మిమోసా ప్యూడికా


“నీకు పుట్టిన కాణ్నించీ బయ్యివేఁరా…” అనేది అమ్మ ఎగతాళిగా. నేను నవ్వేవాణ్ని.

నేను పసికందుగా ఉన్నప్పుడు చన్ను నోటికందిస్తే ఊరుకునే వాణ్ని కాదట. నోట కరచుకుని చప్పరిస్తూనే ఒక చేతిని అమ్మ రెండో చన్ను మీద ఉంచి, నిమ్మళంగా కళ్లు మూసుకుని తాగుతూ ఉండేవాడినట.

“నీ ఆస్తిని ఎవురైనా ఎత్తుకెళ్లిపోతారని, ఇంకెవరైనా వచ్చి ఆ బాయి తాగేస్తారని నీకు బయ్యిం రా,” నవ్వేది అమ్మ.

అమ్మ చెప్పిన ఆ ముచ్చట్లు నాకు గుర్తులేవు. గుర్తున్నవి వేరే. నేను భయస్తుడిననేది నిజమే. ఇంటికి ఎవరైనా కొత్త అతిథులు వస్తే నేను అమ్మ వెనక్కు వెళ్లిపోయి, పైటకొంగు చాటున నిల్చుని అమ్మ కాళ్లను గట్టిగా వాటేసుకుని దాక్కునేవాణ్ని. తెలిసినవాళ్లు వచ్చినా కూడా అమ్మ ముందుకు చేరి, చీర కుచ్చిళ్ల మధ్య సగం దాక్కుని, అటుగా వెళ్తున్న పైట పొరను మొహం మీదికి లాక్కుని ఆ తెరలోంచి చూస్తుండేవాణ్ని.

ఎదిగే కొద్దీ, నాలోని భయం, పిరికితనం పెరిగాయో, పారిపోయాయో చెప్పలేను. అమ్మ స్పర్శకు మాత్రం దూరం కాలేకపోయాను. మేం ఎవ్వరం బయటకు వెళ్తున్నా అమ్మకు ఓ ముద్దు పెట్టేసి వెళ్లడం ఆచారంగా మారిపోయింది మా ఇంట్లో. అది విశేషం కాదు. పని ఒత్తిడిలో బుర్ర వేడెక్కిపోయినప్పుడు, వంట ముగించి నిమ్మళంగా సోఫాలో సేదతీరుతుండే అమ్మ చెంతకు వచ్చి, ఎదురుగా నేలపై కూచునే వాణ్ని. అమ్మకదా… ఆమెకు సంకేతం అందిపోయేది. నా తలలోకి వేళ్లు జొనిపి నెమ్మదిగా నిమురుతూ. ఎప్పటెప్పటివో ముచ్చట్లు, తానెరిగిన రామాయణ భారత కథలూ పంచుకోవడం ప్రారంభించేది. కాసేపటికి నా బుర్ర మీద ఉన్న బరువంతా దూదిపింజెలా ఎగిరిపోయేది. మళ్లీ గోదాలో దూకేవాణ్ని.

గోగాకు వొలవడానికో, పూలు కట్టడానికో, అమ్మ నేల మీద కూర్చున్నదంటే చాలు. ఆమె ఒడిలో ఎవరు ఏ పక్క తలపెట్టుకుని పడుకోవాలో తేల్చుకోడానికి నా పిల్లలతో పోటీ పడుతుండేవాణ్ని. హాయిగా అనిపించేది. ఆ హాయి యింకో దారిని వెతుక్కోవాల్సిన రోజు, దాని సహజక్రమంలో వచ్చిపడింది. బతుకు ఆట – ఆశకు తగ్గట్టుగా సాగదనే సత్యం తెలిసింది.

అమ్మ ఒడిలో ఉండే వెచ్చదనం, అమ్మ చేతి స్పర్శలో ఉండే చల్లదనం ఎవరికి మాత్రం తెలియవు? వాటి పేరే ప్రేమ అని, రూపమే ధైర్యమని నాకో నమ్మకం.


మిస్టర్ బీన్ చూస్తున్నాను.

‘యూ లైక్ దిస్ డిష్ వెరీ మచ్,’ తన ఎదుట ప్లేట్‌లో డిష్ సర్వ్ చేసి, స్పూన్ అందించాడు బీన్.

