శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన

ఇప్పటికి ఆరున్నర శతాబ్దాల క్రితం క్రీస్తుశకం 1360 ప్రాంతాల ఆంధ్రసరస్వతి పూర్ణకళావతారమైన శ్రీనాథుడు పాకనాటింట జన్మించి, వారిధి ఒడ్డున కాల్పట్టణాధీశ్వరుడు తాతగారు కమలనాభామాత్యుని ముద్దుముచ్చటలకు నోచుకొని, గర్భాష్టమంలో పిల్లలమఱ్ఱి పెద్దన్న గారివద్ద అక్షరశిక్షకు చేరేనాటికి ఆంధ్రదేశపు సాహిత్యవాతావరణంలో ఎన్నడూ లేని కొత్తగాలులు వీస్తున్నాయి. విద్యావిధానం మారసాగింది. పాఠ్యగ్రంథాలు కొత్తవి వచ్చిచేరాయి. లక్షణపద్ధతిలో నూత్నప్రస్థానాలకోసం వెతుకులాట మొదలయింది. సంస్కృత భాషాధ్యయనం గాఢతరమయింది. నన్నయాదుల కాలం నాడు ప్రవర్త్యమానములై ఉండిన అగ్నిపురాణం, భామహాలంకారం, దండి కావ్యాదర్శం, రాజశేఖరుని కావ్యమీమాంసాదుల స్థానంలో వామనుని కావ్యాలంకార సూత్రవృత్తి, ఉద్భటాచార్యుని కావ్యాలంకారసంగ్రహం, రుద్రటుని కావ్యాలంకారం, ఆనందవర్ధనుని ధ్వన్యాలోకం, అభినవగుప్తుని ధ్వన్యాలోక లోచనవ్యాఖ్య, మమ్మటుని కావ్యప్రకాశం, భోజరాజు శృంగారప్రకాశ సరస్వతీకంఠాభరణాలు మొదలైన మహాగ్రంథాల పఠనపాఠనాలు ప్రవేశించి, అవీ ప్రాతవడ్డ మాటలు కాసాగాయి.

ఎందుచేతనో కాని అభినవగుప్తుని అభినవభారతి, కుంతకుని వక్రోక్తిజీవితం, క్షేమేంద్రుని ఔచిత్యవిచారచర్చ, హేమచంద్రుని కావ్యానుశాసనం ఆంధ్రదేశంలో అంతగా ప్రభావాన్ని నెరపినట్లు కనబడదు. తెలంగాణంలో కాకతీయుల రాజకీయవిజయాల ఫలితంగా ఆంధ్రదేశమంతటా ఉత్సవోత్సాహం వెల్లివిరిసి, శ్రవ్యమాధ్యమాల స్థానంలో దృశ్యమాధ్యమాలకు ప్రచారం వచ్చి రంగస్థల ప్రదర్శనలు ప్రజాదరణకు నోచుకొనసాగాయి. సాహిత్యానురక్తుల దృష్టి శారదాతనయుని భావప్రకాశనం, ధనంజయుని దశరూపకం, భరతుని నాట్యశాస్త్రం వంటి రూపక కళాశాస్త్రగ్రంథాలకు మళ్ళింది. సంస్కృత నాటకాల అధ్యయనానికి, ప్రదర్శనకు ప్రాధాన్యం వచ్చింది. రంగశాలలు వెలిశాయి. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని నిర్మించి మళ్ళీ నాటకరంగానికి ప్రాణం పోశాడు. అమృతానందయోగి అలంకార సంగ్రహం, ధనికుని దశరూపక వ్యాఖ్య, శార్ఙ్గదేవుని సంగీతరత్నాకరం ప్రసరించిన కొత్తవెలుగుల ప్రస్థానంలో జాయప సేనాని నృత్తరత్నావళి ఉదయించి ఆంధ్రనాట్యాన్ని తలకెత్తింది. రాచకొండ సంస్థానంలో సర్వజ్ఞ సింగభూపాలుని రసార్ణవ సుధాకరం నాటక రంగంలో తెలుగువారి అన్వయాలను, నూత్నరీతులను ప్రచారంలోకి తెచ్చింది. మారుతున్న తెలుగువారి అభిరుచులకు అనుగుణంగా విశ్వేశ్వర దేశికుని చమత్కార చంద్రిక రసానుభవానికి కొత్తదారులను ఆవిష్కరించింది.

