“The evil that men do lives after them,
The good is oft interred with their bones,
So let it be with Caesar …
..
Bear with me;
My heart is in the coffin there with Caesar,
And I must pause till it come back to me.”
— Anthony in “Julius Caesar”.
నేను అమెరికా వచ్చి పాతికేళ్ళు కావస్తోంది. నన్నెరిగిన వాళ్ళంతా నేను బుద్ధిమంతుణ్ణనీ, ఏ తగాదాల్లోకీ తలదూర్చననీ అనుకుంటారు. కాని వాళ్ళలో తెలుగు వాళ్ళు బహు తక్కువ మంది; ఎవరితోనూ సాహిత్యమనేది చర్చలోకి రానే రాదు. నడి వయసు దగ్గరపడేకొలదీ నాలో కనుమరుగవుతున్న “తెలుగుదనం” కోసం తాపత్రయపడి, పోయినేడు తానా సభలకి వెళ్ళాను, రచ్చబండలో చర్చల్లోకి దిగాను. దానితో నా నిజస్వరూపం బయటపడింది. అందరికన్నా ముందు ఇది మా ఆవిడే కనిపెట్టింది – అయినదానికీ కానిదానికీ గొడవలు కొని తెచ్చుకోటం.
కొడవటిగంటి కుటుంబరావు మన తెలుగువాళ్ళ ఆలోచననే హత్యచేసిన వాళ్ళలో ఒకడు అని రచ్చబండ సభ్యులొకరు ఆరోపించారు. ఎంత విరసం ఉపాధ్యక్షుడైనా అంత ఘోరం చేశాడా అని నేను కాస్త కటువుగానే రుజువు చేయండన్నాను. కుటుంబరావు రాసిన కొన్ని వేల పేజీల నుంచి ఒక “వాక్యం” సాక్ష్యంగా చూపెట్టారు. హత్యా నేరానికి ఆధారం అంతేనా అన్నా. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలదా అన్నట్లు చూశారు. ఇంకేమన్నా ఉన్నాయా అని అమాయకంగా అడిగా. చుట్టూ చూడండి, మీకే తెలుస్తుంది అన్నారు. నా చుట్టూ చెట్లూ, చేమలూ, చెరువూ, రావణాసురిడి కాష్ఠంలా కాలే Mount Rainier అనే అగ్నిపర్వతశిఖరమూ కనిపించాయి. కళ్ళజోడు సరిచేసుకొని చూస్తే కుటుంబరావు సాహిత్య సంపుటాలు కూడా కనిపించాయి.
కుటుంబరావు సాహిత్యాన్ని విమర్శే గాదు, పరామార్శ గూడా చేసే అర్హత నాకు లేదు. అయినా ఇదెందుకు రాస్తున్నానంటే, శాంతం గారన్నట్లు మనసులో వున్నది కాగితం మీద పెడితే మనసు కుదుటపడుతుందని, కాస్త నా ఆలోచన పెరుగుతుందనీ.
సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబించాలని పెద్దవాళ్ళు చెప్పారు. కాని వడ్డెర చండీదాస్ అన్నట్లు, “కేవలం అద్దప్పెంకు మాత్రమే ఐతే అక్షర చాయాగ్రహణ ఐ వూరుకుంటుంది. రవ్వంతకూడా ఆలోచన రేకెత్తించని రచన, శుద్ధదండుగ.” Hamlet పాత్రధారులకి తమతమ పాత్రలు ఎలా అభినయించాలో సలహా ఇస్తూ అన్నమాటలు గుర్తొస్తాయి: “The end of playing, both at the first and now, was and is, to hold as ’twere the mirror up to nature: to show virtue her feature, scorn her own image, and the very age and body of the time his form and pressure.” Mirroring and “holding up a mirror”, ఈ రెండిటికీ చాలా తేడా ఉందని, ఒకటి జడ పదార్థమైన అద్దం లక్షణం అయితే, మరొకటి దాని వెనక వున్న కదలికతో కూడిన హస్తాన్ని తెలుపుతున్నాయని ఎక్కడో చదివాను. ఈ ఉపమానాలతో తలనొప్పి వస్తోంది:
“One thing that literature would be greatly the better for
Would be a more restricted employment by authors of simile and metaphor.
Authors of all races, be they Greeks, Romans, Teutons or Celts,
Can’t seem just to say that anything is the thing it is but have to go
out of their way to say that it is like something else.
…
Then they always say things like that after a winter storm
The snow is a white blanket. Oh it is, is it, all right then, you sleep
under a six-inch blanket of snow and I’ll sleep under a half-inch
blanket of unpoetic blanket material and we’ll see which one
keeps warm.
And after that may be you’ll begin to comprehend dimly
What I mean by too much metaphor and simile.”
— Very Like a Whale, Ogden Nash.
వర్ణనలూ, ఉపమానాలూ లేకుండా సూటిగా చెప్పే శైలిలో రాసిన వాళ్ళలో ప్రముఖుడు కుటుంబరావు. సాహిత్య ప్రయోజనం గురించి ఆయన అన్న మాటలు ఇందుకు ఓ తార్కాణం: “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, సాహిత్యం చెయ్యగల ఉత్తమకార్యాలు. ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం.” మరి జీవితం అనేది విస్తృతంగానూ రకరకాలుగానూ ఉంది. కుటుంబరావు దాన్నెంతవరకు స్పృశించాడో కొంతైనా చూపెట్టాలని ఈవ్యాసం ఉద్దేశం.
2
“But I do think it is their husbands’ faults
If wives do fall: say that they slack their duties,
And pour our treasures into foreign laps,
Or else break out in peevish jealousies,
Throwing restraint upon us; or say they strike us,
Or scant our former having in despite;
Why, we have galls, and though we have some grace,
Yet have we some revenge. Let husbands know
Their wives have sense like them: they see and smell
And have their palates both for sweet and sour,
As husbands have. What is it that they do
When they change us for others? Is it sport?
I think it is: and doth affection breed it?
I think it doth: is’t frailty that thus errs?
It is so too: and have not we affections,
Desires for sport, and frailty, as men have?
Then let them use us well: else let them know,
The ills we do, their ills instruct us so.”
— Emilia in “The Tragedy of Othello”
“మొగాడికయినా ఆడదానికయినా నీతి వుండాలి” అంటూ రంగప్రవేశం చేసింది ఆధునిక తెలుగు సాహిత్యంలో కెల్లా అపూర్వసృష్టి అయిన, గురజాడ మనోనేత్రం నుండి ప్రభవించిన మధురవాణి. స్త్రీ స్వేచ్ఛ కోసం, వివాహవ్యవస్థని చీల్చి చెండాడుతూ ధ్వజమెత్తాడు చలం: “ఒక్క నిమిషం నాకు విశ్రాంతి నివ్వక మహాప్రణయమారుత వేగాలమీదనో, అగాథ వియోగభారం క్రిందనో చీల్చి నలిపి ఊపిరాడనీక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదికతం.” చలం విప్లవ భావాలను మెచ్చుకుని, ఆయనని “జీనియస్” గా పొగిడిన కుటుంబరావు, చలం తరవాత రమణాశ్రయం నుండి రాసిన musings లోని విషయాలను విమర్శించాడు.
“స్త్రీ మోహం కన్న వుత్తమమయింది, వాంఛనీయమయింది యీ లోకంలో ఏం వుంది? ఆత్మ సామ్రాజ్యం – అనేదేవుంటే అది. లేకపోతే స్త్రీ సామ్రాజ్యం. ఈ రెండే. ఇంకేవీ లేవు. వీటి ముందు తక్కినవి దుమ్ము…. ఈ దేశంలో అన్ని ఆనందాలూ నశించాయి. వున్న అందాలన్నీ చాలా త్వరగా వొదిలిపోతున్నాయి. “భోజనం, పాలిటిక్స్” రెండు మిగిలాయి. అందువల్లనే ప్రజలకి కూడూ గుడ్డా అని అల్లాడతారు నాయకులు.” అని చలం మ్యూజింగ్స్ లో రాస్తే, ఈ “రసమయ జీవులు” లేక elegant souls, ప్రణయానికి మించిన యదార్థ జీవిత సమస్యలు వీళ్ళని బాధించవంటూ కుటుంబరావు విమర్శించాడు. గాడిదకేం తెలుసు గంధప్పొడి వాసన అన్నట్లు, మార్క్సిస్టయిన కుటుంబరావుకేం తెలుసు భగవాన్ లీలలూ, రసమయ జీవన సౌందర్యాలూ అనొచ్చు కొందరు!
రసమయ జీవితం సంగతేమో కాని, ప్రతివారికీ ప్రేమ కావాలి. కాని ఈ ప్రేమలో అనేక రకాలూ, రూపాలూ ఉన్నాయని, శరీర ఆకర్షణేకాక, మమత, ఆపేక్ష, అనురాగం, సానుభూతి ఇవన్నీ ప్రేమలో భాగాలనీ, దీని వెనక ఆర్థిక, సామాజిక కారణాలుంటాయని, కుటుంబరావు అనేక రచనలలో చూపించాడు. ఆ విధంగా చలంతో విభేదించి విస్తృతంగా రాశాడు.
