వాన

వుధృతంగా
వాన
కురుస్తున్న చప్పుడు

గాయపడ్డ పక్షి రెక్కల్లా
కిటికీ తలుపులు
కొట్టుకుంటున్నాయి.

ఆగి ఆగి నీటి జల్లు
ముఖాన్ని
ఆదుర్దాగా తడుముతూ
ముద్దు పెట్టుకుంటుంది.

ఎడ తెరపి లేకుండా
తల్లడిల్లుతున్న
కిటికీని
సముదాయిద్దామని పోయిన

బయట ఒక్క చినుకు లేదు!
నిశ్చలంగా తలుపులు.
మౌనంగా తలూపుతున్న పరదాలు.

ఇంకా వుధృతమౌతున్న
వాన చప్పుడు.

లోలోపల …
సగం కాలిపోయిన
ఇళ్ళ మొండిగోడల మధ్య

వొక్క నీటి చుక్కకోసం
యేళ్ళనుండీ
నోరు తెరచిన బీళ్ళ మధ్య

అసంఖ్యాక సుపరిచిత కంఠస్వరాలు
సజీవులవీ, అమరులవీ

ఒక్కోసారి అనేకంగా
పలుమార్లు ఒక్కటిగా
నిరంతరంగా వర్షిస్తున్న ప్రతిధ్వని.

వేన వేల జెండాలు రెపరెప లాడుతున్న హోరు.

గాయపడి తిరిగిలేచిన
పక్షి రెక్కల్లా
నా కనురెప్పలు కొట్టుకుంటున్న
చప్పుడు
మరింత వుధృతంగా
వినబడుతోంది.