ఈ కృషిముఖాన తెలుగువారికి అనేకశాస్త్రపరిజ్ఞానం వృద్ధి కాసాగింది. విషయవివేచనాశక్తి పెరిగింది. రంగస్థల నాటకాలపై అభిమానం ఫలితంగా ప్రాకృత భాషాధ్యయన మొదలయింది. నాటకాలలో సగానికి సగభాగం విస్తరించి ఉండే బహుశాఖల ప్రాకృతాలను చదువుకోవటానికి ఆ భాషా వ్యాకరణాల పాండిత్యం ఆవశ్యకం అయింది. ఆ సమయంలో ఓరుగల్లు, రాచకొండలలో వెలసిన రీతిప్రస్థానానికి ప్రత్యామ్నాయం కాగల వినూత్నమార్గదీపనకు చందవోలు సామ్రాజ్యాధిపతి, మహాపండితుడు పెదకోమటి వేమారెడ్డి ప్రయత్నిస్తున్నాడు. విద్యాధరుని ఏకావళిలోని ధ్వన్యధ్వానికి, విద్యానాథుని రంగావిష్కరణకు, సర్వజ్ఞ సింగభూపాలుని శబ్దార్థవృత్తికి, విశ్వేశ్వర దేశికుని చమత్కృతికి సమాధానం ఆయనకు సర్వాంగీణమైన రుయ్యకుని అలంకార సర్వస్వంలోని అలంకారప్రస్థానంలో కనిపించింది. రుయ్యక వ్యాఖ్యాతలలో అగ్రేసరుడైన జయరథుని విమర్శినీ వ్యాఖ్యను తెలుగునేలకు తీసికొనివచ్చాడు. శాబ్దబోధంలో అలంకారశోభను మించిన కావ్యగుణం లేదని నిర్ధారించుకొన్నాడు. ప్రాకృత భాషాధ్యయనం మూలాన ఆయనకు అలంకార ప్రస్థానానికి, ధ్వనిప్రస్థానానికి, శబ్దధర్మానికి, రామణీయకానికి, రసవత్తకు, లోకస్వభావచిత్రణకు భవ్యాదర్శమైన హాల సంకలిత గాథాసప్తశతి లభించింది. గంగాధర భట్టు భావాలేశ ప్రకాశిక, భువనపాలుని ఛేకోక్తి విచారలీల, పీతాంబరుని గాథాసప్తశతీ ప్రకాశికా వ్యాఖ్యలను తెచ్చుకొని చదువుకోవటం ప్రారంభించాడు. ఆ వ్యాఖ్యలకు భిన్నంగా ధ్వన్యధ్వాన్ని చిత్రీకరించే అభినవవ్యాఖ్యను నిర్మించాలనే సంకల్పం ఉదయించింది. . వెంటనే రచన ప్రారంభించాడు. క్రీస్తుశకం 1375-వ సంవత్సరానికి ఒక యేడాది మునుపో, తర్వాతనో ఆ వ్యాఖ్య పూర్తయింది. దానికి భావదీపిక అని పేరుపెట్టాడు. దేశం సుభిక్షంగా ఉన్నది. కొండవీటిలో కొమరగిరి రెడ్డి ప్రారంభించిన వసంతోత్సవాలు చందవోలులోనూ మొదలయ్యాయి. ఆ శుభసమయంలో ఉజ్జ్వలంగా ఉన్న తెలుగువారి జీవితం ఆ గాథాసప్తశతిలో నిండుగా ప్రతిబింబిస్తున్న సంగతిని అప్పటికే బ్రాహ్మీదత్త పాండిత్యం వల్ల గడిదేరి, మరుత్తరాట్చరిత్రను నిర్మించి, సాహిత్యరంగంలో నిలదొక్కుకొంటూ నూనూగుమీసాల నూత్నయౌవనంలోకి అడుగుపెడుతున్న శ్రీనాథుడు నేత్రపర్వంగా చూచివుంటాడు. తెలుగువారి ఆచార సంప్రదాయాలు, వేషభాషలు, ఒయ్యారాలు, సరాగాలు, సాహసాలు, విలాసాలు, వినోదాలు, కళలు, కుటుంబజీవితంలో అల్లుకొన్న అనుబంధాలు, ఆటలు, పల్లెప్రజల తీరుతెన్నులు ఉట్టిపడే కావ్యం ఇంతకంటె వేరొకటి లేదని నిశ్చయించుకొన్నాడు. పెదకోమటి వేమారెడ్డి సంస్థానప్రవేశానికి, తన సాహిత్యసంస్కార ప్రతిఫలనానికి, ఆత్మోన్నతికి నిదర్శనగా గాథాసప్తశతిని అనువదించాడు. క్రీస్తుశకం 1433 ప్రాంతాల చెప్పిన కాశీఖండంలో (1-7)

