గత “ఈమాట” సంచికలో “అమెరికాలో తెలుగు కథానిక” గురించి నేను వ్రాసిన వ్యాసంపై శ్రీ సాహితీవిమర్శకుడు గారి అభిప్రాయం చూశాను. వారు నిష్కర్షగా చెప్పిన అభిప్రాయంతో నేనూ చాలావరకు అంగీకరించక తప్పదు. ఆ వ్యాసం వ్రాయటంలో నేను కొద్దిగా మొహమోట పడిన మాట వాస్తవమే. విమర్శకుడు గారి అభిప్రాయం చదివిన తరువాత నేను ఆ సమీక్ష గురించి ఒకసారి ఆత్మపరీక్ష చేసుకోవాల్సి వచ్చింది.
ఆ వ్యాసం వ్రాసినప్పుడు నా ఉద్దేశం అమెరికాలో తెలుగు కథానిక తీరుతెన్నుల గూర్చి స్థూలంగా పరిచయం చెయ్యడం. నేను చదివిన అమెరికా తెలుగు కథల స్థాయిలో భేదాలు చాలా ఉన్నా, తెలుగు దేశానికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ వీరందరూ తెలుగుమీద ప్రేమతో ఇంత కృషి చేస్తున్నారు కదా అన్న గౌరవం వాళ్ళ కథల్లో ఉన్న లోపాల గురించి గట్టిగా మాట్లాడకుండా చేసింది. అప్పటికీ ఉండబట్టుకోలేక కొన్ని లోపాలు ఎత్తిచూపించినా, నా సాహిత్య సమీక్ష సగటు తెలుగు సినిమా సమీక్షకుడి స్థాయిని దాటలేదు.
ఈ “ఈరాతల్లో” రెండో వ్యాసం గురించి “ఈమాట” సంపాదకులు గుర్తు చేసినప్పుడు నేను ఈ విషయం గురించి పునరాలోచించక తప్పలేదు. ఇలా మొగమోటపు వ్రాతలు వ్రాసేకన్నా కొన్ని కథానికల్ని తీసుకొని వాటి మంచిచెడ్డలను కొంత లోతుగా చర్చించటం కొద్దిగా ఉపయోగకారిగా ఉంటుందని అనిపించింది. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తాను.
ముందుగా ఒక మాట చెప్పాలి. అమెరికాలో రచయితలూ, సంపాదకులూ అందరూ ఔత్సాహికవర్గానికి చెందినవారే. పత్రికలు కూడా ఆ వర్గానికి చెందినవే. విమర్శకుడు గారన్నట్లు ఆయా రచయితలూ, సంఘాలూ, సంపాదకులూ తమ సాహిత్య సరదాను (ఆయన వేరే మాట వాడారనుకోండి) తీర్చుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది చాలావరకు. అందుచేత ఉత్తమ సాహిత్య ప్రమాణాలతో ఈ ప్రయత్నాలను ఎంచటం, ఎలిమెంటరీ స్కూలు పిల్లల కాంపోజిషన్లను పోస్టుగ్రాడ్యుయేటు ప్రమాణాలతో దిద్ది మార్కులు వేయటం లాంటిదే. ఆ విషయాన్ని నేను మర్చిపోవడం లేదు.
కానీ, ఈమధ్య ఇక్కడి (తెలుగుదేశం) పత్రికలలో అమెరికా రచయితల రచనల ప్రచురణపై మోజు స్పష్టంగా కనిపిస్తున్నది. అమెరికా రచయితల సన్మానాల గురించి, పుస్తకావిష్కరణల గురించి పత్రికలలో అక్కడక్కడా చదువుతూనే వున్నాం. అమెరికా తెలుగు సాహిత్యం ఔత్సాహిక స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయి అందుకుందనీ, తెలుగు సాహిత్యపు గరిమనాభి ఆంధ్రాని దాటి అమెరికాలోకి వెళ్ళిందనీ అనేటువంటి మాటలు అప్పుడప్పుడూ వినిపిస్తున్నాయి. అంచేత కొంత నిర్మాణాత్మక విమర్శ ఇప్పుడు తప్పదు. ఆ విషయాన్ని గుర్తు చేసిన శ్రీ విమర్శకుడికి నా కృతజ్ఞతలు.
ఈ వ్యాసంలో 1995లో వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన “అమెరికా తెలుగు కథానిక” మొదటి సంకలనంలో కొన్ని కథలు పరిశీలిద్దాం. సంపాదకులు డాక్టరు పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఈ సంకలనానికి ముందుమాటగా వ్రాసిన కథానికా తత్వ విచారణలో మంచికథ లక్షణాలగురించి, కథ చెప్పటంలో వేరువేరు టెక్నిక్కుల గురించీ చక్కగా వివరించారు. ఔత్సాహిక కథారచయితలందరూ తప్పకుండా చదవవలసిన వ్యాసమిది. అయితే మంచికథ గురించి ఇంతగా తెలిసిన సంపాదకులు ఈ కథా సంకలన విషయంలో కొద్ది ప్రమాణాలు పాటించి ఉంటే ఈ సంకలనం స్థాయి మరింత పెరిగేది.