‘వావ్… దిసీజ్ డెలీషియస్. యూ విల్ ఎంజాయ్ ఇట్,’ రుచి మొత్తం కళ్లలో కనిపిస్తుండగా తనతో ఆ అనుభూతిని షేర్ చేసుకున్నాడు. రెస్టారెంట్లో వాళ్ల డిన్నర్ అయిపోయింది. లేచి, నేప్‌కిన్‌తో తన మూతి తుడిచి, బుగ్గలు చిదిమి బుజ్జగించి, ‘గుడ్ బోయ్’ అని కితాబిచ్చి, తన కారు ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టి, సీట్‌బెల్ట్ పెట్టి మరీ భుజం తట్టాడు, టెడ్డీని!

పూర్ బీన్. ఎవరూ లేరు తనకి. అంతా ఆ టెడ్డీనే!


“ఇలా ఉన్నప్పుడు, నాకు ఇంకేం వద్దనిపిస్తుంది…” అనేది రాధ తన్మయంగా. నేను నవ్వేవాణ్ని.

పడగ్గదిలో కొంత సమయం గడచిన తర్వాత, తను నా గుండెల మీద తలపెట్టి, ఒత్తిగిలి పడుకున్నప్పుడు, మౌనానికీ మౌనానికీ మధ్యలో బయటకు వచ్చే మాట అది! ఆమె మనసులో బలంగా నాటుకునేలాగా, ఆ సమయంలో నేను, ఆమె వీపు మీద జో కొడుతున్నట్టుగా ఒక చేతి మునివేళ్లను తాడిస్తూ, మరో చేత్తో మొహాన్ని నా గుండెలకేసి పొదవుకుని, పువ్వులాంటి చెవి తమ్మెలను సుతిమెత్తగా పరామర్శిస్తూ ఉంటాను.

“నీ ఆస్తిని ఎవ్వరూ ఎత్తుకుపోలేరు,” అంటాను, కొన్ని క్షణాల స్పర్శాపరామర్శల విరామం తరువాత. చాలాసార్లు, గుసగుసల స్వరంతో ఆ మాట వచ్చేలోగా ఆమె నిద్రలోకి జారుకుని ఉండేది. ఎముకలు తేలిన గుండెలే పానుపుగా సేదతీరడంలో తనకేం సుఖపరవశం దక్కుతుందో నాకు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. నా దేహపుష్టి అలాంటిదీ మరి! ప్రతి రోజూ అలా మాత్రమే జరిగేది కాదు.

అప్పుడప్పుడూ నేనే, ఆమె మెత్తటి పొత్తి మీదకు తల చేర్చి అడ్డంగా పడుకునేవాడిని. ఒక చేతిని నా గుండెలపై ఉంచి, వేళ్లతో పలచటి జుత్తును రింగులుచుడుతూ తను ముచ్చట్ల ప్రవాహం అయ్యేది. మోహభాషకు వ్యక్తరూపాలు వేనవేలు! మా పసితనమూ, కౌమారమూ, యవ్వనమూ అన్నీ అందులో తేలియాడూతూ వస్తుండేవి. వర్తమానంలోని బతుకు స్పర్శ ఉత్సాహంగా మారేది. బతుకులోని వర్తమానపు సమీక్ష స్తబ్ధత నింపేది. రేపటి బతుకు గురించిన ఆశ మెరమెరలాడుతుండేది. బూచిలాంటి అనుభూతులు మాటల్లో దోబూచులాడుతున్నా, ఆ సమాగమపు స్పర్శావరణంలో నిశ్చింత – గులాబీ అత్తరులా పరిమళిస్తుండేది!

“ఈ ముచ్చట్లు కొంచెం కట్టిపెట్టుకోవాలి యిక,” అంది ఓనాడు. చిన్న చిన్న బతుకుల్లో అంతే. తలుపులు మూసుకుని పడుకోవడం కూడా ఒక లగ్జరీ.

స్పర్శ లేకపోయినంతనే నిశ్చింత మాయమౌతుందని కాదు. జీవితం అలాంటి నిర్వచనం చెప్పదు. లేనిదల్లా అత్తరు పరిమళాలే. ఆ పరిమళానికి మరో రూపం భరోసా!


టెడ్డీలంటే మైకేల్ జాక్సన్‌కు ఇష్టమని, నాకు ‘మైకేల్’ సినిమా చూసేదాకా తెలియదు.