తెలుగు సాహిత్యం మీద చలం ప్రభావం అపారంగా ఉందని కీర్తించిన రారా, చలం రచనల్లో కనిపించే ప్రేమకూ, కుటుంబరావు రచనల్లోని ప్రేమకూ వున్న తేడాని విపులంగా చూపెట్టాడు.
కుటుంబరావు రాసిన “కురూపి” అనే గల్పికలో, కురూపి తన భర్త స్నేహితుణ్ణి ఆకర్షించే ప్రయత్నంలో అంటుంది: “ప్రేమలూ, గీమలూ చెప్పకండి. ఒకటే ప్రేమ ఉంది ప్రపంచంలో – పరమ కురూపికి నవమన్మధుడి మీదా, నవ మన్మధుడికి కురూపి మీదా కలిగే ప్రేమ! అది అంటుకుంటే చల్లారదు. ప్రపంచాన్ని భస్మం చేస్తుంది. మిగిలిన ప్రేమలన్నీ ఇస్తివాయినం. పుచ్చుకుంటి వాయినం!”
ఆ స్నేహితుడు తనని ఒంటరిగా ఉన్నపుడు దగ్గిరకు తీసుకుంటే, చిరునవ్వు నవ్వి, “చాలు, చాలు! నా అభిప్రాయం ఇదికాదు. మా వారికి నన్ను చూస్తే ఒక దురభిప్రాయం. నేనెవ్వరికీ అక్కర్లేదని. నన్ను వీధిలో పారేస్తే నల్ల కుక్కయినా ముట్టదని. ఈయన పొరపాటు పడ్డట్టు కనిపిస్తుంది… దేవుడల్లే వచ్చి నా అనుమానం తీర్చావు. నన్ను బాధించకు. నాకు మా వారిమీద తప్ప మరెవ్వరిమీదా భ్రమ లేదు.” అన్నది.
చలం చెప్పే ప్రేమ “అంటుకుంటే చల్లారదని”, అది కేవలం శరీరాకర్షణ కాకపోయినా, దానిని ప్రకృతి సిద్ధమనీ, అదొక దైవిక శక్తి అన్నట్లుగా చలం చిత్రిస్తే, కుటుంబరావు చెప్పే ప్రేమకి ఆపేక్షా, మమకారాలు ముఖ్యమనీ రారా అభిప్రాయపడ్డాడు.
అందవిహీనతని ముఖ్యాంశంగా తీసుకున్న నవల “కురూపి”. సరస్వతి తనని బస్సులో చూసి నవ్వినందుకు కనకం ఆమెను వెకిలిదనుకుంటాడు. తన స్టాపులోనే దిగితే, “ఇది నన్ను పట్టుకుందేమిటి?” అనుకున్నాడు. “మా ఇల్లు దగ్గిరే, రండి పోదాం” అంటే, ఆమె సాహసానికి నిర్ఘాంతపోయి, “ఆమె అభిప్రాయం ఏమిటి? ఏ ఆడ కుక్క చూపుడువేలు ఆడించినా తాను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడనా?” అనుకుంటాడు.
కనకం వెటకారంతో “వద్దునుగాని నాకు మరో చోట ఎంగేజ్మెంటున్నది” అంటూ చేతిలో వున్న కాగితం ముక్క చూపిస్తే, ఆమె దానిని చూసి “ఇదే మా ఇల్లు” అంటుంది. దానితో గట్టి దెబ్బ తిన్న వాడై, “నేనెవరో తెలుసన్న మాట!” అంటాడు. “మీరెవరో తెలియకుండానే మా యింటికి ఆహ్వానించా ననుకున్నారన్న మాట” అని గొప్ప దెబ్బ తీస్తుంది.
ఆదెబ్బతో శిఖండి చాటునుంచి అర్జునుడు భీష్ముణ్ణి కాలసర్పంలాటి బాణం వేసి కొడుతూ ఆపేక్షగా నవ్వితే భీష్ముడికెట్లా ఉండి ఉండునొ కనకానికి అర్థమవుతుంది.
సరస్వతి ఎమ్మే చదివి లెక్చరరుగా పనిచేస్తున్నదని తెలిసి ఆమె మొహం చూస్తే ఇప్పుడామెలో ఎమ్మే జాడలూ, లెక్చరరు కవళికలూ కనకానికి కనిపించాయి. సరస్వతిని కలిసిన ప్రతి సారీ, ఆమెలోని అనాకారి తనం తగ్గిపోవడం, హృదయ సౌందర్యం పెరగడం అనుభవం లోకొస్తాయి — ఇల్లు చక్క పెట్టుకోవడం, అన్న వదినల పిల్లల్ని ఆపేక్షతో పెంచటం, వాళ్ళలో ఒక పిల్ల హఠాత్తుగా చనిపోవటంతో అందుకు తాను లేకపోవడమే కారణమని కుమిలిపోవడం, ఇవన్నీ ఆమె హృదయ సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని తెలుపుతాయి. కనకం ఆమెకి దగ్గరయి ప్రేమలో పడతాడు. చివరకి గాఢ నిద్రలో సరస్వతి అతని డొక్కలోకి దూరితే తాను సరస్వతికి తల్లి అయినట్లుగా తోచి కనకానికి నవ్వొస్తుంది.
ఈ నవలలో సరస్వతి కనకం ప్రేమకోసం చేసిందేమీ లేదు. తను అనాకారినని, తననెవరూ ప్రేమించరనే ఆత్మన్యూనతా భావంతో తనకెవరి ప్రేమా పొందే అవకాశం లేదనే నిర్లిప్తత అలవరచుకుంది. కాని ఆమే తన ప్రేమనంతా తన అన్న పిల్లలమీద చూపెట్టి ఆవిధంగా గాఢమైన ఆపేక్ష పెంచుకుంటుంది. ఇదే ముఖ్యంగా కనకాన్ని కట్టేస్తుంది.
మనిషి నుంచి మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటి మాత్రమే అని, స్త్రీ పురుషుల మధ్య గోడలు పడిపోతే అలాంటి అనుభూతులకి అవకాశాలు, విలువ పెరుగుతాయనీ, సరస్వతి పాత్రని కనకం పాలిటి అంతరాత్మలాంటిదిగా చిత్రించాననీ, అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలు చిన్నతనం నుండీ తనకు తెలుసనీ, మరి ఈ కాలపు యువకుల ఉద్దేశం మాత్రం తనకు తెలియదనీ కుటుంబరావే చెప్పాడు.
3
“ప్రేమించిన మనిషి” నవలలో నాయకుడు గోపాలం సరోజని చూసీ చూడటంతోటే ఆకర్షించబడతాడు. “నిజంగా అందమైన పిల్ల. కొంచెం బొద్దుగా ఉంటుంది. భలే రంగు. దబ్బ పండు. మంచి కళ్ళూ, కనుబొమలూనూ. జెర్రిపోతులాంటి జడ నడుముదాకా వచ్చి కత్తిరించినట్టు ఆగిపోయింది.”తరవాత బీచిలో సరోజ స్నేహితురాలు పద్మ కనిపిస్తుంది. “ఆమె తనకేసి కన్నార్పకుండా చూస్తూ ఉండటం అతను గమనించాడు. అతని వంటి మీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్టయింది. ఆ పిల్ల అనాకారిదనటానికి వీల్లేదు. చిన్న మొహమే అయినా కుదురుగానే ఉంది. నల్లతోలు. అయితే నల్లతోలంటే గోపాలానికి ద్వేషం లేదు. కానీ, ఈ పిల్ల వంటి చర్మం పదును పెట్టి చెప్పులు కుట్టటానికి తయారు చేసినట్టుగా వికారంగా ఉంది. అసలు మనిషిని చూస్తేనే గానుగాడిన చెరుకుగడలాగా ఉంటుంది. ఆ పిల్ల కళ్ళు చూస్తే తినేసేటట్టున్నాయి. ఆమె కేసి గోపాలం రెండోసారి చూడలేకపోయాడు.”గోపాలం సరోజతో చాలా సమయం గడిపేవాడు, ప్రేమిస్తున్నాననే అనుకునే వాడు. జీవితం గురించి తన విశ్వాసాలు ఆమెతో చెప్పేవాడు, ప్రేమని వెల్లడించడానికి అదే ఉత్తమ మార్గమని. కాని సరోజ వాటితో ఎలాంటి సానుభూతీ చూపించదు. పైపెచ్చు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి పనిదాని మంగిని దొంగతనంగా అన్నం తిన్నందుకు శాపనార్థాలు పెట్టడంతో అతనికి బాధ కలుగుతుంది: “దొంగముండ! నీతీ జాతీ లేదు. పని చేసే వాళ్ళని వేయి కళ్ళ కనిపెట్టుకుని ఉండాల్సిందే! ఎన్నడూ డబ్బులు కూడా ముట్టుకునేది కాదు. ఇవాళ ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో! ఎంత మంచిగా కనిపించినా వీళ్ళను నమ్మకూడదు! ఛా! ఛా!”గోపాలానికి మంగి మీద జాలి కలిగి, ఇడ్లీలకి డబ్బిస్తాడు. దగ్గరవుతాడు. మంగిని వర్షంలో తడిపి పని చేయించుకొని న్యుమోనియా తెప్పించిందని సరోజ అంటే విముఖత ఏర్పడుతుంది. కాని అనుకోకుండా పద్మకి దగ్గరవతాడు: “మీరెక్కడినుంచో ఊడిపడ్డారుగాని, సరోజ చేసిన పని అందరూ చేస్తారు. నేనైనా చేస్తానేమో!” అంది పద్మ.