ఈ సంకలనంలో చెప్పుకోదగ్గ కథలు తక్కువే. వేలూరి వెంకటేశ్వరరావు గారి “స్వర్గారోహణం”, సత్యం మందపాటి గారి “పుత్రకామేష్టి” మంచి టెక్నిక్ తో పట్టుగా వ్రాసిన చిన్న,వ్యంగ్య కథలే కాని, వాటి పరిధి వేరు. మిగతా కథల్లాగా యివి సమకాలీన సమాజాన్ని వస్తువుగా తీసుకుని రాసినవి కావు. వెల్చేరు నారాయణరావు గారి “పువ్వూ కాగితం పువ్వూ” చక్కగా వ్రాసిన కథ. కథావస్తువు ఇంతకుముందు మిగతా రచయితలు స్పృశించిందే అయినా, ఈ కథను గ్రిషాం (నవలారచయిత కాదు ఆర్థిక శాస్త్రజ్ఞుడు) సూత్రానికి భాష్యంగా చెప్పటం రచయిత నైపుణ్యానికీ, సునిశిత సామాజిక దృష్టికీ నిదర్శనం. సీయస్సీ మురళి గారి “బ్రతికేందుకు సాకు” కథ కూడా బాగా వ్రాసిన కథ. కథావస్తువు రొటీన్ దే అయినా కథను చాకచక్యంగా చెప్పటంతో విసుగు పుట్టదు. కథకు రచయిత ఇచ్చిన ముగింపు, బ్రతికేందుకు వెదుక్కునే సాకుల గురించి రచయిత వ్యాఖ్యానమూ, ఈ కథని గుర్తుంచుకోవాల్సిన కథల కోవలోకి చేరుస్తాయి. అయితే వెల్చేరు గారి కథా, మురళిగారి కథా అమెరికాలో వ్రాసిన తెలుగు కథల కన్నా చాలాకాలం క్రితం తెలుగు దేశంలో ఉండగానే వ్రాసిన కథల్లా అనిపిస్తాయి.
మాచిరాజు సావిత్రిగారి “దెయ్యం పట్టింది” వస్తుపరంగా గొప్పకథగా వెంటనే అనిపించకపోయినా, నైపుణ్యంతో వ్రాసిన వ్యంగ్య కథ. కథ పేరు, ఎత్తుగడా కథ ముగింపును ఏమాత్రమూ సూచించవు, అయినా అవి రెండూనూ కథకు సరిగ్గా సరిపోయినవే. అధునాతనమయిన భావాలు కల ఒక యువకుడు మంచి చేద్దామనుకుంటూ చేసిన పనివల్ల అతనికి పట్టిన దెయ్యం గురించిన ఈ కథకి చదివించే గుణం, ఆలోచింపచేసే లక్షణమూ ఉన్నాయి.కలకాలం నిలిచే కథ అని చెప్పనుగానీ, చక్కగా చెప్పిన కథ.
విజయశ్రీ గారి “దాంపత్యానికి అనుబంధం” క్లిష్టమైన విషయాన్ని తీసుకొని వ్రాసిన కథ. అన్యోన్యంగా ఉన్న జంటలో భర్తకి అతని స్నేహితుని భార్యతో ఏర్పడిన విచిత్రమైన అనుబంధం గూర్చిన కథ. కథనంలో రచయిత(త్రి) నిజాయితీ కనిపిస్తున్నా, మూలవస్తు విచారణలో రచయిత(త్రి)కి ఉన్న అస్పష్టత కథలో కూడా చోటు చేసుకుంది. ఉత్తమ పురుష (ఫస్ట్ పర్సన్)లో కథ చెప్పటం కోసం ఔత్సాహిక రచయితలు పడే ఇబ్బంది ఈ కథ ఎత్తుగడలో కనిపిస్తుంది. కథానాయకుడు తన భార్యకి వ్రాసిన ఉత్తరం పోస్టు చేయడంతో ప్రారంభమయిన ఈ కథని తిన్నగా ఉత్తరంతో ప్రారంభించినా నష్టమేమీ ఉండేది కాదు, నిడివి తగ్గేది కూడా. దానికి తోడు ఇది భార్యకి వ్రాసిన ఉత్తరమే అయితే, ఆవిడకు అప్పటికే తెలిసిన విషయాలు చాలావాటి గురించి మళ్ళీ ఈ ఉత్తరంలో కొత్తవాళ్ళకు చెప్పినట్లుగా చెప్పటం కృతకంగా ఉంది. కథానాయకుడు, అతని భార్య, స్నేహితుని భార్య ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధాల చిత్రణలో సంబద్ధత (కన్సిస్టెన్సీ) లేదు.ఐతే ఇలాంటి క్లిష్టపు ఇతివృత్తాన్ని తీసుకున్నందుకు రచయిత(త్రి)ని అభినందించాలి. కథ నిర్మాణం (స్ట్రక్చర్) విషయంలోనూ, సన్నివేశాల చిత్రణలో సంబద్ధతను సరిచూసుకోవటంలోనూ కొద్దిగా జాగ్రత్త చూపి ఉంటే ఇది ఇంకా మంచికథ అయ్యేది.
