పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1

ఎన్ని లక్షణంబు లెఱిగిన రేఫయు
బండిఱాల నెఱుగకుండునట్టి
కవి కవిత్వమెల్ల గవ్వకు కొఱగాక
కొఱత జెందు రజితకుధరనిలయ
– (ఆంధ్ర సర్వ లక్షణ సార సంగ్రహము 3.40)

తెలుగులో మనకు ప్రాఙ్నన్నయ కాలానికి చెందిన తొలి శాసనాల నుండి సాధురేఫ (ర-వర్ణం), శకటరేఫలు (ఱ-వర్ణం) రెండు వేర్వేరు వర్ణాలుగానే కనిపిస్తున్నాయి. అయితే, సంస్కృత ప్రాకృత భాషల్లో ఈ శకటరేఫ లేదు. అయినా, ప్రాఙ్నన్నయ శాసనాలలో శకటరేఫను గుర్తించడానికి ‘ఱ’ అన్న ఒక ప్రత్యేక అక్షర సంకేతం ఉపయోగించారంటే ఆ కాలంలో తెలుగులో ఈ ధ్వనుల మధ్య తేడా స్పష్టంగా గుర్తించేవారని మనం ఊహించవచ్చు. కానీ, మధ్యతెలుగు కాలం (దాదాపు 15వ శతాబ్దం) నాటికే ఈ రెండు ధ్వనుల మధ్య తేడా తెలుగులో దాదాపుగా తొలగిపోయి, ఱ-కార ఉచ్చారణ, ర-వర్ణ ఉచ్చారణతో కలిసిపోయిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఈనాడు కూడా గొఱ్ఱె, బఱ్ఱె వంటి ద్విరుక్త స్థలాల్లో తప్ప వ్యవహారికంలో శకటరేఫ ధ్వని వినిపించదు.

తెలుగు వైయాకరణులు మాత్రం ఈ రెండు ధ్వనుల మధ్య భేదం చూపకుండా యతిప్రాసలు కలపడం నేరంగా భావించారు. అయితే ఉచ్చారణలో తేడా తొలగిపోయింది కాబట్టి కవులకు ఎక్కడ ర వాడాలో ఎక్కడ ఱ వాడాలో సరిగా తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని మనకు కొన్ని కావ్య ప్రయోగాల ద్వారా తెలుస్తుంది. ఈ రకమైన వర్ణసంకరాన్ని ఆపడం కోసం ఆనాటి వైయాకరణులు నన్నాయాదుల పూర్వ సాహిత్యం ఆధారంగా రేఫఱకారాదుల పట్టికలు తయారు చేసారు. అయినా ఎన్నో పదాల నిర్ధారణలో పండితుల మధ్య విభేదాలు తలెత్తాయి. 15వ శతాబ్దం నుండి వచ్చిన ప్రతి వ్యాకరణ గ్రంథంలో రేఫ-ఱకార నిర్ణయం గురించి విపులమైన చర్చలు, ఖండన ప్రతిఖండనలు కనిపిస్తాయి. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత తీవ్రంగా వాదోపవాదాలు జరిగిన ఈ చర్చలలో అయోమయ నివృత్తి కోసం ఎక్కడా సోదరభాషలైన కన్నడ, తమిళాదుల నుండి ఆధారాలు తీసుకోలేదు. ఇందుకు కారణాలు ఏమిటో విశ్లేషించడం అవసరం.

ద్రావిడ భాషలలో రేఫ-ఱకార విభేదాలను భాషాశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా వివరిస్తూ, తెలుగులో రేఫ-ఱకార వర్ణాల పరిణామాన్ని స్థూలంగా సమీక్షించడం ఈ వ్యాసభాగం యొక్క ముఖ్యోద్దేశ్యం. రేఫ-ఱకార నిర్ణయంపై వచ్చిన సంప్రదాయ వ్యాకరణ గ్రంథాలను విశ్లేషిస్తూ, సంప్రదాయ వైయాకరణులు తయారుచేసిన రేఫఱకారాదుల పట్టికలను ఆధునిక తులనాత్మక భాషాశాస్త్రం దృష్టా చేసిన విశ్లేషణ వచ్చే సంచికలోని వ్యాసభాగంలో చూడవచ్చు.