ఇదో పెద్ద సమస్య. ఒక రంగంలో పెద్ద సెలబ్రిటీ అయిపోతే, ఆ మనిషిలోని మిగిలిన జీవితాన్ని ప్రపంచం కర్కశంగా అణిచేస్తుంది. కనీసం గుర్తించకుండా ఇగ్నోర్ చేస్తుంది. వాళ్ల ఆసక్తులూ, మోహాలూ సమస్తం, వారిని మీరి పెరిగిన కరిస్మా ముందు దిగదుడుపు అవుతాయి. వాళ్లకు మాత్రమే అనుభవమయ్యే, ముల్లులా గుచ్చుతూ ఉండే మానని లేత గాయం అది. ఎందరుండగలరు, అబ్దుల్ కలామ్‌లాగా? తన కరిస్మా పరిధిలోంచి బయటకు వెళ్లి వీణావాదనలోని తన్మయత్వాన్ని పదిలంగా కాపాడుకునేవాళ్లు!

జాక్సన్‌కు పెట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బీన్ కంటే ఇతను బెటర్. జాక్సన్ గదిలో ఎక్కడపడితే అక్కడ మడోన్నా కనిపిస్తుంటుంది. అది తనతో మాట్లాడదు. ముచ్చట్లు చెప్పదు. కనీసం బబుల్స్‌లాగా తనతో ఆడుకోదు. కానీ అప్పుడప్పుడూ, పడుకుని ఉన్న జాక్సన్‌పై ఒళ్లంతా పాకుతూ ఉంటుంది, అంతే! నోరు మెదపకపోయినా, మడోన్నాకు ఎప్పుడెప్పుడు ఆకలి అవుతుందో కూడా జాక్సన్‌కు తెలుసు. మడోన్నా అంటే అంత ప్రేమ మరి!


“ఇది నా గుర్రం… లకలకలక యెల్తాది,” అనేవాడు కృష్ణ సంబరంగా. నేను నవ్వేవాణ్ని.

కాసేపు రకరకాల ఆటలాడుకున్నాక నన్ను పిలిచి సైగ చేసేవాడు. నేను గుర్రంలా నాలుగు కాళ్లమీదికి, వాడు కోరుకునే భంగిమలోకి రావాలి. అతి కష్టమ్మీద నా మీదకు ఎగబాకి చొక్కా కాలర్ ఒడిసిపట్టుకుని, సవారీ చేస్తూ ‘చల్… చల్…’ అనేవాడు. నేను గది మొత్తం గుర్రంలా కలియతిరిగేవాణ్ని. అన్ని ఆటల్లోకీ వాడికి గుర్రం ఆటే ఎక్కువ ఇష్టం. ఒంటె ఆట కూడా ఉండేది. అది ఇన్‌డోర్ కాదు. అవుట్‌డోర్ గేమ్! మేమిద్దరం బయటకు వెళ్లినప్పుడు, నామీద ఎక్కి కూచునేవాడు, భుజాల మీదుగా కాళ్లు రెండూ ముందుకు వేళ్లాడేసి! నా తలచుట్టూ రెండు చేతులూ వేసి పట్టుకుని ‘ఇది నా ఒంటి’ అంటూ సవారీ చేసేవాడు.

బిడ్డను కనిపెట్టుకుని ఉండడం అనేది నాకెప్పుడూ పెద్ద ప్రయాస అనిపించేది కాదు. నడవాల్సి వచ్చినా, బయట ఎక్కడ తిరుగుతున్నా. అసలు నా వేలిని వదిలిపెడితేగా?

పడుకోవడంలో కూడా వాడిది ప్రత్యేకమైన శైలి. మామూలుగా పిల్లలు నాన్న చేతిని తలగడగా పెట్టుకు పడుకుని, చేతిని నాన్న గుండెల మీద, కాలిని పొట్టమీద వేసి హాయిగా నిద్రపోతారు. కృష్ణ కూడా అందుకు అతీతమైన వాడేం కాదు. ఎప్పుడూ పడుకునేది అలాగే. ఒక్కోసారి ఆ భంగిమ ఇంకోలా ఉండేది. నా పొట్టను తలగడలా వాడేస్తూ, రెండు కాళ్లనూ అక్కడ పడేసి, నాకు లంబంగా పడుకుని కబుర్లు అందుకునేవాడు. కథలు చెప్పమని పోరేవాడు. ఆ రెండు పాదాలను మెత్తగా మర్దిస్తూ, కథ మొదలెడితే నిద్రలోకి జారుకునేవాడు.