ఈ సంకలనంలో మామూలు కథలు అంటే ఔత్సాహిక ప్రమాణాలతో చూస్తే ఆదరించదగ్గ కథలు (ఫార్ములా కథలే అయినా చదువుతున్నంత సేపూ కాలక్షేపంగా అనిపించేవి) చాలా ఉన్నాయి. ముందుగానే చెప్పిన్నట్లు ఇటువంటి సంకలనంలో ఈ కథలు ప్రచురించవలసినవే. అయితే ఇలాంటి ఔత్సాహిక ప్రమాణాలకు కూడా సరితూగని కథలు చాలా ఈ సంకలనంలో చోటు చేసుకొన్నాయి. వాటిలో రెండిటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.
ఈ సంకలనంలో మొదటి కథ శ్రీమతి కొమరవోలు సరోజ గారి “ఉష్ణం ఉష్ణేణ శీతలః”. కావాలని మేనత్త కొడుకు హరినారాయణని చేసుకున్న స్వప్నసుందరి భర్తతో పాటు ఇంగ్లండులో కాపురం చేస్తూ, తను కూడా ఉద్యోగంచేస్తూ, సంసారాన్ని పొదుపుగా నడుపుకుంటూ మిగుల్చుకొన్న డబ్బు అత్తగారికి నెలనెలా పంపిస్తుంటుంది. ఎనిమిదేళ్ళ తరువాత భార్యాభర్తలు ఇండియా తిరిగివస్తారు. అలా వచ్చిన రోజున ఆవిడ అత్తగారు హరినారాయణకు షడ్రసోపేతమైన భోజనం పెట్టి, కోడలు స్వప్నసుందరికి మాత్రం “ప్రత్యేకంగా బీరకాయ చెక్కుతో చేయబడిన కూరా, చింతకాయ పచ్చడీ, వేసి అన్నం పెట్టింది”. మర్నాడు పొద్దున్న,
“ఏమేవ్! స్వప్నా! ఏటికెళ్ళి బట్టలుతుక్కురా” రామలక్ష్మమ్మ ఆజ్ఞతోబాటు ఓ బండెడు బట్టలూ, చిన్న సోపుముక్కా పడేసింది. ఏటికి వెళ్ళిన స్వప్నకు బట్టలు ఉతికీ ఉతికీ చేతులు ఎర్రగా కందిపోయాయి. కళ్ళ నీళ్ళాగటం లేదు. ఎట్లాగో ఆ బట్టలని మోసుకొని ఇంటికి వచ్చింది.
“మురికి పోలేదు ఏమిటీ ఈ ఉతకటం”, దీర్ఘం తీసింది రామలక్ష్మమ్మ.
అలా పదిహేను రోజులు గడిచాక “మాడిపోయిన ఇత్తడి గిన్నెల్ని తెల్లగా తోమ”మన్న అత్తగారితో పోట్లాడిన స్వప్న అప్పుడు పుట్టింటికి వెళుతుంది. ఆ తర్వాత ఇంగ్లండు వెళ్ళి కావాలని ఖర్చులు పెంచుకుని అత్తగారికి భర్త డబ్బు పంపే వీల్లేకుండా చేస్తుంది. ఆ తర్వాత ఒకరోజు “ఇంక డబ్బులు పంపటానికి వీలుండదు” అని భర్త అత్తగారికి వ్రాసినట్లుగా ఆమే ఫోర్జరీ చేసి వ్రాసిన ఉత్తరాన్ని స్వప్న పోస్ట్ చేయడంతో ఈ కథ ముగుస్తుంది.