“ఎందుకు చేస్తాం అటువంటి పనులు? మనిషి రెండు పూటలా తినాలంటే అధమం నెలకు ఇరవై రూపాయలు కావాలి. అటువంటప్పుడు పనిచేసేవాళ్ళకు నాలుగూ, అయిదూ ఎందుకిస్తారు?” అన్నాడు గోపాలం.
“అంతకన్న ఇవ్వలేకనేమో!”
“ఫిడేలు మాస్టరుకు ముప్ఫై అయిదు ఇచ్చుకోగలమా?”
“అంతకన్న తక్కువకు రాడుగా!”
“పనివాళ్ళు చవకగా వస్తారనే మనకు వాళ్ళంటే అగౌరవం. మనిషి మంచితనం పెళ్ళాం పట్ల ప్రవర్తించటంలో బయట పడుతుందిట! మన సంస్కారమంతా పేదవాళ్ళ దగ్గిర బయట పెట్టుకుంటాం!”
..
సరోజతో అనని మాటలు తనతో అంటున్నాడని పద్మ గర్వంగా ఫీలవుతుంది.
పద్మ మీద గోపాలానికి ప్రేమ పెరుగుతుంది. పద్మ సమయం దొరికినపుడల్లా గోపాలం మీద తనకున్న ప్రేమని వ్యక్తం చేస్తుంది:
“అంత దూరం ఆలోచిస్తే ఆయిర్దాయం తరిగి పోతుంది.” అన్నది పద్మ.
“అదా మీ వంశం వాళ్ళ నమ్మకం?”
“ఇటువంటి నమ్మకాలు ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కసారి తెలుసుకోకండి, భయపడిపోతారు. ఒక్కోసారి నేనే దడుసుకుంటూ ఉంటాను.”
“ఏదీ ఇంకోటి చెప్పి భయపెట్టు!”
“ప్రపంచంలో ఒక్కడే మగాడున్నాడని!”
“దారుణం!”
“ముందే చెప్పానుగా?”
“ఆ మగాడికి చాలామంది ఆడవాళ్ళు కనిపిస్తే?”
“వీరస్వర్గం ఉండనే ఉంది!”
పద్మ తనను ప్రేమిస్తున్నదని గోపాలం గ్రహించాడు. తనకి చెప్పకుండా పద్మ ఏమైనా చేస్తే చిన్నబుచ్చుకుంటాడు:
” గోపాలం పత్రిక తీసుకుని తిరగేసాడు.
“కొత్త తార పద్మ! తారాపధాన యింకో మహోజ్వాల తార ఉదయించిందా?”
నాలుగు రోజుల క్రితం కనిపించినప్పుడు కూడా పద్మ చెప్పలేదు. కావాలని దాచిందని ఆమె మీద కోపం వచ్చింది. ..
మర్నాడు పన్నెండు గంటల వేళ గోపాలం సెట్టు మీద ఉండగా పద్మ వచ్చింది. గోపాలం ఆమెను చూడనట్లు గమనించాడు. ఆమె తనకోసం వచ్చిందనీ, తన ఉత్తరం చూసుకుని వచ్చిందనీ అతను గ్రహించాడు. ఆమె ఏడిచి రాగాలు పెడితే ఏం చెయ్యాలా అని అతను లోలోపల మధనపడుతున్నాడు.
“ఏం ఇట్లా వచ్చావ్?” అన్నాడు.
“పెద్ద స్టారుకు తాను లేని షూటింగు చూడాలనిపించింది?” అన్నది పద్మ. ఆమె కళ్ళు మాత్రం ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
“పులి ఇవాళ వ్యంగ్య ధోరణిలో ఉంది?” అన్నాడు తను.
“ఇంకేం వ్యంగ్యం? వేటగాడు గుండెలో గుండేసి కొట్టాడు!”
“అంతలావు వేటగాడెవరబ్బా?”
“ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు.”
“Nonsense! ఆ వేటగాడి కళ్ళలో దుమ్ము కొట్టటం పులికి బాగా తెలుసు!”
“నాకు ఏడవాలనుంది. ఇది మంచి చోటు కాదు.”
“నాకు వేరే పనుంది. కొంచెం ఆగు!”
..
“ఏమిటీ ముసురు గోపాల్?”
“రుతువు మార్పు!”
“నన్ను ఏడిపించదలిస్తే కనీసం సముదాయించటానికయినా దగ్గిరుండు గోపాల్! దూరాన్నుంచి తిట్టకమ్మా!”
ముసురు కాస్తా వర్షపాతంగా పరిణమించింది.
“ఏడవకు పద్మా? ఎవరికోసం ఏడుస్తావ్? నేను తగను. ఆ విషయం ఏనాడో చెప్పాను.”
“నేనేం తప్పు చేశాను? ఆ వెధవ వేస్తున్నానని నాతో చెప్పలేదు…” గోపాలం ఆమెకేసి పశ్చాత్తాపంతో చూసి, “అదృష్టవంతురాలివి. ఏడవగలవు. నాకదికూడా చేతకాదు. లోపల ఏడుస్తున్నాననుకుని క్షమించెయ్యి,” అన్నాడు.
గోపాలం మంగి మీద జాలీ, ప్రేమా చూపినందుకు పద్మ ఉక్రోషపడదు. సానుభూతి చూపి ఇంకా దగ్గరవుతుంది. గోపాలంకి తెలుసు తను మంగిని పెళ్ళిచేసుకోలేడని. సరోజ దాటలేని డబ్బు గోడల మూలంగా ఆమె దగ్గర కాలేదు. మొదట్లో చూసినప్పుడు వెకిలిదనుకున్న పద్మే చివరకి గోపాలానికి దగ్గరవుతుంది. కాని “కురూపి” లోని సరస్వతిలా కాకుండా, దీంట్లో పద్మ గోపాలం ప్రేమ కోసం ఆసక్తి చూపెడుతుంది. సమయం దొరికినపుడల్లా ఆపేక్ష, మమకారం చూపెడుతుంది. ప్రతి సంఘటన తరవాతా ఆమె హృదయ సౌందర్యం ఇనుమడిస్తుంది.
నవల చివర్లో సరోజ గురించి చర్చిస్తూ పద్మ “ఆపేక్ష లేకపోతేనే అసూయ” అంటుంది. తనకు గోపాలం మీద ఆపేక్ష ఉండటానే అతను మంగికి సాయపడినా అర్థం చేసుకుంటుంది. అది లేకపోవటానే సరోజకి పద్మ మీద అసూయ. ఇలా కుటుంబరావు తన ప్రేమ కథల్లో పైపై ఆకర్షణ కన్నా మమతలకీ, ఆపేక్షలకీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.
4
“పంచకళ్యాణి” నవల అయిదుగురు చదువుకున్న అమ్మాయిల వివాహ సమస్య గురించి. ఈ అయిదుగురూ ఎలా ఘర్షణ పడేదీ చివరకి వివాహజీవితంలో పొందవలసిన ఆనందం పొందలేకపోవటం చిత్రించాడు. వీళ్ళతోపాటు వాళ్ళ కుటుంబాలలో వున్న సంఘర్షణ గూడా ఉంది.సుశీల తండ్రి, సవతితల్లి సుందరమ్మలతో ఉంటుంది. పెద్ద కట్నాలిచ్చి చేసే స్తోమతు లేదు. సుశీలకి సుందరమ్మ గానుగెద్దు జీవితం చూస్తే జాలి – జీవితంలో ఏ చిన్న ఆనందమూ లేదు. తన జీవితం గూడా అలాగే అవుతుందేమోనని భయం. తెలివిగలది, చదువుకున్నది. కానీ, పై చదువుల చదవడం కన్నా పెళ్ళిచేసుకుని సుఖపడాలని కోరిక.నీతికీ ధర్మానికీ కట్టుబడి వున్న పిన్ని గొడ్డులా జీవిస్తుంటే, అన్నింటికీ తెగబడిన ఎదురింట్లో ఇంజనీరుగారు ఉంచుకున్న దుర్గాంబ అందలాలెక్కి ఊరేగుతుండటం చూసి చాతనయితే దుర్గాంబలాగా బతుకుతాను కాని చచ్చినా పిన్నిలాగా కాదని తీర్మానించుకుంటుంది.తండ్రి స్నేహితుడూ, వివాహితుడూ, పొగాకు వ్యాపారీ, ధనవంతుడూ అయిన రామకృష్ణరావుతో ప్రేమ సాగించి, గర్భవతవడంతో పెళ్ళిచేసుకోమని రామకృష్ణ ఊరు చేరి రెండో కాపురం పెట్టిస్తుంది. డబ్బుకు లోపం లేకపోయినా, భద్రత లేదు. రామకృష్ణ ఒక్కడే ఏదన్నా ఊరు వెళ్తే తన లాంటి సంబంధం మరొకటి పెట్టుకుంటాడేమోనని భయం.
