నిసీ షామల్ తన ఆఫీసు గదిలో కూర్చుని బల్ల మీద ఇంత ఎత్తున పెట్టి ఉన్న కాన్సర్ పేషెంట్ల ఛార్టులు ఒక్కక్కటే తీసి చూస్తూ ఒక క్లినికల్ ట్రయల్ కి సంబంధించిన కాగితాల్లో ఒక్కొక్కరి రేడియేషన్ ట్రీట్మెంట్ వివరాలు ఎక్కిస్తున్నది.
ఆమె ఆఫీసు గది తలుపు తీసి ఉంది. బైటినుంచి ఆమె సెక్రెటరీ డాన్ గర్బర్ ఫోన్లో మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి.
“మిస్టర్ జాన్సన్ ! మీరు మంచి డాక్టర్ ను ఎంచుకున్నారు. మీ భార్యను డాక్టర్ షామల్, చాలా జాగ్రత్తగా చూస్తుంది.”
కొంత విరామం . మళ్ళీ డాన్ మాటలు.
” డాక్టర్ షామల్ న్యూయార్క్ మౌంట్ సైనాయ్ హాస్పిటల్లో రెసిడెన్సీ చేసింది. మెమోరియల్ స్లోయన్ కెట్టరింగ్ హాస్పిటల్లో ఫెలోషిప్ చేసింది. ఆ తర్వాత ఆల్బర్ట్ అయిన్స్టైన్ హాస్పిటల్లో అటెండింగ్ గా … ” ఇలా నిసీకి అప్పటి వరకూ ఉన్న అనుభవం దండకం చదువుతున్నదామె. కొంతమంది రోగులు, వారి బంధువులు తమ డాక్టర్ ని ఎంచుకునే ముందు చాలా శ్రద్ధగా అన్ని వివరాలూ కనుక్కుంటారు.
లోపల్నుండి వింటున్న నిసీకి అది అలవాటే ఐనా, ఆ రోజు కొంచెం నవ్వు వచ్చింది. అప్పుడప్పుడు నేను ఇన్ని మంచి యూనివర్సిటీలలో చదివినట్లు, పేరున్న హాస్పిటల్సు లో పని చేసినట్ట్లు కొద్దిగా మా ఇంట్లో వాళ్ళకు కూడా డాన్ చెపితే ఎంత బాగుండును. మా అమ్మా నాన్నలకు చదువుకో, చదువుకో అన్నప్పుడు ఉన్న ఆరాటం ఆ చదువుకు సార్ధకత వచ్చి, అది వేరే వాళ్ళకు ఉపయోగ పడుతున్నప్పుడు ఆనందంగా మారలేదు ఎందుకో, అనుకుంది.
” అందరూ తరచూ ఇండియా వచ్చి వెడుతుంటారు. నువ్వు ఎప్పుడో గాని రావు. ” అప్పుడప్పుడూ ఫోన్లో ఆమె ఆమ్మా నాన్నల దగ్గర్నుండి ఇదే ఆమె వినేది.
పేషెంట్ల కంప్లైంట్లు
పేరెంట్ల కంప్లైంట్లు
ఇవే నా బోటి డాక్టర్ల
అచ్చట్లు ముచ్చట్లు
అనుకుందామె నవ్వుకుంటూ.
సెక్రెటరీ డాన్ మళ్ళీ ఇంకో లైన్లోకి వెళ్ళినట్లుంది. ఈ సారి ఆమె గొంతు పూర్తిగా మారింది. కఠినంగా మాట్లాడుతున్నది. ఆమె ఎవరినో నిసీ షామల్ తో కలవకుండా ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నట్లుంది.
” మీకు తెలియదు. ఇంక కొంచెంసేపట్లో నిసీ ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్ ని చూడాలి. ఆమె మిన్నిసోటా నుండి వస్తున్నది. ”
అవతలి వ్యక్తి ఏమి చెప్పారో కాని డాన్ చాలా విసుక్కుంటున్నది. ఏమైనా సరే వీలు కాదు అని చెపుతూంది.
నిసీకి అర్ధం కాలేదు. ఎందుకు ఆమె, తనను కలవకుండా ఎవరినో ఆటంకపరుస్తున్నదీ. తను పేషెంటును చూడటానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది. ఒక సీనియర్ రెసిడెంట్ ముందు ఆ పేషెంట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతను వచ్చి రోగి కధా కమామీషూ చెప్పాక అప్పుడు తను ఆ రోగిని చూసేది.
నిసీ బైటికి వచ్చి డాన్ గర్బర్ బల్ల ముందు ప్రశ్నార్ధకం ముఖం పెట్టి నుంచుంది.
ఫోన్ హోల్డ్ లో పెట్టి ఆమె ” పాల్ నిన్ను ఇప్పుడే కలవాలంటున్నాడు. ” అంది. డాక్టర్. పాల్ బ్రాఫ్, ఆ రేడియేషన్ ఆంకాలజీ విభాగపు కొత్త ఛెయిర్మన్.
” నిసీ! నీకిప్పుడంత టైం లేదు పాల్ ని కలిసేందుకు. మధ్యాహ్నం కూడా వీలవదు. నీకు చాలా మీటింగులు ఉన్నాయి. ”
” డాన్! పాల్ ని చూస్తానికి వస్తానని చెప్పు” లాబ్ కోట్ తొడుక్కుంటూ బైటికి వచ్చి మళ్ళీ ” పాల్ ఆఫీసుకు నేనే వస్తున్నానని చెప్పు ” అంది. వెళ్తుంటే వెనక నుండి ” ఓ! నిసీ! ” అని పెద్దగా డాన్ పిలుపు .
ఏమిటీ ? అంటూ వెనక్కి తిరిగి చూస్తే డాన్, పెన్ చేతిలో తిప్పుతూ, ” ఇవ్వాళ చాలా బాగున్నావు. నీ డ్రెస్ నా కెంతో నచ్చింది. చెప్పటం మర్చేపోయా ” అంది.
నిసీ నవ్వుకుంటూ పాల్ ఆఫీసు కేసి నడిచింది.
నిసీకి తెలుసు. పాల్ తనని ఎందుకు చూడాలనుకుంటున్నాడో. తన సెక్రెటరీ డాన్ కి కూడా ఆ సంగతి తెలుసనీ తెలుసు. అందుకే ఆమె ఈ మీటింగ్ వెనక్కి నెడుతూ ఉంది. సెక్రెటరీలకు డిపార్ట్ మెంట్ లోని రాజకీయం అందరికన్నా ముందుగా తెలుస్తుంది. పాల్ ఖచ్చితంగా ‘ ఫేకల్టీ రూల్ బుక్ ‘ ప్రకారం నడుస్తున్నాడు. ఆ రోజు బహుశా నిసీ ఉద్యోగానికి త్వరలో ఉద్వాసన అని ఆమెకు చెప్పే రోజు.
పాల్ బ్రాఫ్ ముందు ఎం.ఐ. టి. లో ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత జాన్స్ హాప్కిన్స్ వైద్యకళాశాల. మాస్ జెనరల్ హాస్పిటల్లో రేడియేషన్ ఆంకాలజీ శిక్షణ. . వెంటనే ఎన్.ఐ.ఎచ్ లో అతనిని చీఫ్ చేశారు. అక్కడ అతనికి సరిపడా గ్రాంటులు రాలేదని వదంతి. అతనికి రోగులలో, వాళ్ళ రోగ నిదానం లో ఆసక్తి, నిపుణత తక్కువ. అతని రీసర్చ్ కి సరిపడా పేషెంట్లైనా, అక్కడ అతనికి రాలేదట.
ఈ యూనివర్సిటీ లో ఛెయిర్మన్ ఆకస్మికంగా మరణించాడు. కొత్త ఛెయిర్మన్ కోసం వెతికి వెతికి, విసిగిపోయి -పాల్ ఎత్తైన ముక్కూ , జులై ఫోర్తున ఫైర్ వర్క్స్ లాగా వెలిగే అతని రెస్యూమేని చూసి ముచ్చటపడి, అతని గురించి మరీ ఎక్కువగా వాకబు చెయ్యకుండా ఛెయిర్మన్ ఉద్యోగం ఇచ్చేశారు. అతడు డీన్, హాస్పిటల్ ప్రెసిడెంట్ లకు ఈ హాస్పిటల్ లో కాన్సర్ సెంటర్ని దేశంలో మొదటి స్థానంలో పెడతానని ప్రామిస్ లు చేసి ఇక్కడకు వచ్చి చేరాడు.