ద్రావిడ భాషల్లో శకటరేఫ మూలాలు

లఘువోలఘవశ్చేతి ద్వేధాంత స్తాన్వదంతి శాస్తారః
అన్యే అన్య వ్యాకరణ స్పష్టాః రస్త్వ గృహ్యతే ద్వివిధః
(ఆంధ్ర శబ్ద చింతామణి సంజ్ఞ సూ. 16)

తెలుగులో వ్యాకరణ గ్రంథాలు చాలావరకూ సంస్కృత సంప్రదాయాన్ని పాటించినా, తెలుగులో రేఫలు ద్వివిధాలని ప్రత్యేకంగా చెప్పారు. సంస్కృత, ప్రాకృతాల్లో శకటరేఫ లేకపోయినా, సంస్కృత వ్యాకరణాల్లో అంతస్థ వర్ణాలకు ఆపాదించిన లఘు-అలఘు భేదాన్ని ర-కారానికి వర్తింపజేసి, శకటరేఫను అలఘురేఫగా వర్ణించారు. తెలుగు వైయాకరణులు సాధురేఫను లఘురేఫ, శుద్ధరేఫ, మేలురా, గుండురా అని వర్ణిస్తే, బండి-ఱను అలఘురేఫ, శకటరేఫ, గౌరవరేఫ, పెద్దఱ, గురుఱ అని పలురకాల పేర్లతో ప్రస్తావించారు. బండి-ఱ లిపి రూపం రెండు బండి చక్రాలతో, మధ్యలో గీత ఇరుసు లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బండి-ఱ అని, శకటరేఫ అని అన్నారని మనం ఊహించవచ్చు.

వర్ణనిర్మాణ పరంగా సాధురేఫకు, శకటరేఫకు స్థానకరణాలు ఒకటే. ఈ రెండు ధ్వనులకూ వర్ణోత్పత్తి స్థానం దంతమూలీయం. కరణం నాలుకకొస. రెండూ అల్పప్రాణాలే (unaspirated), రెండూ నాదవర్ణాలే (voiced). అయితే, సాధురేఫకు ప్రయత్నం అల్ప కంపితం (tap) అయితే, శకటరేఫకు అధిక కంపితం (trill) ముఖ్య లక్షణం. స్పానిష్ వంటి భాషలలో కూడా సాధురేఫను (tap), అధిక కంపితరేఫను (trill) వేర్వేరు వర్ణాలుగా (phonemes) పరిగణిస్తారు. స్పానిష్ భాషలో “పెరొ (pero)” అంటే ‘కానీ-but’, అయితే, “పెఱొ (perro)” అంటే ‘కుక్క-dog’.

తెలుగులో శకటరేఫ వల్ల అర్థం మారిపోయే సమాన సన్నివేశ (minimal pair) పదాలకు కొన్ని ఉదాహరణలు:

సాధు రేఫ శకటరేఫ
అరుగు‘వెళ్ళు’ అఱుగు ‘జీర్ణించుకొను’
ఒర ‘పోలిక’ ఒఱ ‘కత్తిఒఱ’
ఊరు ‘గ్రామము’ ఊఱు ‘స్రవించు’
ఏరు ‘ఏరుకోవడం’ ఏఱు ‘నది’

తులనాత్మక భాషాశాస్త్ర పరంగా చూస్తే, పెక్కు ద్రావిడ భాషలలో బండి-ఱ ఆనవాళ్ళు కనిపిస్తాయి. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నూఱు, చెఱువు వంటి పదాల సోదర (cognate) పదాల్లో కూడా -ఱ- ఉండడం వల్ల ఈ వర్ణం మూలద్రావిడం (Proto-Dravidian) లోకూడా ఉండి ఉండాలని మనం ఊహించవచ్చు. అయితే, అతిప్రాచీన వ్యాకరణమైన తోల్కాప్పియమ్ కావ్యంలో ఱ-కారాన్ని క, చ, ట, త, ప వంటి వల్లిన (=బలమైన) స్పర్శాలతో (plosives/stops) తోపాటు కలిపి సూత్రీకరించడం ఆశ్చర్యకరమైన విషయం (క, చ, ట, త, ప, ఱ ఎన్పన వల్లిన ఎఴుత్తుక్కళ్ 1.19). అదీకాక, ద్విత్వాక్షమైన ఱ్ఱ-ను తమిళంలో –ట్ర-గా పలకడం కద్దు. మలయాళంలోనూ, శ్రీలంక జాఫ్నా తమిళ మాండలికంలోనూ –ఱ-ను దంతమూలీయ –ట- కారంగా, స్పర్శ ప్రయత్నంతో పలకుతారు. అంతేకాక, తమిళ, కన్నడాది భాషలలో –ఱ- ఉండే పెక్కు పదాలకు సమానంగా మధ్య ద్రావిడ భాషలలో –ద- కారమో, డ-కారమో కనిపిస్తుంది.

