(నవలాకారులుగా, కథకులుగా, కవిగా కలశపూడి శ్రీనివాస రావు గారు అమెరికా పాఠకులకు చిరపరిచితులు.)
రకరకాల రంగాలలో
పలు రకాల ప్రశంసలు పొందిన
అమెరికా ఆంధ్రుల అతిధులారా
అందుకోండి ఆహ్వానం!
మేం వదలివచ్చిన నేల “స్పర్శ”
మేం పొందలేని గాలి “శ్వాస”
మేం కోరుకొనే నీటి “తడి”
కొంత తీసుకురండి
సిలికన్ వేలీలో
సిరి తూగుటుయ్యాలలో
తలమునకలవుతున్న
తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూడండి.
ఇందు గలదు అందు లేదన్న
సందేహం లేక అన్ని రాష్ట్రాలలో
పోటీలమీద పుట్టుకొస్తున్న
కోటి డాలర్ల కోవిళ్ళను దర్శించండి.
“ఆంధ్ర భాషా పత్రిక” నుండి
“అమెరికా భారతి” దాకా
“తెలుగు వెలుగు”తో
“తెలుగు జ్యోతి”గా
వెలిగే “తానా పత్రిక”
మా సాహితీ ఉత్సాహానికి ప్రతీకలు
పలు చోట్ల చిన్నిచిన్ని ప్రయత్నాల
గోరు వెన్న ముద్దల రుచి చూడండి.
అమెరికా వ్యాపారపుటెడారిలో
అక్కడక్కడ అప్పుడప్పుడు
కనిపించి, వినిపించే
సాహితీ సమావేశాలలో పాల్గొనండి.
“డేన్”లైన ధనంజయలు
“పేట్”లైన పతంజలులు
“పేడ్”లైన పద్మలు
“క్రిస్”లైన కృష్ణవేణులు
తమకు తామే పరాయులైన
సోదర సోదరీమణులు
త్రిశంక స్వర్గ నివాసులు
వారి అభిప్రాయాల గనులు తవ్వకండి.
అడ్డు గోడలు దాటి వచ్చినా
అంటుకున్న మట్టి వదలక గోడలు కట్టే
అన్నయ్యలకు అక్కయ్యలకు
ఆసరాగా తాపీ మేస్త్రులవకండి.
భయంకర పరిస్థితులూహించుకోకండి
సునాయాసమైన జీవితమనుకోకండి
గ్రహించిన విషయాలను విశ్లేషించండి
అనవసరంగా శంఖంలో పోయకండి.
స్వేఛ్ఛా విగ్రహాన్ని పూజిస్తూ
దశమగ్రహమై పీడిస్తూ
అమెరికా మిమ్మల్ని బాధిస్తే
మీరు వంటరివారు కారు.
స్వేఛ్ఛను ఆశకు
అమ్ముకొనే అంగళ్ళు
అన్ని దేశాలలో లాగే
అమెరికాలోనూ ఉన్నాయి.
నిద్రపోని నగరాలు
జనజీవన నయాగరాలు
సుదీర్ఘ రహదారులు
నిజానికి ఈ దేశ ధమనులు.
వివిధ రీతుల, వివిధ జాతులు
కాలగతిలో కలిసిపోతూ
క్రొత్తజాతిని సృష్టించే ప్రయోగం
ఇక్కడి మహానగరాల ముఖ్య విశేషం
క్రొత్త మానవ ఆవిర్భావానికి
మనకి మనం వేసుకుంటున్న
చిన్న చిన్న పరిణామ సోపానాలను
పదిలంగా ఎక్కండి.
ప్రపంచంలో పలుచోట్ల భవిష్యత్ కాలం
నేడిక్కడ వర్తమానం
నిదానంగా కలుసుకోండి
అనుభూతులే ప్రధానంగా దాచుకోండి
నిర్మలమైన కెరటాల నీటితో
కడిగిన ఇసుక తిన్నెలాంటి
మీ మనోఫలకంపై,
ఈ ప్రవాహంలో
మీ కళ్ళు చూసే
మనిషి ఉన్నతి శిఖరాలకి
అగాధాల గాధలకి
నకళ్ళుగా వ్రాయండి!