యూనివర్సిటీ వాళ్ళకు అలాంటి గొప్ప ఆశలు ఉండటం న్యాయమే. అంతకు ముందున్న ఛెయిర్మన్ చాలా ఏళ్ళుగా ఆ విభాగాన్ని ఎంతో పేరు ప్రఖ్యాతులున్న చోటుగా నడిపాడు. ఎన్నో గ్రాంటులు సంపాదించి, కొత్త కొత్త పరిశోధనలకు పునాది వేశాడాయన. ఆయన శిష్యరికంలో ఎంతమందో డాక్టర్లు తయారై, దేశం నలుమూలల ఉన్న కాన్సర్ హాస్పిటల్స్ లో పని చేస్తున్నారు.
ఈ కొత్త డాక్టరు -లీడరు లక్షణాలు, చాకు లాటి బుర్ర, ఉప్పొంగే ఉత్సాహం- చూడ్డానికి , ఆ పాత ఛైర్మన్ లాగానే ఉన్నాడు. డాక్టర్ పాల్ బ్రాఫ్, మళ్ళీ ఈ కాన్సర్ సెంటర్ కి పాత వైభవం తెస్తాడనుకోటంలో ఎవరిలోనూ ఎలాటి తప్పూ లేదు.
నిసీ షామల్, పాల్ బ్రాఫ్ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు, అతను తన కంప్యూటర్ బల్లవద్ద కూర్చుని ఏవో కాగితాలు సర్దుకుంటున్నాడు.
హాయ్! పాల్! అని చెప్పి నిసీ ఆ గదిలోనే పక్కగా ఉన్న గుండ్రటి బల్ల వద్ద కూర్చుంది. సాధారణంగా అతను అక్కడకు వచ్చి కూర్చుని తనను కలవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు.
నిసీ గుండె దడ లాడుతూంది. చేతుల్లో చెమటలు. గొంతు మూసుకు పోయినట్ట్లు , గుటక పడనట్లుగా, కొంచెం ఊపిరాడనట్లుగా ఉంది. అశాంతిగా ఉంది లోపల. అలాటప్పుడు ఆమె మాట్లాడితే స్వరం అసలు వస్తుందో రాదో! కీచుమంటూ వస్తుందో అని అనుమానంగా ఉంటుంది.
పాల్ కొంచెం సేపు తను లివర్ మెటాస్టసెస్ మీద రాస్తున్న పేపర్, లివర్ కి ఓ ఆరో, ఎనిమిదో పక్కల్నుండి ఎక్స రేస్ పంపి లివర్లో ట్యూమర్లను సగం ఎలా చెయ్యవచ్చో చెప్పాడు. బ్రహ్మాండం. బ్రహ్మాండం . లివర్ కి మాత్రం ఏమీ దెబ్బ తగలదు. ట్యూమర్లు ఫటాఫట్ పేలిపోయి కరిగిపోతాయి.
నిసీ లోలోపల అనుకుంది. ఏమి చెపుతావయ్యా బాబూ. నాకు తెలుసు ఆ పేషెంట్లకు ఏమి జరిగేదీ . ఈ డిపార్ట్ మెంట్ నుండి వెళ్ళే పెద్ద పెద్ద బిల్లులు కట్టేవరకూ కూడా ఉండరు కదా వాళ్ళు పాపం.
కొంచెంసేపు వాళ్ళిద్దరి మధ్యా పెద్ద ఎత్తున సైంటిఫిక్ డిస్కషన్ నడిచింది. అది అప్పుడు చాలా అవసరం. ఆ గొప్ప విషయాలలో, ఆ అధ్భుతమైన పరిశోధనల చర్చలలో, నిసీ సొంత విషయం ఆమె ఉద్యోగం, చాలా చిన్న విషయం లాగా ఆమెకే అనిపించాలి మరి.
అప్పుడు గబుక్కున నిసీ ఉద్యోగం ప్రసక్తి తెచ్చాడతను.
“నీతో ఈ విషయం నేనే స్వయంగా చెప్పటానికి పిలిచాను. సారీ! ఈ జూన్ తో నిన్ను పంపెయ్యవలసి వస్తుంది. నాకు బ్రెస్ట్కాన్సర్, గైనకలాజికల్ కాన్సర్, రెండూ మానేజ్ చేసే ఒక డాక్టర్ ను తీసుకో బోతున్నా. హాస్పిటల్ ప్రత్యేకంగా ‘ ఆడవాళ్ళ జబ్బులు’ కి ఒక విభాగం కట్టబోతున్నది. ఇంకా చుట్టు పక్కల కొన్ని చిన్న హాస్పిటల్స్ ని కూడా తన అధీనం లోకి తీసుకుంటున్నది. అబ్బో! చాలా పెద్ద ప్రణాళిక ఉంది. ఈ సెంటర్ చాలా పెద్దది అవుతుంది త్వరలో. ”
నిసీ వింటూ ఉంది. అసలు పాల్ చాలావరకూ ఆమెను పేరు పెట్టి పిలవడు. ఎప్పుడూ ఆయన మబ్బుల్లోనూ, ఆమె ఎక్కడో భూమ్మీదో, ఇంక కిందో ఉన్నట్లుగా నాటకం. అలా అని ఎవరి పేర్లూ గుర్తుండవా పాపం అంటే , తనకన్న పై హోదాలో ఉన్న వారి పేర్లు ఎంతో బాగా జ్ఞాపకం. అసలు ఇక్కడ కాక బైటెక్కడైనా చూస్తే తనను గుర్తు పడతాడా అని ఆమెకు సందేహం.
ఈ డాక్టరు వచ్చి ఇంకా రెండేళ్ళు తిరగలేదు. అప్పుడే కాన్సర్ వ్యాధిలో ఘన విజయాలు సాధించినట్లు మాట్లాడతాడు. తను కాన్సర్ ఫీల్డ్ లో అప్పటికి ఎన్నో సంవత్సరాలుగా పనిచేసింది. చేసింది. లింఫోమా, బ్రెస్ట్ కాన్సర్ వ్యాధులలో ప్రత్యేకంగా అనుభవం గడించుకుని, ఎంతమంది జబ్బులో నయం చేసి డాక్టర్లలోనూ, పేషెంట్ల మధ్యా మంచి పేరు తెచ్చుకుంది. ఐనా ఆమెను ఉద్యోగంలోనుండి సాగనంపడానికి పాల్ బ్రాఫ్ కి ఇంత కూడా జంకు లేదు.
ఛెయిర్మన్ షిప్ అంటే ఇదే కాబోలు ! మన మీద, మన ఆశయాల మీద గొప్ప విశ్వాసం. వేరే వారి ఆశయాల మీద, జీవితం మీద అలక్ష్యం. కొందరి జీవితాలను కిందా పైనా చెయ్యక పోతే అధికారానికి అర్ధమేమిటి? వినోదం ఎలా వస్తుంది?
నిసీ బైటికిలా అంది. ” గైనకలాజికల్ కాన్సర్ లో కూడా నాకు తక్కువ అనుభవం లేదే! వేరేవాళ్ళతో చూస్తే బ్రెస్ట్ కాన్సర్ లో నాకున్నంత పరిచయం ఎవరికీ లేదు . ఇక్కడ పనిచే్సే , సర్జన్లు, గైనకాలజిస్టులు, ఫేమిలీ డాక్టర్లు -అందరికీ నేను తెలుసు. నువ్వింకో క్లినకల్ డిరెక్టర్ని చూసుకునే పనేముంది. (నవ్వుతూ) – ఊళ్ళో నాకు చెడ్డ పేరు లేదోయ్! ”
పాల్ ” అవునవును. నీ పలుకుబడి నాకు తెలుసు. నీకున్న పేరు. నువ్వు తీసుకొచ్చే పేషెంట్లను పోగొట్టుకోటం నాకూ ఇష్టం లేదు. అందుకే కావాలంటే నువ్విక్కడే ఉండిపో. కాంట్రాక్ట్ ఏమీ ఉండదు. నెల నెలా జీతం ఇస్తాను. నీకెప్పుడు కావాలన్నా మానెయ్యొచ్చు. నీకూ కావాల్సినంత స్వేచ్ఛ. ”
నిసీకి అసహ్యం కలిగింది అతని మాటలకు.