పసిపిల్లలంటేనే మాటల పుట్టలు. మీద ఎక్కినంతసేపూ, వేలు పట్టుకుని నడుస్తున్నంతసేపూ, వాడి పుట్ట పిగిలి మాటలు, ప్రశ్నలు దొర్లుతూనే ఉండేవి. ఎప్పుడైనా కాసేపు చేయి విడిచి, పక్కన కూర్చోబెడితే అన్నీ ఆగిపోయేవి. గుర్రమూ, ఒంటే ఆటలు తప్ప. ఈ వ్యవహారం మొత్తం వాళ్ల అమ్మతో కూడా యథాక్రమంగా పునరుక్తమయ్యేది.

ఆత్మీయ స్పర్శలేనా చైతన్యప్రేరకాలు! అమ్మ స్పర్శలో నేను పొందినది అదేనా? రాధతో నేను పరస్పరమూ పంచుకున్నది అదేనా? అమ్మ నాకు అందించిన చైతన్యంలో సహస్రాంశమైనా నేను వాడికి అందించగలుగుతున్నానా? నాలో ప్రశ్నలు రేగుతూ ఉండేవి.

వాడూ పెద్దవాడైపోతున్నాడని నాకు తొలిసారిగా అర్థమైంది. టూరు పేరుతో ఓ గుడికి తీసుకువెళ్లినప్పుడు ఒకటే గది తీసుకున్నాం. మేమందరం గదిలోంచి బయటకు వెళ్తే తప్ప బట్టలు మార్చుకోనని భీష్మించుకున్నాడు- నాలుగో తరగతి చదువుతున్న బుడంకాయ్‌గాడు. ఎప్పుడైనా ఓ ముద్దు పెడతాడు. అదే మహద్భాగ్యం. తతిమ్మావన్నీ ఇప్పుడు లేవు. అంటే, కొడుకు ఎద్దంత ఎదిగినా మీద కాళ్లేసుకుని పడుకోవాలని కాదు నా ఉద్దేశం. స్పర్శలు మాత్రమే చెప్పే ఆత్మీయతలకు ఇతర రూపాలు కూడా ఉంటాయి కదా. అవి ఏమైపోతున్నాయని? ఏమీ చేయలేం. ఎదుగుతున్నారని సరిపెట్టుకోవాలంతే.

ఎదగడం? ఎక్కడినుంచి ఎక్కడికి ఎదుగుతున్నాం మనం? ఇలాంటి ఎదుగుదల మనలో దేన్ని మింగేస్తున్నది? ఏ చైతన్యాల విత్తులను తాలుగింజలుగా మార్చుకుంటున్నాం?


అది గోసిగ్ గోల్డెన్ జాతి పప్పీ. ఇంటికి తెచ్చుకున్నాక దానికి నేను పోన్యో అని పేరు పెట్టుకున్నాను. ఏం చెయ్యను? యింకో మార్గం తోచలేదాయె!

మధ్యలో ఇంకో అవకాశం వచ్చింది. మిత్రుడు ఫోన్ చేసి ‘మా లేబ్రడార్ నాలుగు పిల్లలు పెట్టింది. రెండు మగవి. ముద్దుగా ఉన్నాయి. అమ్మే ఉద్దేశం నాకు లేదుగానీ, నువ్వు ఒకదాన్ని తీసుకెళ్లు,’ అని ఆఫర్ ప్రకటించాడు. వాకబు చేస్తే గొప్ప ఆఫరే అని తెలిసింది. జాతికుక్కని స్టోర్‌లో కొనాలంటే ధర పదివేలు పైగానే ఉంటుందట. మా వాడి మీద ప్రేమ పుట్టింది. ఇంకొంచెం ఎక్కువ భోగట్టా చేశాను. ఆ మాత్రపు జాతికుక్కను ఇంట్లో పెంచుకోవాలంటే, నెలకు సగటున అయిదారు వేలనుంచీ, ఎనిమిది పదివేలదాకా ఖర్చవుతుందని తేటతెల్లం అయింది. నెలకో పార్సిల్ బిర్యానీ తినడం, రెండు నెలలకోసారి థియేటరులో సినిమా చూడ్డం కూడా చేతకాకుండా పోతున్న బతుకులో, సాధ్యమేనా? నా మిత్రుడంటే భయం కలిగింది. రెండు మూడు ఫోన్ కాల్స్ ఎవాయిడ్ చేశాను. ఆ లేబ్రడార్ పిల్లలు వేరే ఇళ్లకు చేరేదాకా!