లలిత అందమైనదీ, స్వతంత్రంగా బతకగలదీ. కాని, చిన్నప్పటినుండీ పెంచుకున్న పురుషద్వేషం వలన ప్రేమ అణగారిపోయింది. “ఆడదాన్ని కాళ్ళూ చేతులూ కట్టేసి, చావచితక కొట్టి, చీకటి కొట్లో వేసి పరిగెత్తమంటే ఏం పరిగెత్తుతుంది?” అంటుంది. జానకి, “నీదంతా చోద్యం పోనిద్దూ! నువు ఏకాలపు ఆడవాళ్ళను గురించి మాట్లాడుతున్నావ్?” మనం డిగ్రీలు తెచ్చుకున్నా మగాళ్ళకూ మనకూ తేడా తగ్గదంటుంది లలిత. రామారావుతో పరిచయం అవుతుంది. అతను ప్రేమను అనేకవిధాల వ్యక్తం చేస్తాడు; ఆమె సులభ సాధ్యురాలు కాదనుకుంటాడేగాని లలితలో ప్రేమించే గుణంలేదని తెలుసుకోలేడు — పెళ్ళయిందాకా! “పెళ్ళయినాక మగవాళ్ళంతా మీలాగే మారుతారు” అని లలిత ఎప్పుడూ సాధిస్తూంటుంది.
లక్ష్మి పెద్దన్న భాస్కరం, వదిన సావిత్రి, చిన్నన్న శీతారాం లతో ఉంటుంది. సినిమా తార కావాలని ఆశ. అలాగయితే డబ్బూ, కీర్తీ వస్తుందని పెద్దన్నకీ, అవినీతీ, అపఖ్యాతీ వస్తాయనీ చిన్నన్నకి వేర్వేరు అభిప్రాయాలు. సీతారాం మాత్రం సినిమాస్టార్లతో స్నేహం చేస్తాడు. లక్ష్మి స్నేహితురాలయిన ఇందిర అక్క సినీ తార; వాళ్ళింట్లో సంసార బంధాలన్నీ తారుమారు. ఇందిర అక్క భర్త, ఇంట్లో జరిగే వ్యభిచారానికి అనవసరంగా రభస చెయ్యకుండా డబ్బు చూసుకుని “సుఖంగా” బతుకుతుంటాడు. కష్టమైతే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళమని భార్య సూచన. లక్ష్మి తన ఇంట్లో అన్నయ్య వదినని హీనంగా చూడటంతో పోల్చి, ఒకే సంఘంలో రెండు రకాల సమాజాలున్నాయని ఆశ్చర్యపోతుంది. కాని పోషించే వాళ్ళు అధికారం చెలాయించడమే రెండు ఇళ్ళలోనూ జరుగుతుంది.
“మేడలూ, మిద్దెలూ అక్కర్లేదు. ఒక చిన్న కుటీరంలో సంసారపక్షంగా” కాలం వెళ్ళబుచ్చడం ఒక కలగా ఎందుకుండాలనుకుంటుంది. చివరకి జానకి వదిలేసిన మొగుడు పెళ్ళిచూపులకొస్తే, ఛీ అనుకుని, అప్పటిదాకా తను చాలా తేలిగ్గా చూసిన జానకి అన్న కమలాకరాన్ని చేసుకుంటుంది.
తాయారు విశ్వనాథం గారి కూతురు. ఆమెకు పిల్లలంటే భయం. తన వదిన పార్వతి మెడకి పిల్లలు ఎలా గుదిబండలయారో చూసి, పెళ్ళయి పదేళ్ళదాకా పిల్లలు కలగకుండా హాయిగా బతకాలనీ, అత్తగారూ ఆడబిడ్డలూ చేరి నెల నెలా వేధిస్తారేమోననుకుంటుంది. లలిత అన్న నారాయణని చేసుకున్న రెండు నెలలకే నెల తప్పుతుంది!
జానకి అత్తగారూ, ఆడబిడ్డలూ లేకుండా చూసి మొగుణ్ణి కట్టుకోవాలని, ఒక వేళ వున్నా, వేరే కాపురం పెట్టాలనీ కోరుకుంటుంది. బంధువుల ప్రయత్నంతో ఒడ్దు, పొడుగూ, ఆస్తిపాస్తులూ వున్న లెక్చరర్ సుధాకర్ “స్మార్ట్ గానే కనిపిస్తున్నాడు,” ఏ వంకా లేదని పెళ్ళికి ఒప్పుకుంటుంది. కాపురానికి వెళ్ళి విచిత్రమైన ప్రపంచంలో అడుగుపెడుతుంది. సుధాకర్ పిన తల్లులూ, అక్క చెల్లెళ్ళు చాలా మంది కలిసి జీవిస్తుంటారు. వాళ్ళకి ఇతరులని ప్రతిదానికీ విమర్శించటం హాబీ.
జానకి వాళ్ళ అనాగరిక ప్రవర్తనని ప్రశ్నించడం, దానికి సుధాకర్ ఓ యజమానిలా కోపగించి, జానకికి sense of humor లేదని తిట్టడం తో భార్యా భర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఆ ఇంట్లో సంస్కారం గల ఒకే ఒక మనిషి చలపతితో ఆవిడకి అక్రమ సంబంధం కట్టపెట్టడంతో జానకి పుట్టింటికొచ్చి వుద్యోగం చూసుకొంటుంది. జీవితంలో ఇంతకుముందులేని స్వేచ్ఛ, ఆనందం కనబడతాయి.
ప్రతి వాళ్ళకీ వివాహం ఒక సమస్య కావడం, అంతా చదువుకున్న వాళ్ళే అయినా ఎవరికీ వివాహ జీవితం గురించి సరయిన అవగాహన లేకపోవడం, అనేక మధ్యతరగతి కుటుంబాలలో ప్రేమ కొరవడటం కుటుంబరావు ఈ నవలలో చిత్రీకరించాడు. కుటుంబరావుకి సామాజిక చిత్రణ ముఖ్యం. మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో స్త్రీలకున్న తక్కువ స్థానాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించాడు:
“పార్వతి వెర్రెత్తిపోయి అంటుంది: “పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా పిల్లలకు చచ్చే చాకిరి చెయ్యటానికి తప్ప మరి దేనికీ పనికిరాను. ఆయనా, ఆ పిల్లలూ ఇంటి యజమానులు, నేను దాసీదాన్ని. ఛీ ఛీ!” తాయారు యింకొకందుకు కూడా పార్వతిని చూసి జాలి పడేది. ఒక చెంప పిల్లలకూ, మొగుడికీ మధ్య నలిగి తిట్లు తింటూ మొగుడు పక్కలోకి రమ్మంటే రావాలి. అది ఏం సుఖం? ఏ మాత్రం కుళ్ళు కనిపించినా కూరలూ, పళ్ళూ అవతల పారేస్తాం గదా, సంసారంలో కుళ్ళు మాట ఏమిటి?”
“ఒకనాడు సావిత్రి కాలిమీద మరచెంబు పడి రెండు వేళ్ళు చితికి రక్తం వరదలు కట్టి పారింది. ఆ సాయంకాలం ఇంటికి వచ్చి శంకరం ఆ విషయమే విచారించలేదు. పైపెచ్చు ఆమె కుంటుతూండటం చూసి, “ఈ భాగ్యానికేనా కుంటుతున్నావు?” అని అడిగాడు. నన్ను ప్రేమగా చూడు, నన్ను దయగా చూడు! నా మనస్సు నిష్కారణంగా నొప్పించకు, అని ఆడది మొగుణ్ణీ ఎట్లా అడుగుతుంది?”
ఒకప్పడు సంఘ సంస్కరణలో పాల్గొన్న విశ్వనాథం గారు, జానకి భర్తనొదిలేసి వస్తే, “ఈ కాలపు ఆడపిల్లలు ఇలా ఎందుకై పోతున్నారో నాకు బోధ పడదు. వీళ్ళు అతి చిన్న కష్టాలను కూడా కొండంత చేసుకుంటారు. కాస్తయినా సహనం లేదు. అందరూ బతికినట్టు బతకటం నామోషీ అనుకుంటారులాగుంది! బతుకులన్నీ మల్లెపూల పాంపులాగా వుండాలంటే అది సాధ్యమా? కష్టాలుంటే భరించొద్దూ? వెనకటి వాళ్ళిలాగే వుండేవాళ్ళా? మిన్ను విరిగి మీదపడ్డా చలించేవాళ్ళు కారు!”