ఏం తెలివి! నేనుంటే వేరే వాళ్ళొచ్చేవరకూ అతడికి పనీ జరుగుతుంది. ఈ లోపల ఏ డాక్టరునైనా తీసివేసినా, వాళ్ళు వెళ్ళిపోదామనుకున్నా తన కున్న అనుభవంతో ఏ శాఖలోనైనా తనతో పని చేయించుకోవచ్చు. తనను ఉదాహరణగా తీసుకుని, వాళ్ళ ఉద్యోగాలకేం ముప్పు వస్తుందో అని పాల్ అంటే ఇతర డాక్టర్లకు భయమూ పెరుగుతుంది. ఓహో! జీనియస్!
అన్ని లాభాలూ నీకే!
పైకి ప్రశాంతంగా ఇలా అంది. ” కాంట్రాక్ట్ లేకుండా పని చెయ్యమంటావా పాల్? అలా ఐతే హెల్త్ బెనిఫిట్ , పెన్షన్ ప్లాను, ఏమీ ఉండవని తెలిసీ నీ కన్నా సీనియర్ డాక్టర్ని అలా పని చెయ్యమని అడుగుతున్నావా? ”
” అదేముంది నిసీ! నువ్వు అంతకు ముందు ప్రైవేట్ ప్రాక్టిస్ లో బాగా సంపాదించుకునే ఉంటావు. నువ్వు కొనుక్కోగలవు అవి, నేనిచ్చినా ఇవ్వక పోయినా. ”
నిసీ లోపల -ఎంత ఆశ్చర్యం ? ఎంత చిన్న విషయం కింద మార్చేశాడు! తెలివైన శుంఠ ! నా మొగుడి అనారోగ్యం గురించి తెలుసు. నా ఆదాయం, హెల్త్ ఇన్స్యూరెన్స్ , నాకూ నా ఫేమిలీకి అవసరం అని తెలిసీ, జెలసీ ?- అనుకుంది.
ఆమెకు కొన్ని నెలలముందే వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణ బాగా గుర్తుంది. అప్పుడే అనుకుంది ఆమె త్వరలో తన ఉద్యోగానికి మూడిందని . గొప్ప సలహా ఇచ్చాడతను. నువ్వు ఇంటి దగ్గర ఉండి నీ భర్తను జాగ్రత్త తీసుకో. ఇంత ఒత్తిడి తో నువ్వు పనిచెయ్యక పోతేనేం? అని.
కరుణా సముద్రుడు ! కాని ఎవరు కడతారు, ఇంటికయ్యే ఖర్చులు, హాస్పిటల్ బిల్లులు?
హాస్పిటల్ కు వచ్చే పేషెంట్ల భర్తలు ఎవరైనాగాని వారి ఉద్యోగాలు మానేసి, ఇంటి దగ్గర ఉండి వారి భార్యల సేవ చేస్తున్నారా? మగవాళ్ళ ఉద్యోగం పోదేం?
కొత్త డాక్టరు. అతనికి సమస్త అధికారం చేతిలో పెట్టారు. డిపార్ట్ మెంట్లో ఆటలాడుకోవచ్చు. అతనికి తనతో సరదాగా ఉండేవాళ్ళని, అంతకు ముందు స్నేహితులను, పోగేసుకోవాలని ఉంది. తన ఎక్స్పెరిమెంటల్ వైద్యాలను మెచ్చుకుని, ఆహా, ఓహో అనే వాళ్ళను కొంతమందిని చుట్టూ జేర్చాలి. పేషెంట్ల తరుఫు మాట్లాడే వాళ్ళు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎంతమంది రోగులు వచ్చారు? అందులో ఎంతమందికి రోగాలు నయమైనయ్? మనం చేసే వైద్యం ఎంత బాగుంది? ఇలా తన లా చెత్త ప్రశ్నలు వేశేవాళ్ళు ఎందుకు? ముందు తన పొజిషన్ బలపరుచుకోవాలి మరి. కరెక్ట్ స్ట్రాటజీ.
నవ్వుకుంది నిసీ. ఈ డాక్టరుకు తనన్నా లెక్కలేదు. పేషేంట్లన్నా లెక్క లేదు. ఈ ఉద్యోగాలకు నిలకడ లేదు. ప్రస్తుతం తన పరిస్ఠితిలో తనకు ఇతనితో తగువు పెట్టుకొనే ఓపిక లేదు.
“అలాగే పాల్! నువ్వు చెయ్యాల్సిందేదో చెయ్యి. నీ భుజాల మీద పెద్ద బాధ్యతలున్నాయి. నా ప్రస్తుత బాధ్యత, పేషెంట్ల వైద్యం మాత్రమే. అదేమంత పెద్ద విషయం ఈ రోజుల్లో! ఉద్యోగం లేకపోతే ఆ బరువూ లేదు. ”
పాల్ హాయిగా నవ్వుతూ “నువ్వు కావాలనుకుంటే ఉద్యోగం ఎక్కడైనా నిమిషంలో వస్తుంది. నువ్వు కట్టిన కాన్సర్ సెంటర్ షేర్లు అనవసరంగా అమ్మేసుకున్నావు . అవే ఉంటే నీకు అసలు ఈ యూనివర్సిటీలో పని ఎందుకు? నీకు డబ్బు ఆదుర్దాలు ఎప్పుడూ లేవని విన్నాను. నేనూ, మన కాలీగ్స్ అంతా నీకు మంచి రెకమెండేషన్లు ఇస్తాం. ” అన్నాడు.
ఇక్కడ ఉద్యోగం ఊడబీకి, వేరే చోటికి మంచి రెకమెండేషన్ ఇస్తాడట. ప్రపంచంలో అందరికీ కావాల్సిన డబ్బు నాకెందుకు అక్కర్లేదో మరి! అనుకుంది నిసీ.
“సరే పాల్. నీ సిఫార్సు కావాల్సినప్పుడు అడక్క తప్పుతుందా. సరిగ్గా యూనివర్సిటీ నియమాల ప్రకారం నాకు నోటిసు ఇచ్చావు. థేంక్యూ.” అంది.
వెళ్ళటానికి లేచిందామె.
” నేను ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతాను. నిజమే. నీకు ఫార్మల్ గా మెయిల్లో ఉత్తరం పంపిస్తాను. ” అన్నాడు పాల్.
ఫేకల్టీ రూల్ బుక్స్ లో ఎంత నోటిసుతో స్టాఫ్ ని తీసెయ్యాలో రాసారు కాని, మంచి అనుభవం ఉన్నవాళ్ళని తీసెయ్యటం హాస్పిటల్ కు మంచిదికాదని ఇంకా రాసుకోలేదు.
నిసీ దగ్గర్లోనే ఉన్న మెయిల్ బాక్సుల నుండి తన మెయిల్ తీసుకుని, మళ్ళీ వెనక్కు తన ఆఫీసుకి వెళ్ళినప్పుడు డాన్ చాలా ఆదుర్దాతో ఆమె ముఖంలోకి చూసింది. ఆమెకు పాల్ సెక్రె టరీ ఆ పాటికే, నిసీ జూన్ లో వెళ్ళిపోతుందని వార్త అంద చేసి ఉండొచ్చు. ఉత్తరాలు అవీ టైపు చేసే పని ఎలాగా వాళ్ళదేనయ్యె.