మరి నా బలహీనతను అధిగమించేదెలా? అందుకే ఈ పోన్యోను తెచ్చుకున్నాను. ఎంత ముద్దుగా ఉంటుందో? మెత్తగా ఉంటుంది. మారాం చేయదు. కరవదు. తిండి అడగదు. పెట్టినా తినదు. మనం ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటే, దానికి తగ్గట్టుగా దాని కళ్లు మనతో ఊసులాడుతుంటాయి. వినే భాష మనకు తెలియాలంతే.

పడుకున్నా సరే నిద్రరాని వేళల్లో, పోన్యోని దగ్గరకు తీసుకుని నా పొట్టపై పడుకోబెట్టుకుంటాను. నాలుగు కాళ్లూ నాలుగు వైపులకు బారజాపి పడుకుంటుంది. దాని చెవులూ, వీపూ నిమురుతూ ఏదైనా చిన్న కథ చెప్పడం మొదలెడతాను. క్షణాల్లో నిద్రొచ్చేస్తుంది. నాకే! అది కూడా నిద్రపోతుందో? లేదా, ఎప్పటికీ మాట్లాడుతూనే ఉండే కళ్లతో నా పొట్ట మీద అలాగే ఉండిపోతుందేమో కూడా… నేను గమనించను.


“ఇక్కడ ఉండాల్సిన ముద్రలు కావివి,” నా మురిపెపు మాటలకు చిట్టెమ్మ నవ్వేది బోసిగా. నేనూ నవ్వేవాణ్ని.

ఆస్పత్రిలో, రాధ పొత్తిళ్లలో ఉన్న పాప రెండు పాదాలను చేత్తో పట్టుకుని నా రెండు బుగ్గల మీద పెట్టుకుని, ఆ స్పర్శకు నీరైపోయాను. అవే బోసి నవ్వుల్ని కురిపిస్తోంది నా మీద. ఏమైనా చెప్పడానికి తనకి చేతకాదు కద.


అడుగులు వేసేవరకూ వచ్చింది. రెండు చేతుల్నీ పట్టుకుని నిల్చోబెట్టి, అడుగుల్ని నా గుండెల మీద వేయించి పండగ చేసుకున్నాను. ఒకవైపు రాధ తిడుతున్నా పట్టించుకోకుండా, ఆ బుజ్జి పాదాలకు అక్రిలిక్ పెయింట్లు పులిమి, టీ షర్టు మీద అచ్చొత్తి, పాదస్పర్శలకు రూపు కట్టి, ‘నా హృదయపు ముద్రలు’ అంటూ ఇంగ్లీషులో కేప్షను రాసుకున్నాను. ఈ స్పర్శల మధురిమలు తరచుగానే మురిపిస్తున్నాయి. చిట్టెమ్మ యింకా పసితనపు ఛాయ దాటలేదు కదా.

ఎప్పటికీ అలాగే గడవదు. సహజ పరిణామక్రమాలకు అయిష్టంగా సిద్ధపడడమే కదా జీవితం… ప్రతి అంచెను అభావంగా స్వీకరిస్తూ సాగడమే కదా ప్రయాణం!


నలుగురమూ ఒకే చోట కూర్చుని ఉంటాం. నాలుగు ప్రపంచాల్లో, వేర్వేరు తలాల్లో విహరిస్తుంటాం. ఆఫీసులో యాభైమంది ఉంటే, యాభై ప్రపంచాలే!

