నమో వెంకటేశా నమో తిరుమలేశా
గంట కొట్టినట్టు ఘంటసాల గొంతు.
ఒకే టాకీసు, ఒకటే ఆట. చిల్లర తిత్తి
చంకలో చాప. చల్లని యిసుక నేల టిక్కెట్టు.
వెదురు బొంగులపై వేలాడే తెల్లటి తెర.
నలుపూ తెలుపుల మాయాప్రపంచం
రెప్పారని జనాలు. ప్రేమలు పాటలు పద్యాలు.
తారలపై తారాడే బల్లులు పిల్లల నవ్వులు.
విశ్రాంతి.
బోండా బజ్జీ. గాలిలో ఒంటేలు వాసన.
గుర్రాలు కత్తియుద్ధాలు నాట్యాలు నవరసాలు
జైహింద్.
తిరుగు దారి సరదాల్లో భుజాలపై చిన్నోళ్ళు
చంకలో చంటోళ్ళు. చింత లేని రేపు.
ఆటో బస్సు హారన్లు. తార్రోడు పక్కగా పెద్ద పెద్ద కటౌట్లు.
రద్దీగా థియేటరు. అభిమాన సంఘాల హీరో వర్షిప్పులు.
కుర్చీ టిక్కెట్ల పర్సులో నోట్లు. తెల్లతెరకు ముడతల పరదా.
రంగుల డిస్కోలైట్లు కమ్ సెప్టెంబరు సంగీతం.
లిప్పుస్టిక్కు హీరో. వానపాటలో మెరిసిన బొడ్డు. పనిచేయని ఏసీ.
ఈలలు గంతులూ బంతిపూలూ నకిలీ నోట్లూ
ప్రేమలు పగలు అపార్థాలు. విడిపోయిన అన్నతమ్ములు.
ఇంటర్వెల్
సమోసాలు కట్లెట్లు చాయ్ సోడాలు. నాఫ్తలీను వాసనలు.
కామెడీ విలనీ హీరో మారువేషం ఆఖరులో పోలీసులు.
శుభం
ఉడిపీ హోటలు టిఫిను ప్యాకెట్లు. యిరుకిరుకు రిక్షాప్రయాణం.
పెద్దల సోమవారపు నిట్టూర్పు. పిల్లల సినిమా కబుర్ల సంబరం.
కార్లు బైకులు. మల్టిప్లెక్సులు. ఇంగ్లీషు మాటల అడ్వాన్స్ క్యూ. షరా మామూలు టిక్కెట్టు క్యూ.
సోఫాల్లా సీట్లు. పెద్ద సైజు తెర. మొబైల్ ఫోన్లపై తారాడే వేళ్ళు వేరార్యూ టెక్స్టింగులు.
తెలుగు పలకలేని కుర్ర హీరో. తెలుగు రాని తెల్ల చర్మం హీరోయిన్. మాటల్లో యాసలు.
యాసల్లో విలన్లు. ఐటంసాంగ్ స్పెషళ్ళు. విదేశాల్లో లొకేషన్లు. వాయిద్యాలు మింగేసిన పాటలు.
హీరో ఇచ్చే డ్రమటిక్ ఎంట్రీ. హీరోయిన్ షవర్ సాంగ్. డ్రామా. హాస్యం. యాక్షన్. హాస్యం.
రాజకీయాలు. హత్యలు. డాన్సులు. హాస్యం. ఫైట్లు. హాస్యం. యాక్షన్. హాస్యం.
ఇంటర్మిషన్
కోలా పాప్ కార్న్ నాచోస్ చిప్స్. సెల్ఫ్ ఫ్లష్ రెస్ట్ రూం ఫ్రెషనర్ వాసనలు. సెల్ఫీలు.
జీరో సైజుల షో అప్పులు బ్యాక్లెస్ క్లోజప్పులు విఎఫెక్స్ ఫైట్స్ చేజెస్ హీరో బిల్డప్స్.
చీకటి ముఖాలలో కసి, ఆరాటం, కలలు, ఊహలు. యువజంటల గుసగుసలు.
నల్లతెర. తెల్లగా పైకిపోతూ పేర్లు.
పిజ్జా చికెన్ వింగ్స్. ఫేస్బుక్ అప్డేట్స్. కేలండర్ రిమైండర్స్. పిల్లల ఐఐటి కోచింగ్ షెడ్యూల్.
లాగిన్ టునైట్ ఆఫీస్ నుంచి ఈమెయిల్. బాక్ టు వర్క్ గానుగెద్దు ఆలోచనలు.