నిసీ, పాల్ ను కలవటానికి ముందెట్లా ఉందో వచ్చాక అట్లాగే ఉంది . డాన్ కి మాత్రం కంగారుగా ఉంది. రెండు మూడు సార్లు ఉత్తుత్తి పనులు కల్పించుకుని ఆఫీసు లోకి బైటికి తిరిగింది. నిసీ ఏడిస్తే ఓదార్చవచ్చు. పాల్ ని తిడితే పోనీ తనూ రెండు తిట్టవచ్చు. ఏమీ మాట్లాడకపోతే ఏమి చెయ్యటం? డాన్ కి ఈ ఇండియన్ డాక్టరు మీద ఎందుకో ఆరాధనా భావం. డాక్టర్. షామల్ కు ఒక నీడ లాగా తిరుగుతూ, ఆమెకి కావలసిన వన్నీ అమర్చి పెడుతూ, పనిలో సహాయం చెయ్యటం ఆ కుర్ర పిల్లకు చాలా ఇష్టం.
నిసీ లోపల్లోపలే ఆలోచించుకుంటున్నది. ఆమె నాన్న మంచి కార్డ్ ప్లేయర్. కాంట్రాక్ట్ బ్రిడ్జ్ ఛాంపియన్. ఆమెకు పోకర్ ఫేస్ అన్నా చేత కావద్దా. ఈ మధ్య ఆమెకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. దాంతో తండ్రేమిటి! తాతలు కూడా తరచూ గుర్తొస్తున్నారు.
మనిషి కష్టాల్లోంచి బంతి లాగా పైకి లేవాలి. బంతి చూడు ఎంత గట్టిగా కిందకు కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది. ఏ కష్టాన్నీ మనల్ని కిందే ఉంచనివ్వకూడదు. – అని చెప్పే వాడామె నాన్నారు.
అదే అని ఏమిటి. కూతురికి శిబి, దధీచి కధలూ చెప్పాడు. సీతా సావిత్రుల కధలూ చెప్పాడాయన. దయలు, దానాలు, భూదేవిలా ఓర్పులూ, కష్టంలో ఉన్న ఏ మనిషికైనా -అపకారికైనా సరే- సాయం చెయ్యాలనే ధర్మ సూత్రాలూ, అబ్బో! ఒకటేమిటి! డ్రింకు ఎక్కువైన కొద్దీ కూతురికి బోధించే నీతులు ఎక్కువయ్యే యాయనకు.
బైట ఫోన్ మోతకు, నిసీ ఉలిక్కిపడి తన ఆలోచనలను త్రుంచి వేసింది. లేచి , సెక్రెటరీ బల్ల ముందుకు వెళ్ళి నిల్చుని, “ఒ.కె . డాన్ ! మిన్నిసోటా నుండి నిన్నూ నన్నూచూస్తానికి ఒకామె అంత ఓర్పుతో, అంత ఆశతో వస్తే మనం ఇక్కడేం చేస్తున్నట్టు ? పద. మనం ఆమెకు సహాయం చేద్దాం. పద మిస్ .” అంది.
డాన్ హుషారుగా లెచి నుంచుని ” మరి! నువ్వుకాక పోతే ఎవరు చేస్తారు ! డాక్టర్ షామల్! ” అంది.
ఇద్దరూ కావాల్సిన పేపర్లు సర్దుకుని క్లినిక్ కు వెళ్ళిపోయారు.
*
ప్రెసిడెంట్ మార్గరెట్ బ్లూమ్ ఎంతో పొడుగ్గా, హుందాగా, గంభీరంగా ఉంది. చక్కటి మెరిసే తెల్లని జుట్టు. తెలివి వెల్లి విరుస్తున్న ముఖం. ఆమె ముందు నిసీ చిన్న పిల్లలా ఉంది.
అంత ఇబ్బందిలోనూ ఆమె తన డాక్టరుకు కానుక తేవటం మరిచి పోలేదు.
“మీకు ఏమి ఇష్టం అని వాకబు చేస్తే, పుస్తకాలంటే మీకు అధికప్రీతి అని తెలిసింది.” అంది. తన చేతిలోని పుస్తకం నిసీకి అందించింది. ” ఈ రచయిత మా ఊరికి పేరుతెచ్చిన ముద్దుబిడ్డ. పులిట్జర్ ప్రైజు వచ్చింది. మీకు నచ్చుతుందీ పుస్తకం అనుకుంటున్నా. ”
“ఓ! నెను చదవాలనుకుంటున్న పుస్తకం. మీకెలా తెలిసింది?” స్నేహంగా నవ్వింది నిసీ. వాళ్ళిద్దరి మధ్యా మాటలు సులువుగా జరిగేందుకు, కాసేపు మార్గరెట్ ఉద్యోగం గురించిన విశేషాలడిగింది. వాళ్ళ యూనివర్సిటీ లో బోధించే కోర్సులేమిటో? ఆమెకు విద్యార్ధులకు పాఠాలు చెప్పే బాధ్యతలున్నాయా? లేక అంతా అజమాయిషీ యేనా? ఇలా అడుగుతూనే ఆమెను పరీక్ష చెయ్యటం సాగించింది.
” డాక్టర్ షామల్! మిమ్మల్ని గురించి నేను గొప్పగా విన్నాను. ఇక్కడ పై చదువులు చదువుకొని, ఈ దేశం మీది కాదు అని తలచకుండా, మీ వాళ్ళను వదిలిపెట్టి మాకు మంచి వైద్యం చేస్తున్నారు. మా అదృష్టం.” మార్గరెట్ బ్లూమ్ అన్నది.
నిసీకి సంతోషం కలిగింది. అంతలోనే తన ఉద్యోగం సంగతి గుర్తొచ్చి విషాదం. తనకు ఉద్యోగం తీసివేసినట్ట్లు తెలిస్తే ఈ రోగికి మరునిమిషంలో తన మీది గౌరవం నిలుస్తుందా? అసలు ఇప్పుడు ఈమెకు ముందుగా, కొన్ని నెలలలో తను ఇక్కడ పని చెయ్యదని చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉన్నదా? తన కర్తవ్యం ఏమిటీ?
ఈమెకు ఏమి వైద్యం అవసరమవుతుందో ఇదంతా ఎన్ని నెలలు పడుతుందో ముందు నిర్ధారించాక, అవన్నీ – అనుకుని పరీక్ష సాగించింది. కాని లోలోపల ఏదో తప్పు చేసినట్లు, ఆమెను మోసగించి పరీక్ష చేసినట్లుగా నిసీకి అనిపించింది.
తనను గురించిన ఆలోచనలు వెనక్కి నెట్టేసి, రోగి వ్యాధిని గురించి పరీక్ష వివరాలన్నీ, తర్వాత వైద్యంలో తను తీసుకోవలసిన జాగ్రత్తలు నోట్ చెసుకుంది. మార్గరెట్ కు రేడియేషన్ ఇస్తే రొమ్ము కాని, కుడి చెయ్యి కాని వాస్తుందా? వాపువలన గాని నొప్పి వల్ల గాని, ఆమె రోజూ పనులకు ఆటంకం వస్తుందా? అలా రాకుండా తను వైద్యం ప్లాన్ చెయ్యాలి అనుకుంది. పరీక్ష పూర్తి చేసి, రోగితో తన అభిప్రాయం, చెయ్యవలసిన వైద్యమూ గురించి మాట్లాడింది.
మార్గరెట్ బ్లూమ్ తన వైద్యం గురించిన వివరాలు విని, శ్రద్ధగా నోట్స్ రాసుకుంది. తన కేలెండర్లో కొన్ని తెదీలు గుర్తు పెట్టుకుంది. ఆమె చాలా స్థిమితంగా ఉంది. ఒక్క సారి మాత్రమే, నిసీ “మీకు ఏం భయం లేదు, మీకు క్యూర్ ఛాన్స్ ఎక్కువ” అని చెప్పినప్పుడు మాత్రం ఒక నిట్టూర్పు విడిచింది. కళ్ళలో నీటి పొర కనిపించింది.
“మార్గరెట్ ! మీరు మీ స్టూడెంట్ల పని చూసుకోండి . మేం మీకు వైద్యం, మీ పనికి ఇబ్బంది రాకుండా అమరుస్తాం. నా సెక్రెటరీ చిన్నదే ఐనా, చాలా ఎఫిషిఎంట్ . ఆమె మీరు ఈ ఊరికి వైద్యానికి వచ్చినప్పుడు వసతి ఏర్పాట్లు కూడా చక్కగా చేస్తుంది. డాన్ తో ఎప్పుడు కావాల్సినా మాట్లాడండి. నాతో వెంటనే సంప్రదిస్తుంది. ఆ అమ్మాయిని మీకు కావాల్సిన టెలిఫోన్ నంబర్లన్నీ ఇమ్మంటాను. ” అని చెప్పి వెళ్ళిపోయింది నిసీ.
