పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..

గుంటూరు శేషేంద్ర శర్మ కి నివాళి

గుంటూరు శేషేంద్ర శర్మ (వికీపీడియా సౌజన్యంతో)
(అక్టోబర్ 20, 1927- మే 31, 2007)

[ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి గ్రహీత శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ మే 31, 2007 న హైదరాబాదులో మరణించారు. ఆయన ‘ఆధునిక మహాభారతం’, ‘నా దేశం-నా ప్రజలూ, ‘రక్తరేఖ’, ‘షోడశి, ‘మబ్బుల్లో దర్బారు’ మొదలైన రచనలెన్నో చేసారు. పురపాలకశాఖలో కమీషనర్ గా ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్ అంతటా తిరిగి, ప్రజల సాధకబాధకాలను ప్రత్యక్షంగా చూసి, ప్రభావితమై ఎన్నో రచనలు చేసారు. శేషేంద్ర శర్మ కవితలు మాత్రమే కాక, కథలు, విమర్శలు, సైన్స్ వ్యాసాలు కూడా రాసారు. ముత్యాల ముగ్గు సినిమాలో ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది..’ అన్నది ఆయన సినిమా కోసం రాసిన ఒకేఒక పాట. శేషేంద్ర శర్మ రచనలను ఆయన భార్య ఇందిరాదేవి ఇంగ్లీషులోకి అనువదించారు. శేషేంద్ర శర్మ గారికి నివాళిగా ఆయన రాసిన చివరి కవితను, ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూని ప్రచురిస్తున్నాము. — సంపాదకులు]

పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..

నవ్వుల జల్లులు కురిశాయి నా మీద
పుష్పవాణి పలికింది
బిడ్డా! పువ్వుల్ని తెలియని వారే అందరూ లోకంలో
పూరేకుల రంగులు చూసి పరవశులౌతారా
మూర్చపోతారు పరాగ పరీమళాలకు వశీకృతులై
దేవుడ్ని పూజిస్తారు వాటి గొంతులు కోసి
దండలల్లి ధరించుకుంటారు వాటి గొంతులు కోసి
అజ్ఞానులు – సమగ్ర పుష్పజ్ఞానం కావాలంటే
దర్శన శక్తి కావాలి మానవ నేత్రాలకు
అది సిద్ధిస్తుంది చిత్తాన్ని ఏకాగ్రం చేసి
తపస్సు చేసినప్పుడే –
అట్టి నేత్రాలు పుష్పాన్ని చూస్తే పుష్పపు
లోతుల్లోకి పోతాయి చూపులు
ఆశ్చర్య జనకములు ఆ లోతులు!
పుష్పం ఫలాన్ని కంటుంది
ఫలం గర్భంలో బీజం ఉంటుంది.
బీజంలో వృక్షం ఉంటుంది – ఇలా
ఇదొక అవిచ్చిన్న సృష్టి వలయం
పుష్పం లేకపోతే సృష్టి లేదు –
పుష్పాలన్నీ తల్లులే’
సృష్టిలో అన్ని ప్రాణుల్లో నూటికి యాభై
పుష్పవతులౌతాయి
ఆ ప్రాణుల్లో మనుష్య జాతి ఒకటి –
పుష్పవతులైన మానవీయ జాతి వారందరూ
మాతృదేవతలే
భార్య కూడా భర్తకు మాతృదేవతయే ఇది
కీలక రహస్యం – ఇది కీలక సత్యం
ఈ సత్యాన్ని ఉల్లంఘించిన వాడు
పాప పుణ్యాలనేవి ఉంటే
పాపగ్రస్తుడే అవుతాడు
జాగ్రత్త!

గుంటూరు శేషేంద్ర శర్మ

రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ గురించి: తెలుగు సాహిత్యంలో విలక్షణ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. పలు భారతీయ భాషల్లోకి ఆయన కవితలు అనువదించ బడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేషజ్యోత్స్న, ఋతుఘోష, నీరై పారిపోయింది, ప్రేమలేఖలు, నేను -నా నెమలి, నా రాష్ట్రం, మొదలుకొని యాభై గ్రంధాలు రాశారు. ఆయన ఎంత సనాతనుడో అంత నూతనుడు, ఎంత ప్రాచీనుడో అంత అధునాతనుడు. ...