నటన

ఇంటిమీద అప్పుచేసి ఇంటర్నెట్‌ స్టాక్‌లు కొన్నవాడిలా వెలవెలబోతున్న మొహంతో కొండమీంచి సముద్రంలోకి దూకేస్తున్నాడు సూర్యుడు.

ఇంటికొస్తూ ఆ దృశ్యం చూస్తోన్న శ్యాం కుమార్‌ మనసులో కూడా అలాటి ఆలోచనలే గజిబిజిగా గంతులేస్తున్నయ్‌.

ఆరేళ్ళుగా కూడబెట్టిందంతా ఆర్నెలల్లో హరించుకుపోయింది, స్టాక్‌ మార్కెట్‌ చావు దెబ్బతో.
డబ్బుతో పాటే రోజురోజుకీ పెరుగుతూ వచ్చిన ధీమా కూడా ఎయిడ్స్‌ రోగిలా ఎండి ఈ మధ్యనే పూర్తిగా బాల్చీ తన్నేసింది.
ఎవర్నైనా కళ్ళలోకి చూచి మాట్టాడాలంటే గుండెల్లోంచి వొణుకు పుట్టుకొస్తోంది.
“బిన్‌ లాడిన్‌ అనుచరుడివి కదా నువ్వు!” అని ఎవరైనా గట్టిగా దబాయిస్తే కిక్కురుమనకుండా ఒప్పేసుకునేంత పిరికితనం ఆవహించిందతన్ని.
“ఎవరికేది ప్రాప్తమో వాళ్ళకదే దక్కుతుంది” అనేది నిత్యపారాయణగా మారింది, భగ్గుమనే మనసు మీద నీళ్ళు పోయటానికి.

ఎన్నో వేల కదలని క్షణాల నరకయాతన తరవాత,
వందలు పెట్టి కొన్న స్టాక్‌లన్నీ ఒకట్లలోకి, సున్నాల్లోకి కృశించాక,
ఏడంకెల చరాస్తులు మూడంకెల్లోకి ముడుచుకున్నాక,
మిణుకుమిణుకుమన్న ఆశ పూర్తిగా కొండెక్కిపోయింది.
“ఇంతకన్నా, నరకం నయంగా ఉండితీరాలి” అనిపిస్తోంది.

ఇంట్లో ఇందిరతో కూడా నిజం చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితి!
“మార్కెట్‌ టాప్‌ లో ఉన్నప్పుడే మన స్టాక్‌లన్నీ అమ్మేశాలే!” అని బింకంగా చెప్పిన అబద్ధం యిప్పుడు గొంతు పట్టుకుంటోంది.
ఈ భీభత్సం చాలదన్నట్టు
రెండేళ్ళుగా కుక్క చాకిరీ చేస్తూ స్వర్గానికి వేసుకున్న నిచ్చెన్లు యిందాకే ముక్కలుగా విరిగిపొయినయ్‌.
బిలియన్ల వాల్యుయేషన్‌ వస్తుందనుకున్న కంపెనీ కాస్తా కొత్త రౌండుకు ఇన్వెస్టర్లు దొరక్క మూతబడింది.
ఆ ఉప్పెనలో అంతా కొట్టుకుపోయారు శ్యాం కుమార్‌ తో సహా!

ఇప్పుడున్న పరిస్థితుల్లో
తనకున్న క్వాలిఫికేషన్లతో
మరో జాబ్‌ దొరకటం కల్ల.

ఇలాటప్పుడు ఏ మొహంతో ఇంటికెళ్ళటం?
ఏ నోటితో ఫ్రెండ్స్‌ కి చెప్పటం?
ఇండియాలో ఈవిషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా?

ఇదంతా తెలిస్తే ఇందిర ఏమంటుంది? పెళ్ళై సరిగ్గా మూడేళ్ళు కాలేదు. కేవలం తను అమెరికాలో వున్నానన్న ఒక్క కారణం వల్ల తప్ప ఎంత తపస్సు చేసినా తనలాటి వాడికి ఇందిర లాటి అందగత్తె దొరికేదా? మరిప్పుడిలా డబ్బుతో పాటు జాబ్‌ కూడా పోగొట్టుకున్నట్టు తెలిస్తే ఏమంటుంది? పోనీ చెప్పకుండా ఉందామంటే తన కంపెనీ నిండా తెలుగువాళ్ళే. ఎవరో ఒకరు పనిగట్టుకునైనా ఏదో విధంగా చెప్పకమానరు.