ఇంటర్వ్యూ అంతా ముగించేసరికి నిసీ అలిసిపోయింది. అంతకు ముందు పాల్ తనకు వినిపించిన వార్త ప్రభావం అప్పుడు తెలుస్తున్నదేమో. ఐనా, ఆమెకు డాక్టర్. మార్గరెట్ బ్లూమ్ తో పరిచయం, ఆమె తనపై చూపిన గౌరవం , తను ఆమెకు జబ్బు నయం చేయగలదన్న విషయం ఉత్సాహాన్నిచ్చాయి.
ఆ ఆనందం ఎంత సేపుంటుంది నిసీకి!
ఇప్పుడు తన సంగతేమిటి ? పాల్ తో తగువు పెట్టుకొని ఈ హాస్పిటల్ లోనే పని కొనసాగించడమా? లేక వేరే ఉద్యోగం వెతుక్కోడమా?
ఆమెకు వాడాలంటే పలుకుబడి ఉంది. అంతకు ముందు తను వైద్యం చేసిన పేషెంట్లు-పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు , తన మీద గౌరవం ఉన్న డాక్టర్లు, పైవాళ్ళ మీద వత్తిడి తేగలిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కాని అలా చెయ్యవచ్చా?
చైర్మన్ నిర్ణయమే సరైతే? ఏమో! అతని ఉద్దేశాలే రైటేమో! కొత్త డాక్టరు తనకన్నా మంచి వైద్యం చెయ్యగలగొచ్చు!
ఐతే తన రోగులను , వాళ్ళ పట్ల తన బాధ్యతలను వేరే వాళ్ళకు వప్పజెప్పి కొత్త చేట చేరాల్సిందేనా? ఈ ఉద్యోగం పోడానికి భర్త జబ్బు కారణమైనట్లే, ఇంకోటి వెతుక్కోడానికీ అది అడ్డమే. తను వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న రాకమానదు.
వైద్య రంగం ఎంత విచిత్ర మైనది! రోగులు ఎప్పుడూ ఆస్పత్రులకు రావాలి. అవి కిటకిటలాడుతూ ఉండాలి. కాని డాక్టరు ఫేమిలీకి డాక్టరుకు జబ్బులే రాకూడదన్నట్లు, రావన్నట్లు ప్రవర్తిస్తారు. ఒక్క రోజు సిక్ కాల్ చేసినా దొంగ నాటకం ఆడుతున్నట్లు చూస్తారు.
అబ్బా! ఇప్పుడు ఈ ఆలోచనలకు ఖాళీ ఎక్కడ. ఇంకో పేషెంటు రూమ్ లో రెడీగా ఉంటే. నిసీ తలుపు తోసుకుని లోనికి పోయింది.
*
ఓ వారం గడిచాక హాస్పిటల్లో ఒక రోజు.
“పాల్! ఏమిటోయ్ ఆదుర్దాగా కనిపిస్తున్నావ్? ” డాక్టర్ జాన్ బెన్నెట్ అడిగాడు. ఆయన సర్జరీ చైర్మన్.
పాల్ బ్రాఫ్ ఎందుకో అకస్మాత్తుగా ఆయన ఆఫీసులోకి, అడక్కుండా పెట్టకుండా లోపలికి వచ్చేశాడు.
” మరిస్సా బ్రెస్ట్ లో కేల్సిఫికేషన్లున్నాయి. రేడియాలజిస్ట్ ఇప్పుడే మామోగ్రాములు నాకు తీసుకొచ్చి చూపించాడు. కొంచెం ఆందోళనగా ఉంది నాకు.”
వేరేవాళ్ళ జబ్బు గురించి మాట్లాడినప్పుడు. ఓ! చాలా ఇంటెరెస్టింగ్ . చాలా ఎక్సయిటింగ్! అనే పాల్ నోట్లోంచి, ఆ మాటలు, ఈ మామోగ్రాములు చూపిస్తున్నప్పుడు రాలేదు. మరి మరిస్సా అతని భార్య అయ్యె.
ఇద్దరు డాక్టర్లూ మరిస్సా ఎక్స్ రేలు చూశారు. ఎడమ రొమ్ములో, చిన్ని చిన్ని మినుకుమనే తెల్ల చుక్కల గుంపు చుట్టూ ఎర్ర రంగు పెన్సిల్ తో సర్కిల్ చుట్టి ఉంది.
“నెను బయాప్సీ చేస్తాలే. పాసిటివ్ అయితే, -అవ్వదులే- ఒకవేళ అయితే గనుక, సెంటినెల్ నోడ్ బయాప్సీ కూడా అప్పుడే చేసేస్తా, అవసరమయితే. ఇంతకీ నిసీ ఏమంది . ఈ ఎక్స్ రేలు చూసి? ”
“నిసీతో నేను ఇంకా వీటి గురించి మాట్లాడలేదోయ్.”
“అదేంటి? ఆమేగా మీ బ్రెస్ట్ డివిజన్ చీఫ్! ”
“ఈ మధ్యే ఆమెను ఉద్యోగం నుండి తీసేస్తున్నట్లు చెప్పానోయ్. జూన్ దాకా గడువు.”
“అదేంటి. ఎందుకూ. నేను నమ్మలేక పోతున్నా. నీకున్న స్టాఫ్ లో గొప్పగా పని చేసే ఆమె. నాకామె ఎంతో ఇష్టం కూడాను.”
పాల్ ముఖం ఎర్రగా అయ్యింది. బెన్నెట్ తో వైరం అతనికి మంచిది కాదు.
” ఆమెకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి జాన్. భర్తకు జబ్బు. ఈ మధ్య అప్పుడప్పుడు పనిలోకి ఆలస్యంగా వస్తున్నది. నర్సులు నస పెడుతున్నారు. పేషెంట్లు గొణుగుతున్నారు.
‘మాస్ జెనరల్ హాస్పిటల్ ‘ నుండి ఒక అమ్మాయిని తేవాలనుకుంటున్నా. చాలా చురుకైంది. భలే తెలివి. కొత్త ఆలోచనలు. నీకు బాగా నచ్చుతుంది జాన్! ”
జాన్ బెన్నెట్ సూటిగా, పాల్ కళ్ళలోకి చూశాడు. చాలా మంది సర్జన్లు అలాగే నిర్భయంగా చూస్తారు. నసుగుడు లేకుండా ఉన్న మాట ఉన్నట్లు చెపుతారు.
“ఆ కొత్త డాక్టర్ సంగతేమో గాని, ఈ మామోగ్రాములు నా భార్య వైతే గనుక ఇవి నేను ముందు నిసీ దగ్గరకు తీసుకు వెడతా. నీ భార్య నీ ఇష్టం అనుకో. నన్ను మరిస్సా నెప్పుడు చూడమంటావో చెప్పు. అప్పుడు చూస్తా ” అన్నాడు బెన్నెట్.
*
ఆ మర్నాడు: మధ్యాహ్నం: పన్నెండు గంటలు:
కూపర్ ఆడిటోరియమ్. ప్రతి మంగళవారం అక్కడ బ్రెస్ట్ కాన్సర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ రోజు ఊళ్ళో ఉన్న చాలా హాస్పిటల్స్ నుండి అక్కడకు స్పెషలిస్ట్లు వస్తారు. యూనివర్సిటీ లోని పెద్ద పేరున్న సర్జన్లూ, ఆంకాలజిస్టులూ, పెథాలజిస్టులు, రేడియాలజిస్టులు. వీరు కాక ఆంకాలజీ ఫెలోస్ , రెసిడెంట్లు, మెడికల్ స్టూడెంట్లు. ఇంకా సోషల్ వర్కర్లు, డ్రగ్ రెప్రెసెంటెటివ్లు ఇలా. ఆ రోజు ఎప్పటిలానే ఆడిటోరియమ్ కిటకిటలాడిపోతున్నది. అంతా హడావిడిగా ఉంది. గొడవగా ఉంది.