కుటుంబరావొకచోట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారితో మాట్లాడాక, తన రచనాధోరణి మారిపోయిందన్నాడు. “ఆడవాళ్ళు మాట్లాడుకునేవి వినవోయ్, అసలైన తెలుగు వస్తుంది” అన్నారట శ్రీపాద. మచ్చుకొకటి:
“ఆ ఆడమనిషి ఒక వాక్యం ఆశ్చర్యార్థకంగా మాట్లాడితే, ఇంకోటి ప్రశ్నార్థకంగా మాట్లాడుతుంది — “అదే నయమవుతుంది! నయం కాదూ? డాక్టరు రోజూ వచ్చి చూస్తున్నాడు గదా! చూడడూ మరీ. అద్దె నూరు రూపాయలా? అంతేనమ్మా, చౌకగా కొంపలు దొరకవు!”
5
“The force that through the green fuse drives the flower
Drives my green age; that blasts the roots of trees
Is my destroyer.
And I am dumb to tell the crooked rose
My youth is bent by the same wintry fever.”
— Dylan Thomas
కుటుంబరావు రచనల్లోకెల్లా పేరున్న నవల “చదువు”. కుటుంబ సంబంధాలని, సాంఘిక వాతావరణాన్ని గొప్పగా చిత్రీకరించాడు. “అనుభవం” నవలలో గూడ ఇవే ప్రధానంగా ఉన్నాయి. దీంట్లో ప్రధాన పాత్ర అయిన పార్వతి పుట్టుక నుండి చివరిదాకా సాగుతుంది. తెలుగు సమాజంలో జరిగిన మార్పులు, వాటితో మారిన మారకపోయిన పార్వతి జీవితం కేంద్రంగా, వివాహేతర సంబంధాలు, స్వతంత్రోద్యమంలో ప్రవేశించిన “పెద్ద మనుషులు”, ఉమ్మడి కుటుంబాలు చీలి వేరు పడటం, బిడ్డల పెంపకంలో మార్పులు, తరాల మధ్య జరిగే ఘర్షణ — ఇవన్నీ కళాత్మకంగా కలిపితే “అనుభవం”.
పార్వతి చిన్నతనం నుండీ జీవితం గురించి కాస్త ఆలోచన గలది. కుటుంబరావు చిన్నపిల్లల ఆలోచనలని వర్ణించడంలో సిద్ధహస్తుడు: ” చిన్న పిల్లలకు ఏమీ అర్థం కాదనుకుని పెద్దవాళ్ళు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఎవరో తన తల్లి గురించి మాట్లాడుతూ, “ఆవిడకేం? కుంతీదేవి” అనటం చిన్నతనంలో పార్వతి విన్నది.
నిజానికామాట ఆమెకు అప్పట్లో అర్థం కాలేదు. తరవాత కొంతకాలానికి, కుంతి అయిదుగురు కొడుకులను పెంచి పెద్దచేసిందని విని అందుకే తన తల్లిని వాళ్ళెవరో కుంతితో పోల్చారనుకున్నది. కానీ ఇంకా పెద్దయాక ఒకరోజున అకస్మాత్తుగా మరొక అర్థం స్ఫురించింది. తల్లిని గురించి ఆమె తలలో ఒక అనుమానం తలయెత్తి, రానురాను రూఢి అయింది. అయినా పార్వతి “షాక్” కాలేదు. నిర్వికారంగా వుండిపోయింది.”
పార్వతిని ఓ జమీందారు కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తారు. జమీందారు బస్తీలో ఎవర్నో ఉంచుకుని అక్కడే కాలం గడిపేస్తుంటాడు. కాంతయ్యకి కూడా తండ్రి బుద్ధులబ్బినయ్. కాని నిర్వికారంగా ఉండిపోయింది. ఎవరో బందువుల్లో మొగుడు పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవటం విడ్డూరంగా అనిపించి, ఆలోచిస్తే అదే బాగుందనిపిస్తుంది. “ఆమె చాలా దాంపత్యాలు చూసింది. కాపరానికి వచ్చిన కొత్తలో భార్య మొగుణ్ణి చూసినప్పుడల్లా చెప్పరానిదేదో జ్ఞాపకం వచ్చినట్టు ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతుంది. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక మొగుడు పిలిచినపుడల్లా మొహం రాయల్లే చేసుకుని, ముక్కుతూ, మూలుగుతూ, గొణుగుతూ లేచి వెళ్ళి ‘ఏమిటీ?’ అని దెప్పినట్టుగా అడుగుతుంది.” తనకో కూతురు పుడితే దాన్ని మొగుడు పేరు పెట్టి పిలిచేవాడికే ఇస్తాను అని నిర్ణయించుకుంటుంది.
అన్నల దగ్గరకి పురిటికోసం వచ్చిన పార్వతికి కొడుకు, నారాయణ, పుడతాడు. కాంతయ్య బస్తీలో మకాం వేసి విలాస జీవితం గడుపుతుంటాడు. ఉన్న ఆస్తి అంతా భర్త కాంతయ్య తగలబెడుతున్నాడనీ, కొడుకు జీవితం దుర్భరమవుతుందని పార్వతి కలత చెందుతుంది గాని, కోర్టుకెళ్ళాలంటే భయపడుతుంది. ఆమె తమ్ముడు లాయరు వెంకటేశ్వర్లు ప్రోద్బలంతో దావా వేస్తుంది. కాంతయ్య రాజీ కొస్తాడు; రావలసిన ఆస్తి రాయించుకుని పార్వతి పిల్లవాణ్ణి పెంచుతుంది.
అన్నల ఉమ్మడి కుటుంబం, దంపతులకు వేరే గదులు లేకపోవడం, తన వదినెలకి పరిశుభ్రత తెలియదని, తన కొడుకు అలాంటి వాతావరణంలో పెరగగూడదని వేరే ఇంటికి మారుతుంది. ఈ స్వేచ్చ పార్వతికి ఎంతో సుఖంగా ఆనందంగా గడిచిపోతుంది. తన కొడుకుని తీర్చిదిద్దాలని, వాడి నాన్న, తాతల బుద్ధులు ఎంత మాత్రమూ రాగూడదనీ, వాడి జీవితంలో తనకి చాలా పెద్ద స్థానం ఉండాలనీ ఆవిడ దృక్పథం.
కాని కొడుకు నానా కులాల స్నేహితులని ఇంటికి తీసుకురావడం ఆమెకు నచ్చదు. వాడి గురించి అనవసరమైన భయాలన్నీ పెంచుకునేది. ఇంతలో సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చి, తన తమ్ముడు వెంకటేశ్వర్లు వాళ్ళ మామ నిక్షేపంలాంటి లా ప్రాక్టీసు మానేసి ఉద్యమంలో చేరతాడు. ఆయన వేంకటేశ్వర్లుని మాత్రం ఉద్యమంలోకి అప్పుడే దిగవద్దనీ, కాస్తా “ముందూ వెనకా” చూసుకోమనీ సలహా ఇస్తాడు. ఇది “చదువు” లో సంఘటనని గుర్తు తెప్పిస్తుంది. విచిత్రమైన విషయమేమిటంటే, పార్వతి భర్త కాంతయ్య గూడా ఖద్దరు కట్టి గాంధీ ఉద్యమంలో చేరతాడు.
కోడళ్ళని రంపపుకోతకి గురిచేసే అత్తలనీ, భర్తలు చావగొట్టినా పడి ఉండే భార్యలనూ చూస్తే పార్వతికి ఆశ్చర్యంగా ఉండేది. తన బ్రతుకు అలా కాకపోవడానికి కొంతవరకైనా తనకి ఆస్తిపై ఉన్న అధికారం అని ఆమెకు తోచదు.
పార్వతి భర్త కాంతయ్య చనిపోతాడు. తన అత్తగారిలాగే పార్వతికూడా ముండనం చేయించుకోదు. అందానికి లోటవుతందని కాదు; కొడుకు నారాయణ ప్రాణం విలవిలలాడుతుందని. కాని భర్తకు శాస్త్రోక్తంగా మాసికాలూ, తద్దినాలూ పెడుతూ వస్తుంది.
నారాయణ తల్లిని ద్వేషించకపోయినా, వాడు పెద్దయేకొలదీ కొంత సొంత ఆలోచన పెరిగి, తల్లి చెప్పినవాటిని ఖాతరు చెయ్యడు. తద్దినం నాడు వాడు మస్తుగా కాఫీ హోటల్లో తిని వస్తే, ఏం పనిరా యిదీ అంటే, తద్దినం పెట్టే ఆయన కూడా ఆ కాఫీ హోటల్లోనే తిన్నాడని చెప్తాడు. శ్రాద్ధం! అంటే శ్రద్ధగా పెట్టాలి, ఇంత అశ్రద్ధగా పెట్టకపోతేనేం? అంటుంది. వాడు “పోనీ. మానేద్దాం” అంటే చాచి చెంప పగలగొట్టింది. వాడు తన చెయి దాటిపోతున్నాడని, తను ఇచ్చిన శిక్షణ వృధా అని కుమిలిపోతుంది.