ఈ రకమైన తులనాత్మక ఆధారాలతో -ఱ- మూలద్రావిడంలో దంతమూలీయ స్పర్శంగా ఉండేదని భాషాశాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ ధ్వనిని -కారంగా (ṯ) సూచిస్తారు. ఈ దంతమూలీయ -కారం, దంత్య-త కారానికి, మూర్ధన్య-ట కారానికి భిన్నంగా ఉంటుంది. ఈ మూడు రకాల త-కార స్పర్శాల ఉచ్చారణ ఇప్పటికీ తొద, కోత వంటి గిరిజనుల భాషల్లో వినిపిస్తుందని ఆయా ప్రాంతాల్లో పనిచేసిన భాషావేత్తలు పేర్కొన్నారు.

మూలద్రావిడంలో పరుషాలు (voiceless plosives) అయిన క, చ, ట, త, ప మాత్రమే ప్రధాన స్పర్శాలు (plosives/stops). అయితే, అవి ద్రుతంమీద (న, మ, అరసున్న వంటి అనునాసికాలమీద) గ-జ-డ-ద-బ లు గాను, అచ్చులమధ్యలో గ-స-డ-ద-వలు గాను పలికేవారని ద్రావిడ భాషలను తులనాత్మకంగా పరిశీలించిన భాషావేత్తల నిర్ణయం. ఈ ధ్వనులు పదం మొదట్లోనూ, ద్విత్వంగా వచ్చినప్పుడు మాత్రం క, చ, ట, త, ప గానే, పరుష ధ్వనిలోనే ఉచ్చరింపబడుతాయి. అయితే, క, చ, ట, త, ప ల తో పాటు త-కారం కూడా మూల భాషలో పరుష స్పర్శం అయితే, అది ఇతర స్పర్శాలవలె ద్రుతం మీద సరళంగా, అచ్చుల మధ్య తేలికగా పలుకబడుతుందని ఊహించవచ్చు.

తులనాత్మకంగా దంతమూలీయ -కారం వివిధ పరిసరాల్లో పలు ద్రావిడ భాషల్లో ఏ రకమైన మార్పులు చెందిందో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాం.

దంతమూలీయ ద్విత్వాక్షరాలు

ద్రావిడ భాషలో ప్రధాన స్పర్శాలు అయిన క-చ-ట-త-ప ద్విత్వాక్షరాలుగా వచ్చినప్పుడు పరుష ధ్వనిలోనే ఉచ్చరింపబడతాయి. అదే రకంగా దంతమూలీయ త-కార స్పర్శం కూడా పలుభాషలలో పరుషంగానే కనిపిస్తుంది. అయితే, పలుభాషలలో దంతమూలీయ త-కారం దంత్య త-కారంతోనే, మూర్ధన్య ట-కారంతోనే విలీనమైపోయింది. తెలుగులో చాలా పదాలలో మనకు ట-కారమే కనిపిస్తే, కన్నడలో చాలా వరకు ఇది దంత్య త-కారంగా మారిపోయింది.

మూల-ద్రావిడ అర్థం దక్షిణ ద్రావిడ తెలుగు దక్షిణ మధ్య మధ్య ద్రావిడ ఉత్తర ద్రావిడ
*పుత్-[DEDR 4335] చీమల పుట్ట పుఱ్ఱు (తమిళ) పుత్తు/హుత్తు (కన్నడ) పుట్ట పుట్టి (గొండి)పుచ్చి (కుయి) పుచి(పెంగో) పుట్ట (నాయికి) పుత్త (ఖూరుక్) పుతె (మాల్తో)
*ఆత్– [DEDR 407] శక్తివంతమగు, తాడించు- ఆఱ్ఱు (తమిళ)ఆర్తు (Ka) ఆటు-
*తేత్– [DEDR 3471] తేటపరుచు- తేఱ్ఱు (తమిళ) తేట తేర్-స్పు (గొండి), తిజ (కుయి)
త్– [DEDR 1021] ఒత్తు- ఒఱ్ఱు (తమిళ)ఒత్తు (కన్నడ)ఒట్టిని (Tu) ఒట్టు ఒత్తు- ఉహ్-నై (కువి)
చాత్– [DEDR 2486] ప్రకటించు- చాఱ్ఱు (తమిళ)సాఱు (కన్నడ) చాటు- హాట్ (Kw) చాల్
చుత్– [DEDR 2715] చుట్టుముట్టు- చుఱ్ఱు (తమిళ)సుత్తు (కన్నడ) చుట్టు-