ఆడిటోరియమ్ వెనకాలగా ఒక పక్కన బల్లమీద డ్రగ్ కంపెనీలు కేటర్ చేయించిన లంచ్ – సాలడ్ లు , చైనీస్ చోమైన్లూ, లోమైన్లూ, ఎగ్ ఫూయాంగ్లు , జాపనీస్ సూషీ, క్రాబ్ ఫిష్ , రకరకాల సేండ్విచ్ లు- ఉన్నయ్. ఇంకోపక్క బల్ల మీద కాఫీ్ టీలూ, కేక్ కుక్కీలూ, కోక్ పెప్సీలూ ఉన్నయ్ . అందరూ లంచ్ తెచ్చుకొని కూర్చుంటున్నారు. కొందరు వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్సులు తెరిసి తింటున్నారు.
ఇంకొంచెం సేపట్లో ఈ లంచ్ సద్దు మణిగి, కాన్ఫరెన్స్ మొదలవుతుంది. ఆ వచ్చిన డాక్టర్లు కేసుల గురించి చేసుకొనే వాదాలు, విసురు కొనే విసురులు, చర్చలు అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉత్తేజకరంగా ఉంటాయి. ఒక్కరి క్కూడ ఆ యుద్ధరంగం వదిలి వెళ్ళాలనిపించదు. కొన్ని సార్లు గడువును మించి వాదించుకొంటారు డాక్టర్లు. ఒకరిని ఒకరు ఒప్పించాలని చూస్తారు. మా వైద్యం గొప్పదంటే మాది గొప్పదని బీరాలు పల్కుతుంటారు.
చాలా వరకూ, ఒక్కొక్క కేసూ చర్చించి, ఒక అభిప్రాయానికి రావటానికి ప్రయత్నిస్తారు. చర్చలు, రికార్డ్ చేస్తారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు చెప్పిన అభిప్రాయాలు, భక్తితో నోట్ చేసుకుని, మళ్ళీ వాళ్ళ రోగులను చూసినప్పడు ఇది యూనివర్సిటీ పెద్ద డాక్టర్లిచ్చిన సలహా అని చెప్పి వాళ్ళకు ధైర్యం కలిగిస్తారు. ఈ చర్చల మూలాన కొంతవరకూ, ఊళ్ళోని ఇతర ఆసుపత్రులలో కూడా మంచి వైద్యం జరగటానికి అవకాశం కలుగుతుంది.
కాన్ఫరెన్స్ మొదలయ్యింది. రెసిడెంట్లు, ఫెలోస్ , వేదిక మీదకు వచ్చి, పోడియం వద్ద నిలబడి, పేషెంట్ల కేసు వివరాలు చెప్పి వెళ్ళి కూర్చుంటున్నారు. వరసగా సభలో ఉన్న సీనియర్ డాక్టర్ల అబిప్రాయాల ప్రకటనలు, చర్చలు జరిగి పోతున్నాయి.
ఆ రోజు పాల్ భార్య మరిస్సా కేస్ కూడా లిస్ట్ లో ఉంది. రెసిడెంట్ డాక్టరుకు కొంచెం భయంగానూ ఉంది. కొంచెం గర్వంగానూ ఉంది. రేడియేషన్ డివిజన్ ఛైర్మన్ గారి భార్య గారి కేస్ తను సభకు పరిచయం చేస్తున్నందుకు. రెసిడెంట్ సభలో వారికి , మరిస్సా బ్రాఫ్ కేస్ వివరాలు చెప్పాడు. కేస్ మీద చర్చ మొదలు పెట్టబోతూ ఉంటే అతను ” డాక్టర్ బ్రాఫ్ తను వచ్చేవరకూ మొదలెట్టద్దన్నారు . ఆయన్ని పేజ్ చేశాను. వస్తూనే ఉండాలి. ” అన్నాడు.
ఇంతలో డాక్టర్. పాల్ బ్రాఫ్ రానే వచ్చాడు. అతని పక్కన ఒక యువతి ఉంది. ఆమె చక్కనిది. కాలు పొడుగు మనిషి. చక్కని సిల్క్ సూట్ వేసుకొనిఉంది. జుట్టు సరికొత్త ఫేషన్ లో కత్తిరించి ఉంది. ఆ అమ్మాయి ముఖం మీద డాక్టరు అనీ, ఐవీలీగ్ స్కూలు నుండి అనీ, స్టాంప్ స్పష్టంగా కొట్టినట్లే ఉంది.
ఫాల్ కాన్ఫరెన్స్ రూమ్ వేదిక ముందు నిల్చొని,
” ఫ్రెండ్స్ ! ఈమె డాక్టర్. సాండ్రా మాండ్రెల్. ఈ వచ్చే జులై నుండీ మన బ్రెస్ట్ – గైనే సర్వీస్ చీఫ్ గా ఉండటానికి అంగీకరించింది. అది మన అదృష్టం . మన హాస్పిటల్ ఈమె రాకతో వన్నె కెక్కుతుంది. వివరాలు తర్వాత అందరికీ చెపుతాను. ప్రస్తుతానికి, నా ఇన్విటేషన్ మీద మనం ట్యూమర్ బోర్డ్ ఎలా నడుపుతామో చూడటానికి వచ్చింది.” అని చెప్పి ఆమెతో సహా వెళ్ళి సభలో కూర్చున్నాడు.
వాళ్ళకేసి కొందరు తలలూపారు. కొందరు చిరునవ్వులు నవ్వారు. కొంతమంది డాక్టర్లు లోలోపల ఆశ్చర్య పోయారు. నిసీకి వేరే పదవి ఇచ్చారా? ఆమె ఏమి చేస్తుంది ? ఏమీ చెప్పలేదే?
నర్సులు కొంతమంది నిసీ కూర్చున్న చోటికి దృస్టి సారించారు. చప్పట్లు కొట్టబోయిన రెసిడెంట్లు మళ్ళీ గబుక్కున డాక్టర్ నిసీ షామల్, ఆ హాల్లోనే ఉన్న సంగతి గుర్తొచ్చి విరమించారు.
డాక్టర్ షామల్ ఉద్యోగం మానెయ్య దలుచుకుందేమో. ఆమె భర్తకు ఆరోగ్యం బాగా లేదటగా? కుతూహలం అందరి మనసులో.
నిసీ అప్పటివరకూ మామూలుగా కేసులు డిస్కస్ చేస్తూ ఉంది. ఆమెకు పాల్ భార్య మరిస్సా ఎక్స్ రేల విషయం తెలియదు. ఇలా ఈ రోజు పాల్, కొత్త డాక్టర్ ను తీసుకు వస్తాడని అసలే తెలియదు. ఆ ఉదయం వాళ్ళు స్టాఫ్ మీటింగ్లో కలిసినప్పుడు, అతను కొత్త డాక్టర్ను గురించి ఆమెతో ప్రస్తావించనే లేదు. ఆ తర్వాతైనా సాండ్రాను తనకు పరిచయం చెయ్యలేదు.
ఆమె ఇంకా స్నెహితులు ఎవరితోనూ తన ఉద్యోగం పోయిన సంగతి చెప్పనే లేదు. వారి సలహాలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని అకస్మాత్తుగా తీసుకొచ్చి, అందరికీ పరిచయం చేశాడు. పాల్ కి తన పరువు ప్రతిష్ఠలతో సంబంధమే ఉన్నట్లు లేదు.
నిసీకి చాలా బాధ కలిగింది. వాంతి వచ్చేలా అనిపించింది. తల తిరిగింది. గుండె బిగదీసింది.
రోగుల మీద దయ చూపించే డాక్టర్లు, వెరే డాక్టర్లతో ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు? మనుషులకు బీదల పట్ల, రోగుల పట్ల మాత్రమేనా దయ. ఆరోగ్యంగా ఉన్న మన తోటి ప్రాణుల మీద దయా గౌరవాలు లేవా?
తుఫాను రేగుతున్నదామె మనసులో.
