ఫహెశ్! సాదత్ హసన్ మంటో రచనాజీవితాన్ని వెంటాడి, వేటాడిన ఒకే ఒక్క పదం. అర్థం: అశ్లీలం. అసభ్యం, కుసంస్కారం, మతానికి వ్యతిరేకం లాంటి పదాలకి తెరతీసే పదం. మంటో ఆ ఒక్క పదం కారణాన ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. తన రచనలను తానే సమర్థించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇంతకీ అతని నేరమేమిటి? తనచుట్టూ ఉన్న సమాజాన్ని ఏ కోణం నుంచి, ఏ దృష్టి నుంచి చూశాడో అదే దృష్టిని, అదే కోణాన్ని ఎక్కడా రాజీపడకుండా తన కథల్లో ప్రదర్శించాడు. ఒక రచయితకు తన పట్ల, సాహిత్యం పట్ల ఉండవలసిన నిజాయితీకి, నిబద్ధతకు మంటో నిలువెత్తు దర్పణం. మంటో చనిపోయే అరవై యేళ్ళు దాటింది. కాని, అప్పటికంటే ఇప్పుడు మంటో వంటి రచయితల అవసరం మరింతగా ఉంది. కారణం? ఈనాటికీ ఏ ప్రయోజనాలను ఉద్దేశించి రచయిత కథను మలిచాడోనన్న కనీసపు అవగాహన కూడా ఏర్పరచుకోకుండా, రచనల్లోంచి ఒకటి రెండు పదాలనో వాక్యాలనో విడదీసి తమ అభద్రతల భూతద్దంలో అవసరాల నేపథ్యంలో వాటిని చూస్తూ, చూపిస్తూ ‘ఇది అపచారం, అది మా మనోభావాలకు గాయం!’ అని విరుచుకుపడుతున్నవారు ఎక్కువైపోతున్న ఈనాటి మన సమాజం. మంటోని కేవలం కోర్టుకి ఈడ్చడంతో సరిపెట్టుకున్నారు అప్పటి సమాజోద్ధారకులు, ధర్మరక్షకులు. ఇప్పటివారిలా దాడులకు, బెదిరింపులకు, అసభ్యప్రచారాలకూ పాల్పడలేదు. రచయితలను భయపెట్టి అజ్ఞాతవాసంలోకి నెట్టేయలేదు. ఇది మనం సాధించిన ప్రగతి. ఇది సాహిత్యం, సమాజం వంటి వాటిపై మన దృక్కోణం ఏదైనా కాని, అందరమూ తలదించుకోవల్సిన పరిస్థితి.
సాహిత్యచక్షువు చూడలేనిది చూడకూడనిది ఏదీ లేదు. రచయిత కంటికి నిబంధనలు, అతని కలానికి నిర్బంధనలు ముమ్మాటికీ సమాజానికి చెరుపు మాత్రమే చేస్తాయి అన్న స్పృహ ఇప్పటికైనా రాకపోతే మనదేశపు స్వచ్ఛత మేడిపండుగా స్వేచ్ఛ మిథ్యగానే మిగిలిపోతాయి. అలా మిగిలిపోకూడదు అంటే అశ్లీలం, అనైతికం అని ముద్రవేయబడ్డ ఆ సాహిత్యాన్ని మనం మరింతగా చదవాలి. సాహిత్యంలో అశ్లీలత ఏమిటి? మనోభావాలు ఎందుకు గాయపడాలి? సాహిత్యం కొన్ని అంశాలు స్పృశించకూడదనే నియమాలు ఎందుకు, ఎవరికోసం? వంటివి మరింతగా చర్చించాలి. మంటోనే స్వయంగా అన్నట్టు రచయిత సమాజపు నల్లపలక మీద తెల్లగీత గీస్తాడు ఎందుకంటే ఆ నలుపు మరింతగా కొట్టవచ్చేలా మన అందరికీ కనిపించడానికి. సమాజంలో నలుపు చూపడం అశ్లీలమా? మంటో నిజంగానే అశ్లీలపు కథలు రాశాడా? తెలుసుకోవడం కోసం, మంటో ప్రపంచాన్ని తెలుగువారికి తెలియజేయడం కోసం, పూర్ణిమ తమ్మిరెడ్డి ఈ సంచికనుండీ మంటో కథలు ఉర్దూ మూలం నుండి నేరుగా, విధేయతతో తెలుగులోకి అనువాదం చేసి అందిస్తున్నారు. వారి శ్రమకి కృతజ్ఞతలు. మొదటగా ఈ శీర్షికలో మంటో వివాదాస్పద కథ కాలీ సల్వార్, కథా సంబంధిత వ్యాసం సఫేద్ ఝూట్ ప్రచురిస్తున్నాం.