నారాయణకి సావిత్రితో పెళ్ళవుతుంది. వాడు పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవడం, నిన్నటిదాకా తనని అడిగినవన్నీ ఇప్పుడు పెళ్ళాన్ని అడిగి చేయించుకోవడం చూసి, ఇరవై ఏళ్ళ పాటు పెంచి పెద్దచేసిన తన కంటె, ఇరవై నిముషాలన్నా కాకుండా వచ్చిన ఈ బొట్టికాయ తన గద్దె మీద ఎక్కి కూర్చుందని, తనకి అన్యాయం జరిగిందని బాధ పడుతుంది. ఒకప్పుడు అలాంటి దాంపత్య జీవితాన్నే ఆదర్శంగా భావించిన పార్వతి ఆ విషయం మరచిపోతుంది.
వాళ్ళిద్దరూ మద్రాసులో కాపురం పెట్టి, “బుల్లి పార్వతి” పుట్టింతర్వాత, అక్కడకోసారి వెళ్తుంది. తను పిల్లని పెంచే తీరు వాళ్ళకి నచ్చదు. వాళ్ళు మరి అచ్చమాంబ పుస్తకాలు చదివి పెంచే వాళ్ళాయె. తన ఇంటికి తిరిగి వచ్చి “క్రిష్ణా! రామా!” అనుకుంటూ వేదాంతం ఆధారంగా ఆఖరి దశ గడుపుతుంది. చివరకి కొడుకుతో అన్న మాటలు: “నాకు ఒక్కటే విచారం నాయనా! నిన్ను ఎట్లా పెంచాలో చాతకాక దూరం చేసుకున్నా … మన అద్దెకున్న వాళ్ళబ్బాయి – ఆ తల్లీ కొడుకులు ఎంత ప్రేమగా ఉంటారు! వాళ్ళను చూస్తే ముచ్చటేస్తుంది.”
నవల మధ్యలో వున్న ఓ జీవిత సత్యం: “పై తరం వాళ్ళు కింద తరం వాళ్ళను అర్థంచేసుకోవటానికి ప్రయత్నిస్తారు గానీ ఆ ప్రయత్నం ఫలించదు. కిందితరం వాళ్ళు పైతరాలను అర్థం చేసుకునేందుకు చెప్పుకోదగిన ప్రయత్నం చెయ్యరు. అది వాళ్ళకి చాలా అనవసరంగా తోస్తుంది. కాలం ఎప్పుడూ ముందుకే పోవటం అందుకు కారణం కావచ్చు. అయినా చిన్నవాళ్ళు కాలానికి ఎదురీదవలసిన అవసరం ఉన్నది. పార్వతి మనస్సు ఎట్లా పనిచేసేదీ అర్థం చేసుకుని నారాయణ విసుక్కునే వాడేగాని, తను దూరమయాక ఆవిడ జీవితంలొ ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నదో అర్థం చేసుకోలేదు.”
6
“Gloucester: These late eclipses in the sun and moon portend no good to us: though the wisdom of nature can reason it thus and thus, yet nature finds itself scourged by the sequent effects: love cools, friendship falls off, brothers divide: in cities, mutinies; in countries, discord; in palaces, treason; and the bond cracked ‘twixt son and father.Edmund: This is the excellent foppery of the world, that, when we are sick in fortune,–often the surfeit of our own behavior,–we make guilty of our disasters the sun, the moon, and the stars: as if we were villains by necessity; fools by heavenly compulsion; knaves, thieves, and treachers, by spherical predominance; drunkards, liars, and adulterers, by an enforced obedience of planetary influence; and all that we are evil in, by a divine thrusting on: an admirable evasion of whoremaster man, to lay his goatish disposition to the charge of a star!” — In “King Lear”.కుటుంబరావు రచనల్లో దేవుడు, ఆచారాలు, నమ్మకాలు మొదలైనవన్నీ సాంఘిక చిత్రణలో సంభాషణలలో భాగంగా కనిపిస్తాయి. వీటిని ఒకరికి హాని కలిగించనంత వరకు ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని ఊరుకోవడం, కానప్పుడు తీవ్రంగా విమర్శించటం చూస్తాం. “అనుభవం” నవలలో పార్వతి చివరి కాలంలో తమ ఇంట్లో అద్దెకుంటున్న ఆంజనేయులు గారి “వేదాంత” సంభాషణల్లో ఆసక్తి చూపుతుంది. ఆవిడ తమ్ముడు, “ఆయన చెప్పేది వేదాంతమవునో కాదో గాని అది ఒకరికి చెరుపు చేసేది మాత్రం కాదు” అంటాడు.కాని మనుష్యులకంటే ఎక్కువగా దేవుణ్ణే నమ్ముకునే వాళ్ళ గురించి “చిరంజీవి భక్తుడు” అనే గల్పికలో వ్యంగ్యంగా రాశాడు: “భక్తుడికి ఇంకా ధనం కావాలి. ఉద్యోగం కావాలి. రేసులో భక్తుడు కాసిన గుర్రం గెలవాలి. భక్తుడి లాటరీ టికెట్కు మొదటి బహుమతి రావాలి. భక్తుడు తీసిన ప్రతి పిక్చర్ హిట్ కావాలి.
మామూలు మనుషులు మనుష్యులని నమ్ముకుంటారు. భక్తుడు దేవుణ్ణి తప్ప నమ్మలేడు. ఎందుకంటే దేవుడు నీతులు చెప్పడు. దేవుడికి పెట్టే లంచం చట్ట విరుద్ధం కాదు.
దేవుడి సమక్షం లో దొంగతనం బాహాటంగా జరుగుతుంది. దేవాలయం గోడల క్రింద వ్యభిచారం అవిరామంగా కొనసాగుతుంది. దేవుడి విషయంలో మనుష్యుల హెచ్చుతగ్గులు ఖచ్చితంగా పాటించబడతాయి. ఒక్కముక్కలో భక్తుడికి కావాల్సిన జీవితం అంతా దేవుడి చుట్టు ఉన్నది.
భక్తుణ్ణి వీలయినప్పుడల్లా దొంగలు చంపి, డబ్బు లాక్కుని, శవాన్ని ఒకమూలలాగి పారేస్తారు. భక్తులు ప్రయాణించే బస్సులు బోల్తాకొట్టి జననష్టం జరుగుతుంది. దేవుడు దగాచేస్తే భక్తుడికి తీరని ధననష్టం జరుగుతుంది. భక్తుడి కోరికలు తీరవు.
అయినా భక్తుడు చావడు. వాడి వంశం వర్ధిల్లుతుంది. వాడి రక్తం చిందినచోట మరింత భక్తులు పుట్టుకొని వస్తారు.
దేవుడికి జననం లేదు.
భక్తుడికి మరణం లేదు.
“కుటుంబరావు “బెదిరిన మనుషులు”, దానికి sequelగా “బ్రతుకు భయం” అనే నవలలు రెండు రాశాడు. వీటిల్లోని ముఖ్యపాత్ర సీతప్ప లాంటి వాళ్ళు ఉంటారా అని సందేహం కలుగుతుంది. కాని ఇది “సహజ పాత్రే” అని చాలా మంది రచయిత కన్నా తెలివైన వాళ్ళే అన్నారట.
“సీతప్ప ఉత్తరం చూసుకుని సంగతులన్నీ గ్రహించుకున్నాడు. తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాలకి సీతారత్నం ఆడపిల్లను కన్నది. దుష్ట నక్షత్రం కావటం చేత పెద్ద పెట్టున శాంతీ, నవగ్రహపూజా వగైరాలు చేయించాలి. నాలుగైదొందలు ఖర్చుంటుంది. గనక సీతప్ప డబ్బు సేకరించి ఉత్తరం అందిన మూడోనాడు బయలుదేరి రావలెను. ఇంతే సంగతులు.”
నాలుగైదొందలే! ఎక్కడి డబ్బూ హరించి పోతోందిగద!
“అసలే ఆడపిల్ల. ఆపైన చచ్చే శాంతట! ఖర్చులు మనం భరించాలట! యెక్కడైనా కద్దా? ఎవరింట పురుడోసుకుంటే వారు భరించడం సులువు. ఏమంటావు?”
“శాంతికయే ఖర్చు మనవే భరించవలిసుంటుందేవో మరి” అన్నది రావమ్మ అనుమానంగా.
“అసలు నువుండు. వాళ్ళకేం తెలుసే వెర్రిదానా? వొట్టి నాస్తికులు! ఓ దేవుళ్ళేడు, ఓ దైవం లేడు! దీని వైనవంతా శాస్తుల్లుగార్నడిగి తెలుసుకొస్తాను. అలానే ఈ ప్రళయం విషయం కూడా కనుక్కొస్తా” అన్నాడు సీతప్ప. నాస్తికులే పెద్ద శాంతి అవసరమంటుంటే శాస్తుల్లు గారు యాగాలే చెయ్యాలంటాడేవోనని సీతప్పకు లోపల దడగానే ఉంది.
“ప్రళయవేవిటండోయ్!” అన్నది రావమ్మ.