వ్యూ బాక్సుల మీద మరిస్సా ఎక్స్ రేలు పెట్టారు. రేడియాలజిస్ట్ ఒక పాయింటర్తో ఎక్స్ రేలు అందరికీ వివరించాడు. కొన్ని ముఖ్యమైన ఎక్స్ రేలు, తెర మీద ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ వాటిని వివరించాడు. వాళ్ళ సరి కొత్త పరికరాలతో చాలా సులువుగా రొమ్ములోని ఆ కేల్సిఫికేషన్లను ఎలా తీసివెయ్యచ్చో చెప్పాడు. .
తర్వాత డాక్టర్. జాన్ బెన్నెట్ తను ఓపెన్ బయాప్సీ చెయ్యదలిచినట్లుగా చెప్పి , రేడియాలజీ వాళ్ళు చెప్పినట్లు కాక తను ఇలా చెయ్యడం పేషెంటుకు ఎందుకు మంచిదో కారణాలతో వివరించాడు.
సభలో కొందరు సర్జన్లు లేచివెళ్ళి , మామోగ్రాములను దగ్గరగా వెళ్ళి చూసి బెన్నెట్ చెప్పిన మాటలను సమర్ధించారు.
మామూలుగా ఆ తర్వాత రేడియేషన్ లేక మెడికల్ ఆంకాలజీ డాక్టర్లు వాళ్ళ అభిప్రాయం చెపుతారు. నిసీ షామల్ మాట్లాడవలసిన సమయమది.
నిసీ మాట్లాడకముందే పాల్ కల్పించుకొని , “సాండ్రా మేండ్రెల్ ఉద్దేశమేమిటో ఈ విషయంలో, వాళ్ళ సెంటర్లో ఏం చేస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది.” అన్నాడు.
కొద్దిగా సభలో సంచలనం రేగింది. అటూ ఇటూ ఊగారు కుర్చీల్లో సభికులు. నిసి మీద అభిమానం ఉన్న వాళ్ళు, లోలోన ఏమిటీ పాల్ ! ఎందుకిలా! అనుకున్నారు.
కొంతమందికి మామూలు మనుషులకు ఉండే కుతూహలమే ఉంది. తర్వాత వింత చూడాలనే తహతహ. రోజూ రోగాలూ, రొష్టులూ ఐతే విసుగు కాదా! మధ్య మధ్య ఇలాటి సోప్ ఆపెరాలు కావాలి ఆస్పత్రుల్లో పని చేసే వాళ్ళకు.
డాక్టర్. సాండ్రా మేండ్రెల్ చాలా వివరంగా, తను అది ఎలాంటి కాన్సర్ అనుకుంటుందో చెప్పింది. పేషెంటుకి చాలా స్ట్రాంగ్ ఫేమిలీ హిస్టరీ ఉన్నందువల్ల, చిన్న వయసు ఐనైందునా, ఎడమ బ్రెస్ట్ తప్పక తీసెయ్యాలని చెప్పింది. ఈ మధ్య ఐతే ఇలాటి కేసుల్లో వాళ్ళు తమ హాస్పిటల్లో రోగి రెండు రొమ్ములూ కూడా తీసి వెయ్యాలని సలహాలిస్తున్నారనీ, కొత్త కొత్త ఆర్టికల్స్ ఉదహరిస్తూ చెప్పి అందరినీ మురిపించింది.
ఆ తర్వాత “రెండు రొమ్ములూ మళ్ళీ తయారు చెయ్య వచ్చు. ఇక్కడ ఎంత గొప్ప సర్జన్లున్నారో దేశమంతా తెలుసు” అంటూ మెచ్చుకోలుగా అంతకు ముందు కొంతమంది సర్జన్లు మాట్లాడిన దిక్కుగా చూసింది. అందరూ పులకించి పోయారు. ఆమె తెలివికి, క్షుణ్ణంగా అంత విప్పి చెప్ప గలిగిన విజ్ఞానానికి, ఆమె ముందు చూపుకి.
ప్లాస్టిక్ సర్జన్లు ఈ కొత్త డాక్టరు ఎప్పుడెప్పుడు వస్తుందా తమ ప్రాక్టీసు ఎప్పడు పెరుగుతుందా అనుకున్నారు.
నిసీ మరీ కన్సర్వెటివ్ డాక్టర్. మాస్టెక్టమీనే చెయ్యకుండా అడ్డు పెడుతుంటే, ఇంకా రీకన్స్ట్రక్షన్ ఎక్కడ? వాళ్ళ సర్జరీ చేసిన పేషెంట్ల స్లయిడులు మీటింగ్స్ లో చూపినపుడు అప్పుడప్పుడూ వాళ్ళను ఫ్రాంకెన్ స్టైన్ లని చెప్పి ఎగతాళి చేస్తుంది అందరిలోనూ.
దేవుడిచ్చిన అందమైన రొమ్ములను మీరెందుకోయ్ చెడగొట్టటం అంటుందయ్యె. ఇంకా ఇంకా, తక్కువ సర్జరీ చెయ్యమంటుంది. ఇంక మా సర్జన్ల ట్రెయినింగెందుకు, మట్టి కొట్టుకు పోను? పేషెంట్లేమో ఆమె కోసం ఎగబడుతున్నారు.
నేషన్ లో బ్రెస్ట్ కాన్సర్ కు ఎంత గిరాకీ ఉంది. అలాటి గిరాకీ ఉన్న ఫీల్డ్ లో సర్జన్ల విలువ తగ్గిచ్చేస్తే ఎలా? అవీ కొందరు సర్జన్ల ఆలోచనలు.
ఈ లోపల పాల్ మనస్థితి చూడాలి. అతడికి అకస్మాత్తుగా డాక్టర్. సాండ్రా మేండెల్ ని చూస్తే భయం వేసింది. అంతలోనే తన పెళ్ళాం మరిస్సా తన ముందు ఒక రొమ్ముతోనూ , తర్వాత రెండు రొమ్ములూ లేకుండా ఒక బల్ల లాగా ఉన్న ఛాతీతోనూ, తన ఎదురుగా నుంచున్నట్లు కనిపించింది. వేళ్ళాడే తోళ్ళూ, వికృతమైన స్కార్లూ కనిపించాయి. ఓ మై గాడ్! ఖీమోథెరపీ కూడా ఇస్తే? విగ్గులు పెట్టుకున్న మరిస్సా, తన బోట్ మీద వాంతులు చేసుకుంటున్న మరిస్సా.
పాల్ అసలు చిన్న సర్జరీతో సమస్య తేలిపోతుందనుకున్నాడు. ఒకవేళ కాన్సర్ ఐనా మహా ఐతే రేడియేషన్. అతను ఈ బ్రెస్ట్ లు తీసివేసే తతంగమంతా ఒక్క సారి కూడా అనుమానించలేదు.
తను ఈ ఊళ్ళో ఇంకా కొత్త డాక్టర్. హాస్పిటల్లో పెద్ద బాధ్యతలున్నాయి. ఛైర్మన్ భార్యగా, దేశంలోని ఫిలాంత్రపిస్టులతో ఛారిటీ ఇవెంట్స్ లో , బాల్ రూమ్ గౌనులు వేసుకొని రొమ్ములు లేని మరిస్సా డాన్స్ లెలా చేస్తుంది? చెయ్యక పోతే తనకు పెద్ద గ్రాంటు లెలా వస్తాయి? అది సరే, తన సంసార సుఖం మాటేమిటి? తన పిల్లల గతి ఏమిటి?
పాల్ కు గాజు కళ్ళు పడినయ్యి. నోరు తెరుచుకు పోయింది. అతని మనస్సులో తన పడవ తలకిందులై పోయి , దాని మీద రొమ్ముల్లేని మరిస్సా కూర్చుని చేతులూపుతున్నట్లూ, తను మునిగి పోతున్నట్లూ, తన లాబ్ కోట్ నీళ్ళలో కొట్టుకు పోతు న్నట్లూ అనిపించింది
ఈ లోపల నిసీ బాధ నిసీది. ఆమె మరిస్సా కేసు గురించి వింది. వినలెదు. ఎక్స్ రేలు చూసింది. చూడ లేదు. చర్చలు వింది. వినలేదు.
