అనగనగా ఒక అందమైన రాజకుమారి. ఆ సుకుమారిపై ఒక దుండగీడు దాడికి దిగాడు. అమితంగా బాధ పెట్ట సాగాడు. ఆమె పడే బాధని చూడలేకపోయింది చెలికత్తె. కాని తాను మాత్రం ఏం చేయగలదు పాపం! అందుకే అతనిపై తిట్లదండకం మొదలుపెట్టింది. అవడానికి త్రేతాయుగానికి చెందినదయినా, అచ్చంగా ఒక తెలుగింటి సూర్యాకాంతమో నిర్మలమ్మో నోటినుండి ఊడిపడ్డట్టే ఉన్నాయామె మాటలు!
శా. నీ బాణంబులు రాల! నీ ధనువు ఖండీభూతమైపోవ! నీ
జాబిల్లిన్ ఫణియంట! నీ బలము లాశావీధి పాలై చనన్!
నీ బంట్రౌతుతనంబు స్త్రీల యెడనే! నిన్నెవ్వరున్ నవ్వరే!
మా బాలామణి నేచబోకు మకటా మర్యాదగా దాత్మజా!
“నీ బాణాలు రాలిపోనూ! నీ విల్లు విరిగిపోనూ! నీ తోడుగా తగుదునమ్మా అని వచ్చాడే నీ మామగాడు, అతన్ని పాము మింగెయ్య! నీ బలగమంతా నాలుగు దిక్కులా చెల్లాచెదరయిపోవా! ఆడదాని మీదనా నీ శౌర్యం. నిన్నుచూసి అందరూ నవ్విపోరూ! అయ్యో, నీకిది మర్యాద కాదు! మా ముద్దుగుమ్మని బాధించకు.”
ఇదీ వరస! తిడితే తిట్టింది కాని ఎంత సొగసుగా తిట్టిందీ! ఆ తిట్లు తిన్న శూరుడెవరో యీపాటికే అర్థమై ఉంటుంది. అవును అతనే. మనలోంచి, మన మనసులోంచి పుట్టి, ఆ మనసునే మథనానికి గురిచేసే అల్లరివాడు – ఆత్మజుడు, మనోజుడు, మన్మథుడు!
ఈ పద్యం కుమారధూర్జటి రచించిన ఇందుమతీపరిణయం కావ్యం లోనిది. కుమారధూర్జటి అంటే కాళహస్తీశ్వర శతకం, కాళహస్తిమాహాత్మ్యం రచించిన స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి మనుమడు. మన్మథ బాధ పొందిన ఆ రాకుమారి, రాముని నాన్నమ్మ అయిన ఇందుమతీదేవి. అజుడు ఇందుమతీదేవిని స్వయంవరంలో వివాహమాడే కథ, కాళిదాసు రఘువంశం ద్వారా చాలా ప్రసిద్ధి పొందింది. పూర్వకాలంలో ఆంధ్ర విద్యార్థులు తమ కావ్య అధ్యయనం రఘువంశంతో మొదలు పెట్టేవారు. కాబట్టి యిది తెలుగుకవులకు మరింత దగ్గరయినట్టుంది. ఈ కథని ఆధారం చేసుకొని కనీసం ఒక ఆరేడు కావ్యాలు తెలుగులో వెలువడ్డాయి. ఇవన్నీ ప్రబంధకాలంలోనూ ఆ తర్వాతా రచింపబడినవి. కాబట్టి వీటిల్లో ప్రబంధ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి. ప్రాచీన కావ్యాలలో, ముఖ్యంగా ప్రబంధాలలో, నాయికా నాయకులు ప్రేమలో పడడం, ఆపై ఒకరికొకరు దూరమై విరహంతో తపించడం అనేది ఒక తప్పనిసరి సన్నివేశం. ఆ విరహబాధను తట్టుకోలేక వారు దానికి కారణమైన మన్మథునీ, అతనికి తోడుగా ఉండి మన్మథతాపాన్ని మరింత పెంచే అతని పరివారాన్నీ తూలనాడడం ఆ సన్నివేశంలో తప్పనిసరి అంశం. నాయిక చెలికత్తెలు కూడా ఆమెకి తోడుగా తిట్లదండకం అందుకుంటూ ఉంటారు. దీనినే కాస్త ఘనంగా ‘ఉపాలంభము’ లేదా ‘ఉపాలంభనము’ అంటారు. అందులో కూడా మన కవులు తమ కల్పనాచాతుర్యానికీ భాషాగరిమకూ పదునుబెట్టి, ఆ దూషణపర్వాన్ని ఒక అందమైన ఘట్టంగా మలిచే ప్రయత్నం చేశారు. కొన్ని కొన్ని చర్వితచర్వణాలుగా అనిపిస్తాయి కాని, కొన్ని మాత్రం అంతకు ముందు చూడని ఒక కొత్త చమత్కారపు సోయగంతో మనసులని మురిపిస్తాయి. అలాంటి ఒక ముచ్చటైన ఉపాలంభన యిది.