“మనుషులతో మమేకమయ్యే, స్పర్శలను అనుభూతించే వ్యవధానం ఎవరికి ఉన్నదని? వర్తమానమంతా మనిషి పొలకువకు జడుసుకునే వేగయుగ జీవులే. ఎల్లెడలా స్వకపోల మర్దనలే. ఎవరి ప్రపంచంలోకి వారు ముడుచుకుపోతూ, ఎవరి కురచతనంలో వారు శిఖరాలను చూసుకుంటూ! ఆత్మవంచనలను కూడా గుర్తించలేని అమాయకమూర్తులే! ప్రపంచమంతా మొగ్గలే. వికసించిన పువ్వులు లేవు. ఆంథెసిస్‌కు విలోమంగా ఆధునిక టెక్ హంగులు. అంతా వర్ణమయమైన జీవితాలు… ఆత్మలేని వర్ణాలు!

కృత్రిమత్వం ఎరగని, నాటకీయత లేని కరచాలనాలెన్ని, ఆలింగనాలెన్ని? ఆధునిక వాతావరణానికి ఆకలెక్కువ. మనుషుల్లో ఉండే చైతన్యాలను కబళించేయడమే ప్రకృతి. ఆత్మీయతలను, సంకేతించే స్పర్శలను, సంధానించే దేహసరళిని ఊహించడమే వికృతి. ఈ నాలుగేనా? యింకా ఎన్నెన్ని విధాలుగా ముడుచుకుపోతున్నాం మనం…” దుఃఖాన్ని పొదవి దాచుకున్న డైరీ వాక్యాలూ నన్ను చూసి నవ్వుతుంటాయి!

ఎవరిలోకి వారు ముడుచుకుపోవడమేనా కలియుగపు మనువు రాయగలిగిన ఏకవాక్యపు స్మృతి!


వీధి పక్కన మునిసిపల్ పార్కులో కూర్చుని ఉన్నాను.


స్కూలు పిల్లలు అనుకుంటా. ఓ పాతికమంది బిలబిలా వచ్చారు. వెంట ఇద్దరు టీచర్లు కూడా. మొక్కల మీద పడ్డారు. ఒక్కో దాన్నీ పట్టిపట్టి చూస్తున్నారు. వెంట తెచ్చుకున్న నోట్సుల్లో ఏదేదో రాసుకుంటున్నారు. బొటానికల్ టూర్‌లా ఉంది. మధ్యమధ్యలో వాళ్ల టీచరు దగ్గరికెళ్లి డౌట్లు అడుగుతున్నారు. ‘కొమ్మలు విరచకూడదు. పూలు కొయ్యకూడదు,’ ఒక టీచరమ్మ అరిచి అరిచి చెప్తోంది. ఈలోగా ఇద్దరు నేను కూర్చున్న సిమెంటు బెంచీవైపు వచ్చారు. ఆ పక్కనే మొక్కల్లో దేవులాడుతున్నారు.

“అరె ఇది ముడుచుకుపోతోంది,” అరిచాడా బాబు.

“తాకితేనే రా,” చేతుల్తో మిగిలిన రెమ్మల్ని కదుపుతూ అన్నది రెండో పాప.

“భలే ఉందే,” ఒక్కో రెమ్మని తాకుతూ నవ్వుకుంటున్నారు పిల్లలు. మధ్యలో నాకేసి చూస్తే, “అత్తిపత్తి అంటారు దాన్ని,” చెప్పాను.

“మిమోసా ప్యూడికా ఈజ్ ది సైంటిఫిక్ నేమ్,” అటు వచ్చిన టీచరమ్మ అన్నది. వాళ్లు పుస్తకంలో రాసుకున్నారు. “టచ్ మీ నాట్ ప్లాంట్. సిగ్గాకు అని కూడా అంటారు,” నాకంటే ఎక్కువ తెలుసునని ప్రదర్శించే అభిలాషతో, నాకేసి చూస్తూ ఆ మాటలు వారికి చెప్పింది. నోట్ చేసుకున్నారు. వెళ్లిపోయింది.

“కాసేపటికి తెరుచుకుంటుందిలే… తాకితే చాలు, మళ్లీ ముడుచుకుపోతుంది,” ఆశ్చర్యంగా చూస్తున్న పిల్లల్తో అన్నాను.

“మరి దీనికి యాంటీగా, మనం తాకితే తెరుచుకునే, వికసించే మొక్క ఏదీ ఉండదా?” ఆ పాప ఇంగ్లీష్ లో అడిగింది.