నూనూఁగుమీసాల నూత్నయౌవనమున
శాలివాహన సప్తశతి నుడివితి

అని సగర్వంగా చెప్పుకొన్నాడు. ఇదంతా 1376 నాటి కథ.

నూనూగుమీసాల నూత్నయౌవనం

‘నూనూగుమీసాల నూత్నయౌవనం’ అంటే ఏనాటి వయసు? విమర్శకులు పరిపరివిధాల ఊహించారు. ఇరవై అయిదేళ్ళని కొమర్రాజు లక్ష్మణరావుగారు, ఇరవై రెండేళ్ళని కందుకూరి వీరేశలింగంగారు, రమారమి ఇరవయ్యేళ్ళ వయసని బండారు తమ్మయ్యగారు, పద్దెనిమిదేళ్ళని చిలుకూరి వీరభద్రరావుగారు, పదిహేడు – ఇరవై సంవత్సరాల నడిమి ప్రాయమని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాలన్నింటిని సమీక్షించి, కొర్లపాటి శ్రీరామమూర్తిగారు 1971లో ప్రకటించిన తమ బృహత్పరిశోధనగ్రంథం శ్రీనాథుడులో అది పదహారేళ్ళ ప్రాయమని నిరూపించారు. శివరాత్రి మాహాత్మ్యములో (3-38) సుకుమారుని వర్ణిస్తూ శ్రీనాథుడే స్వయంగా ‘ఉద్భిన్ననవశ్మశ్రు నభినవయౌవనోద్భాసితు షోడశవర్షదేశీయు’ అంటూ, నూనూగుమీసాలు మొలిచే అభినవయౌవనకాలం పదహారేళ్ళ ప్రాయమని చెప్పిన ప్రయోగాన్ని కనుగొన్నారు. దానితో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఇటీవల నాకు పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి <ఎం>జైమిని భారతములో (8-51) ‘పదియాఱేఁడుల నూఁగుమీసముల లేఁబ్రాయంబునం’ అని ఇంకొక ప్రయోగం దొరికింది. దీనితో నూనూగుమీసాల నూత్నయౌవనం అంటే పదహారేళ్ళని నిర్ధారణ అయింది. శ్రీనాథుడు క్రీస్తుశకం 1360 ప్రాంతాల జన్మించాడు కనుక అది 1376 ప్రాంతం అన్నమాట.