ఈ కథలో సన్నివేశాలు నాకు చాలావరకు నమ్మబుద్ధి కాలేదు. కథలో పాత్రల మధ్య సంబంధాల చిత్రణలో లోతు కనిపించదు. ముగింపులో ఔచిత్యం లేదు. ఈ కథ వ్రాయటంలో రచయిత్రి ఉద్దేశమేమిటో నాకేం అర్థం కాలేదు. పాత్ర చిత్రణా, సన్నివేశ కల్పనా పక్కన పెట్టినా, కథనమైనా బాగుందా అనుకుంటే అదీ ఎగుడుదిగుడులుగా సాగుతుంది. కథ ప్రారంభంలో హీరోయిన్ పాడుకునే పోతన పద్యాలు అసందర్భంగా రచయిత్రి తన పాండితీ ప్రకర్షను వెల్లడించుకోవటానికి వ్రాసినట్లుగా ఉన్నాయి. ఇలాటి కథతో ఈ సంకలనాలను ప్రారంభించిన సంపాదకుల్ని తప్పు పట్టకుండా ఉండలేను.
సులోచన భండారు గారి “స్వయంకృతం” కథ రిటైరయిపోయిన కథానాయకుడు పక్కవాటా దంపతుల సంభాషణ విని, ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్ళిపోయి తన విఫల ప్రేమకథని గుర్తుకు తెచ్చుకోవటం గురించి. ఉత్తమపురుషలో కథని ప్రారంభించలేకపోవడమే ఈరకమైన ఆరంభానికి కారణమనిపిస్తుంది ముసలాయన ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ఉండగానే కథ కంచికెళ్ళిపోవడం చూస్తుంటే. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో కథనం కూడా కొంత ఉత్తమ పురుషలోనూ (ఫస్ట్ పర్సన్), కొంత ప్రథమ పురుషలోనూ (థర్డ్ పర్సన్) సాగుతుంది. కథానాయకుడూ, కథానాయికా కూడా ఒకరిమీద ఒకరికి బోల్డంత ప్రేమ ఉన్నా, ఒకరికొకరు చెప్పుకోరు. పోనీ కథానాయకుడు పిరికివాడులే అనుకొన్నా, చాలా సూటిగా ఉంటుందని వర్ణించిన కథానాయిక కూడా బయటపెట్టదు. ఇద్దరూ చివరికి విషయం తెలుసుకొని తెగబాధపడటంతో కథ అయిపోతుంది. పన్నెండు పేజీల కథ. దీర్ఘ సంభాషణలు. పెద్ద పెద్ద పేరాగ్రాఫుల్లో పంక్చ్యుయేషన్ మార్కులు కూడా సరిగ్గా లేకుండా ఎడాపెడా మాట్లాడేసుకుంటుంటే ఒకోసారి ఎవరు ఏం మాట్లాడుతున్నదీ గుర్తు పట్టడమే కష్టమౌతుంది. ఈ కథలో రచయిత్రి చెప్పిన కొత్త విషయమేమీ లేదు. చెప్పిన విధానంలోనూ కొత్తదనం ఏమీ లేదు. కథానిర్మాణంలో మొదలూ, ముగింపూ టెక్నిక్ రీత్యా చాలా ముఖ్యమైనవి. ఈ కథలో రెండూ దుర్బలంగా ఉన్నాయి. ఈ కథకు ఫ్లాష్‌బ్యాక్ టెక్నిక్ అవసరం లేదు. కథను ఇంకా క్లుప్తంగా వ్రాయాలి. సంభాషణల్లోనూ, సన్నివేశాల్లోనూ కొద్దిగానన్నా సహజత్వం కావాలి. కథానిర్మాణంపై రచయితలకు అవగాహన లేనప్పుడు, కనీసం సంపాదకులన్నా జాగ్రత్త తీసుకుంటే పాఠకులకు సదుపాయంగా ఉంటుంది. రచయితలకు నిర్మాణాత్మకమైన సహాయం చేసినట్లూ ఉంటుంది.
ఈ సంకలనం ఆఖరులో ఇచ్చిన పరిచయాల ప్రకారం ఈ రచయిత(త్రు)లందరూ చాలా అనుభవం ఉన్నవారూ, ఇండియాలోనూ, అమెరికాలోనూ తమ కథలను ప్రచురించినవారూనూ. వీరి మిగతా కథలు ఇంతకన్నా గొప్పగా ఉండవచ్చు. లేకపోతే విమర్శకుడు గారన్నట్లు వీరిలో కొంతమందికి రావాల్సినదానికన్నా ఎక్కువ పేరు వచ్చి ఉండవచ్చు. సంస్థాగత పత్రికలు ఈ ఔత్సాహిక రచయితలను కొంతవరకూ ప్రోత్సహించటం న్యాయమే. కాని ఇలాంటి సంకలనాలు ప్రచురించేటప్పుడయినా కొన్ని కనీస ప్రమాణాలు నిర్దేశించుకోవటం మంచిదని నా అభిప్రాయం.