“సాహితీసమరాంగణ సార్వభౌము”డైన శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు భువనవిజయ సభ తీర్చి ఉండగా తెనాలి రామలింగడు ఆ సభకి ఆలస్యంగా వచ్చాడు. అది చూసిన రాయల వారు “కవివృషభులు ఆలస్యంగా వచ్చారే”
అని అన్నారట. వృషభ శబ్దానికి ఎద్దు అని అర్థం. శ్రేష్టం అనే అర్థం కూడా వస్తుంది. దానికి సమాధానంగా రామలింగడు “కామధేనువు వంటి ప్రభువులుండగా కవివృషభులకి ఏమి లోటు?” అని సమాధానమిచ్చాడు. అడిగింది ఇచ్చే ప్రభువులుండగా ఎప్పుడు వస్తే ఏమిటనే ధ్వనన్న మాట. అలాగే “మావంటి కవులు (వృషభాలు) మీవంటి రాజుల (ధేనువుల) వెంట పడతారు సుమా!” అనే చమత్కారం కూడా. కామధేనువులా మీరు కోరిన కోర్కెలు తీరుస్తారని మరో భావం. ఇలా ఒక చిన్న సంభాషణలో ఇన్ని చమత్కారాలు చోటు చేసుకున్నాయి.
నిర్వాహకుడే!
కోనసీమలో నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి అనే మహాకవి, పండితుడు ఉండేవాడు. ఆయన చాలా చమత్కారి కూడా. నడిమింటి వారి హాస్యోక్తులు ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి. ఒకాయన వచ్చి శాస్త్రి గారిని “ఏమండీ, కుక్క కుడి వైపున ఎదురైతే మంచిదా? ఎడమ వైపున ఎదురైతే మంచిదా?” అని అడిగాడట. దానికి సమాధానంగా శాస్త్రి గారు “నాయనా! అది మనని కరవకుండా ఎటు వెళ్ళినా మంచిదే!” అన్నారట.
ఒకరోజు మంగళేశ్వర శాస్త్రి గారి కొడుకు మరణించాడు. అతను బతికుండగా ఎందుకూ పనికి వచ్చేవాడు కాడు. ఆయనకా దిగులు ఉండేది. మరణించిన తర్వాత ఏదో కారణం వల్ల శవవాహకులు కూడ కరువయ్యారట. అంతటి విషాదం లోనూ శాస్త్రి గారు “నా కొడుకు బతికుండగా నిర్వాహకుడే మరణించాకా నిర్వాహకుడే” అని చమత్కరించారట. అంటే బతికుండగా ఏదీ వహించేవాడు కాడు (ఏ పనీ చేసేవాడు కాడు), మరణించాక “వాహకులు” లేని వాడు అనన్న మాట.
చీకట్లో అరసున్న!
తిరుపతి వెంకట కవుల వాగ్ధాటికి అడ్డూ ఆపూ ఉండేది కాదు. ఎవర్నైనా ఎలాగైనా బోల్తా కొట్టించగలిగే వారు. ఒకసారి అవధాన సభలో అప్రస్తుతప్రసంగి “అవధాని గారూ! చీకట్లో అరసున్న ఉంటుందా?” అని అడిగాడట. నిజమే, గ్రాంథిక తెలుగులో ఏ పదంలో అరసున్న ఉంటుందో, ఎందులో ఉండదో చెప్పటం తేలికైన విషయం కాదు. “చీకటి” లో అరసున్న ఉంటుందనీ ఉండదనీ వాదోపవాదాలు జరిగేవా రోజుల్లో. ఈ తగాదాలోకి వెళ్ళకుండా అవధానులు ఇలా చమత్కరించారు “చీకటి కదండీ, అరసున్న ఉందో లేదో కనబడటం లేదు!”
గడ్డం బాధ!
ఒకసారి సి. వి. సుబ్బన్న శతావధాని గారు అష్టావధానం చేస్తున్నారు. అప్రస్తుతప్రసంగం చేసే వ్యక్తి చూస్తూ ఊరుకోడు కదా! “ఏమండీ అవధాని గారూ, మనం ఒక గడ్డం గీసుకోలేకే చాలా బాధలు పడుతున్నాం కదా! మరి రావణాసుడు పది గడ్డాలతో ఎలా బాధపడి ఉంటాడో!” అని అడిగాడు. వెంటనే అవధాని తడుముకోకుండా, “రావణాసురుడికి పదిగడ్డాలతో పాటు ఇరవై చేతులు కూడా వున్నాయని మర్చిపోయారా? అయినా, రావణాసురుడికి ఆ బాధ ఉండి ఉండదు దేవతల్ని పిలిచి గడ్డం గియ్యండర్రా అంటే చకచకా గీసెయ్యరూ!” అని చమత్కరించారు.
పొట్ట కోసినా అక్షరం….
ఆరుద్రకి కడుపుకి ఆపరేషన్ చెయ్యబోతున్నారు. డాక్టర్ గార్ని ఆరుద్ర, “ఏమండీ, ఆపరేషన్ చేసేప్పుడు నా పొట్టకేసి ఒకసారి చూడవచ్చా?” అని అడిగాడట. డాక్టర్, “చూడవచ్చు గానీ ఎందుకండీ చూడటం?” అన్నాడట. వెంటనే ఆరుద్ర, “ఏం లేదు పొట్టకోసినా వీడికి అక్షరం ముక్క లేదు అంటారు కదా, నా పొట్టలో అక్షరం ముక్క ఉందో లేదో చూసుకుందామని” అని చమత్కరించాట్ట.