ప్రద్యుమ్నుడు భ్రుకుటి ముడిచాడు. తెరిచాడు. దీర్ఘంగా నిశ్వసించాడు. తల పంకించాడు. ఒక్క కనుబొమనే ఎగురవేద్దామని ప్రయత్నించి మానుకున్నాడు. ఫలితము గురించి ఆలోచించకుము, కార్యసన్నద్ధుడివి కమ్ము అని ఘంటసాల భగవద్గీత శ్లోకం ఏదో పాడుకుందామని, గుర్తు రాక తన గొంతు తనకు తెలుసు కనుక మానేశాడు.
“ఏమిటా పిచ్చివేషాలు, ఒంటరిగా మీలో మీరే అలా సోఫాలో కూర్చుని గాల్లోకి చూస్తూ, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?” అని చీవాట్లు పెట్టడానికి ప్రభావతి ఇంట్లో లేదు. అది ఒక కారణం. మధ్యాహ్నం ఏం తినాలి, ఎలా? ఆ ముఖవిన్యాసాలకు అది అసలు కారణం.
ఈ వేళ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి సాన పెడదామన్న ఆలోచన ప్రద్యుమ్నుడిని కుదురుగా ఉండనీయడంలేదు. నాలుగు బ్రెడ్ ముక్కలకి రెండు వైపులా అంత జామ్ పూసి, ఒక బీరు మగ్గులో కాఫీ నింపుకుని, తింటూ, తాగుతూ ఆలోచించాడు, చేద్దామా, వద్దా? చేస్తే ఏ కూర చేద్దామా? అని.
చివరికి కృతనిశ్చయుండై, ఆత్మవిశ్వాసం ఇబ్బడించి, తినటం, తాగటం పూర్తి చేసి వంటింట్లోకి వెళ్ళాడు. ఫ్రిజ్‌లో కూరలు సమృద్ధిగానే ఉన్నాయి. పెద్ద నిమ్మకాయలని చూసి, నిమ్మకాయ పప్పు చేద్దామని అనుకున్నాడు. గుండ్రంగా ముచ్చటగా ఉన్న కాబేజీని, తురిమిపెట్టిన కొబ్బరి కోరుని చూసి ఆహా అనుకున్నాడు. కాబేజీ కొబ్బరి కూర చెయ్యడం తేలికే గదా అనుకున్నాడు. లుంగీ పైకి కట్టి, కాబేజీని బైటికి లాగి పీట మీద పెట్టి, ఇష్ట దేవతాప్రార్థన చేసి కత్తితో అడ్డంగా కోశాడు. ఇంతలో సెల్‌ఫోన్ మోగింది.
‘హే కృష్ణా ముకుందా మురారీ, హే కృష్ణా ముకు…’ ప్రభావతి నుంచి. ప్రద్యుమ్నుడు మౌనంగా ఫోనెత్తాడు.
“ఏం చేస్తున్నారు?”
“లుంగీ మడిచి కేబేజీకి, కొబ్బరి కోరుకి, నిమ్మకాయలకి కాలం చెల్లబెట్టే ప్రక్రియలో ఉన్నాను.”
“వద్దు వద్దు! మీకో పెద్ద దణ్ణం. ఈ వేళ పనిమనిషి రాలేదు. రేపు కూడా రానంది. గిన్నెలు మాడ్చినా, మసి పట్టించినా, కేబేజీ బొగ్గు మూకుడుకి అంటించినా తోమటానికి, కడగటానికి, పారేయడానికి నాకు ఓపిక లేదు. మీరు వంట చేయవద్దు. ముందు ఆ లుంగీ దించండి. ఆనక పోయి హోటల్‌లో తినేసి రండి.”
“ఇదేనా నీ తుది నిర్ణయం? గిన్నెలు నేనే తళతళా మెరిసేటట్టు తోముతానని త్రికరణ శుద్ధిగా వాగ్దానం చేస్తున్నాను.”
“మీ వాగ్దానాల మీద నమ్మకం లేదు. పదేళ్ళ క్రితం కాసులపేరు చేయిస్తానన్నారు. రెండేళ్ళ క్రితం కొంటానన్న పట్టు చీరకే ఇప్పటిదాకా డబ్బులు లేకపోయాయి మీకు.”
“నీకు పాతివ్రత్య లక్షణాలు లోపిస్తున్నాయని నా విశ్వాసం.”
“మరేం ఫరవాలేదు!. మీరు వంటగది లోంచి ముందు బయటకు నడవండి. అక్కడ కంగాళీ పనులేమీ చేయకండి.” ఘట్టిగానే చెప్పింది ప్రభావతి.
చేసేదేమీ లేక భార్యాజ్ఞాబద్ధుడై వంట కార్యక్రమం విరమించుకున్నాడు ప్రద్యుమ్నుడు. బీరుమగ్గులో ఇంకో కాఫీ నింపుకుని వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు.