“సారిపోయింది? నువ్వింకా వినలేదూ? నేను రాగానే దాన్ని గురించేగదూ చెప్తా? ప్రళయం వచ్చేస్తోందిట. నవగ్రహకూటం. అంటే తొమ్మిది గ్రహాలున్నూ ఆ పళంగా ఒక్కచోటచేరి ఊరుకుంటాయి. ఇంక అడిగావూ, భూకంపాలేవిటి, అగ్నిపర్వతాలు బద్దలు కావడవేమిటి, పిడుగులు పడిపోడవేవిటి, అంతలేసి మేడలు గభాల్న కూలిపోవడవేవిటి, సర్వనాశనమనుకో! ఒక్క ప్రాణి మిగల్దు! సూరీడు కనిపించట్ట! ఎటో వెళ్ళిపోయి దాక్కుంటాడు. సూర్యచంద్రులు గతులు తప్పడమంటే ఇదేనూ. నవగ్రహకూటవంటే మాటలే. అబ్బో!”
“అయితే మరి మీ ఆఫీసో?” అన్నది రావమ్మ అంతా విని.
“పురఁవేలేదు, అంతఃపురఁవన్నట్టు, ఓ చెంపని ప్రళయం వచ్చేసి సర్వనాశనవై పోతుంటే ఇంకా ఆఫీసేవిటే, వెర్రిదానా?”
“ఈ ప్రళయం ఎప్పుడొస్తుందిటా?”
“ఎప్పుడోనా? పై మాసం నాలుగైదు తేదీల్లోనే. మద్రాసు మీదికి వెయ్యి నిలువుల నీరొచ్చి ఇరవైనాలుఘంటల సేపు తియ్యకుండా ఉండిపోతుందట!”
రావమ్మ ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుని, “యీ ఉపద్రవం తప్పే దారే లేదా?” అని అడిగింది.
“ఎందుకు తప్పదూ? చాలమంది ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నారు. మా ఆఫీసులో సహం మందికి పైగా ముందుగానే సెలవు దరఖాస్తులు పెట్టేశారు. జలప్రళయం తీసిపోయాక వస్తారు. మద్రాసు పట్టణవంతా మళ్ళీ కట్టుకోవాలి!” రావమ్మకు గొప్ప ఆలోచనతట్టింది. “అప్పుడు మనం కూడా ఎక్కడో ఇంత స్థలం కొని ఇల్లుకట్టేస్తాం. అద్దెకింద ఎంత డబ్బూ నాశనవై పోతోంది” అన్నది. “భేషుగ్గా చెప్పావు!” అన్నాడు సీతప్ప.
సీతప్పని చూస్తే మనకు వెన్నెముక లేని మనిషి అనిపిస్తుంది. రావిశాస్త్రి సృష్టించిన “అల్పజీవి” సుబ్బయ్య గుర్తొస్తాడు. కాని రావిశాస్త్రి సుబ్బయ్య అంతరంగాన్ని చైతన్యస్రవంతి పద్ధతిలో వర్ణిస్తే, కుటుంబరావు సీతప్ప దిన చర్యలనీ, సంభాషణలనీ కళ్ళకుకట్టినట్లు చిత్రించాడు. సీతప్ప పిల్లలు పెద్దవాళ్ళయింతర్వాత వ్యక్తిత్వం అనేది పూర్తిగా కోల్పోకముందే బుద్ధి తెచ్చుకొంటారు. కాని సీతప్పకి కనువిప్పు కలిగే మార్గం లేదు. సీతప్ప సజీవ పాత్ర అంటే నమ్మ బుద్ధి గాదు. కాని అతని స్వభావంలోని కొన్ని లక్షణాలు మాత్రం ఇప్పటికీ కొందరిలో కనబడతాయి.
7
కుటుంబరావులో ఉద్రేకం లోపించందనీ, అందువలన ఆయన శైలికి లోపం జరిగిందనీ అంపశయ్య నవీన్ విమర్శించారు: “పాఠకుడికి సాహిత్యంలో కొంత ఉద్రేకం కావాలి. కన్నీళ్ళు కావాలి. లోకంలో జరుగుతున్న అన్యాయాల పట్ల వాళ్ళ హృదయాలు భగ్గున మండిపోవాలి. అప్పుడే సమాజంలోని కుళ్ళును, అన్యాయాన్ని సహించలేని సంస్కారం పాఠకుడికి సాహిత్యం యివ్వగలుగుతుంది. అప్పుడే సాహిత్యం గురజాడ అన్నట్లు “great civilizing medium” అవుతుంది.”అదే నిజమయితే “కన్యాశుల్కం” మనకేమీ సంస్కారం కలిగించలేదనుకోవాలి. దాంట్లో ఉద్రేకాలు తక్కువ, హాస్యం ఎక్కువ. ఆ హాస్యం వెనక అనేక జీవిత విషాద రేఖలు వున్నవి. నిజానికి కుటుంబరావు రచనల్లో గుండెలు పిండేసే సన్నివేశాలు చాలా వున్నాయ్. కాకపోతే అవి కవిత్వంతోటీ, వర్ణనలోతోటీ నిండి ఉండవ్ – ఓ చిన్న సంభాషణలోనో, జీవిత సత్యంలోనో అణిగి ఉంటాయి. ఉదాహరణకి “అనుభవం” నవలనుండి రెండు:”గర్భాదానపు గదిలో కాంతయ్య మొరటుగా ప్రవర్తించలేదు కాని – చాలా అసహ్యంగా ప్రవర్తించాడు… ఆకస్మాత్తుగా పార్వతి అతన్ని, “నన్ను పేరు పెట్టి పిలుస్తారా?” అని అడిగింది.”అదేమిటి?” అన్నాడు కాంతయ్య నిర్ఘాంతపోయి.
“తెలుసుకోవాలని అడిగాను” అన్నది పార్వతి.
“నీ పేరు నాకు తెలుసు – పార్వతి”
“మీ పేరూ నాకు తెలుసు – కాంతయ్య గారు.” ఆ “గారు” చేర్చకపోతే అసలే దడదడలాడుతున్న ఆమె గుండె బద్దలే అయ్యేదనిపించింది. ఆడది మొగుడి దగ్గిర ఒంటరిగా ఉన్నప్పుడుకూడా మొగుడి పేరు అనటానికి గుండె ధైర్యం కావాలి! ”
మరొకటి:
” కొంతమంది ఆడవాళ్ళ లాగా బయటపడేది కాదు గాని, పార్వతికి కూడా కబుర్లు వినటం సరదాగానే ఉండేది. … ఫలానా వారి కోడలు రంకు మరిగింది. పట్టుబడినప్పుడల్లా చావగొట్టేవాళ్ళు. చుట్టుపక్కలవాళ్ళు వినోదంగా చెప్పుకునే వారు.
పార్వతికి ఈ ఏర్పాటు అర్థం కాలేదు. అది మొగుడితో సరిగా ఉండలేకపోతే ఏ మిండగాడితోనైనా ఎందుకు లేచిపోదు? దానికి దెబ్బలు లక్ష్యం లేదని రుజువైనాకా కూడా వదిలేసి ఊరుకోక ఎందుకు చావగొడతారు? ఈ ప్రశ్నలకు సమాధానం పార్వతి ఎరగదుగానీ, అటువంటి సమాధానం లేకపోలేదు. అది మిండగాడితో ఎందుకు లేచిపోదంటే తనకింత పిండాకూడు పెట్టే మిండగాడు లేడుగనక. వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు కొడతారంటే దాని బుద్ధి మార్చటానికి కాదు, తమ పరువు నిలబెట్టుకునేందుకు. ఎందుకు ఇంట్లో నుంచి దాన్ని గెంటెయ్యరంటే, అది ఇంటెడు చాకిరీ గొడ్డులాగా చేస్తుందిగనక!”
అలాగే ఓ చిన్న పిల్ల హృదయం లో జరిగే అంతఃర్మధనాన్ని గూడా మనల్ని కరిగించేలా చెయ్యగలడు. “ఔట్” కథలో శేషు అనే పదమూడేళ్ళ బాల్య వితంతువు హృదయావిష్కరణ చూడండి: “పదమూడేళ్ళ పిల్ల హృదయంలో కూడా ఈ లోకంలో ఏదో ఒక విధమైన న్యాయం వుంటుందనే విశ్వాసం వుంటుంది; ఆ విశ్వాసమే లేకపోతే అంత చిన్న హృదయం కూడా గాలికి బుడగ విచ్చినట్టు విచ్చిపోక తప్పదు. లోకంలో ఉండదగిన న్యాయం ప్రత్యక్షంగా కనిపించకపోతే అంత లేత హృదయమూ, సాలీడు తనకుతానే గూడు అల్లుకున్నట్టుగా, లోకంలో వుండదగిన ఆ న్యాయాన్ని సృష్టించుకుంటుంది. ఒకటే వ్యత్యాసం: సాలీడు తన గూడులో ఎన్నడూ చిక్కుకోదు. మానవ హృదయం తన గూడు విడిచి ఒకంతట పైకి రాలేదు.”
