నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు

దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, స్థానికంగా ఊరూరా అభివృద్ధి చెందిన సంఘాలు, సాహితీ సదస్సులు జరపడం మనం చూస్తున్నాం. గత ఇరవై సంవత్సరాలుగా, ఈ సదస్సులనబడే కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలు పంచుకోవడం జరుగుతూ ఉన్నది. నా అభిప్రాయాలు నా అనుభవాల సారాంశం అని వేరే మనవి చెయ్యనక్కరలేదనుకొంటాను. దేశవ్యాప్త సంస్థలు పెద్దయెత్తున జరిపే తిరణాళ్ళ లాంటి సంబరాలకి అనుబంధంగా, (appendix గా అన్నా తప్పులేదనుకుంటాను) సాహితీసదస్సులను జరుపుతున్నాయి. ఒకరో ఇద్దరో కవులనో, కథకులనో తెలుగు నాడు నుంచి ఈ సంబరాల పేరున ఆహ్వానించడం, వారిచ్చే ఉపన్యాసాలు (లేదా ఉద్బోధనలు!) వినిపించడం ఆనవాయితీ అయ్యింది. ఈ ఉపన్యాసాలకి సాధారణంగా శ్రోతలు ఎవరు? సదస్సులో పాల్గొని, తమ స్వీయ రచనలు వినిపిద్దామనే ఆశతో వచ్చిన స్థానిక తెలుగు-అమెరికన్ రచయితలు. చాలాసార్లు ఈ రచయితలందరూ, వారికిచ్చిన కొద్ది నిముషాల్లో వాళ్ళ రచనలని వినిపించడం, ఆఖరి రచయితకి సదస్సు నిర్వహించే వాళ్ళు మాత్రవే శ్రోతలు కావడం, ఆ రచయితల బంధువులు ప్రేక్షకులు కావడం మామూలు! ఇది సాధారణంగా అన్ని సాహితీ సదస్సులకీ template అయిందనడం అతిశయోక్తి కాదు.

ఈ రకమైన సదస్సుల వలన మనం ఏవిటి సాధించాం? అని ప్రశ్నించుకోవడం తప్పు కాదనుకుంటాను. అటు తెలుగునాడులో రచయితలకి, ఇక్కడ రచనలు చేస్తున్న వారికీ ఏ విధమైన సాహిత్య బాంధవ్యాలు ఏర్పడ్డాయి? ఇందువలన తెలుగు సాహిత్యానికి ఏ రకమైన మేలు జరుగుతున్నది? అని అడిగితే, సబబైన సమాధానం దొరకదని నేను విశ్వసిస్తున్నాను.

సదస్సులు కేవలం సరదాకోసం, పెద్ద యెత్తున చేసుకొనే సంబరాలలో “సత్రకాయ” మాత్రవే అనే వారితో నాకు ఏ పేచీ లేదు. శుభం. Stay The Course అనే చింతకాయల మంత్రం వల్లించే సమాజ నాయకులతో నేను వాదించలేను. ఈ సదస్సుల వలన మనం సాహితీపరంగా, ఉమ్మడిగా ఏదో సాధించగలం అనే ఆశ ఉన్నవాళ్ళంతా కలిసి ఆలోచించడం అవసరం అని భావిస్తున్నాను. అక్కడి మేలు రచయితలతో ఇక్కడి రచయితల కలయిక చాలా అవసరం. అయితే, కేవలం పొగడ్తలతో ఉద్బోధనలు చేసే భట్రాజుజాతి వారు అక్కడనుంచి ఇక్కడికి అనవసరం; ఇక్కడినుంచి అక్కడికి మరీ అనవసరం.

దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇక్కడి, అక్కడి రచయితలని కలుపుకొని శిక్షణ శిబిరాలు నడపగల అవకాశం ఉన్నది. శిక్షణ శిబిరాలు అనే మాటలు ఘాటుగా వినపడితే, వాటినే writers’ workshops అనండి. అంటే, రెండురోజులూ, ఈ ప్రత్యేకమైన పనికే కేటాయించవచ్చు. అనువాద సాహిత్యాన్ని చర్చించవచ్చు; విమర్శించవచ్చు. ఇకపోతే, స్థానికంగా ఉన్న సంస్థలు స్వీయరచనల విమర్శ పెట్టుకోవచ్చు. లేదా, Reading Clubs నిర్వహించవచ్చు. ( ఈ పని డెట్రాయట్ లో ఎప్పటినుంచో చేస్తున్నారు!). ఇక్కడనుంచి ప్రచురితమైన పుస్తకాలు సమీక్షించ వచ్చు. పుస్తక సమీక్షలు చెయ్యడంలో ఇక్కడి ప్రముఖ ఆంగ్ల పత్రికల పద్ధతుల పై, వాటిలో జరిగే వివాదాలపై మనం చర్చలు చెయ్యవచ్చు. ఈ చర్చలవల్ల చక్కని సమీక్షలు పైకి రావచ్చు. ఆ సమీక్షలు ప్రచురించుకోవడం అవసరమని వేరే చెప్పనక్కర లేదనుకుంటాను.

ఆలోచించండి. సాహితీ సదస్సుల విషయమై మీ అందరి సలహాలు ఎంతైనా అవసరం. మీ అభిప్రాయాలు రాయండి. శలవ్.