ఇందిర జాబ్‌ కూడా ఈమధ్యనే పోయింది. ఇప్పుడింక ఇల్లు గడవటం ఎలాగ?

దిక్కూదరీ తోచని ఆలోచనలు. బుర్ర గిర్రున తిరుగుతోంది.
అలవాటుగా ఇంటికే దారి తీసింది కారు.
గరాజ్‌లో దిగాక గాని గుర్తుకి రాలేదు ఇందిరతో ఈవిషయం ఎలా చెప్పాలనేది అప్పటిదాకా ఆలోచించలేదని!
బిక్కుబిక్కుమంటూ అదురుతోన్న గుండెల్తో లోపలికి అడుగుపెట్టాడు, యింకేం చెయ్యాలో అర్థం కాక.

పరిగెత్తుకుంటూ అతనికి ఎదురొచ్చింది ఇందిర.
అనుకోకుండానే ఆమెను దగ్గరకు హత్తుకున్నాడతను.
ఇందిర కూడ అతన్ని కౌగిలించుకుని జుత్తు నిముర్తూ అన్నది “ఏమీ బాధపడకు శ్యాం, జాబ్స్‌ దేముంది, వస్తయ్‌, పోతయ్‌, మళ్ళీ వస్తయ్‌. వాటి గురించి మనసు పాడుచేసుకుంటే ఎలా? దా. గబగబా డిన్నర్‌ చేసి బయటికెళ్ళి ఏదన్నా సిన్మా చూసొద్దాం.”

ఒక్కసారిగా గుండెల్లోని బాధంతా గట్లు తెంచుకుని బయటికొచ్చింది శ్యాం కి.
కళ్ళలోంచి వరదలుగా కారింది.
ఎక్కిళ్ళు పెడుతూ భోరుమని ఏడ్చేశాడు ఆమె బుజాన తల ఆనించి.

చేత్తో అతని కళ్ళు తుడుస్తూ బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి బెడ్‌ మీద పడుకోబెట్టిందతన్ని. “కాసేపు రెస్ట్‌ తీసుకో, హాయిగా ఉంటుంది. ఇక దాన్ని గురించి ఆలోచించకు”.
“కాదు, కాదు. జాబ్‌ పోవటమే కాదు.. ఇన్నాళ్ళూ నీకు చెప్పలేదు గాని బ్యాంకులో ఇప్పుడున్నది అంతా కలిసి వెయ్యిడాలర్లే. మిగిలిందంతా స్టాక్‌ మార్కెట్లో పోయింది. నేనో దౌర్భాగ్యుణ్ణి. స్టుపిడ్‌ ఫెలోని. ఫూల్‌ని. రాస్కెల్‌ని. .. నన్ను క్షమించు…” విపరీతమైన ఎక్కిళ్ళ మధ్య బయటికొచ్చిన మాటల సారాంశం ఇది.
“ఐనా గాని ఏడిస్తే పోయినవి తిరిగిరావు కదా! ఏం చెయ్యాలో తర్వాత తాపీగా ఆలోచిద్దాం. ముందు కాసేపు పడుకో. ఈలోగా డిన్నర్‌ రెడీ చేస్తా. మూవీ కెళ్దాం.”

మగతగా పడుకున్నాడు శ్యాం. ఇందిర ప్రవర్తన కొత్తగా, వింతగా ఉంది. తన జాబ్‌ పోయినట్టు అప్పుడే ఎవరు చెప్పారో!
కళ్ళు మూసుకుంటే ఏవేవో భయంకరదృశ్యాలు కళ్ళముందు కనపడుతున్నయ్‌. తనకు ఐదేళ్ళప్పుడు తాతయ్య చనిపోయిన దృశ్యం అదే తను చూసిన తొలిచావు. కాలేజి రోజుల్లో ఓసారి సముద్రంలో యీదబోయి తను దాదాపుగా చావబోయిన సన్నివేశం .. మరోసారి వేసవి సెలవల్లో ఊరు బయట కొండెక్కుతూ కాలుజారి పెద్దబండ మీద పడబోతూ స్నేహితుడి కాలు పట్టుకు వేలాడిన సంఘటన .. దృశ్యాలన్నీ కలగాపులగమై పోయి అలుక్కుపోయి ఒకటిగా కలిసిపోయి .. నిద్రపట్టేసింది.