శాపార్థంలో రాల, పోవ, అంట, మొదలైన క్రియారూపాలు కావ్యాలలో ఎక్కువగా కనిపించవు. కావ్యభాషలో అక్కడక్కడ గుబాళించే వాడుక ప్రయోగాలివి! ఇచ్చిన శాపాలు కూడా ఆయా వాటికి అతికినట్టు సరిపోవడం మరింత చమత్కారాన్ని కలిగిస్తోంది. మన్మథ బాణాలైన పూవులు రాలి పోవడం వాటి సహజ లక్షణం. అలానే విల్లు (చెఱుకు) విరగడం, జాబిల్లిని పాము (రాహువు) మింగడం, బలములు (చిలకలు, కోకిలకు మొదలైన పక్షి సంతతి) నలుదిక్కులా ఎగిరిపోవడం – అన్నీ కూడా సంభవించే అంశాలే. అవేవో అప్పుడే జరగిపోవాలని ఆ చెలికత్తె కోరిక! పైగా — అలా రాలిపోయే బాణాలూ విఱిగిపోయే విల్లూ మొదలైన బలహీనమైన సామగ్రితో కూడా మన్మథుడు అంతటి దండయాత్ర చేస్తున్నాడు — అనే వ్యంగ్యార్థం కూడా అందులో స్ఫురిస్తోంది. అందుకే నీ ‘బంట్రౌతుతనం’ (మన్మథుని ప్రతాపంపై ఉన్న చులకన భావమంతా ఈ పదంలో ధ్వనించడం లేదూ!) స్త్రీలపైనా అన్న ఎద్దేవా. అందులో కూడా — స్త్రీలపై కాదు, నువ్వు నిజంగా శూరుడవైతే వెళ్ళి ఆ రాజుపై నీ ప్రతాపాన్ని చూపు అన్న భావం కూడా ధ్వనిస్తోంది. (అప్పుడే కదా నాయికా నాయకుల సంగమం త్వరగా జరిగేది!) భాష విషయంలో ఈ పద్యంలో నాకు కనిపించిన మరొక విశేషం ‘నిన్నెవ్వరున్ నవ్వరే’ అన్న ప్రయోగం. నవ్వడం అనే క్రియ సాధారణంగా అకర్మకంగానే కనిపిస్తుంది. ‘అతన్ని చూసి నవ్వారు’ అని అంటాము కాని ‘అతన్ని నవ్వారు’ అని అనము. సంస్కృతంలో, పరిహసించు అన్న పదం సకర్మకం, ‘అతన్ని పరిహసించారు’ మొదలైన విధంగా. ఇక్కడ, నిన్ను నవ్వరా! అని ‘నవ్వు’ పదాన్ని సకర్మకంగా ప్రయోగించాడు కుమారధూర్జటి. మరెక్కడా యిలాంటి ప్రయోగం చదివిన గుర్తు లేదు.
ఇంతకీ యీ పద్యం ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందంటే, యీ నెల రాబోయే కొత్త సంవత్సరం మన్మథ నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలకి యీ పేర్లు ఎవరు పెట్టారో కాని చాలా తమాషాగా ఉంటాయి. ఒకవైపు వికారి, దుర్ముఖి, రుధిరోద్గారి, ఖర లాంటి బీభత్సకరమైన పేర్లు, మరొక వైపు మన్మథ, శ్రీముఖ, సౌమ్య లాంటి అందమైన పేర్లు! ప్రతి ఏటా వచ్చే ఉగాది సాధారణంగా వసంతుణ్ణి మాత్రమే వెంటబెట్టుకు వస్తుంది. ఈసారి అతనితో పాటుగా అతని దొరవారయిన మన్మథుని కూడా తీసుకువస్తోంది! కోరికకీ కామానికీ అధిపతులైన దేవతామూర్తులు ప్రతి సంస్కృతిలోనూ కనిపిస్తారు. అలాంటి దేవతలలో స్త్రీమూర్తులే ఎక్కువ. గ్రెకో-రోమను సంస్కృతిలో కనిపించే క్యుపిడ్ (Cupid) మాత్రం మగ దేవతే, మన మన్మథునిలాగే విల్లమ్ములు ధరిస్తాడు. తన బాణాలతో మనసులని కోరికల తాపానికి గురిచేస్తాడు. అయితే క్యుపిడ్ బాణాలు మన్మథబాణాలలా పూలబాణాలు కావు. అంచేత అవి గుచ్చుకుంటే కలిగేది మెత్తని బాధ అని చెప్పలేం. ఎంతటి తీవ్రమైనా, మన్మథబాణాలు కలిగించేది మాత్రం తీయని తాపమే! అది అతని ప్రత్యేకత. బాణాలే కాదు, అతని సరంజామా అంతా ప్రకృతికి సంబంధించినదే. చెఱుకువిల్లు, తుమ్మెదల నారి, పూలబాణాలు, చిలక వాహనం, చిరుగాలి రథం, చంద్రుడు సైదోడు. అంతా, మనసులని మరులుగొలిపే వసంతకాలపు ప్రకృతి. స్వయానా ఆ వసంతుడే అతని సైన్యాధిపతి. ఇలా దేవతా స్వరూపాలను ప్రకృతికి ప్రతీకలుగా రూపుదిద్దడం మన సంస్కృతిలో సర్వత్రా కనిపించే విశేషం. మన సంస్కృతికి ప్రకృతే జీవం. ప్రకృతికి దూరమైపోయి మన సంస్కృతిని కాపాడుకోవాలని తాపత్రయపడటం శవజాగరణ చేయడం లాంటిదే!