ఆమెకు తననెవరో కొరడాలతొ కొట్టినట్లుంది. నడివీధిలో తనను వేలాం వేసినట్లనిపించింది. భార్య ఉండగా ఉంపుడుకత్తెను తీసుకువచ్చి , మొగుడు ఆమె ముందే ఉంచుకున్నదానితో నాట్యం చేస్తే ఆ భార్య కిలాగే ఉంటుందేమో అనిపించిందామెకు. ఆమె వళ్ళంతా భగ్గున మండింది.
ఇదేనా! ఒక డాక్టరుకు ఒక హాస్పిటల్లో జరగవలసిన సత్కారం. ఛీ! దీనికోసమేనా, ఇంత చదువులూ. కష్టపడి పని చెయ్యటాలూ? అనుకుంది నిసి.
ఆమె గబుక్కున లేచింది. ఆడిటోరియమ్ ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. ఆమె చక చకా మెట్లు దిగింది. అందరి చూపులూ అటే . ఆమె ముందుకు వచ్చి బయటకు వెళ్ళే తలుపు దగ్గర అగింది. ఆడిటోరియమ్ అంతా ఊపిరి బిగ పట్టింది. కోటు జేబుల్లో చేతులు దూర్చి ఏదో ఆలోచనలో అక్కడ నిలబడింది. అది ఒక్క నిమిషమే ఐనా ఒక రోజులాగా అందరికీ అనిపించింది.
ఐతే ఆమె బైటికి వెళ్ళకుండా, గిర్రున తిరిగి వేదిక ముందుగా నడిచి ఎక్స్ రే -వ్యూబాక్సుల దగ్గరకు వెళ్ళింది. ఆ ఎక్స్ రేలు కాసేపు, అటూ ఇటూ మార్చి పెట్టుకుంది. శ్రద్ధగా వాటి వంక చూసింది. మళ్ళీ అటూ ఇటూ మార్చి పెట్టుకుని చూసింది.
అందరూ వింతగా చూస్తున్నారు ఆమెనే. అంతటా మౌనం.
సభికుల వైపు తిరిగి “నా ఉద్దేశం ఎవరూ అడగలెదనుకోండి. ఐనా నేను ఈ కేస్ గురించి మాట్లాడ వచ్చా?” అంది.
ఎవ్వరూ మాట్లాడ లేదు. పాల్ వైపు చూసింది. అతడు పలక లేదు. ముఖం పక్కకు తిప్పివేశాడు. బెన్నెట్ వంక చూసింది. ఆయన తల ఊగించాడు.
“నా ఉద్దేశంలో ఈ పేషెంటుకు కాన్సర్ లేదు. ఈ కేల్షియం డిపాసిట్ రొమ్ములో లేదు. ఇవి బైట చర్మంలో ఉన్నాయి. ఇవి అసలు ఏమీ హాని కలిగించవు. ఈ వ్యూలలో ఇలా కనిపించినా ఇంకా కొన్ని ఎక్స్ రేలు తీస్తే, ఈ విషయం స్పష్టంగా తెలిసి పోతుంది. ఈమెకు ఏ వైద్యమూ అక్కర్లేదు. బయాప్సీ కూడా అక్కర్లేదు. ఇదీ నా అభిప్రాయం” అని చెప్పి నిసీ షూ టకటక లాడిస్తూ బైటికి వెళ్ళిపోయింది.
పాల్ మళ్ళీ నోరు తెరిచాడు. ఒక్కసారిగా అతని గుండె మీద పెద్ద బరువు తొలిగి పోయింది. అతని వళ్ళు తేలికై పోయింది. కాళ్ళు రబ్బరు లాగా వేళ్ళాడాయి. మూర్చ పోతాడెమో అనుకున్నాడు ఒక్క క్షణం .
సభ మళ్ళీ స్తంభించి పోయింది. డాక్టర్ బెన్నెట్ తన టై సర్దుకుని, చిన్నగా నవ్వుకున్నాడు. అతనికేం కొత్త కాదు. నిసీ తననూ హాస్పిటల్ నూ అనవసరమైన మాల్ ప్రాక్టిస్ గొడవలు రాకుండా ఎన్నిసార్లు రక్షించలేదు! నిసీ స్నేహితులు శభాష్ నిసీ! అనుకున్నారు. మనసులో చప్పట్లు కొట్టుకున్నారు. గుసగుసలాడుతూ మెల్లిగా ఆడిటోరియమ్ లోని అందరూ, బయటకు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళి పోయారు.
*
ఆ సాయంత్రం. అందరూ ఇంటికి వెళ్ళే వేళ అయింది. డాన్, నిసీ షామల్ దగ్గరకు వచ్చి “నేను ఇంటికి పోబోతున్నా. నీకు ఇంకేమన్నా కావాల్సినవి ఉన్నయ్యా ” అని అడిగింది.
ఏం లేదంది నిసీ.
ఇంకా దగ్గరకు వచ్చి డాన్ “డాక్టర్ బ్రాఫ్ నిన్ను చూడాలని అడుగుతున్నాడు. నేనేమో, నువ్వు రేపు వాషింగ్టన్ లో లెక్చర్ ఇవ్వాలి. తొందరగ ఇంటికి వెళ్ళక పోతే ప్లేన్ మిస్సవుతావ”ని చెప్పానంది.
ఆమె కళ్ళు -చూడమాకు నిసీ. నువ్వెందుకు చూడాలి . ఆ పాల్ ని ఇంత చేశాక – అంటున్నాయి.
నిసీకి నవ్వొచ్చింది ఆమె కోపాన్ని చూసి. ఈ పిల్లకెందుకూ తన మీద ఇంత ప్రేమ. ఈ కుర్ర పిల్లకున్న విశ్వాసం తోటి డాక్టర్లకు లేక పోయింది గదా అనుకుంది.
“రానివ్వమ్మా తల్లీ! అతని పెళ్ళానికి ప్రోబ్లమ్ ఏమైనా ఉందని తెలిసిందేమో. ”
డాన్ కళ్ళల్లో కసి తీరిన తృప్తి. ఆనందం. ఆమెకు గూఢచారులన్నిచోట్లా ఉన్నారు. పాల్ బ్రాఫ్ పెళ్ళాం మరిస్సా బ్రాఫ్ కి మళ్ళీ ఎక్స్ రేలు తియ్యటం అయిపోయింది. నిసీ చెప్పిందే రైటు. కాన్సర్ లేదూ పాడూ లేదు.
“సరే డాక్టర్ షామల్. నేను పోతూ పోతూ, నువ్వు రమ్మన్నావని డాక్టర్. బ్రాఫ్ తో చెప్పి పోతాలే. నీ స్లైడుల బాక్స్, అదిగో అక్కడ ఉంది ” అని చెప్పి వెళ్ళి పోయింది.
కొంచెంసేపట్లో పాల్ చేతిలో ఒక ఛాకలెట్ బాక్సు తో ఆఫీసులోకి వచ్చాడు. కొంచెం సిగ్గుపడుతూ అది నిసీకు అందించాడు. ఆమె అది వెనక బల్ల మీద పెట్టి బల్ల కానుకుని ఏం మాట్లాడకుండా నుంచుంది.
ఈసారి అతను కొంచెం సందేహిస్తూ, కొంచెం ధైర్యం చేసి , ఆమెను కావిలించుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టాడు.
“నువ్వు చెప్పిందే రైటు. కంగ్రాచ్యులేషన్స్ . చాలా థేంక్సు కూడా . మరిస్సా తర్వాత స్వయంగా వచ్చి నీకు ధన్యవాదాలు చెపుతుంది. మాకు చాలా ఆదుర్దా తప్పించావు. ”
నిసీ షామల్ ” రోజూ చేసే పనేగా పాల్ ! ఈ కేసులో ప్రత్యేకత ఏమి ఉందని? మీ దిగులు తీరినందుకు సంతోషం. నే వెళ్ళాలోయ్!” అని ఏ సమాధానానికి సందివ్వకుండా తన వస్తువులు తీసుకుని, తలెత్తుకుని దర్జాగా బైటికి నడిచింది.