ఆ మిగిలిన రోజెలా గడిచిందో తెలీదతనికి. ఇందిరే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది, ఏవేవో చేయించింది. కలలో ఉన్న జాంబీ లాగా చెప్పినవన్నీ కిక్కురుమనకుండా చేశాడు. ఏదో సినిమా కూడా చూసినట్టున్నాడు.

మర్నాడు శనివారం ఆచారం ప్రకారం ఉద్యోగాల్ని ఊడబీకేది శుక్రవారం నాడు కదా!
పదకొండుకి నిద్ర లేచాడు శ్యాం. తల ఇంకా దిమ్ముగానే ఉంది గాని మెదడు ఇప్పుడిప్పుడే కాస్త ఆలోచించటం మొదలెట్టింది. ఐతే మొదటగా వచ్చిన ఆలోచనలు అంత ఆరోగ్యవంతమైనవి కావు. వాటి వెనకనే బోలెడు ప్రశ్నలు పుట్టుకొచ్చినయ్‌ మళ్ళీ ఇప్పట్లో ఎక్కడైనా జాబ్‌ దొరుకుతుందా? అందుకు వేట ఎక్కడ, ఎలా మొదలెట్టాలి? హెల్ప్‌ చేసే వాళ్ళెవరన్నా ఉన్నారా? ఉన్న డబ్బు ఎక్కువ రోజులు రాదు, చివరి పేచెక్‌ ని కలుపుకున్నా గాని. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం మంచిదా లేదా కొన్నాళ్ళపాటు ఇండియా వెళ్ళి ఉంటే బాగుంటుందా?
లెక్కలేనన్ని ప్రశ్నలు. సరైన సమాధానాలే కనపట్టం లేదు.

లంచ్‌ కి దోసెలు చేసింది ఇందిర. వాటితో సాంబారు కూడా. ఈ గోల లేకుండా ఉంటే కొంతమంది ఫ్రెండ్స్‌ని రమ్మని పిలవాలనుకుంది ఇందిర. అందుకు రెడీ చేసి ఉంచినవే ఈ దోసెపిండీ, సాంబారూను.
తింటూండగా అడిగిందతన్ని “ఇక చెప్పుడు చెప్పు విషయం అంతా. బ్యాంక్‌లో ఎక్కువ డబ్బులు లేవని నిన్ననేదో అన్నట్టు గుర్తు.”
ఒక్కసారిగా విలవిల్లాడాడు శ్యాం. పీడకల మళ్ళీ మొదలౌతోంది. చెప్పుకోలేని బాధ మూలుగ్గా ముసుగేసుకుని బయటికొచ్చింది.
“అవును. ఇన్నాళ్ళూ నీకు చెప్పాలంటే భయవేసి చెప్పలేదు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టిందంతా పోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో వాటిని అమ్మితే ఏమీ రాదు.” తలదించుకుని సాంబార్‌ని కెలుకుతూ అన్నాడు.
“స్టాక్‌లన్నీ కేష్‌ ఎకౌంట్‌లోనే ఉన్నాయని చెప్పావు కదా, అదైనా నిజమా కాదా?”
“కాదు. ఆర్నెల్ల క్రితం దాన్ని మార్జిన్‌ ఎకౌంట్‌గా మార్చాను.”
“ఐతే మొత్తం ఎంత పోయింది?”
“ఉన్నదంతా పోయినట్టే”
“ఒకప్పుడు స్టాక్‌ పోర్ట్‌ఫోలియో వాల్యూ మిలియన్‌ పైగా ఉందన్నావ్‌ కదూ! అదీ నీ అబద్ధాల్లో ఒకటా?”
“కాదు, కాదు. మార్కెట్‌ బాగా హైలో ఉన్నప్పుడు నిజంగానే మిలియన్‌ దాటింది.”
“అందులో మన ఒరిజినల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బయటికి తీసి మనీ మార్కెట్లో పెట్టమని ఎన్నో సార్లు చెప్పాను కదా! అలా చెయ్యలేదన్న మాట!”
మౌనమే అతని సమాధానం.
“మూడేళ్ళ నుంచి ఇద్దరం కలిసి సంపాయించి సేవ్‌ చేసింది కనీసం రెండు లక్షలు ఉంటుంది. ఇక అంతకు ముందు మూడేళ్ళలో నువ్వు సేవ్‌ చేసింది మరో లక్ష అనుకుంటే మొత్తం మూడు లక్షల డాలర్ల సొంత డబ్బు పోయిందన్న మాట. ఇంత డబ్బు పోతున్నప్పుడు ఒక్కసారైనా ఐడియా రాలేదా ఒరిజినల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బయటికి తీసుకోవాలని?”
“ఎక్కడ చూసినా, ఎవరితో మాట్టాడినా స్టాక్‌ మార్కెట్‌లో ఎలా సంపాయించాలో సలహా ఇచ్చే వాళ్ళే కదా! ఆఫీసులో గాని, పార్టీల్లో గాని, ఎవడితోనన్నా ఫోన్లో మాట్టాడినా గాని, ప్రతివాడూ స్టాక్‌ల్లో రోజుకి ఎంతెంత సంపాయిస్తున్నాడో చెప్పి ఊదరగొట్టేస్తుంటే చూస్తూ చూస్తూ బయటికి తియ్య బుద్ధి కాలేదు. దానికి తోడు ప్రతి తలమాసిన వాడూ వాడి స్టాక్‌ ఆప్షన్ల వాల్యూ ఐదు మిలియన్లు, పది మిలియన్లని చెవి కింద జోరీగ లాగా హోరెత్తిస్తుంటే తట్టుకుని నిలబట్టం ఎవరి వల్లౌతుంది?..” ఇందిర కూడా తనతో పోటీగా ఓ చిన్న ఎకౌంట్‌ ఓపెన్‌ చేసి దాన్లో పెట్టిన ముప్ఫైవేల డాలర్లూ పోగొట్టిందన్న విషయం గుర్తు చేసేంత తిక్క వొచ్చినా అతి కష్టం మీద తమాయించుకున్నాడు.
“ఇంత జరుగుతున్నా నాకు ఒక్కసారి కూడా నిజం చెప్పలేదు నువ్వు” ఆమె గొంతులో స్పష్టంగా వినిపించిన కోపానికి, విసుక్కి బిక్క చచ్చిపోయాడు శ్యాం.
“పొరపాటైపోయింది, మళ్ళీ ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పను.”