ఇంతకీ అసలు సంగతికి వస్తే, ఎంత సొగసుగా అయితే మాత్రం, మరీ శాపనార్థాలతో స్వాగతం పలికితే మన్మథుడు నొచ్చుకొంటాడో ఏమో! అమ్మో, అనంగుడే అలిగితే యింకేమైనా ఉందా! అంచేత అతన్ని ప్రసన్నుని చేసుకోడం మన తక్షణ కర్తవ్యం.
హరిహరాదుల కంటె నతి సనాతనుడ వీ
వఖిల జీవుల కంతరాత్మ వీవు
శంకరాదుల యున్కి శంకించువారుంద్రు
తెలియ నజాత నాస్తికుడ వీవు
అజుడగ్రజుండైన నగుగాక తత్కర్మ
కాండ నాదేశించు ఘనుడ వీవు
అల వేల్పు లందఱి వలె గాక యడుగక
వచ్చి వరాలిచ్చువాడ వీవు
కలడె వేల్పులందొకడు నీకంటె ఘనుడు?
అవితథమ్ములు యుష్మదీ యాయుధములు
సర్వదేవతలును శిరసా వహింత్రు
నేననగ నెంత! నన్ను మన్నింపు మింత
ఇది ఆచార్య ఎస్.వి. జోగారావు గారు రచించిన ప్రసన్న కుసుమాయుధం కావ్యంలో పద్యం. ఇదొక తమాషా అయిన కావ్యం. అమరపురిలో మన తెలుగు కవిదిగ్గజాలు అప్సరసలతో సాగించే సరససల్లాపాల గురించీ అక్కడ జరిగే సరదా సంఘటనల గురించీ చమత్కారమైన ఊహలతో సాగే శృంగారకావ్యం. ఇందులో దేవతలు కూడా వసంతోత్సవం, కాముని పున్నమ జరుపుకుంటారు! మన్మథుని స్తుతిస్తూ శ్రీనాథుని నోట పలికించిన పద్యమిది. మన్మథుడు ‘అజాత నాస్తికు’డట! అంతే కదా మరి. ఈశ్వరుడు లేడనే వారు ఉండవచ్చు కాని మన్మథుడు లేడనేవారు ఎవరుంటారు! బ్రహ్మ తనకు అగ్రజుడే కావచ్చు కాని ఆయన చేసే పనిని, అంటే సృష్టి కార్యాన్ని ఆదేశించే అసలు దేవుడు మన్మథుడే. మిగతా దేవుళ్ళలా కాకుండా, అడగకుండానే వచ్చి వరాలిచ్చేవాడూ అతడే! అవితథము అంటే వ్యర్థము కాని, మొక్కవోని అని అర్థం. అతని ఆయుధాలు తిరుగులేనివే కదా! ఇంతటి చమత్కారభరితమైన మన్మథస్తుతి మరెక్కడా నేను చదవలేదు! ఈ కావ్యంలో యిలాంటి చమత్కార పద్యాలు అడుగడుగునా ఉంటాయి.
ఆ సొగసైన తిట్లకి యీ సరసమైన పొగడ్తలతో ఉపశాంతి జరిగిపోయింది. కాబట్టి యిక రాబోయే మన్మథనామ సంవత్సరానికి మనసారా స్వాగతం పలుకుదాం!