శాలివాహన సప్తశతి పద్యాలు

శ్రీనాథుని శాలివాహన సప్తశతి ఇంతవరకు లభింపలేదు. శ్రీనాథుడు తాను వ్రాశానని స్వయంగా చెప్పుకొన్న మాట తప్పించి ఇతరులెవరూ ఆ విషయాన్ని చెప్పలేదు. లాక్షణకులు ఉదాహరింపలేదు. అందులోనివని కొన్ని కొన్ని పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణములో ఒకటి, దామరాజు సోమన పేరుమీద ఒకటి పద్యాలు కనబడుతున్నాయి. ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు పేర్కొన్నవి మరికొన్ని ఉన్నాయి. వాటి తథ్యమిథ్యావివేచన కోసం ఈ పరిశీలనమంతా ఉద్దేశింపబడుతున్నది. ఒక్కొక్కటిగా వాటిని వివరిస్తాను.

1. బాలబోధచ్ఛందములోని శాలివాహన సప్తశతి పద్యం

వారణసేయ దావగొనవా నవవారిజమందుఁ దేటి క్రొ
వ్వారుచు నంట నీ వెఱుఁగవా ప్రియ హా తెఱగంటి గంటి కె
వ్వారికిఁ గెంపు రాదె తగవా మగవారల దూఱ నీ విభుం
డారసి నీ నిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.

శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 1908లో ప్రకటించిన కుమారసంభవం ప్రథమ భాగంలోని ఉదాహరణం ఇది. కుమారసంభవం పంచమాశ్వాసంలో మన్మథదహనానంతరం వచ్చిన రతివిలాప సన్నివేశంలోని 89వ వచనంలో ‘అనుచు నతిసంభ్రమంబునం బఱతెంచిన వసంతకుం గనుంగొని రతి మతి నడల నూర్మడించినం దావగొనక’ అని ఉన్న దళంలోని ‘దావగొనక’ ధాతువు అర్థాన్ని వివరించటం కోసం రామకృష్ణకవిగారు ఒక అధోజ్ఞాపికను నిలిపి, దావగొనక = నిలువలేక అని అర్థాన్ని వ్రాసి, ఆ ధాతువుకు తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం నుంచి ‘నావుడు … పార్థివముఖ్యుఁడు తల్లడంబునం దావగొనంగలేక తన తమ్ముల నప్పుడ’ అని ఒక ప్రయోగాన్ని, శ్రీనాథుని సప్తశతి నుంచి పైని ఉదాహరించిన పద్యాన్ని – మొత్తం రెండు ప్రయోగాలను ఉదాహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు 1972లో ప్రకటించిన మానవల్లి కవి రచనలు అనే సంపుటంలో ఈ అర్థవివరణ, ఈ పద్యోదాహరణ ఎందువల్లనో తొలగిపోయాయి. సప్తశతిలో నుంచి వారు ఉదాహరించిన పద్యం ఆ కావ్యంలోని నాలుగవ ఆశ్వాసం లోనిదని వారు వ్రాసిన ‘శ్రీనాథుని సప్తశతి, ఆ. ౪’ అన్న ఆకరాన్ని బట్టి తెలుస్తున్నది. కుమారసంభవం దశమాశ్వాసంలోని 176వ సంఖ్య గల వచనంలో ‘కోపాగ్రహావేశంబునం దావగొనక’ అని ఉన్న ప్రయోగానికి కూడా రామకృష్ణకవిగారు మళ్ళీ ఒకసారి, దావగొనక = నిల్పోపక, అని అర్థాన్ని చెబుతూ ‘వారణసేయఁ దావగొనవా – శ్రీనాథుని సప్తశతి’ అని శ్రీనాథుని సప్తశతిని పేర్కొన్నారు. మానవల్లి కవి రచనలు సంపుటంలోని 45వ పుటలో ఈ రెండవ అర్థవివరణ మాత్రం ముద్రితమై ఉన్నది. తెలుగు సాహిత్యంలో శ్రీనాథుని సప్తశతిని అధికరించిన తొలి ప్రస్తావనలు ఇవే.