అతని వంక సూటిగా చూసింది ఇందిర.
“ఇక నుంచి రూల్స్‌ మారబోతున్నయ్‌. ఈ యింట్లో డబ్బు విషయాలన్నీ నేను చూడబోతున్నా. బిల్స్‌ పే చెయ్యటం దగ్గర్నుంచి అన్ని విషయాలు నేనే చూసుకుంటా. చెక్‌ రాయాలన్నా, క్రెడిట్‌ కార్డ్‌ ఉపయోగించాలన్నా నన్నడక్కుండా చెయ్యటానికి లేదు. సరేనా?”
బుద్ధిగా తలూపాడు శ్యాం.
“ఊరికే తలూపితే చాలదు. ఇది చాలా సీరియస్‌ వ్యవహారం . నీకేదో పెద్ద తెలుసునని చెప్పి నేను పట్టించికోకపోతే మిలియన్‌ డాలర్ల పైగా తగలేశావ్‌ నువ్వు. నీకిచ్చిన ఛాన్స్‌ ఐపోయింది. ఇక ముందెప్పుడూ డబ్బు విషయంలో నిన్ను నమ్మేది లేదు. ఈ నిర్ణయానికి కట్టుబట్టంలో నీకే మాత్రం అనుమానం ఉన్నా సరే, యిప్పుడే చెప్పెయ్యి.”
“లేదు, లేదు. ఏ మాత్రం అనుమానం లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తా.”
“తరవాత మళ్ళీ మాట తప్పావంటే మాత్రం మర్యాద దక్కదు. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు.”
“తప్పను, తప్పను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్పమంటావా?”
“ఒట్లెందుకులే! ఇదంతా రికార్డ్‌ చేసి ఉంచుతున్నాగా!”
“సరే ఐతే. మరైతే ఇప్పుడు మనిద్దరికీ జాబ్స్‌ లేవు కదా, డబ్బెక్కణ్ణుంచొస్తుంది?”
“అంతా పోగొట్టి ఇప్పుడు ఏడుపు మొహంతో నన్నడిగితే నా దగ్గర రెడీ మేడ్‌ సొల్యూషన్‌ ఉంటుందా ఏమిటి? ఏదో ఆలోచిస్తాలే. రాత్రికి మధు వాళ్ళింట్లో పార్టీ ఉంది కదా, అక్కడ ఉపయోగపడే విషయాలు ఏవన్నా తెలియొచ్చు.”
“నేను గూడా కనుక్కుంటా, ఎవరన్నా హెల్ప్‌ చేస్తారేమో.”
“వొద్దొద్దు. కావాలంటే జాబ్స్‌ గురించి మాట్టాడు గాని స్టాకుల్లో డబ్బులు పోయిన విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు. ఆ సంగతి ఎవర్తోనన్నా అన్నావంటే ఊరుకునేది లేదు.”
“అలాగలాగే. ఒట్టు, ఎవరితోటీ అనను.”