ఆ రోజు ఉదయం ప్రభావతి వీసా కోసం అమెరికన్ కాన్సల్ ఆఫీసుకి వెళ్ళింది. ప్రభావతి అమెరికా వెళ్ళటంలేదు. వాళ్ళ అమ్మాయి, పిల్లలు వెళతారు వీసా దొరికితే. వాళ్ళకి సహాయంగా ప్రభావతి వెళ్ళింది. ప్రద్యుమ్నుడిని రమ్మన్నారు. ఆయన వెళ్ళలేదు.
“పొద్దున్నే పోయి ఎండలో నిలబడి విటమిన్ డి నేను పెంచుకోనక్కర్లేదు. ఒంట్లో మెలనిన్ ఇప్పటికే సమృద్ధిగా ఉంది. ఇంకా ఎక్కువ నాకక్కర్లేదు. ఆఫీసు చుట్టుపక్కల ఉన్న హోటళ్ళలో కూచుని టీ, కాఫీలు తాగుతూ నా కాయంలో గాస్ కర్మాగారానికి ప్రారంభోత్సవం కూడా చెయ్యదలుచుకోలేదు.” అని ఉద్ఘాటించాడు.
ఈ విషయం వాళ్ళ అమ్మాయికి వయా వాళ్ళ ఆవిడ తెలిసింది. అమ్మాయి నిరసన వ్యక్తంచేసింది, ప్రభావతి అసమ్మతి వ్యక్తంచేసింది. పిల్లలు ఏమీ వ్యక్తంచేయలేదు. అయినా ఆయన స్థితప్రజ్ఞుడిలాగా చిరునవ్వు చిందిస్తూ కూర్చున్నాడు. అందుకని శ్రీమతి ప్రభావతి వెళ్ళింది ఉదయం ఎనిమిదిన్నరకి. ప్రద్యుమ్నుడుగారి ధర్మపత్ని అధర్మంగా అసమ్మతి ప్రకటిస్తే ఏమౌతుందో ప్రద్యుమ్నుడు ముందే ఊహించాడు. భోజనం వండబడలేదు. టిఫిను కూడా చేయబడలేదు.
వాళ్ళు హోటల్లో టిఫిను తిని కాన్సల్ ఆఫీసుకెళతారు. పని అయిన తరువాత మధ్యాహ్న విందు కోసం వారి బంధువుల ఇంటికి వెళతారు. ఇది కూడా ఒక కారణం (నిజానికి ముఖ్య) ప్రద్యుమ్నుడు వెళ్ళకపోవడానికి. వారి బంధువులు అంటే బాగా దూరపు బంధువులే. ప్రకాశనగర్లో ఉంటారు. ఈ మధ్యనే దగ్గర బంధువులు అయ్యారు. ఆ బంధువు ఆ మధ్యన హాస్పిటల్‌లో చేరాల్సివచ్చింది. ప్రద్యుమ్నుడు ఆ హాస్పిటల్ దగ్గర్లోనే కాపురం ఉంటాడని విషయం తెలిసిన ఆ బంధువులు ప్రద్యుమ్నుడి ఇంటికి వచ్చి ప్రభావతి వండిన భోజనం చేసివెళ్ళారు. వెళుతూ వెళుతూ ప్రద్యుమ్న దంపతులను కూడా తమవెంట హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. అప్పుడు మాటలు పెరిగి బంధుత్వం ఇనుమడించి ఆనందోత్సాహాలతో ప్రభావతి తన ఔదార్యాన్ని ప్రకటించింది. తన గొప్పతనాన్ని విప్పి చూపించింది. పర్వవసానంగా ప్రద్యుమ్నుడు మూడురోజులు వాళ్ళకి తమ ఇంటి నుంచి భోజనం తీసుకెళ్ళవలసివచ్చింది. నిన్న వాళ్ళకి వీసా విషయం తెలిసి, ఖూన్ కా బదలా ఖూన్! అన్నారు. హాస్పిటల్‌లో మీరు భోజనం పంపితే అమెరికన్ ఆఫీసులో పనికి మా ఇంట్లో మీకు మేం భోజనం పెడతాము, అన్నారు. కాదు అన్నా వినిపించుకోలేదు. మా ఔదార్యాన్ని మీరు చవిచూడాల్సిందేనని భీష్మించారు. మా గొప్పతనం తక్కువ కాదని మీరు తెలుసుకోవాలి! అని శపథం పట్టారు. అందుకని వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావాలని ఉన్నతాధికారి నిర్ణయించింది.