అలాగని నవీన్ గారు అన్నదాంట్లో కొంత నిజం లేకపోలేదు. కాని కుటుంబరావు శైలి ఆయన దృక్పధానికి సరిపడే విధంగా ఉంది: “సమాజంలోని కుళ్ళును దైవికంగానూ, అనివార్యంగానూ చిత్రించి హృదయాలను సంచలింపచేస్తే అందువల్ల సమాజం మారుతుందనేది కల్ల. దుర్భరమైన జీవిత సమస్యలక్రింద నలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కథలు చిత్రించవలసింది వాళ్ళను కాదు, ఆ సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నించేవాళ్ళని.”
బాల్య వితంతువులు, బాల్య వివాహాల వాళ్ళు, ఆడపిల్ల పెళ్ళిళ్ళు చెయ్యలేని వాళ్ళు, కుటుంబాల్లో ప్రేమ లేక నలిగే వాళ్ళు, ఇలా అనేక సాంఘిక సమస్యలని చిత్రించటంలో కుటుంబరావు వీటిని అధిగమించేవాళ్ళ గురించీ, జీవితంలో ఆశ కలిగించేవాళ్ళ గురించీ రాశాడు. ఇందుకు కొన్ని ఉదాహరణలు:
“ఆడబ్రతుకే మధురం!” అనే కథ ఓ చిన్న అమ్మాయి స్వగతం. ఇలా మొదలవుతుంది:
తాతయ్య అమ్మమ్మని ఇప్పటికీ కొడతాడు. నాన్న అమ్మని కొడతాడు. అక్కయ్యని బావ కొడతాడు. మొగవాళ్ళు ఆడాళ్ళని కొడతారు తిడతారు కూడానూ.
“ఆడబ్రతుకే మధురం” అని రేడియో పాడుతున్నది. .. ” ఆడబ్రతుకులో వున్న కష్టాలన్నీ ఈపిల్ల నెమరు వేస్తుంటుంది. కిష్టమూర్తి గారి కుటుంబాన్ని మిగిలిన వాళ్ళలాగా కాక చెడిపోయినట్లుగా భావిస్తుంది – ఎందుకంటే ఆయన వాళ్ళావిణ్ణి కొట్టడు. ఆవిడ చదువుకుంది. బాగుంటుందికాని చెడిపోయే ఉంటుంది. రేడియోలో పాట వస్తూనే ఉంటుంది. కథ ఇలా ముగుస్తుంది:
నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయ, ఎవరు పడతారమ్మా దెబ్బలూ, తిట్లూనూ? పెద్దదాన్నయితే ఎవరికీ తెలీకుండా కిష్టమూర్తిగార్ని చేసుకుంటాను! …
“ఆడబ్రతుకే మధురం!” అనే పాట పాడటం మానేసింది రేడియో. ”
“చెడిపోయిన మనిషి” అనే కథలో పట్టుదల కల పార్వతీశానికి వున్న పెళ్ళికాని కూతురు వర్థని. కట్నమివ్వగూడదనే పట్టుదలతో కొంత, ఇవ్వలేక మరికొంతా, వర్థనికి పెళ్ళి సంబంధాలు రావు. పెళ్ళికోసం హైరానా పడక చదివించమని అడిగి, చదివి ఓ పంతులమ్మ ఉద్యోగం సంపాదిస్తుంది, తండ్రిని గూడా పోషిస్తుంది. నిశ్చింతగా కాలం గడుస్తుంటే, ఒకరోజు స్నేహితుడొకడు పార్వతీశం పరువు మర్యాదల గురించి విచారం వెల్లబరుస్తాడు. మర్నాడే వర్థని చాలా పొద్దుపోయి ఇంటికి వస్తుంది. ఎవరో దిగబెట్టారని గ్రహించిన పార్వతీశం గొడవ చేస్తాడు. తన జీవితం, తన ఇష్టమన్నట్టు మాట్లాడుతుంది వర్థని.
కోపమొచ్చి పార్వతీశం ఇల్లొదిలి, మద్రాసు వెళ్ళే రైలెక్కుతాడు. తిండిలేక దాదాపు చనిపోయే స్థితిలో ఓ డాక్టరు ఆదుకుని ఇంటికి తీసుకెళ్ళుతుంది. ఆవిడ సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నా, ఆవిడ మరొకరితో తన కూతురిలాగే చేస్తున్న స్నేహాన్ని హర్షించడు. ఆమెతో తన సమస్య చెప్పుకుంటాడు:
“కాని, మనిషికి కొన్ని కట్టుబాట్లుండవద్దా? ఒకరుచేసిన పనే అందరూ చేస్తే ఏమవుతుంది? మనిషి ప్రవర్తనను నిర్ణయించే గీటురాయి అది కాదా?” అన్నాడు పార్వతీశం.
“ఎవరన్నారామాట? అందరూ డాక్టర్లయితే ఏమవుతుందని నేననుకోలేదు. అందరూ టీచర్లయితే ఏమవుతుందని మీ అమ్మాయి అనుకోలేదు బహుశా. మగవాడు ప్రభాకర్ లాగా బ్రహ్మచారిగా ఉండిపోతే సంఘానికెంత నష్టమో, నాబోటిదీ, మీ అమ్మాయి బోటిదీ పెళ్ళి కాకుండా ఉండిపోతే అంతే నష్టం. ఒకప్పుడెప్పుడో ప్రిమిటివ్ కమ్యూనిటీలలో అందరికీ ఒకే నియమాలుండేవిట. ఈనాడు మనమింకా అదే మనస్తత్వంతో జీవించడం చాలా హాస్యాస్పదం. మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ, సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేటట్టు చూసుకోవడమే సరి అయిన ప్రవర్తన. మిగిలిన బూటకపు నీతినియమాలను నమ్మకండి” అన్నది డాక్టరు.
ఆ మధ్యాహ్నం జనతాలో పార్వతీశం తిరుగు ప్రయాణమైనప్పుడు ఆయన గొంతులో గరళం ఉండివున్న లక్షణాలేవీ లేవు.
8
Hippolyta: This is the silliest stuff that ever I heard.
Theseus: The best in this kind are but shadows; and the worst are no worse if imagination amend them.
— In “A Midsummer Night’s Dream”
Auden అంటాడు: “I find Shakespeare particularly appealing in his attitude towards his work. There’s something a little irritating in the determination of the very greatest artists, like Dante, Joyce, Milton, to create masterpieces and to think themselves important. To be able to devote one’s life to art without forgetting that art is frivolous is a tremendous achievement of personal character. Shakespeare never takes himself too seriously.”జీవితంలో చివరి క్షణం వరకూ సాహితీకృషిలో నిమగ్నమైనా కుటుంబరావు సాహిత్యమే జీవిత పరమార్థంగా భావించలేదు: ” మానవ జీవితంలో అనేక విషయాలకు అనేకరకాల ప్రాముఖ్యత ఉంది. అటువంటి వాటిల్లో సాహిత్యం ఒకటి. … సాహిత్యానికి పరిమితమైన ప్రాముఖ్యత ఉందని గుర్తించిన మీదట, దానివల్ల సాధించగలిగిన ప్రయోజనమేమిటో తేల్చుకుని, ఆ తరువాత … నిజమైన సాహిత్య లక్షణాన్ని అందరూ గుర్తించి తీరాలి. దానికి చిరత్వం లేదు. … సాహిత్యం వల్ల తాత్కాలిక ప్రయోజనం విశేషంగా ఉండటమే కాక అది త్వరగా అయిపోతే అంత మంచిది.””నాకు ఒకటే ఆశయం — నా రచనలవల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండితీరాలి, వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనలమీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపకారం చేసిన వాణ్ణవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది. నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు.”
వితంతు వివాహాలు జరుగుతున్నాయి, బాల్య వివాహాలు ఆగిపోయాయి, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కుటుంబరావు రచనలు మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏమిటి?
స్త్రీ పురుషుల మధ్య, వివిధ వర్గాల మధ్య, తరాల మధ్య, మనుషుల మధ్య ఇంకా ఎన్నో గోడలున్నాయి. వీటికి మూలం మన కర్మలోనో, మానవుడికి అతీతమైన మరో శక్తిలోనో వున్నాయనే నమ్మకాలున్నాయి. అవి వున్నంతకాలమూ కుటుంబరావు రచనలకి ప్రయోజనం ఉంది. ఆ గోడలు కూలినపుడు, వాటితోపాటు ఆయన రచనలూ కాలగర్భంలో కలిసిపోతాయి. అప్పుడు కుటుంబరావు కన్నా ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు.
తెలుగు వాళ్ళ ఆలోచననే హత్య చేశాడని కుటుంబరావుని దోషిగా బోనులో నిలబెట్టారు. తీర్పు చెప్పాల్సింది పాఠకులు. ముద్దాయి ఎవరి దయా దాక్షిణ్యాలు కోరే వ్యక్తి కాదు. తీర్పు ఇచ్చేముందర, అతను పాఠకులని కోరేది ఒక్కటే – ఆలోచించమని.
పనికొచ్చిన పుస్తకాలు:
1. కుటుంబరావు సాహిత్యం, సంపుటాలు 2-6.
2. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యవ్యాసాలు.
3. నవీన్ సాహిత్యవ్యాసాలు.