నవ్వేసింది ఇందిర.

ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం

వాళ్ళు వెళ్ళేసరికి శివరాం వాళ్ళ ఇల్లు హడావుడిగా ఉంది. శ్రీను, మాధవ్‌, సుధాకర్‌ వాళ్ళు అప్పటికే వచ్చేశారు. శివరాం భార్య మధు యధాప్రకారంగా గలగలా మాట్టాడేస్తూ అటూయిటూ తిరుగుతోంది. అందరూ బీర్‌బలులై నిలబడి మాట్టాడుకుంటున్నారు. ఓ టేబుల్‌ మీద నట్స్‌, చిప్స్‌, పకోడీలు ఉన్నయ్‌.

ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబుల గురించీ అమెరికాలో యాంత్రాక్స్‌ గురించీ గబగబా కొంచెం సేపు మాట్టాడేసుకున్నాక అందరూ ఎదురుచూస్తున్న విషయం రానే వచ్చింది.

“ఈ ఎకానమీ యింకా ఎంతకాలం ఇలా ఉంటుందో తెలీటం లేదు గాని కంపెనీలు మాత్రం లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ మూతబడిపోతున్నయ్‌” అన్నాడు అప్పుడే వచ్చిన రమేష్‌.
అప్పటికే శ్యాం కంపెనీ సంగతి తెలిసిన మిగిలిన వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఐపోయి తలలు దించుకుని కొనచూపుల్తో శ్యాం వంక, రమేష్‌ వంక చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో ఇందిర కల్పించుకోకపోతే అలా ఎంతసేపు ఉండేవాళ్ళో!
“నిజమేనండీ, మరీ అన్యాయంగా ఉంది. నిన్ననే శ్యాం వాళ్ళ కంపెనీ కూడా మూసేశారు. ఏదో ఇదివరకు సేవ్‌ చేసుకున్న మనీ ఉంది గనక మనలాటి వాళ్ళకి పర్లేదు గాని అలా సేవ్‌ చేసుకోకుండా ఏ స్టాక్‌ మార్కెట్‌ లోనో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలో?” అంది ఏ మాత్రం తొణక్కుండా.
“ఔనౌను, ఈస్ట్‌ కోస్ట్‌ లో ఉండే మా కజిన్‌ వాళ్ళొకళ్ళు యీ మధ్యనే ఇండియా తిరిగెళ్ళారు. ఇక్కడ ఒక నెలకయ్యే ఖర్చుతో అక్కడ ఒక యేడాది గడపొచ్చు కదా!” అన్నాడు శ్రీను కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ.
“నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది స్టాక్‌ మార్కెట్‌లో బాగా దెబ్బ తిన్నార్లే. ఐనా మరీ అత్యాశకి పోయి ఉన్నదంతా స్టాక్‌ల్లో పెట్టటం ఎందుకూ? ఇప్పుడు అదంతా పోయిందని ఏడవటం ఎందుకు? ఆ జ్ఞానం ముందే ఉండాలి” ఆవేశంగా అన్నాడు శ్యాం, భార్య మాటల్తో ఉత్సాహం పుంజుకుంటూ.
“మార్కెట్‌ పడుతుంది, పడుతుంది అని అంతా అన్నవాళ్ళే గాని నిజంగా అది పడుతున్నప్పుడు మాత్రం చాలా కొద్ది మందే ముందుగా బయటపడింది. చేతులూ, కాళ్ళూ కాల్చుకున్న వాళ్ళే చాలా ఎక్కువ” అన్నాడు సుధాకర్‌ సాలోచనగా.
“నా కళ్ళకి ఇక్కడ అందరికీ కాళ్ళూ చేతులూ బాగానే ఉన్నట్టు కనపడుతున్నయ్‌” అన్నాడు మాధవ్‌ వాతావరణాన్ని కొంత తేలిక పరుస్తూ.
అంతా నవ్వేశారు. “నిజమే, నిజమే. మన టీమ్‌లో ఎవరూ పెద్దగా దెబ్బ తిన్నట్టు లేరు” అన్నాడు రమేష్‌.
“ఏమో బాబూ, ఏనాడైతే యాహూ రొండొందల నించి ఒక్కసారిగా నూట యాభైకి పడిపోయిందో అప్పుడే నాకు గట్టిగా అనిపించింది యీ మార్కెట్‌ ఇంక కిందికే గాని పైకి పోయేది కాదని. వెంటనే స్టాక్సన్నీ లిక్విడేట్‌ చేసి బయటికొచ్చేశా!” అన్నాడు శ్యాం తన పాత్రని అద్భుతంగా పోషిస్తూ.
“శ్యాం, రెణ్ణెళ్ళ నాడు నీ యాహూ స్టాక్‌ అంతా ఇంకా అలాగే ఉందని చెప్పావు గదా?” అనడిగాడు శ్రీను అమాయకంగా.

