తెలుగు భాషాబోధన ఒక ఎత్తు; సాహిత్యం, సంస్కృతీచరిత్రల అధ్యయనం మరొక ఎత్తు. భాషాబోధన ఇప్పటికి ఆరు విశ్వవిద్యాలయాలలో జరుగుతూన్నది. కొన్ని చోట్ల జోరుగాను, మరికొన్నిచోట్ల కొంచెం వొడుదుడుకుతోనూ తెలుగు భాషా బోధన జరుగుతూన్నది. రెండు విశ్వవిద్యాలయాలలో (బర్కెలీ, డెట్రాయట్ లలో) స్థానికంగా ఉన్న తెలుగు వాళ్ళు ప్రయత్నించి ఆపని సాధించారు. అయితే, తెలుగు పరిశోధనా స్థాయిలో, ఒక్క విస్కాన్‌సిన్‌ విశ్వవిద్యాలయంలోనే ఉన్నది. గత సంవత్సరం, అట్లాంటా తెలుగు వాళ్ళు ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి పరిశోధనాస్థాయిలో ఒక పీఠం ఏర్పరుచు కోవాలని నిశ్చయించుకొని, ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు ఎమరీ సుముఖత చూపించింది. అయితే, తెలుగు కమ్యూనిటీ అధమపక్షం రెండు లక్షల డాలర్లు విరాళంగా తీసుకొవస్తే, ఎమరీలో తెలుగు సాహిత్యాచార్యపీఠం నెలకొల్పవచ్చు. ఈ ఆచార్యపీఠానికి నాందిగా 2008 వింటర్‌ సెమెస్టర్‌కి, ఎమరీలో దక్షిణ ఆసియా విభాగంవారు వెల్చేరు నారాయణ రావు గారిని విజిటింగ్‌ ప్రొఫెసర్‌ గా ఆహ్వానించారు. బహుశా త్వరలోనే బర్కెలీ లో కూడా ఇటువంటి ఆచార్యపీఠం రావచ్చు. అందుకు అక్కడి తెలుగు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు.

ఇందుకు స్థానిక సంస్థలే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న తానా, ఆటా వంటి పెద్ద సంస్థలు పూనుకోవాలి. ఇప్పుడు తానా ఈ విషయంపై ప్రయత్నించడానికి సుముఖత చూపిస్తున్నదని, ఆర్థికంగా మద్దతు ఇస్తుందని విన్నాను. ఇది శుభసూచకం.

దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు (‘మావూరు’ అనే పెరోకీయల్‌ నినాదం కాస్సేపు మరిచిపోయి!) సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక. ఇది అసాధ్యం కాదు; నా రాటటూయీ కాదు; ఆభూతకల్పన అసలే కాదు. ఇది సాధ్యం.