మామూలుగా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళడానికి ప్రద్యుమ్నుడు ఉత్సాహం చూపిస్తాడు. కొత్త రుచులు చవిచూడవచ్చని ఆయన సరదా. కానీ ఇప్పుడు ఈ భోజనాహ్వానంలో ఇంకో ఖూన్ కా బదలా ఖూన్ వ్యవహారం నిగూఢంగా ఉంది. హాస్పిటల్‌లో భోజన త్రిదినోత్సవంలో ప్రభావతి ఒక రోజున పనసపొట్టు ఆవ పెట్టిన కూర వండిపెట్టింది. తిని దగ్గరైన దూరపు బంధువులు పరమానందభరితులైనారు. అమందానంద కందళిత హృదయారవిందులయ్యారు.
ఒక ముళ్ళ కూరగాయలో ఇంత రుచి ఉందా!? అని ఆశ్చర్యచకితులైనారు. పనసపండు అనగా పనస తొనలే అనుకున్నాము కానీ కూర ఇంత బాగుంటుందని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు! అని త్రికరణ శుద్ధిగా వాకృచ్చారు. ఇటువంటి కూరను పరిచయం చేసిన మీ ఋణం తీర్చుకోలేము, అని మామూలుగా అన్నారు. కానీ ఋణగ్రస్తులుగా మిగిలి పోలేము, అని సాలోచనగా అన్నారు. మీకొక కొత్త కూర రుచి చూపించి తీరతాము! అని నిక్కచ్చిగా అన్నారు.
ఈ విషయం విని ప్రద్యుమ్నుడు చింతాక్రాంతుడయ్యాడు. దగ్గరైన దూరపు బంధువు భార్య వంటల మీద రిసర్చ్ చేస్తోంది. ‘దేశ విదేశాలలో వంకాయతో చేసే వంటకాలు, రుచులలో బేధాలు’ అనే విషయంపై ఆవిడ పరిశోధనలు చేస్తోంది. ఆమె ముగ్గురు పుత్రులు మూడు దేశాల్లో ఉన్నందున ఈ విషయంలో ఆమెకి అనుభవం ఉందని ప్రకటించుకుంది. ఆమె పరిశోధనా పత్రాలు ఒకటి రెండు వారపత్రికలలో ప్రచురించబడ్డాయి. అప్పటినుంచి ఆమె చెలరేగి పరిశోధిస్తోందని భోగట్టా. ఇటాలియన్ అమెరికన్లు చేసుకునే వంకాయ కూరకి బ్రెజిల్ రుచులు కలగలిపి ఆమె తయారు చేసిన వంటకం రుచి చూపిస్తానని ప్రతిజ్ఞ చేసింది. ప్రద్యుమ్నుడు భయపడి వెనకడుగు వేసినా వారి ధర్మపత్ని, కుమార్తె ధైర్యసాహసాలు ప్రకటించారు. కుమార్తె ఇంకో అడుగు ముందుకువేసింది.
“మా నాన్న చేసిన బంగాళా దుంపల వేపుడు తిన్న తరువాత ఏ కూరైనా తినడం మాకు కష్టం కాదు!” అని హేళనగానే వక్కాణించింది. ఆ కూర ప్రద్యుమ్నుడు చేసిన మొట్టమొదటి వంటకం.
ప్రద్యుమ్నుడికి వంటచేయడం హాబీ కాదు. తినడమే కానీ వంట చేయడం రాదని సగర్వంగానే చెప్పుకుంటాడు. భార్య ఎప్పుడైనా, చాలా అరుదుగానైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వంట చేసుకునే వాడు కాదు. ఆ పది పదిహేను రోజులు బ్రహ్మచారుల మెస్సులోనే నేపాలీ వంట తినేసేవాడు. జోర్హాట్‌లో ఆ కాలంలో వంటమనిషి దొరికేవాడుకాదు. అందుకని ఇన్‌స్టిట్యూట్ కేంటీనులో ఒక నేపాలీ వాడిని కుదుర్చుకున్నారు. చేరినప్పుడు ఆ నేపాలి యోధుడు టీ పెట్టి, కాఫీ అని అడిగినవారికి కూడా అదే ఇచ్చి, డబ్బులు ఇంకో అర్ధరూపాయ ఎక్కువ వసూలు చేసేవాడు. మెల్లిగా కష్టపడి ఒక ఏడాదిలో కాఫీ, టీలు విడివిడిగా పెట్టడం, సమోసాలు చేయడం లాంటివి నేర్చుకున్నాడు. ఇంకో ఆర్నెల్లు గడిచిన తరువాత బ్రహ్మచారోద్ధరణ కోసం ఒక మెస్సు పెట్టాడు. ఏళ్ళు గడిచినా వాడికి వంటలో మెలుకువలు బోధపడలేదు. డబ్బు సంపాదించడం మాత్రం సులువుగానే అలవాటయింది. పెళ్ళికాక ముందు ప్రద్యుమ్నుడు కూడా ఆ మెస్సులోనే భోజనం చేసేవాడు.