గొంతులో హఠాత్తుగా పడ్డ పచ్చి వెలక్కాయని మింగటానికి శ్యాం తిప్పలు పడుతుంటే వెంటనే అతన్ని రక్షించటానికి ఇందిర రంగం లోకి దూకేసింది.
“అది కాదు శీనూ, ఏదో మన ఫ్రెండ్స్‌ మధ్యన మనం నిజం చెప్పుకోవచ్చు గాని బయటివాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అందర్లాగే మనకీ స్టాక్‌మార్కెట్‌లో బాగా లాసొచ్చినట్టు యాక్ట్‌ చేస్తానన్నాడు శ్యాం. అదీ నిజమే కదా, లేకపోతే మళ్ళీ లేనిపోని జెలసీలు” అంది అతన్ని నచ్చజెబుతున్నట్టుగా.
“ఆ రోజు కూడా బయటివాళ్ళు ఎవరూ లేరనుకుంటానే” అని పట్టువదలని విక్రమార్కుడిలా లాగబోతున్న శ్రీను మాటల్ని మొదల్లోనే తుంచేస్తూ మధు అందుకుంది
“ఇందూ, నువ్‌ నమ్మవ్‌ గాని నాకూ అదే ఐడియా వచ్చింది తెలుసా? ఆ మాటే శివాతో అంటే అతనేదో హరిశ్చంద్రుడికి అన్నైనట్టు, చూస్తా చూస్తా అంత అబద్ధం చెప్పటం నా వల్ల కాదు పొమ్మన్నాడు. అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ ఒకటే చెప్పటం, మాకు స్టాకుల్లో ఆరొందల వేలు వొచ్చినయ్యని. ఒక పక్కన ఉన్నయ్యన్నీ పొయ్యి వాళ్ళు ఏడుస్తుంటే మధ్యలో ఇదెక్కడ గోలని నేను ఎంత చెప్పినా వినడే!” అంది మధు కూడా ఇందిర శ్రుతిలోనే పాడుతూ.

భార్య దగ్గరున్నప్పుడు భాషని అతి పొదుపుగా వాడే శివరాం ఎవరో గొంతు పట్టుకున్నట్టు ఏవో శబ్దాలు చేశాడు, ఎవరూ పట్టించుకోక పోయినా.

అంతా తలా కాసేపు అలా మనసులు విప్పి చెప్పుకున్నారు స్టాక్‌ మార్కెట్‌లో ఒక్కొకరు ఎంత సంపాయించి, మార్కెట్‌ పడటం మొదలు కాగానే ఎలా బయటికొచ్చేసిందీను. ఇప్పుడున్న బేర్‌ మార్కెట్‌లో నైనా సరే కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు సంపాయించటం ఎంత తేలికో కథలు కథలుగా వివరించుకున్నారు. ఆ తరవాత ఒక చిన్న పోటీ పెట్టుకున్నారు ఒకే ఒక్కరోజులో ఎవరెవరు ఎంత సంపాయించారో, అందర్లోకి ఎవరు ఎక్కువ సంపాయించారోనని. దాన్లో కూడ శ్యామే గెలిచాడు యాభై ఇంటెల్‌ కాల్స్‌ ఒక్కొకటీ రెండు డాలర్లకి కొని పదికి అమ్మి ఒక్కరోజులో నలభై వేలు సంపాయించాడు (ట)!