నిజానికి మానవల్లివారు ఈ పద్యాన్ని ప్రకటించిన నాటినుంచే తెలుగు సాహిత్యాభిమానుల దృష్టి ఆరు శతాబ్దాల మునుపటి శ్రీనాథుని శాలివాహన సప్తశతి వైపుకు మళ్ళిందనటం అతిశయోక్తి కాదు. అయితే, ఇది వారు స్వయంగా శ్రీనాథుని కృతిని చూసి ఉదాహరించిన ప్రయోగం కాదని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో D. 705, M. 326 సంఖ్య గల ఛందోగ్రంథము అన్న వ్రాతప్రతి 43b పుటలో ఆ పద్యం ఉన్నదని; అది తప్ప శ్రీనాథుని శాలివాహన సప్తశతి అన్న వ్రాతప్రతి ఒకటి ఆ రోజులలో ఉపలభ్యమై లేదని – విమర్శకులు ఆనాడే గుర్తించారు. ఆ వ్రాతప్రతిలోని పాఠం ఇది:

వారణసేయ దావగొనవా? నవవారిజమందుఁ దేటి క్రొ
వ్వారుచు నుంట నీ వెరుగవా? ప్రియ! హా తెరగంటి గంటి కె
వ్వారికి గెంపు రాదె తగవా మగవారల దూర నీ విభుం
డారసి నీ నిజం బెరుగనంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారములో R. 1212 సంఖ్యతో పైని పేర్కొన్న గ్రంథానికే మరొక కాగితపు వ్రాతప్రతి బాలబోధచ్ఛందము అన్న పేరుతో ఉన్నది. అందులోనూ ఈ పద్యం ఇదే రూపంతో ఉన్నది. ఈ రెండూ ఒకటే అనుకొంటే, ఈ బాలబోధచ్ఛందము లేదా ఛందోగ్రంథము అన్న వ్రాతప్రతిలో తప్పించి ఈ పద్యం మరెక్కడా లేదని విశ్వసింపవచ్చును. ఈ బాలబోధచ్ఛందము మరీ ప్రాచీనమైన సంధానం కాదు. ఆ మాటకు వస్తే పద్దెనిమిదవ శతాబ్ది ప్రథమార్ధానికి లేదా పదిహేడవ శతాబ్ది ఉత్తరార్ధానికంటె పాతది కాదు. పోనీ ఆ ప్రతులలో అయినా ‘సప్తశతి నుండి’ అని ఉన్నదే కాని, ‘శ్రీనాథుని సప్తశతి నుండి’ అని లేదు. ‘శ్రీనాథుని సప్తశతి నుండి – ఆశ్వాసము ౪’ అని అసలే లేదు. అందువల్ల దీని కలరూపును గురించి నిశ్చయాత్మకంగా ఇదమిత్థమని ఏమీ చెప్పటానికి వీలులేకుండా ఉన్నది. అందువల్ల తథ్యమిథ్యావివేచన చేయవలసి వచ్చింది.

ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ హాల సంకలితమై, ఇప్పుడు అచ్చులో ఉన్న గాథాసప్తశతి ప్రతులలో లేదు. ఒక్క ఆంధ్రదేశపు గాథాసప్తశతి వ్రాతప్రతులలో మాత్రమే ఉన్నది. నేటికి సుమారొక సార్ధశతాబ్ది మునుపు 1881లో ప్రాకృత గాథాసప్తశతిని సప్రమాణంగా పరిష్కరించి, Ueber das Saptaçatakam des Hâla అన్న పేరిట జర్మన్ భాషానువాదంతో, సంస్కృతంలోని సర్వవ్యాఖ్యానాలలోని మేలైన ఉదాహరణలతో స్వీయవ్యాఖ్యానసమేతంగా లీప్‌జిగ్‌లో అచ్చు వేసిన ఆల్బ్రెష్ట్ వెబర్ తన మహాగ్రంథంలో Die erste Teli̅n̅ga Recension అన్న పేరిటి విభాగంలో 450వ పుటనుంచి 501వ పుట వరకు ఇచ్చిన ఆంధ్రదేశపు వ్రాతప్రతులలోని గాథలలో దీనిని 479వ పుటలో 886వ గాథగా ఉదాహరించాడు. అందువల్ల మూలగాథయొక్క ప్రామాణికతను సంశయించటానికి వీలులేదు. పెదకోమటి వేమారెడ్డి భావదీపికా వ్యాఖ్యతో రూపొందిన గాథాసప్తశతీసారంలో ఇది 7వది. ఆ పాఠమూ, దాని ఛాయ ఇవి:

కస్స వ ణ హోఇ రోసో దట్ఠూణ పిఆఏ సవ్వణం అహరం
స-భమర-పోమ్మగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏణిహం.

కస్య వా న భవతి రోషో దృష్ట్వా ప్రియాయాః సవ్రణ మధరం
సభ్రమరపద్మాఘ్రాయిణి వారితవామే సహస్వేదానీం. (ఛాయ)

దీనిని అధికరించిన పెదకోమటి వేమారెడ్డి వ్యాఖ్య అమోఘంగా ఉన్నది. వ్యాఖ్యానరచనలో ఆయన శైలిని గుర్తింపగలరని దానినిక్కడ ఉదాహరిస్తున్నాను: “పోమ్మం ఇత్యత్ర “పద్మే మి” ఇత్యత్రోక్తం. (త్వం) ఏణ్హిం ఇత్యత్ర “ఏణిం ఏత్తహే ఇదానీమః” ఇతి ఇదానీం శబ్దస్య ఏణ్హిం ఆదేశః. అత్ర కాచిద్దిగ్ధా స ఖ్యుపపతినా దష్టాధరాం సఖీం పతి రాలోక్య కిం వా ప్రతివ క్తీతి తస్మిన్ సమాగచ్ఛతి సతి తదాగమన మజానతీవ తాం ప్రతి, హే వారితవామాస్యే మద్వచనాఙ్గీకారిణి ప్రియాయాః సవ్రణ మధరం దృష్ట్వా కస్య రోషో న భవతి, ఈర్ష్యాభరరహితస్యాపి రోషో భవ తీ త్యర్థః. సభ్రమరపద్మాఘ్రాణం న కర్తవ్య మి త్యుక్తం. కిమర్థం కృతం. ఇదానీం న కేవలం వేదనామేవ, తద్దృష్ట్వా తేన యత్క్రియతే తదపి సహస్వేతి సఖీం భర్త్సయన్తీవ తస్యా అధరక్షతి ర్భ్రమరకృతా అకృతేఽతి తం ప్రతి శ్రావయతీ త్యభిప్రాయః. అత్ర స్వతస్సిద్ధార్థశక్తిమూలో వస్తునాన్యవిషయో వస్తుధ్వనిః.”

పిఆఏ = ప్రియురాలి, సవ్వణం అహరం = పెదవిపై కొరికిన గాటును చూసి, కస్స వ = ఎవరికి మాత్రం, రోసో = కోపం, ణ హోఇ = రాదు చెప్పు, వారిఅ వామే = వద్దు వద్దంటున్నా ఓ నెచ్చెలీ, స-భమర = తుమ్మెద వాలి ఉన్న, పొమ్మగ్ఘాఇణి (ప్రాకృతంలో సతిసప్తమి ప్రయోగం) = పద్మాన్ని వాసన చూశావు, ఇదానీం = దీన్ని (ఈ బాధను), సహస్వ = భరించు (భరింపక తప్పుతుందా) – అని భావం.