ఏం చెప్పాలి? ఏముంది నా ఎరికలో? ఏం మిగిలింది? కనీసం అటు వెళ్తున్న ఆ టీచరుకైనా అలాంటి జాతి గురించి తెలుసా? నా ముతక భాషలో నేను చెబితే శాస్త్రీయమైన పేరునో, దొరల భాషలో పిలుపునో ఆ టీచరమ్మ విడమరచగలుగుతుందా? వంద సుడులు తిరగడానికి లిప్తపాటు చాలదా? బుర్ర ఓ పెద్ద ప్రవాహజడి, నిర్ఝరిణి! చివరికి తేరుకుని చెప్పాను-

“ఉండేది తల్లీ… మొక్క కాదుగానీ ఇంకో జాతి,” పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా, ఉత్సుకతతో నాకేసి చూస్తున్నారు.

“ఎక్కడ?”

ఏం చెప్పను- సాలోచనగా నెమరువేసుకుంటూ అన్నాను- “లండన్‌, అమెరికా, స్వీడన్‌, ఇండియా…”

“ప్రపంచమంతానా! ఏ కాలంలో?”

ఎలా చెప్పను- కొంత గుంజాటన తర్వాత అన్నాను- “ఇప్పుడిప్పుడే…”

సగంలో అడ్డుకుని ఆ బాబు ఇంగ్లీషులో పూర్తిచేశాడు. “న్యూ స్పీషీసా?”

ఆ చోటు వదిలి – మిగిలిన పిల్లలవైపు అప్పటికే నాలుగు అడుగులు వేసిన టీచరమ్మ, నాక్కూడా ఏదో తెలుసుననే నమ్మకంతోనో, తెలియకున్నా బుకాయిస్తున్నానేమోననే అనుమానంతోనో ఆగి, తల మాత్రం పక్కకు తిప్పి నాకేసి ఓరగా చూస్తోంది. బెంచి మీదనుంచి లేచేముందు బాబును వారించి, తల అడ్డంగా ఊపి, మాట పూర్తిచేశాను.

“ఇప్పుడిప్పుడే అంతరించిపోతోంది.”

వివరణలు:
– ప్రఖ్యాత పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ పెంచుకునే చింపాంజీ పేరు బబుల్స్, కొండచిలువ పేరు మడోన్నా.
– రాబర్ట్ అట్కిన్సన్ చేసిన ప్రఖ్యాత మిస్టర్ బీన్ కామిక్ సిరీస్‌లో అతని ఫ్రెండ్ అయిన సాఫ్ట్ టాయ్ పేరు టెడ్డీ.
– స్వీడన్ మూలాలున్న ఐకియా స్టోర్‌లో విక్రయించే వాళ్ల ఎక్స్‌క్లూజివ్ డిజైన్ సాఫ్ట్ టాయ్ పప్పీ పేరు గోసిగ్ గోల్డెన్.
– ప్రఖ్యాత స్టుడియో గిబ్లి వారి, హయావో మియాజాకి దర్శకత్వంలో వచ్చిన ప్రఖ్యాత జపనీస్ యానిమేటెడ్ సిరీస్‌లో హీరోయిన్ అయిన పసిపాప పేరు పోన్యో.
– మొగ్గలు పువ్వుగా మారే ప్రక్రియను ఆంథెసిస్ అంటారు.


కె.ఎ. మునిసురేష్ పిళ్లె

రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె గురించి:

మౌలికంగా జర్నలిస్టు కావడంవల్ల రాయడం పట్ల కూడా ఆసక్తి, ప్రవేశం ఏర్పడిన మునిసురేష్ పిళ్ళే గారికి రాయడమే ఆసక్తి, అభిరుచి, బతుకుతెరువు. వీరు రచించిన మూడు కథా సంపుటాలు ‘పూర్ణమూ నిరంతరమూ’, ‘రాతితయారీ’, గారడీవాడు, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ‘పుత్రికాశత్రుః’, ఒక కవిత్వం సంపుటి ‘షష్ఠముడు’, ఒక సంపాదకీయ వ్యాసాల సంపుటి ‘మునివాక్యం’ ప్రచురణ అయ్యాయి. వీటిలో కొన్ని పుస్తకాలకు వివిధ పురస్కారాలు లభించాయి. అనువాద సాహిత్యంకోసం ప్రత్యేకించిన ‘కథావసుధ’ వెబ్ మేగజైన్ ను తన సంపాదకత్వంలో నిర్వహిస్తున్నారు.

 ...