అక్కణ్ణుంచి స్టాక్‌ మార్కెట్‌లో పోగొట్టుకున్న వాళ్ళ మీదికి మళ్ళినయ్‌ మాటలు. పదేళ్ళపాటు చచ్చీచెడీ దాచిన సేవింగ్స్‌ అన్నీ డాక్టర్‌కూప్‌ డాట్‌కామ్‌ లో పెట్టి పోగొట్టుకున్న వాళ్ళని గురించి ఒకరు చెప్తే, ఇంటిమీద సెకండ్‌ మార్ట్‌గేజ్‌ తీసుకుని ఆ డబ్బు కూడ మార్కెట్‌లో పోగొట్టుకున్న వాళ్ళ గురించి మరొకరు చెప్పారు. క్రెడిట్‌ కార్డ్‌ మీద అప్పుచేసి తెచ్చిన యాభై వేలూ ఇంటర్‌నెట్‌ స్టాక్‌ల మీద వొదిలించుకున్న వాళ్ళ కథ ఒకరు వినిపిస్తే పెన్షన్‌ ప్లాన్‌ నుంచి లక్ష డాలర్లు విత్‌డ్రా చేసి మార్జిన్‌ మీద ఇంకా అంత అప్పుచేసి టెక్‌ స్టాకుల్లో అదీ ఇదీ అంతా కలిపి పోగొట్టుకున్న వాళ్ళ గురించి మరొకరు అభినయించి చూపించారు.
నవ్వుల్తో, కేరింతల్తో నిండిపోయింది వాతావరణం అంతా.
“హబ్బ, హబ్బ, నవ్వలేక చస్తున్నా” పొట్ట పట్టుకుంటూ అన్నాడు శ్రీను, కన్నీళ్ళొచ్చేలా నవ్వుతూ. అంతలోనే ఎందుకో హఠాత్తుగా ఆ నవ్వు కాస్తా ఎక్కిళ్ళ లోకి తర్జుమా అయింది.
“ఇంకో బీర్‌ తాగు” సలహా ఇచ్చారెవరో.
చూస్తుండగానే ఎక్కిళ్ళకి ఏడుపు కూడా జతయ్యింది.
అతనికి ఏవైందో ఎవరికీ స్పష్టంగా అర్థం కాలేదు.

ఎలాగో గొంతు పెగుల్చుకుని మాట్టాడాడు శ్రీను “ఇంక యీ యాక్టింగ్‌ నా వల్ల కాదు … నిజం చెప్తున్నా వినండి.. ఈ దేశానికి వొచ్చిందగ్గర్నుంచి సేవ్‌ చేసిందంతా స్టాక్‌ మార్కెట్‌ దెబ్బతో కొట్టుకుపోయింది. బోలెడంత తీసుకుని ఇండియాకి తిరిగెళ్ళి దర్జాగా లైఫ్‌ గడపొచ్చని ఇక్కడ తిండి కూడా సరిగా తినకుండా దాచిన డబ్బది. బ్యాంకులో ఇప్పుడెంతుందో తెల్సా? పదిహేనొందలు! బోడి పదిహేనొందలు! ఈ ఉన్న ఉద్యోగం కూడా ఎన్నాళ్ళుంటదో తెలీదు. రోజూ నిద్రపట్టటం లేదు. పీడ కలల్తో చస్తున్నా. ఇక్కడ తిండి దొరక్క ఇండియాకి పోయినట్టూ, అక్కడందరూ పురుక్కింద చూసి ఇంట్లోంచి బయటికి నెట్టినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. సూయిసైడ్‌ చేసుకుందామా అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు!” బావురుమన్నాడు శ్రీను.
అంతలోనే కొంతవరకు సంభాళించుకుని ఏడుపునవ్వుతో అన్నాడు “సారీరా, నన్ను క్షమించండి. ఎవరికొకరికి చెప్పుకోకపోతే పిచ్చెక్కేట్టుంది. కాని, ఇంకెవరికీ ఈ విషయం చెప్పకండిరా!” దీనంగా ఉన్నాయతని మాటలు.
అంతా బిక్క చచ్చిపోయి జాలిగా అతని వంకే చూస్తున్నారు.
మరో మూల కొంత తృప్తి కూడ.

“ఇంక నయం, నా సంగతి కూడ చెప్పాను కాదు” మనసులోనే అనుకుని ఆనందించాడు శ్యాం.
మిగిలిన వాళ్ళు కూడా అందరూ అదే స్థితిలో ఉన్నారు.