అయితే, కొన్ని పదాల్లో దంతమూలీయ త-కారం ఛాయలు ఏ భాషలలోనూ కనిపించవు. ముఖ్యంగా మధ్య ద్రావిడ భాషలలో ఏ భాషలోనూ స్పర్శ ప్రయత్నం కనిపించక పోవడంతో, ఈ పదాల మూలం దంతమూలీయ త-కార స్పర్శం కాదేమోనన్న అనుమానాన్ని స్తారోస్టిన్ అన్న రష్యన్ భాషాశాస్త్రవేత్త లేవదేసాడు.

మూల-ద్రావిడ అర్థం దక్షిణ ద్రావిడ తెలుగు దక్షిణ మధ్య మధ్య ద్రావిడ ఉత్తర ద్రావిడ
*గొత్
[DEDR 2165]
sheep,goat, deer కొఱి(Ta)కుఱి, కొఱి(Ka) గొఱ్ఱె gore (Go) గొఱి(Kuwi) గొఱియ (Kol)
*koṯl-(?)
[DEDR 2163]
millet kural (Ta) koṟale (Ka) koṟṟalu *kuṟeṅ (Ko) *koyl-
*toṯ-(?)
[DEDR 3534]
kine, cattle, cow toṟu (Ta)tuṟu (Ka) toṟṟu
*juṯ(p)- to sip, suck zuṟ- juṟṟ- *zuṟ- *ćurp- *surp

ద్రుతాలపై (అనునాసికాలపై) దంతమూలీయ ధ్వని

ద్రుతాలమీద దంతమూలీయ త-కారం తెలుగులో దాదాపుగా -డ-కారంగా మారిపోయింది. ఈ కింది పట్టికలో కందు, పంది అన్న పదాలు తప్ప తమిళంలో న్ఱ కనిపించే పదాలన్నీ తెలుగు –డ-కారంతో కనిపించడం విశేషం.

మూల-ద్రావిడ అర్థం దక్షిణ ద్రావిడ తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ మధ్య ద్రావిడ ఉత్తర ద్రావిడ
*ఎం sunshine, heat of sun ఎన్ఱు ఎండ ఎడ- *ఎంద-
*కంతు scorched, burnt; black కన్ఱు- కందు
*కొం hill కున్ఱు- కొండ *కొంద-
*మూన్-తు three మూన్ఱు- మూండు మూండు-
*నింతు to be full నీఱ, *నిన్ఱు- నెఱ/నిండు *ninḏ- *ninḍ- (*-nḏ-) *nind-
*నేంతు day నాన్ఱు- *నేఁడు- *nēi-nḏ- *nān
*ఒంతు one ఒన్ఱు-, ఒరు *ఒండు- *unḏ- *ond
*పంతి pig పన్ఱి *పంది *panḏ- *panḏ
*తాం belleric myrobalan తాన్ఱ తాండ్రకాయ *tānḍ- *dānḏ-
*తొంతు to appear, be తోన్ఱు *తోచు- *tōnḏ- *tōnḏ-
*ఊంతు to plant, fix ఊన్ఱు- *ఊను- *uḏs- *unḏ- *ūd-

పై పట్టికలోని పదాలే కాక, ద్రావిడ భాషలలో పురుష (మనుష్య) ప్రత్యయం అయిన –అంత్ తెలుగులో ప్రాఙ్నన్నయ్య శాసనాల్లో అందు (ఉదా: ధనంజయున్దు) అన్న ప్రత్యేక చిహ్నంతో కనిపించడం గమనించదగ్గ విషయం. తరువాతి కాలంలో అది –అండు (ధనంజయుండు) అని –డ- కారంతో కలిసిపోయింది.