మరి ప్రద్యుమ్నుడు వంట ఎందుకు చేసేడు అంటే అదో విషాద గాథ అని భార్యా పిల్లలు అంటుంటారు. అనుకోవడమే కాదు కథలుకథలుగా బంధు మిత్రులకు చెప్తుంటారు కూడాను. ఆ కథా కాలానికి ప్రద్యుమ్నుడు గృహస్తుగా పదిహేను ఏళ్ళ అనుభవం సంపాదించాడు. పెద్దపిల్లాడికి పదమూడు, చిన్నదానికి ఎనిమిది ఏళ్ళు వచ్చేశాయి కూడా. ఒకరోజు పిల్లలను స్కూలుకు, మొగమహారాజును ఆఫీసుకు పంపించి, పనిమనిషి చేత ఇల్లు తుడిపిస్తూ మేడమెట్లు దిగుతూ ఆరవ మెట్టు మీద నుంచి జారిపడి కుడికాలు తొడ, మోకాలి కింద, రెండు ఎముకలు విరగకొట్టుకుంది ప్రభావతి. ఆ కాలంలో జోర్హాట్‌లో వైద్య సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంవల్ల కబురు తెలిసి వెంటనే ఇంటికి వచ్చిన ప్రద్యుమ్నుడు ఆవిడను గవర్నమెంటు హాస్పిటలుకే తీసుకువెళ్ళాడు. అక్కడ ఎముకల డాక్టరుగారు ఉత్సాహంగా కాలు మొత్తం అంతా, ఒక్క పాదం తప్పించి, కట్టు గట్టి, దాని మీద సంతకం పెట్టి, తేదీ వేసి, గుప్పెడు మందులు ఇచ్చి, మరో సంచీడు మందులు కొనుక్కోమని రాసి ఇచ్చి –
“ఒకే ప్రయత్నంలో పైన, కింద కూడా ఇంత క్లిష్టంగా కాలు విరగకొట్టుకొన్న వారిని చూడడం ఇదే ప్రథమం. ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు మీకు ధన్యవాదాలు!” అని ప్రభావతితో చెప్పి మురిసిపోయాడు.
“నాలుగు నెలల తర్వాత తీసుకువస్తే ఎక్స్-రే తీసి, కట్టు విప్పేది ఎప్పుడో చెబుతాను,” అని విజయ దరహాసం చేసేడు పెద్ద డాక్టరుగారు. చిన్న డాక్టరుగారు, నర్సమ్మ, ఆయా కూడా ఆంబులెన్స్ దాకా వచ్చి టాటా చెప్పి, గెట్ వెల్ సూన్ అని ఆశీర్వదించి మరీ వెళ్ళారు.
ఇంటికి తిరిగి వచ్చిన తరువాత హంసతూలికాతల్పం లేకపోయినా, ఫోం బెడ్ మంచం మీద అలానే రెండు దిండ్లు తలకింద పెట్టుకొని, విష్ణుమూర్తి పోజులో ప్రభావతి స్థిరపడింది.
“కనీసం నాలుగు నెలలు ఇలాగే ఉంటాను. నేను తిరిగి లేచేదాకా ఈ సంసార బాధ్యత మీదే!” అని అంపకాలు చేసింది.
“పదిహేను ఏళ్ళగా గొడ్డుచాకిరీ చేస్తున్నాను. ఈ విధంగానైనా నాకు నాలుగైదు నెలలు విశ్రాంతి కలిగించిన ఆ దేవదేవుడికి శత వందనాలు అర్పించుకుంటున్నాను.” అని ఎదురుగుండా ఉన్న గోడమీద కేలండరులోని వేంకటేశ్వరస్వామికి వినమ్రంగా నమస్కరించింది.
పాపం ప్రద్యుమ్నుడికి కష్టకాలం వచ్చింది. పనిమనిషిని బతిమాలుకొని మూడు నాలుగు రోజులు పది గంటలకి వచ్చి వంట చేయడానికి ఒప్పించాడు. ఆ నాలుగు రోజులూ నాలుగు కిమీ దూరంలో ఉన్న ధాబా నుంచి సాయంకాలం రొట్టెలు, కూర తెచ్చుకుందాం అని నిర్ణయించుకున్నాడు. పిల్లలని స్కూలుకి వెళ్ళేటప్పుడు, బ్రెడ్ జామ్-బటర్, బిస్కెట్స్, కార్న్‌ఫ్లేక్స్, నూడుల్స్ వగైరాలతో సరిపెట్టుకోవాలని ఒప్పించాడు. నాలుగు రోజుల్లో ఒక వంటమనిషిని కుదురుస్తానని హామీ కూడా ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు, నాలుగు రోజులు తిరిగినా వంట మనిషి దొరకలేదు. అందుచేత పాపం ప్రద్యుమ్నుడికి వంట చెయ్యక తప్పింది కాదు.