నాయిక ఉపపతి దగ్గరికి వెళ్ళి వచ్చింది. రత్యున్ముఖీకరణకాలంలో అతను పంటితో ఆమె క్రింది పెదవిపై గాటుపడేట్లు దంతక్షతాన్ని ముద్రించాడు. ‘మీ ఆయన చూసినప్పుడు దాని సంగతి ఏమని చెబుతావు?’ అని చెలికత్తె ఆమెను అడగబోతున్నది. అంతలో పతి ఇంటిలోనికి అడుగుపెట్టాడు. నాయిక అతనిని చూడలేదు. చెలికత్తె చూసింది. ఆమె గడుసైనది. ‘విదగ్ధ అయిన దూతి’ అని వేమభూపాలుడన్నాడు. అంటే నాయిక కోసం ఆమె ఉపపతితో దూతీకృత్యాన్ని కూడా నిర్వహించినదన్నమాట. ‘చెబితే విన్నావు కావు. వద్దు వద్దంటున్నా తుమ్మెద వాలి ఉన్న పద్మాన్ని వాసన చూశావు. ప్రియురాలి పెదవిపై కొరికినట్లున్న గాటును చూసి ఎవరికి మాత్రం కోపం రాదు?’ అన్నది. ఈర్ష్యాభరం లేనివారికి సైతం ఆ స్థితిలో భార్యను చూసినప్పుడు రోషం పొడుచుకొని వస్తుంది. సభ్రమరపద్మాఘ్రాణం వద్దంటే విన్నావు కాదు – అని చెలికత్తె అన్న మాటకు ఉభయాన్వయం. చెయ్యకూడని పని చేశావు. పెదవిని కొరికినప్పుడు నొప్పి, ఆ తర్వాత గాటువలని బాధ, అని నాయికను ఆట పట్టిస్తున్నది. అధరక్షతం భ్రమరకృతమే కాని, అన్యకృతం కాదని భర్తకు చెప్పినట్లయింది. పొంచివున్న ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రకరణోచితంగా ప్రసంగించింది. అనుకోని ఆ ప్రస్తావనకు కారణాన్ని నాయిక గుర్తింపకమానదు. సంభ్రమం నుంచి సర్దుకొని ఆమె భర్తతో ఏమి మాట్లాడాలో ఆలోచించుకొనేట్లు చేసింది.

ఇందులో అలంకృతోక్తికి ప్రాధాన్యమేమీ లేదు. నాయిక ఉపపతితో భోగించి రావటమూ, ఆ ఉపభోగచిహ్నితమై ఆమె అధరోష్ఠంపైని కలిగిన దంతక్షత శృంగారవిలాసాన్ని చెలికత్తె చూడటమూ, అదే సమయంలో నాయకుని ప్రత్యాగమనమూ మొదలైన ఘట్టితాంశాలతో సన్నివేశంలోని చమత్కారం స్వతస్సంభవిగా అమరింది. ఇందులోని శబ్దాలకు పర్యాయపదాలను కూర్చి కొత్తగా వాక్యాన్ని రచించినా, ఆ శబ్దార్థాలు బోధించే అర్థంలో మార్పు ఉండదు. ఆ ప్రకారం శబ్దపరివృత్తిని చేసినప్పటికీ ప్రతీయమానమైన ధ్వన్యర్థానికి ఎటువంటి భంగమూ కలుగలేదు కాబట్టి ఇది అర్థశక్తిమూలకమైన ధ్వని. ఆ విధంగా స్వతస్సిద్ధంగానే సంభవించిన అర్థశక్తిమూలకంగా భ్రమరకృతాధరక్షతరూపమైన కథావస్తువుచేత ఉపపత్యుపభోగరూపమైన వస్త్వంతరం ధ్వనిస్తున్నది కనుక ఇది స్వతస్సిద్ధ – అర్థశక్తిమూలకృత – వస్తుధ్వని అని పెదకోమటిభూపాలుడు వివరించాడు. గాథాలక్షణమైన వ్యంగ్యాన్ని సహృదయ హృదయాహ్లాదకరంగా ఆవిష్కరించి రసాలంకారాలను కావ్యార్థంలో అంతర్భవింపజేయగల వ్యాఖ్యాతలు ఆయన వంటివారు ఎంతోమంది ఉండరు.